బ్లాగోగులు: ప్రవాసాంధ్రులు

(ప్రవాసాంధ్రులంటే విదేశాలలో వున్నవారే కాదు స్వదేశంలో వేరే రాష్ట్రాలలో వున్న ఆంధ్రులు కూడా అని గమనించగలరు)

ప్రవాసంలో వున్న ఆంధ్రులు సామాన్యంగా "అదే మా వూర్లో అయితేనా.." అనో "ఎంతైనా మనవాళ్ళు.." అనో అవకాశం వచ్చినప్పుడల్లా అంటారని నా అనుభవం. లక్నోలో వున్న ఒక తెలుగు స్నేహితుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడి ఆంధ్రా భవన్లో భోజనం చేసి, తెలుగు సరుకులు దొరికే షాపుల్లో కావాల్సినవి కొనుక్కోని కానీ తిరిగి వెళ్ళడు. (తెలుగు సరుకులేమిటి అనకండి - క్రేన్ వొక్కపొడి, ప్రియ పచ్చళ్ళు, నెల్లురు సోనా మసూరి, ఎంటీఆర్ గులాబ్‌జాం, బ్రూక్‌బాండ్ కాఫీపొడి, చింతపండు, బియ్యప్పిండి... ఇంకా ఇలాంటివన్నమాట. నేను చూసినంతలో ఇలాంటివి నార్త్ ఇండియాలో ఎక్కడా దొరకవు)

ఇది ఇలా పక్కన పెడితే మరో విషయం - నేను బ్లాగులు వ్రాయటం మొదలెట్టాక కొంతమంది మిత్రులకి లంకెలు పంపించాను. అందులో ప్రవాసాంధ్రులు వున్నారు.. వాళ్ళంతా అన్న మాటల్లో ముఖ్యమైనది, ప్రముఖమైనది ఏమిటంటే - "అబ్బ.. తెలుగు అక్షరాలు చూసి చాలా రోజులైంది.. థాంక్యు."

ఇలాగే ప్రవాసాంధ్రుల్లో తెలుగు మిస్ అయ్యేవాళ్ళు చాలామంది వుంటారని నా అనుమానం. మరీ ప్రత్యేకించి ప్రవాసంలో వున్న మహిళలు (Home makers) ఈ తెలుగుని ఎక్కువగా మిస్ అవుతారని నాకనిపిస్తోంది. ఇందుకు కారణం లేక పోలేదు - అయ్యగార్లు సామాన్యంగా ఆఫిస్ పనుల్లో ఇంగ్లీషు వాడుతుంటారు అది హైదరాబాదైనా, ముంబై అయినా..!! కాబట్టి వాళ్ళకి అంత మార్పు కనపడదు. కానీ ఆడవారికి అట్లాకాదు.. కూరగాయల బండి నించి ఇంట్లో పనిమనిషి దాకా ఏ హిందీలోనో లేకపోతే కూచిపూడి భరతనాట్యం భగిమల్లోనో మాట్లాడాలి.. (ఠక్కున చెప్పండి బూడిద గుమ్మడికాయని ఇంగ్లీషులో ఏమంటారు... పోనీ గిన్న అడుగంటింది గట్టిగా తోము అనేది హిందీలో చెప్పండి...). ఇలాంటి వారికి దగ్గర్లో తెలుగువారు లేరు అనే భావన తప్పకుండా వుంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు నవలలు, వీక్లీ చదివటం అలవాటున్న ఆడవారికి ఈ ప్రవాసం ఒక ప్రహసనం. ఇలాంటివారిని మన బ్లాగ్ పాఠకులుగా చేసుకోవడం చాలా సులభమని నేననుకుంటున్నాను. (అయితే ఈ తెలుగు మిస్సింగ్ భావన ఆడవాళ్ళకు మాత్రమే కాదండోయ్.. ఆడవాళ్ళలో ప్రముఖం అని నా అభిప్రాయం)

మరి ప్రవాసంలో వున్న ఇలాంటివారందరినీ కలిసి మన బ్లాగులగురించి చెప్పే అవకాశం గురించి చెప్తాను -

నేను గమనించినంతలో ఎక్కడ పది పదిహేను కుంటుంబాల మేర తెలుగువాళ్ళున్నా అక్కడ ఒక తెలుగు అసోసియేషన్ లేదా తెలుగు క్లబ్ వుంటుంది. (నాకు తెలిసి - చెన్నై, ముంబై, పునే, అహ్మదాబాదు, భోపాల్, ఇండోర్, ఆనంద్, ఢిల్లీ, లక్నోలలో ఇలాంటి అసోసియేషన్లు వున్నాయి). విదేశాలలో అయితే ఖచ్చితంగా తెలియదుకానీ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో వున్న అసోసియేషన్లలో కొన్ని చోట్ల తరచుగా కలిసినా ఎక్కువ శాతం కార్తీక మాసం, సంక్రాంతి, వుగాది సందర్భాలలో కలుస్తారు. అదే మనకి మంచి అవకాశం...!! మరో పక్షంలో రాబోతున్న సంక్రాంతికి మీరూ మీ ప్రాంతంలో వున్న తెలుగు అసోసియేషన్‌కి వెళ్ళండి. వాళ్ళు జరపబోయే కార్యక్రమాలలో మీరు పలు పంచుకోండి. అక్కడ ఈ-తెలుగు కర పత్రాలు ఇవ్వండి, మన బ్లాగుల విశేషాలు చెప్పండి. ఇప్పుడు యండమూరి రచనలు, వార పత్రికలు ఇంటెర్నెట్లొనే చదవచ్చని చెప్పండి. కొత్త తెలుగు సినిమాలు ఇప్పుడు అంతర్జాలంలొ చూడచ్చని చెప్పండి (ఇది అన్నిటికన్నా పెద్ద పాయింటు - తెలుగువారు సినిమా ఒక విడదీయరాని బంధం కదా). మీ బ్లాగులో మీరు రాసుకున్నదో, మరో బ్లాగర్ రాస్తే మీకు నచ్చినదో తీసుకెళ్ళి చదవండి. ఇంకా వీలైతే లైవ్ డెమాన్‌స్ట్రేషన్ చెయ్యండి, ఆఫ్‌లైన్లో లేఖినిలో తెలుగు అక్షరాలు చూపించండి.

మరో ముఖ్యమైన విషయం - సాధారణంగా కరపత్రంలో చూసి వుత్సాహపడినా ఇంటికెళ్ళిన తరువాత/ఆఫీస్ కి వెళ్ళిన తరువాత (చాలామంది ఆఫీస్‌లోనే అంతర్జాలం చూస్తారు) ఆ విషయం మర్చిపోతారు. గుర్తొచ్చినప్పుడు కరపత్రం ఎక్కడపెట్టారో గుర్తుకురాదు. అందుకే మనం కరపత్రాలతో పాటు మరో చిన్న పనిచేస్తే బాగుంటుంది. అదేమిటంటే ఆ సమావేశాలలో ఒక రిజిస్టరు పెట్టి వచ్చిన ప్రతివారి వివరాలు ముఖ్యంగా మైల్ ఐడీ వ్రాయమని చెప్పండి. ఆ తరువాత వారందరికీ లింకులిస్తూ ఒక వేగు పంపితే సరి. ఆ రోజు జరిగిన తెలుగువారి సమావేశం గురించి ఇంటర్నెట్‌లో మర్నాడు వస్తుందని మీ బ్లాగ్ లంకె ఇవ్వండి. మర్నాడు మీ బ్లాగ్‌లో ఆ విశేషాలు టపాగా వ్రాయండి.

ఈ సంక్రాంతికి నేను ఇండోరులో ఈ పని చెయ్యటానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాను... మీరూ మొదలెట్టండి మరి..!!

ఇదంతా బాగానే వుంది మరి ప్రవాసంలో లేని వాళ్ళం ఏమి చెయ్యాలి అని అడగచ్చు... అలాగే ప్రవాసంలో వున్న వారు కూడా సంవత్సరానికొక పండగ.. ఇంటికెళ్ళాలి అంటున్నారా..?? అయితే వోకే. పండక్కి ఇంటికొచ్చే ప్రవాసాంధ్రులు చాలామందే వుంటారు. మీరూ ఇంటికెళ్ళినప్పుడు ఇలాంటి మిత్రులని తప్పకుండా కలుస్తారుగా..!! వారికి చెప్పండి.. మైల్ ఐడీ తీసుకోండి. వేగు పంపండి..!!

(వేగు విషయం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మొన్నా మధ్య నేను గుంపుకు పంపిన వేగులో చైన్ మైల్ గురించి ప్రస్తావించాను. హై. చర్చలో అది ఏ భాషలో వుండాలి అని ప్రశ్న వచ్చింది. తెలుగులో పంపితే మళ్ళీ డబ్బాలు కనిపిస్తాయేమో అన్నారు. ఈ మధ్య ఒక బ్యాంకు నాకు పంపిన మైల్ చూసి నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం చెప్పదలుచుకున్నది బొమ్మ (image) రూపంలో పెట్టి వేగు పంపలేమా..?? టెక్కునిక్కులు తెలిసినవారెవరైనా వివరించగలరు)

బ్లాగోగులు: తెలుగు బ్లాగర్లకు ఒక రూపం కల్పిద్దాం..!!


మొన్నామధ్య అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా గుంపుకి నేనొక వేగు పంపాను - "తెలుగు బ్లాగుల అభివృద్దికి మనమేమి చెయ్యొచ్చు??" అని. అందులో కొన్ని విషయాలను హై. సమావేశంలోనూ, అంతర్జాల సమావేశంలోనూ చర్చించారు. యోగ్యత అనుసరించి కొన్ని పాటించటం మొదలుపెట్టాము కూడా. చాలా సంతోషం. అందులోని విషయాలనే ఇంకొంచెం వివరంగా చర్చించాలని నా ప్రయత్నం. అందులో లేనివి కూడా కొన్ని సందర్భానుసారంగా ప్రస్తావిస్తాను.

తెలుగు బ్లాగుల ప్రచారోద్యమంలో ఈ-తెలుగు స్టాలు ఒక మైలు రాయి అనిపిస్తోంది నాకు. అక్కడ బ్లాగ్మిత్రులు తీసుకున్న శ్రమ, సమయస్ఫూర్తి (కరపత్రాలనించి స్టాలుకి, స్టాలు నుంచి స్టేజికి, చివరికి ఆ పుస్తక ప్రదర్శన సైటు మనమే తయారు చేసే దాకా) ఎంతో అభినందనీయం. అక్కడ నేను లేకపోతినే అంటూ చాలా మంది బ్లాగర్లు ఇప్పటికే అన్నారు. నేను అనలేదు... అనను కూడా... ఎందుకంటే నేనక్కడలేకపోయినా అందులో భాగస్వామినే. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి "టీవీలో చూపిస్తున్నారు... ఎవరో తెలుగు బ్లాగర్లట అంతా కుర్రాళ్ళే (పద్మనాభంగారు కనపడలేదనుకుంటా.. కనపడ్డా ఆయన వుత్సాహంలో కుర్రాడేగా..!!) తెలుగుకోసం ఎంత పనిచేస్తున్నార్రా.." అని అంటే నేను "అవును నేను కూడా అందులో భాగమే... హైదరాబాదులో లేను కానీ లేకపోతే నేనూ అక్కడే వుండేవాడిని" అని చెప్పుకొచ్చా. విషయమేమిటంటే... నన్ను నేను అక్కడ శ్రీధర్‌లోనూ, శిరీష్‌లోనూ, లక్ష్మిలోనూ, కశ్యప్‌లోనూ, పద్మనాభంగారిలోనూ చూసుకున్నాను.

ఈ సమావేశం టపాలలో ఒక చిత్రం జరిగింది (వుద్దేశ్యపూర్వకమో కాదో కానీ...) ఈ-తెలుగు సమావేశంలో తీసిన (చాయా) చిత్రాలను బ్లాగుల్లో పెట్టినవారెవ్వరూ - ఇదుగో నిల్చున్నవారు కుడి నుంచి ఎడమకి - అని పేర్లు వ్రాయలేదు. నాకూ తెలుసుకోవాలనిపించలేదు. ఎందుకంటే వారందరిలో నేనూ వున్నాను... అక్కడ నాకు కనపడేది తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేస్తున్న తెలుగు బ్లాగర్లు మాత్రమే. ఎవరో అనవసరం...!!

వీడేమిటి ఇలాగంటున్నాడు అనుకుంటున్నారా?? ఇక్కడ నేను అంటే తెలుగు బ్లాగర్. వ్యక్తిగతంగా నాకు తోటి బ్లాగర్లతో మాట్లాడాలని - దార్లతో దళిత సాహిత్యం, రామరాజుతో గుత్తి గుమ్మడికాయ, భగవాన్‌తో వ్యంగ్య హాస్యం, సౌమ్యతో నేను చదివిన పుస్తకాల గురించి - ఇలాంటివి ఎన్నో. కానీ ఇవన్నీ సత్యప్రసాద్‌గా, అదే తెలుగు బ్లాగర్లమై మనం కలిస్తే మనం మాట్లాడేది బ్లాగాభివృద్ధి, అంతర్జాల తెలుగు వైభవం.. కాదంటారా..??

ఒక్క విషయం గమనించండి ఈ-తెలుగు సమావేశాలలో కృషి చేస్తున్నది శ్రీధరో, భార్గవోకాదు - ఒక తెలుగు బ్లాగర్ మాత్రమే. "నేనక్కడ వుంటే నిశ్చయంగా అక్కడ నిలబడేవాడిని.." - ఈ మాట అనుకోని తెలుగు బ్లాగర్ ఎవరైనా వున్నారా? (వుంటే జోహార్... మీరీ టపా ఇక్కడిదాకా చదవటమే తప్పు. అర్జెంటుగా కంట్రోలు ఎక్స్ కొట్టండి). అంటే వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం కాదా అనకండి.. నేననేది ఇదే అవకాశం మీ వూర్లో వస్తే మీరు కృషి చెయ్యరా అని? (చేస్తారా.. అయితే నా తరువాతి టపా తప్పకుండా చదవండి). మరో చిత్రం చూసారా - ఇప్పటిదాకా మనం చాలామంది బ్లాగరలను ముఖాముఖీ చూసిందిలేదు. అయినా ఏదైన విషయం వస్తే కత్తి మహేష్ అయితే ఇలా ఆలోచిస్తాడేమో, తాడేపల్లికి తెలిస్తే ఇంకో కొత్త తెలుగు పదం పుట్టిస్తాడు అనుకుంటాం. ముఖాలు తెలియకపోతేనేమి...?? కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే మనందరిలో అంతరాంతరాలలో తెలుగు బ్లాగర్ అనే ఒక సన్నని దారం సామ్యంగా కనపడుతోంది.

ఇప్పుడు అసలు విషయం -

మనమందరం పూలలాగా ఒక దారంతో కలిసిపోయి వున్నాం కదా.. అందరం కలిస్తే ఒక దండ అవుతాముకదా. ఆ దండకి ఇప్పుడు ఒక రూపం ఇవ్వాల్సిన అవసరం వుంది. నేననేది తెలుగు బ్లాగర్స్‌కి ఇప్పుడు ఒక చిహ్నం అవసరం. మనమందరం ఒకటి అని గుర్తుచేస్తూ వుండటానికి, సందర్భం వచ్చినప్పుడు చూసే వాళ్ళందరికి ఒహో వీళ్ళు ఫలానా కదూ అని చెప్పటానికి, ముఖాముఖి కలుసుకోని తెలుగు బ్లాగర్లందరికి ఒక రూపం తీసుకురావటానికి, ఏదైనా అవకాశం చిక్కినప్పుడు (పుస్తక ప్రదర్శనలాగా) దాన్ని బ్యానరు పైనా, బాడ్జీలపైనా వెయ్యటానికి, నాగ ప్రసాద్ లాంటివారు టీ షర్ట్‌పైన వెయ్యటానికి, తెలుగురత్న గ్రంధాలయంలో పెట్టే బ్లాగు ఈ-పుస్తకాలపైన వెయ్యటానికి, ప్రతి బ్లాగరు తన బ్లాగులో పెట్టుకొని బ్లాగు ప్రచారోద్యమంలో పాలు పంచుకోవటానికి, తరచుగా బ్లాగులగురించి వ్రాసే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఆ వ్యాసంలో ప్రచురించటానికి.. ఇంకా ఇలాంటివి ఒక ఇరవై ముప్పై అయినా వ్రాయచ్చు..!!
సరే చిహ్నం కావాలి...!! అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారా..?? చెప్తా అదీ చెప్తా -

అ) తెలుగు బ్లాగర్ల చిహ్నం తయారు చెయ్యమని బ్లాగర్లనే అడగటం/పోటీ పెట్టడం. (ఈ విషయం ఇదివరకే ప్రస్తావనకి వచ్చింది.. మళ్ళి ఒక ఆలోచన పారెయ్యండి). మన దగ్గర భగవాన్, వెంకట్ (వెంకటూన్స్), పృధ్వీరాజు లాంటి మంచి ఆర్టిస్టులు వున్నారు. వారు వేసినా సరే లేదా మరెవరైనా ఔత్సాహికులు వేసినదానికి మెరుగులు దిద్దినా సరే.

ఆ) రెండొవది చాలా సులభమైనది. ఎవరైనా పేరుమోసిన ఆర్టిస్టుని పట్టుకోని బాబ్బాబు మేమిలాగిలాగ తెలుగు బ్లాగర్లం అని చెప్పుకోని బొమ్మ గీయించుకోవడం. దీంట్లో వున్న ఇబ్బంది ఏమిటంటే సదరు ఆర్టిస్టుకి మన సంగతులు వివరంగా తెలియజేయాలి, ఆయనా తెలుసుకోవాలి అది బొమ్మలో రావాలి. రెండొవ సమస్య మన బ్లాగర్లు అలా "బయట"వారు వేస్తే కలుపుకుంటారా లేదా అనేది ప్రశ్న. (ఈ ఆలోచన నచ్చితే బాపూగారితోనే వేయించగలిగితేనే సార్థకత అని నా విశ్వాసం.)

ఇ) మూడొవది మరీ తెలివైనది - పుణ్యం పురుషార్థం ఆలోచన. మనం తెలుగు బ్లాగర్లం ఏదైనా పత్రికలో పోటీ ప్రకటిద్దాం. మాకు చిహ్నం చేసిపెట్టేవారు కావలెను అని. తయారు చేసి సాఫ్ట్/స్కాన్‌డ్ కాపీ పంపించండి, ఎన్నికైన బొమ్మకి పారితోషికం అని. అసలు ఆలోచనేమిటంటే సదరు ఆర్టిస్టుగారు బొమ్మ వెయ్యాలంటే వివరాల కోసం మనం ఇచ్చే లంకెలు పట్టుకొని కూడలి, పొద్దు నించి మొదలెట్టి బ్లాగులు చదివి ఆకళింపు చేసుకొని బొమ్మ గీసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రక్రియలో ఒక వందమంది అయినా "ఆర్టిస్టులు" బ్లాగులు చూస్తారు. (చదువరులు పెరుగుతారు, ఆర్ట్"ఇష్టులు" కాబట్టి మళ్ళీ వస్తారు, లేదా వారి బొమ్మలతో ఒక బ్లాగైనా పెడతారు.)

ఏది ఏమైనా ఇలాంటి చిహ్నం మనం తయారు చేసుకోవటం అవసరం, అత్యవసరం. తరువాతి టపాలో నేను చెప్పే కొన్ని విషయాలు ఇలాంటి చిహ్నంతో చేస్తే బాగుంటుంది. అందుకని యుద్ధప్రాతిపదికన మీ అభిప్రాయం వ్యాఖ్య రూపంలో చెప్పండి..!! (ఎందుకు బ్రదర్ అనవసర ప్రయాస అంటున్నారా సరే అదే చెప్పండి).

బ్లాగోగులు: తెలుగులోనే ఏల బ్లాగవలె?

నిన్నటి నా టపాకి నెటిజెన్‌గారి ప్రశ్న ఇది - తెలుగులోనే ఏల బ్లాగవలె?

చాలా చిన్న ప్రశ్న, కానీ సమాధానం పెద్దది అందుకే టపాగా రాస్తున్నా.

దీనికి రెండు రకాల సమాధానాలు -

అ)వ్రాయటానికి సంబంధించి

అ.అ)మనమందరం మా
తృభాషలోనే ఆలోచిస్తాం. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన సత్యం. మనం ఆంగ్లమో మరో భాషో మాట్లాడాలన్నా తెలుగులో ఆలోచించుకొని మాటల్లోకి వచ్చేసరికి తర్జుమా చేసుకుంటాం. అలా ఆలోచించటంలో ఒక సౌలభ్యముంది (Comfort). అదే ఆలోచనలను మాతృభాషలో వ్రాయటం సులభం, తర్జుమా చేసి ఆంగ్లంలో వ్రాసేకన్నా. ఈ మాట తెలుగేతర భాష తెలిసిన వారందరూ వొప్పుకుంటారనుకుంటున్నా. తెలుగులో బ్లాగు వ్రాయటానికి ఇదే ప్రాధమిక కారణం అని నేను నమ్ముతున్నాను.

అ.ఆ) తరువాతది - "నాకు తెలిసిన చాలా విషయాలు తెలుగులో చెప్పటం, తెలుగువారితో చదివించడం సులభం". కవిత్వం, పద్యం, సంక్రాంతి ముగ్గులు, బాపు రమణలు, తెలుగు సినిమా, వాలు జడలు, వయ్యారి భామలు, పంచె కట్టులు, పాపిటబిళ్ళలు, పరికిణీలు, బతుకమ్మలు, చిరంజీవి - చంద్రబాబు, నుడికారం, సామెతలు... ఇలాంటివి వేరే భాషలో రాయాలంటే (రాయచ్చు) ఈ పదాలకి అర్థం రాయాటానికే ఒక టపా రాయాలి. (పరికిణీ అంటే ఒక రకం డ్రస్సు అంటే సరిపోతుందా..?? అందులో వున్న అందం, వయ్యారం, ఠక్కున గుర్తొచ్చే తెలుగుతనం గురించి వేరే భాషలో ఎంతవరకు చెప్పగలరు..??)

అ.ఇ) మూడొవది భాషాభిమానం. దీని గురించి నిన్నటి టపాలో కూడా ప్రస్తావించాను.

అ.ఈ) నాకు తెలుగు మాత్రమే తెలుసు. వేరే ఏ భాషపైనా పట్టులేదు

రెండొవది: మళ్ళీ అదే పాయింటు. ఆ)పాఠకులు.

ఇంగ్లీషులో బ్లాగులు మొదలెట్టి తెలుగులోకి వచ్చిన వాళ్ళు మన గుంపులో చాలామందే వున్నారనుకుంటా. నేను కూడా ఒకడిని. (నకిలీ కణికుడి గురించి చెప్పే అమ్మవొడి బ్లాగు మరొక వుదాహరణ). ఇందాక చెప్పినట్టు తెలుగు వారు చదివి అసోసియేట్ (associate)చేసుకోవటం సులభమనే కారణం ఒకటైతే, ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన బ్లాగు అగ్రిగేటర్ల ద్వారా పాఠకులు దొరుకుతారు అనే నమ్మకం మరొకటి.

ఏ రకంగా చూసినా పాఠకులే ప్రాధమికం. అయితే ఈ ప్రశ్న మన ప్రచారోద్యమంలో కొత్త కోణం చూపిస్తుంది. అదేమిటంటే మనం ప్రచారం చేసేటప్పుడు ఏ విషయం పైన ఫోకస్ చెయ్యాలి అన్నది.

తెలుగులో వ్రాయటానికి కారణం పైన చెప్పిన ఫలానా ఫలానా అయితే వాటి గురించే ప్రచారంలో ప్రస్తావించడం అవసరం -

ఉదా:
అమెరికాలో వుండి సంక్రాంతి ముగ్గులు, హరిదాసు పాటలు మిస్స్ అవుతున్నారా?
మీ పిల్లలకి వేమన పద్యాలు రావని బాధపడుతున్నారా?
అయితే నేడే చూడండి తెలుగు బ్లాగులు..!!

(వచ్చే టపాలో: తెలుగు బ్లాగర్లకొక రూపం కల్పిద్దాం)

బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?


ఇది ప్రాధమిక ప్రశ్న. తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేద్దామని ఇప్పటికే పలు బ్లాగర్లు అనటం జరిగింది. వ్యాప్తి చెయ్యటమంటే ఏమిటి? బ్లాగులు పెంచాలా? బ్లాగర్లను పెంచాలా? పాఠకులని పెంచాలా?

అందుకే ఈ ప్రశ్న.

మనకి కావలసింది ఏమిటి?

దీనికి నాకు తోచిన జవాబు చెప్పే ముందు మరి కొంచెం లోతైన ప్రశ్న - ఆసలు మనం ఎందుకు బ్లాగుతున్నాం?

నా వరకు చెప్పాలంటే నేను బ్లాగు మొదలు పెట్టకుముందే అచ్చోసిన రచయితని (అనగా అడపాదడపా అచ్చులో నా రచనలు ప్రచురించబడ్డాయి). నేను బ్లాగటం మొదలు పెట్టింది నా దగ్గర వున్న రచనలని కొత్తగా మొదలైన ఒక మాధ్యమం (అంతర్‌జాలంలో) పెట్టడం. అంతే. అయితే వ్రాయటం మొదలెట్టాక అడపదడపా వ్యాఖ్యలు మొదలై తరచుగా రావటం మొదలైయ్యాయి. ఆ ప్రోత్సాహం మరిన్ని (కొత్త) కథలు రాయటానికి స్పూర్తి నిచ్చాయి. ఈ వ్యాఖ్యలు లేకపోతే గతంలో అచ్చైన కథలవరకు ఎక్కించేసి శెలవు పుచ్చుకునేవాణ్ణి. (అసలు నేను వ్రాయటం ఆపేసి అయిదు సంవత్సరాలైంది. మళ్ళీ రాస్తున్నానంటే అది మీ చలవే)

చెప్పొచ్చేదేమిటంటే.. నేను నాకోసమే బ్లాగు రాసుకుంటున్నాను, ఎవరు చదివినా చదవక పోయినా - అనే మాట అసంబద్ధంగా తోస్తుంది నాకు. అలాగైతే ఈ కూడళ్ళు, జల్లెడలూ ఎందుకు చెప్పండి? మీరు రాసుకునేది రాసుకోండి, రెండు మూడు సార్లు చదువుకోండి, మురిసిపోండి. ఇంకొకరు చదవాల్సిన పనిలేదు కాబట్టి ఏ ఆశలు ఆశయాలు లేవు..!!

నేను మాత్రం వొప్పుకోనండి..! ఎవరెన్ని చెప్పినా కళకారుడికి చప్పట్లే సన్మానపు దుప్పట్లు..!! బ్లాగరికి కామెంట్లే సన్మానపు దుప్పట్లు..!!

తనకోసమే వ్రాసుకునే వాళ్ళకి ఈ చర్చతో పనిలేదు. మీరు వ్రాసుకోండి.. అంతర్జాలంలో తెలుగు వెలుగుకి మీరూ ఒక సమిధనిచ్చారని (ఆ వుద్దేశ్యంతో కాకపోయినా) మీకు నెనర్లు. (ఈ విహారిణి కుడిచేతివైపు అన్నిటికంటే పైన ఒక ఇంటూ గుర్తు వుంటుంది అది నొక్కండి).

అలా కాదు నేను రాసేది ఇతరులు చదవటానికే అనే వాళ్ళు చదవటం కొనసాగించవచ్చు.

ఇతరులు చదవటానికి వ్రాసేవాళ్ళు అసలు ఎందుకు వ్రాస్తారా అని ఆలోచిస్తే నాకు తట్టిన సమాధానాలివి -

అ) నా భావాలు నలుగురితో పంచుకోవాలి

ఆ) నా అనుమానాలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎంతమందికి నచ్చుతాయో తెలుసుకోవాలి

ఇ) నేనూ రచయితనే.. ఈ సంగతి స్వాతీ ఆంధ్రభూమి తెలుసుకోలేకపోయాయి... మీరన్నా తెలుసుకోండి (నా లాంటివారు)

ఈ) నాకు తెలిసిన విషయం కొంత మందికైనా వుపయోగపడుతుంది..

ఉ) నా రచన చదివి ఎవరైనా వీరతాళ్ళేస్తే నాకు ఎంత సంబరమో

ఊ) వాడెవడో సత్యప్రసాదట - నేను వాడి కన్నా బాగ రాయగలనని నిరూపించాలి


ఇంకా ఇలాంటివి మరెన్నో వుండచ్చు - అన్నింటిలో సామ్యమైన విషయం ఏమిటంటే - నేను రాసింది చదివేవాళ్ళు కావాలి..!! నేను రాసినదానికి వ్యాఖ్యల రూపంలో అభినందనో, అభిప్రాయమో కావాలి. ఇది జరగాలంటే చదువరులు ఇంకా కావాలి.

బ్లాగర్లలో మరో వర్గం - తెలుగు భాషాభిమానులు. పైన చెప్పిన వర్గంలో భాషాభిమానులు లేరా అనకండి. ఇది ఇంకో రకమైన విభజన (Classification). దాదాపు అందరిలోను భాషాభిమానం వున్నా కొంచెం బలంగా అంటే బ్లాగు మాధ్యమంగా తెలుగు వాడకం పెంచాలనో, అంతర్జాలంలో తెలుగు వాడకం పెంచాలనో, కొండకచో "తెలుగు వాడుక భాషా దోషాలను సమూలంగా ప్రక్షాళన గావించెద" అనే తీవ్ర అభిమానులు వుంటారు. వీరి పుణ్యమే ఈ నాటి తెలుగు వెలుగులు, ఇంకా జరుగుతున్న అంతర్జాల తెలుగు భాషోద్యమ ప్రయత్నాలు. (నేను ఇక్కడకూడా వున్నాను అందుకే ఈ టపా). వీరి ప్రయత్నాలు ఫలించాలంటే అంతర్జాలంలో తెలుగు వెలుగుల గురించి మరింత మంది చదవాలి. వీరికీ చదువరులు మరింతగా కావాలి.

ఇక ఇంకొక విషయం - బ్లాగులు మొదలు పెట్టినవారి స్వగతాలో, సింహావలోకనాలో, లేదా మొదటి టపాలో చదవండి.

అ) నేను ఫలానా ఫలానా వారి బ్లాగు చదవటం మొదలు పెట్టాను. వారిలాగ/వారి కంటే బాగా రాయగలననే నేను మొదలెట్టా

ఆ) ఈనాడులో/ఆంధ్రజ్యోతిలో తెలుగు బ్లాగుల గురించి చదివాను.. నేనూ మెదలెట్టాను

ఇ) గూగులమ్మని ఏ వేమన గురించో పోతన గురించో అడుగుతుంటే తెలుగు పదాలు కనపడ్డాయి.. హై భలేగుందే అని ఒక నొక్కు నొక్కాను... ఆ తరువాత అ) పాయింటు చదువుకోండి.

ఇలాంటి కారణాలు కనిపిస్తాయి. కొంత మంది ఇంతకు ముందే అచ్చోసిన రచయితలు (నా లాంటోళ్ళూ) మినహాయిస్తే ఎక్కువగా బ్లాగులు మొదలెట్టిన వారు ముందు చదివారు, తరువాత మొదలెట్టారు. కాబట్టి మనం ఏం కనిపెట్టాం.. బ్లాగు రాయండి అని ప్రచారం చెయ్యటం కన్నా బ్లాగులు చదవండి అని ప్రచారం చేస్తే చదివిన వారు నెమ్మదిగా వ్రాస్తారు. పరంతూ... (అంటే కాకపోతే) ఇలాగొచ్చినవాళ్ళకి మీరూ వ్రాయండి... వ్రాయటం చాలా వీజీ అని చెప్తుంటే చాలు.

ఇప్పటికిక్కడ ఆపేస్తే మనకి కావల్సింది చదివేవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. పాఠకులే ముఖ్యం..!! రచయితలు కాదు..!! నేటి పాఠకులే రేపటి రచయితలు..!! కాబట్టి అంతర్జాలంలో తెలుగు చదివేవారికోసం వుద్యమిద్దాం..!! (నాకు తోచిన కొన్ని అవిడియాలు తదుపరి టపాలలో)

మొన్నామధ్య మాయాబజార్‌లో ఒక సన్నివేశం పేరడీలో నేను చెప్పదల్చుకుంది అదే. జ్యోతిగారు కరెక్టో అని మార్కులేశారు. మీరేమంటారు? మీరంతా నిరభ్యంతరంగా విభేదించవచ్చు, అనామక వ్యాఖ్యలేసుకోవచ్చు... ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే నేను వ్రాసేది చదివేవారికోసమే... వారి వ్యాఖలకోసమే.


ఆంధ్రజ్యోతిలో పలక బలపం

మొన్న గురువారం (18/12/2008) నవ్యలో ప్రచురించారట... ఎవరో మిత్రుడు వ్యాఖ్యలో రాయబట్టి తెలిసింది... ఆ తరువాతే నాగామృతంలో చదివాను. నెనర్లు.




అరిపిరాల

బ్లాగోగులు: మాయాబజార్

తాన శార్మ: ఏమయ్యా ఇవేనా మీరు చేసిన ఏర్పాట్లు?

చినమయ్య: అం అః ఇం ఇః - నవతరంగం, పొద్దు, ఈ మాట, వైజాగు డైలీ

తాన శర్మ: ఓహో హో ఇవి వెబ్ పత్రికలు

చినమయ్య: కూడలి, జల్లెడ, తెలుగు బ్లాగర్స్...

తందాన శాస్త్రి: ఇవన్నీ అగ్రిగేటర్లు

లంబు: రెండు రెండ్లారు, తోటరాముడు, నవ్వులాట, హాస్య దర్బారు, భగవాన్ కార్టూన్లు, వెంకటూన్లు, వికటకవి

తాన శార్మ: మాకు తెలుసులేవయ్యా ఇవి హాస్య బ్లాగులు

జంబు: సాహితీయానం, సంగతులు, దార్ల, కళాస్పూర్తి, పలకబలపం

తాన శర్మ: ఏవుంది.. సాహిత్యం బ్లాగులు

చినమయ్య: సరే ఇవి చూడండి సాములు - హరిసేవ, నరసింహ, దైవలీలలు

తందాన శాస్త్రి: ఆపు ఆపు.. ఇవి భక్తి బ్లాగులు

లంబు: కలగూర గంప, పర్ణశాల, గడ్డిపూలు...

తాన శర్మ: సర్లేవోయ్ ఇవన్నీ అనుభవాల బ్లాగులు

జంబు: ఇంకా వున్నాయి సాములూ

తాన, తందాన: మాకు తెలుసులేవయ్యా ఇంకా వంటకాల బ్లాగులు, పురాణాల బ్లాగులు, సంగీతాల బ్లాగులు వున్నాయి..!! అసలైనది ఏది కనపడదే?

లంబు జంబు
: ఓ తెలిసింది తెలిసింది

తాన, తందాన
: ఏమిటి తెలిసింది?

లంబు జంబు:
బూతు బ్లాగులు...! బూతు బ్లాగులు..!!

తాన, తందాన: శివ శివ శివ శివా.. అలాంటి లేకపోవటమే కదా తెలుగు బ్లాగుల ప్రత్యేకత

లంబు జంబు
: మరింకేం కావాలి సాములూ ??

తాన, తందాన:
బ్లాగులు చదివేవాళ్ళు.. పాఠకులయ్యా చిన్నమయ్యా.... పాఠకులు, వ్యాఖ్యలు లేకపోతే మా ప్రభువులు ఒక్క టపా అయినా వ్రాయరు తెలిసిందా..!!

(సరదా వూహ రాగానే వ్రాసేశాను... ఇందులో వున్న బ్లాగులు అప్పడు గుర్తుకువచ్చినవి మాత్రమే... వేరే ఏ ప్రాధాన్యతలు లేవు )

ఫో...ఇక్కడ్నుంచి..!!

"లే.. ముందు లే ఇక్కడ్నుంచి... ఫో అవతలికి... ఫో.. ఇక్కడుంటానికి వీల్లేదు.." కానిష్టేబుల్ రాముడు అరుస్తున్నాడు ఆ ముసలామెను.

"అయ్య.. రోగమొచ్చినదయ్య.. నాలుగు రూపాయలు రాగానే పోతాను.. పది నిముషాలు బాబు...!"

"ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా బుద్దిరాదు.. ఎస్సైగారు వచ్చి నాలుగు తగిలిస్తేగాని కదలవు.." అంటూనే తన కుర్చీలో కూర్చున్నాడు.

రెండురోజులుగా ఇదే వరస. ముక్కోటి ఏకాదశికని స్పెషల్ డ్యూటీ మీద అమరావతి గుడి దగ్గర చిన్న టెంట్ వేసి పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసారు. పెద్దగా జనంలేరు. పెద్దగా పని కూడా లేదు. అడపదడప మా పాప తప్పిపోయిందనో, పర్సు పోయిందనో వస్తున్నారు. ఎక్కువమంది వచ్చేది మాత్రం గుంటూరు బస్సు ఎప్పుడుందో కనుక్కోవడానికి.

రాముడు మాత్రం ప్రతి అరగంటకి లేచి ఎదురుగా కూర్చుని అడుక్కుంటున్న ముసలమ్మను అరుస్తూనే వున్నాడు. కేకలు వేసినంతసేపు వేసి, ఎస్సైగారు వస్తేగాని నీకు బుద్ధిరాదు అంటూ కూలబడుతున్నాడు. ముసలిదానికి నాలుగురూపాయలు రావటంలేదు.. అది అక్కడ్నించి కదలటంలేదు.

"ఫో.. లే ఇందాకట్నుండి చెప్తున్నానా... ఏం వినపడలేదా.. లే ఇక్కడ్నుంచి" మళ్ళీ అరిచాడు.

"అయ్యగారు.. అయ్యగారూ.." ముసల్ది.

"నోరు మూసుకొనిలే.. ఈ కర్రతో ఒక్కటిచ్చానా..!!" కర్ర పైకెత్తాడు.

"బాబుగారు.. బాబుగారు.. నీ కాళ్ళకు దణ్ణాం పెడతా... పోనీ అయ్యా ముసల్దాన్ని.."

"ఛీ ఛీ.. చెప్తే వినే రకమైతేగా.." మళ్ళీ యధాస్థానం. హెడ్‌కానిష్టేబుల్ విశ్వనాధం ఇదంత గమనిస్తూనే వున్నాడు.

***

మర్నాడు -

"మళ్ళీ దాపురించావూ..? నా ఖర్మ.. లే ఇక్కడ్నుంచి. ఈ రోజు వదలను నిన్ను. లే.. ఫో ఇక్కడ్నుంచి. ఇక్కడ అడుక్కోకూడదు.. బయటకిపో ఆ చివర్న కూర్చో ఫో..!!"

"అయ్యా అయ్యా.. ఆడ సానామంది వుండారు బాబుగారు.. ఈడుంటే నాలుగు డబ్బులైనా వస్తాయి... మందులు కొనుక్కోవాలయ్యా.."

"సెత్.. నీ యవ్వ... నీ తలకాయ పగలగొడితేగాని.." మళ్ళీ లాఠీ ఎత్తాడు.

"బాబుగారు.. కొట్టమాకండయ్యా.. ఈయాలొక్కరోజేనయ్యా.. రేపుటాలనుంచి ఈడ కూకోను బాబు.."

"సరే ఛావు ఈ రోజుకి.." విసురుగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.

విశ్వనాధం రాముడి భుజమ్మీద చెయ్యేసి అడిగాడు -

"ఏంట్రా రాముడు... ఎప్పుడూలేంది నీక్కూడా కోపం వస్తోందే..?? ఆ ముసల్దానితో మనకెందుకురా.. వచ్చిన డ్యూటీ చూసుకోక..?"

"మీకు తెలియదండి.. అది కొవ్వు పట్టి ఛస్తోంది.. మూడు రోజులబట్టీ చూస్తున్నారుగా..? ఒక్కసారైనా లేపగలిగానా..అని"

విశ్వనాధం మరి మాట్లాడలేదు.

***

మర్నాడు డ్యూటీకి బయల్దేరిన విశ్వనాధానికి నైట్ డ్యూటీ చెయ్యాల్సిన వీరన్న కనిపించాడు.

"మీతోపాటు ఈ రోజు నేనొస్తున్నాను విశ్వనాధం మాష్టారు.." వీరన్న అన్నాడు.

"అదేమిటి రాముడు రాలేదా.."

"మీకు తెలియదా వాడు రిజైన్ చేశాడు.."విశ్వనాధం అదిరిపడ్డాడు.

"ఏమిటి రిజైనా.. ఎప్పుడు..? అసలెందుకు..??"

"ఏమో మరి.. మొన్న అడ్జెస్ట్మెంట్లో నాకు బదులు నైట్ ద్యూటీకి వెళ్ళాడు. పొద్దున వస్తూనే ఎస్సైగారిని కలిసి వుద్యోగం వదిలేస్తున్నానని చెప్పాడు"

"అదే ఎందుకని..??"

"ఏమో మాష్టరు.. నేనూ అడిగాను.. మనసు చంపుకొని పోలీసుద్యోగం చెయ్యలేడట.. పోలీసుల్లో మనసున్నవాళ్ళు పనికి రారట.."

విశ్వనాధం ఆలోచనలో పడ్డాడు."ఆ రోజు రాత్రి ఏమైనా జరిగిందా..?"

"ఆ ఏముంది మాష్టరు.. ఎవరో ముసల్ది చచ్చిపోయింది.. మనవాడికి శవ జాగారం.. పంచనామ.. మనోడికి కొత్తనుకుంట.. భయపడుంటాడనే అనుకుటున్నారు అంతా..!!"

విశ్వనాధం గుండె కలుక్కు మంది. ఇద్దరూ కలిసి డ్యూటీ చేసిన రోజు జరిగినది గుర్తొచ్చింది. ఆ రోజు ఇద్దరూ కలిసి డ్యూటీ అయిపోయాక గుంటూరు బయలుదేరారు. దారిలో అడిగాడు విశ్వనాధం -

"రేయ్ రాముడు.. నిజం చెప్పరా.. ఆ ముసల్దాన్ని ఎందుకక్కడ అడుక్కోనివ్వడం లేదు..??""ఎందుకేంటి అక్కడ అడుక్కోకూడదు..."

"రేయ్ రూల్స్ గురించి నాకు చెప్పకు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. సైకిల్‌మీద పొయ్యేవాడివికూడా ఆగి బిక్షగాళ్ళకి డబ్బులు వేయటం నేను చూశాను. అట్లాంటిది ఆ ముసల్దాన్నెందుకు అట్లా తరిమావు..?"

రాముడు రెండు నిముషాలు మాట్లాడలేదు. గట్టిగా నిట్టూర్చాడు. ఉన్నట్టుండి అన్నాడు -

"అది.. ఆ ముసల్ది నన్ను డ్యూటీ చేసుకోనివ్వటంలేదు సార్.. అది అంత బాధగా మూల్గుతూ.. దయనీయంగా అయ్యా అయ్యా అంటూ అడుక్కుంటుంటే.. నా గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు వుండేది. ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడైనా దానికి డబ్బులేశాడా..? అన్నం తినలేదయ్యా అంటుంటే హేళనగా చూస్తున్నారు. అది పొద్దుననుంచి మన కళ్ళముందే పడి వున్నా, తిండి కూడా తినలేదని తెలిసినా.. అది చస్తుందని తెలిసినా నేను ఏమి చెయ్యలేను. పోలీసులే ఇలా అడుక్కునేవాళ్ళని ప్రోత్సహిస్తున్నారని అంటారు. పైగా నేను జాలి తలిస్తే అది ఇంక అక్కడే కూర్చుంటుంది.. నా బాధని ఎక్కువ చేస్తూ..!! అది అమ్మ అయ్యా అంటుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది.. ఎంత తరిమినా పోదు.. నేను కొట్టలేను..ఏం చెయ్యాలి సార్..??" అంటుంటే రాముడు కాళ్ళలో నీళ్ళు కారుతున్నాయి.

విశ్వనాధం ఆశ్చర్యంగా అతని వైపు చూసాడు.

"ఇంత సెంటిమెంటల్‌గా వుంటే ఎలారా.. పోలీసు వుద్యోగానికి ఇలాంటివి పనికిరావు.."

"పోతే పోనీయండి సార్..!! మనసు చంపుకోని ఎవరు చేస్తారు వుద్యోగం" అన్నాడు రాముడు.

***

విశ్వనాధం బాధగా నవ్వాడు.

"పోలీసుల్లో మనసున్నవాళ్ళు లేక కాదురా.. నీలాగ మనసు కోసం, విలువలకోసం బ్రతుకుతెరువుని వదల్లేక" అనుకుంటూ అమరావతి బస్సెక్కాడు విశ్వనాధం.

(2001)

గూడు బోసిపోతే.. గుండె మూగవోదా..??

"ఒంటరితనంలో వున్న కష్టమొక్కటే - తోడులేదు అన్న సంగతి గుర్తుకురావటం"

సుబ్బరాజుగారికి నిద్రలేస్తూనే పేపరందుకొని అందులో "నేటి మాట" చదవటం అలవాటు. అది చదవగానే చిన్న చిరునవ్వు మెరిసింది - బాగుందని కాదు - తనకెంతో తెలిసిన విషయం లాగుండటం వల్ల. లేచి తయారయ్యి అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో కిందకి దిగి, పాలపేకెట్ కొనడానికి బయలుదేరాడు.

"మీకెందుకు సార్ శ్రమ, రోజు మా కుర్రాడు తెచ్చి ఇస్తాడు కదా.. ఒక అర్థరూపాయేగా ఎక్కువ" అన్నాడు పాలబూత్ రమేష్.

"భలేవాడివే..! నేనొచ్చేది పాలపాకెట్ కోసం కాదయ్యా..!! నడవటంకోసం… కొంత కాలక్షేపం కోసం" అంటూ సుబ్బరాజుగారు అక్కడే వున్న చిన్న బల్లపైన కూలబడ్డారు. అక్కడ ఆయన్ని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, ఒకరిద్దరు పెద్దవాళ్ళు తరచుగా చూడటంవల్లేమో చిన్న చిరునవ్వు నవ్వుతారు. రాజుగారు నవ్వుతారు.. అంతే..!! ఆ ప్రాంతానికి వాళ్ళొచ్చి రెండేళ్ళు కావస్తోంది. వూరి మధ్యలో వున్న లంకంత సొంత ఇంటిని అమ్మి, కొంత విదేశాలకి వెళ్ళేందుకు వాడుకోని మిగిలిన దానితో వూరి బయట వున్న ఈ అపార్ట్మెంటులో ఒక ఫ్లాటు కొన్నారు. పాతింటి దగ్గరయితే గడ్డం బాబాయిగారు, కవిగారు, కానిస్టేబులు సత్యం, బండి మహబూబు అంతా తెలిసిన వాళ్ళే. ఇక్కడెవరున్నారు..??

సుబ్బరాజుగారు కళ్ళజోడు సర్దుకుంటూ వచ్చే పోయేవాళ్ళను తెరిపారా చూస్తున్నారు. కొంతమంది పట్టించుకోవటంలేదు.. కొంతమంది చిరాగ్గా చూస్తున్నారు.. కొంతమంది పలకరిస్తున్నారు. నైట్‌డ్రస్సులో వచ్చిన ఒక అమ్మాయి చంకనెక్కి వుందో చిన్న పిల్ల. సుబ్బరాజుగారు "చీ చీ.." అన్నారు పలకరింపుగా. ఆ అమ్మాయి ఏడుపుముఖం పెట్టింది.

"అయ్యో తాతమ్మా తాత... తాతకి హలో చెప్పు.. షేకాండివ్వు" వాళ్ళమ్మ చెప్పింది.

పసిపాప భయం భయంగా చెయ్యిచాచింది. సుబ్బరాజుగారు చెయ్యి పట్టుకొని చిన్నగా వూపాడు.

"తాత" అనిందా పాప.

"తన మనవరాలు ఏం చేస్తోందో…" అనుకున్నాడాయన. మొన్న ఇంటర్నెట్లో కెమరా పెట్టి చూపించారు.. బాగా మాటలు నేర్చింది. తాతా నాకు సైకిల్ కావాలి అని అడిగింది.

"చిన్న పిల్లల సైకిళ్ళెక్కడ దొరుకుతాయి రమేషూ…?" అడిగాడాయన.

"ఇక్కడ ఎక్కడున్నాయి సార్... ట్రంకు రోడ్లో వున్నాయి షాపులు, లేకపోతే గాంధిబొమ్మ సెంటర్… అయినా ఎవరికి సార్… మీ మనమళ్ళు అంతా అమెరికాలో వున్నారన్నారు"

"అమెరికా కాదయ్యా పెద్దవాడు ఇంగ్లాండు… రెండోవాడు దుబాయి… అయితే మాత్రం అక్కడే వుంటారా ఏం? వచ్చినప్పుడే కొనిద్దామని… సరే నే వస్తా... మా టీచరుగారికి కాలేజీ టైమైందంటే నన్ను చంపేస్తుంది." అంటూనే లేచి ఇంటికి బయలుదేరాడు.

ఎపార్ట్మెంట్ దగ్గరకి చేరాడో లేదో శారదమ్మ పరుగున ఎదురొచ్చింది.

"ఏంటి టీచరుగారు... పాలపేకెట్ తెచ్చేలోపలే తొందరైపోయిందా మీకు..."

"కాదండి… పెద్దాడు ఫోన్ చేసాడు..."

"అరె రే… ఎన్నిసార్లు చెప్పాను వాడికి కొంచెం ఆలస్యంగా చెయ్యరా అని... నేను మాట్లాడే వాడిని కదా…"

"మాట్లాడుదురుగానీలెండి... తీరిగ్గా మాట్లాడురు... వాళ్ళు వస్తున్నారు... వచ్చే నెల నా రిటైరుమెంట్‌కి..."

"వీడేమిటి ఏ విషయం నాకు చెప్పనే చెప్పడు… నేనడిగితే కుదరదు సెలవల్లేవన్నాడు…?"

"సర్లేండి… ఇప్పుడేమంటారు… రావద్దంటారేమిటి వాణ్ణి..? ఎదో సర్దుబాటు చేసుకొని వుంటాడు..." ఇద్దరూ లిఫ్ట్‌లో ఎక్కారు.

"ఇంకా ఏమి చెప్పాడు..?"

"ఇంకేముంది... అదే వస్తున్నామని…"

"అది కాకుండా ఇంకేమీ మాట్లాడలేదా..."

"ఆ... మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నాడు…"

"నా గురించి కాదులేవే... కోడలు, మనమడు... వాళ్ళ సంగతి"

"అంతా బాగున్నారు… కోడలితో కూడా మాట్లాడాను… మొన్న అనంతపద్మనాభ చతుర్దశికి పూజకూడా చేసుకుందట…"

"సరిపోయింది... ఇదా మీరు మాట్లాడుకుంది..." ఇంట్లోకి అడుగుపెడుతూనే పాల పేకెట్ ఆమె చేతిలో పెట్టి పేపరు పట్టుకొని కూర్చున్నాడాయన. ఆమె కాఫీ పెట్టి తీసుకువచ్చి ఆయన చేతికిచ్చింది.

"షుగర్ ఫ్రీ వేసావా…??"

"అరె రే మర్చిపోయి పంచదార వేసానండి…"

"చిన్నాడు అన్ని డబ్బాలు కొని ఇంట్లో పెట్టి వెళ్ళాడు… నా కోసం కాకపోయిన వాడికోసమన్నా వెయ్యచ్చు కదా….!!"

"అబ్బో నాకు తెలియదా చిన్నాడి మీద మీ ప్రేమ... ఇటివ్వండి నేను తాగుతాను, మీకు వేరే చేసుకొస్తా…"

"సరేలే రేపట్నించి వెయ్యి… అవును నేను ఎంత రమ్మన్నా రాని వాడు… నువ్వు పిలిస్తే ఎలా వస్తానన్నాడు..?"

"ఎవడు పెద్దాడా... అదే టీచరుగారి తెలివి. చిన్నాడు వస్తున్నాడు అందరం ఒకసారి కలిసినట్టుంటుంది అని చెప్పా.."

"చిన్నాడు రానన్నాడు కదే..."

"మీరున్నదెందుకు... ఇప్పుడు పెద్దాడు వస్తున్నాడు… నువ్వు కూడారా అని చెప్పండి మీ ముద్దుల కొడుక్కి.."

"వస్తాడంటావా..?"

"రావాలి… మనకి ఇక ముందు ఇంత మంచి అవకాశం రాదు... ఇద్దరూ వస్తేనే మనం అనుకున్నది కుదురుతుంది…"

"అవును నిజమే... నేను మాట్లాడతాను…"

శారదమ్మ కాఫీ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బరాజుగారు కళ్ళజోడు సర్దుకొని పేపర్లో మునిగిపోయాడు.

***

చిన్నాడు వస్తానన్నాడు. ఇంక ఆ ఇద్దరి హడావిడి మొదలైంది. అందరు ఒక్కసారి కలిసి దాదాపు ఐదేళ్ళైంది... చిన్నాడి పెళ్ళిలో.

"టిచరుగారూ..!! వాళ్ళు వచ్చాక ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో మెనూ తయారు చెయ్యండి. ఆ సరుకుల లిస్టేదో నాకిస్తే ఆ ఏర్పాట్లు చేస్తా.."

"అన్నట్టు గులాబ్‌జామూన్ రాసావా… అనిరుధ్‌కి అవంటే చాలా ఇష్టం."

"ఒక రోజు గడ్డం బాబాయిగారిని, పిన్నిగారిని పిలుద్దామండి. ఆప్యాయత కలిగిన మనుషులు.. మన పిల్లలు సగం వాళ్ళింట్లోనే పెరిగారు.. వాళ్ళని చూస్తే సంతోష పడతారు.."

"మూడు చెక్రాల సైకిలు కొనాలే… చిట్టితల్లి కావాలని అడిగింది.."

"అంతా సిద్దమైనట్లేగా... మనిల్లు సరిపోకపోతే పక్కింటి వాళ్ళని అడుగుదామా..?"

"మీరు మరీనూ..! సరిపోక ఏమండి.. ఎపార్ట్‌మెంట్ అన్నాక అంతే..! సర్దుకుపోవాలి..!! మన పాతిల్లైతే బాగుండేది.."

ఇదే హడావిడి.. ఇద్దరూ వయసు మర్చిపోయి ఆడపిల్ల పెళ్ళికి ఏర్పాట్లు చేసినట్లు చేస్తున్నారు.

***

"మన కానిస్టేబుల్ సత్యం లేడు నిన్న సాయంత్రం కాలం చేసాడటనే…"

"అయ్యో పాపం.. కొడుకెక్కడున్నాడో.."

"ఇంకెక్కడ.. ఆస్ట్రేలియాలోనే.. వస్తాడేమో చూడాలి.."

"సరే.. సత్యం రాతెట్లుందో... పదండి నేను ఆవిడని పలకరించి అట్నించే కాలేజికి పోతాను.. మీ సంగతి..?"

"నేను అక్కడే వుంటానే.. పాపం నలుగురులో కలిసిపోయే మనిషి. నా కన్నా చిన్నవాడే.."

***

ఆ ఇంటికి సంక్రాంతి రెండు నెలలు ముందే వచ్చినట్లుంది. పది మంది జనం ఆ ఇరుకింటిలో అందంగా కలిసిపోయారు. పిల్లల ఆటపాటలతో పెద్దవాళ్ళిద్దరికీ పొద్దే తెలియటంలేదు. సుబ్బరాజుగారు ఒక్కొక్కటే తను కొన్న బహుమతుల్ని తీసి పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళంతా "సర్‌ప్రైస్, సర్‌ప్రైస్" అని అరుస్తున్నారు.

"ఏంటమ్మా... నాన్న మాకేమి సర్‌ప్రైస్ ఇవ్వట్లేదా..??" అడిగాడు చిన్నాడు.

"ఇస్తార్రా... మీరు వస్తున్నారని తెలియగానే అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు.. సరే కూరేమి చెయ్యమంటావు.. కాకరకాయ వేపుడు చెయ్యనా.. నీకిష్టం కదా"

"వేపుడొత్తయ్యా ఆయనని నూనె తగ్గించమన్నారు డాక్టర్లు.. అయినా ఆయనకి మీరు చేసే వేపుడు కన్నా నేను చేసే ఇగురంటేనే ఇష్టం" అన్నది కోడలు. శారదమ్మ కొడుకు వైపు చూసింది. అతను ఏమి మాట్లాడలేదు. కాకరకాయలు కోడలి చేతిలో పెట్టి తనూ కొడుకు దగ్గరే కూర్చుంది.

"ఇద్దరం రిటైరయ్యాము... మీరు ఏమి ప్లాన్ చేసారు" అడిగిందామె ఉండబట్టలేక.

"ప్లానేముంది అమ్మా..." అన్నాడే కాని తర్వాత ఏమనలేదు. పెద్దాడు అందుకున్నాదు.

"మాతో వచ్చి వుంటామంటే రండి. కాకపోతే అక్కడ మీరు సర్దుకోగలరా అనేది మీరే ఆలోచించుకోండి. కాలక్షేపం వుండదు.. భాష, వాతావరణం అంతా కొత్తగా వుంటుంది. ఇంక మీకు మీ కోడలికి మధ్య ఏదైనా ఇబ్బందులు వస్తే అదొక తల నొప్పి.. కోడల్లేని అత్త గుణవంతురాలని ఎంత దూరంగా వుంటే అంత మంచిదేమో. మీరే ఆలోచించుకోడి." పెద్దాడు చెప్పాడు.

చిన్నవాడు గట్టిగా నిట్టూర్చి అన్నాడు -

"మేము మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావటం అంత సాధ్య పడక పోవచ్చు. పేరుకి ఫారిన్ వుద్యోగాలేకాని మేము దాచిపెట్టేది చాలా తక్కువ. ఆ కాస్తా ఇలా ఫ్లైటు టికెట్లకి దండగ చెయ్యడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ సారి వెళ్ళేటప్పుడు ఈ ఇంటిని కూడా బేరం పెట్టమని ఒక ఏజెంటుకి చెప్పాం. ఆ డబ్బేదో బ్యాంకులో వేసుకోండి. హాయిగా ఇక్కడే వుండండి"

"కాదు మాతోనే వస్తామన్నా ఓకే…! మీకు తెలుసుగా.. ఏదీ బలవంతం లేడు.. ఎట్లాగైనా అభ్యంతరమూ లేదు.. ఛాయిస్సు మీదే" అన్నాడు పెద్దాడు.

నిజంగా చాయిస్సు ఇచ్చాడా అని అనుమానం వచ్చింది శారదమ్మకు. పైకిమాత్రం ఏమి అనలేక వూరుకుంది. సుబ్బరాజుగారు పెద్దాడి పక్కగా వెళ్ళి రిమోట్ తీసుకొని టీవీ మ్యూట్‌లో పెట్టారు.

"మీరు చెప్పేది బాగానే వుందిరా.. మీరన్నట్టు అక్కడొచ్చి వుండలేము. ఇక్కడ మీరు లేకుండా కష్టమే.. పైగా పాతింట్లో అయితే చుట్టూ పదిమంది తెలిసినవాళ్ళు వుండేవారు.. ఆలోచిద్దాం.. అన్నట్టు పాతిల్లంటే గుర్తొచ్చింది.. మన సత్యంలేడు.. కానిస్టేబుల్ సత్యం.."

"ఆ ఆ పాపిన్స్ అంకుల్ అనేవాడిని.." చిన్నాడన్నాడు

"ఆ ఆయనే మొన్న పోయాడ్రా పాపం.."

"అరె రే... మంచివాడు." పెద్దాడన్నాడు. ఆ తరువాత వాళ్ళ చర్చ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది.

***

ఆ రోజు శారదమ్మగారి రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. కాలేజి విద్యార్థులు, హితులు, బంధువులు చాలా మందే వచ్చారు. "దీని కోసం అంతంత ఖర్చు పెట్టుకొని రావాలా" అని పెద్ద కోడలు అన్న మాట వినపడలేదు కాబట్టి శారదమ్మ చాలా సంతోషపడింది. ఆ రాత్రి ఇల్లు చేరేసరికి పదకొండైయ్యింది. మర్నాడే చిన్నాడు వెళ్ళిపోతున్నాడని అందరూ రెండు గంటలదాకా కబుర్లు చెప్పుకొని పడుకున్నారు.

మర్నాడు ఆ ఇంట్లో పిడుగు పడ్డట్టైంది..!!

పెద్దవాళ్ళిద్దరూ లేవట్లేదని ఉన్నట్టుండి చిన్నాడు అరిచాడు.. ఇద్దరూ మంచమ్మీడ పడుకున్నట్లే పోయారు. పెద్దకొడుకు పరుగున అక్కడికి వెళ్ళాడు. కోడళ్ళు - "ఇప్పుడు ప్రయాణాలు కాన్సిల్ చెయ్యాలి కామోసు" అని సణిగారు. మనమళ్ళు, మనమరాలు గట్టిగా ఏడ్చారు.

చిన్నాడు మరో బాంబు పేల్చాడు - "ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.."

పెద్దబ్బాయికి వాళ్ళు చివరిగా రాసిన వుత్తరం దొరికింది. గట్టిగా చదివాడు -

"పిల్లలూ,

అవును ఆత్మహత్యే చేసుకున్నాం.

మీదగ్గరికి రావాలా ఇక్కడే వుండాలా అని ఆలోచించే అవసరం మాకు లేకుండా పోయింది. అందులో చాయిస్సులేదని మాకు అర్థమైయ్యింది. మీ దగ్గరకి వచ్చి వుండాలన్న ఆలోచన మాకెప్పుడూ లేదు. ఇక ఇక్కడే వుండటమంటారా.. మీరెవ్వరూ లేకుండా కొంచం కష్టమే. మళ్ళీ మళ్ళీ రావడం సాధ్యపడక పోవచ్చు అని మీరే అంటున్నారు. ఎదురు చూస్తూ బ్రతకటం ఇంకా కష్టం.

కానీ ఇవేవి మేము చనిపోవటానికి కారణం కాదు. మేము ఇలా చనిపోవాలని చాలా రోజులక్రితమే అనుకున్నాము.. స్థిరంగా నిర్ణయించుకుంది ఎప్పుడో తెలుసా.. మీరంతా వస్తారని తెలిసినప్పుడు.

కానిస్టేబుల్ సత్యం గురించి మీకో విషయం చెప్పలేదు. వాణ్ణి కరెంటు పెట్టి దహనం చేసారు. వాళ్ళబ్బాయి ఆస్ట్రేలియా నించి టైముకి రాలేదు. ఇదొక చాదస్తమని మీకనిపించవచ్చు, కాని ఎక్కడ బ్రతకాలనే కాదు, ఎక్కడ చావాలనేది కూడా ఒక ఛాయిస్సే.. మాకు మా పిల్లందరు వుండగా వాళ్ళ సంతోషం చూస్తూ పోవాలని ఆశ. మా కొడుకులే మాకు అంత్యక్రియలు చెయ్యాలని కోరిక. అదే ఇప్పుడు తీర్చుకుంటున్నాం. మీకిది ఏదో పిచ్చితనంగా కనిపించవచ్చు. కొంచం అలాంటిదే.. అర్థమైతే ఆలోచించండి..

- అమ్మ నాన్న.”