ఉప్మా పేరడీ పాట...

ఆ మధ్య ఒక ఫేస్ బుక్ గుంపులో వచ్చిన ప్రస్తావన - ఉప్మా మీద పేరడీ పాట ఒకటి రాయాలని... ఇదిగో ఇదీ నా సమాధానం.....

ఉప్మా అనే పదం వాడకుండా ఉప్మా మీద రాసిన పేరడీ -

(గీతాంజలి "ఆమనీ పాడవే" ట్యూన్ లో... ఇళయరాజకి, వేటూరికి క్షమాపణలతో)


మెత్తగా జారవే హాయిగా
చెట్నియే జోడియైన వేళ
కారాల పొడితో కంబైన్డుగా
పలహారాల పనిలో లేటేస్టుగా
అట్టు తాకి నీవిలా
ఎమ్మెల్ యే గా మారగా || మెత్తగా||

పెళ్ళింటిలో టిఫినాగ్రణీ
టమాటతో ద్విగుణించగా
అనియన్సుతో అదిరేట్టుగా
వండించనీ పెళ్ళేలిక?
సదా నీవిలా
పెదాల చేరవా
తరాల నీ కథా
తరించి పాడనా
బేచిలరింటి మేత నీవనీ || మెత్తగా||

పూరీలతో, ఇడ్లీలతో
బేజారినా మహాజనం
అవీ ఇవీ తినం నిజం
నువ్వే వుంటే అదే జయం

మరో టిఫినుకే
మరిచేంత దీటుగా
అమోఘ పోపువై
ఉదయాల వేళలో
తరగిపోని టేస్టు నీదనీ || మెత్తగా||

మౌనమేలనోయి.. (కథ)


ఒక పెళ్ళైన అమ్మాయి ఇలా ఆలోచించవచ్చా?
ఈ అనుమానం వచ్చినా ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయింది. రవి నేను కొట్లాడుకోవడమే అందుకు కారణమా అంటే కావచ్చేమో.! కానీ మనసులో కలిగే ప్రతి ఆలోచనకీ బయటప్రపంచంలో కారణం వుంటుందనుకోవడం అమాయకత్వం.
అసలింతకీ నాకు వచ్చిన ఆలోచన ఏమిటనేనా మీ అనుమానం? చెప్తాను... చెప్పాలనే కదా మొదలుపెట్టాను.
పుట్టింటికి వచ్చి అప్పటికి వారం రోజులైంది. రవితో గొడవపడ్డ విషయం కానీ, ఆ వారం రోజులుగా మేమిద్దరం మాట్లాడుకోవటం లేదని కానీ ఇంట్లో చెప్పలేదు. చెప్పాలని అనిపించలేదు.కానీ, మా ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగే వుంటుందని అమ్మ నాన్న అనుమానించినట్లున్నారు. వాళ్ళూ ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా, చూచాయగా అడగాలని ప్రయత్నిస్తూనే వున్నారు. నేను చెప్పకుండా దాటవేస్తూనే వున్నాను.
నిజానికి, నేను రవి మాట్లాడుకోవటం లేదని అనడం కన్నా, నేను రవితో మాట్లాడటంలేదని చెప్పడమే సబబు. ఎందుకంటే నాతో మాట్లాడటానికి రవి ప్రయత్నిస్తూనే వున్నాడు. రోజూ క్రమం తప్పకుండా పది పదిహేనుసార్లు ఫోన్ చేస్తూనే వున్నాడు.
ఇంతకీ నాకు వచ్చిన ఆ రాకూడని అనుమానం ఏమిటా అని మళ్ళీ మీరు ప్రశ్నిస్తారు... నాకు తెలుసు. కానీ ఇదంతా చెప్తే కానీ ఆ ఆలోచన ఎలాంటిదో మీరు బేరీజు వెయ్యలేరు. నాకు వచ్చిన ఆలోచనని మీరు సమర్థించాలంటే మీ సానుభూతి పొందాలి కదా?
చాలా కాలం క్రితం, అంటే నాకు పెళ్ళి కాకముందు సంగతి. మా కాలేజీకి రెండు వీధుల వెనక ఒక టైప్ ఇన్స్టిట్యూట్ వుండేది. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి, సాయంత్రం టైపింగ్ నేర్చుకునేందుకు అక్కడికి వెళ్ళేదాన్ని. నాకు తోడుగా పూర్ణిమ కూడా వచ్చేది. నిజానికి నేను చెప్పాలనుకున్నది ఆ అమ్మాయి గురించి కాదు. ఆ అమ్మాయి కాకుండా నా వెనకాలే వచ్చే ఆ అబ్బాయి గురించి. కాలేజి వదిలిపెట్టే సమయానికి ఠంచనుగా వచ్చి నిలబడేవాడు. నేను బయటికి రాగానే నవ్వుతున్న కళ్ళతో చూసేవాడు. నా వెనకే సైకిల్ నడిపించుకుంటూ వచ్చేవాడు. నా టైపింగ్ క్లాస్ అయ్యేదాకా అక్కడే వుండి, మళ్ళీ నా వెనకే వచ్చి మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల ఆగిపోయేవాడు.
నాలుగైదు రోజుల దాకా నా వెనకాల ఒకడు వస్తున్నాడన్న స్పృహే వుండేది కాదు కానీ, పూర్ణిమ చెప్పడంతో నాకూ అనుమానం మొదలైంది. అనుమానం కొద్దిగా భయంగా మారింది. ఆ తరువాత అలవాటుగా రూపాంతరం చెందింది. అక్కడితో ఆగితే బాగుండేది. నా కోసమే అతను వస్తున్నాడు, ఎదురు చూస్తూ నిల్చుంటున్నాడు అన్న ఆలోచన పదే పదే మెదలడం వల్లనేమో అతనంటే కొంచెం అభిమానం ఏర్పడింది. అతను నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడన్న ఆలోచన మొదలైంది. అమ్మా నాన్నా పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అది అంతటితో ఆగిపోయింది.
ఇంతకీ ఇప్పుడు కలిగిన ఆ దుష్ట ఆలోచన ఏమిటంటారా? అదే... ఆ అబ్బాయి ఎవరో, ఒక్కసారి నా ముందుకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్పి వుంటే? నేను ఒప్పుకునేదాన్నేమో.. ఆ తరువాత? ఇంట్లొ చెప్పేవాళ్ళమా? మా పెళ్ళి జరిగేదా?ఇదినామనసులోమెదిలినఆలోచన.కానీఒకటి మాత్రం నిజం. అతనే నా భర్త అయ్యుంటే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.
అయితే రవి ప్రేమగా చూసుకోవటంలేదా అని మీరు అనుమానపడకూడదు. ప్రేమ లేదని చెప్పలేను. వున్నదని చెప్పడానికీ బలమైన ఆధారాలు లేవు. పెళ్ళైన తరువాత అన్ని జంటల పరిస్థితి ఇంతేనేమో... ముఖ్యంగా పెద్దల కుదిర్చిన పెళ్ళిలో..!!
రవి మళ్ళీ ఫోన్ చేశాడు. నాకు మాట్లాడాలని లేదు మొర్రో అంటే ఎందుకు అర్థం చేసుకోడు? ఫోన్ కట్ చేశాను.
నాకు ఎందుకో నన్ను వెంటాడి ప్రేమించిన ఆ అబ్బాయితో మాట్లాడాలనిపించింది. అతను ఎవరో, పేరేంటో కూడా తెలియదు. పూర్ణిమకి ఫోన్ చేశాను.
“అప్పుడు నాతో టైపింగ్ సెంటర్ కి వచ్చేవాడు గుర్తుందా... మనం బాడీగార్డ్ అనేవాళ్ళం... అతను ఎవరు? ఎక్కడుంటాడు?” అడిగాను. మాట్లాడటం మొదలుపెట్టిన అయిదు నిముషాలలోపే ఆ విషయం అడగటం దానికి నచ్చినట్లు లేదు.
“వాడి సంగతి ఎందుకులేవే..” అంది దాటవేస్తూ.
“ఇప్పుడు తల్చుకుంటే అనిపిస్తోందే... నిజంగానే చాలా ప్రేమించినట్లున్నాడు...” చెప్పాను.
“ఛ ఏమిటా మాటలు... పెళ్ళైనదానివి...” పూర్ణిమ కోపాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తోంది.
“పెళ్ళైతే... ఒకప్పడు ప్రేమించిన వాణ్ణి గుర్తు చేసుకోకూడదా? నిన్నటి నుంచి నాకు అనిపిస్తోంది– ఒక్కసారి వాడు వచ్చి ప్రేమిస్తున్నాను అని చెప్పి వుంటే ఈ కథ మరోలావుండేదని...” అన్నాను.
“చెప్పేవాడే... కానీ ఎలా చెప్పగలడు... తరువాత తెలిసింది అతను మూగవాడట...!!” ఆ తరువాత పూర్ణిమ ఏం మాట్లాడిందో గుర్తులేదు. ఫోన్ ఎప్పుడు పెట్టేశానో కూడా గుర్తులేదు.
మూగవాడు... మాట్లాడలేని మూగవాడు...!!
నాకు అప్పుడు గుర్తొచ్చింది. రెండు మూడు సార్లు దగ్గరగా వచ్చాడు. చేతికి పూలు ఇచ్చాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ... చెప్పలేదు... కాదు కాదు చెప్పలేడు.. అందుకే చెప్పలేదు.
చెప్పి వుంటే మరో కథ. చెప్పలేదు కాబట్టే ఈ కథ.
ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? మాట్లాడగలిగి కూడా మాట్లాడకపోవటం. మాట పట్టింపుకు పోయి మాట్లాడే దారుల్ని మూసెయ్యడం. రేపు ఇది రవికి నాకు మధ్య విషాదమై మిగిలితే..?? అప్పుడు ఇలాగే మాట్లాడుంటే బాగుండేది కదా అని అనుకోవాల్సి వస్తుందేమో..!!
ఫోన్ అందుకోని రవికి ఫోన్ చేశాను.
<< ?>>
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక, 12 జులై 2012)

తుది బంధం (బహుమతి కథ)



“ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు...” ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే.
“నేను మా వూరు వెళ్ళి వస్తాను..” చెప్పాను ఆ రోజు సాయంత్రం.
“ఎందుకు అనవసర ఖర్చులు... మీ అన్నయ్యే వాళ్ళే హైదరాబాద్ మారిపోతున్నారు కదా... వాళ్ళు వచ్చిన తరువాత ఒక సారి కలిస్తే సరిపోదూ..” అన్నాడు మోహన్.
“అన్నయ్య వస్తున్నాడనే నా బాధ.. అసలు అందుకే వెళ్ళాలి” అని చెప్తామనుకున్నాను. అలా చెప్తే అర్థం కాదు. ఎలా చెప్తే అర్థం అవుతుంది అని ఆలోచించినా నాకు ఏ ఆలోచనా రాలేదు.
“నేను వెళ్ళాలి అంతే..” అన్నాను గట్టిగా.
“సరే వెళ్దువులే... దానికి ఎందుకంత కోపం..” అన్నాడు పేపర్ చదువుతూ. నాది నిజంగా కోపమే అయితే ఇలా పేపర్ చదువుతూ సమాధానం చెప్పేవాడా? అసలు కోపంగా అనడానికి, స్థిరంగా అనడానికి చాలా తేడా వుంది. అగ్రెషన్ కి అస్సెర్షన్ కీ తేడా లేదూ...?
“ఎప్పుడు వెళ్ళను?” అని మాత్రం అన్నాను.
“అది కూడా ఏదో అనుకోనే వుంటావుగా... అదీ నువ్వే చెప్పు..” ఆ గొంతులో నాకు అలవాటైన వెటకారం అందుకే ఆ వెటకారానికి నేను స్పందించను, స్పందించకూడదు అని కూడా అనుకుంటూ వుంటాను. కనీ అంతలోనే నా గొంతులో నుంచి మాటలు దొర్లుకొస్తాయి -
“అవును... నువ్వే అంటావుగా దేనికైనా ప్లానింగ్ అవసరమనీ...” చివర్లో దీర్ఘం తీస్తున్నప్పుడు మాటకి ప్రతిమాట చెప్పానని గుర్తొస్తుంది. నా మాటలు ఆగిపోతాయి. అతని చూపులు నాలో దిగబడతాయి.
“విసిగించకుండా విషయం చెప్పు...” అంటాడు విసిగిపోయిన ముఖం పెట్టి. ఒక్క మాటకి విసిగిపోయిన ముఖాలే ఇట్లా వుంటే, సంవత్సరాల తరబడి విసుగుని భరింఛే ముఖాలు ఇంకెంత ఛెండాలంగా వుండాలి? మరి నా ముఖం అలా వుండదే?
“సరే వచ్చే బుధవారం వెళ్తున్నాను... రెండు రోజులు వుంటాను. పిల్లల్ని ఇక్కడే వదిలేస్తున్నాను. సత్తెమ్మకి రోజు రమ్మనమనీ, మీకు పిల్లలకీ బాక్స్ పెట్టమనీ చెప్పాను... గ్యాస్ వస్తుంది పెట్టించండి... ” గడగడా చెప్పేశాను. ఆయన దగ్గర్నుంచి సమాధానం రాదు. తల పేపర్లో నుంచి తీసి –
“ఏంటి.. ఏం చెప్పావు..” అన్నాడు. మళ్ళీ చెప్పాలా వద్దా?
చెప్పలేదు.
***
బస్సు బయల్దేరింది. చీకటి గుహలోనుంచి బయటపడ్డ చిలకలా రెక్కల్లా నా చీర చెంగు గాలి లోకి ఎగురుతోంది. ఏ.సీ. గదిలో నుంచి, ప్రకృతి వడిలోకి పరిగెత్తుతున్నట్లు వీస్తోంది గాలి. దారం తెగిన గాలిపటంలా రెపరెపలాడుతున్న జుట్టు.
కిటికీ పక్కన సీటు.
ఎప్పుడూ అన్నయ్య సొంత ఆస్థిలా ఆక్రమించిన స్థలం. స్కూల్ బస్ లో బడికి వెళ్ళినంతకాలం. నాకు కాకుండా పోయిన నాకు ఇష్టమైన స్థలం. వాడు నాకు అన్నయ్య కాకుండా వుంటే? తమ్ముడై వుంటే? ఈ సీటు మీద ముందు నేనే అధికారం చెలాయించేదానినా?
నాన్న మాత్రం – “పోనీలేమ్మా ఆ కిటికీ పక్కన కూర్చుంటే నీ జుట్టంతా గాలి ఎగిరిపోయి చిక్కుపడిపోతుంది... ఎంచక్కా ఈ పక్కనే కూర్చుంటే బాగుంటుంది..” అంటుంటేవాడు. నాకు అలా గాలికి ఎగిరే జుట్టే ఇష్టమని చెప్దామని అనుకున్నాను. ఎలా చెప్తే నాన్నకి అర్థం అవుతుందో తెలియక అసలు చెప్పనే లేదు. ఎప్పటికైనా బస్సులకి మినిష్టర్ ని అయ్యి, కిటికీ పక్కన సీట్లన్నీ అమ్మాయిలకే అని ప్రకటించేయాలని బలంగా అనుకునేదాన్ని. కోరుకునేదాన్ని. వేడుకునేదాన్ని.
నవ్వు వస్తుంది తల్చుకుంటే..!
ఆ తరువాత అన్నయ్యకి బస్సులో కిటికీ సీటు మీద మోజు పోయి, సైకిల్ మీద ఇష్టం మొదలైంది. నాకు సైకిల్ అంటే అసహ్యం. ఇంతవరకూ నేను సైకిల్ ఎక్కనేలేదు. అది తొక్కుతుంటే ఆయాసం వచ్చి, కాళ్ళ నొప్పులు కూడా వస్తాయట కదా? ఈ మాటే అన్నయ్యని అడిగితే – “అందని ద్రాక్షపళ్ళు పుల్లన..” అంటూ నవ్వేశాడు. అవును నాకు అందని ద్రాక్షలు పులుపే. పులుపు మాత్రమే కాదు చేదు కూడా..!!
 ఇష్టం లేనివి తల్చుకోవడం కన్నా మేలని పేపరు తీసి రెండు పేజీల తిప్పానో లేదో మా  వూరు వచ్చేసింది.
***
“ఏమ్మా రాజ్యం? కులాసాగా వున్నావా? బావగారు బాగున్నారా?” అడిగాడు అన్నయ్య నన్ను చూస్తూనే.
“బాగున్నాం అన్నయ్యా...” అన్నాను లోపలికి అడుగుపెడుతూ. వదిన ఎదురొచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుంది.
“ఏంటి విశేషాలు..” అడిగింది వదిన.
“అవ్వాల్సిన రెండు విశేషాలు అయినాయి కదా... ఇంక అంతకన్నా మా సంసారంలో విశేషాలు ఏముంటాయి..” చెప్పాను నేను. వదిన నవ్వేసి – “భలే పిల్లవే..” అంటూ వంటింటిలో టీ పొడిమీద యుద్ధానికి పోయింది.
నేను ఇల్లు మొత్తం పరికించి చూశాను. ఎలా వుండేదో అలాగే వుంది కానీ అక్కడక్కడా పెచ్చులూడిపోయాయి. అప్పుడెప్పుడో నా పెళ్ళికి అన్నయ్య కొట్టించిన సున్నం అది. మా సంసారంలోనే పెచ్చులూడుతున్నాయి, సున్నం ఎంతసేపు అనుకున్నాను నేను. చెక్కతలుపులు మాత్రం అలాగే వున్నాయి.
ఇంటి పెరట్లో బాదం చెట్టు, మామిడి చెట్టు అలాగే పాతుకుపోయి వున్నాయి. మామిడి పూత పూయటమే తప్ప కాయ కాయటం లేదని రెండేళ్ళుగా అన్నయ్య వంక పెడుతున్నాడు. అంచేత ఆ చెట్టును కొట్టేయాలని ఆయన అభిప్రాయం. ఇంతకు ముందు, పడకగది చిన్నదిగా వుందని వెనకాల మూడడుగులు పెంచినప్పుడు రెండు కొబ్బరి చెట్లు కొట్టించేశాడు. ఆ చెట్లతో పాటే ఎన్ని జ్ఞాపకాలు కూలిపోయాయో... కొబ్బరి ఆకులతో చేసి వూదుకున్న పీకలు, రెండు చెట్ల మధ్య ఆడిన తొక్కుడుబిళ్ళ, లేత కొబ్బరి నీళ్ళు..!!
బెడ్ రూం బాగానే పెరిగింది కానీ, ఇల్లు స్వరూపమే మారిపోయింది. కట్టుడు పళ్ళు, కొయ్య కాళ్ళు పెట్టించుకున్న ముసలమ్మ లా  తయారైంది. అందుకే నాకు కోపం వచ్చింది
“ఈ సారి ఇంటికి ఏ మార్పు చేసినా నాకు చెప్పి చెయ్యి అన్నయ్యా..” అన్నాను నేను.
“ఎప్పుడో తాతలనాటి ఇల్లు... ఇంకా ఏముందమ్మా ఈ ఇంటిలో...” అంటాడు అన్నయ్య.
“ఎలా చెప్తే అర్థం అవుతుంది...!!” అనుకున్నాను తప్ప చెప్పలేకపోయాను.
***
“ఇల్లు అమ్మక తప్పేటట్టు లేదు...” అన్నాడు అంతకు వారం రోజుల ముందు ఫోన్ లో. “బేరం కూడా కుదిరింది... అపార్ట్ మెంట్ కడతారట... అరవై ఇచ్చి నాలుగు ఫ్లాట్లు కూడా ఇస్తామంటున్నారు... పిల్లలిద్దరికి చెరొకటి ఇచ్చి, ఒకటి అద్దెకి ఇచ్చుకున్నా... పిల్ల పెళ్ళి ఖర్చులకి ఇంకొకటి అందివస్తుంది... అన్నట్టు సంబంధం కూడా కుదిరేట్టే వుంది” చెప్పాడు.
పెళ్ళి కుదిరింది. బేరం కుదిరింది.
ఇంక ఏం చెప్పాలి నేను. ఆ ఇల్లు అమ్మద్దని చెప్పచ్చు “మరి పెళ్ళికి డబ్బుల సంగతి” అంటాడు. వుండటానికి అత్తగారింట్లో కోట్లు వున్నాయి, కానీ అవి ఆయన కష్టార్జితం... పోనీ ఆ ఇల్లు నిలుపుకుందామా అంటే అది అన్నయ్య పిత్రార్జితం. నా దగ్గర ఏముందని నిలుపుకోగలను.
“నేను హైదరాబాద్ వస్తున్నాను... కాగితాలు తీసుకొస్తాను నువ్వు కూడా సంతకం పెడితే...” అన్నాడు.
“వద్దు... నేనే వస్తాను..” ఫోన్ పెట్టేసాను.
***
వీధి గుమ్మానికి ఆనుకోని వున్న అరుగులపైన కూర్చుంటే అమ్మ వళ్ళో కూర్చున్నంత హాయిగా వుంది. చిరు చీకట్లు కమ్ముకుంటుండగా వీధి వెంట గొడ్లను అడవి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న గోపయ్య వచ్చి రేగికాయలు, కలేకాయలు చేతిలో పెట్టాడు.
అన్నయ్య అసహనంగా వున్న సంగతి మధ్యాహ్నం నుంచీ తెలుస్తూనే వుంది. కారణం తెలుసుకోవాలనిపించలేదు. కొంత చీకటి పడేదాకా ఆగి – “ఇంక చాలు రా... చీకటి పడుతోంది...” అన్నాడు లోపలి నుంచే.
“ఫర్వాలేదులే అన్నయ్యా... ఇక్కడ చాలా బాగుంది.” అన్నాను మిణుగురు పురుగులను చూస్తూ. అన్నయ్యే బయటికి వచ్చాడు.
"ఏమిటి విషయం?" అన్నాడు నెమ్మదిగా.
"విషయం ఏముంది.. ఏమీ లేదు.."
"నేను వస్తానన్నాను కదా.. ఇంత హడావిడిగా రావాల్సిన పనేముంది..?" అడిగాడు జంకుతూ.
"భయపడద్దు అన్నయ్యా.... ఈ ఇల్లు అమ్ముకునేందుకు నీకు అన్ని హక్కులూ వున్నాయి. నేనేం నీకు అడ్డం పడదామని రాలేదు.." చెప్పాను నేను. అన్నయ్య గట్టిగా నిట్టూర్చాడు.
"మరి ఇంకెందుకు వచ్చినట్లు?" మొహమాటంగా అడిగాడు.
"ఈ ఇంటికీ నాకూ చుట్టరికం వుందన్నయ్యా... ఈ ఇల్లే కాదు, ఈ వూరికీ నాకు కూడా ఒక అనుబంధం వుంది. ఇప్పుడు ఈ ఇల్లు నువ్వు అమ్మేస్తానంటే ఎదోగా వుంది... అందుకే ఒక్కసారి చూసి పోదామని..." చెప్పాను నేను.
"భలేదానివే... దానికోసం ఇంత దూరం రావాలా? అయినా హైదరాబాద్ లో నేను ఇల్లు తీసుకుంటున్నానుగా... అది మాత్రం నీ ఇల్లు కాదూ.. ఎప్పుడు కావాలంటే అప్పుడురా... నిన్ను కాదనేదెవరూ..." అన్నాడు.
ఎలా చెప్తే అర్థం అవుతుందీ అని ఆలోచింఛాను...
"ఈ ఇంటి ఆడపిల్లగా నాకు ఆస్థి హక్కు వుండచ్చు... కానీ అది కేవలం చట్టపరంగా మాత్రమే... మాకే అభ్యంతరాలు లేవని చెప్పమని మోహన్ అనేస్తాడు... నువ్వు ఇల్లు అమ్మేస్తావు... నా హక్కు కేవలం కాగితాలపైన సంతకం మాత్రమే...
"ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు... ఆ ఇంటికి వస్తే నాకు కలిగే ఆనందం నీకు తెలియదు. ఇల్లు అమ్మేయటం అనే ఒక్క నెపంతో ఆ ఆనందాన్ని నాకు కాకుండా చేస్తావు... పుట్టింటికి వెళ్ళడం అనే సాకుతో వచ్చి నేను నడచిన నేలని, నేను పెంచిన చెట్టుని అప్పుడప్పుడు చూసుకునే అవకాశం లేకుండా చేస్తావు... నీకు తెలియదన్నయ్యా ఈ ఇల్లు నాకూ నా జ్ఞాపకాలకీ మధ్య వున్న తుది బంధం... అది తెగిపోతోందనే నా బాధంతా...!!"
ఇదంతా చెప్పాలని వుంది. చెప్తే అర్థం అవుతుందో లేదో...!! ఆలోచిస్తూ వుండిపోయాను.

?