పరాయి దేవుడు

మూలం: నయోమి ఆల్డర్మెన్
అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్
మిస్టర్ బ్లూమ్ వినాయకుడిని చూసేదాకా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం గడిపాడు. బ్లూమ్ లాంటి వాళ్ళంతా ఇంతే. మనసులో సుదూర దేశాలకు ప్రయాణం చెయ్యాలన్న కోరిక బలంగా వున్నా అమ్మ చెప్పిన మాట విని ఆప్థమాలజీ (కంటి వైద్యం) కాలేజీలో చేరతారు. ఇదిగో ఇలాంటివాళ్ళే స్పైస్ ద్వీపాలకో, అందమైన మైదానాలకో వెళ్ళాలని కలలు కంటూనే టెల్మా లాంటి మందుల గుట్టలో పడి బతికేస్తుంటారు. ఇలాంటివాళ్ళే - చివరికి రిటైరైన కంటి డాక్టర్ లెఫ్కోవిజ్ కూతురు ఎంత లావుగా వున్నా సర్దుకుపోయి పెళ్ళి చేసుకుంటారుబ్లూమ్ లాంటి వాళ్ళే నీరు కారే కళ్ళని పరీక్షించడం అనే పనిని రోజూ చేస్తూనే సంసారాన్ని ఈదేస్తుంటారు. కుటుంబంతో కలిసి బంగారం రంగు ఇసుక వున్న బీచ్కి వెళ్ళాలని, అక్కడ చొక్కా లేకుండా నిలబడి సముద్రపు గాలిని పీల్చాలనీ, మనిషి నడవని చోట నడవాలని, మనిషీ ప్రేమించనంతగా మరొకరిని ప్రేమించాలనీ  అనుకుంటూ, అవేమీ చెయ్యకుండానే సంవత్సరాలు గడిపేస్తుంటారు. అలా గడపటం కొంత మందికి అసంతృప్తి ఇవచ్చుగాక, కానీ కొంతమందికి అలా బ్రతకడంలోనే తృప్తి వుంటుంది. సరిగ్గా అలాంటి తృప్తి కలిగివున్న జీవితం గడుపుతున్న బ్లూమ్కి వినాయకుడి ప్రతిమ దొరకటమే ఆశ్చర్యం.
రోజు అతను గాజులు, చీరలు, అగరుబత్తీలు అమ్ముతున్న ఒక దుకాణం దగ్గర నిలబడ్డాడు. వాటన్నింటి మధ్యలో అనుకోకుండా కనపడిందా విగ్రహం. నాలుగు చేతుల మనిషి శరీరానికి ఏనుగు తల వుందా? లేక ఏనుగుకి మనిషి శరీరం అతికించారా? అని పరిశీలనగా చూశాడు. మెరిసిపోయే గులాబి రంగు శరీఅం, కరుణ కురిపించే కళ్ళు, బంగారు కిరీటం. ఒక చేయ్యి చూపుడు వేలుతో ఏదో సైగ చేస్తున్నట్లు వుంటే, రెండొవది దగ్గరకు రావద్దని వారిస్తున్నట్లు కనపడింది. చూడగానే అది దేవుడి బొమ్మ అయ్యివుంటుందని వూహించాడు  బ్లూమ్. "కాకపోతే మరేమిటి? ఒకేసారి భయం భక్తి రెండూ కలుగుతున్నాయంటే ఆయన ఖచ్చితంగా దేవుడే అయ్యుంటాడు" అనుకుంటూ నునుపైన విగ్రహాన్ని వేళ్ళ చివర్లతో సుతారంగా అందుకున్నాడు. అది చూసి పక్కనే నిలబడి స్టాల్ చూసుకుంటున్న కుర్రవాడు ముందుకొచ్చాడు.
"ఏంటి తాతగారూ? జాగ్రత్తగా పట్టుకోండి... బొమ్మ పగలకొట్టినా డబ్బులు కట్టాలి.. అర్థం అయ్యిందా?" అన్నాడతను.
పూర్వం విగ్రహారాధన చేసే తండ్రిని ఎదిరించిన అబ్రహాం కథ గుర్తుకొచ్చింది బ్లూమ్కి. చిన్నతనంలోనే దేవుడు సర్వవ్యాప్తమై వున్నాడన్న సత్యం తెలుసుకున్న అబ్రహాం తన తండ్రి పూజించే విగ్రహాలని అన్నింటినీ పగలగొట్టాడు.
"నేను కాదు నాన్నా పగలకొట్టింది.. ఇదంతా పెద్ద విగ్రహం చేసిన పని. బొమ్మే కర్ర తీసుకోని మిగిలిన అన్నింటినీ పగలగొట్టింది.." అన్నాడు.
"విగ్రహాలు ఎక్కడైనా కదులుతాయట్రా?" అన్నాడు తండ్రి మరింత కోప్పడి.
"మరి కదలలేని విగ్రహాలకు పూజలెందుకు నాన్నా" అంటూ సమాధానం చెప్పాడు అబ్రహాం.
కథ అంతటితో అయిపోయింది. ప్రశ్నతో ఆ తండ్రికి జ్ఞానోదయమైందో లేక తన నమ్మకాల్నే ప్రశ్నించిన కొడుకుని మరింతగా కొట్టాడో తెలియదు. అందులోనూ, కాలంలో నమ్మకాలు ఇప్పటికన్నా పవిత్రంగానూ బలంగానూ వుండేవి కదా.
వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టుకోనే ఇదంతా ఆలొచించాడు  బ్లూమ్. ప్రతిమ అర్థ మిళిత నేత్రాలతో ప్రేమని కురిపించేలా వున్నాయి. ఆయన శరీరం ఎంత దృఢంగా  వుందంటే, బొమ్మే మన పక్కన వుంటే విజయం తధ్యమని అనిపిస్తోంది. నిజానికి  బ్లూమ్ ఇలాంటి ప్రతిమల్ని ఏనాడూ ముట్టుకోను కూడా లేదు. మతపరంగా నిషేదించిన విగ్రహారాధన చేస్తే పాపం చుట్టుకుంటుందో అని అతని భయం. ఇప్పుడు చేతిలో వున్న వినాయకుడి వైపు మళ్ళీ చూశాడు. గుండ్రంగా తిరుగుతూ బలంగా వున్న తొండం వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు.
"నాకు ఇది కావాలి" అన్నాడు స్థిరంగా.
***
విగ్రహాన్ని తీసుకోని ఇంటికి వెళ్ళిన తరువాత ఎక్కడైనా దాచేయ్యాలని అనుకున్నాడు. బొమ్మని కళ్ళద్దాలు తుడుచుకునే మెత్తటి గుడ్డలలో చుట్టి, ప్లాస్టిక్ సంచిలో పెట్టి స్టోర్ రూమ్లో ఒక అరమర కింద భాగంలో, పగిలిపోయిన పాత్రల వెనక దాచిపెట్టాడు. కాని ఫలితం లేకపోయింది. అతని భార్య నిముషానికి ఒకసారి అదే అరమర తెరిచి ఏదో ఒక వస్తువు తీసుకోవడమో, లేకపోతే పిల్లలు ఆడుకుంటూ తలుపులు తీసి వదిలేయడం చేస్తుండటంతో దాన్ని అక్కడి నుంచి తీసేయ్యాలనుకున్నాడు. గది దగ్గరకు వెళ్ళినప్పుడల్లా చుట్టిపెట్టిన సంచీ చిరుగులలోంచి వినాయకుడి తొండం బయటికి వచ్చి, తననే పిలుస్తున్నట్లుగా అనిపించేది.
"ఆయన పూజలు కావాలని అడుగుతున్నట్లున్నాడు" అనుకున్నాడు  బ్లూమ్. "దేవుడు కదా... అలాంటి కోరిక వుండటం సహజమే" అని సర్ది చెప్పుకున్నాడు.
"అయితే  ఆయన్ను ఎలా పూజించాలి?బ్లూమ్ కి ఏం తోచలేదు. ఇంతకు ముందెపుడూ విగ్రహాన్ని పూజించనే లేదు కదా. అసలు ఎలా చెయ్యాలో కూడా తెలియదైపోయే. బైబిల్ తీసి ఒకసారి తిరగేశాడు. "దేని రూపమునైననూ విగ్రహమైనైననూ నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు" అని వుంది. ఇంకొక చోట "మంటి (మట్టి) బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను నీ గొర్రలను నీ ఎద్దులను అర్పింపవలెను" అని కూడ వుంది.  బ్లూమ్ దగ్గర గొర్రలూ లేవు, ఎద్దులూ లేవు. అలాగని వృత్తిపరంగా వాటికి సమానమైనవి బలిగా తగలపెట్టడం భావ్యం కాదనిపించింది. ఒకసారి పొరపాటున ఒక జత కళ్ళద్దాలు తగలబడితేనే వాటి వాసననే భరించలేకపోయాడు. అంతకన్నా శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించడమే తేలిక అని అనిపించింది.
 బ్లూమ్ స్టోర్ రూమ్ లోకి ఎవరూ రాకుండా తలుపులు వేశాడు. వినాయకుణ్ణి తీసి అక్కడే వున్న ఒక వెదురు స్టూల్ మీద వుంచాడు. అప్పుడే వినాయకుడి కళ్ళలో సంతోషం, తను చెయ్యబోతున్న పనికి ఆమోదం కనిపించాయి ఆతనికి. జాగ్రత్తగా మోకాళ్ళ నొప్పులు బాధించకుండా మోకరిల్లి, ముందుకు వంగి నుదిటిని నేలకి ఆనించి తన ప్రార్థన మొదలుపెట్టాడు.
" గణేశా... నీ రాకతో మా ఇంటిని పావనం చేసిన నీకు నా కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. ఇంటిలో వున్నవారందరినీ నీవు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మా అమ్మాయి జూడీ లా పరీక్షలలో నీవు సహాయము చెయ్యాలి. పిల్లకి లా పుస్తకాలు, సెక్షన్లు అవీ కష్టం అనిపిస్తున్నాయట... వినాయకా.." అంటూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూనే మళ్ళీ మోకాళ్ళ మీదకు లేవబోయాడు. అతని నడుము మాత్రం అతని ప్రార్థనకి సహకరించలేదు. ఎడమ వైపు నడుముకి కొంచెం కింద నరం పట్టేసినట్లై కలుక్కుమనడంతో మళ్ళీ ముందుకే వంగాడు. ఇక లేవనూ లేడు, అలా వుండనూ లేడు. ఇరవై నిముషాల తరువాత అతని భార్య వచ్చి చూసేదాకా అలాగే, అదే భంగిమలో వున్నాడు  బ్లూమ్.
"బ్లూమ్...!! ఏం చేస్తున్నావక్కడ?" అంటూ అరిచింది ఆమె.
"శాండ్రా... సమయానికి వచ్చావు... నా నడుము మళ్ళీ పట్టేసింది. అమృతాంజనం తెచ్చిస్తావా" అన్నాడతను. ఆమె అటు వెళ్ళగానే పాక్కుంటూనైనా సరే వినాయకుణ్ణి మళ్ళీ అలమరలో దాచేయ్యాలని అతని ఆలోచన. కానీ శాండ్రా అతనికంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లుంది.
"బ్లూమ్... అది విగ్రహమే కదూ. నువ్వు మన ఇంట్లో విగ్రహారాధన చేస్తున్నావా? ఒక పక్క నేను అంట్లు తోముకుంటూ, అతిధులు వస్తారని పరుగులు తీస్తుంటే నువ్వు ఇక్కడ.." అంటుండగానే అందుకున్నాడు బ్లూమ్.
"శాండ్రా... ఎందుకు ఎలా అనుకుంటున్నావు? నేను విగ్రహానికి ఎందుకు మొక్కుతాను? విగ్రహం బజార్లో అమ్ముతుంటే చూశాను. ఇదిగో గది గోడలకి వేసిన రంగులకి మంచి మాచింగ్ అవుతుందని కొన్నాను..." అన్నాడు. ఇరవై ఏళ్ళ సంసారంలో  బ్లూమ్ ఇలాంటి ఇంటి విషయాలు పట్టించుకున్నదే లేదు. అలాంటప్పుడు మిసెస్ బ్లూమ్ అతని మాటల్ని ఎలా నమ్ముతుంది? అయినా అతను వదల్లేదు. "ఇది ఎక్కడపెడదామా అని చూస్తూ వున్నాను.. ఇంతలో తూలి ముందుకు పడ్డాను... నడుం పట్టేసింది.." అన్నాడు.
శాండ్రా నమ్మీ నమ్మనట్లు తలాడించింది.
" ప్లీజ్ శాండ్రా... అమృతాంజనం..." అన్నాడతను మాట మారుస్తూ. శాండ్రా మాట కరుకేకానీ మనసు వెన్న. అందుకే అమృతాంజనం తీసుకురావాలని బాత్రూమ్ వైపు పరుగెత్తింది.
ఇదే అవకాశం అని వినాయకుడి బొమ్మని తీసి ఇంతకు ముందున్న సంచిలో పెట్టాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు బ్లూమ్. అప్పటికే చిరిగిపోయిన సంచిలో నున్నగా జారిపోతున్న బొమ్మ పట్టలేదు. శాండ్రా తిరిగి వచ్చేసరికి వినాయకుడి బొమ్మ ఇంకా అక్కడే నేలమీదే వుంది. పాపం ఆమె  బ్లూమ్ నడుము మీద అమృతాంజనం పూసి నెమ్మదిగా మర్దనా చేస్తూ వినాయకుడి బొమ్మ వైపే చూస్తూ వుండిపోయింది. చివరికి ఘాటైన అమృతాంజనం వాసన వస్తున్న చేతులతోనే వినాయకుడి బొమ్మను తీసుకోని పరీక్షగా చూసింది.
"నాకు తెలిసి బొమ్మ హాల్లో పెడితేనే బాగుంటుందనుకుంటా... చాలా ప్రాచీనంగా కనిపిస్తోంది కదా, అక్కడ బాగుంటుంది..." అంది.
అలా ఆ వినాయకుడి స్థానం ఇంటి నట్టింట్లోకి మారింది.
***
అందరి పిల్లల్లాగే వాళ్ళ పిల్లలు కూడా అభ్యంతరం చెప్పారు.
" బొమ్మ నన్నే చూస్తున్నట్లు అనిపిస్తోంది..." అంది జూడీ మర్నాడు బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు.
డెవిడ్ స్కూల్ బాగ్ అందుకుంటూ వేలితో బొమ్మని తాకి - "దీని నిండా మురికి వున్నట్టుంది.." అన్నాడు.
" విగ్రహం లోపలంతా ఖాళీ... ఏం వుండదు... ఆయన పేరు గణేశ" చెప్పాడు బ్లూమ్. అందమైన పసిపిల్లల్ని ఇలాంటి మాటలనే టీనేజర్లుగా ఎందుకు మారుస్తావు భగవంతుడా అనుకున్నాడు మనసులో.
డేవిడ్ చిత్రంగా కళ్ళు తిప్పాడు. జూడీ నిట్టూర్చింది. ఇద్దరూ స్కూల్కి బయల్దేరారు. బ్లూమ్ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు వంటింటిలోకి తీసుకెళ్తూ ఒక్క క్షణం వినాయకుడి బొమ్మ దగ్గర ఆగాడు. ఒక చిన్న బ్రెడ్ ముక్కను తుంచి ప్రతిమ దగ్గర సాసర్లో వుంచి, తల వంచి నమస్కరించాడు.
వినాయకుడి బొమ్మ వచ్చిన తరువాత అతని జీవితం బాగున్నట్టు గుర్తించాడు. మిసెస్ రోసెన్బ్లట్ అని పెద్ద డ్రై ఫ్రూట్ కంపెనీ అధిపతి భార్య, నాలుగుదఫాలుగా వస్తానని రాకుండా ఎగ్గొడుతోంది. బ్లూమ్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు కోపంతో అరిచి బెదిరించలేదు. మనసులో ఒక ప్రశాంతత, స్థిరత్వం ధ్వనిస్తుండగా మాత్రం జంకకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు.
"మిసెస్ రోసెన్బ్లట్, మీ అపాయింట్మెంట్ సాయంత్రం నాలుగున్నరకి మార్చబడింది. సరిగ్గా నాలుగున్నరకి నా షాప్ ముందు మీరు లేకపోతే బ్లూమ్ ఆప్టిసియన్ మీకు ఎలాంటి సహాయము..."
"అది కాదండీ..." మధ్యలో మాట్లాడబోయింది ఆమె.
"మీరేం చెప్పాల్సిన పనిలేదు..."
"లేదండీ... హలో..."
"థ్యాంక్ యూగుడ్ డే..." పెట్టాశాడు బ్లూమ్. సరిగ్గా నాలుగున్నరకి ఠంచనుగా, బిక్కు బిక్కు మంటూ వచ్చింది మిసెస్ రోసెన్బ్లట్. ఆమెను కళ్ళు పరీక్షించే టెస్టింగ్ రూమ్కి పంపిస్తూనే, నిశబ్దంగా వినాయకుడికి మొక్కాడు.
క్రమంగా కుటుంబం మొత్తం దేవుడి మీద ఇష్టం పెంచుకోవడం మొదలైంది. గణేషుడి చల్లని చూపులు ఇల్లు మొత్తం ప్రసరిస్తూ వుండేవి. ఇప్పుడు శాండ్రా తో పాటు పిల్లలు కూడా ఎక్కువ సమయం గదిలోనే గడుపుతున్నారని బ్లూమ్ గ్రహించాడు. జూడీ ఇప్పటికీ నమ్మనట్టే వుంటోంది కానీ మాడ్యూల్ పరీక్షలు రాయటానికి వెళ్ళే రోజు వుదయం మాత్రం తన కోటుపైన బాడ్జి తీసి వినాయకుడి ముందు వుంచింది. విషయాన్ని బ్లూమ్ గమనిస్తే, ఏమీ ఎరగనట్టు భుజాలు ఎగరేసి - "లక్ కోసం నాన్న" అంది. అయితే పరీక్షలలో జూడీ ఆమె టీచర్లు అనుకున్నదానికన్నా బాగా రాయటంతో నమ్మకం ఇంకా బలంగా తయారైంది. ఆమే కాదు, కుటుంబం మొత్తం వినాయకుడి ప్రతిమని భక్తిగా చూడటం మొదలుపెట్టారు.
మొదట్లో బ్లూమ్ కుటుంబ సభ్యులెవరూ వినాయకుడి గురించి బయట ఎక్కడా అనలేదు. కానీ వాళ్ళుండే హెండన్ ప్రదేశంలో రహస్యాలకు చోటే లేదు. బహుశా జూడీ స్నేహితురాలు మికైలా ఇంటికి వచ్చినప్పుడు, జూడీ హోంవర్క్ చెయ్యడానికి ముందు ప్రతిసారీ దేవుడి ముందు గుప్పెడు బ్రెడ్ ముక్కలు నైవేద్యం పెట్టడం చూసినట్లుంది. డేవిడ్ స్నేహితుడు బెంజీ కూడా, కప్యూటర్ టెన్నిస్ గేం ఆడుతూ ఫైనల్ రౌండ్కి వచ్చిన ప్రతిసారీ డేవిడ్ విగ్రహాన్ని తాకుతున్న సంగతి గమనించాడు. ఇంకేముంది.. ఒకరి నుంచి ఒకరికి అక్కడి నుంచి ముగ్గురికి అలా అలా హెండన్ మొత్తానికి తెలిసిపోయింది. " బ్లూమ్స్ లేరూ - అదే కళ్ళజోళ్ళు అమ్మే బ్లూమ్ కుటుంబం... అవును శాండ్రా బ్లూమ్ అనే ఆవిడ, అదే వాళ్ళాబ్బాయి డేవిడ్ బ్లూమ్ అనే పిల్లాడు... వాళ్ళేనండీ - వాళ్ళింట్లో ఒక విగ్రహముందట.”
ఒక సాంప్రదాయకుడైన యూదుని ఇంట్లోకి విగ్రహాన్ని తీసుకురావటాన్ని క్షమించిన దాఖలాలు బైబిల్లో లేవు. అందుకే కదా బంగారు ఆవుదూడ విగ్రహానికి పూజ చేశారని 3000 మందిని పొట్టనపెట్టుకున్నారు? జెస్బెల్ ఇలాంటి తప్పు చేసినందునే కదా కిటికీ గుండా గిరాటు వేసి కుక్కలకు బలి చేశారు. ఇక్కడ వున్న కౌన్సిల్ కూడా విషయంలో రాజీ పడే అవకాశమేలేదు.  బ్లూమ్ ఇలా అనుకున్నాడో లేదో రాత్రే అతనికి ఫోన్ వచ్చింది. చర్చిలో వుండే రబ్బీ (మతపెద్ద)ని వీలైంనంత త్వరగా వచ్చి కలవాలన్నది ఫోన్ సారాంశం.
***
వూరి రబ్బి చాలా చిన్నవాడు. మధ్యనే అతని మతపరమైన విద్యాభ్యాసం పూర్తైంది. అయినప్పటికీ అతను కుదురుగా పెంచిన గడ్డంతో, హుందాగా ఎంతో మర్యాదస్తుడిలా కనిపించాడు బ్లూమ్కి.
పిలిపించాడేకానీ మాట్లాడటానికి చాలా సేపు తటపటాయించాడు రబ్బీ. - "అదే.. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించాను... అదే విగ్రహం గురించి.." అన్నాడు
"సరే మాట్లాడండి" అన్నాడు బ్లూమ్. అతను మాత్రం ఖంగారు పడలేదు. వినాయకుడి విగ్రహం అతని జీవితంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇలాంటి విపర్యాలకి అతను మాత్రం చెలించడంలేదు.
"అవును అదే... విషయం ఏమిటంటే బ్లూమ్గారూ... బయట చాలామంది అనుకుంటున్నారు, మీకు తెలిసే వుంటుంది లెండి... అంటే నేను అవన్నీ పట్టించుకుంటున్నానని కాదు కానీ మీలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు... పైగా మీరు మన ఆరాధనా సమాజానికి ట్రస్టీ కూడా కదా..." అన్నాడు రబ్బి తడబడుతూ.
"మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి" అన్నాడు బ్లూమ్ మరింత స్థిరంగా.
బ్లూమ్ తీరు మరింత ఖంగారు పెట్టడంతో రబ్బీ గబగబా మాట్లాడటం మొదలుపెట్టాడు.
"అదే అదే.. విగ్రహం గురించి..  మిస్టర్ బ్లూమ్ మీలాంటి ఆరాధనా సమాజం సభ్యుల వద్ద అలాంటిది వుండకూడదు.."
"ఏది?"
"అదే"
"వినాయకుడా?" రెట్టించాడు బ్లూమ్.
"కాదు విగ్రహం... మీలాంటి పెద్దమనుషులు అలాంటివి ఇంట్లో వుంచుకోకూడదు...  దాన్నీ తీసిపారేయండి" చెప్పడాయన.
బ్లూమ్ క్షణ కాలం వినాయకుడు తన ఇంటికి వచ్చిన తరువాత వచ్చిన మార్పులను గుర్తుచేసుకున్నాడు. అక్కడికేదో అద్భుతాలు జరిగాయని కాదు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటారు, అరుచుకుంటారు, అప్పుడప్పుడూ అపశృతులు వుంటూనే వుంటాయి. కానీ గజముఖుడు ఉండటం వల్ల కుటుంబం మొత్తంలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తోంది. అది అతని వూహే అయ్యివుండచ్చుగాక అయినా సరే దేవుణ్ణి వదులుకోవడం ఇష్టం లేదు అతనికి.
"నేను విగ్రహాన్ని తీసెయ్యలేను" స్థిరంగా చెప్పాడు రబ్బీతో.
రబ్బీ మాట వింటూనే కళ్ళు చిట్లించి అపనమ్మకంగా ముందుకు వంగాడు.
"అలాకాదు మిస్టర్ బ్లూమ్ మనం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం... అయినా నాకూ తెలుసు మీకూ తెలుసు... విగ్రహం ఇంట్లో వున్నంత మత్రాన మీరు దానికేం పూజలు చెయ్యరనుకోండి, అయినా చూసేవారికి ఇదంతా పెద్ద తప్పులా అనిపించకుండా ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా.." అనూనయించబోయాడు.
"నేను చేస్తున్నానుగా" చెప్పాడు బ్లూమ్
"ఏమిటి? అలాంటి ప్రయత్నం చేస్తున్నారా?" అన్నాడు రబ్బీ తృప్తిగా.
"నేను చెప్పేది ప్రయత్నం చేస్తున్నానని కాదు...  పూజ చేస్తున్నానని చెప్తున్నాను" సరి చేశాడు  బ్లూమ్.
మాటలు ముఖానికి కొట్టినట్లు అనిపించండంతో ఏం పాలుపోక  వెనక్కి జారిగిలపడ్డాడు రబ్బీ. చాలా సేపు ఏం మాట్లాడకుండా వుండి తరువాత - " విషయం గురించి మనం మళ్ళీ చర్చించాలి. రేపు ఒకసారి రాగలరా?" అన్నాడు నీళ్ళు నములుతూ.
మర్నాడు రబ్బీ  బ్లూమ్కి మళ్ళీ ఫోన్ చేసి మధ్యాహ్నంగా ఆరాధనా మందిరానికి పిలిపించాడు.
"మిస్టర్ బ్లూమ్ మీతో దేవుడి గురించి చర్చించాలి" అన్నాడు ఖంగారుగా. బ్లూమ్ చిన్నగా నవ్వి -
"అది మీకు బాగా తెలిసిన సబ్జక్ట్ రబ్బీగారూ, నాకేం తెలుసు" అన్నాడు. దానికి రబ్బీ కూడా చిన్నగా నవ్వాడు.
"సరే సరే.. కాకపోతే మిస్టర్ బ్లూమ్...  ప్రభువు విగ్రహారాధన గురించి ప్రత్యేకంగా చెప్పియున్నాడు. రెండొవ ఆజ్ఞ గుర్తులేదా? 'మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు', ‘దేని రూపమునయనను విగ్రహమైనయినను నీవు చేసికొనకూడదు అని చాలా స్పష్టంగా చెప్పబడివుంది.”
బ్లూమ్ సన్నగా తలవూపాడు.
"అలాంటిది మీరు విగ్రహానికి పూజలు చేస్తానని చెప్తూ సమాజం బోర్డులో ఎలా వుంటున్నారో నాకర్థం కావటంలేదు... ఇలాగైతే మిమ్మల్ని ఆరాధనా సమాజంలోనికి రానివ్వడం కూడా కుదరకపోవచ్చు.."
"అదేమిటండీ... నేను అన్ని నియమాలు పాటిస్తున్నాను. ప్రభువునీ ఆరాధిస్తున్నాను. నా మతం ఇప్పటికీ యూదు మతమే కదా" అన్నాడు  బ్లూమ్ కొంచెం ఆవేశంగా.
రబ్బి అందుకు సమాధానంగా నవ్వి చేతులు వెడల్పుగా చాస్తూ బైబిల్లోని మరో వాక్యాన్ని చదివాడు. "మీ దేవుడను యావేను అయిన నేను అసూయగలవాడను"
 బ్లూమ్ ఒకసారి వినాయకుణ్ణి, అతని కరుణ పూరితమైన కళ్ళను గుర్తుచేసుకున్నాదు.
"దేవుడు నిజంగా గొప్పవాడైతే... ఆయనకు అసూయ ఎందుకు వుంటుంది? ఇలాంటి రాగద్వేషాలకు అతను అతీతుడు కదా?" సూటిగా అడిగాడు.
రబ్బీ ముఖం పాలిపోయింది. " విషయం గురించి మనం ఇంకా మాట్లాడాలి మిస్టర్ బ్లూమ్.. రేపు మళ్ళీ కలుద్దాం" అన్నాడు.
మూడోరోజు  బ్లూమ్కి మళ్ళీ ఫోన్ వచ్చింది. అదీ తెల్లవారుఝామునే. అంత పొద్దున్నే ఫోన్ చేసినందుకు రబ్బీ క్షమాపణ అడిగి చెప్పాడు -
"మిస్టర్ బ్లూమ్.. మీరు చెప్పిన విషయం గురించి రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను. నేను ఒకసారి విగ్రహాన్ని చూడాలి. మీరు ఇప్పుడు విగ్రహాన్ని తీసుకోని మన ఆరాధనా మందిరానికి రాగలరా? అలా చేస్తే అన్ని సమస్యలను అక్కడే పరిష్కరించుకుందాం.."
బ్లూమ్ అందుకు అంగీకరించాడు. ఎన్ని వివాదాలైన తను ఒక యూదుడే కదా, ప్రార్థనా మందిరం వల్ల, రబ్బీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన మాటకూడా నిజమే. విగ్రహం విషయంలో రబ్బీ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా అతనికి గౌరవభంగం కలిగించే పని చెయ్యకూడదని అనుకున్నాడు.
వినాయకుడి విగ్రహాన్ని మెత్తటి దుప్పటిలో చుట్టి, చిన్న చేతి సంచిలో పెట్టాడు బ్లూమ్. అలా చుడుతున్నప్పుడు కూడా వినాయకుడి నున్నని తోండాన్ని ఒక్కసారి ప్రేమగా నెమిరాడు. బైబిల్ కథల్లో ఎలీజా అనే మేధావిలా రబ్బీ కూడా దేవుడితో వాదప్రతివాదాలు చేస్తాడా అని అనుమానం వచ్చింది. అలా నిజంగా జరిగితే దేముడు ఏం సమాధానాలు చెప్తాడో అని ఆసక్తి కలిగింది.
బ్లూమ్ ప్రార్థనామందిరానికి చేరేసరికే రబ్బీ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఎళ్ళుగా ప్రార్థనలు, గీతాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పురాతన మందిరంలోనికి  బూమ్ను తీసుకెళ్ళాడు.  మామూలుగా వసారాగుండా ప్రధాన మందిరంలోకి వెళ్లే దారిలో కాకుండా, దేవదారు మెట్లద్వారా పై అంతస్తులోని పాటకులు కూర్చుండే గదిలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా పవిత్రమైన గదికి పైన వున్న గదిలోనే పాతనిబంధనము తాలూకు వ్రాతప్రతులు వుంచబడ్డాయి. అక్కడి నుంచి చూస్తే చర్చిలోని ప్రార్థనా మందిరం మొత్తం, అక్కడ వేయబడిన కుర్చీలతో సహా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలలో కుర్చీలు మొత్తం భక్తితో వచ్చే వందలాది యూదులతో నిండిపోయి వుంటాయి.
రబ్బీ పాటకులగది కిటికీ తలుపులు బయటకు తెరిచి గట్టిగా రెండు మూడుసార్లు శ్వాస తీసుకోని తరువాత బ్లూమ్ వైపు తిరిగాడు. " విగ్రహాన్ని తీసుకొచ్చారా?" అడిగాడు. బ్లూమ్ అవునన్నట్లు తలాడించాడు. రబ్బీ మనసులో కూడా అలజడి తగ్గి స్థిరంగా వున్నట్టు బ్లూమ్ గుర్తించాడు.
"ఏది నన్ను చూడనివ్వండి" అన్నాడు రబ్బీ.
బ్లూమ్ తన చేతిసంచిలో వున్న దేవుణ్ణి బయటకు తీసి, చుట్టివున్న మెత్తటి గుడ్డని తొలగించి, వినాయకుణ్ణి సుతారంగా పట్టుకున్నాడు. కొన్న రోజుకన్నా రోజు విగ్రహం బరువు పెరిగినట్లుగా అతనికి అనిపించింది.
రబ్బి భృకుటి ముడిపడింది.
"ఇది కేవలం ఒక మనిషి తయారు చేసిన బొమ్మ. విషయం మీకు అర్థం అవుతోందా మిస్టర్ బ్లూమ్? ఇందులో చైనా మట్టి, పెయింటు తప్ప ఇంకేమి లేదు. మనకి మనమే తయారు చేసుకున్న ఇలాంటి వస్తువుకి మనం ఎలా మొక్కగలం చెప్పండి?" అన్నాడు.
రబ్బీకి అర్థం అయ్యేలా సమాధానం చెప్పడం అసాధ్యమనిపించి బ్లూమ్ భుజాలు ఎగరేశాడు. చివరికి ఎదో ఒక సమాధానం చెప్పాలని - "నా కళ్ళను, మనసును నమ్మి పని చేస్తున్నాను అంతే.." అన్నాడు. అనడానికైతే అన్నాడు కానీ, తను చెప్పాలకున్నదాంట్లో కనీసం పదోవంతు కూడా చెప్పలేకపోయాడని అతనికి అర్థం అయ్యింది.
చాలా సేపు రబ్బీ బ్లూమ్ వంకే చూస్తూ వుండిపోయాడు. తరువాత చిన్న చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి అతని భుజాలమీద చెయ్యివేసి నడిపించుకుంటూ కిటికీ దగ్గరకు తీసుకొచ్చాడు. ప్రార్థనామందిరం ఎత్తైన ప్రదేశంలో కట్టబడటం వల్ల మరకలు పడ్డ కిటికీ అద్దాలలోంచి చూడగలిగితే హెండన్ నగరం మొత్తం కనపడుతుంది.
" దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసుకదా?" అడిగాడు రబ్బీ.
బ్లూమ్ నిశబ్దంగా తలాడించి ప్రశాంతమైన వినాయకుడి ముఖం వైపు చూశాడు.
"ఇలాంటి సమస్య నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు... అందుకే నిర్ణయం తీసుకునే ముందు నా కన్న పెద్దవాళ్ళను కూడా సంప్రదించాల్సి వచ్చింది.." చెప్పుకుపోతున్నాడు రబ్బి. బ్లూమ్ తలాడిస్తూనే వున్నాడు.
"పెద్దలంతా ఒకే అభిప్రాయం తెలిపారు. మీరు అర్థం చేసుకోవాలి మిస్టర్ బ్లూమ్.. మేం తీసుకున్న నిర్ణయం మీకు మంచే చేస్తుంది.." అన్నాడతను. అంతే... అప్పటిదాకా నెమ్మదిగా మట్లాడుతున్నవాడల్లా ఒక్క ఉదుటున, బ్లూమ్కి ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా చప్పున విగ్రహాన్ని లాగేసుకున్నాడు. విగ్రహాన్ని ఒక్క క్షణంపాటు తన శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు. తరువాత కిటికీకి వున్న చిన్న ఖాళీలోనుంచి విగ్రహాన్ని కిందకి జారవిడిచాడు. భళ్ళున పగిలిన శబ్దం. కిటికీ కింద వున్న ప్రాంతంలో వినాయకుడి విగ్రహం వెయ్యి ముక్కలై పరుచుకుంది.
"మిస్టర్ బ్లూమ్ ఇప్పుడు తిరుగుబాటు చిహ్నం బద్దలైపోయింది... మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తోందా?" అడిగాడు రబ్బీ దగ్గరగా వచ్చి.
బ్లూమ్ సమాధానం చెప్పలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళి కిందకి తొంగి చూశాడు. వినాయకుడు కింద పడిన చోటు చుట్టూ గులాబి రంగు శకలాలు పరుచుకోని మెరుస్తూ కనిపించాయి. రబ్బీని తప్పించుకుంటూ కిటికీ నుంచి దూరంగా జరిగి ఇంటి వైపు అడుగులేశాడు బ్లూమ్.
***
గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థనా మందిరానికి కోశాధికారిగా వ్యవహరించిన బ్లూమ్ అప్పటికి ఏం మాట్లాడకుండా వున్నా తరువాత, బాగా చీకటిపడిన తరువాత మందిరం వెనుక వున్న ఇనుప గేటు తీసుకోని నిశబ్దంగా అడుగుపెట్టాడు. వచ్చేటప్పుడు ఇంటినుంచి తనతోపాటు గుడ్డ బ్రష్, నగిషీలు చెక్కిన చిన్న చెక్క పెట్ట, ఇంకా సంచిలో ఏవో బరువైన వస్తువులు తెచ్చుకున్నాడు. వినాయకుడు పడి పగిలిపోయిన చోట చుట్టూ తిరుగుతూ బ్రషతో ముక్కలను చెక్కపెట్టలోకి చేర్చుకున్నాడు. తరువాత పక్కనే వున్న పూలమొక్కల మధ్యలో ఒక చిన్న గుంత తొవ్వి అందులో పెట్టను వుంచి మట్టితో కప్పేశాడు. అక్కడే నిలబడి వినాయకుడితో ఏదన్నా చెప్పాలా అని ఆలోచింఛాడు కానీ, ఏం చెప్పాలో తెలియక మిన్నకున్నాడు.
తరువాత అలాగే చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా నడుస్తూ ప్రధాన ద్వారం తెరిచి ప్రార్థనా మందిరంలోకి జారుకున్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా అదీ ఎలాంటి స్పష్టమైన అవసరం లేకుండా మందిరంలో అడుగుపెట్టడం అతనికి దే మొదటిసారి. ఒక్క క్షణం అక్కడే ఆగి ప్రాంతం అతనికి ఎన్ని గంటల ప్రశాంతతనిచ్చిందో గుర్తుచేసుకున్నాడు. తన సంతోషంలో, బాధలో ఇదే ప్రదేశంలో విన్న ప్రార్థనలు, ప్రత్యేక స్వరంలో పాడిన గీతాలు అన్నీ జ్ఞప్తికి వచ్చాయి.
మర్నాడు ఉదయం మత పెద్దలు అక్కడికి వచ్చేసరికి తలుపులు తాళాలు వేసి వుండటం, తాళాలకు మైనం కూరి వుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఏదో అనర్థం జరిగి వుంటుందని వూహిస్తూనే తాళాలు బాగుచేసేవారిని పిలిపించి తాళాలను పగులకొట్టించారు. అప్పటికే అక్కడ జరిగే వింత చూడటానికి గుమికూడిన జనంతో సహా పెద్దలంతా లోపలికి అడుగుపెట్టి, లోపల జరిగింది చూసి నిశ్చేష్టులైయ్యారు.
లోపల అంతా విధ్వంసం జరిగినట్టు వుంది. అక్కడ బల్లలు విరిగిపోయి, కర్టన్లు చినిగిపోయి, దీపపుసెమ్మలు వంగిపోయి, అద్దాలు పగిలిపోయి వున్నాయి. వాటన్నింటి మధ్యలో చేతిలో గొడ్డలితో అలసిపోయి ఆయాసపడుతూ వున్నాడు  బ్లూమ్. చమటతో అతని బట్టలు తడిసిపోయి వున్నాయి.
ఇదంతా నువ్వే చేశావా?ఆడిగారు వాళ్ళు.
నేనా? నేను కాదు.. ఇదంతా భగవంతుడు చేశాడు..” చెప్పాడతను.
వాళ్ళు మళ్ళీ చుట్టూ కలియచూశారు. విరిగిన బల్లలన్నింటి మీద గొడ్డలి గుర్తులు కనిపిస్తున్నాయి. పరదాలన్నింటి పైనా ఒక మనిషి అరచేత్తో చించినట్లు గుర్తులున్నాయి.
దేవుడు చేశాడా? దేవుడు ఇలాంటివి ఎలా చెయ్యగలడు?అడిగారు వాళ్ళు.
ఇది కూడా చెయ్యలేని దేవుణ్ణి కొలవాల్సిన పనేముంది?ప్రశ్నించాడు అతను.
ఇంతవరకే తెలుసు. అతను అడిగిన ప్రశ్నవల్ల అక్కడున్న మనుషులకు జ్ఞానోదయం అయ్యిందా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.


***
Other People's God by Naomi Alderman

1 వ్యాఖ్య(లు):

Andhra Talkies చెప్పారు...

మంచి పోస్ట్. చాలా బాగా వ్రాసారు...Good

మీకు నచ్చిన latest Telugu Dubbed Movies చూసి ఆనందించండి.