చిరాకు రామనాథం (కథ)


"రామనాథం గారు పోయారట" అమ్మ చెప్పింది. నేనేమి పలకపోవడంతో మళ్ళీ తనే అంది - "మీ నాన్నగారు ఆయన మంచి స్నేహితులు, వూర్లోనే వున్నావు కదా పోనీ ఒకసారి వెళ్ళి చూసిరారాదూ"



"సరే వెళ్తాలే" అన్నాను చదువుతున్న పేపరు పక్కన పెట్టి.


నాన్న బతికున్నప్పుడు కూడా రామనాథంగారి గురించి చాలా సార్లు చెప్పేవాడు. ఆయన తరచుగా స్నేహితులతో చుట్టపక్కాలతో గొడవపడే విషయాలే ఎక్కువగా చెప్పినట్లు గుర్తు. రామనాధంగారికి మా నాన్న తప్ప ఇంకెవరూ స్నేహితులు లేరనీ కూడా చెప్పారు. నాన్న ఎలాగూ లేరు కాబట్టి ఆయన తరఫున కనీసం నేనైనా వెళ్ళి చూసి రావాలని అమ్మ ఆలోచన.


***


నేను అక్కడికి వెళ్ళేసరికి అట్టే జనం కూడా లేరు. ఒక మనిషి పోతే కనీసం పది మందైనా రాకపోతే ఇంక ఆయన బ్రతికి ఏం సాధిచినట్లు అనుకున్నాను. నన్ను కనీసం గుర్తుపట్టి పలకరించేవాళ్ళు కూడా లేరక్కడ. సాంప్రదాయబద్ధంగా శవాన్ని పడుకోబెట్టి, దండలూ అవీ వేసున్నారు. తల దగ్గర దీపం పక్కనే వాళ్ళ అబ్బాయి అనుకుంటా కూర్చోనున్నాడు. గడప అవతలగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో రామనాధంగారి భార్య కూర్చోని చెంగు నోటికి అడ్డం పెట్టుకోని చిన్నగా ఏడుస్తోంది.


నేను శవం దగ్గరగా వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. పల్చటి మనిషి, చామనఛాయ, తల మీద ఎక్కువగా వెంట్రుకలు లేవు, చిరాకుగా వున్నట్టు వుంది ముఖం. కొందరి ముఖాలంతే... ప్రతిదానికి చిరాకు పడుతున్నట్టు వుంటాయి. అలాంటి మనిషి అందరితో గొడవలు పెట్టుకున్నాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు అనుకున్నాను. అక్కడినుంచి రెండడుగులు వెనక్కి వేసి వాళ్ళ అబ్బాయిని పలకరించాలా లేదా అని ఆలోచించాను. అంతలో అతనే గుర్తుపట్టాడు -


"భీమేశ్వర్రావు గారి అబ్బాయా మీరు..?" అడిగాడు అనుమానంగా.


"అవునండీ.." అన్నాను ఇంకేం చెప్పాలో తెలియక.


"నాన్నకి మీ నాన్నగారు ఒక్కళ్ళే మంచి స్నేహితుడు... ఎప్పుడూ ఆయన్నే తల్చుకుంటుండేవారు.." అన్నాడు బాధగా.


"బాధ పడకండి.. మళ్ళీ స్నేహితులు కలుసుకోని వుంటారు" అన్నాను పైకి చూపించి. అతను చిన్నగా నవ్వాడు.


"ఇంకెవరైనా రావాలా?" అడిగాను ఏదో ఒకటి అడగాలి కాబట్టి.


"అన్నయ్య నాగ్పూర్ నుంచి బయల్దేరాడు. ఇంకొంచెం సేపట్లో రావాలి. నేను బాంబేలో వుంటాను. నాన్నకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి నిన్నే వచ్చాను" చెప్పాడతను.


"సరే" అంటూ మళ్ళీ రామనాధంగారికి చేతులు జోడించి బయల్దేరాను.


ఆ వీధి చివర ఒక చిన్న పాకలో టీ కొట్టు చూసి అక్కడ ఆగి టీ చెప్పాను. అప్పటికే అక్కడ నలుగురైదుగురు కూర్చోని మాట్లాడుకుంటున్నారు.


"ఎవరో పోయారట" అడిగాడు అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న బట్టతలాయన.


"అదే మన చిరాకు రామనాథం లేడూ.. రామనాధం.." ఒకాయన అన్నాడు వెటకారంగా.


"హమ్మయ్య.. పోయాడా? ఇంక మనకు రోజు ఆ పిచ్చోడితో గొడవలు తప్పినట్లే.." అన్నాడా మొదటి వ్యక్తి నవ్వుతూ.


"మరే లేకపోతే ఈ పాటికి ఇంత ప్రశాతంగా వుండేదా? ఎవరిమీదో అరుస్తూ గోల చేస్తుందేవాడు కాదూ" ఇంకెవరో గట్టిగా నవ్వారు.


చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడుకోవడం తప్పుగాను, ఇబ్బందిగాను అనిపించింది నాకు.


"ఎందుకండీ చనిపోయినవాళ్ళ గురించి అట్లా మాట్లాడతారు" అన్నాను నేను కల్పించుకోని.


"మీరెవరు? ఆయన బంధువా?" ఆడిగారు.


"లేదండి.. తెలిసినాయన. చూడానికి వచ్చాను" చెప్పాను టీ అందుకుంటూ.


"తెలిసినాయనా? ఆయన గురించి పూర్తిగా తెలియదనుకుంటా... లేకపోతే మీరు ఇలా మాట్లాడరు"


"ఏమైనా చనిపోయిన తరువాత ఎవరినీ అలా కించపరిచేలా మాట్లాడకూడదు" అన్నాను నేను. అక్కడ వున్నవాళ్ళందరూ ముఖముఖాలు చూసుకున్నారు.


"ఆయన మమ్మల్ని పెట్టిన ఇబ్బందుల గురించి వింటే మీరుకూడా మాలాగే అదే మాటంటారు... ఈ వీధిలో వున్నవాళ్ళందరితో గొడవపడందే రోజు గడవదు ఆయనకి తెలుసా" చెప్పాడు మధ్యలో కూర్చున్న వ్యక్తి.






ఈ వ్యవహారం ఏదో కొత్తగా వుంది నాకు. నాన్న చెప్పినంతలో రామనాధంగారి గురించి ఇంత చెడుగా ఎప్పుడూ చెప్పలేదు. ఏవో ఆదర్శాలు, నియమాలు అంటూ చాలా మందితో గొడవలు పడేవారని నాన్న చెప్పినా, అతనంటే పడనివాళ్ళు ఇంతమంది వున్నారా అని ఆశ్చర్యం కలిగింది. అసలు అదేమిటో తెలుసుకోవాలని వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను.


"ఏం చేసేవాడు?" అడిగాను.


" ఏం చేసేవాడా? ప్రతి దానికి చిరచిరలాడుతుంటాడు... అందుకే చిరాకు రామనాథం అని పేరు పెట్టారు మా వీధి కుర్రాళ్ళు. ఆయనకి అదో రకమైన పిచ్చి.. అన్నీ రూల్ ప్రకారమే జరగాలంటాడు.. సిగ్నల్ పడ్డ తరువాతే బండి కదలాలంటాడు.. రోడ్డుకి ఎడమ వైపే నడవాలంటాడు.. అదేంటి.. ఆ.. జీబ్రా క్రాసింగ్.. అక్కడే రోడ్డు దాటాలంటాడు.. ఎవరైనా అట్లా చెయ్యకపోతే మనిషికి ఎంత చిరాకో చెప్పలేము.." చెప్పాడు నా కుడివైపున్న వ్యక్తి.


"అందులో తప్పేముంది?"


"మీకు అలాగే అనిపిస్తుంది... అక్కడికి మేమేమీ రూల్స్కి విరుద్ధంగా నడుచుకుంటామని కాదు.. కానీ ఈ ట్రాఫిక్లో అవన్నీ ఎక్కడ సాధ్యమౌతాయి చెప్పండి... "


"అయితే"


"అయితే ఏమిటి.. ఆ రామనాధం వీధి వెంట పోతుంటే ఎవరో టర్నింగ్ తిరుగుతూ చెయ్యి చూపించలేదనో, రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నాడనో పట్టుకునేవాడు.. ఇహ వాళ్ళతో వాదన... రూల్స్ ఒప్ప జెప్పడం, సెక్షన్లు చెప్పి నువ్వు చేస్తున్న పనికి ఇంత జరిమానా వుందని ఒకటే గొడవ.." చెప్పాడు మరొకాయన.


"డబ్బులు తీసుకునేవాడా?" అడిగాను.


"తీసుకోని వదిలేసినా బాగుండు... ఇచ్చినా తీసుకునేవాడు కాదు.. పైగా లంచం ఇస్తావా అని మరో గొడవ చేసేవాడు..."


"మరి?"


"ఎవరైనా ట్రాఫిక్రూల్ తప్పితే బలవంతంగా పోలీసు దగ్గరకి తీసుకెళ్ళి చెలాన వ్రాయమనేవాడు..." అంటూ అతను పక్కనే వున్న ట్రాఫిక్కానిస్టేబుల్ని చూపించాడు. అతను తల నిలువుగా వూపుతూ అన్నాడు


"అమ్మో.. అతను వీధిలో నడుస్తుంటే మాకే భయం వేసేది.. ఎవడో సిగ్నల్ దాటేసి వెళ్ళాడని మమ్మల్ని పట్టుకోని వాయించేసేవాడు.. మీరు వుండి ఏం చేస్తున్నారని నిలదీసేవాడు.." అంటూ నిట్టూర్చాడు కానిస్టేబుల్.


వాళ్ళు ఎంత చెప్పినా అతను చేసినదాంట్లో నాకేమీ తప్పు కనిపించలేదు. అదే అన్నాను వాళ్ళతో.


"మీకు అలాగే అనిపిస్తుంది లెండి.. రూల్స్ మాట్లాడటం చాలా సులభం.. పాటించాలంటేనే తెలిసొస్తుంది.." చెప్పాడు బట్టతలాయన.


"ఆయన పాటించేవాడు కాదా?" అడిగాను మరింత కుతూహలంగా. సదరు రామనాధంగారి విషయాలు కొత్తగానూ, విచిత్రంగాను అనిపించసాగాయి నాకు.


"ఎందుకడుగుతారులే.. ఆయన పాటించక పోవడమా? మిన్ను విరిగి మీద పడ్డా తప్పేవాడు కాదు... అదే సమస్యంతా... ఆయన చెయ్యడు ఇంకొకళ్ళని చెయ్యనివ్వడు.. మొన్నా మధ్య సిగ్నల్ దగ్గర ఆయన బండి మీద వున్నాడు. వెనకెవరో హారన్ కొట్టాడని బండి దిగి అతనితో గొడవ పెట్టుకున్నాడు.. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది.." చెప్పాడు కానిస్టేబుల్. మరొకళ్ళు అందుకున్నారు -


"ఆ ఇంట్లో వాళ్ళు ఈయనతో ఎట్లా భరించారో గానీ.. సినిమా హాలుకి వెళ్తాడా.. ఎవరో లైన్ తప్పి వచ్చి టికెట్ తీసుకున్నాడని వాడితో గొడవ.. సినిమా అయినా వొదులుకుంటాగానీ ఇలా లైన్ తప్పి వచ్చేవాళ్ళను వదలను అంటాడు.. పిచ్చి కాకపోతే ఏమిటి?" అన్నాడు.


" ఆయనగారి రూల్స్ పిచ్చి తట్టుకోలేకే “చిరాకు రామనాధం” అనేవాళ్ళు అందరూ.. ఆయనకేమో మమ్మల్ని చూస్తే చిరాకు.. మాకు ఆయన్ని చూస్తే చిరాకు.." గట్టిగా నవ్వారు అందరూ.


"పొద్దున్నే నీళ్ళ పంపు దగ్గర గొడవ... లైన్లో రమ్మంటాడు... మొన్నామధ్య ఆ కనకయ్యని కొట్టినంత పని చేశాడు.."


"అవును... అదే కోపంతో మా ఇంట్లో కరెంట్ మీటర్ టాంపర్ చేశానని పట్టించాడు.. నా నా గడ్డి కరిచి లంచాలిచ్చి మళ్ళీ మీటర్ వేయించుకుంటే.. లంచాలెందుకు ఇచ్చావని మళ్ళీ గొడవకొచ్చాడు.." చెప్పాడు కనకయ్య. అప్పటి దాకా వింటున్న టీ కొట్టు కుర్రాడు కూడా వంత పాడాడు -


"ప్లాస్టిక్ కవర్లు వాడద్దని నా మీద ఒక రోజు గొడవ... పర్యావరణం అంటాడు... కవర్లతో ప్రమాదం అంటాడు.. మీరే చెప్పండి నేనొక్కణి వాడితే ప్రపంచం పాడై పోతుందా? నేనొక్కడ్నే మానేస్తే ఆగిపోతుందా?" అన్నాడు.


ప్రతి ఒక్కరికీ ఆయనతో గొడవలున్నాయని అర్థం అయ్యింది. అర్థం కానిదల్లా ఒక్కటే - రామనాథంగారు చెప్పినవన్నీ సబబుగానే వున్నాయి ఆ విషయాన్ని వీళ్ళెందుకు అర్థం చేసుకోవటం లేదు అని.


టీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ రామనాధంగారింటికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఆయన చిన్నబ్బాయి కనిపించాడు.






"అన్నయ్య వచ్చాడు.. బయట వున్నాడు కలిసారా?" అన్నాడు.


"కలుస్తాను" అని బయటికి వచ్చాను. బయట పురోహితుడితో మాట్లాడుతున్నాడు అతను. దాదాపు రామనాధంగారిలాగానే వున్నడు. కాకపోతే తల మీద మరి కాస్త జుట్టు వుంది. పురోహితుడు వెళ్ళిపోయాక నేను పలకరించాను.


"నమస్తే నేను భీమేశ్వర్రావు గారి అబ్బాయిని" చెప్పాను.


"ఓ.. మీరేనా.. ఇందాకా వచ్చి వెళ్ళారని చెప్పాడు తమ్ముడు..?" అంటూ ఆగిపోయాడు. “మళ్ళీ వచ్చారే?” అన్నట్లు అనిపించింది నాకు.


"ఏం లేదు.. మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది.. చివర టీ కొట్టు దగ్గర ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు.. అది విని.." చెప్పటం ఇష్టం లేక ఆగిపోయాను.


"ఏమనుకుంటున్నారు? చిరాకు రామనాధం అనా? అందరితో గొడవలు పెట్టుకునేవాడనా?" అతను అంటుంటే అతని కళ్ళలో నీరు.


నేనేమి మాట్లాడలేదు, అతని భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నొక్కాను.


"నాన్నకి రూల్స్ అంటే పిచ్చి అనుకుంటారు అందరూ... కాదు.. ఆయనకి జనం అంటే పిచ్చి... అలాంటి నియమాలు వుంటే మన అందరి జీవితాలు బాలెన్స్గా వుంటాయని చెప్పేవాడు. జీవితాంతం ఎలాంటి నియమాన్ని దాటలేదు ఆయన. ఆయనకి ఇష్టం లేని నియమాలు చాలా వున్నాయి, అయినా అవన్నీ పాటించేవాడు.. అలా పాటించని వాళ్ళంటే ఆయనకి చిరాకు, కోపం, జాలి కూడా. అందుకే అందరితో అలా గొడవలు పెట్టుకునేవాడు. ఇంటికొచ్చి ఎంతో మధన పడేవాడు. ప్రపంచం అంతా పద్ధతిగా వుండాలని కలవరించేవాడు.. అలాంటి ప్రపంచం ఇక సాధ్యంకాదని అమ్మతో చెప్పారట.. తెల్లవారేసరికి గుండె ఆగిపోయింది...." చెప్తూనే ఏడ్చాడు అతను.


నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే సరికి అతను లోపలికి వెళ్ళిపోయాడు. నాకెందుకో అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఆయన అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతుంటే అవన్నీ చూస్తూ స్తబ్దుగా వుండిపోయాను. ఎత్తుబడి జరిగిపోయింది..


"గోవిందా గోవిందా అంటూ పడమటివైపు కదలండి" చెప్పాడు పురోహితుడు. నేను అప్రయత్నంగానే కల్పించుకున్నాను.


"అటు కాదు.. రోడ్డుకి ఎడమ వైపున నడుస్తూ చివరిదాకా వెళ్ళి, అక్కడ క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటి ఇటు వెళ్ళండి" చెప్పాను.


"కానీ శ్మశానం ఇటు వుందండీ" అన్నారెవరో.


"ఆయన చెప్పినట్లే చేద్దాం" అన్నాడు రామనాధంగారి పెద్ద కొడుకు నా వైపు చూస్తూ. నేను చెప్పినట్లే అంతిమ యాత్ర మొదలైంది.


ఇప్పుడు మీరు గాని జాగర్తగా గమనిస్తే రామనాధంగారి ముఖంలో చిరాకు మచ్చుకైనా కనిపించదు..!!


 
("సురభి" తెలుగు మాస పత్రిక అక్టోబర్ సంచికలో ప్రచురితం)

ఐదు వందల రూపాయల నోటు (కథ)


"హైద్రాబాద్.. హైద్రాబాద్.." అరుస్తున్నారు బస్సు డ్రైవర్లు. ఒకప్పుడు ఎవరు ఎక్కారో లేదో సంబంధం లేకుండా వుండే ఆర్టీసీ వుద్యోగుల్లో ఇలాంటి మార్పు అనివార్యమైపోయినట్టుంది.



"హైటెక్.. నాన్స్టాప్.. రండి సార్.. వెళ్ళిపోవడమే.." గుక్క తిప్పుకోకుండా అరుస్తున్నాడు అతను. పేరుకి ఖాకీ చొక్కా వేసుకున్నా అందులో ఆరింట నాలుగు గుండీలు పెట్టుకోలేదు. లోపల బనియన్ చెమటకి తడిసిపోయివుంది. అదే ప్రైవేటు బస్సు డ్రైవరైవుంటే ఇలా వుండేవాడా..? తెల్లగా తళతళ లాడే చొక్కా వేసుకోని వుండేవాడేమో. అక్కడైతే అతని పని బస్సు నడపడమే, కానీ ఇక్కడ - బస్సు అద్దాలు తుడుచుకునే క్లీనర్, జనాలని పిలిచి ఎక్కించే ఏజెంటు, టికెట్లు కొట్టే కండెక్టరు అన్నీ డ్రైవరే..


"ఎక్కండి సార్.." అన్నాడతను నన్ను చూసి. "మన బస్సే ముందు బైల్దేరుతుంది.." చెప్పాడు. ఈ పోటీ ప్రపంచంలో బస్సుల మధ్య కూడా పోటీనే..!


"హైద్రాబాద్ కి ఒక టికెట్ ఇవ్వండి" అన్నాను అతని చేతిలో టికెట్ మెషీన్ చూసి.


టికెట్ ఇవ్వడం అలవాటు లేదేమో కొంచెం తడబడ్డాడు. చివరికి ఎలాగో టికెట్, చిల్లర తీసుకోని బస్సు ఎక్కి కండక్టర్ సీటు వెనకాల కిటికీ సీటులో కూర్చున్నాను. ఏదో మాట వరసకి చెప్పడమేకానీ కండక్టర్లే లేకపోతే కండక్టర్ సీటు ఎక్కడిది? నాతో పాటు మరో ఇద్దరు ఎక్కారు. ప్రేమ జంటో కొత్తగా పెళ్ళైన జంటో అయ్యుండాలి. అమ్మాయిని కూర్చో పెట్టి అతను మంచినీళ్ళు తెస్తానని ఒకసారి, కూల్డ్రింక్ తెస్తానని ఒకసారి కిందకి దిగాడు. దిగిన ప్రతిసారి ప్లాట్ఫారం మీద నిల్చున్న డ్రైవర్ దగ్గరకు వె ళ్ళి వెంటనే వచ్చేస్తానని చెప్పి ప్లాట్ఫారం మొత్తం పరుగులు తీస్తున్నాడు. అతను అనవసరంగా ఖంగారు పడటమే కానీ బస్సు ఇంతా కదలనే లేదు.




నాకన్నా ముందే మనవరాలితో బస్సు ఎక్కిన ముసలి జంట డ్రైవర్ వైపు రెండో వరసలో కూర్చున్నారు. మూడేళ్ళ పిల్ల.. పాపం ఆ ఉక్కపోతకి ఏడుపు అందుకుంది. ఆయన సీటు కింద నుంచి బ్యాగు లాగి అందులోనుంచి బిస్కెట్ పేకెట్ తీసి పాప చేతికిచ్చి బుజ్జగిస్తున్నాడు.


"ఏమిటండీ ఎంతకీ కదలదు.." అంటూ బస్సు గురించి అడిగిందామె.


"నాకు మాత్రం ఏమి తెలుసే.." అన్నాడాయన చిరాకుగా.


"ఇందాక ఆ డీలక్స్ దొరికినా బాగుండేది.. ఈ పాటికి కర్నూల్ దాటేసేవాళ్ళం." అన్నది ఆమె.


"తమరు రాణీ గారిలాగా నడుచుకుంటూ వస్తే బస్సు నీకోసం వుంటుంది.." నిష్టూరంగా అన్నాడాయన.


"నా మోకాళ్ళ నొప్పుల సంగతి మీకు తెలియదా.. అందుకే కొంచెం ముందే బయల్దేర్దామంటే వింటేనా?" ఆమె ప్రతి నిష్టూరమాడింది. జరగబోయే సంగతి అర్థం అయ్యిందనుకుంటా పాప మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది.


హైదరాబాద్లో ఏదో హాస్టల్లో వుంటూ చదువుకునే ఆడపిల్లలు నలుగురు ఎక్కారు. అందరూ ఒకే చోట వుండాలని నాలుగు వరసలు దాటి కొంచెం వెనకగా కూర్చున్నారు. కిటికీలోనించి ఈ విషయం చూసి ఒక తండ్రి అరిచాడు -


"ఒక్కరవ్వ ముందుకెళ్ళి కూకోకూడదంటే.. మరీ టైరు పైన కూకుండావే?" అని.


"ఫర్లేదులే నాన్నా.. అందరం కలిసి వుంటే సేఫ్.." అంటూ "సేఫ్టీ" అనే బ్రహ్మాస్త్రం వదిలింది. అవతల తండ్రి ఏం మాట్లాడకుండా తల పంకించి టికెట్ కొనడానికి డ్రైవర్ దగ్గరకి వెళ్ళాడు. ఆడపిల్లలు ముసి ముసిగ నవ్వుకుంటున్నారు. మరో కుర్రాడు సెల్ఫోన్లో మాట్లాడుతూ వచ్చి, వాళ్ళనే చూస్తూ, బ్యాగ్ని సీటు పైన కంపార్ట్మెంట్లో ఇరికించేందుకు కష్టపడుతున్నాడు.


అప్పటికే నేను ఎక్కి పావు గంట కావడంతో కొంచెం చిరాకానిపించింది. కర్చీఫ్ సీట్లో వేసి కిందకి దిగాను. డ్రైవర్ దగ్గర టికెట్ల కోసం పది మందిదాకా వున్నారు. టికెట్లు కొట్టడం చేతకాక అతను ఇబ్బంది పడుతున్నట్లు వుంది. ఎంతలేదన్నా ఇంకో ఐదు నిముషాలైనా పట్టేట్లుంది కదాని చెప్పి నేను అతనితో చెప్పకుండానే వెళ్ళి ఒక కూల్డ్రింక్ తాగి, ఏదో ఒక వారపత్రిక కొనుక్కోని తిరిగి వచ్చాను.


డ్రైవర్ దగ్గర జనం ఇంకా వున్నారు. సాయం కోసం వేరే బస్సు కండక్టర్ని పిలిపించుకోని టికెట్లు కొట్టిస్తున్నాడు. నేను బస్సు ఎక్కి నా సీట్లో కర్చీఫ్ తీసి కూర్చున్నాను. నేను కూర్చున్న సీటు వెనకాలే ఒక జంట కూర్చోని వుంది. వాళ్ళ పదేళ్ళ పిల్లాడు కిటికీ డోర్తో ఆటలు మొదలెట్టాడు. రెండుసార్లు నా మోచేతిని కిటికీతో పొడవడంతో నా చెయ్యి లోపలికి పెట్టుకోక తప్పలేదు. "చేతులు బయట పెట్టరాదు " అన్న ఆర్టీసీ సూక్తిని అమలుపరిచే బాధ్యత ఈ పిల్లాడు తీసుకున్నట్లున్నాడు.


"ఏమైనా మా అన్నయ్య బాగా ఘనంగా చేశాడు కదండీ పెళ్ళి.." అన్నది ఆ ఇల్లాలు.


"ఏడ్చాడు.. సొంత బావకి మర్యాద చెయ్యడం తెలియదు కాని ఘనంగా చేశాడట పెళ్ళి.." సన్నాయి నొక్కులు నొక్కాడు భర్త.


"ఊర్కే ఆడిపోస్కోవడం కాకపోతే మీకేం తక్కువ చేశాడండీ?" ఈ మాట అంటుంటే మరో మాటకి ఏడుపు వచ్చేట్లుంది ఆమె గొంతు.


"ఏం చేశాడా? నాకు పెట్టిన బట్టలు చూశావా? మనవాడి బారసాలకి మేనమామ అని ఎంత మంచి బట్టలు పెట్టాం? కనీసం ఆ కృతజ్ఞతైనా వుండద్దు.." ఆయనికా చెప్తూనే వున్నాడు. ఆమె గొంతు మాత్రం మళ్ళీ వినపడలేదు. చిన్నగా ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది.


కింద ప్లాట్ఫారం మీద గొడవ మొదలైంది. మనవరాలితో ఎక్కిన ముసలాయన, ప్రేమజంటలో కుర్రాడు డ్రైవర్తో గొడవ పెట్టుకున్నట్లున్నారు. నేను దిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను.


"నాకు టికెట్లు కొట్టడం రాదు సార్.. అందుకే ఆలస్యమైంది.. ఇంక బయల్దేరడమే.." చెప్తున్నాడు.


"ఏమిటయ్యా బయల్దేరేది. మేం టికెట్ కొనిన తర్వాత మూడు బస్సులు పొయ్యాయి. వెంటనే కదలనప్పుడు టికెట్లెందుకిచ్చావు?" అన్నాడు పెద్దాయన.


"అవును.. వెంటనే బయల్దేరు లేకపోతే మా డబ్బులు మాకిచ్చెయ్యి" అన్నాడు కుర్రాడు.


"లేద్సార్.. వెళ్ళిపోదాం.." అంటూనే "ఇంకా ఎవర్సార్ హైద్రాబాద్ హైద్రాబాద్.." అంటూ ప్లాట్ఫారం మీద జనాలకోసం అరిచావు.


"అరిచింది చాలు ఇంక పదండి" అన్నాను నేను. అందరం బస్సు ఎక్కి కూర్చున్నాం. బస్సు స్టార్ట్ చేశాడు డ్రైవర్.


స్టార్ట్ చేశాడు కానీ బస్సుని బయటికి తియ్యలేదు. దాదాపు అయిదు నిముషాలు అలాగే వుంచి లోపలికి వచ్చాడు. మొదటి సీటు నించి చివరిదాకా లెక్కపెట్టుకుంటూ వెళ్ళాడు.


"ఇంకా ఎవరో రావాలి సార్" ప్రకటించాడు. నేను వెనక్కి తిరిగి చూశాను. - ముసలి జంట, పడుచు జంట వున్నారు, పెళ్ళికెళ్ళి వస్తున్న జంట వున్నారు, హాస్టల్ పిల్లలు వున్నారు - ఆ సెల్ఫోన్ పట్టుకోని వచ్చిన కుర్రాడు?


"అదుగో ఆ సీట్లో ఒక కుర్రాడు వుండాలి" చెప్పను డ్రైవర్తో.


వెనుకనుంచి ఎవరో అసహనంగా "ఛ" అనడం వినిపించింది.


ముసలి దంపతుల దగ్గర పిల్ల మరింత గట్టిగా ఏడుస్తోంది.


"నీకు చెప్పి వెళ్ళలేదా?" నా వెనకాలతను అడిగాడు.


"లేదండి.." అని డ్రైవర్ అంటుండగానే అతను వచ్చాడు. బస్సులో వున్న జనమంతా అతన్ని చిత్రంగా చూస్తుండటంతో చేతిలో మంచినీళ్ళ బాటిల్ చూపించి జనాంతికంగా "నీళ్ళ కోసం" అన్నాడు. వెనకాల హాస్టల్ పిల్లల నవ్వులు చిన్నగా.


"అసలే ఈయన టికెట్టు కొట్టటం లేటు, బండి తీయడం లేటు, దానికితోడు ఇదొకటి.." ముసలాయన గొణిగాడు. డ్రైవర్ తిరిగి తన సీట్లోకి వెళ్ళి బండి బయటికి తీసాడు. వూర్లో మరో ఐదారుగురు ఎక్కారు. మరో ఆర్టీసీ వుద్యోగి అనుకుంటా ఎక్కి డ్రైవర్ దగ్గరే చేరి కబుర్లలో పడ్డాడు. బస్సు నడుపుతూనే టికెట్లు కొడుతున్నాడు డ్రైవర్. బస్సు వూరు దాటగానే లైట్లు ఆరిపోయాయి. డ్రైవర్ సీట్ పైన మాత్రమే లైట్ వెలుగుతోంది.


నా వెనక సీట్లో పెళ్ళికి వెళ్ళొచ్చిన జంట లోగొంతులో ఇంకా వాదించుకుంటూనే వున్నారు.


"అంతే లెండి మా వాళ్ళంటే మీకు ఏనాడు పడింది గనుక.." ఆమె ఏదుస్తున్న సంగతి అర్థమౌతోంది.


"అల్లుడన్న గౌరవం వాళ్ళకుంటే.. వాళ్ళకి మర్యాదిచ్చేవాణ్ణి.." నిష్టూరమాడుతూనే కిటికీతో ఆడుతున్న కొడుకు రెక్క పట్టుకుని లాగుతున్నాడు.


ముసలి జంట కిటికీకి దగ్గరగా చేరి, ఆ గాలికి చిన్న పిల్లని నిద్రపుచ్చారు. ఆమె ఇంకా చిన్నగా "రామా లాలి.." పాడుతూనే వుంది.అవతల ప్రేమ జంట - లైట్లు ఆరిపోగానే సీట్లోనే కొంచెం కిందకి జారి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి గాజుల చప్పుడు, ముసి ముసి నవ్వులు తప్ప ఇంకేం వినపడటంలేదు, కనపడటంలేదు.


చెక్పోస్ట్ దాటక ముందే బస్సు ఆగింది. మరో నిముషంలో లైట్లు వెలిగాయి. ప్రేమ జంట గబగబా కదిలినట్లు గాజుల చప్పుడు. ఇద్దరూ నిటారుగా కూర్చున్నారు. నా వెనక వున్న ఇల్లాలు కన్నీళ్ళు తుడుచుకుంది. పెద్దామె లాలిపాట ఆగిపోయింది. డ్రైవర్ ఉన్నట్టుండి దూసుకు వచ్చాడు -


"అయ్యా.. ఎవరికైనా చిల్లర ఎక్కువిచ్చానా.. చూడండి.. లెక్క తేలడం లేదు.." అన్నడు. పసి పిల్ల లేచి మళ్ళీ ఏడుపు అందుకుంది.


"మళ్ళీ ఇదేమిటయ్యా.." అడిగాడు ముసలాయన.


"ఇట్లా అయితే మనం హైదరాబాద్ చేరినట్లే" కాలేజీ పిల్ల కాస్త గట్టిగానే అని కుర్రాడి వంక చూసింది.


"కాదండి.. డబ్బులు షార్ట్ పడితే నా జేబులో నించి కట్టాలి.. ఒక్కసారి చూసుకోని చెప్పండి.."


"ఎంత తగ్గిందిరా.." ఇంతకు ముందెక్కిన ఆర్టీసీ వుద్యోగి సాయంగా నిలబడి అడిగాడు.


"నాలుగు వందలు.."


"ఇంకేం.. ఎవరో అయిదు వందలు ఇచ్చి వుంటారు.. వాళ్ళకి చిల్లర ఇవ్వబోయి వందకి బదులు మళ్ళీ అయిదొందలు తిరిగి ఇచ్చి వుంటావు.." అనుభవం మీద చెప్పినట్లు ఖచ్చితంగా చెప్పాడతను. "ఎవరెవరు అయిదొందలు ఇచ్చారో గుర్తు చేసుకో.." అంటూ సలహా కూడా ఇచ్చాడు.


"ఎవరెవరో గుర్తులేదు.. ఐదారుగురు ఇచ్చారు.." డ్రైవర్ ముఖం నీరసంగా మారింది.


"క్యాష్ బ్యాగ్లో ఎన్ని ఐదొందళ్ళు వున్నాయి?"


"అయిదు"


"అంటే ఆరు అయిదొందల కాగితాలు నీ దగ్గరకి వచ్చాయి.. ఒకటి వెనక్కిచ్చావ్.." చెప్తున్నాడతను


"ఏమిటండీ ఈ డిస్కషను? త్వరగా పోనివ్వయ్యా.." అరిచాడు నా వెనకున్న గృహస్తు.


"సార్.. ఒక్క నిముషం సార్.. మీ దగ్గర చూసుకోండి.. వంద బదులు అయిదొందలు ఇచ్చాను. మీ దగ్గర వుంటే చూసి చెప్పండి.. ప్లీజ్"


ఎవ్వరి దగ్గర్నించి సమాధానం రాలేదు. ఎవ్వరూ కనీసం పర్స్ తీసి చూసునుకున్నట్లు కూడా కనిపించలేదు.


"సరే చెప్పావుగా వుంటే ఇస్తార్లే.. ఇంక పోనీ" ముసలాయన గదిమాడు. తప్పని పరిస్థితిలో ముఖం వేలాడేసుకొని డ్రైవర్ సీటు దగ్గరకు వెళ్ళిపోయాడు. బస్సు కదిలింది - లైట్లు ఆరిపోయాయి.


మళ్ళీ ప్రేమజంట గుసగుసలు, సంసారులు రుసరుసలు మొదలయ్యాయి. కాలేజిపిల్లల మొబైల్లో ఏవో కొత్త పాటలు వినపడుతున్నాయి. ఎవరో సన్నగా గురక తీస్తున్నారు. బస్సు చాలా నెమ్మదిగా పోతోంది. బహుశా డ్రైవర్ పోయిన నాలుగు వందల గురించి ఆలోచిస్తూ నడుపుతున్నాడేమో. బస్సు నిండా చీకటి. బస్సు బయటకూడా చీకటే.


ఒక రెండు గంటల తరువాత బస్సు ఒక హోటల్ దగ్గర ఆగింది. మళ్ళీ లైట్లు వెలగడంతో ఎవరికి వారు సర్దుకున్నారు. డ్రైవర్ బస్సులోకి వచ్చాడు.


"సార్.. దయచేసి ఎవరికైనా ఎక్కువ ఇచ్చానేమో చూడండి.. చెకింగ్ జరిగిందంటే వుద్యోగం పోతుంది.." అన్నాడు దీనంగా. నా ఆలోచన కరెక్టే, అతను ఇదే విషయం ఆలోచిస్తూ వున్నట్లున్నాడు.


"ఏమిటయ్యా నీ గోల.. ఎన్ని సార్లు ఆపుతావు" మండి పడ్డాడు కుర్రాడు.


"నీ డబ్బులు మేమేదో దోచెసినట్లే మాట్లాడుతున్నావే? మమల్ని హైద్రాబాద్ చేరుస్తావా లేక ఇట్లాగే.." ముసలాయన ఏదో అంటుండగా డ్రైవర్ అందుకున్నాడు.


"అహ.. లేదు సార్.. దానికోసం ఆపలేదు.. భోజనానికి ఆపాను.. అదుగో హోటల్.. బస్సు పదిహేను నిముషాలు వుంటుంది..." చెప్తూనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దాదాపు అందరూ దిగారు. చివరిగా దిగింది నేనే. డ్రైవర్ అక్కడే నిలబడి బీడీ కాలుస్తున్నాడు.


"మీరు రారా భోజనానికి?" అడిగాను.


"ఏం తినబుద్దైతుంది సార్.. నాలుగొందలు పోగొట్టుకున్నా ఇవాళ.." అన్నాడతను బీడి పొగ వదుల్తూ.


"వుద్యోగమన్నాక ఇలాంటివి తప్పవు కదా.. దానికే భోజనం మానేస్తారా?" అన్నాను నేను.


"మీకు తెలియదు సార్.. దాదాపు ప్రతి డ్యూటీలో ఎంతో కొంత పోతూనే వుంటుంది.. అలవాటు లేని పని కదసార్.. అప్పట్లో ఎనిమిది ప్యాస్ అయితే క్లీనర్ వుద్యోగం ఇచ్చారు.. డ్రైవరయ్యా.. ఈ టికెట్టు లెక్కలు ఎక్కడ వెయ్యగలను చెప్పండి.. కాకపోతే ఇయ్యాల లేవగానే ఎవరి ముఖం చూశానో నాలుగొందలు పొయినాయి.. నాలుగు వందలు.." అన్నాడతను బాధగా. నేనేమీ మాట్లడలేదు. అతనే మళ్ళీ అన్నాడు -


"నెలాఖరు కద్సార్.. ఎవడో ఒకడి దగ్గర అప్పన్నా చెయ్యాలి ఇది కట్టాలంటే.. మధ్యలో చెకింగ్ అయితే సస్పెండ్ చేస్తారు.. అయినా అది కాదు బాధ.. పొరపాటున డబ్బులు ఎక్కువ వస్తే వెనక్కి ఇచ్చే నిజాయితీ ఒక్కడికి కూడా లేద్సార్.. అదుగో ఆ హోటల్లో ఎవరో ఒకళ్ళ నా డబ్బుల్తో భోజనం చేస్తున్నారు.." కసిగా అంటుంటే అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను మౌనంగా హోటల్కేసి నడిచాను.




హోటల్ కౌటర్ దగ్గర భోజనం టోకెన్ తీసుకుంటుంటే కనపడిందది - ఐదు వందల రూపాయల నోటు.. నా పర్సులో. నేను సామాన్యంగ పెద్ద నోట్లు చిన్న నోట్లు ఒక వరసలో పెడతాను. ఈ నోటు మాత్రం రెండు వంద రూపాయల మధ్య వుంది. అది ఖచ్చితంగా డ్రైవర్ పొరపటున ఇచ్చిందే.


నిజం చెప్పద్దూ.. ఆ నోటు చూడగానే తిరిగి ఇవ్వాలనే అనిపించింది. కానీ మీరనుకున్నట్లు ఆ నోటు తిరిగి ఇవ్వలేదు, ఇస్తే ఈ కథే లేదు..!! బస్సులో హైద్రాబాద్ వచ్చేవరకూ తర్జన భర్జన పడుతూనే వున్నాను. హైదరాబాద్లో దిగిపోయాను - నా జోబులో నోటు అలాగే వుండిపోయింది. ఆ తరువాత ఎక్కడ ఖర్చుపెడదామాన్నా ఎందుకో మనసు వొప్పలేదు. మళ్ళీ ఆ డ్రైవర్ కనపడకపోతాడా, నేను నోటు తిరిగి ఇవ్వకపోతానా అని ఎదురు చూస్తున్నాను. ఆ అయిదువందల రూపాయల నోటు మాత్రం రోజూ, నేను పర్సు తీసినప్పుడల్లా కనపడి వెక్కిరిస్తుంటుంది.


(19.09.2010 "సాక్షి" ఆదివారం అనుబంధంలో ప్రచురితం)