అనగనగనగ అమెరికాలో ఒక గన్నాయిగాడున్నాడు. సదరు గన్నాయిగాడికి ఎప్పటినుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ. వాళ్ళూరిలోనే వున్న పిటి బాంకుకు వెళ్ళి అడగ్గా వాళ్ళు -
“నువ్వు చేసే వుద్యోగమేమిటి.? నీ దగ్గర ఇతర ఆస్తులేమైనా వున్నాయా..? నెల నెలా ఈఎంఐ ఎలా కడతావు..” లాంటి ప్రశ్నలన్నీ వేశారు. గన్నాయిగాడి దగ్గర అవేమి లేకపోవటంతో అప్పు ఇవ్వముగాక ఇవ్వమని చెప్పేసారు పిటిబ్యాంకు వాళ్ళు.
గన్నాయిగాడు కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాడు.
2004 - 2007
లేమాన్ తమ్ముళ్ళని ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీవాళ్ళు, పిటీ బ్యాంకువాళ్ళను కలిసారు.
“పిటీ బ్యాంకూ పిటీ బ్యాంకూ నువ్వు ఇళ్ళు కొనుక్కోటానికి లోన్లు ఇస్తావటకదా.. ఆ లోన్లు తీరి ఆ డబ్బంతా నీ దగ్గరకు వచ్చేసరి ఇరవై ముప్ఫై ఏళ్ళు పడుతుందికదా.. అప్పటిదాకా నీ డబ్బులు ఇరుక్కుపోయినట్లే కదా”
“అవును అదే చాలా ఇబ్బందిగా వుంది… ఏదైనా వుపాయం చెప్పరాదూ..” అన్నారు పిటీ బ్యాంకర్లు.
“అయితే విను… నీ హోం లోన్లన్నీ నాకు అమ్మేసెయ్యి నేను కొనుక్కుంటాను… నీకు ఒక్కసారే డబ్బులిస్తాను అది నువ్వు మళ్ళీ నీ బ్యాంకు పనులకి వాడుకోవచ్చు… నాకు మాత్రం నెల నెలా లోను తీసుకున్నవాళ్ళు ఇచ్చే నెల వాయదాల్లో కొంత భాగమివ్వు చాలు..” అని లేమాన్ తమ్ముళ్ళు చెప్పారు.
భలే భలే అని బ్యాంకులన్నీ అప్పులను అమ్మడానికి సిద్ధమయ్యాయి. అనుకున్నట్టే బ్యాంకులు తమ తమ అప్పులన్నీ తమ్ముళ్ళకి అమ్మేసాయి. తమ్ముళ్ళిచ్చిన డబ్బులను మళ్ళీ అప్పుగా ఇవ్వడం మళ్ళీ తమ్ముళ్ళకి అమ్మటం.. ఇలా సాగుతోంది ప్రహసనం.
తమ్ముళ్ళు ఆ అప్పులన్నీ ఒక కుప్ప పోశారు. వాటిని విలువ, వ్యవధి, వడ్డిని బట్టి భాగాలుగా కోసారు. ఒక్క భాగాన్నికి 'STRUCTURED ENHANCED HOME LOAN CREDIT LEVERAGE FUND' లాంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టి అమ్మకానికి పెట్టారు. (అమ్మకానికైతే అంత పేరుగాని అసలు వీటిని COLLETARALIZED DEBT OBLIGATIONS అంటారు)
ఈలోగా మరోపక్క వేరే కథ నడుస్తోంది. ప్రపంచంలో వున్న అనేక కంపెనీలు అంటే జపాను ఇన్సురెన్సు కంపెనీ, ఫిన్లాండు పెన్షన్ కంపెనీ లాంటివి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాటిని ఎక్కడ పెడితే ఎక్కువ రిటన్సు వస్తాయా అని చూస్తున్నాయి. ఇంతకు మునుపైతే అమెరికా గవర్నమెంటు బాండ్లలో పెడితే 4-5% దాకా వచ్చేది, సెప్టెంబరు పదకొండు తర్వాత అమెరికా 1% కన్న ఇవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే తమ్ముళ్ళు పెట్టిన అమ్మకం గురించి వీళ్ళకి తెలిసింది.
వాళ్ళు తమ్ముళ్ళ దగ్గరకు వచ్చి –“అబ్బాయిలూ మీరు అమ్ముతున్నది బాగానే వుంది కాని గవర్నమెంటు బాండులు కొనుక్కుంటే మాకేదో గ్యారంటీ వుండేది.. నీ బాండులు కొంటే రేప్పొద్దున అప్పుతీసుకున్నవాళ్ళు తిరిగివ్వకపోతే బ్యాంకు నీకు డబ్బులివ్వదు, బాంకు నీకివ్వకపోతే నువ్వు మాకివ్వవు, మేము ఇవ్వకపోతే మా వూళ్ళో నిలబెట్టి తంతారు… అందుకని నువ్వు వద్దు నీ బాండులు వద్దు..” అన్నారు.
తమ్ముళ్ళు వెంటనే – “అంతే కదా ఇక్కడే వుండండి” అని KIG అనే ఒక ఇన్సురెన్సు కంపెనీ దగ్గేరకి వెళ్ళారు. .
“కేఐజీ కేఐజీ ఇలాగిలాగ మేము అప్పులు కొనుక్కున్నాము… ఎవడన్నా అప్పుతీర్చకపోతే మా డబ్బులు నువ్విచ్చేట్టు ఒక ఇన్సూరెన్సు తయారు చెయ్యి… ప్రీమియము ఎంతైతే అంత నీకిస్తాము..” అన్నారు.
KIG సరే లెమ్మని “CREDIT DEFAULT SWAPS” అనే ఒక ఇన్సూరెన్సు తయారు చేసి పెట్టారు. తమ్ముళ్ళు అది కొనుకున్నారు. ఇకనే… అప్పు తీసుకున్నవాళ్ళు ఇవ్వకపోయినా ఇన్సురెన్సు కంపెనీ ఇస్తుంది కదా అని ప్రపంచంలో వున్న రకరకాల కంపనీలు తమ్ముళ్ళ దగ్గర బాండులు కొనడం మొదలెట్టాయి.
బ్యాంకులు అప్పులియ్యను, తమ్ముళ్ళు కొనుక్కోను, KIG ఇన్సుర్ చెయ్యను పెట్టుబడిదారులు కొనుక్కోను… ఇలా సాగుతోంది వరస. ఆప్పు కొన్నా నష్టపోయేది లేదు కాబట్టి తమ్ముళ్ళు బ్యాంకులను ఇంక ఇంకా లోనులివ్వమని ప్రోత్సహించారు. తాము తయారు చేసిన విధానంలో విశ్వాసంతో తమ్ముళ్ళు కూడా తమ గొడ్డు గోదా అన్నీ అమ్మి ఇందులో పెట్టారు.
బ్యాంకులు ఎవడు దొరుకుతాడా అప్పిద్దామని ఎదురు చూడసాగాయి. కనపడ్డవాడినల్లా అప్పు కావాలా అప్పు కావాలా అని వేధించసాగాయి. లోను దొరకటం చాల సులభమైపోయింది. ఒక రోజు గన్నాయిగాడిని పట్టుకోని పిటీ బ్యాంకువాళ్ళు బలవంతంగా లోను అంటగట్టారు. దమ్మీడి ఆదాయంలేదు నాకెందుకయ్యా లోను అంటే, కాదు కూడదు తీసుకోవాల్సిందే అని బ్రతిమిలాడారు. అమెరికాలో రియలెష్టేటు మాంచి బూం లో వుంది. మేమిచ్చిన డబ్బులుతో ఇల్లు కొనుక్కోని వెంటనే అమ్మేసినా బోలెడు డాలర్లు వెనకేసుకోవచ్చు అని ఆశపెట్టాయి.
ప్రతివాడు ఎగబడి ఇళ్లు కొనడంతో ఇళ్ళు కట్టే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి , టైలు కట్టిన మేనేజర్లను పెట్టి ఎడా పెడా ఇళ్ళు అమ్మేసుకున్నారు. ఇందులో భాగస్వాములైన కంపనీలన్నీ దిన దిన ప్రవర్ధమానమై వెలగ సాగాయి. తమ్ముళ్ళు లాంటి వారు, పిటీ లాంటి బ్యాంకులు, KIG లాంటి ఇన్సురెన్సు కంపెనీలు, ఇళ్ళుకట్టే కంపెనీలు, తమ్ముళ్ళ దగ్గర అప్పు ముక్కలు కొనుక్కునే కంపెనీలు వగైరాలన్నమాట. ఇంకేముంది వీటి చుట్టు సాఫ్టువేరు కంపెనీలు, HR కంపెనీలు, కన్సల్టెంటులు, ఏసీ సప్లై చేసేవాడి దగ్గరనుంచి, ఆఫీసులో చెత్త వూడ్చే వాడిదాక, అసలు ఇది ఇంత సక్సస్ ఎందుకైందో రీసర్చ్ చేసేవారి నుంచి ఇలాంటి వుద్యోగాల్లో చేరటానికి కోచింగ్ సెంటర్లు దాకా అన్ని ఎక్కడికక్కడ ఎదో పదో పరకో సంపాయించుకుంటున్నాయి.
KIG లాంటి ఇన్సురన్సు కంపనీలైతే… ఈ పాలసీలమీద క్లయిములెట్టాగు రావు కాబట్టి ఎవరైనా ఈ రిస్కుని మా దగ్గర కొనుక్కుంటే మీకు ప్రీమియంలో భాగమిస్తామన్నాయి. (బ్యాంకులు అప్పులమ్మినట్టే ఇన్సురన్సు కంపెనీలు ఇన్సురన్సు కవర్ అమ్మసాగాయి)
2008
బ్యాంకులు ఇచ్చిన అప్పులన్నీ వేరియబుల్ వడ్డి రేట్లు. అంటే నెల నెలా కిస్తులు స్థిరంగా వుండవ్. అదీ కాక అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువవటంతో జనాలు పోనీలే ఇల్లు కొంటే దాని ధర ఎప్పటికైనా పెరుగుతుంది అని ఎడా పెడా కొనేసారు. నిజానుకి డబ్బులు దండిగా దొరకటంతో గన్నాయిగాడుకూడా కొత్తిల్లే కొన్నాడు. అవసరమైతే అమ్మి అప్పు కడదామనుకున్న వాళ్ళకి వడ్డి పై వడ్డిలు పడ్డాయి. అమెరికా రియలెస్టేటు బుడగ ఒక రోజు బుడుగున మునిగింది.
గన్నాయిగాడు ఆలోచించాడు -
“ నేనెట్టాగు అప్పుతీర్చలేను… రెండురోజులైనా సొంతింట్లో వున్నాను.. నా కల రెండురోజులకైనా నెరవేరింది…” అనుకున్నాడు. అప్పు తీర్చడం మానేసాడు – కావాలంటే ఇల్లు జప్తు చేసుకోమన్నాడు.
పిటీ బ్యాంకుకు మతి పోయింది… అసలు లేదు, వడ్డి లేదు పైగా ఆ ఇంటిని జప్తు చేసి అమ్ముకుంటే లోనులో సగంకూడా వచ్చేట్టు లేదు. తమ్ముళ్ళని పిలిచి –
“అయ్యా ఇదీ పరిస్థితి… కనక మేము నీకు డబ్బులిచ్చుకోలేము” అని తేల్చేసారు. తమ్ముళ్ళు నానా హైరాన పడి KIG దగ్గరకు వెళ్ళారు. KIG కొంతకాలం పాపం వోపిక పట్టి కొన్ని తీరని అప్పులు తీర్చింది. అవి మరీ ఎక్కువైపోతుండటంతో తనూ చేతులెత్తేసింది. ఇంకేముంది – తమ్ముళ్ళు, KIG ఇద్దరూ ఐపీ పెట్టారు. దుకాణాలు మూసేసారు.
తమ్ముళ్ళదగ్గర అప్పు ముక్కలు కొన్న కంపనీలన్నీ ఏడుపు ముఖాలు పెట్టాయి. ఆయా దేశాలలో వాటి షేర్లూ ఏడుపు ముఖమే పట్టాయి. అలాగే తమ్ముళ్ళను నమ్ముకున్న సాఫ్టువేరు ఇత్యాది కంపనీలన్నీ హడావిడిగా మీటింగులు పెట్టేసుకున్నాయి. కొన్ని దుకాణాలు కట్టేసాయి, కొన్ని మనుషుల్ని బయటికి గెంటేసాయి.
దాంతో ప్రపంచంలో వున్న అన్ని మార్కెట్లు నేల చూపులు చూసాయి. తమ్ముళ్ళ దగ్గర అప్పు ముక్కలు కొన్న కంపనీలు మనదేశంలో లేక పోయినా… వాళ్ళకి BPOలు, సాఫ్టువేర్లు, హార్డువేర్లు, మంత్రిచ్చినవేర్లు గట్రా సేవలందించే కంపనీల వల్ల, తమ్ముళ్ళ దగ్గర అప్పుముక్కలు కొన్న కంపనీలన్ని నష్టాలని తగ్గించుకోవడానికి మన దేశంలో పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల, ప్రపంచంలో మార్కెట్టులన్ని పడిపోతున్నాయి కాబట్టి మన మార్కెట్టు పడిపోవాలి అనే పిచ్చి నమ్మకం వల్ల, కొండక చో మన బ్యాంకులు మూత బడుతున్నాయహో అని పనిలేని వాళ్ళు పుట్టించే పుకార్ల వల్ల మన మార్కెట్టు పడిపోతోంది. కోలుకోవడానికి సమయం పట్టినా కోలుకోవడం ఖాయం.. ప్రాణ భయమేమి లేదు అంటున్నారు (ఆర్థిక) డాక్టర్లు. సరే చూద్దాం ఏంజరుగుతుందో…
కొసమెరుపు
కథ అంతా విన్న శిష్యుడు గురువు మణి సిద్దుడితో అన్నాడు –
“గురువుగారు, అంతా బాగానే వుంది కాని.. ఇప్పుడు మన దేశంలోనూ రియలెస్టేటు బూం అంటున్నారు కదా.. బ్యాంకులూ వెంటబడి లోన్లిస్తున్నాయి… మరి రేపో మాపో మనకీ అమెరికా గతి పడుతుందంటారా..?”
“పిచ్చివాడా… భారత దేశం ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ముందుంది. అమెరికా లాంటి చోట బాంకులు ఇచ్చిన అప్పుతోనే ఇల్లు కొంటారు కాబట్టి, అప్పు తీర్చలేనప్పుడు… ఇల్లు వదిలేసుకుంటారు..
అదే మన దేశంలో అయితే బ్యాంకు ఇచ్చిన అప్పుకు దాదాపు సమానంగా నల్ల ధనం చేతులు మారుతోంది. అంటే బ్యాంకు దృష్టిలో నీ ఇంటికిచ్చిన అప్పు 30 లక్షలైతే నిజానికి నువ్వు కట్టిన డబ్బు యాభయ్యో అరవయ్యొ లక్షలుంటుంది. ముప్పై లక్షల అప్పుకి అరవై లక్షల ఇల్లు ఎవరైనా వదులుకుంటారా.. అందుకే తల తాకట్టు పెట్టైనా మనవాళ్ళు ఇంటిమీది అప్పులు తీరుస్తుంటారు…”
“అంటే గురువుగారు… నల్ల ధనమే మన దేశాన్ని సంక్షోభంలోకి పోకుండా కాపాడుతోందన్నమాట…”
“నిశ్చయంగా..”
(హాస్యదర్బార్ సీరియల్ తరువాత నేను రాయబోతున్న సీరియల్ కథ కోసం ఇది రాసుకున్నాను. మార్కెట్టు "నెత్తురు కక్కుంటూ నేలకి రాలటం" చూసి సందర్భం కుదిరిందని ఇప్పుడే ప్రచురించాను.)
"బాబూ రిక్షా.." అతికష్టం మీద పిలిచింది రాములమ్మ. ఆమె కళ్ళు, డొక్క లోపలికి పోయినాయి. కాళ్ళు చేతులు సన్నగా కట్టెపుల్లల్లా వున్నాయి. మాసిన పాత చీర, చిరుగులు పడ్డ జాకెట్టు తొడుక్కొని వుంది. నెరిసిన జుట్టు మీద పడ్డ దుమ్ము జుట్టు రంగునే మార్చేసింది.
"ఏటే.. ఏడకి పోవాలే" అడిగాడు రిక్షావాడు. ఆమె చెప్పింది.
"అరే.. ఆ గల్లీలెంట బోవాలె.. ఇదేమన్న రిక్ష అనుకున్నవా.. ఇమానమనుకున్నావా..?? అసలు నీకాడ పైసలున్నాయే..?" వ్యంగ్యంగా అడిగాడు.
"పైసల్లేవు బిడ్డ.. ఆడకు పోగానే నా కోడుకిస్తడు.. నడ్వలేకున్నా జరంత తోల్కపో బిడ్డా.." ఆమె ప్రాధేయపడింది.
"ఏందిరన్నా సంగతి.." అంటూ వచ్చాడు మరో రిక్షావాడు.
"బస్తిలెంట గల్లీలెంట బోవాలంటది. పైసలు మాత్రం దీని బిడ్డ ఇస్తడంట.."
మధ్యలోనే అందుకుంది రాములమ్మ
"అవు బిడ్డ.. కాళ్ళునొస్తున్నాయ్.. జర నువ్వైనా జెప్పు నాయనా.."
"ఈళ్ళంత ఇంతెనే.. దా నా బండెక్కు నే తోల్కబోతా.." అంటూ ఆమెనెక్కించుకున్నాడు.
***
"నీ పేరిందిర బిడ్డ" దారిలో అడిగింది
"నా పేరేదైతేనేంటిలే అవ్వా.."
"ఏంలేదు.. మంచి తీరుగున్నవని అడిగిన.."
"అందరూ యాదగిరి అంటరు.."
"గట్లనా.."
అంతకు మించి ఏమి మాట్లాడుకోలేదు. బండి వీధులన్నీ తిరిగి తిరిగి చేరవలసిన చోటికి చేరింది.
"ఏడనే వుండు బిడ్డా.. నా బిడ్డ వచ్చి పైసలిస్తడు.." అంటూ లోపలికెల్లింది రాములమ్మ.
"ముసల్దొచ్చింది" లోపలినుంచి విసురుగా ఒక ఆడగొంతు.
"ఇదేందే ఇప్పుడొచ్చినావ్.. ఇంకా నాల్గుదినాలుండెగా.." కోపంగా మొగగొంతు.
"అదిగాదురయ్య.. ఆడనే సూపుగానక ఓ బుడ్డి పగలగొట్టిన.. ఆడు ఇంట్లోంచి తరిమేసిండ్రా.. మళ్ళ గిట్ల రావద్దండు.." బావురుమంది రాములమ్మ.
"ఆడు దరిమేస్తే.. గిట్లెందుకొచ్చినావ్..? నా కొంప సత్రం లెక్క గానొస్తుందానె.." అంటూ కసురుకున్నాడు.
"అది గాదురా అయ్యా.. ఆడు అసలు ఇంట్లోకే రానీయననిండు.."
"ఆడు దరిమితే.. నేనేమైనా పాగల్గాన్నా నిన్నుంచుకోడానికి.. నేను ఇంట్లోకి రానీయ్య.. బయటకిపో.."
"నువ్ గూడ గిట్లంటే నేనేంగావాల్రా..?"
"ఏహె గదంతా నాకెర్కలేదు నూవ్ ముందైతె ఇంట్లకెల్లి పో.."
రాములమ్మ పైటచెంగుతో గుడ్లొత్తుకుంది.
"గట్లనేకాని బిడ్డ.. బయట రిక్షావోడున్నడు.. ఆనికి పైసలిస్తే.."
"మంచిగనేవుంది.. నీ కోడుకులేమైనా పటేల్లనుకున్నవా.. రిక్షాల్లో తిరిగి రాజ్యాలేలనీకి.." కసురుకుంటూ డబ్బులిచ్చింది కోడలు. చివుక్కుమన్న గుండెతో రావులమ్మ బయటకి వచ్చింది.
"ఛీ ఛీ.. ఈ నాకొడుకులంతా ఇంతే.. కన్న తల్లిని జూస్కోడానికేమాయే..!!" అనుకున్నాడు యాదగిరి.
బయటకువచ్చి డబ్బులిచ్చింది రాములమ్మ. యాదగిరి వద్దనాడు. రాములమ్మ ఏమి మాట్లాడలేదు.
"నేనంతా ఇన్నాన్లే.. ఇప్పుడెక్కడికి పోతావ్.." యాదగిరి అడిగాడు.
"ఏడకని బోతా నైనా..! ఏ సెట్టు కిందో పుట్టకిందో.. గిట్లనే సచ్చిందనక.." ఆ పైన మాట్లాడలేదు. ఆ వయసులో నిస్సహాయంగా ఏడవటానికి మనస్కరించక కళ్ళలో నీళ్ళను తొక్కి పట్టింది.
"నా రిక్షా ఎక్కు.. నిన్ను ఆ పార్కు కాడ వదుల్తా.."
రాములమ్మ మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.
"గట్లైతే నికు ఇద్దరు బిడ్డలా..?" యాదగిరి అడిగాడు రిక్షా తొక్కుతూ.
"అవు బిడ్డా..! ఇంకొకడుండె గాని.." అంటూ ఆపేసింది.
"ఆనికేమైంది.."
"ఆడు సిన్నప్పుడే తప్పిపోయాడు బిడ్డ.. ఆడి సిన్నతనంలో నేను ఇస్కూళ్ళ ఆయాగా చేస్తుండె. ఇస్కూల్ల సారు సానా మంచిగుంటుండె. నా బిడ్డలకు వుట్టిగనే సదువుకూడ సెప్పిండు. ఆ యెదవ ఆయనకాడ చోరి చేసిండు. నే తంతానని ఆడ నించే పారిపోయిండు.. ఇప్పుడు ఏడున్నడో ఏమో...! ఆని పేరు కూడా యాదగిరే.."
యాదగిరి రిక్షా వేగం తగ్గింది. చిన్నప్పుడు హెడ్డుసారు ఆఫీసులో తనుచేసిన దొంగతనం గుర్తొచ్చింది.
"ఆడు గానొస్తే గుర్తుపడతావా..?" అడిగాడు అనుమానంగా.
"ఆయాల్టినుంచి గనపడనేలేదు.. ఇప్పుడు నీయంతై వుంటడు. ఆని మెళ్ళో ఒక దండ వుంది. ఆ ఇస్కూళ్ళ సారే ఆని మెళ్ళో ఏసిండు.. దానిపైన వోళ్ళ దేముడు బొమ్మ కూడా వుంది." చెప్పింది రాములమ్మ
యాదగిరి గుండె చప్పుడు వేగంపెరిగింది. రిక్షా దాదాపు ఆగిపోయింది. బుర్ర నిండా ఆలోచనలు -
"అయితే నేనేనా ఈమె బిడ్డని..?" మనసులో రొదగా వుంది.
"అమ్మా.." అని పిలవబోయాడు. అప్రయత్నంగా ఆ పిలుపు గొంతు దగ్గర ఆగిపోయింది. గొంతు ఆగిపోయి బుర్ర పనిచెయ్యడం మొదలెట్టింది.
"ఇప్పుడు ఈమే అమ్మని తెలిస్తే.. ఇంటికి దీస్కపోవాల.. ఇంటికాడ యాదమ్మ నన్ను సంపతాది.. మనం తినేదానికే లేకపోతే ఈ ముసల్దానేడకెళ్ళి దెచ్చినావ్ అంటది"
"అది సెప్పేది నిజమే.. ఈ రిక్షాపైన నాకెన్ని పైసలొచ్చినా అయి మా తిండికే సాలవు.. ఇంక దీన్నేస్కెల్తే కర్సులెక్కువైతాయి.. అయినా ఆళ్ళిద్దరూ తరిమేసిన్రు.. నడిమిట్ల నేనెందుకు సూడాలే..??"
ఆలోచన్లలోనే పార్కు దగ్గరకు వచ్చేసాడు. రిక్షా ఆపి కిందకి దిగాడు.
"పార్కు వచ్చేసింది.." అన్నాడు.
రావులమ్మ పలకలేదు.. ఇక పలకలేదు కూడా. అచేతనంగా పడిపోయివుంది.
యాదగిరి మాట్లాడలేదు. అతనికి ఏడుపు కూడా రావట్లేదు. ఆమె వైపే చూస్తూ నిలబడి పోయాడు. చుట్టూ జనం చేరారు.
"పాపం..!! కొడుకులు తరిమేసరికి గుండ పగిలి చచ్చిపోయింది.." ఎవరో పెద్దమనిషి అన్నాడు.
"ఛి.. ఛి..!! ఈ నా కొడుకులంతా ఇంతే.. కన్నతల్లిని చూస్కోడానికి యేమాయే.." ఇంకెవరో అంటున్నారు.
యాదగిరి గుండె కలుక్కుమంది. సూర్యుడి కిరణం పడి అతని మెడలో దండకున్న సిలువ తలుక్కుమంది.
(1995 ఆదివారం ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
మళ్ళి మరో దెబ్బ...!
నా కొమ్మలపై గూళ్ళు కట్టుకుని వుంటున్న పిట్టలన్ని చివాల్న లేచి నిద్రమత్తును దులుపుకున్నాయి. ఒక్కొక్క దెబ్బ పడుతునేవుంది. నాకు తెలుసు ఈరోజు నన్ను నరికించి అక్కడ కార్ షెడ్డు కట్టుకోబోతున్నారని. అలాగని శేఖరం నిన్న సాయంత్రమే నిర్ణయించాడు. తెల్లవారుతూనే ఇదుగో ఇలా...
నా కథ ఈ రోజుతో ముగిసిపోతోంది. నేను పుట్టి ఎన్నాళ్ళైందో...? బహుశా నూటాభై యేళ్ళు..?? లేక ఇంకా పైనే నేమో..??
ఇన్నేళ్ళలో ఎన్ని అనుభూతులు..? ఎన్ని అనుభవాలు..?? ఎన్నన్నని చెప్పను.
మా వూరి జమిందారు, రాజావారు వస్తున్న సందర్భంలో నా నీడలో ఏర్పాటు చేసిన గానా బజానాలు.. చల్లని రాత్రుళ్ళో నా చెట్టుకింద జరిగిన తోలుబొమ్మలాటలు, శేఖరం తాతగారు ఈ స్థలంలో ఇల్లు కడుతూ "పచ్చని చెట్టు ఇంటిముందుంటే మనమూ పచ్చగా వుంటాము" అంటూ ఆప్యాయంగా నన్ను నెమరిన సంగతి.. ఆ తరువాత నా చెట్టునీడలో పిల్లకి పాఠాలు చెప్పడం.. ఎన్నో మధుర స్మృతులు.
శేఖరం తాతగారు నా కుడివైపు కొమ్మ విరిగినప్పుడు చేయించుకొన్న చేతికర్ర ఇప్పటికీ వారింట్లో వేలాడుతోంది. శేఖరం నాన్నగారు నా ఆకు పసరుతో ఊరందరికి వైద్యం చేసేవాడు. నాకివన్నీ గుర్తే.. మరి శేఖరానికి గుర్తులేవా..?? బడి ఎగ్గొట్టడానికి నా పైకి ఎక్కి కూర్చున్న రోజులు, నా చుట్టు తిరుగుతూ ఆడుకున్న ఆటలు.. ఇవన్నీ మర్చిపోయాడా..? అయ్యో నన్ను ఇంతకాలం తన నేస్తంలా చూస్తున్నాడనుకున్నానే..!!
నాపైన ఏం హక్కున్నదని నన్ను కొట్టిస్తున్నాడు? అతనింట్లో వున్నంత మాత్రాన నేనతని సొత్తేనా..?? నేను ప్రకృతినికదా..!
అబ్బా.. అబ్బా ఈ గొడ్డలి దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. ఎంత కర్కశులీ మానవులు.? శేఖరం కూతురు భవాని అక్కడే నిలబడి చిత్రంగా నావైపు చూస్తోంది. చూడటానికి ఎంత ముద్దుగా వుందో.. వసంతంలో నేనున్నట్లు..!!
ఒకరోజు అన్నం తిననని మారాం చేస్తూ నా చుట్టు తిరగబోయి నా వేర్లు తగులుకొని కింద పడ్డప్పుడు చెయ్యి అందించలేని నా అశక్తతకు ఎంత విలపించానో నాకు తెలుసు. ఈ పాపకు కూడా నా మీద దయ లేదా..? నా నీడ లో కూర్చొనే కదా -
"చెట్లు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి.. చెట్లు నరకడం వల్ల కాలుష్యం పెరుగుతుంది.. వృక్షో రక్షతి రక్షితః " అంటూ పాఠాలు చదివింది.
మరో పోటు నాలో దిగబడింది. కొద్దిగా తూలుతున్నాను. నా పైనున్న పక్షులన్నీ రెక్కలు టపటపలాడించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఒంటరి రాత్రులలో ఇవే కదా నాకు నేస్తాలు..? ఎన్ని పగళ్ళు వీటి బిడ్డలకు కాపలా కాశాను..? ఎన్ని రాత్రులు నా వెచ్చటి ఆకుల దుప్పట్లు కప్పుకొని ఇవి పడుకున్నాయి..? ఈ రోజు ఇలా విడిచి వెళ్ళిపోవలసినదేనా..?
నా చివరి కొమ్మ మీద తేనెపట్టు ఒకటుంది. ఆ తేనెటీగలు నా రక్షణకొచ్చాయి. నన్ను గొడ్డలితో కొడుతున్న వీరయ్య మీదకి వురుకాయి. తేనెటీగలు కుట్టడంతో వీరయ్య గొడ్డలి వదిలి దూరంగా జరిగాడు. తరువాత పొడవాటి కర్ర తెచ్చి ఆ తేనెపట్టును కదిపాడు. నా నుంచి ఏదో భాగాన్ని వేరు చేసినట్లైంది. తేనె పట్టు తొలగించి దూరంగా వున్న తన కొడుకుకు ఇచ్చాడు. చిత్రం ! తేనెటీగలు ఒక్కటీ ఇటు రాలేదు. వాటికీ ఎంత స్వార్ధం..! వాటికి ఆసరాగా నిలిచిన నన్ను అంతలోనే మర్చిపోయాయా..??
మళ్ళి మొదలయ్యాయి గొడ్డలిపోట్లు... ఒంటరినై బాధగా ఈ దెబ్బలను భరిస్తున్నాను.
అప్పుడు పలికింది భవాని...
"నాన్నా! ఈ చెట్టును కొట్టేయద్దు నాన్నా.. ఇదెంతో మంచి చెట్టు నాన్నా.. మనకి చాలా పండ్లిచ్చింది కదా నాన్నా"
చాలు..! నా జన్మకిది చాలు..!! ఎంత ప్రేమగా చెప్పింది భవాని. ఇద్దామంటే నా వంటి మీది పళ్ళన్నీ నిన్ననే దులిపేశారు. గొడ్డలి దెబ్బలకు కాండం చివరిదాక వచ్చింది. మరో రెండు దెబ్బలు.. అంతే..!!
ఈ లోగా భవానికి ఏదో ఒకటి ఇవ్వాలి. నా శరీరాన్ని పూర్తిగా పరికించాను. ఎక్కడో ఒక మూల చివర ఆకులచాటున వుంది దోరమాగిన పండు.
గొడ్డలి దెబ్బ మరికటి పడింది..నా కొమ్మలని కదుపుతూ ఆ కాయను కోస్తున్నాను..మరో దెబ్బ...! అదుపు తప్పి వూగిపోతున్నాను.. కాయను గట్టిగా కోస్తున్నాను...ఇక వొరిగిపోతున్నాను.. సరిగ్గా అప్పుడు తెగిన కాయ భవాని ముందు పడింది. నేను క్రింద పడిపోతూ వున్నాను. వీరయ్య చిన్నగా నవ్వి చెమట తుడుచుకుంటున్నాడు.
మగత కళ్ళు మూతలు పడుతుండగా భవాని వైపు చూసాను. కిందపడిన పండుని అందుకొని పరుగున శేఖరం దగ్గరకు వెళ్ళింది.
"నాన్నా నేను ఈ పండు పెరట్లో నాటుతాను నాన్నా.. మళ్ళి ఇలాంటి చెట్టే వస్తుంది.." అంటోంది వాళ్ళ నాన్నతో.
నేను ఆనందంగా కళ్ళు మూసుకున్నాను.
("వాయిస్ - విద్యుల్లత" పర్యావరణ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ, సెప్టెంబరు 1997)
నేను చేస్తున్న ఎంబీయేలో భాగంగా ఒక ప్రాజక్ట్ విషయమై ఆ సంస్థలో అడుగుపెట్టాను. నాకు కావల్సిన వివరాలు సేకరించిన తరువాత బయల్దేరబోతుంటే ఆ సంస్థ రిసోర్స్ మొబిలైజేషన్ శాఖలో పనిచేస్తున్న జేరూఖాన్ చిన్నమాట అంటూ నన్ను ఆపేసారు.
"ఈ రోజు మా సంస్థలో ఒక ఈవెంట్ వుంది.. మీరుకూడా వుండి చూస్తే మాకు చాల సంతోషం" అన్నదామె హిందీలో."ష్యూర్" అని ఆమెతోపాటే మెట్లుదిగి కిందికి వచ్చాను. అక్కడే ఈవెంట్ జరగబోతోందని చెప్పారావిడ.
వారం రోజులుగా ఆ సంస్థలో ట్రైనింగ్ పొందిన యువతీ యువకులు, ఆ రోజు తల్లిదండ్రులు, అతిథుల ముందు వాళ్ళు నేర్చుకున్నది ప్రదర్శించబోతున్నారు. కొంతసేపటికి ప్రదర్శన ప్రారంభమైంది. యువకులంతా ఒక ఇనుప పోల్ మీద యోగాసనాలు ప్రదర్శించారు. ఆడపిల్లలంతా అవే ఆసనాలను ఒక వ్రేలాడుతున్న తాడు పై చేసి చూపించారు. ఏమైన ఆ ఆసనాలు కొంచం కష్టమనే చెప్పాలి.
మేము చప్పట్లు కొట్టినప్పుడల్లా వాళ్ళ సంతోషం ముఖంలో వెలుగై పూస్తోంది. ప్రతి అభినందనకి వారంతా రెట్టించిన వుత్సాహంతో ప్రదర్శిస్తున్నారు. ఆక్కడ నిలబడ్డ తల్లి దండ్రులకు అంతా సంభ్రమంగా వుంది. అసలు ఇన్ని ఫీట్లు చేస్తున్నది తమ పిల్లలేనా అని ఆశ్చర్యపోతున్నారు. దాదాపు అరగంట జరిగిన కార్యక్రమంలో నెను చప్పట్లు ఆపనేలేదు.. అసలు ఆపబుద్దే వెయ్యలేదు. అంతా అయిపోయిన తరువాత కలిశానా అమ్మాయిని. పద్దెనిమిది పంతొమ్మిదేళ్ళుంటాయేమో ఆ పిల్లకి. అనుకోకుండా వచ్చి నాకు తగిలింది.
సారీ చెప్తూనే "ఎలా చేసాను సార్ నేను" అంటూ అడిగింది.
"బ్రహ్మాండం" అన్నానేను.
ఆ అమ్మాయి నవ్వింది.
మ నో హ రం గా...
ఎంత స్వచ్చంగా వుందా నవ్వు...
నేను ఆమె వైపే చూస్తూవుండిపోయాను. ఆ అమ్మాయి మాత్రం నన్ను చూడట్లేదు.
నేను చొరవ చేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని "నిన్ను నీ రూందగ్గర వదిలి పెట్టనా..?" అని అడిగాను.ఆ అమ్మాయి మళ్ళి నవ్వింది -
"నా అంతట నేను వెళ్ళగలను.." అంటూ నా చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది
అంతే.. ఇదుగో.. నేనిక్కడ సముద్రపువొడ్డున బెంచీపై కూర్చొని.. ఎంతసేపు అలావుండిపోయానో నాకే గుర్తులేదు. ఏమేమి ఆలోచించానో తెలియదు. కూర్చున్నాను అంతే.. ఇలాంటిచోట పని చెయ్యాల్సి రావటం నా అదృష్టమేమో.. రేపు ఇలాంటిదే మరో సంస్థకి వెళ్ళాలి. అక్కడ ఇంకేమనుభవముందో.. లేచి నిలబడి టాక్సి ఆపాను -
"దాదర్" చెప్పాను ముక్తసరిగా.
టాక్సి కదలబోయే ముందు మళ్ళి ఒక్కసారి ఆ బిల్డింగ్ వైపు చూసాను -
నల్లటి గేటు మీద తెల్లటి అక్షరాలతో ఆ సంస్థ పేరు రాసుంది -
"నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్"
(ఇది కథ కాదు. మూడేళ్ళ క్రితం నాకు అనుభవమైన సంగతి)
మాయదారి ముసుగులన్నీ తొలగిపోతాయి
మనసు ఖాళీ అవుతున్నకొద్ది గుండె బరువెక్కుతుంది
ఘనీభవించిన వేదనలన్ని కరిగి కన్నీరౌతాయి
నీ కళ్ళలోకి చూస్తాను
ఒంటరి నక్షత్రాలు తళుక్కుమంటాయి
ఒక చిరునవ్వు రెక్కలు కట్టుకొని
బాధల్ని మోసుకుంటూ దీవి దాటి పారిపోతుంది
మళ్ళి నేను నా లోకంలోకి వస్తాను
పసిపిల్లాడినై కేరింతలు కొడుతూ
నా తొలి అడుగులను మోసుకుంటూ
నువ్వు మాత్రం అక్కడే వుంటావు
మళ్ళి నాకోసం ఎదురుచూస్తూ..
(16 నవంబరు 1999)
బలి చక్రవర్తి కూతురు రత్నమాల తన తల్లి కైతవి పక్కనే నిలబడి ఆ మనోహర దృశ్యాన్ని చూసింది. అమాయకంగా అర్థిస్తూ నిలబడ్డ ఆ బాల వటువును చూడగానే రత్నమాలకు చిత్రంగా మాతృవాత్సల్యం పొంగుకొచ్చింది. ఆ చక్కని బిడ్డడు తన పుత్రుడే అయితే తన స్తన్యమిచ్చి లాలించాలనిపించిందామెకు.
మూడొవ అడుగు బలి తలపై పెడుతూ వామనుడు ఆమె వైపు చూసి తథాస్తు అన్నట్టు నవ్వాడు.
***
ఎన్నడూ లేనిది పార్వతి కొలనులో శివపూజకై నిర్దేశించిన పూలు మాయమైనాయి. పార్వతి కోపంతో దుర్గైంది.. కాళికైంది.. ఆ పని చేసినవాడు కొంగరూపంలో తిరిగే రాక్షసుడు కావాలని శపించింది. శివార్చనకే ఆ పూలు కోసిన గంధర్వుడు అదేమి తెలియక పరమేశ్వరుడి పాదాలపై ఆ పూలు వుంచి నమస్కరించాడు. అన్నీ తెలిసిన సర్వేశ్వరుడు మూడు నేత్రాలు మూసుకొని కేశవ స్తుతి చేసాడు.
***
మహర్షి ద్రోణుడు అగ్నిని ఆవాహన చేసాడు. ఆయన ముందున్న సమిధలు భగ్గున మండాయి. ఆ ఋషి పత్ని ధర కంట కన్నీరు వర్షిస్తోంది. ఇద్దరూ అగ్నిహోత్రం చుట్టు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తూ నిలబడ్డారు.
"దేవాది దేవా.. సంతానంకోసం అలమటించిపోతున్నాము.. ఇన్నేళ్ళుగా చేసిన తపస్సు నీలో కరుణ కలిగించలేదా ప్రభూ.. మా అత్మాహుతితోనైనా నీకు దయ కలిగితే మరుజన్మలోనైనా పుత్రభాగ్యాన్ని ప్రసాదించు తండ్రి.." అంటూ ఇద్దరూ వేడుకున్నారు. ఆ పై ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు.
***
ఆ రోజు నారదుడు సత్యలోకం చేరేసరికి జయవిజయులు విష్ణుమూర్తికి ప్రణమిల్లుతూ కనపడ్డారు.
"స్వామీ.. సనకసనందులను అడ్డగించిన పాపం మీ వియోగానికి కారణమౌతుందని తెలిస్తే.. వారిని అడ్డగించేవారమే కాదు. వారి శాపాన్ననుసరించి హిరణ్యాక్షహిరణ్యకశపులుగా, రావణకుంభకర్ణులుగా మీకు విరోధులమై మీచేతే వధించబడ్డాము. ఇక మా వల్లకాదు.. విష్ణుద్వేషులమై మిగిలిన ఆ ఒక్క జన్మా వెంటనే ఆరంభిస్తాము.. మమ్ములని వధించి శాశ్వత విష్ణుసేవా భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభూ.." అంటూ వేడుకొని వెళ్ళిపోయారు.
నారదుడు విష్ణుసంకీర్తనం చేసి నమస్కరించాడు.
"దేవదేవా.. ఏనాడు లేనిది తాపసిని నాకు కోపం కలిగింది స్వామీ.. మునుపు మిమ్మల్ని దర్శించి వెళ్తుండగా నగ్నంగా విహరిస్తున్న కుబేరపుత్రులు నలకుబేరుడు, మణిగ్రీవుడు కనిపించారు. నన్ను చూసి, తొలగక, నా ఆగ్రహానికి కారణమయ్యారు. వారిద్దరిని మద్దిచెట్లు కమ్మని శపించాను. నా చేత ఈ పని చేయించటంలో అంతరార్ధమేమిటి జగన్నాటక సూత్రధారి..?" అని ఆడిగాడు.
విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి అన్నాడు -
"నీవల్ల శాపంపొందిన కుబేరపుత్రులే కాదు నారదా.. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి ఆరుగ్గురు కొడుకులు అనేకానేక జన్మలెత్తుతూ బ్రహ్మ విధించిన శాపవిమోచనానికి ఎదురుచూస్తున్నారు.. సహస్రాక్షుడనే రాజు రాక్షస రూపంలో శాపవిముక్తికై వేచివున్నాడు.."
"ఇంతమంది శాపగ్రస్తులు ఏ కథకి నాంది పలుకుతున్నారు దేవా.."
"శాపగ్రస్తులేకాదు నారదా, వరప్రసాదులు కూడా వున్నారు.. సూర్యుని కుమార్తె కాళింది నన్ను వివాహమాడాలని వరం పొందింది. తరువాతి అవతారంలో ద్వంద యుద్ధం చేస్తానని జాంబవంతుడికి మాట ఇచ్చాను.."
"నారాయణా.. అయితే ద్వాపర యుగానికి దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారభమైనట్లేనా..."
విష్ణుమూర్తి నవ్వుతూ లక్ష్మీదేవి వైపు చూసాడు. ఆమె చిరునవ్వుతో సమ్మతించి అదృశ్యమైంది.. ఆమెతో పాటే విష్ణుమూర్తి కూడా. అటుపై ఆదిశేషుడు కూడా అంతర్ధానమయ్యాడు. నారదుడు నిష్ఠగా నారాయణ మంత్రం పఠిస్తున్నాడు.
బలిపుత్రిక రత్నమాల పూతన అనే రాక్షసిగా, శివపూజకై పార్వతి కొలనులో పూలుకోసిన గంధర్వుడు బకమనే రాక్షసుడిగా, సహస్రాక్షుడు తృణావర్తుడనే రాక్షసుడిగా పుట్టి కంసుడి దగ్గర చేరారు. జయవిజయులు శిశుపాల దంతవక్తృలుగా పుట్టి విష్ణుదూషణ చేయసాగారు. ధరాద్రోణులు యశోదా నందులై గోకులంలో పుట్టారు. నారద శాపంతో మద్దిచెట్లైన కుబేరపుత్రులు నందుని పెరట్లో పెరిగి విష్ణుస్పర్శకై వేచివున్నారు. లక్ష్మీదేవి రుక్మిణిగా జన్మించింది. అదితికశ్యపులు దేవకీ వసుదేవులుగా జన్మించారు. పూర్ణిమంతుడు, పుర్ణిమాసాది మరీచి పుత్రులు ఆరుగ్గురు, షడర్భకులుగా దేవకి గర్భమున ఒక్కొక్కరే జన్మించారు. ఏడొవ గర్భమున ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడు. అష్టమ గర్భంలో సాక్షాత్ శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు.