పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు

ఓ బోయవాడు బాణం వదిలాడు. పూర్వాశ్రమంలో దొంగగా బతికిన ఓ వ్యక్తి అక్కడ నిలబడి జంట పక్షుల్లో ఒకటి నేలకొరగడం చూశాడు. తోడు కోల్పోయిన రెండో పక్షి కన్నీరులో కరిగాడు. కరుణరసాత్మకమైన ఓ కావ్యానికి బీజం పడింది. ఇది మనందరికీ తెలిసిన వాల్మీకి కథ. జాగ్రత్తగా గమనించండి. వాల్మీకికి అప్పుడు కలిగిన భావన కేవలం కరుణేనా? బాణం వేసిన బోయవాడి మీద కోపం రాలేదా? ప్రాణాలని కబళించి మిగిలిపోయినవారికి విషాదాన్ని మిగిల్చే మృత్యువు మీద ఆగ్రహం కలగలేదా? ప్రేమ జంట తనని వీడిపోయిందని ఏడుస్తున్న పక్షి కన్నీరు తుడవలేని అశక్తతని తలుచుకోని వాల్మీకికి అసహనం కలగలేదా? ఒకవేళ అలాంటి ఆగ్రహం, అసహనం కలిగివుంటే వాల్మీకి రాసిన కావ్యం ఎలా వుండేది?
నేను చెప్పనా?
అప్పుడు కూడా రామాయణం కరుణరసాత్మకంగానే వుండేది. ఆ వాల్మీకి పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయితే. ఆగ్రహానికీ కరుణకు ఏమిటీ సంబంధం? తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. ఎలా? పెద్దిభొట్ల కథలు చదవాలి. “ద్రణేవుడు” ఎవరు? ఎవరో వుండే వుంటారు. వెతకాలి. వెతుకుతూనే వుండాలి. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. తెలుసుకోలేనివాడు “ఇంగువ” అంటే ఏమిటో ఎరగని వాడిలా జీవితాన్ని చాలిస్తాడు. ముగిసిపోయేది కాదు జీవితం అంటే, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావే అదీ జీవితం అంటే..
అలా కాదు నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటావా... ఆల్ రైట్... గాటానికి కట్టిన ఎద్దులా గిరా.. గిరా.. గిరా... బావిదాటని కప్పలా బెక బెక బెక బెకా...! తనకు తెలియని కొత్త ప్రపంచం ఒకటుందని, అందులో కనుచూపు సాగినంత మేర “నీళ్ళు” వుంటాయని తెలియని వాడు ఏమౌతాడు? మంచినీళ్ళు కనిపిస్తే అవురావురంటూ తాగుతాడు. గంటలుగంటలు స్నానాలు చేస్తాడు. చివరికి ఓ ముహూర్తాన నీళ్ళలోనే పడి చస్తాడు. మరి అతను తెలుసుకోవాల్సిందేమిటి? ఓ వూరిలో నీళ్ళు లేక ఛస్తుంటే మరో వూర్లో నీళ్ళలో మునిగి చస్తుంటారు. ఈ వైరుధ్యాన్నే తెలుసుకోవాలి. ఈ వైరుధ్యం పేరు కూడా జీవితమే.
అయితే ఈ జీవితం గురించి మనకి చెప్పేది ఎవరు? నేను చూడని కొత్తకోణం వైపు బైనాకులర్స్ పెట్టి చూపించేది ఎవరు? ఒక పుస్తకం. ఒక జిజ్ఞాస. ఒక ప్రశ్న. ఇదిగో అలాంటి ప్రశ్నలన్నింటినీ తలకెత్తుకోని తిరిగే పెద్దమనిషి ఒకాయన వున్నాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు ఆయన్ని. మృత్యువుని రక్తం రంగులో కళ్ళారా చూసినవాడు. తల్లిప్రేమని అభద్రత రూపంలో అనుభవించిన వాడు. కష్టాన్ని కన్నీటి రుచిలో తెలుసుకున్నవాడు. జీవితం అంటే కషాయం అని కనిపెట్టిన మానసిక శాస్త్రవేత్త. ఆ కషాయాన్ని ఏ మిశ్రమాలలో కలపాలో తెలుసుకున్న సరికొత్త రసవాది. కథ అనే అంబులపొదిలో అక్షయతూణీరాల్లాంటి పాత్రల్ని పెట్టుకోని మనసుని కరుణాస్త్రబద్ధుల్ని చేయగల విలుకాడు.
కవిసామ్రాట్ దగ్గర శిష్యరికం చేసినవాడు పోనీ కవిత్వం రాసి వుండచ్చుగా? కథని పట్టుకున్నాడు. కథ ఆయన్ని పట్టుకుంది. కథల్లో వర్ణన చూడండి. ఒకో కథలో ఒకలాగ వుండే వాతావరణం చూడండి. నిప్పుల మీద నుంచి వీస్తున్నట్లుగా వేడిగాలులు, బాగా బలిసిన ఏనుగుల్లా మబ్బులు, వాన జల్లులు, ముసురు పట్టడాలు, గుడ్డివెన్నెలలు, తెల్లటి వెండి కంచంలాంటి చంద్రుడు, వేప చెట్లు అబ్బో.. ఇంకా చాలా వున్నాయి. ఇవన్నీ కథలోకి వచ్చి ఏం చేస్తున్నాయి? చదివిస్తున్నాయి. అంతే. ఏ వాక్యాన్ని విత్తనంగా వేస్తే ఏ అనుభూతి మొలకెత్తుతుందో తెలియడమే రచన. అదే కదా కావాల్సింది.
వుద్యోగంలో చేరాల్సినరోజే ఎగ్గొట్టి “పథేర్ పాంచాలి” చూసినవాడు పోనీ సినిమా అయినా తీసుండచ్చుగా? లేదు. మళ్ళీ కథలోకే వచ్చాడు. సినిమా చూపించాడు. కావాలంటే అయన రాసిన తొలి కథల్లో ఒకటైన “భయం” (1960) చూడండి. ఓ పిల్లవాడు గోడగడియారం బద్దలుకొట్టాడు. నాన్న వస్తే బెత్తం విరిగేట్లు కొడతాడని భయం. అదే కథ. అంతే కథ. ఆ పిల్లాడి భయం చెప్పాలంటే వాడి మనసులో దూరి తెరలు తెరలుగా వున్న భయాన్ని పొరలు పొరలుగా వ్యాక్యాలలో చెప్పాలా? ఊహు.. అలా కాదు. ఎండ, ఎండుటాకులు, టెలిగ్రాఫ్ తీగలమధ్య చిక్కుకున్న గాలిపటాలు, వీధి చివర తోలుతిత్తి వొత్తుతుంటే వచ్చే ’గుఫ్ గుఫ్’ చప్పుడు, మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న ముసల్ది, దూదేకులవాడు ఏకుతున్న దూది, ఓ ఇంటి పంచాలో ఓ చిన్నపిల్ల వూదుతూ పగలగొట్టిన బెలూన్, ఆ చప్పుడుకి ఏడ్చిన చంటిపిల్లాడు... ఏమిటిదంతా? సంబంధంలేనివేవో చూపిస్తూ ఆ పిల్లాడి మనసులో భయాన్ని పరిచయం చేస్తాడు. ఈయనెవరు సైకాలజిస్టా? దాదాపు అలాంటిదే – స్కూల్ మేష్టరు.
 “నేను ఏదీ టెక్నిక్ ప్రకారం రాయలే”దని. “కథకి మేథమేటిక్స్” వుండదని చెప్పిన రచయితేనా రాసింది? అవున్నిజమే. ఆయన టేక్నిక్ అనుకోని రాయడు. అది రాసిన తరువాత ఆ టెక్నిక్ గురించి మనం తెలుసుకుంటాం.
కథలన్నీ కరుణరసం అన్నామా? మరి మనసుల్ని తాకేవి, పిండేవి, కాల్చి నుసి చేసేవి రాసాడా? అదీ లేదు. మరేం చేశాడు?చెప్పదల్చుకున్నది మూడు పేజీలలో తేల్చేశాడు. ఆ మూడు పేజీల్లోనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తయారు చేశాడు. కరుణరసాత్మకమైన కథలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్? ఇదెలాగా? అదలాగే. ఏ వాక్యమైతే కథకి మూలమో ఆ వాక్యాన్ని గుండెకి దగ్గరగా పెట్టుకోని, షో చెప్పేముందు విసిరే ట్రంప్ కార్డులా విసిరి కథ ముగిసిందంటాడు. అదేమి చిత్రమో మన మనసులో కథ అప్పుడే మొదలౌతుంది. “అన్నదాత సుఖీభవ” కథ చూడండి. పురుషోత్తం అనే వ్యక్తి కథ చెబుతుంటాడు. ఎక్కడో సత్రంలో తప్పక అన్నదాన పంక్తిలో భోజనం చెయ్యాల్సివచ్చిన సంగతి అది. తీరా తిన్నాక అక్కడ బోర్డుమీద వున్న పేరుని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానంటాడు. ఆ పేరేమిటో చెప్పడు. ఆ తరువాత మూడు పేరగ్రాఫుల సమయం గడిచాక, పక్కనున్న మిత్రుడు అడిగితే గాని ఆ పేరు ఎవరిదో పాఠకుడికి తెలియదు. ఆ తరువాత లైనుకి కథ అయిపోతుంది. ఇది కొసమెరుపుతో ముగించడం కాదు. ఒక మెరుపుని కొసదాకా లాక్కొచ్చి పడేయడం. ఆయన రాయడానికి కలం వాడుతారా? ఉలి వాడుతారా? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా?మధ్యతరగతి జీవితాలని కాచి వడబోసిన కషాయం కనిపెట్టిన కథకుణ్ణి తెలుసుకోవద్దూ? అర్థంకాని లిపిలో దేవుడు రాసిన జీవితమనే కావ్యాన్ని అలతి తెలుగుపదాలలోకి మార్చిన అనువాదకుణ్ణి తెలుసుకోవద్దూ? అగ్రవర్ణం అని పిలవబడే జాతిలోకూడా అస్పృశ్యుడైన దళితుణ్ణి పరిచయం చేసిన మనిషిని గురించి తెలుసుకోవద్దూ? ఆటల్ని కూడా కథలుగా మార్చగలిగిన రచయితని తెలుసుకోవద్దూ? మీరే చెప్పండి - తెలుసుకోవాలా లేదా? మరింకెందుకాలస్యం తెలుసుకోండి -
ఇంతకీ ఇంగువ ఏమిటి? తెలుసుకున్నారా? “అది చెట్టు నుంచి వొస్తుందా? ఏదైనా రసాయనిక పదార్థమా? లేక ఒక రకం రాయి వంటిదా? అది గాక ఏదన్నా జంతువుకు సంబంధించినదా?” తెలుసుకున్నారా?లేక తెలియకుండానే..???
("బోలెడు కరుణ…కొంచెం ఆగ్రహంతో…!" పేరుతో సారంగ వెబ్ పత్రికలో ప్రచురితం)
(సుబ్బరామయ్యగారి కథలు ఇతర రచనలు అన్ని పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యం. కినిగె.కాం లో ఇక్కడ)