మబ్బుతునక (రచన కథాపీఠం కథ)


వాసంతీ... నాకు నిజంగా పిచ్చి పట్టిందా?” అడిగాను నేను. ఆమె నిర్దయగా నవ్వింది.
“ఈ ప్రపంచానికే పిచ్చి పట్టింది. అందుకే నిన్ను పిచ్చివాడు అంటోంది.” అలా అంటూనే నేల చూపులు చూస్తోంది వాసంతి.
“పోనీలే, నువ్వన్నా నమ్ముతున్నావు. నా పిచ్చి లోకంలో నేను బాగానే వున్నాను కదా? అయినా ఈ జనానికి వచ్చిన బాధేంటి..”
“మన లోకానికి, ఈ లోకానికి చాలా తేడావుంది విశ్వం. అదే వాళ్ళ బాధ..” చెప్పింది నవ్వుతూ.
“కాఫీ కలపనా?” అడిగాను.
“వద్దు అలా బయటికి వెళ్ళి నడుద్దాం పద..” చెప్పింది.
“ఇంత రాత్రా?” అన్నాను. ఆమె సమాధానం చెప్పకుండా లేచి బయటికి అడుగులేసింది. నేను అనుసరించాను.
బయట వూరంతా వెన్నెలలో తడుస్తోంది. వాసంతి మబ్బుతునకలా ముందుకు నడుస్తోంది. నేను చల్లగాలిలా అమె వెనకాల.
“ఎందుకు అంత తొందర... ఇద్దరం కలిసినడుద్దాం..” అన్నాను
“అవును నిజమే... ఇద్దరం కలిసే నడుద్దాం అనుకున్నాం, కానీ నీ దారి వేరు నా దారి వేరు అయిపోయాయి కదా?” అంది అడుగులు నిదానించకుండానే.
“అది అప్పుడు... ఇప్పుడు నేనూ నీ దారిలోకి వచ్చేశాను కదా?”
“నువ్వు వచ్చేసరికి నేను నీ కన్నా చాలా ముందుకి వెళ్ళిపోయాను కదా...” అంది. నాకు ఆమెను అందుకోవడం కష్టంగానే వుంది.
“సరే ఆ పార్కులో కూర్చుందామా” అడిగాను. ఇలా నడవటం కన్నా ఒక చోట కూర్చుంటే సుళువనిపించింది.
పార్కు నిశబ్దంగా వుంది. పూలమొక్కలన్నీ కొత్త అతిధుల్ని నిద్ర కళ్ళతో ఆహ్వానిస్తున్నట్లు తలలూపాయి. ఇద్దరం ఒక సిమెంటు బెంచి మీద కూర్చున్నాం.
“ఏదైనా పాట పాడు...” అడిగింది వాసంతి. నేను గట్టిగా నవ్వేశాను.
“నేను పాటలు పాడి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో... అప్పుడు కాలేజి రోజుల్లో...”
“అదే... అప్పుడు క్యాంటీన్ లో నన్ను చూసి పాడావు చూడు – “తూ మెరీ జిందగీ హై... తూ మెరీ హర్ ఖుషీ హై...” ఆ పాట పాడు” ఆ జ్ఞాపకం ఒక్కసారి వెండి వెలుగులా ఆమె ముఖంలో మెరిసింది.
“లిరిక్స్ గుర్తులేవు..” ఏదో ఒక సాకు.
“నాకు గుర్తున్నాయిగా... నేను అందిస్తాలే.. పాడవూ ప్లీజ్..”
పాట మొదలైంది.
“సపనోమే ఆనేవాలీ బాహోమే కబ్ ఆయేగీ...” అన్నప్పుడు గట్టిగా నవ్వేసింది వాసంతి. పాట ఆగిపోయింది.
“ఎందుకు ఆపావు?” ఆమెకి ఎప్పుడూ రాని కోపం నటించింది.
“పాడమని అడిగి అలా నవ్వితే ఎలా పాడను? ముందే చెప్పాను పాటలు పాడి చాలా రోజులైందని”
“నేను నవ్వింది అందుకు కాదు... అప్పుడు కాలేజీలో ఈ లైన్లు పాడినప్పుడు ఏం జరిగిందో గుర్తులేదా?” అంటూ మళ్ళీ నవ్వింది.
“గుర్తుంది... వున్నట్టుండి వచ్చి నన్ను కౌగిలించుకున్నావు...” నవ్వొచ్చింది. సిగ్గేసింది. అంత అందమైన అమ్మాయి అప్పుడెప్పుడో కాలేజి కేంటీన్ లో అందరి ముందు కౌగిలించుకున్నప్పుడు కలిగిన గర్వం మళ్ళీ నా కళ్ళలోకి వచ్చింది. వాసంతి నవ్వుతూనే నా వొళ్ళో పడుకుంది.
“అంత సంతోషం మళ్ళీ మన జీవితంలోకి రాలేదు కదా విశ్వం...” అడిగింది ఆమె. అప్పటిదాకా నవ్విన చంద్రుణ్ణి దిగులు మబ్బులు కమ్మేశాయి.
“అలా ఎందుకు అనుకుంటావు వాసంతి... మన పెళ్ళిరోజు, మొదటిరాత్రి... మర్చిపోయావా?” సరదాగా మాట్లాడాననుకున్నాను. ఆమె ముఖంలో విషాదం పెరిగింది.
“మన తల్లిదండ్రులు లేకుండా పెళ్ళి చేసుకోవటంలో లోటు తప్ప సంతొషం లేదు విశ్వం... మొదటిరాత్రి కూడా గుర్తుంది... ముందు ముందు భార్యాభర్తలుగా ఎలా బ్రతకాలో, సంసారమనే నది పైన డబ్బుల తెప్ప ఎలా పరచాలో అని చర్చించుకోని నిద్రపట్టక ఏ తల్లవారుఝామునో చేసిన శృంగారం...”
“ఎందుకలా అంటావు... అది జీవితంలో కొత్త మలుపు... ముందు దారిలో పూలు వుంటాయో, ముళ్ళు వుంటాయో అన్న భయం, ఆందోళన...”
“మనం సంసారం మొత్తం ముళ్ళు ఏరి పడెయ్యడానికే సరిపోయింది... పూలు వున్న దారులు పక్కనే వున్నా ముళ్ళు ఏరే పనిలో ఆ దారుల్ని గుర్తించనేలేదు మనం.”
“ఏం చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తావు నువ్వు... సరే ఆ విషయాన్ని వదిలెయ్... నువ్వు రాసిన కథలన్నీ నా దగ్గరే వున్నాయి. పుస్తకంగా వేద్దామనుకుంటున్నాను” అడిగాను మాట మార్చే ప్రయత్నంలో.
“వద్దు. ఆ కథలన్నీ మెలాంకలిక్ గా కనిపిస్తాయి నాకు... అలాంటివి వుంచడమే దండగ. రేపు మొత్తం తగలబెట్టేసెయ్...” చెప్పింది ఆమె నా వొళ్ళో నుంచి లేస్తూ.
“నిజంగా చెప్తున్నావా... నువ్వు అంత కష్టపడి రాసిన కథలు...”
“కథకి విలువ ఎంత కష్టపడి రాసామని కాకుండా, ఆ కథ ఏం చెప్తోంది అన్నదాని మీద ఆధారపడి వుంటుంది... వద్దు... తగలబెట్టేసెయ్...” గట్టిగానే అరిచింది.
“సరే... నువ్వు చెప్పినట్లే చేస్తాగా...” నేను కూడా కాస్త గట్టిగానే చెప్పాల్సివచ్చింది. ఇద్దరి మధ్య మౌనగీతం మోస్తూ చల్లగాలి తిరుగుతోంది. మళ్ళీ నేనే మాట్లాడాను.
“నీకు నచ్చవేమో కానీ, నీ కథలు నాకు బాగా నచ్చుతాయి...”
“అబద్ధాలు చెప్పకు విశ్వం ...” అంది ఆమె. “నేను రాసినప్పుడల్లా నీకు వినిపించేదాన్ని... ఆఫీసుకు వెళ్ళే హడావిడిలోనో, మంచం ఎక్కే తొందరలోనే వినేసి, “బాగుంది” అని ఒక్క మాటతో సర్టిఫికెట్ ఇచ్చేవాడివి... ఆ తరువాత ఎప్పటికో ఏదో పత్రికలో వచ్చేది. ఏదో ఒక ఆదివారం నీ చేత బలవంతంగా చదివిస్తే చదివి – “ఇదెప్పుడు రాసావు, నాకు గుర్తులేదే” అనేవాడివి...” అంతా కళ్ళముందు జరుగుతున్నట్లు చెప్తోంది వాసంతి.
“అప్పుడు నా వుద్యోగం... కార్పొరేట్ ప్రపంచం... టార్గెట్ లు, ప్రజంటేషన్లు... ఆ హడావిడిలో పడిపోయి అలా...” చెప్తున్నమాటలు మధ్యలోనే ఆగిపోయాయి. తప్పు చేసినప్పుడు కన్నా తప్పు చెప్పుకునేటప్పుడు చూపులు నేలరాల్తాయి.
“ఆ జంఝాటాన్ని వదిలేసి రమ్మని ఎన్నిసార్లు చెప్పాను... అలాంటి బ్రతుకు వద్దని ఎంత వేడుకున్నాను..” తల్చుకోని మరీ బాధపడింది వాసంతి.
“వచ్చేశాను కదా... ఇప్పుడు అవన్నీ ఏవీ లేవు... నువ్వు చెప్పినట్లే అన్నీ వదిలేశాను...” అంటున్నప్పుడు నా కళ్ళలో ఆశ. ఆమె కళ్ళలో అదే నిరాశ.
“ఇప్పుడా... చేతులు కాలిన తరువాత ఏం చేసి మాత్రం ఏం ప్రయోజనం... జరగాల్సినవన్నీ జరిగిపోయాక నువ్వు ఎన్ని విమానాలు ఎక్కి వస్తే మాత్రం ఏమిటి లాభం..?” ప్రశ్న సూటిగా వాడిగా తగిలింది. నా దగ్గర సమాధానం లేదు.
“నీకు గుర్తుందా విశ్వం? ఆ రోజు మార్చి ముఫై ఒకటి... నువ్వు అందీ అందని టార్గెట్లు వెనక పరుగులుపెడుతూ ఆఫీసులో వుండిపోయావు... నేను రోజంతా నీకు ఫోన్ చేస్తూనే వున్నాను... నువ్వు ఎత్తలేదు” ఆమె చెప్తుంటే మధ్యలో ఆపాను.
“గుర్తుంది... ఆ రోజే అంత వరకూ కంపెనీలో ఎవ్వరూ చెయ్యనంత బిజినెస్ చేశాను... లక్షల్లో బోనస్, ప్రమోషన్... అయినా నీ ఫోన్ ఎత్తలేదని అనకు ఒకసరి మాట్లాడాను...” సమర్ధించుకున్నాను.
“అవును ఫోన్ ఎత్తి... “ఏమైనా అర్జంటా? నేను పనిలో వున్నాను” అన్నావు... నువ్వు తండ్రివి కాబోతున్నావని అంత హడావిడిగా చెప్పడం నాకు ఇష్టంలేక పెట్టేశాను..”
“అవును ఆ రోజు రాత్రి బాగా ఏడ్చేవు కూడా...” అంటూ దగ్గరకు తీసుకోని గుండలకి హత్తుకున్నాను నేను.
“ఆ రోజు మాత్రమే కాదు... ఆ రోజు నుంచీ ఏడుస్తూనే వున్నాను...”
“అలా అనకు వాసంతి... అభినవ్ పుట్టినప్పుడు శలవు పెట్టి నీ దగ్గరే వున్నాను కదా?”
“వున్నావు... తరువాత అమర్ పుట్టినప్పుడు? ఢిల్లీలో నువ్వు మొదలుపెట్టబోయే వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్టర్స్ తో మీటింగ్స్ అన్నావు... నేను ఒక్కదాన్నే నొప్పులు పడుతూ ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళాను. ఆ క్షణంలో నాకేమనిపించిందో తెలుసా? అలా అనాధలా బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది” ఆమె చెంపల పైన జారిన కన్నీళ్ళు నా చేతి మీద పడుతున్నాయి.
“ఏడవకు వాసు... నిజమే... అప్పుడు తెలియలేదు. సక్సస్ ఇచ్చే మత్తు అది... ఒక్కఒక్క మెట్టు ఎక్కుతున్నానన్న సంతోషంలో కిందెక్కడో మిమ్మల్ని వదిలేశానన్న నిజం వెనక్కి తిరిగి చూసినప్పుడే కదా తెలిసింది..” నా కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. వాసంతి నా గుండల మీద నుంచి లేచి, కన్నీళ్ళు తుడుచుకోని నిటారుగా కూర్చుంది. చేతులు రెండు రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకోని వస్తున్న ఏడుపును దిగమింగుకుంటోంది.
“వెనక్కి తిరిగి చూసుకోమని చాలాసార్లు నీకు చెప్పాను... నువ్వు ఈ రోజు తిరిగి చూసుకునేసరికి నువ్వు కోల్పోవలసింది కోల్పోయావు... మన వయసు, మన సంతోషం, మన కుటుంబం అన్నీ కోల్పోయావు. చివరికి నన్ను కూడా...!!” చెప్పి కూర్చున్న చోటు నుంచి లేచింది వాసంతి. ఆ ముఖంలో ఇప్పుడు సంతోషంలేదు, దుఖంలేదు. ఒక స్థిరమైన మొండితనం మాత్రమే వుంది.
“వెళ్తున్నావా?” అడిగాను వినవలసిన జవాబు ఇష్టం లేకపోయినా.
“అవును”
“రేపు కలుస్తావుగా?”
“ఊ”
వాసంతి వెళ్ళిపోయింది.
***
“అన్నయ్యా... నేను అమర్ ని మాట్లాడుతున్నాను” నా చిన్న కొడుకు పెద్దవాడితో మాట్లాడుతున్నాడు. నాకు వినపడకూడదనేమో వరండాలోకి వెళ్ళి చిన్నగా అంటున్నాడు. వినపడ్డా వినపడనట్లే వున్నాను నేను.
“రాత్రి మళ్ళీ వెళ్ళి పార్కులో కూర్చున్నాడీయన... చెప్తే వినడు.. పైగా నన్ను వుద్యోగం మానేసి, ఎక్కడైనా టీచింగ్ చెయ్యమంటాడు... మళ్ళీ మొదటికొచ్చిందన్నయ్యా...” వాడు చెప్తూనే వున్నాడు. తప్పేముంది? నేను చేసిన తప్పే వాడు చేస్తున్నాడని నా బాధ. వాడు ఫోన్ కి చెయ్యడ్డం పెట్టుకోని మాట్లాడుతున్నాడు.
“పొద్దున్న అమ్మ పుస్తకాలన్నీ తీసి తగలబెట్టబోయాడు... ఏమన్నా అంటే మీ అమ్మే చెప్పింది అంటాడు... నాన్నకి పిచ్చి ఎక్కువైనట్లుంది అన్నయ్యా... అమ్మ చనిపోయిన దగ్గర్నుంచి ఇదే వరస... మొన్న డాక్టర్ అంకుల్ నాన్నకి నిజం చెప్పేశాడు... అమ్మ ఆత్మహత్య చేసుకుందని.. అప్పటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు... అక్కడ ఏదైనా మంచి వైద్యం దొరికే అవకాశం వుంటే చెప్పు అన్నయ్యా... పంపిచేస్తాను... ఇంక ఈయన పిచ్చి పనులు తట్టుకే శక్తి నాకు లేదు...”
“పిచ్చట... నాకు పిచ్చి... విన్నావా వాసంతీ... నువ్వు చచ్చిపోయావని నేను పిచ్చివాణ్ణి అయిపోయానట... విన్నావా? విన్నావా?...” విరగబడి నవ్వుతున్నాను.
“ఫర్లేదులే విశ్వం... నేను చెప్పాగా... ఈ ప్రపంచానికే పిచ్చి పట్టింది. అందుకే నిన్ను పిచ్చివాడు అంటోంది.” అంది నాకు తప్ప ఇంకెవరికీ కనపడని వాసంతి.

<<?>>
(రచన కథాపీఠం నవంబరు 2012)

ఒక ఉషస్సు కోసం జాగారం


ఒక్కణ్ణే స్టేజి వెనుక భాగంలో కూర్చోని వున్నాను. స్టేజ్ పైన ఏదో రెండర్థాల పాట నడుస్తోంది. వుండుండి అమ్మాయి గొంతు వినపడగానే కుర్రకారు వేస్తున్న ఈలలు వినపడుతున్నాయి. ఆ పాట కచేరి అయిన తరువాత నా మ్యాజిక్ షో వుంటుందని చెప్పారు నిర్వాహకులు. అన్నీ సిద్ధంగా వున్నాయో లేదో చూసుకున్నాను. నా సరంజామా అంతా పెట్టుకున్న పెట్టె దారికి అడ్డంగా వుందేమో అని అనుమానంతో నేను కూర్చున్న కుర్చీ కిందకి జరిపాను. దాని మీద రాసున్న అక్షరాలను ఒకసారి తడిమి చూసుకున్నాను – “మెజీషియన్ బుచ్చిబాబు”. నాకెందుకో నాన్న పేరు కళ్ళ ముందు మెదిలింది. గారడి మల్లయ్య.
నాన్నని తల్చుకుంటే ఎక్కడలేని వుత్సాహం వచ్చేస్తుంది.
“రండి బాబు రండి... మల్లయ్య చేసే ఇంద్రజాల, మహేంద్రజాలం చూడండి... గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు చూడండి... ఇంద్రస్థంభన, వజ్రస్థంభన, జలస్థంభన, వాయుస్థంభన విద్యలు చూడండి...” గొంతెత్తి అరిచే నాన్న రూపమే కనిపిస్తుంది నాకు. నాన్న చేసిన ట్రిక్కులన్నీ నాకూ నేర్పించాడు. నేను వేరే చోట కొత్త ట్రిక్కులు కూడా నేర్చుకున్నాను. అయినా నాన్న చేతికి వున్న హస్త లాఘవం, తీయటి మాటలతో మత్తు జల్లే విద్య నాకు సగం కూడా అబ్బలేదు.
“నాన్నా నాకు ఏదైనా పెద్ద గారడి చేసి చూపించవా?” అడిగాను నాలుగేళ్ళ వయసులో ఒకసారి. అప్పటికే చీకటి పడుతోందని గారడి సామానంతా సర్దుతున్నాడు నాన్న.
“ఏం చెయ్యమంటావు... ఒక మనిషిని మాయం చెయ్యమంటావా? నీకు మీసాలు తెప్పింఛమంటావా?” అడిగాడు నాన్న కర్ర తిప్పుతూ. గారడి చెయ్యమంటే ఎంత వుత్సాహమో నాన్నకు.
“ఊహు... అలాంటిది కాదు. అవన్నీ నువ్వు మంత్రం వేస్తే వుంటాయి, మంత్రం పోతే అవీ పోతాయి... అట్టాంటివి కాదు... ఎప్పటికీ వుండిపోయే గారడి చేస్తావా?” అడిగాను అమాయకంగా.
నాన్న అరనిముషం ఆలోచించి “సరే చూసుకో...“ అంటూ ఏదో మంత్రాలు చదివాడు. ఆకాశం వైపు చూస్తూ చేతిలో ఒక తాడు వున్నట్లు గిరగిరా తిప్పి దాన్ని ఆకాశంలోకి విసిరినట్లు నటించాడు. నా పసి వయసుకు ఏదో అద్భుతం జరగబోతోందని నమ్మకం కలిగించాడు. ఆ తరువాత చెప్పాడు –
“బుచ్చీ... అదిగో ఆడుండాడే చందమామ... ఆడ్ని తాడుతో కట్టేసినా... ఇంగ చూడు మనం ఏడకి బోతే ఆడకి మనతోనే వస్తాడు... ఇంద తాడు పట్టుకో..” అంటూ చేతికి ఏదో అందించినట్లు నటించాడు. నేనూ అందుకున్నా.
నాన్న చెప్పింది నిజమే. నాన్న సైకిల్ కి ముందుండే రాడ్ మీద కూర్చోని వెళ్తుంటే మా వెంటే వచ్చాడు చందమామ. గుట్టల్లో, పొలాల్లో, మట్టిరోడ్డు మీద, కాలవ గట్టుమీద... ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు. ఆ రాత్రంతా తాడుని పట్టుకున్న పిడికిలి విడవకుండా నిద్రపోయాను నేను.
కొంచెం పెద్దయ్యాక నాన్నకు ఈ విషయం చెప్పి నవ్వేస్తే ఆయన కూడా దగ్గుతూ నవ్వి – “పైన పెద్ద గారడి వాడు ఆయన విద్యని ప్రదర్శిస్తుంటే మనం చెయ్యాల్సిందల్లా ఆ మంత్రం మనకి తెలుసన్నట్లు నటించడమే... మన చుట్టూ జరుగుతుండే గారడిని తెలుసుకోవడమే విద్యంతా...” అంటూ పాఠం చెప్పాడు నాకు.
***
“బుచ్చిబాబూ... ఈ పాట తరువాత నీదే రా... నువ్వు రెడీనేగా?” అడిగాడు శేషు. ఆ వూర్లో జరుగుతున్న కొత్త సంవత్సరం సంబరానికి నన్ను పిలిచేలా వూరి పెద్దల్ని ఒప్పించినవాడు శేషు. నా చిన్నప్పటి స్నేహితుడు.
నాన్న ఆలోచనల్లోంచి బయటికి రావటం ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి తలాడింఛాను. స్టేజ్ మీద ఏదో వాంప్ సాంగ్ ఊపందుకుంది. శేషు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.
“ఎక్కువ టైం వుండదేమోరా... తోందరగా చేసి వచ్చేయ్... సిగరెట్ తాగుతావేటీ..” అడిగాడు. నేను వద్దని చెప్పడంతో కొంచెం దూరంగా వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. టైమ్ చూసుకున్నాను. పదకొండు నలభై. మళ్ళీ నా ఆలోచనల్లోకి జారుకున్నాను.
నాన్న గారడీ చెయ్యడానికి ఎన్నో వూర్లు తిరిగేవాడు. ఎప్పుడో వచ్చేవాడు. నాకేమో ఎప్పుడూ నాన్నతోనే వుండాలని. అమ్మ మాత్రం ఒప్పుకునేదికాదు. ఒకరోజు రాత్రి నా కోరిక విని నాన్న నన్ను తీసుకెళ్తానని పట్టుపట్టాడు. అమ్మ ఏం మత్రం వేసిందో కానీ మర్నాడు వూరెళ్తూ  – “బాగా సదువుకోరా అయ్య... నాబోటి బతుకు కాకూడదు నీది..” అంటూ వెళ్ళాడు. ఇదంతా అమ్మ చేసిన మాయ. అసలు నాన్న తెచ్చే నాలుగు డబ్బులతో అమ్మ ఎట్లా ఇల్లు నడిపేదో, నాకు చదువులు ఎట్లా చెప్పించేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అప్పట్లో తెలిసేది కాదు కానీ ఇప్పుడు తల్చుకుంటే అనిపిస్తుంది - నాన్న చేసే గారడిలకన్నా ఇదే పెద్ద గారడి అని. అన్ని కష్టాలు వున్నా అమ్మ నవ్వుతూనే వుండేదే అది అన్నింటికన్నా అంతు చిక్కని మహేంద్రజాలం.
సిగరెట్ పూర్తి చేసి శేషు కార్యక్రమం నిర్వహిస్తున్న ఏంకర్ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడాడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి –
“ఆ పిల్ల పాడతాంటే జనాలు ఎంజాయ్ చేత్తన్నారంట... ఇంకో పాట పాడిస్తన్నారు. ఆ తరువాత నీదే..” చెప్పాడు.
అప్పటికే చిన్నపిల్లలంతే ఎక్కడపడితే అక్కడ నిద్దర్లు పోతున్నారు. మ్యాజిక్ షో అంటే ముందు వరసలో వుండేది పిల్లలే కదా. వాళ్ళు నిద్ర పోతుంటే ఇంకేం మ్యాజిక్ చెయ్యాలి? అడగకూడదనుకుంటూనే అడిగేశాను వాణ్ణి.
“పోన్లేరా... హ్యాపీ న్యూయియర్ అంటే అంతే మరి... అద్దరేత్రి అయుతేనే కదా... అప్పటిదాకా ఏదో పోగ్రామ్ చేస్తానే వుండాలి కదా..” చెప్పాడు వాడు.
హ్యాపీ న్యూ ఇయర్..!!
మా లెక్కల మాష్టారు సంజీవయ్యగారు గుర్తుకొచ్చారు. ఒక సంవత్సరం జనవరి ఒకటిన ఆయన క్లాసులోకి రాగానే ఇలాగే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పలకరించాను. ఆయన కొంచెం తీక్షణంగా చూసి బోర్డు వైపు తిరిగి – “365” అంటూ రాసాడు.
“ఏమిటిది?” అడిగాడు.
“ఒక సంవత్సరంలో వుండే రోజులు..” క్లాసులో చాలామంది బదులిచ్చారు.
“అదే... అన్నే రోజులు ఎందుకున్నాయని?”
“భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం – మూడొందల అరవైదు రోజులు” చెప్పాను.
“మరి లీపు సంవత్సరంలో 366 రోజులు వుంటాయేం?” కళ్ళెగరేస్తూ మళ్ళీ అడిగాడాయన. ఈసారి సమాధానం చెప్పడానికి నాకు కొంచెం సమయం పట్టింది.
“ఎందుకంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 కన్నా ఒక పావు రోజు ఎక్కువ పడుతుంది... అలాంటి పావు రోజుల్ని మొత్తం కలిపి నాలుగేళ్ళకి ఒకసారి ఫిబ్రవరిలో చేరుస్తాము.. అందుకే ఒక రోజు ఎక్కువ వుంటుంది..” చెప్పాను ఖగోళపాఠాన్ని లెక్కల మాస్టారికి వివరిస్తూ. ఆయన ప్రసన్నంగా నవ్వి-
“అంటే మనం అర్థరాత్రి దాకా మేలుకోని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటామే అదంతా బూటకం... నిజంగా భూమి మొదలు పెట్టిన చోటికి మళ్ళీ తిరిగి రావటానికి 365 రోజులు కాక మరో పావురోజు పడుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం అర్థరాత్రి కాకుండా మర్నాడు పొద్దున ఆరు గంటలకీ, ఆ తరువాత సంవత్సరం మధ్యాన్నం పన్నెండు గంటలకీ, ఆ తరువాత సంవత్సరం సాయంత్రం ఆరు గంటలకీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి..” చెప్పాడు సంజీవయ్య మాష్టారు.
మా ముఖాల్లో ఆశ్చర్యం చూసి మరి కొంచెం నవ్వుకుంటూ – “అంతే కాదురా... నువ్వు చెప్పినట్లు నాలుగోవంతు రోజు కూడా కరెక్టుగా నాలుగోవంతు కాదు. కొన్ని గంటలు అటూ ఇటూ... ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాలుగు వందల సంవత్సరాలకి ఒకసారి కానీ కరెక్టుగా డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటలకి భూమి మొదలు పెట్టిన ప్రదేశంలో వుండదు. అంటే అర్థరాత్రి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మనల్ని మనమే పిచ్చోళ్ళని చేసుకొవడం...” వివరించాడాయన.
ఆయన చెప్పిన విషయం నాకు సగం అర్థం అయ్యి సగం అర్థం కాక వుండిపోయాను. ఆ విషయం గురించి చాలా సార్లు ఆలోచించాను. ఆ లెక్కలేవో నాకు అర్థం కాలేదు కానీ మరీ కొత్త కోణం అర్థం అయ్యింది. భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సమయాన్ని ఏ మూడొందల రోజులకో, నాలుగొందల రోజులకో సర్దేసి వుండచ్చుగా దేవుడు? ఈ అరవై అయిదు రోజులా కొసర్లు ఎందుకు? ఇదిగో ఇది కూడా దేవుడు చేసే ఒక గారడీ. మనల్ని మోసం చేసే గారడీ. మోసం చెయ్యడమే కదా గారడీ అంటే.
***
“తరువాత కార్యక్రమం... మెజీషియన్ బుచ్చిబాబుచే మ్యాజిక్ షో...” స్టేజి పైన ప్రకటన వినపడటంతో ఈ లోకలోకి వచ్చాను. హడావిడిగా పెట్టెని స్టేజి దగ్గరగా జరుపుకోని, వంగి వేదికకి నమస్కారం చేసుకొని ముందుకు నడిచాను.
“త్వరగా కానివ్వాలి... టైమ్ లేదు మనకి” చెవి దగ్గర చెప్పాడు నిర్వాహకుడు. ఆయన మైక్ ఆపడం మర్చిపోయాడు కాబట్టి ఆయన చేసిన సూచన ప్రేక్షకులదాకా పాకింది. గట్టిగా నవ్వులు
నేను మొదలు పెట్టాను.
పేకమేడలు లేస్తున్నాయి, కాగితం తగలబడి నోట్లకట్టలా మారుతోంది, ఏ ఆధారం లేకుండ కర్ర గాలిలో నిలబడుతోంది.
“కానీరా బాబూ... బోరు కొట్టిస్తున్నావు..” ఎవడో ఆకతాయి అరిచాడు.
“ఆ పిల్ల పాటే నయం... వీణ్ణి ఎవడు పిలిచార్రా..” ఇంకెవరో నిట్టూరుస్తున్నారు.
యాంత్రికంగా నా మ్యాజిక్ జరుగుతూనే వుంది. మనసులో నాన్న మెదిలాడు. ఆయన దగ్గర నాలా సూటు లేదు, అందమైన మేకప్ లేదు, మైక్ లేదు, సరంజామా లేదు... అయినా జనం. తోసుకుంటూ, ఒకరి మధ్యలో ఒకరు దూరుకుంటూ, ఒకరి భుజాల మీద నుంచి ఇంకొకళ్ళ తలలు మొలుచుకుంటూ, కొంగల్లా మెడల్ని చాపుకుంటూ, ఆశ్చర్యంగా కళ్ళు విచ్చుకుంటూ...
“కానీ... కానీ...” వెనకనుంచీ పిలుపు.
ఒక ఇరవై మందిదాకా కొత్త జనం వచ్చి స్టేజి ముందుకు చేరారు. ఆ రాత్రితో తాగుడు మానేస్తామని నమ్మే మూర్ఖులు. అదే నెపంగా నాలుగు రోజులకి సరిపడా తాగి అప్పుడే అక్కడికి చేరుకున్నారు.
“చెప్పాగా గురూ... ఇక్కడంతా చెత్త పోగ్రాములుంటాయని... మన సిటింగే కరెష్టు...” బీడీ పొగ వదులుతూ అన్నాడెవరో.
నా వెనక స్టేజీ పైన ఒక బల్ల, దాని పైన కేకు వచ్చి చేరింది. దూరంగా ఎవరో టపాసులు అంటించారు. జరిగేది అర్థం అయ్యేలోపల నా చేతిలో మైక్ లాకున్నారు. “ఇప్పుడు కేక్ కటింగ్...” మైక్‍లో నుంచి వినపడింది. నా టోపీలో నుంచి బయటికి రావాల్సిన పావురం అక్కడే ముడుక్కోని వుండిపోయింది.
జనంలో కోలాహలం. అయిదు... నాలుగు... మూడు... రెండు... ఒకటి... సున్నా.... హ్యాపీ న్యూ ఇయర్....!!
ఎవరెవరో ఎవరెవరినో కౌగిలించుకుంటున్నారు. పలకరించుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్... హ్యాపీ న్యూ ఇయర్. ఫోన్లు, మెసేజులు, కేకులు, కేరింతలు...!! ఏదో అర్థంకాని కోలాహలం. నేనొక్కణ్ణే స్టేజికి ఒక మూలగా, వైరాగ్యం ఆవహించిన సన్యాసిలా నిలబడి చూస్తూ వున్నాను. సంజీవయ్య మాష్టారు చెప్పినట్లు చాలా మంది పిచ్చివాళ్ళు కనపడుతున్నారు నాకు.
***
తెల్లవారుతోంది.
అవున్నిజమే... కేలండర్ మారింది. రోజు ఒక పేజి చించుతాం, కాకపోతే నెలకి ఒక కాగితం మడుస్తాం. ఈ రోజు కొత్త క్యాలండర్ అదే స్థానంలో. రెండు రోజులు పోతే దాని ముఖాన కూడా పాలపేకట్ లెక్కలు, ఇస్త్రీ బట్టల పద్దులు.
ఎవరి బతుకైనా అంతేగా. రాత్రి తాగింది దిగాక కొత్త సీసా పగుల్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్న మధ్యాన్నానికి గత సంవత్సరం బాకీలు గుర్తుకొస్తాయి. నాలాంటి వాడికి కడుపు నింపుకునే మహా మహా కార్యానికి మరో రోజు పుట్టుకొస్తుంది. స్కూటర్ తీసి శేషు ఇంటినుంచి బయల్దేరాను. మధ్యాన్నానికి పక్కూరికి వెళ్ళి అక్కడ సాయంత్రం ఎవరిదో పుట్టిన రొజు ఫక్షన్లో మ్యాజిక్ షో. మళ్ళీ అదే పెట్ట, అదే స్కూటర్, అదే బుచ్చిబాబు, అదే పావురం.
వూరు పొలిమేర దాకా వచ్చానో లేదో అక్కడ దృశ్యాన్ని చూసి ఆగిపోయాను. కాలవ మీదుగా ఆకాశాన్ని ఆక్రమించేందుకు సూర్యుడు కదులుతున్నాడు. ఎర్రరంగు సిరా పోసి అలికినట్లు ఆకాశం సూర్యుణ్ణి ఆహ్వానిస్తోంది.
దేవుడు రోజూ చేసే మ్యాజిక్ షో. కేలండర్ మారినా, జనవరి ఒకటైనా డిసెంబరు ముప్పై ఒకటైనా, అలుపుసొలుపు లేకుండా యుగయుగాలుగా సాగుతున్న ఇంద్రజాలం. చూడాల్సినవాళ్ళంతా రాత్రి మత్తులోనే జోగుతున్నాసరే ఆగని మహేంద్రజాలం.
“మన చుట్టూ జరుగుతుండే గారడిని తెలుసుకోవడమే విద్యంతా...” నాన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది.
ఇప్పుడు నాన్న చేసినంత అద్భుతంగా నేనూ గారడి చెయ్యగలను.

***
(హంసిని వెబ్ పత్రిక అక్టోబర్ 2012)

ఏ మతం


ఆ రోజు శుక్రవారం కావడంతో ఆజాద్ మసీద్ దగ్గర డ్రాప్ చెయ్యమని నన్ను బ్రతిమిలాడాడు. అతన్ని బండి మీద తీసుకెళ్ళి దింపాను. అతను నమాజ్ చేసి తిరిగి వచ్చేదాక మసీదు బయట నిలబడి ఎదురుచూస్తున్నాను. సరిగ్గా అప్పుడే కనిపించింది ఆమె.
ముఖం కప్పుకోకుండా బురఖా వేసుకోని ఓ పసిపిల్లని ఎత్తుకుని డబ్బులు అడుక్కుంటోంది. ఆమె ముఖం గుర్తుపట్టాను. ఇంతకు ముందు ఎక్కడ చూశానా అని గుర్తుతెచ్చుకున్నాను. రెండు రోజుల క్రితం గుడికెళ్ళినప్పుడు అక్కడ ఆమె అడుక్కోవడం చూశాను.
ఛ.. ఈమె ఎంత మోసం చేస్తోందీ! గుడిదగ్గర హిందువులా.. ఇక్కడ ముస్లింలా రెండు చోట్ల.. రెండు రకాలుగా.. వేషం మార్చి జనాలని మోసం చేస్తోంది. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. పోలీసులకో, కనీసం పత్రికలవాళ్ళకో చెప్తేకాని దారిలోకి రారు! అనుకుంటూ వెళ్ళి ఆమెను నిలదీశాను.
“ఏయ్.. మొన్న గుడి దగ్గర... ఈ రోజు మసీదు దగ్గర.. ఏంటీ మోసం? పోలీసులకి పట్టివ్వనా?” అన్నాను. ఆమె సమాధానం చెప్పలేదు.
“చెప్పు నువ్వు హిందువా? ముస్లిమా?” గట్టిగా అడిగాను.
“నేను మతం పేరు చెప్పి అడుక్కోవడం లేదు బాబు... నా పేదరికం... నా పిల్ల ఆకలి చూపించి అడుక్కుంటున్నాను... వీటి మతం ఏమిటో నాకు తెలియదు..” అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయిందామె.
మసీదులోనుంచి నమాజు వేదమంత్రంలా వినిపించింది నాకు.

(కార్డు కథ)
(విపుల – అక్టోబర్ 2012 )

గతం గతః (కథ)


దండపాణి ఆనందంతో పెట్టిన పొలికేక దాదాపు నాలుగు సార్లు ప్రతిధ్వనించింది. అయినా అతని మనసు శాంతించలేదు. ముఫ్ఫై ఏళ్ళ కఠోర శ్రమ ఫలించి కళ్ళ ముందు నిలిస్తే ఎవరికైనా అంతే ఆనందం కలుగుతుంది మరి. పైగా ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వైజ్ఞానిక విప్లవం అది. కేవలం కలలకో, కథలకో, సినిమాలకో పరిమితమైన ఊహ అది. ఇప్పుడు దండపాణి ఆవిష్కారం పుణ్యమాని వాస్తవం అయ్యింది. ఆ ఆవిష్కారం పేరు – టైమ్ మెషీన్.

ముఫ్పై ఏళ్ళ క్రితం ఇలాంటి ఆవిష్కారం సాధ్యమేనని దండపాణి చెప్తే అందరూ ఎద్దేవా చేశారు. ఇదే ధ్యాసలో పిచ్చివాడిలా తయారయ్యాడని ఉద్యోగంలోంచి తీసేశారు. పిచ్చి కుదరాలంటే పెళ్ళి చెయ్యాలని పెళ్ళి చేశారు. రాను రాను పిచ్చి ముదిరిందే తప్ప తగ్గలేదని మందులు, మాకులు, షాకులు కూడా ఇప్పించారు. శాంతియాగాలు, భూతవైద్యాలు చేయించారు...!! అన్నింటినీ సహించాడు దండపాణి. తాతలు సంపాదించిన ఆస్తి మొత్తం ధారపోసి తన ఇంటి పైన రెండు గదులూ ఒక ఖార్కానా చేసి, ఎలాగైతేనేం చివరికి కనుక్కునాడు. టైమ్ మెషీన్ కనుకున్నాడు. ఆ ఆనందంలోనే గెంతుతూ దుముకుతూ అరవడం మొదలుపెట్టాడు –

“ఇప్పుడు... ఇప్పుడు... అనండిరా నన్ను పిచ్చోడని... ఇప్పుడు అనండి చూస్తాను...” అంటున్నాడు.

“ఏమిటండీ ఆ పిచ్చి కేకలు” అంది అతని భార్య సక్కుబాయి లోపలికి వస్తూ.

గాలి తీసిన బెలూన్ లా, పంక్చర్ అయిన టైరులా ఆనందం అంతా జారిపోయి నిలబడ్డాడు దండపాణి.

“ఆ గెంతులేమిటి? ఆ అరుపులేమిటి? మీ పిచ్చికి ఇప్పటికే చుట్టుపక్కలవాళ్ళు మెంటల్ హాస్పిటల్ కి కంప్లైంట్ ఇస్తామంటున్నారు... ఇప్పుడు ఈ గోలకి పోలీస్ స్టేషన్ కి కూడా ఇస్తారు..” అంది సక్కుబాయి.

“పోలీసులేమిటే... ఇదిగో ఇప్పుడు నేను కనుక్కున్న విషయం తెలిసిందంటే ప్రసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి చెప్తారు..” అన్నాడు గర్వంగా.

“అయ్యోరామా... అంత పెద్దమనిషికి చెప్పేంత తప్పు ఏం చేశారండీ...” అంది ఖంగారుగా.

“తప్పు కాదే మొద్దు... కనిపెట్టాను... ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేకపోయిన టైం మెషీన్ కనిపెట్టాను..” చెప్పాడు దండపాణి కాలరెగరేస్తూ.

“సరే కనిపెడితే కనిపెట్టారు... ఇంక చాలు... కిందకి రండి పోదాం..”

“ఓసి నా పల్లెటూరి మొద్దూ... నేను కనిపెట్టింది ఏమిటో తెలుసా కాలవాహకం... కాలంలో ముందుకీ వెనక్కీ వెళ్ళగలిగే మెషిను... దీని ద్వారా మనం ఎన్ని సంవత్సరాలైనా ముందుకు ఎన్ని సంవత్సరాలైనా వెనక్కీ వెళ్ళచ్చు...” చెప్పాడు టైమ్ మెషీన్ చూపించి. సక్కుబాయి దగ్గరగా వచ్చి ఆ మెషీన్ ని చూసింది.

“ఇదేమిటండీ మా కోటప్పకొండ జాతరలో చిన్న ప్రభలా వుంది... దీనికి ఇంత మహత్తు వుందా?” అంది ఆశ్చర్యంగా.

“మరి ఏమనుకున్నావు?” అన్నాడు

“అయితే ఒక పనిచేసి పెట్టరూ... ఇస్తరాకులు సీరియల్ లో ఆ పంకజాక్షికి రెండో మొగుడికి నాలుగో పెళ్ళాం వుందన్న సంగతి తెలుస్తుందా తెలియదా కొంచెం చూసి చెప్తారూ...” అంది బ్రతిమిలాడుతూ.

“ఒసే సక్కూ... ఇంత కష్టపడి కనిపెట్టింది ఈ ఇస్తరాకులు, ఇనపరేకులు సీరియల్ గురించి తెలుసుకోడానికి కాదు... దీంతో నేను సాధించాల్సింది చాలా వుంది... నువ్వు కిందకి వెళ్ళి ఆ సీరియళ్ళు చూసుకో... నేను ఈ మెషీన్ ఎక్కి అలా షికారుకి వెళ్ళొస్తాను.” చెప్పాడు దండపాణి. అప్పటికే టైమ్ మెషీన్ ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అని తొందరగా వుంది అతనికి.

“షికారా... అయితే నేనూ వస్తానండీ... ఎప్పుడో పెళ్ళైన రెండు నెలలకి సైన్స్ మ్యూజియంకి తీసుకెళ్ళారు... మళ్ళీ ఇప్పటికి వింటున్నాను షికారనే మాట... నన్నూ తీసుకెళ్ళండీ..” అంటూ బ్రతిమిలాడింది ఆమె.

“ఏమిటే... నేనేమన్నా బిగ్ బజార్ కి వెళ్తున్నానా... కాలంలోకి ప్రయాణం... భవిష్యత్తులోకి వెళ్ళి...” అతను చెప్పకముందే అందుకుంది సక్కుబాయి.

“సరేలెండి.. మీరు తీసుకెళ్తారేమో అని అనుకోవడమే తప్పు... మీరు వెళ్ళి రండి..” చెప్పింది. “అన్నట్టు రాత్రి భోజనానికి వస్తారా? ఏం వండమంటారు?” అడిగింది అమాయకంగా.

సమాధానం ఏం చెప్పాలో తెలియక తలబాదుకున్నాడు దండపాణి. “నేను ఏదో ఒకటి తింటాలేగానీ.. నువ్వు జాగ్రత్తగా పడుకో... నేను ఇలా వెళ్ళిన సంగతి ఎవరితో అనకు...” చెప్పి టైం మిషన్ లోకి ఎక్కాడు అతను.

“సరే... వచ్చేటప్పుడు చంటాడికి ఏమన్నా తీసుకురండి” అంటూ కదిలింది సక్కుబాయి.
దండపాణి టైమ్ మెషీన్ ఎక్కి కూర్చున్నాడు.

ఎక్కడి వెళ్ళాలి? ముందుకా? వెనక్కా?

“వెనక్కి వెళ్ళి ఇందిరాగాంధీనో, బాపూజీనో చూసి వస్తే ఎలా వుంటుంది?” అనుకున్నాడు. “అంత దూరం వెళ్ళి ఊరికే చూసిరావడం ఎందుకు? ఫలానా ఫలానా వాళ్ళు ఫలానా తేదీ రోజు వాళ్ళని చంపబోతున్నారని చెప్తే పాపం జాగ్రత్త పడతారు కదా?” అని మరో ఆలోచన వచ్చింది.

తీరా వెళ్ళి చెప్పిన తరువాత పిచ్చివాడని తీసిపారేస్తారేమో అని అనుమానం వచ్చింది. “అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు?” అని అనుమానించి లోపల వేసి కుళ్ళబొడుస్తారేమో అని భయం వేసింది.

“ఇదంతా కాదు... వెనక్కి వెళ్ళడం కన్నా ముందుకి వెళ్ళడమే కరెక్ట్... ఈ ప్రపంచాన్ని సాంకేతికంగా ముందుకు నడిపించే యంత్రం కనుకున్నాను కాబట్టి, నేను కూడా ముందుకే వెళ్తాను” అనుకునాడు స్థిరంగా.

“రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో కనిపెట్టవచ్చు... అసలు ఇలాంటి పరికరం ముందు ముందు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు... ఇలాంటి మెషీన్ కనిపెట్టినందుకు తనకు ఎంత పేరు వచ్చిందో కళ్లారా చూసి రావచ్చు..” అంటూ ఉత్సాహపడ్డాడు. మెషీన్ లో బటన్లు నొక్కి, 2032 అని సంవత్సరం నొక్కాడు... ఒక్కసారి అన్నీ సక్రమంగా వున్నాయో లేదో చూసుకోని అసలైన ఎర్రబటన్ నొక్కాడు. టైం మెషీన్ మాయం అయ్యింది.

***

ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇరవై ఏళ్ళలో అనుకున్నదాని కన్నా ఎక్కువ అభివృద్ధే జరిగినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న ఇళ్ళ స్థానంలో పెద్ద పెద్ద సౌధాలు వున్నాయి. చిన్న చిన్న గుడిసెలు వుండాల్సిన చోట “ఈ స్థలం ఫలానా ఎమ్.ఎల్.ఏ. గారికి చెందును” అని రాసిన బోర్డులు కనిపించాయి. రోడ్ల నిండా గుంతలు, కార్లు విపరీతంగా పెరిగిపోయాయి. కాలుష్యం ప్రమాద స్థాయిలోనూ, పర్యావరణం పతనావస్థలోనూ వున్నట్టు గుర్తించాడు. వూరంతా తిరిగి సంభ్రమంగా చూశాడు.

రాబోయే కాలాన్ని అతి దగ్గరగా చూసేందుకు అవకాశం తనకి మాత్రమే వచ్చినందుకు చాలా సంతోషించాడు. అలాంటి అనుభవం తన టైం మిషీన్ వల్లే వచ్చిందని గుర్తుకువచ్చి తన భుజం తనే చరుచుకోని “శభాష్” అనుకున్నాడు. ఆ కాలంలో వున్న వింతలు విశేషాలు ఒక్కొక్కటిగా పరిశీలించాడు.

పేపర్లో అచ్చులో వార్తల బదులు కదులుతున్న బొమ్మలు కథలు చెప్పడం చూశాడు. టీవీకి పేపరుకు అంటు కడితే పుట్టిన కొత్త పరికరం కాబోలని ఆశ్చర్యపోయాడు. అయితే వార్తల్లో పెద్ద మార్పేమీ లేదని గ్రహించాడు. నేరం చేసినట్లు రుజువైనా రాజ్యమేలుతున్న నాయకుల గురించి, చంద్రమండలంలో జరిగిన లాండ్ మాఫియా గురించి తెలుసుకున్నాడు. డేబ్బై ఏళ్ళ హీరో పదహారేళ్ళ హీరోయిన్ తో పాటలు పాడుతూ వేసిన స్టెప్పులను చూశాడు. రోబోల తో వివాహాలు ఎక్కువైపోతున్నాయని సంసారాల శాఖా మంత్రి చేసిన ప్రకటన గురించి చదివాడు. వేల మైళ్ళ వేగంతో పరుగెత్తే రైళ్ళను, కార్లను దాని వల్ల పెరిగిపోయిన ప్రమాదాలను గమనించాడు. అన్ని సంవత్సరాలైనా బాబాలను, స్వామీజీలను నమ్మి మోసపోతున్న ప్రజలను చూశాడు. ఇవన్నీ తిరిగి వెళ్ళిన తరువాత అందరితో చెప్పాలని ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఆ తరువాత ఆకలేస్తే దగ్గర్లో కనపడ్డ రెస్టారెంటుకు వెళ్ళాడు. సర్వర్ వచ్చి ఏదో మెషీనుతో దండపాణిని పైనుంచి కిందదాకా తనిఖీ చేశాడు. ఆ తరువాత వినయంగా నమస్కరించి -

“సార్.. మీకు షుగర్ లెవల్స్ ఎక్కువగానూ, హార్ట్ బీటు తక్కువగా వున్నాయి... అందువల్ల...” అన్నాడు సర్వరు.

“ఇదేమిటి... హోటల్ అనుకోని హాస్పిటల్ కి వచ్చానా?” అని అనుమానంగా అడిగాడు.

“లేదు సార్... మీ ఆరోగ్యం సంగతి తెలిస్తే కదా మీకు ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలిసేది... మీకు వున్న రోగాలకి చక్కర వెయ్యని డ్రింకు, ఉప్పు వెయ్యని పచ్చి కూరలు, యమహో వారి ప్యాకేజ్డ్ కాకరకాయ జూస్ ఇవ్వగలం... మీకు ఇష్టమైతేనే చెప్పడి” అన్నాడు అతను.

మనిషి ఆరోగ్యం స్పర్శమాత్రంగా తెలుసుకునే ఆ మెషీన్ ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. అయితే తనకి ఇష్టమైనవి తిననీయకుండా, రోగిష్టివాడికి పథ్యం ఇస్తున్నట్లు పెట్టే తిండి తినాలని అనిపించలేదు. సరిగ్గా అప్పుడే అతనికి భార్య సక్కుబాయి గుర్తుకువచ్చింది.

“ఎలా వుందో, ఏం చేస్తోందో... నా ఇల్లు ఎలా వుందో, అసలు తను ఇప్పుడు ఎంత ముసలాడు అయిపోయాడో” లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అనిపించింది అతనికి. వెంటనే తన ఇల్లు వుండాల్సిన చోటుకి వెళ్ళాడు.

ఇల్లు అక్కడే వుంది. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం చూసిన ఇళ్ళు ఇప్పటికీ అదే విధంగా వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. కాకపోతే కొంచెం రంగులు వెలిసిపోయి వుందంతే. అసలు ఇంతకాలం ఏ కబ్జాదారుడు కన్ను దానిమీద పడకపోవటమే అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. తలుపు పక్కనే వున్న కాలింగ్ బెల్ నొక్కాడు.

“ఎవరదీ...?” అంటూ వచ్చింది ఒక ముసలామె. ఆమెను చూడగానే పెద్దగా నవ్వటం మొదలు పెట్టాడు దండపాణి.

“ఎవరండీ మీరు? ఎందుకు నవ్వుతున్నాడు” అడిగిందా ముసలామె.

“ఒసేయ్... సక్కుబాయ్.. నేనే దండపాణిని...” అన్నాడు అతను. ఆమె కళ్ళలో ఆశ్చర్యం చూసి ఇంకా నవ్వు వచ్చొందతనికి. సక్కుబాయి కాస్సేపు స్తబ్దుగా వుండిపోయింది. ఆ తరువాతే మొదలైంది –

“చచ్చినోడా... ఎందుకు వచ్చావు ఇప్పుడు.. నేను బతికి వున్నానో లేదో అని చూడటానికి వచ్చావా?” అంది నిష్టూరంగా.

“అదేమిటే అలా అంటావు... నేను నీతో లేనా? నేను నువ్వు అనుకుంటున్న నేను కాదు... ఇరవై ఏళ్ళ క్రితం నుంచి టైం మెషిన్ ఎక్కి వచ్చాను...” చెప్పాడతను. ఆమె తల కొట్టుకుంది.

“ఇంకా ఆ విషయాలే మాట్లాడుతున్నారా? నా ఖర్మ..!!” అంది ఆమె కోపంగా.

“ఇందులో తప్పేముందే... అప్పుడు ఎప్పుడో ఎక్కాను... ఇక్కడ దిగాను... చూడు అందుకే నీ కన్నా వయసులో, అందంగా వున్నాను...” కాలర్ ఎగరేస్తూ చెప్పాడతను.

“ఎందుకు వుండవూ... నీ కోసం ఎదురుచూసి చూసే నేను కదా ఇలా తయారయ్యాను... లేకపోతే నీ కన్నా అందంగా వుండేదాన్ని కాదూ..” అంది ఆమె.

“అదేమిటే... నా కోసం ఎదురు చూడటం ఏమిటి? అప్పటి నుంచీ నేను తిరిగిరాలేదా? నన్ను ఆఖరుగా ఎప్పుడు చూశావు.” అడిగాడు దండపాణి.

“ముదనష్టపోడా... అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రాత్రికి భోజనానికి వస్తానని వెళ్ళావు... నేను నీ కోసం గోంగూర పచ్చడి చేసి ఎదురుచూస్తూ కూర్చున్నాను..” గుర్తుతెచ్చుకుంటూ అంది సక్కుబాయి.

“అంటే ఆ తరువాత మళ్ళీ నేను కనిపించలేదా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఎక్కడా? మళ్ళీ ఇప్పుడే కదా కనిపించావు...” అంది కొంచెం బాధగా.

“అదేమిటి... నేను ఇప్పుడే టైం మెషీన్ లో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, నేను ఎందుకు తిరిగిరాలేదో కనుక్కుంటాను...” అంటూ కదలబోయాడు దండపాణి. ఠక్కున చెయ్యి పట్టుకోని ఆపింది సక్కుబాయి.

“ఇదుగో ఆ దిక్కుమాలిన మెషీన్ దగ్గరకు మళ్ళీ వెళ్ళారా మిమ్మల్ని చంపి నేనూ చస్తాను...”  అంది ఆవేశంగా.

“అదేమిటే... అప్పట్లోకి వెళ్తే కదా అసలేం జరిగిందో తెలిసేది... నీకర్థం కాదు కానీ... ఒక్క గంట ఓపిక పట్టు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తేను ” అని దండపాణి చెయ్యి వదుల్చుకోబోయాడు. ఆమె పట్టు వదలలేదు.

“ఆ దరిద్రపుగొట్టు మెషీన్ అప్పుడు ఎక్కి పొయ్యావు మళ్ళీ రావడానికి ఇరవై ఏళ్ళు పట్టింది... మళ్ళీ వెళ్ళావంటే నేను చచ్చిన తరువాత కానీ రావు... నేను వెళ్ళనివ్వను అంతే” అంది మొండిగా.

“ఇదెక్కడి గోలే సక్కూ... నీకు అర్థం కావటంలేదు... నేను ఇప్పుడు వెళ్తేనే నువ్వు చేసిన గోంగూర పచ్చడి తినేది... నీకు ఎదురుచూపులు తప్పేది...” వివరించడానికి వృధా ప్రయాస చేశాడు దండపాణి. సక్కుబాయి కాస్త మెత్తపడ్డట్టే అనిపించింది.

“సరే ముందు ఇక్కడ కూర్చోండి..” అంటూ కుర్చీ చూపించింది. దండపాణి కుర్చీలో కూర్చోగానే పరుగు లాంటి నడకతో ఇంటి బయిటికి అడుగుపెట్టి బయట నుంచి గడియ వేసేసింది. జరిగింది దండపాణి అర్థం చేసుకునే లోపల తన ఇంట్లోనే బందీ అయిపోయాడు.

“సక్కూ.. ఇదేమిటే... ఇలా బంధించావు? ముందు తలుపుతీ..” అన్నాడు కిటికీ దగ్గరకు వచ్చి.

“తలుపు తీయాలేం? తలుపు?... వుండండి... ఆ దిక్కుమాలిన మెషీన్ ని నాశనం చేస్తేగాని మీరు బుద్ధిగా వుండరు...” అంటూ పెరటి మొక్కల దగ్గర వున్న గునపం తీసుకోని టైం మెషీన్ దగ్గరకు పరిగెత్తింది.

“వద్దే... నా మాట విను... ఆ మెషీన్ పాడు చేస్తే మళ్ళీ నేను వెనక్కి పోలేను... మళ్ళీ అది తయారు చేసేందుకు నా దగ్గర నోట్స్ కూడా లేదు... వద్దే.. పల్లెటూరి మొద్దు...” అరుస్తూనే వున్నాడు దండపాణి. అప్పటికే సక్కుబాయి టైం మెషీన్ పగలగొట్టడం మొదలుపెట్టింది.

<< ?>>

(సాక్షి ఫన్ డే)

బందేమాతరం



వాడిన పూలే వికసించులే... (సరదా కథ)


మాధవరావు అద్దంలో ఒక్కసరి చూసుకోని, తలపైన చేత్తో సవరించుకున్నాడు. నలభై ఏళ్ళ వయసు నల్లటి జుట్టు అయితే అందులో పదిహేనేళ్ళ వివాహంలా అక్కడక్కడ తెల్లజుట్టు మెరుస్తోంది.
“ఇంకా ఎంతసేపని ఆ అద్దం ముందు... మీరు కానిచ్చి బయల్దేరితే నేను చేసుకోవాల్సిన పనులు సవాలక్ష వున్నాయి..” వంటింటిలొ నుంచి అరిచింది అన్నపూర్ణ.
“చాల్లే సంబడం... నువ్వు అద్దం ముందు నిల్చుంటే నేను కేలండర్ ముందు నిలబడి తేదీలు మార్చాలి... నువ్వు నాకు చెప్పొచ్చావు...” మాధవరావు ప్రతిగా అన్న మాట ప్రతిధ్వనించింది.
“అనండి.. అనండి... మీరు నాకు నగలు, చీరలు సరైనవి కొనిస్తే, నాకు ఈ పైపైన మెరుగులు వేసుకోవాల్సిన పనే ఉండేది కాదు... అందరూ నగల్ని చూసి నన్ను అంచనా వేసేవాళ్ళు..” ఆ మాటలతో పాటు గరిటె వెళ్ళి పళ్ళెంపైన చేసిన నాట్యం తాలూకు శబ్దాలు కూడా మాధవరావును చేరాయి.
“ఇల్లు చూడు... ఇల్లాలిని చూడు అన్నారు కానీ... ఇలా నగల్ని చూడు నా ముఖం చూడు అనలేదే ఎవరూ..” అన్నాడు మాధవరావు.
“అయితే ఇంకే ఈ ఇల్లుని చూపించండి ఎవరికైనా... ఈ ఇంటిని, మన వాలకాన్ని చూస్తే ఇది ఇల్లు కాదు ఏదో మెంటల్ హాస్పిటల్ అనుకోని..”
“మరే.. మరే... నువ్వు పేషంటు, నేను డాక్టరు..” వెక్కిరించినట్లు నవ్వాడు.
“అవునవును... మిమ్మల్ని కట్టుకునేదాకా బాగానే వుండేదాన్ని పాపం... కట్టుకున్నాకే ఇలా పేషంట్ అయ్యాను”
“నీతో మాట్లాడటం కన్నా నోటికి ప్లాస్టర్ వేసుకోని..” ఆయన మాట పూర్తి కాకముందే అన్నపూర్ణ అందుకుంది..
“అక్కడ డ్రస్సింగ్ టేబుల్ కింద డ్రాయర్లో వుంది ప్లాస్టర్...” అనేసి గిరుక్కున తిరిగింది.
పాపం ప్లాస్టర్ వెయ్యకుండానే నోరు మూతపడటంతో, తప్పనిసరై ఇంట్లో నించి బయటపడ్డాడు మాధవరావు. ఏదో ఆఫీసు పని వల్ల వేరే వూరు క్యాంపుకి బయల్దేరాడు. జరిగిన ప్రహసనం అంతా అన్నపూర్ణ గారి తరహాలో చెప్పాలంటే వీడ్కోలు..!!
***
ఇదిలా వుండగా... పైన ఆకాశంలో...
“నాథా..!” రతీదేవి పలకరించింది.
“ఏం దేవీ” పులకరించాడు మన్మధుడు.
“మదీయ మానసంబున ఏదో అంతుతెలియన వింత భావన కలుగుచున్నది. సుగంధవీచకలను ఆఘ్రాణించిన భ్రమరమునకు చిత్తచాంచల్యము కలిగినటుల పరిపరి విధముల పరితపించుచున్నది..” అందామె భారంగా నిట్టూరుస్తూ. మన్మధుడు తేలికగా నిట్టూర్చి –
“ఏమిటిది దేవీ... ఇంకా ఆ గ్రాంధిక భాషను వదలలేదా? మనం ఎప్పుడూ మానవుల మధ్య తిరిగేవాళ్ళ... వారిలో ప్రేమ మొలకెత్తించేవాళ్ళం... ఆ భాషను వదిలి ఇప్పుడు ప్రేమకు కారణమైన ఇంటర్ నెట్, చాటింగ్ వంటివి నేర్చుకో అని నీకు ఎన్నిసార్లు చెప్పాను..” అన్నాడు అసహనంగా.
“బాగానే వుంది... ఆ విషయంలో మీకంటే ముందే వున్నాను... మీరు చెప్పినవే కాక ఫేస్ బుక్, ట్విట్టర్ గురింఛి కూడా తెలుసుకున్నాను... కానీ ఏకాంత వేళ... ఈ మధుర మధుమాసపు సంధ్యవేళ, మనసులో భావాలను చెప్పడానికి అదే అనువైన భాషనీ..”
“బాగానే వుంది... నీకు బొత్తిగా వేళాపాళా లేకుండా పోయాయి... సరసానికి ఇదా సమయం... ఇంకా మనం పూర్తి చెయ్యాల్సిన టార్గెట్ ఎంత వుందో తెలుసా... కనీసం ఈ నెల మనం వాడవలసిన బాణాలలో సగం కూడా వాడలేదు...”
“పూలతో చేసిన బాణాలు కదా... అవే వాడతాయిలే స్వామీ..”
“అయ్యే.. ఆ వాడటం కాదు సఖీ... మనం వాడటం గురించి చెప్తున్నాను... అర్థంచేసుకోకుండా...” మధ్యలో అందుకుంది రతీదేవి.
“నాకు బాగానే అయ్యింది... నేనేదో చమత్కారంగా అంటే అది మీకే అర్థం కావటంలేదు... అసలు నవ్వడమే మర్చిపొయారీమధ్య...!!” రుసరుసలాడుతూ వెనక్కి మళ్ళింది ఆమె. ఆ విసురుకి తగిలిన వాల్జడ దెబ్బకి సరసం కావాల్సింది విరసం అవుతోందని అర్థం అయ్యింది మన్మధుడికి.
“అంతలోనే అలకా... సరే ఏం కావాలో చెప్పు...”
“ఏదైనా అడిగితీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది... నా మనసులో విషయం మనసులో వుండగానే గ్రహించి తెచ్చిన ఆ అసమాన ప్రేముకుడైన మన్మథుడివేనా నువ్వు..” ఉక్రోషంతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
“ఎంత మాట దేవీ... గ్రహించే వాడినే కానీ ఏం చేద్దాం... అంతకన్నా ముందే నా వుద్యోగ ధర్మం అడ్డుపడుతోంది... నీకు తెలుసుగా ఈ మధ్య ప్రేమికులు ఎలా పెరిగిపోయారో.. పని వత్తిడి..” సంజాయిషీ ఇచ్చాడు అతడు. “ఇంతకీ విషయం చెప్పరాదూ” అంటూ తొందరపెట్టాడు.
“ఇన్ని యుగాలుగా చూస్తున్నాను. ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులు ఒకరికొకరు కోసం ఒకరన్నట్లు బ్రతుకుతారు... పూలు ఇచ్చుకుంటారు, బహుమతులు ఇచ్చుకుంటారు, పదే పదే ప్రేమ ప్రేమా అంటూ పలవరిస్తారు... తీరా పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకేముందిలే అన్నట్లు అవన్నీ మర్చిపోతారు... అంటే పెళ్ళి తరువాత ఆ ప్రేమలు వున్నట్లా లేనట్లా? అని సందేహం?” అనుమాన శరం వదిలింది ఆమె. ఆమె సంధించిన ప్రశ్న తమ వైవాహిక జీవితం గురించేనని మన్మధుడికి అనుమానం.
“అదంతా మనకెందుకు దేవీ... మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్... అంటే ప్రేమలు మన సామ్రాజ్యం, పెళ్ళిళ్ళు ఆ దేవేంద్రులవారి సామ్రాజ్యం...” అంటూ దాటెయ్యబోయాడు.
“అయితే మాత్రం... ప్రేమ పెళ్ళిళ్ళకి రిజస్ట్రార్ ఆఫీసరు, ఇద్దరు సాక్షులతో పాటు మనం కూడా బాధ్యులమే కదా? పెళ్ళి తరువాత మన పవర్ తగ్గి ప్రేమలు మాయమౌతున్నాయేమో తెలుసుకోవద్దూ...”
“సరే అలాగే... అయినా నీకు ఈ అనుమానం మన పెళ్ళి తరువాత రాలేదు కదా?” ఖంగారుగా అడిగాడు మన్మధుడు.
“అయ్యే ’ప్రేమా’... అలాంటిదేమీ లేదండీ...” అంటూ గోముగా కాముడి చేతిపై తన మునివేళ్ళని ఆడిస్తూ అడిగింది ఆవిడ. ఆవిడ అలా ఆడించినప్పుడల్లా ఆయన ఆమె చెప్పినట్లల్లా ఆడతాడు.
“సరే నీ సందేహాన్ని ఇప్పుడే నివారిస్తాను... వెంటనే ఒక ప్రేమ జంటని వెతుకు. వాళ్ళిద్దరికీ ప్రేమ వివాహం జరిగి కనీసం పదేళ్ళ అయ్యివుండాలి. ఇప్పుడు వాళ్ళ వైవాహిక జీవితంలో ప్రేమ పరిస్థితి ఏమిటో తెలుకుందాం...” అన్నాడు. రతీ దేవి భూలొకం వైపు దృష్టి సారించింది.
“అదిగో ఆ ఇద్దరిని చూడండి. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కానీ నిద్రలేచింది మొదలు ఎలుక పిల్లిలా తన్నుకుంటుంటారు.” అంటూ ఆమె చూపించింది. ఆమె చూపుడువేలు చూపించిన ఇద్దరి చూపులు దూసుకెళ్ళాయి.
ఆ ఇద్దరి పేర్లు – మాధవరావు, అన్నపూర్ణ.
***
బస్టాండ్ లో వస్తుందో రాదో తెలియని బస్సు కోసం ఎదురు చూస్తూ కునుకు తీస్తున్న మాధవరావు ఉలిక్కిపడి లేచాడు. అప్రయత్నంగా అన్నపూర్ణ గుర్తుకువచ్చింది. ఈ ట్రైనింగ్ ఒకటి దాపురించింది కానీ లేకపోతే ఒక్కడే వూరు దాటి వెళ్ళిందే లేదు. ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తే ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు.
“అన్నపూర్ణ జాగ్రత్త ఎక్కువ. నాతో వుందంటే సామాన్ల గురించి బెంగలేకుండా వుండేది... ఇప్పుడు కునుకు తీయటానికి కూడా లేదు...” అనుకున్నాడు. లేచి అసహనంగా అటూ ఇటూ తిరిగాడు. అన్నపూర్ణ పెట్టి పంపిన టిఫిన్ కేరియర్ లో నించి రెండు స్పూన్లు ఉప్మా తిన్నాడు. అది రుచిగా వుందా లేదా అనేది అనవసరం, అన్నపూర్ణ చేసి పెట్టిన ఉప్మా కాబట్టి ఎలా వున్నా తినాలనిపిస్తుంది ఆయనకి. మళ్ళీ లేచి అటూ ఇటూ తిరిగాడు.
“మూడు రోజులు... వూరు కాని వూరు, భాష కాని భాష... మాట్లాడుకోడానికి ఎవరూ వుండరేమో”... అనుకున్నాడు... “పోనీ ఎగ్గొడితే? ఏదైనా అనారోగ్యమని చెప్తే మూడు రోజులు ఇంట్లోనే వుండచ్చు... అనుకోని సెలవు కాబట్టి అన్నపూర్ణతో గడపచ్చు” మాధవరావు ఆలొచనలు అలా వుండగానే బస్సు వచ్చి ప్లాట్ ఫారం పైన నిలబడింది. ఆయన మాత్రం భారంగా నిట్టూర్చి బస్టాండ్ బయటికి అడుగులేశాడు.
***
అక్కడ అన్నపూర్ణకి వంట చెయ్యబుద్దెయ్యలేదు. “వంకాయలు వున్నాయి కానీ, అవి ఆయనకి ఇష్టం, ఆయన వచ్చిన తర్వాత గుత్తొంకాయ చేస్తే ఇష్టంగా తింటారు” అనుకుంది. పప్పు చేద్దామనుకుంది కానీ పొరపాటున నీళ్ళెక్కువ పడిపోయాయని దాన్ని సాంబారుగా రూపాంతరం చేసేసింది. అందులో కూడా వుప్పు రెండు సార్లు వేశానా అని అనుమానం ఒకటి మొదలైంది.
ఉడికీ ఉడకని అన్నం పక్కన పెట్టి, పొద్దున మాధవరావుకోసం వండి మిగిలిన ఉప్మా రెండు చెమ్చాలు తినింది. ఏమీ తోచకుండా వుండటంతో టీవీ పెట్టుకోని అందులో ఏదో మళయాలం ఛానల్ వస్తున్న గుర్తించకుండా – “ఈయన ఎట్లా పోతున్నాడో ఏమో..” అనుకుంది. టీవీ పాటికి టీవీని వదిలేసి బట్టలు సర్దే నెపంతో బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
“ఏమిటో ఈ మనిషి... షేవింగ్ కిట్ తీసుకెళ్ళడం మర్చిపోయారు... దారిలో గుర్తొచ్చి తిరిగి వచ్చినా బాగుండు...” అనుకుంది.
కాలింగ్ బెల్ మోగింది.
“ఏం వెనక్కొచ్చారు? మీ మాజీ ప్రేయసి శకునం రాలేదనా?” తలుతీసి ఆశ్చర్యం కనపడకుండా అంది అన్నపూర్ణ.
“కాదు నీ మాజీ ప్రియుడు శవం ఎదురొస్తే వెనక్కొచ్చా...” కసిగా అన్నాడు ఆయన లోపలికి వస్తూ.
“షేవింగ్ కిట్ కోసం వచ్చారా?”
“షేవింగ్ కిట్టే కావాలంటే నువ్వు తెచ్చిన కట్నం డబ్బుల్తో కొనుకునేవాణ్ణి... ట్రైనింగ్ కాన్సిల్ అయ్యింది..” అబద్దమాడాడు మాధవరావు.
“మూడు రోజులు సుఖంగా వుందామనుకున్నా... ఆ అదృష్టం కూడా లేదన్నమాట...” కొంగు విలించింది ఆమె.
“నాకు ఏమైనా వండావా?”
“పోతాను పోతాను అన్న తర్వాత ఎందుకు వండుతాను... నాకొక్క దానికే వండుకున్నా...” మూతి విసిరింది అన్నపూర్ణ.
“సరే కాఫీ ఫ్లేవరుతో వేణ్ణీళ్ళు ఇస్తావుగా అవైనా తగలబెట్టు...” అన్నాడు ఆయన. ఆమె రుసరుసలాడుతూ వంటింటిలొకి వెళ్ళి గుత్తొంకాయ చేయడానికి సరంజామా సర్దుకుంది.
“సాయంత్రం తొందరగా తెమిలితే ఆ చీరలకొట్టుకు పొయ్యద్దాం...” పేపరు చదువుతూ అరిచాడు ఆయన.
***
“ఇంతకీ ఏం జరిగింది స్వామీ... నాకేమీ అర్థం కాలేదు...” అడిగింది రతీదేవి.
“ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది... ఆమెను వదలేక ఆయన తిరిగి వచ్చాడు... ఆయన కోసమే ఎదురుచూస్తూ ఆమె కూర్చుంది...”
“అది సరే స్వామీ... మరి అంత ప్రేమ వున్నప్పుడు ఒకరికొకరు చెప్పుకోవచ్చు కదా?”
“అయ్యో దేవీ... వాళ్ళిద్దరి మధ్యా రోజూ జరిగి పిల్లి ఎలక పోరులోనే వారి ప్రేమలు వ్యక్తమౌతాయి... అందుకే ఒకరిని విడిచి ఒకరు వుండలేక పోతున్నారు... పెళ్ళి అయిపోగానే ప్రేమలు వుండవనేది నిజం కాదు... ఆ ప్రేమని వ్యక్తం చేసే విధానం మారుతుంది అంతే...” అంటూ నవ్వేడు నవమన్మధుడు.
“అయితే ఆ కొట్లాటలు, వెటకారాలు అన్నీ ప్రేమేనంటారా?” అడిగింది ఆశ్చర్యంగా.
“నిస్సందేహంగా...”
రతీదేవి క్షణం ఆలోచించి - “వాళ్ళ సంగతి సరే మరి మీ ప్రేమ పెళ్ళి తరువాత ఏ రూపాంతరం చెందిందో?” అడిగింది చిలిపిగా. కాముడు నవ్వి కార్యోన్ముఖుడయ్యాడు. వాడిన పూలు మళ్ళీ విచ్చుకున్నాయి.                
(ఆశ మాసపత్రిక సరదాకథల పోటీలో బహుమతి పొందిన కథ, ఆగష్ట్ 2012)
<?>