పుస్తక సమీక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తక సమీక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ముస్లిం దృక్కోణంలో మనిషి కథలు - (పుస్తక సమీక్ష)

నూరేళ్ళు పైబడ్డ తెలుగు కథ అనేక వాదాలు, ఉద్యమాల మీదుగా ప్రయాణం చేసింది. ప్రముఖంగా గత రెండు మూడు దశాబ్దాలలో స్త్రీవాద, దళితవాద కథలు, ఈ మధ్య కాలంలో మైనారిటీ కథలు విరివిగా వచ్చి తెలుగు కథకు విస్తృతిని పెంచాయి. ఈ తరహా కథలను నేను రెండు రకాలుగా విభజిస్తాను. మొదటిరకం కథలు ఒక వర్గం మరో వర్గం నుంచి ఎదురయ్యే discrimination గురించి తెలియజేసేవి. ఆ రకంగా చూస్తే ప్రతి పేదవాడి తిరుగుబాటు కథ ఇదే కోవలోకి వస్తుంది. పురుషాహంకారాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ప్రతి స్త్రీవాద కథా ఇదే కోవలోకి వస్తుంది. బ్రాహ్మనిజాన్ని అధిక్షేపించే ప్రతి దళిత కథ ఇదే కోవలోకి వస్తుంది. ఇక రెండో వర్గం కథలు చూపించే జీవితాలు, వినిపించే వ్యధలు వేరే. ఇవి ఆయా సామాజిక వర్గానికి మాత్రమే చెందిన కొన్ని పార్శ్యాలను చూపిస్తాయి. వారి జీవనవిధానాన్ని, వారికి జీవితాలలో మాత్రమే జరిగే కథలను వినిపిస్తాయి.
ఈ రెండు రకాల కథలకూ వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. సాహిత్యంలోనే కాకుండా, సోషయలజీ దృక్కోణంలో చూసినా ఈ రెండు రకాల కథల అవసరం ఉంది. మొదటిది కొంత ధిక్కార ధోరణిని, మరి కొంత తిరుగుబాటు లక్షణాలని ప్రదర్శిస్తూ కొన్ని మౌలికమైన ప్రశ్నలతో సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. రెండో రకం కథ ఆయా సామాజిక, సాంఘిక వర్గాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా రెండు వర్గాల మధ్య సమన్వయానికి దోహదపడుతుంది. నా ఉద్దేశ్యంలో మొదటి రకం కథ రాయడం కన్నా రెండో రకం కథలు రాయటం కష్టమైన పని. అందుకు ఎంతో అవగాహన, ప్రశ్నించే కసితో పాటు మరెంతో సంయమనం అవసరం. అలాంటి సంయమనంతో రాసిన కథలే వేంపల్లి షరీఫ్ రాసిన జుమ్మ లో కనిపిస్తాయి.
నిజానికి ఈ కథలలో అత్యధికం ముస్లిం జీవనానికి సంబంధించినవే అయినప్పటికీ వీటిని కేవలం మైనార్టీ కథలుగా గుర్తించడం ఆ కథల విస్తృతిని కుదింపజేయడమే అవుతుంది. దృక్కోణం ఒక సామాజిక వర్గానిదే అయినా సార్వజనీయమైన ఒక మానవతాంశాన్ని కదిలించి, ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించగలగడం ఈ కథల ప్రత్యేకత. ప్రతి కథ రాయటంలో ఎంతో శ్రద్ధ, కథాంశంలో ఒక నిబద్దత, అక్షరం అక్షరం వెనుక ఒక తపన స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్లే ఈ కథలు జాతీయస్థాయి గుర్తింపును అందుకోగలిగాయి.
ఈ పుస్తకంలో ఉన్న మొదటి మూడు కథలు పర్దా, జుమ్మా, ఆకుపచ్చ ముగ్గు, తెలుగోళ్ళ దేవుడు కథలను మినహాయించి మిగిలిన కథలలో ముస్లిం పాత్రలను తీసి వేరే ఏ పేరు పెట్టినా కథ మారదు. ఆ మూడింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మిగిలినవి ఇందాక చెప్పినట్లు సార్వజనీయమైన కథలు. చాపరాయి”, ’జీపొచ్చిందికథలు ముస్లింలకు సంబంధించినవి కావు. నిజానికి రజాక్ మియా సేద్యంకథలో రజాక్ మియాకి, “జీపొచ్చిందికథలో వెంకట్రెడ్డి కి కథ పరంగా చూస్తే పెద్ద తేడా వుండదు. రజాక్ మియాను వేధించింది అంగబలం వున్న వ్యక్తి అయితే, వెంకట్రెడ్డిని వేధించింది సాక్షాత్తూ సర్కారే. కానీ ఒక ముస్లిం సేద్యం చెయ్యాలని ప్రయత్నించడంలో ఒక వేదన వుంది. తరతరాలుగా దర్జీలుగా, మెకానిక్కులుగా వుంటూ తద్ఫలితంగా పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక జాతి మొత్తాన్ని అతను ప్రతిబింబిస్తాడు. అలాగే అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాలన్న కోరిక తీరక దస్తగిరి చెట్టుచెట్టును అరచేతిలోనే చూసుకోని మొక్కుకునే పిల్లాడు ప్రతి పేదింటిలోనూ కనిపిస్తాడు. ఎవరో అంజనంవేసి చెప్పిన మాట నమ్మి తన బిడ్డ వస్తాడని ఆశగా ఎదురుచూసే జమ్రూత్ లాంటి అమ్మలు అందరికీ తెలిసివాళ్ళే. పలక పండగకోసం పలక కావాలని వేధించే మదారు లాంటి పిల్లలూ మనకి కొత్తకాదు. రూపాయి కోడిపిల్లతో ఆడుకునే అంజాద్ మనందరి బాల్యంలోనూ వున్నాడు.
అలాగని కథకుడు ముస్లింలకి, ముస్లిమేతరులకు మధ్య వున్న వ్యత్యాసాన్ని, ఇతరులలో ముస్లింల పైన వున్న అభిప్రాయాన్ని విస్మరించాడని అనడానికి లేదు. అమ్మమ్మోళ్ల వూరికెళ్తే ఏమొస్తాదిరా నీ బొంద…. ఎక్కడిగైనా ఎళ్లి ఒగ మంచి పదేశం జూసిరాఅనే ఎక్కాల్సారు (దస్తగిరి చెట్టు), “పిల్లాడికి పలకిప్పంచంది బడికి పంపొద్దనిచెప్పే రామకృష్ణ సారు (పలక పండగ), “సాయిబులు మీకెందుకు మామా సేద్యంఅనే అంజిగాడు (రజాక్ మియా సేద్యం) వీళ్ళందరూ ముస్లిం జీవన విధానాన్ని, వారి పేదరికాన్ని విస్మరించారని అంతర్లీనంగా చెప్తూనే వున్నాడు. ఇక తెలుగోళ్ళ దేవుడుకథలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ, పరిష్కారానికి అందరూ కలిసి నడవాలని సూచించాడు కూడా.
ఇక ఈ కథా సంకలనానికి తలమానికమైనవి మొదటి మూడు కథలు.
కొడుకు చిన్నప్పుడు పస్తులున్నాడని ఇల్లిల్లూ అడుక్కున్న తల్లి, అదే బిడ్డ పెద్దై గోషా పేరుతో పర్దా కట్టడాన్ని నిరసించే జేజి కథ – “పర్దా”. ఇక్కడ పర్దా కేవలం ముస్లిం సాంప్రదాయానికి సంబంధించినది కాదు. పర్దా మనందరిలో వుండే హిపోక్రసీకి ఒక సింబల్. అందుకే మన చుట్టుపక్కల హిపోక్రసీ కనపడినప్పుడల్లా జేజిఒక దెప్పిపొడుపులా గుర్తొచ్చి తీరుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా జేజి పాత్ర మనకు బాగా పరిచయమైన వ్యక్తి లాగే వుంటుంది. తిరిగే కాలు, తిట్టే నోరుతో రౌడీలా బతికిన జేజి కేవలం చరమాంకంలో కొడుకు, కోడలు పంచన చేరి మాటపడాల్సి రావడం బాధిస్తుంది. ఎన్ని మాటలన్నా పడ్డ జేజి కొడుకు పరువు కోసం సంప్రదాయం ముసుగును పర్దాగా వేస్తానంటే తిరగబడుతుంది. పల్లె పట్నం మధ్య వున్న వ్యత్యాసాన్ని గుర్తించి – “అడుక్కున్నా పర్వాలా.. నేనీడ ఉండలేనుఅని ప్రకటిస్తుంది.
అవకాశం లేకపోయినా ఆశల్ని వదులుకోని జీనత్ అక్క ఆకుపచ్చ ముగ్గులో అబ్బురపరుస్తూనే కలుక్కుమనిపిస్తుంది. హిందువుల ఇంటి ముందు ముగ్గు ముస్లిం చేతి పైన మెహందీ అవుతుంది. రెండు మతాల మధ్య తేడా ఇంతేనా అంటాడు కథకుడు. ఇంత చిన్న వ్యత్యాసాన్ని తెలుసుకోడానికి జీనత్ అక్క చిన్నప్పటి నుంచి ఎన్ని తిట్లు తింటుందో. ఎన్నెన్ని కష్టాలు కొని తెచ్చుకుంటుందో. ఇదంతా ఒక ఎత్తు.. జీనత్ అక్క పట్టుదలతో చెయ్యాలనిపించిన పని చెయ్యగలగడం చూస్తే మనకి ఏదో పర్వతారోహణ చేసిన తృప్తి కలుగుతుంది. అలాంటి అక్క మీద జాలేస్తుంది. ఆమె గుంటపడిన కళ్ళలో కన్నీరవ్వాలనిపిస్తుంది.
ఇక జుమ్మా ఇది జుమ్మా కథే కాదు. అమ్మ కథ కూడా. ప్రతి జుమ్మాకీ మసీదు వెళ్ళాలని కొడుకుని ప్రోత్సహించిన ఓ తల్లి, ఒక శుక్రవారం మసీదులో జరిగిన బాంబు పేళ్ళుళ్ళకి భయపడి – “నువ్వు కానీ మసీదుకు వెళ్ళలేదు కదా నాయనాఅంటుంది. ఆ మాట అనడానికి ఆ తల్లి ఎంత మధనపడి వుంటుందో కదా..! కన్నపేగు కోసం మతాచారాన్నే కాదనాల్సి వచ్చిందని ఆ తల్లి ఎంత తల్లడిల్లి వుంటుందో..!! కలకాలం గుండెల్లో గుబులుగా మిగిలిపోయే కథ.
ఈ కథలు ఇంత బలమైన అనుభూతిని ఇవ్వగలిగాయంటే అందుకు కారణం ఒకటే ఇవన్నీ ప్రతి మనిషికి సంబంధించిన primal emotions తట్టి లేపుతాయి. కాబట్టే ఇవి ఇంత వైశిష్ట్యాన్ని సంతరించుకున్నాయి.
తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
(వేంపల్లి షరీఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ వారి యువ సాహితీ పురస్కార గ్రహీత)

పుస్తకం: జుమ్మా
రచన: వేంపల్లి షరీఫ్
ప్రచురణ: సాఫిర్ పభ్లికేషన్స్, వేంపల్లి
వెల: రూ 60
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, కినిగె

కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!!

మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..అన్నాడు గిరీశం. పుస్తకానికి ఖోపం వచ్చేసింది. పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.
అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.
నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలిఅన్నది.
ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పుఅన్నాడు రవణ
ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..
హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..
తోడుకేం తక్కువోయ్ ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగలసెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..
ఇంకా ఇంకా..!!
కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..
విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..
హన్నా..
హ హఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్ ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..
ఏమిటా కోతివేషాలు..
అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులుకోతి కొమ్మచ్చులు
తథాస్తు
మరి నువ్వు రావా అమ్మా..?”
పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”
సరే
***
పుస్తక సమీక్ష అనుకుంటే ఈ సొంత పైత్య పరీక్ష ఏమిటనుకుంటున్నారా.. ఇది నా స్థాయిలో కోతి కొమ్మచ్చి. చెట్టు మీదనుంచి చెట్టుకు కాకపోయినా ఒక పూల కుండీ మీద నుంచి మరో పూల కుండీ మీదకి.
స్వాతి వార పత్రికలో ముళ్ళపూడి వెంకట రమణగారు ఆడిన కోతి కొమ్మచ్చులన్నీ కుదురుగా కూర్చి పెట్టిన పుస్తకమిది. ఈ పుస్తకం తిసుకోని ఎక్కడినించి మొదలు పెట్టినా ఎటువైపు చదువుకుంటూ వెళ్ళినా ఎక్కడా ఆగదు. ఆప బుద్ధెయ్యదు. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే-కోతిపిల్ల తల్లికోతిని కరుచుకున్నట్లు రమణగారిని కరుచుకుంటే చాలు ఎన్ని జీవితాల చెట్లు, ఎన్ని అనుభవాల కొమ్మలు, ఎన్ని సంతోషాల పూలు, ఎన్నెన్ని కన్నీళ్ళ పేళ్ళు.. అన్నింటినీ దాటిస్తూ దూకిస్తూ సాగుతుందీ ఆత్మ కథ. కథలో నించి కథలోకి, పిట్టకథలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయామో అర్థంకాక వెనక్కి రావడం తెలియక అభిమన్యుడిలా ఎన్నిసార్లు ఇరుక్కుపోయినా ఈ పద్మవ్యుహాల పుస్తకం చదువుతుంటే ఆహ్లాదంగానే వుంటుంది. అదో కొత్త సొగసుగా వుంటుంది.
మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగు వాచకంలో పది పేజీల ప్రోజు మొత్తం అయిపోయాక చివర కథా సారాంశం (సమ్మరీ) అంటూ ఒక్క పేరాగ్రాఫులో కథ వివరం మొత్తం ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్క పేరగ్రాఫు చదువుకుంటే మొత్తం కథ చదివిన పుణ్యం..!! అలాగే ముళ్ళపుడిగారు వ్రాసిన పది వాక్యాలకి ఒక్క గీతతో తిలకం పెట్టేస్తారు బాపు గారు ఒకోసారి నామం కూడా అనుకొండి. ఆ బొమ్మలు ఇందాక చెప్పిన సారాంశానికి రెండాకులు ఎక్కువ. ఎందుకంటే ఇవి కథ సంగ్రహంగా చెప్పడమే కాదు ఆ కథలో ఆత్మని మన ముందు నిలబెట్టేస్తాయి. చాలా సార్లు ఈ బొమ్మలు రమణగారు చెప్పిన కథకి కొత్త అర్థాన్ని సరికొత్త రూపాన్ని ఇస్తాయి. ఆ రకంగా ఆయన అక్షరాలతో బొమ్మలేస్తుంటే ఈయన బొమ్మలతో కథలు చెప్పేస్తుంటాడు. అందుకే ఈ పుస్తకం ముళ్ళపూడి పుస్తకం అనటంకన్నా బాపూరమణీయం అనటమే సబబు.
అయితే ఇందులో కథేమిట్రా అబ్బాయ్అని ఎవరైనా అమాయకులు అడిగితే చెప్పడానికి కొంచెం కష్టమే ఇదేమైన సినిమా రీలా? “లలిత శివ జ్యోతి కంబైన్స్ లవకుశఅంటూ మొదలెట్టి శుభం కార్డుదాకా చెప్పడానికి? ఇది మన తాతయ్య దగ్గర కుర్చోని ఆయన జ్ఞాపకాల తుట్టెను కదిపితే ఒకదానికొకటి అల్లుకోని వున్న అనుభవాలన్ని తియ్యటి తేనెలాగా కారినట్టు వుంటుంది, మనసులో ఊరినట్టౌతుంది..
ధవళేశ్వరంలో బ్రతికి చెడ్డ కుటుంబంలో పుట్టి ఇంతింతై ఖాళీ పర్సంతై, ఎమ్టీ పాకెటంతై, జేబుకు చిల్లంతై కష్టాలు, కన్నీళ్ళు, బాధలను చిరునవ్వులతో చెరిపేస్తూ ఆత్మ విశ్వాసంతో (కొన్ని భాషల్లో దీన్నే పొగరంటారు) ఎదిగి అప్పులుపడి, అకలిపడి, తిప్పలుపడి స్నేహాలతో కడుపు నింపుకొని, సంగీతంతో దాహం తీర్చుకొని, సాహిత్యంతో సరసమాడుకొని ఈ రమణ అనే వ్యక్తి ఎక్కిన మెట్లు, దూకిన చెట్లు, పడిన తిట్లు అన్నీ వున్నాయి. అక్కడికి ఇదేదో విశాల విషాద గాథ అనుకునేరు. ఇవి కాకుండా నడుమ్మీద చేతులు వేసుకున్న సంధర్భాలు, కాలరూ ముక్కు రెండూ ఎగరేసిన పొగరులు, మెచ్చుకోళ్ళు, మంచి మాటలు, చప్పట్లు, సన్మానపు దుప్పట్లు కూడా వున్నాయి.
మొత్తం మీద ఇది జివన సారం, సరదా ముసుగుతో వైరాగ్య విహారం.. చిరునవ్వులతో కళ్ళు చెమర్చే కథా సాగరం.
పుస్తకం నిండా ముళ్ళపూడి మార్కు పదవిన్యాసాలు మచ్చుకి -
కుళ్ళిపాయల కూర
ఎర్రటి ఎండలో 56 పేజీలు నడిచాను
పొగరెట్ కథలు” (పొగ గురించి, పొగరు గురించి)
పక్కింటి బంతి పూల రథం
ఫిలిం ప్రొడ్యూస్రూ పేపర్ ప్రొప్రయిటర్లూ చిలకా గోయంకల్లా, విస్కీ సోడాల్లా, పెసరట్ వుప్మాల్లా, బుగ్గాముద్దులా..
“(
వద్దంటే పెళ్ళి సినిమా) నిడివి: మూడు మైళ్ళ 5 ఫరలాంగుల 9 గజా 6 అడుగుల 9 అంగుళాలు..
ఇందులో (సినిమాలో) కథానాయిక పన్నాగా జమున అభినయించింది. సిపాయి పాత్రను గుమ్మడి భరించాడు. రాజుగా నాగయ్య, దుష్ట సేనానిగా రాజనాల నటించారు, కైకాల సత్యనారాయణను యువరాజు పాత్ర ధరించింది..
ఇంకా ఎన్నో మరెన్నో.
మొత్తం మీద కొనిచదవాల్సిన పుస్తకం. చదివిన తరువాత పదిలంగా పెట్టుకోవాల్సిన పుస్తకం.
***
కోతి కొమ్మచ్చి విడుదలైంది. రవీంద్రభారతిలో భారతికి అక్షరాభిషేకం జరిగింది. కని విని ఎరుగని రీతిలో మొదటి ప్రచురణ వారం రోజులకే ఖాళీ అయిపొయినట్లు ప్రకటించారు హాసం వారు.
రవింద్ర భారతిలో భారతి -

నాయనా మొత్తానికి బార్బేరియస్ అన్నవాళ్ళే తెలుగు పుస్తకాన్ని కొనేట్టు చేశావు.. చాలా సంతోషంగా వుంది
అప్పుడే ఏమైందమ్మా? కోతికొమ్మచ్చి రెండొవ భాగం రాబోతోంది.నవ్వాడు రమణ. ఆ వెనకే బాపూ కూడా.
(అప్పుడెప్పుడెప్పుడో పుస్తకం వచ్చిన కొత్తల్లో పుస్తకం.నెట్ లో రాసుకున్న సంగతులు...)

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు

ఓ బోయవాడు బాణం వదిలాడు. పూర్వాశ్రమంలో దొంగగా బతికిన ఓ వ్యక్తి అక్కడ నిలబడి జంట పక్షుల్లో ఒకటి నేలకొరగడం చూశాడు. తోడు కోల్పోయిన రెండో పక్షి కన్నీరులో కరిగాడు. కరుణరసాత్మకమైన ఓ కావ్యానికి బీజం పడింది. ఇది మనందరికీ తెలిసిన వాల్మీకి కథ. జాగ్రత్తగా గమనించండి. వాల్మీకికి అప్పుడు కలిగిన భావన కేవలం కరుణేనా? బాణం వేసిన బోయవాడి మీద కోపం రాలేదా? ప్రాణాలని కబళించి మిగిలిపోయినవారికి విషాదాన్ని మిగిల్చే మృత్యువు మీద ఆగ్రహం కలగలేదా? ప్రేమ జంట తనని వీడిపోయిందని ఏడుస్తున్న పక్షి కన్నీరు తుడవలేని అశక్తతని తలుచుకోని వాల్మీకికి అసహనం కలగలేదా? ఒకవేళ అలాంటి ఆగ్రహం, అసహనం కలిగివుంటే వాల్మీకి రాసిన కావ్యం ఎలా వుండేది?
నేను చెప్పనా?
అప్పుడు కూడా రామాయణం కరుణరసాత్మకంగానే వుండేది. ఆ వాల్మీకి పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయితే. ఆగ్రహానికీ కరుణకు ఏమిటీ సంబంధం? తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. ఎలా? పెద్దిభొట్ల కథలు చదవాలి. “ద్రణేవుడు” ఎవరు? ఎవరో వుండే వుంటారు. వెతకాలి. వెతుకుతూనే వుండాలి. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. తెలుసుకోలేనివాడు “ఇంగువ” అంటే ఏమిటో ఎరగని వాడిలా జీవితాన్ని చాలిస్తాడు. ముగిసిపోయేది కాదు జీవితం అంటే, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావే అదీ జీవితం అంటే..
అలా కాదు నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటావా... ఆల్ రైట్... గాటానికి కట్టిన ఎద్దులా గిరా.. గిరా.. గిరా... బావిదాటని కప్పలా బెక బెక బెక బెకా...! తనకు తెలియని కొత్త ప్రపంచం ఒకటుందని, అందులో కనుచూపు సాగినంత మేర “నీళ్ళు” వుంటాయని తెలియని వాడు ఏమౌతాడు? మంచినీళ్ళు కనిపిస్తే అవురావురంటూ తాగుతాడు. గంటలుగంటలు స్నానాలు చేస్తాడు. చివరికి ఓ ముహూర్తాన నీళ్ళలోనే పడి చస్తాడు. మరి అతను తెలుసుకోవాల్సిందేమిటి? ఓ వూరిలో నీళ్ళు లేక ఛస్తుంటే మరో వూర్లో నీళ్ళలో మునిగి చస్తుంటారు. ఈ వైరుధ్యాన్నే తెలుసుకోవాలి. ఈ వైరుధ్యం పేరు కూడా జీవితమే.
అయితే ఈ జీవితం గురించి మనకి చెప్పేది ఎవరు? నేను చూడని కొత్తకోణం వైపు బైనాకులర్స్ పెట్టి చూపించేది ఎవరు? ఒక పుస్తకం. ఒక జిజ్ఞాస. ఒక ప్రశ్న. ఇదిగో అలాంటి ప్రశ్నలన్నింటినీ తలకెత్తుకోని తిరిగే పెద్దమనిషి ఒకాయన వున్నాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు ఆయన్ని. మృత్యువుని రక్తం రంగులో కళ్ళారా చూసినవాడు. తల్లిప్రేమని అభద్రత రూపంలో అనుభవించిన వాడు. కష్టాన్ని కన్నీటి రుచిలో తెలుసుకున్నవాడు. జీవితం అంటే కషాయం అని కనిపెట్టిన మానసిక శాస్త్రవేత్త. ఆ కషాయాన్ని ఏ మిశ్రమాలలో కలపాలో తెలుసుకున్న సరికొత్త రసవాది. కథ అనే అంబులపొదిలో అక్షయతూణీరాల్లాంటి పాత్రల్ని పెట్టుకోని మనసుని కరుణాస్త్రబద్ధుల్ని చేయగల విలుకాడు.
కవిసామ్రాట్ దగ్గర శిష్యరికం చేసినవాడు పోనీ కవిత్వం రాసి వుండచ్చుగా? కథని పట్టుకున్నాడు. కథ ఆయన్ని పట్టుకుంది. కథల్లో వర్ణన చూడండి. ఒకో కథలో ఒకలాగ వుండే వాతావరణం చూడండి. నిప్పుల మీద నుంచి వీస్తున్నట్లుగా వేడిగాలులు, బాగా బలిసిన ఏనుగుల్లా మబ్బులు, వాన జల్లులు, ముసురు పట్టడాలు, గుడ్డివెన్నెలలు, తెల్లటి వెండి కంచంలాంటి చంద్రుడు, వేప చెట్లు అబ్బో.. ఇంకా చాలా వున్నాయి. ఇవన్నీ కథలోకి వచ్చి ఏం చేస్తున్నాయి? చదివిస్తున్నాయి. అంతే. ఏ వాక్యాన్ని విత్తనంగా వేస్తే ఏ అనుభూతి మొలకెత్తుతుందో తెలియడమే రచన. అదే కదా కావాల్సింది.
వుద్యోగంలో చేరాల్సినరోజే ఎగ్గొట్టి “పథేర్ పాంచాలి” చూసినవాడు పోనీ సినిమా అయినా తీసుండచ్చుగా? లేదు. మళ్ళీ కథలోకే వచ్చాడు. సినిమా చూపించాడు. కావాలంటే అయన రాసిన తొలి కథల్లో ఒకటైన “భయం” (1960) చూడండి. ఓ పిల్లవాడు గోడగడియారం బద్దలుకొట్టాడు. నాన్న వస్తే బెత్తం విరిగేట్లు కొడతాడని భయం. అదే కథ. అంతే కథ. ఆ పిల్లాడి భయం చెప్పాలంటే వాడి మనసులో దూరి తెరలు తెరలుగా వున్న భయాన్ని పొరలు పొరలుగా వ్యాక్యాలలో చెప్పాలా? ఊహు.. అలా కాదు. ఎండ, ఎండుటాకులు, టెలిగ్రాఫ్ తీగలమధ్య చిక్కుకున్న గాలిపటాలు, వీధి చివర తోలుతిత్తి వొత్తుతుంటే వచ్చే ’గుఫ్ గుఫ్’ చప్పుడు, మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న ముసల్ది, దూదేకులవాడు ఏకుతున్న దూది, ఓ ఇంటి పంచాలో ఓ చిన్నపిల్ల వూదుతూ పగలగొట్టిన బెలూన్, ఆ చప్పుడుకి ఏడ్చిన చంటిపిల్లాడు... ఏమిటిదంతా? సంబంధంలేనివేవో చూపిస్తూ ఆ పిల్లాడి మనసులో భయాన్ని పరిచయం చేస్తాడు. ఈయనెవరు సైకాలజిస్టా? దాదాపు అలాంటిదే – స్కూల్ మేష్టరు.
 “నేను ఏదీ టెక్నిక్ ప్రకారం రాయలే”దని. “కథకి మేథమేటిక్స్” వుండదని చెప్పిన రచయితేనా రాసింది? అవున్నిజమే. ఆయన టేక్నిక్ అనుకోని రాయడు. అది రాసిన తరువాత ఆ టెక్నిక్ గురించి మనం తెలుసుకుంటాం.
కథలన్నీ కరుణరసం అన్నామా? మరి మనసుల్ని తాకేవి, పిండేవి, కాల్చి నుసి చేసేవి రాసాడా? అదీ లేదు. మరేం చేశాడు?చెప్పదల్చుకున్నది మూడు పేజీలలో తేల్చేశాడు. ఆ మూడు పేజీల్లోనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తయారు చేశాడు. కరుణరసాత్మకమైన కథలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్? ఇదెలాగా? అదలాగే. ఏ వాక్యమైతే కథకి మూలమో ఆ వాక్యాన్ని గుండెకి దగ్గరగా పెట్టుకోని, షో చెప్పేముందు విసిరే ట్రంప్ కార్డులా విసిరి కథ ముగిసిందంటాడు. అదేమి చిత్రమో మన మనసులో కథ అప్పుడే మొదలౌతుంది. “అన్నదాత సుఖీభవ” కథ చూడండి. పురుషోత్తం అనే వ్యక్తి కథ చెబుతుంటాడు. ఎక్కడో సత్రంలో తప్పక అన్నదాన పంక్తిలో భోజనం చెయ్యాల్సివచ్చిన సంగతి అది. తీరా తిన్నాక అక్కడ బోర్డుమీద వున్న పేరుని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానంటాడు. ఆ పేరేమిటో చెప్పడు. ఆ తరువాత మూడు పేరగ్రాఫుల సమయం గడిచాక, పక్కనున్న మిత్రుడు అడిగితే గాని ఆ పేరు ఎవరిదో పాఠకుడికి తెలియదు. ఆ తరువాత లైనుకి కథ అయిపోతుంది. ఇది కొసమెరుపుతో ముగించడం కాదు. ఒక మెరుపుని కొసదాకా లాక్కొచ్చి పడేయడం. ఆయన రాయడానికి కలం వాడుతారా? ఉలి వాడుతారా? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా?మధ్యతరగతి జీవితాలని కాచి వడబోసిన కషాయం కనిపెట్టిన కథకుణ్ణి తెలుసుకోవద్దూ? అర్థంకాని లిపిలో దేవుడు రాసిన జీవితమనే కావ్యాన్ని అలతి తెలుగుపదాలలోకి మార్చిన అనువాదకుణ్ణి తెలుసుకోవద్దూ? అగ్రవర్ణం అని పిలవబడే జాతిలోకూడా అస్పృశ్యుడైన దళితుణ్ణి పరిచయం చేసిన మనిషిని గురించి తెలుసుకోవద్దూ? ఆటల్ని కూడా కథలుగా మార్చగలిగిన రచయితని తెలుసుకోవద్దూ? మీరే చెప్పండి - తెలుసుకోవాలా లేదా? మరింకెందుకాలస్యం తెలుసుకోండి -
ఇంతకీ ఇంగువ ఏమిటి? తెలుసుకున్నారా? “అది చెట్టు నుంచి వొస్తుందా? ఏదైనా రసాయనిక పదార్థమా? లేక ఒక రకం రాయి వంటిదా? అది గాక ఏదన్నా జంతువుకు సంబంధించినదా?” తెలుసుకున్నారా?లేక తెలియకుండానే..???
("బోలెడు కరుణ…కొంచెం ఆగ్రహంతో…!" పేరుతో సారంగ వెబ్ పత్రికలో ప్రచురితం)
(సుబ్బరామయ్యగారి కథలు ఇతర రచనలు అన్ని పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యం. కినిగె.కాం లో ఇక్కడ)