ఏడు తరువాత...



ఒక రోజు సాయంత్రం భలే విచిత్రం జరిగింది. ఏదో ధ్యాసలో అంకెలు లెక్కపెట్టుకుంటున్నానా, ఉన్నట్టుండి ఏడు తరువాత అంకె ఏదో గుర్తుకురాలేదు. బాగా ఆలోచించాను. ఒకసారి వరసగా లెక్కపెట్టుకుంటూ చూశాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు... అంతే అక్కడే ఆగిపోతోంది. ఆ తరువాత ఇంకా అంకెలు వున్నాయని మాత్రం తెలుస్తోంది కానీ అవేమిటో గుర్తుకురావటం లేదు. తల బద్దలు కొట్టుకున్నా ఫలితం లేదు.
“ఏమే... కాంతం... ఏడు తరువాత ఏమిటి?” అడిగాను భార్యని. చాలా సందర్భాలలో మా కాంతం నా కన్న ఎక్కువ తెలివైనదని నిరూపించింది కాబట్టి ఆమె దగ్గర నుండి సరైన సమాధానం వస్తుందని వూహింఛాను.
“ఏడు తరువాత ఏముంది... జీడిపాకం జీవితాలు సీరియల్ వస్తుంది...” అంది తాపీగా.
“అబ్బా అది కాదే... ఏడు అంకె తరువాత ఏమొస్తుందీ అని...” ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాను. ఆమె కూడా కొంచెం సేపు ఆలోచించింది. ఏం లాభం లేక పోయింది. ఏడు తరువాత అంకేదో గుర్తుకురాలేదు.
“చాల్లే సంబండం... నాకు ఇంకేం పని లేదనుకున్నారా? ఏడు తరువాత ఏముంటే నాకెందుకు... మీరు తీరిగ్గా అలోచించుకోండి..” అంటూ విసవిసా వంటింట్లోకి వెళ్ళిపోయింది. సమాధానం తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోకుండా తప్పుకోవడమూ తెలివితేటలే అనుకున్నాను. మళ్ళీ శేష ప్రశ్న ముందుకొచ్చింది. ఏడు తరువాత అంకె ఏమిటి?
బయట బజార్లో ఎవరినైనా కనుక్కోని వస్తానని బయల్దేరాను.
మా ఇంటి చుట్టుపక్కల ఇళ్ళలో వున్న వాళ్ళని ఒక్కర్ని కలిసి అడగటం మొదలుపెట్టాను. ఆశ్చర్యం..!! ఏ ఒక్కడికీ గుర్తు రావటంలేదు.
“ఏడు తరువాత?”
“ఏడు తరువాత ఏముంది... ఆఫీసు నుంచి ఇంటికి రావటం. టీవీ చూడటం, తినడం, పడుకోవడం...” దాదాపు అందరూ ఇదే సమాధానం. ఈ పనికిమాలిన టీవీ ఒకటి వచ్చిన తరువాత టీవీ చూడటం ఒక పని అయిపోయింది అందరికీ. కుటుంబం, సంసారం, పిల్లలు ఇవేవి లేవు...!! సరే ఆ విషయాలు మనకెందుకు?
“అది కాదండీ... ఏడు తరువాత అంకె ఏమిటని నా ప్రశ్న...” అని అడిగితే వెంటనే నిశ్శబ్దం. ఒక్కడూ సమాధానం చెప్పడే. ఒక్కొక్కడు ఒకో తరహా. ఒకడు తల పైకెత్తి ఆలోచిస్తున్నట్లు నటిస్తాడు. ఇంకొకడు మనసులోనే ఒకటి నుంచి మొదలుపెట్టి లెక్క పెట్టుకుంటాడు. ఇంకొక మహాఇల్లాలు నా వైపు చిరాగ్గా చూసి తలుపేసేస్తుంది. అయినా సరే ఒక్కరి దగ్గరా సమాధానం లేదు. అందరూ మర్చిపోయారు. ఏడు తరువాత ఏంటి?
“పోనీ మా ఇంటి దగ్గర ఒక మేధావి వున్నాడు. చాలా టీవీ చర్చల్లో పాల్గొన్నాడు.. అతణ్ణి అడుగుదామా?” సలహా చెప్పాడు స్నేహితుడు కృష్ణ. ఇద్దరం సరే అనుకోని మేధావి దగ్గరకు వెళ్ళాం.
“మేధావిగారూ మేధావిగారూ... ఏడు తరువాత ఏమొస్తుందండీ” అన్నాను గౌరవంగా.
“చూడండీ... అయిదు తరువాత ఆరు వచ్చింది... ఆరు తరువాత ఏడు వచ్చింది... దీని బట్టి చూస్తే ఏడు తరువాత కూడా ఏదో వస్తుందనే అనిపిస్తోంది. అయితే ఆరు తరువాత ఏడు రావటంలో ఆరు ప్రోద్బలం ఏమన్న వుందా? లేదా? అనేది పరిశీలించాలి. దాన్ని ఆధారం చేసుకొని ఏడు తరువాత ఏమొస్తుందో మనం కనుక్కోవచ్చు..” ఆయన టీవీ చర్చలో చెప్పినట్లు చెప్పుకుపోతున్నాడు. మనం మేధావి అయితే నాకు తలియదు చెప్పాల్సిన అవసరమే వుండదని అర్థం అయ్యింది.
“పోనీ ఎవరైనా లెక్కల మాస్టర్ అయితే చెప్పేస్తాడేమో.... పక్క వీధిలో బాదరాయణ అని కోచింగ్ సెంటర్ నడిపే లెక్కల మాస్టారు వున్నారు. ఆయన్న కలుద్దామా?” కృష్ణ మళ్ళీ సలహా పారేశాడు. ఇద్దరూ అక్కడికి చేరుకున్నాం.
“బాదరాయణగారు... ఏడు తరువాత ఏమిటండీ?”
“వుండే వుంటుంది ఏదో... అయినా దానికి విలువెక్కడిదీ... ఇప్పుడు ఎమ్ సెట్ ర్యాంకులే తీసుకోండి... ఒకటి, రెండు, మూడు... అంతే ఆ తరువాత ఏ అంకె వస్తే మాత్రం లాభం ఏముంది? వాటి గురించి, అవి తెచ్చుకున్నవాళ్ళ గురించి తెలుసుకోని మాత్రం ఏం ఉపయోగం?” అని చెప్పి పిల్లల మీద తన పాఠాల బాదుడు, చదువుల చాదుడు కొనసాగించాడు బాదరాయణ.
కృష్ణ ఇక వల్లకాదని చేతులు ఎత్తేశాడు. నేనొక్కణ్ణే కనపడ్డవాళ్ళందరినీ అడుగుతూ తిరుగుతున్నాను. ఒక పార్క్ కి వెళ్ళి చెట్లు లెక్క పెట్టడం మొదలు పెట్టాను. మళ్ళీ అదే గొడవ... ఆరు.. ఏడు... తరువాత ఆగిపోతుంది. అక్కడే గడ్డిలో పడుకోనున్న వ్యక్తి ఏమిటి సమస్య అని అడిగాడు. అతను చిత్రకారుడట. నేను నా సమస్య చెప్పాను.
“వున్నవే ఏడు అంకెలు... ఇంక తరువాత ఏముంటాయి? ఇంద్రధనస్సు చూడండి... ఏడే రంగులు..” చెప్పాడతను.
అక్కడే ఆడుతున్న కుర్రక్రికెటర్ ని అడిగాను
“అసలు ఏడు అనే అంకె వుందా... నాకు తెలియదంకుల్.... నాకు తెలిసినంత వరకూ సిక్సరే అన్నింటి కన్నా ఎక్కువ” చెప్పాడు.
నేను అక్కడి నుంచి బయటపడి బస్సు ఎక్కాను. కనపడ్డవాళ్ళందరినీ అడుగుతూనే వున్నాను. మంచి ఫార్మల్ బట్టలు, టై కట్టుకున్న సాఫ్ట్ వేర్ వుద్యోగి కనిపించాడు.
“బాబు ఏడు తరువాత ఏమొస్తుందో తెలుసా?” అడిగాను.
“ఓస్ అదేం పెద్ద విషయం.... ఏడు తరువాత మళ్ళీ మొదటికొస్తుంది... వారం అంతా గొడ్డు చాకిరీ చేస్తామా, వారాంతంలో రెండురోజులు నిద్రకి, బట్టలు ఉతుక్కోడానికి, సినిమాకీ, మందుకీ సరిపోతుంది... ఆ తరువాత మళ్ళీ సోమవారం... మళ్ళీ అదే ఆఫీసు... అదే గొడ్డు చాకిరీ” దిగులుగా చెప్పాడతను.
కండెక్టర్ వచ్చి టికెట్ ఇచ్చాడు. అతనికి రోజూ అంకెలతో, లెక్కలతోనే కదా పని అని ఆయన్ని అడిగాను -“ఏడు తరువాత ఏమిటండీ?” అని.
“ఏడు తరువాత ఏడుంపావలా... ఏడున్నర...”
“ఆ తరువాత..?”
“అదే లాస్ట్ స్టాప్..”
తల పట్టుకున్నాను నేను. వెనకటికి పేరు మర్చిపోయిన ఈగ కథలా తయారయ్యింది నా బతుకు. ఏడు తరువాత అంకె ఏమిటో గుర్తుకురాదు. అలాగని వదలనీయదు. బస్సు దిగిన తరువాత ఒక చోటా ఖద్దరు చొక్కా వేసుకున్న చోటా నాయకుడు కనపడ్డాడు.
“అయ్యా... నమస్కారం...” చేతులు జోడించాను భక్తిగా.
“అధికార పక్షమా.. ప్రతి పక్షమా...” అడిగాడు ఆయన.
“ప్రజా పక్షం...”
“ఇదో కొత్తపార్టీనా? సరే ఏమిటి నీ సమస్య...?”
“ఏడు తరువాత...??” సణిగాను.
“ఏమిటి ఏడు తరువాత...? ఉన్న టర్మే అయిదేళ్ళు... అది కూడా వుంటుందో వూడుతుందో తెలియని ప్రభుత్వాలు... పదవి కొనుక్కున్నదాంట్లో సగం కూడా సంపాయించుకోక ముందే ఎలక్షన్లు... అయిదేళ్ళే చూడక చాన్నాళ్ళైంది.... ఆ తరువాత నాకేం తెలుసు...” అంటూ ముందుకు కదిలాడు ఆయన.
ఆయన వెనక వుండే అనుచరగణంలో ఒకతను నన్ను పక్కకి పిలిచి విషయం చెప్పాడు – “ఏడు తరువాత అయ్యగారు మందు, విందు, పొందు మూడ్ లో వుంటారు... నేను ఏర్పాటు చేస్తా.. నీ పని కావాలంటే ఏడు తరువాత రా... “
“ఆ ఏడు తరువాతే నా సమస్యరా” అని అనుకొని బాధపడి అక్కడి నుంచి కదిలాను.
ఊరంతా తిరిగాను. కనపడ్డవాళ్ళందరినీ అడిగాను. ఏ ఒక్కరూ ఏడు తరువాత అంకె ఏమిటో చెప్పలేకపోయారు. ఉస్సూరంటూ ఇంటికి చేరాను.
“అయ్యిందా మీ రాచకార్యం..” వెటకారంగా అడిగింది కాంతం.
“ఏం కార్యమో... ఊరంతా తిరిగాను. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు..” కుర్చీలో కూలబడి అన్నాను.
“ఏమిటండీ చెప్పేదీ..?”
“అదే ఏడు తరువాత ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం..”
“బాగానే వుంది సంబడం... ఇంకా వదల్లేదా దాన్ని... ఏడు తరువాత ఏముంటే మనకెందుకండీ... అదంతా ఆలోచిస్తే మనకేమొస్తుంది చెప్పండి. రేపు పిల్ల స్కూల్ ఫీజు కట్టాలి... అదెట్లాగో ఆలోచించండి... ఈ సంసారం ఎట్లా గడవాలో ఆలోచించండి... పచారి కొట్టు కాంతయ్యకి నాలుగువేలు బాకీ వున్నాం.... అది ఆలోచించండి” కాంతం బాధగా కళ్ళొత్తుకుంది.
పచారి కొట్టు కాంతయ్య...!! ఆయన్ను అడగడమే మర్చిపోయాను. పెద్ద పెద్ద చక్రవడ్డీ లెక్కలు కూడా లెక్క కట్టి చెప్పేస్తుంటాడు. ఆయన తప్ప ఇంకెవరు నా ప్రశ్నకి సమాధానం చెప్పగలరు? కుర్చీలోంచి ఛివాలున లేచి కాంతయ్య కొట్టుకి పరుగు పెట్టాను.
“కాంతయ్యా... కాంతయ్యా...”
“ఏం బాబూ... బాకీ డబ్బులు తెచ్చావా?” విషయం వినకుండానే విషయానికి వచ్చాడు కాంతయ్య.
“అబ్బ అది కాదు కాంతయ్యా... పొద్దున్నుంచి ఒక సమస్య పట్టి పీడిస్తోంది... ఏడు తరువాత అంకె ఏమిటో గుర్తుకురావటంలేదు... కనపడ్డవాళ్ళందరినీ అడిగాను... ఏడు తరువాత ఏమిటి? అని.. అదేం చిత్రమో ఏడు తరువాత...” నేను చెప్తుండగానే మధ్యలో అందుకున్నాడు కాంతయ్య.
“అబ్బబ్బ.... కొట్టు ముందు నిలబడి ఏడు.. ఏడు.. ఏడు... అనవాకయ్యా... ఏడు అంటే ఏడుపే అవుద్ది కథ... అందుకే కదా ఆరున్నక్కటి అనేది..” చెప్పాడు కోపంగా.
“అయితే ఆ ఆరున్నొక్కటి తరువాత ఏమిటి?” అడిగాను.
కాంతయ్య ఆలోచించాడు కానీ అతనికీ గుర్తుకురాలేదు. “ఆరున్నురెండు...” అన్నాడు తెలివిగా. నేను నిరాశగా నిట్టూర్చాను.
“నేను సెప్పనా బాబయ్యా...” అని వినపడి వెనక్కి తిరిగాను. వెనకాల ఫకీరు. మాసిన బట్టలు, పెరిగిన గడ్డం... వాణ్ణి చూస్తేనే అసహ్యం వేసింది. పైగా వాడికి పిచ్చి అని కూడా అందరూ అంటుంటారు.
“ఏంట్రా... నువ్వు చెప్పేది?” కోపంగా అన్నాను.
“ఏడు తరువాత..”
“ఆ తరువాత...”
“ఏడు ఏడుపైతే ఆ తరువాత వచ్చేది నవ్వే కదా బాబయ్యా... ఏడుపు తరువాత నవ్వు, నవ్వు తరువాత మళ్ళీ ఏడుపు ఇదే కదా దేవుడి గారడి...” నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఫకీరు.
నేను ఇంటి వైపు అడుగులేశాను.
“వచ్చారా... ఇదుగో ఇప్పుడే పిల్ల స్కూల్ నుంచి వస్తే మీ ప్రశ్న సంగతి చెప్పాను... దానికి తెలిసట..” చెప్పింది కాంతం. నా కూతురు వచ్చి ఎదురుగా చేతులు కట్టుకోని మొదలుపెట్టింది –
“ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు... అయిదు... ఆరు.. ఏడు.. ఎ..” నేను ఆపమన్న సైగ చూసి ఆపేసింది. నాకు వినాలనిపించలేదు. ఎందుకో ఫకీర్ చెప్పిన సమాధానమే బాగుందనిపించింది నాకు.
(సాక్షి ఫన్ డే, 15 ఏప్రిల్, 2012)

పరిచయం



అప్పుడెప్పుడో మెరిసిన ఆ ఒక్క చిరునవ్వు
ఇన్ని సంవత్సరాల అనుబంధానికి నాంది అవుతుందనుకోలేదు
నిన్న మొన్నలా అనిపించే ఇన్నేళ్ళ అనుబంధం
ఒక్క పరిచయం పునాదిపై నిలుస్తుందనుకోలేదు
గంటలు నిముషాల్లా గడిచిపోయిన ఆ చిన్న పరిచయం
మన జీవితాన్ని ప్రేమతో పెనవేస్తుందనుకోలేదు
ఇలాంటి ప్రేమ ఒకటి నాకోసంఎదురుచూస్తూ వుందని తెలిసుంటే
కొన్ని యుగాల ముందే నిన్ను పలకరించేవాణ్ణి కదా..!!

అనగనగా ఓ సినిమా






(స్వప్న మాస పత్రిక మార్చి 2012)