కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!!

మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..అన్నాడు గిరీశం. పుస్తకానికి ఖోపం వచ్చేసింది. పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.
అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.
నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలిఅన్నది.
ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పుఅన్నాడు రవణ
ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..
హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..
తోడుకేం తక్కువోయ్ ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగలసెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..
ఇంకా ఇంకా..!!
కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..
విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..
హన్నా..
హ హఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్ ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..
ఏమిటా కోతివేషాలు..
అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులుకోతి కొమ్మచ్చులు
తథాస్తు
మరి నువ్వు రావా అమ్మా..?”
పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”
సరే
***
పుస్తక సమీక్ష అనుకుంటే ఈ సొంత పైత్య పరీక్ష ఏమిటనుకుంటున్నారా.. ఇది నా స్థాయిలో కోతి కొమ్మచ్చి. చెట్టు మీదనుంచి చెట్టుకు కాకపోయినా ఒక పూల కుండీ మీద నుంచి మరో పూల కుండీ మీదకి.
స్వాతి వార పత్రికలో ముళ్ళపూడి వెంకట రమణగారు ఆడిన కోతి కొమ్మచ్చులన్నీ కుదురుగా కూర్చి పెట్టిన పుస్తకమిది. ఈ పుస్తకం తిసుకోని ఎక్కడినించి మొదలు పెట్టినా ఎటువైపు చదువుకుంటూ వెళ్ళినా ఎక్కడా ఆగదు. ఆప బుద్ధెయ్యదు. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే-కోతిపిల్ల తల్లికోతిని కరుచుకున్నట్లు రమణగారిని కరుచుకుంటే చాలు ఎన్ని జీవితాల చెట్లు, ఎన్ని అనుభవాల కొమ్మలు, ఎన్ని సంతోషాల పూలు, ఎన్నెన్ని కన్నీళ్ళ పేళ్ళు.. అన్నింటినీ దాటిస్తూ దూకిస్తూ సాగుతుందీ ఆత్మ కథ. కథలో నించి కథలోకి, పిట్టకథలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయామో అర్థంకాక వెనక్కి రావడం తెలియక అభిమన్యుడిలా ఎన్నిసార్లు ఇరుక్కుపోయినా ఈ పద్మవ్యుహాల పుస్తకం చదువుతుంటే ఆహ్లాదంగానే వుంటుంది. అదో కొత్త సొగసుగా వుంటుంది.
మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగు వాచకంలో పది పేజీల ప్రోజు మొత్తం అయిపోయాక చివర కథా సారాంశం (సమ్మరీ) అంటూ ఒక్క పేరాగ్రాఫులో కథ వివరం మొత్తం ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్క పేరగ్రాఫు చదువుకుంటే మొత్తం కథ చదివిన పుణ్యం..!! అలాగే ముళ్ళపుడిగారు వ్రాసిన పది వాక్యాలకి ఒక్క గీతతో తిలకం పెట్టేస్తారు బాపు గారు ఒకోసారి నామం కూడా అనుకొండి. ఆ బొమ్మలు ఇందాక చెప్పిన సారాంశానికి రెండాకులు ఎక్కువ. ఎందుకంటే ఇవి కథ సంగ్రహంగా చెప్పడమే కాదు ఆ కథలో ఆత్మని మన ముందు నిలబెట్టేస్తాయి. చాలా సార్లు ఈ బొమ్మలు రమణగారు చెప్పిన కథకి కొత్త అర్థాన్ని సరికొత్త రూపాన్ని ఇస్తాయి. ఆ రకంగా ఆయన అక్షరాలతో బొమ్మలేస్తుంటే ఈయన బొమ్మలతో కథలు చెప్పేస్తుంటాడు. అందుకే ఈ పుస్తకం ముళ్ళపూడి పుస్తకం అనటంకన్నా బాపూరమణీయం అనటమే సబబు.
అయితే ఇందులో కథేమిట్రా అబ్బాయ్అని ఎవరైనా అమాయకులు అడిగితే చెప్పడానికి కొంచెం కష్టమే ఇదేమైన సినిమా రీలా? “లలిత శివ జ్యోతి కంబైన్స్ లవకుశఅంటూ మొదలెట్టి శుభం కార్డుదాకా చెప్పడానికి? ఇది మన తాతయ్య దగ్గర కుర్చోని ఆయన జ్ఞాపకాల తుట్టెను కదిపితే ఒకదానికొకటి అల్లుకోని వున్న అనుభవాలన్ని తియ్యటి తేనెలాగా కారినట్టు వుంటుంది, మనసులో ఊరినట్టౌతుంది..
ధవళేశ్వరంలో బ్రతికి చెడ్డ కుటుంబంలో పుట్టి ఇంతింతై ఖాళీ పర్సంతై, ఎమ్టీ పాకెటంతై, జేబుకు చిల్లంతై కష్టాలు, కన్నీళ్ళు, బాధలను చిరునవ్వులతో చెరిపేస్తూ ఆత్మ విశ్వాసంతో (కొన్ని భాషల్లో దీన్నే పొగరంటారు) ఎదిగి అప్పులుపడి, అకలిపడి, తిప్పలుపడి స్నేహాలతో కడుపు నింపుకొని, సంగీతంతో దాహం తీర్చుకొని, సాహిత్యంతో సరసమాడుకొని ఈ రమణ అనే వ్యక్తి ఎక్కిన మెట్లు, దూకిన చెట్లు, పడిన తిట్లు అన్నీ వున్నాయి. అక్కడికి ఇదేదో విశాల విషాద గాథ అనుకునేరు. ఇవి కాకుండా నడుమ్మీద చేతులు వేసుకున్న సంధర్భాలు, కాలరూ ముక్కు రెండూ ఎగరేసిన పొగరులు, మెచ్చుకోళ్ళు, మంచి మాటలు, చప్పట్లు, సన్మానపు దుప్పట్లు కూడా వున్నాయి.
మొత్తం మీద ఇది జివన సారం, సరదా ముసుగుతో వైరాగ్య విహారం.. చిరునవ్వులతో కళ్ళు చెమర్చే కథా సాగరం.
పుస్తకం నిండా ముళ్ళపూడి మార్కు పదవిన్యాసాలు మచ్చుకి -
కుళ్ళిపాయల కూర
ఎర్రటి ఎండలో 56 పేజీలు నడిచాను
పొగరెట్ కథలు” (పొగ గురించి, పొగరు గురించి)
పక్కింటి బంతి పూల రథం
ఫిలిం ప్రొడ్యూస్రూ పేపర్ ప్రొప్రయిటర్లూ చిలకా గోయంకల్లా, విస్కీ సోడాల్లా, పెసరట్ వుప్మాల్లా, బుగ్గాముద్దులా..
“(
వద్దంటే పెళ్ళి సినిమా) నిడివి: మూడు మైళ్ళ 5 ఫరలాంగుల 9 గజా 6 అడుగుల 9 అంగుళాలు..
ఇందులో (సినిమాలో) కథానాయిక పన్నాగా జమున అభినయించింది. సిపాయి పాత్రను గుమ్మడి భరించాడు. రాజుగా నాగయ్య, దుష్ట సేనానిగా రాజనాల నటించారు, కైకాల సత్యనారాయణను యువరాజు పాత్ర ధరించింది..
ఇంకా ఎన్నో మరెన్నో.
మొత్తం మీద కొనిచదవాల్సిన పుస్తకం. చదివిన తరువాత పదిలంగా పెట్టుకోవాల్సిన పుస్తకం.
***
కోతి కొమ్మచ్చి విడుదలైంది. రవీంద్రభారతిలో భారతికి అక్షరాభిషేకం జరిగింది. కని విని ఎరుగని రీతిలో మొదటి ప్రచురణ వారం రోజులకే ఖాళీ అయిపొయినట్లు ప్రకటించారు హాసం వారు.
రవింద్ర భారతిలో భారతి -

నాయనా మొత్తానికి బార్బేరియస్ అన్నవాళ్ళే తెలుగు పుస్తకాన్ని కొనేట్టు చేశావు.. చాలా సంతోషంగా వుంది
అప్పుడే ఏమైందమ్మా? కోతికొమ్మచ్చి రెండొవ భాగం రాబోతోంది.నవ్వాడు రమణ. ఆ వెనకే బాపూ కూడా.
(అప్పుడెప్పుడెప్పుడో పుస్తకం వచ్చిన కొత్తల్లో పుస్తకం.నెట్ లో రాసుకున్న సంగతులు...)