ఆకురాల్చే కాలం. ఎండిన ఆకులు కాళ్ళ
కింద పడి చిత్రంగా చప్పుడు చేయాల్సిన రోజులు. కానీ ఆ సంవత్సరం వర్షాలు పడటంతో
రాలిన ఎర్రటి ఆకులు పారుతున్న నీళ్ళకింద మునిగి మురిగిపోతున్నాయి. అంతా బాగుంటే
వేటాడటానికి అనువైన సమయం. పరిస్థితులు అలా లేకపోవటం వల్ల ఈ కథ బయటకి వచ్చింది.
అడవంతా చిత్తడిగా వుంది. అందులో
నుంచి వచ్చే గాలిలో వర్షపు నీటి వాసన, తడిసిన గడ్డి వాసన, తడిమట్టి వాసన కలగలిసి
మత్తును కలిగిస్తున్నాయి. వేటగాళ్ళు వర్షం వల్ల ముందుకు వంగి మరీ పరుగెత్తడంతో
అలిసిపోతున్నారు. వేట కుక్కలు తమ తోకల్ని కాళ్ళ మధ్యలో ఇరికించుకుంటున్నాయి. వాటి
వంటి మీద బొచ్చు తడిసి శరీరానికి అతుక్కుపోతోంది. ఆడవాళ్ళ బట్టలన్నీ తడిసి ముద్దైపోతున్నాయి.
ప్రతి సాయంత్రం ఇలాంటి పరిస్థితిలో శరీరం, మనసు రెండూ అలసిపోయి వెనక్కి
వస్తున్నారు.
రాత్రి భోజనాలయ్యాక పెద్ద డ్రాయింగ్
రూమ్ లో చేరి అంతా అష్టాచెమ్మ లాంటి ఆటలు అనాసక్తంగా ఆడుతున్నారు. ఇంటి చుట్టూ
ఈదురుగాలి ఈల వేసుకుంటూ తిరుగుతోంది. అందరూ ఎప్పుడో చదివిన కథలను చెప్పుకునే
ప్రయత్నం చేశారు. అయితే ఆసక్తికరమైన కథలు ఎవరూ ఊహించలేకపోయారు. వేటగాళ్ళు
వేటాడటంలో నైపుణ్యం గురించి, కుందేళ్ళని కొట్టడం గురించి చెప్పారు. ఆడవాళ్ళు తమ
మనసులోని ఊహల్ని కదిలించాలని విశ్వప్రయత్నం చేశారు కానీ ఏ అద్భుతగాథలు బయటికి
రాలేదు. ఇక కథలు చెప్పుకోవడం ఆపేద్దామని అంతా అనుకుంటున్నారు. అక్కడే ఓ పడుచుపిల్ల
ఒక ముసలామె పక్కన కూర్చోని ఆమె చేతిని నెమురుతూ వుంది. అనుకోకుండా ఆ ముసలామె
చేతికి వున్న ఉంగరం ఈ పిల్ల కంటబడింది. గోధుమరంగు జుట్టుతో తయారు చేసిన ఉంగరం అది.
ఆ ఉంగరాన్ని చాలా సార్లు చూసింది కానీ ఎప్పుడూ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.
దానిని సుతారంగా తాకుతూ – “ఆంటీ,
ఇదేం ఉంగరం? చూస్తుంటే ఈ జుట్టు చిన్నపిల్లలది లాగా వుందే?” అంది.
ఆ పెద్దామె కాస్త సిగ్గుపడింది, ఆ
తరువాత ఆమె ముఖం పాలిపోయింది. వణుకుతున్న గొంతుతో సమాధానం చెప్పింది –
“బాధేస్తుంది. ఆ విషయం గురించి
ఎప్పుడు మాట్లాడాలన్నా చాలా బాధేస్తుంది. నా జీవితంలో వున్న విషాదమంతా అక్కడే గూడు
కట్టుకోని వుంది. ఆ సంఘటన జరిగినప్పుడు నేను యవ్వనంలో వున్నాను. అవి ఎంత బాధాకరమైన
జ్ఞాపకాలంటే, ఈ రోజు దాకా వాటిని తల్చుకోని ఏడవని రోజు లేదు.”
అందరికీ ఆ కథేమిటో తెలుసుకోవలన్న
ఆసక్తి కలిగింది. కానీ ఆ ముసలామె చెప్పనంటే చెప్పనంది. చాలాసేపు బ్రతిమాలాడిన
తరువాత చెప్పడానికి ఒప్పుకుంది. ఇదీ ఆ కథ:
“నేను ఎప్పుడూ చెప్తుంటాను చూశారూ
సాంతీజ్ కుటుంబం ఒకటి వుండేదని, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ లేరని.. ఆ కుటుంబంలోని
చివరి ముగ్గురు మగవాళ్ళూ నాకు తెలుసు. ముగ్గురూ ఒకే విధంగా చనిపోయారు. ఈ జుట్టు ఆ
ఆఖరువాడిది. వాడు నాకోసం ప్రాణాలు వదిలినప్పుడు వాడికి పదమూడేళ్ళు. చిత్రంగా అనిపిస్తోంది
కదూ?
“చిత్రమే మరి. ఆ కుటుంబమే అంత. మీరు
పిచ్చి అని కూడా అనుకోవచ్చు. కానీ అదో అద్భుతమైన పిచ్చిదనం. ప్రేమ అనే పిచ్చిదనం.
తండ్రీ అంతే కొడుకూ అంతే. వాళ్ళ శరీరం నిండా ఒకలాంటి తపన వుండేది. అనూహ్యమైన పనులు
చేసేందుకు అదే పురిగొల్పేది. పిచ్చిపట్టినట్లే ఆవేశం ఫూనేది. ఆఖరుకు ఎంత ఘోరమైనా
చేయడానికైనా వెనకాడేవారు కాదు. కొంత మందికి పుట్టుకతోనే భగవంతుడి మీద భక్తి
కలిగినట్లే వీళ్ళకి ఈ పిచ్చి ఆవేశం కలిగింది. వల పన్ని వేటాడే వేటాగాడికి, వాడి
వెనకే నడిచే అనుచరుడికీ తేడా వుండదూ? అలాగే ఇది కూడా. అందుకే మన ప్రాంతంలో అంటుంటారు
- వుంటే సాంతీజ్ కుటుంబం లాగా కోరికతో రగులుతూ వుండాలని. వాళ్ళని చూస్తేనే ఆ విషయం
తెలిసిపోతుంది. వాళ్ళ జుట్టు కనుబొమ్మల మీద పడి గాలికి నిర్లక్ష్యంగా ఊగుతుంటుంది.
గిరజాల గడ్డం, పెద్ద పెద్ద కళ్ళు ... ఆ కళ్ళే..!
సూటిగా మనిషి లోపలికి దిగబడి, కదిలించే చూపు. అలా ఎందుకు జరిగుతోందో
తెలియకుండానే జరిగిపోయేది.
“ఇదిగో ఇలా ఉంగరంగా మారిన జుట్టు ఓ
పిల్లవాడిదని చెప్పాను కదా, ఆ పిల్లవాడి తాత దగ్గర కథ మొదలైంది. ఆయన జ్ఞాపకంగా
ఇదొక్కటే మిగిలింది. ఆయన చాలా కాలం సాహసాలనీ, మల్ల యుద్దాలనీ ఎక్కడెక్కడో
తిరిగాడు. ఎవరెవరినో లేపుకుపోయాడు. అరవై అయిదేళ్ళ వయసొచ్చాక ఓ రైతు కూతురి మీద
ప్రేమలో పడ్డాడు. నాకు ఇద్దరూ తెలుసు. ఆమె తెల్లగా, ఎర్రటి జుట్టుతో ప్రత్యేకంగా
కనిపించేది. మంచి గొంతు, చక్కని మాట తీరుతో ఎంత పొందిగ్గా వుండేదంటే ఎవరైనా చూసి
ఆమే మడోనా అని పొరపాటు పడేవాళ్ళు. ఈ పెద్దాయన ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళాడు.
పూర్తిగా ఆమెతో మమేకం అయిపోయాడు. ఇక ఆ అమ్మాయిని వదిలి నిముషం కూడా వుండలేని
పరిస్థితికి వచ్చాడు. దూరంగా ఎక్కడో పట్నంలో వుండే ఆయన కూతురు, కోడలు కూడా ఆ
విషయాన్ని తప్పు పట్టలేదు. అదంతా చాలా సాధారణమైన విషయంలానే తోచింది వాళ్ళకి. ఆ
కుటుంబంలో ప్రేమ ఒక ఆచారం అన్నట్లుండేది. ఇలాంటి మోహం చూసినా వాళ్ళకి ఎలాంటి
ఆశ్చర్యమూ కలిగేది కాదు. విడిపోయిన ప్రేమికుల గురించో, ప్రేమలో ద్రోహం గురించో, ఆ
తరువాత జరిగే ప్రతీకారం గురించో ఎవరైనా వచ్చి చెబితే కూడా అంతగా స్పందించేవాళ్ళు
కాదు. “ఆ స్థితికి చేరుకున్నారంటే ఎంత వేదనని అనుభవించారో” అని సానుభూతి
చూపించేవారు. ప్రేమ తాలూకు విషాదాలను అనుభవించి బాధపడేవాళ్ళే తప్ప
కోపగించుకునేవాళ్ళు కాదు.
“ఇదిలాగుండగానే ఓ రోజు మాన్సియర్ ది
గ్రాడెల్లీ అనే పెద్దమనిషిని ఆ ప్రాంతంలో వేటాడటానికి పిలిపించారు. ఈ అమ్మాయి
అతనితో లేచిపోయింది.
“సాంతీజ్ పెద్దాయన ఏమీ జరగనట్లే
ప్రశాంతంగా కనిపించాడు. ఏం లాభం? ఓ రోజు పొద్దున్నే కుక్కల కోసం కట్టిన చిన్న
గదిలో ఉరిపోసుకోని కనపడ్డాడు.
“అతని కొడుకూ అలాగే చనిపోయాడు. 1841లో
ప్యారిస్ కి వెళ్ళి అక్కడ ఓ ఒపేరా గాయని మోసం చేసిందని హోటల్లో ఆత్మహత్య
చేసుకున్నాడు.
“అప్పటికే అతనికి ఓ పన్నెండేళ్ళ
కొడుకు. అతని భార్య మా వైపు బంధువులామే. అప్పుడు మేము బెర్టిలాన్ లో వుండేవాళ్ళం. ఆ
పిల్లాణ్ణి తీసుకోని ఆమె మా ఇంటికి వచ్చేసింది. అప్పటికి నా వయసు పదిహేడేళ్ళు.
“చెప్తే నమ్మవు కానీ ఆ పిల్లాడు
అప్పటికే పెద్ద ఆరిందలా వుండేవాడు. ఆ కుటుంబంలో అందరి నాజూకుతనమూ, గొప్పదనం మొత్తం
ఈ పిల్లడికి పోతపోసినట్లు వుండేది. ఎప్పుడూ ఏదో కల కంటున్నట్లు, అడవికి వెళ్ళే
దారుల్లో ఎత్తైన చెట్ల మధ్య ఒంటరిగా నడుస్తుండేవాడు. నేను కిటికీలోంచి
గమనించేదాన్ని. తల వంచి, చేతుల్ని వెనక్కి పెట్టుకోని ఆచి తూచి అడుగులేస్తూ
నడిచేవాడు. అప్పుడప్పుడు ఆగి కళ్ళు పైకెత్తి చూసేవాడు. ఆ వయసులో అర్థంకాని విషయాలన్నీ
క్షుణ్ణంగా అర్థమైనట్లు ప్రవర్తించేవాడు.
“రాత్రిపూట భోజనాలు అయిపోయాక నా
దగ్గరకు వచ్చేవాడు.
“పద అలా బయటికి వెళ్ళి కాసిన్ని
కలలుకందాం” అనేవాడు. ఇద్దరం దగ్గర్లో వున్న పార్కుకు వెళ్ళేవాళ్ళం. చంద్రుడు ప్రసరించే
వెలుగు చెట్లపైన దీపాల్లా పరుచుకునే చోట అతను ఉన్నట్లుండి ఆగిపోయేవాడు. నా చేతిని
మృదువుగా నొక్కుతూ –“చూడు చూడు..!! నేను చెప్పినా నీకు అర్థం కాదేమోలే.. నేను ఆ
అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాను. నీకు కూడా అర్థం అయితే ఇద్దరం సంతోషంగా వుండచ్చు.
ప్రేమలో పడితే కానీ అర్థం కాదేమోలే..” అనేవాడు. వాడికి నా మీద వున్న ప్రేమ చూసి
ముచ్చటేసి ముద్దు పెట్టుకోని నవ్వేసేదాన్ని.
“ఒకోసారి భోజనం తరువాత మా అమ్మ
మోకాళ్ళమీద కూర్చోని – “ఆంటీ నాకు మంచి ప్రేమ కథలు చెప్పవూ” అని అడిగేవాడు. వాడు
హాస్యమాడుతున్నాడని అనుకోని అమ్మ నవ్వేసేది. వాణ్ణి కూర్చోపెట్టి వాడి తాత ముత్తాల
కథలు చెప్పేది. ప్రేమ మత్తులో వాళ్ళు చేసిన సాహసాలు చెప్పేది. అందులో నిజాలకి
కాస్త కల్పన జోడించేది. వాళ్ళందరూ ప్రేమ సాహసాల చేయడం వల్లనే గతించారు. ఆ ప్రేమ
కోసం చేసిన సాహసాలలోనే వాళ్ళకి గుర్తింపు, ఆ కుటుంబానికి విలువ వున్నాయని నమ్మారు.
“ఓ వైపు ఆహ్లాదకరంగా అనిపిస్తూనే మరో
వైపు భీభత్సరసం నింపుకున్నట్లు కనిపించే ఆ ప్రేమ కథలు విని ఈ పిల్లాడు ఉత్తేజితుడయ్యేవాడు.
చప్పట్లు కొట్టేవాడు. కన్నీళ్ళు కార్చేవాడు.
“నాక్కూడా ప్రేమించడం తెలుసు.
వాళ్ళందరికన్నా గొప్పగా ప్రేమించగలను” అనేవాడు.
“అప్పటి నుంచి నా మీద ఎంతో ప్రేమ
కురిపించేవాడు. అది ఎంతో సుతారమైన, సుకుమారమైన ప్రేమ. అందరికీ అదో సరదా సన్నివేశం.
పకపక నవ్వేవాళ్ళు. పొద్దున్నే పూలు ఏరుకొచ్చి నా చేతికి ఇచ్చేవాడు. రాత్రిళ్ళు
నిద్రపోయే ముందు నా చేతిని ముద్దు పెట్టుకొన్ని సన్నని గొంతులో “ఐ లవ్ యూ” అనేవాడు.
“నేను చేసింది కూడా తప్పే. చాలే
పెద్ద తప్పు. అందుకే ఇప్పటికీ అది తలుచుకోని బాధ పడుతుంటాను. నాకు నేనే జీవితాంతం
శిక్ష వేసుకున్నాను. ఇదిగో ఇలా ఎవరినీ పెళ్ళి చేసుకోకుండా కన్యగా.. కాదు కాదు అతని
విధవగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను.
“వాడి ప్రేమని ఓ చిన్న పిల్లవాడి
అమాయకపు చేష్ట అనే అనుకున్నాను. వాడు అలా చేయడానికి నేనూ దోహదపడ్డాను.
ప్రేమించినవాడు ఒక మగవాడు అన్నట్లే ప్రవర్తించాను. కాస్త ప్రేరేపించాను. ఓకోసారి
వాడితో కటువుగా వున్నా మరోసారి వాడితో సరసాలాడాను. వాడలా పిచ్చివాడు కావటానికి
నేనే కారణం. నాకదో ఆటలా వుండేది. ఆ ఆట వాడి తల్లికి, నాకు జరిగిపోయిన విషాదం నుంచి
కాస్త తెరిపినిచ్చేది. నువ్వే చెప్పు – పన్నేండేళ్ళు వాడికి. ఆ పసివాడి ప్రేమలో
నిజంగానే అంత గాఢత వుందని ఎవరు మాత్రం ఊహించగలరు? వాడు అడిగినప్పుడల్లా ముద్దులు
పెట్టాను. కాగితాల మీద ఏవో ముద్దు మాటలు రాసిచ్చేదాన్ని. నేను రాసింది మా ఇద్దరి
అమ్మలూ చదివేవారు కూడా. వాడు మాత్రం ఎంతో శ్రద్దగా ఉత్తరాలు రాసేవాడు. అవన్నీ
దాచుకునేదాన్ని. వాడికేమో ఇదంతా ఓ రహస్యం అని అనిపించేది. వాడి వంశంలో వున్న శాపం
సంగతి మాకెవ్వరికీ గుర్తులేదు.
“దాదాపు సంవత్సరం ఇలాగే గడిచింది. ఓ
సాయంత్రం పార్కులో వున్నప్పుడు వాడు నా కాళ్ళ దగ్గర కూర్చోని పిచ్చి పట్టినట్లు నా
గౌను అంచుల్ని ముద్దులు పెట్టుకున్నాడు.
“ఐ లవ్ యూ... నేను నిన్ను
ప్రేమిస్తున్నాను...” అని పదే పదే అన్నాడు. “నువ్వు నన్ను మోసం చేశావో... నన్ను
కాదని ఇంకెవరితోనైనా వెళ్ళిపోయావో, మా నాన్న చేసిన పనే చేస్తాను. తెలుసుగా మా
నాన్న ఏం చేశాడో?” అన్నాడు. వాడు గొంతులో స్థిరత్వం చూస్తే భయం వేసింది. చివరిగా
వాడన్న మాట నా నరనరాల్లో వణుకు పుట్టించింది.
“నేను భయంతో లేచి కొయ్యబారిపోయి
నిలబడ్డాను. వాడు కూడా లేచి నాకేదో చెప్పాలని, నా ఎత్తుని అందుకోడానికి మునికాళ్ళు
పైకెత్తి నా చెవి దగ్గర నా పేరు పలికాడు. “జెనివైవీ”. మంద్రమైన ఆ గొంతులో వున్న
కమ్మదనం, తీయదనం నాలో భయోత్పాతంగా మారింది.
“పద ఇంటికి వెళ్దాం.. పద వెళ్దాం”
అన్నాను వణుకుతూనే.
“వాడు ఇంకేమీ మాట్లాడలేదు. నా వెనుకే
ఇంటిదాకా నడిచాడు. మెట్లెక్కుతున్నప్పుడు నన్ను ఆపాడు.
“నువ్వు నన్ను కాదని వెళ్ళిపోతే నేనే
వుండను. చచ్చిపోతాను” అన్నాడు.
“విషయం చెయ్యి దాటిపోయిందని నాకు
అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి వాడితో ముభావంగా వున్నాను. వాడికిది ఎంతమాత్రం
నచ్చలేదు. అడిగితే చెప్పాను – “నీతో సరదాగా ఉండేందుకు నువ్వు చిన్న పిల్లాడివీ
కాదు, సరసంగా వుండేందుకు పెద్దవాడివీ కాదు. కొంత కాలం ఆగితే మంచిది”
“సమస్య అక్కడితో తీరిపోతుందని
అనుకున్నాను. ఆ తరువాత ఎండాకాలం అయిపోగానే వాణ్ణి హాస్టల్ లో వేశారు. ఆ తరువాత
సంవత్సరం శెలవలకి వాడు వచ్చేసరికి నా పెళ్ళికి నిశ్చితార్థం అయ్యి వుంది. వాడికి
వెంటనే విషయం అర్థం అయిపోయింది. మరో వారం దాకా ముభావంగా ఉండిపోయాడు. నాలో ఆదుర్దా
ఎక్కువైంది.
“వాడు వచ్చిన తొమ్మిదోరోజు నా గది
తలుపు దగ్గర ఓ చిన్న కాగితం కనపడింది. ఒక్క ఉదుటున దాన్ని అందుకోని గబగబా తెరిచి
చదివాను – “నువ్వు నన్ను కాదన్నావు. నేను చెప్పింది నీకు గుర్తుందిగా. నాకు చావు
తప్ప వేరే మార్గం లేని స్థితిలోకి నువ్వే నెట్టావు. అందుకని వేరే ఎవరో వచ్చి నన్ను
కనుక్కోవటం నాకిష్టంలేదు. పార్కులో పోయినేడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని
చెప్పిన చోటికి వచ్చి చూడు”
“నాకు పిచ్చిపట్టినట్లైంది.
త్వరత్వరగా బట్టలు మార్చుకోని పరిగెత్తుకుంటూ వాడు చెప్పిన చోటుకి దూసుకుపోయాను.
దారిలో బురదలో వాడు పెట్టుకునే టోపీ కనిపించింది. రాత్రంతా వర్షంపడ్డ ఆనవాళ్ళు
వున్నాయి. బలంగా గాలి వీస్తోంది. తల పైకెత్తి చూశాను. చెట్ల మధ్యలో ఏదో
ఊగుతున్నట్లు తెలిసింది.
“అంతే. ఆ తరువాత ఏం చేశానో కూడా నాకు
గుర్తులేదు. అరిచానేమో. స్పృహ తప్పి పడిపోయానేమో. మా ఇంట్లోకి పరుగెత్తుకుంటూ
వెళ్ళానేమో. ఏమో. ఏమీ తెలియదు. నాకు తెలివి వచ్చేసరికి నేను నా మంచం మీద వున్నాను.
నా పక్కన అమ్మ వుంది.
“జరిగిందంతా కలేమో అనిపించింది. ఓ పీడకల
అయ్యింటుందనుకున్నాను. “వాడేడి. వాడేమయ్యాడు?” అడిగాను. సమాధానం లేదు. అంటే..! అది
కల కాదు. నిజం.
“నేను వాణ్ణి అలా చూసే ధైర్యం
చెయ్యలేదు. వాడి గోధుమరంగు జుట్టు కావాలని మాత్రం అడిగాను. ఇదిగో – ఇదే అది!”
అలా అంటూ ఆ ముసలామె వణుకుతున్న తన
చేతిని ముందుకు చాచి నిర్లిప్తంగా పైకెత్తింది. చాలా సార్లు నిట్టూర్చింది. కళ్ళు
తుడుచుకోని కొనసాగించింది.
“పెళ్ళి వద్దనుకున్నాను. కారణాలు
చెప్పలేదు. నేను అప్పట్నుంచి ఇలాగే పదమూడేళ్ళ పిల్లాడి విధవగా మారిపోయాను. అలాగే
మిగిలిపోయాను.” అలా అంటూనే తల ముందుకు వాల్చేసి చాలాసేపటి వరకూ ఏడుస్తూనే
వుండిపోయింది.
అతిధులందరూ తమ తమ గదుల్లోకి
వెళ్ళిపోతున్నప్పుడు ఓ భారీ మనిషి పక్కన వున్న అతని చెవి దగ్గర అన్నాడు. “భావుకత
కలిగి వుండటం కూడా ఒక విషాదమే కదూ” అని. ఆమె చెప్పిన కథ అతనిలో అలజడి
రేపినట్లుంది.
***
Original: Guy
De Mauppasant
Original Title:
A Widow
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి