భూదేవతమ్మ


"నా వుద్యోగం పోయింది" ఎలాంటి వివరాలు లేకుండా సూటిగా చెప్పేశాను. ఏం చెప్పకపోయినా నా మనసులో వున్నవన్నీ అమ్మకి అర్థమైనట్లేవుంది.
"ఒక్కసారి నాన్నతో మాట్లాడు.." అమ్మ చెప్పింది.
"వద్దమ్మా నువ్వే చెప్పు.." అన్నాను.
"కనీసం ఇలాంటప్పుడైనా ఆయనతో మాట్లాడచ్చు కదా.."
"ఇలాంటప్పుడంటే? ఇప్పుడేదో వుద్యోగం పోయి వీధిన పడ్డాననుకుంటున్నావా? ఒకచేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఆయన సహాయం మాత్రం అడగను." కటువుగానైనా సూటిగా చెప్పాను. "రేపొస్తున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
చేతిలో వున్న ఫోను వైపే చూస్తూ వుండిపోయాను. ఇరవై ఐదు వేలు ఖరీదు చేసే ఫోను, ఇప్పుడు అమ్మితే రెండు మూడు వేలైనా రావేమో. అంతేలే.. నిన్నటిదాకా నా విలువ నెలకి యాభైవేలు. బ్యాంకుకి వెళ్ళినా నలభై యాభై లక్షలు తక్కువ కాకుండా లోన్ ఇచ్చేవాళ్ళు. కానీ రోజు నేను మాజీ వుద్యోగిని. బ్యాంకు లెక్కల ప్రకారం చూసినా మాత్రం విలువ చెయ్యనివాణ్ణి.
నా టేబుల్పైన వున్న సామానంతా నేను తెచ్చుకున్న బ్యాగ్లో సర్దుకున్నాను. ప్రతి సంవత్సరం నాకు కంపెనీ ఇచ్చిన అవార్డులు, రివార్డులూ, సర్టిఫికెట్లు..! ఒక్క సంవత్సరంలో ప్రపంచంలో జరిగిన మార్పులు నా విలువని ఇంత దిగజార్చేస్తాయని ఏనాడూ వూహించలేదు. అదే ఆఫీస్.. నాలుగేళ్ళుగా నా క్యాబిన్లోనించి చూసిన ఆఫీసు.. రోజు కొత్తగా కనపడుతోంది. సంవత్సరం క్రితం నేనే రిక్రూట్ చేసిన 'నా' టీం రోజు ఏమీ ఎరగనట్టు తమ పనిలో నిమగ్నమై వున్నారు. నా వుద్యోగం పోతోందన్న జాలికన్నా, తమ వుద్యోగం పోకూడదన్న ఆరాటం ఎక్కువగా కనిపిస్తోంది వాళ్ళలో.
వాళ్ళని మాత్రం అని ఏం ప్రయోజనం? ఇదే ఆఫీసులో.. ఇదే సీట్లో నిన్నటి వరకూ నేనూ ఇలాగే ఆలోచించాను కదా? ఇంతలోనే ఎంత మార్పు? నిన్నటిదాకా నావనుకున్నవి ఏవీ రోజు నావి కావు. చిన్నప్పుడు ఎప్పుడో మా వూరి రామాలయంలో విన్న భగవద్గీత గుర్తుకువచ్చింది. జీర్ణమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త శరీరాన్ని వెతుక్కుటుందట. అలాగే వుద్యోగాలు కూడా.. కాకపోతే ఇక్కడ ఆత్మలు వుండవు. అన్నీ జీవంలేనివే వుద్యోగాలు..!! చిన్నగా నవ్వుకున్నాను. వుద్యోగం పోయిందనగానే వేదాంతం గుర్తుకురావటం.. చిత్రంగానే వుంది మరి
హరిత తలుపు తోసుకోని నా క్యాబిన్లోకి వచ్చింది. ఆమె నా కొలీగ్.
"సో వెళ్ళిపోతున్నావన్నమాట" అన్నది భావం పలకకుండా, నేను తలాడించాను.
"నీకు కావాలంటే నా ఫ్రండ్స్ వున్నారు.. నేను రికమెండ్ చేస్తాను. వై డోంట్ యూ ట్రై" అడిగింది. నేను కొత్త వుద్యోగం ఏదీ చూసుకోకుండా మా వూరు వెళ్తున్న విషయం ఆమెకు ఇంతకు ముందే చెప్పాను.
"నేను వూరు వదిలి వెళ్తున్నది నాకు ఇక్కడ వుద్యోగం దొరకక కాదు. ప్రస్తుతం వుద్యోగం చేసేందుకు మనస్కరించక. కొంతకాలం నాకు విశ్రాంతి కావాలి. నేను చెసిన వుద్యోగాన్ని, కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అప్పుడు కూడా నాకు ప్రపంచం నచ్చితే తిరిగి వస్తాను... అలా వస్తే నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను.. " చెప్పాను నేను.
"ఎక్కడికి వెళ్ళినా.. ఏం ఆలోచించినా.. మళ్ళీ ఏదో వుద్యోగం చెయ్యాలి కదా?" అడిగిందామె.
"ఏమో తెలియదు.. అప్పుడు ఆలోచిస్తాను.." చెప్పాను.
ఎందుకలా మాట్లాడుతున్నావు
"సారీ.. కొంచెం డిస్టర్బ్డ్గా వున్నాను. కార్పొరేట్ ప్రపంచం మీద విరక్తితో వున్నాను"
" నువ్విప్పుడు మాట్లాడేది వుద్యోగం పోయిందన్న బాధలో అనుకుంటాను.. అదే నిజమైతే అందులోనుంచి త్వరగా బయటికి రావడం మంచిది " చెప్పింది
నా వుద్యోగం పోయిందని కాదు. ఇలా ఎంత మంది వుద్యోగాలు పోయాయో తెలుసా?”
"ఒకరి కంపెనీ మరొకరికి అమ్మేశాక కొత్త యజమాని అవసరాన్ని బట్టి మనుషుల్ని తీసేయ్యడంలో తప్పేముంది?"
" హరితా.. నాకు తెలుసు నీకు అది సాధారణంగానే కనిపిస్తుందని.. కానీ వుద్యోగస్తులంటే ఎదో ఫర్నీచరులాగా.. ఇష్టం వుంటే వుంచుకోవడం లేకపోతే తీసెయ్యడం న్యాయమేనా? కంపెనీ కొన్నప్పుడు కంపెనీని వృద్ధిలోకి తెచ్చిన వుద్యోగస్తులు కంపెనీలో భాగం కాకుండా పోతారా? వుద్యోగస్తుల్ని అలా ఉన్నట్టుండి వీధిని పడేస్తే వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కంపెనీకి వుండదా?" అంటూ ఆగాను. హరిత ఆవేశంగా మాట్లాడుతున్న నా వైపే చూస్తూ వుండి పోయింది. మళ్ళీ నేనే అందుకున్నాను - " చాలా రోజుల్నించి ఇదే ఆలోచన తొలిచేస్తోంది. అందుకే కొన్ని రోజులు ప్రపంచానికి దూరంగా వుందామనుకుంటున్నాను. " చెప్పాను.
"యాజ్ ఆల్వేస్.. నువ్వు నాకు అర్థం కావు.. ఏమైనా నీకు నా బెస్ట్ విషెస్ " చెప్పి వెళ్ళిపోయిందామె. ఆమె మాట తీరులో స్పష్టంగా మార్పు కనపడుతోంది. అయినా నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె గురించి ఆలోచించే వుత్సాహం లేదు. అందుకే నేనేమి మాట్లాడలేదు. నా సామానంతా తీసుకొని బయల్దేరాను. కొంతమంది కొలీగ్స్ మాత్రం వచ్చి సాగనంపారు.
ఆటో ఎక్కబోతుండగా ఫోన్ మోగింది. ఇంటి నుంచి నాన్న చేశాడు.
"ఏరా రామం వుద్యోగం పోయిందట కదా.. అమ్మ చెప్పింది.." అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. చెప్పాలని అనిపించలేదు. నాన్నే కొనసాగించాడు -
"కలో గంజో కలిసే తిందాం.. నాలుగు ఎకరాలు వుంది.. ముగ్గురం బ్రతకలేక పోలేం.. నువ్వు ఇక్కడికే వచ్చెయ్ బాబూ.."
"అమ్మ కి ఫోన్ ఇవ్వండి.." అన్నాను నేను. మాట కటువుగా వచ్చిందని తెలిసినా నేను పెద్దగా పట్టించుకోలేదు.
"ఏమిట్రా.." అమ్మ అంది ఫోను తీసుకోని.
"ఏంటమ్మా ఆయన... నేను వస్తున్నట్లు చెప్పలేదా? నాలుగు ఎకరాల సంగతి నా ముందు మళ్ళీ ఎత్తద్దని చెప్పు ఆయనకి.. కలో గంజో పెడతాడట.. దేవుడి దయ వల్ల నేను సంపాదించి దాచిపెట్టిన సొమ్ము కనీసం ఆర్నెల్లైనా వస్తుంది.. ముగ్గురం తిన్నా.. లోగా ఏదోక ఏర్పాటు చేసుకుంటానని చెప్పు ఆయనకి.."
"ఎందుకురా అంత మండిపడతావు?" అడిగింది అమ్మ.
"నీకు తెలియదా ఎందుకో.. మళ్ళీ మొదటికి తీసుకురాకు.. రేపొస్తున్నాను కదా అప్పుడు మాట్లాడదాం.." చెప్పి ఫోన్ కట్ చేసి ఆటో ఎక్కేసాను.
***

బస్సు మా వూరి వైపు పరుగు తీస్తోంది. వెనక్కి వెళ్తున్నట్లు భ్రమ కలిగిస్తున్న చెట్లను చూస్తుంటే ఎందుకో నా వుద్యోగం గుర్తుకు వచ్చింది. ఇలాగే పరిగెట్టి పరిగెట్టి నాలుగేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ముందుకు వెళ్ళలేదనిపిస్తుంది నాకు. ప్రమోషన్లు వచ్చాయి, జీతాలు పెరిగాయి అయినా జీవితంలో ముందుకు వెళ్ళలేదనే భావన. ఇలా ఎందుకనిపిస్తోందో తెలుసుకోడానికే, వేరే వుద్యోగం వెతుక్కోకుండా ఇంటికి వెళ్తున్నాను.
మా వూరి పొలిమేరలోకి వస్తుంటే అప్రయతంగానే నా కళ్ళు మా నాలుగు ఎకరాల పొలం కోసం వెతికాయి. దాదాపు చుట్టు పక్కల వున్న పొలాలన్నీ స్థలాలుగా మారిపోయాయి. వాటిల్లో ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. వాటన్నింటి మధ్యలో మా పొలం.. నాలుగెకరాల పొలం. నాలుగెకరాల పొలం వల్లనే నాకు నాన్నకి పడనిది. చుట్టుపక్కల పొలాలలాగే మా పొలాన్ని రియల్ఎస్టేట్ వాళ్ళకి అమ్ముదామంటే మా నాన్న ససేమిరా అన్నాడు.
"పోనీ అమ్మిన తరువాత వచ్చిన డబ్బులు మీదగ్గరే పెట్టుకోండి.. వయసులో మీకెందుకు శ్రమ. పొలంలో పోయిన నాలుగేళ్ళలో ఒక్కసారైనా మన చేసిన ఖర్చుకి గిట్టుబాటు అయ్యిందా?.. ఇంకా దాన్ని పెట్టుకొని ఏం లాభం?" అడిగాను నేను.
"గిట్టుబాటు అంటె ఏమిట్రా? అన్నింటినీ అదే డబ్బుతో కొలవకూడదు.. అది భూదేవతమ్మ.. తల్లితో సమానం.. అట్లాటి తల్లిని ఎలా అమ్మమంటావు చెప్పు" అన్నాడు నాన్న. విషయమై నాకు నాన్నకి చాలా పెద్ద గొడవే జరిగింది. ఒకసారి పట్నం నుంచి ఒక రియల్ ఎస్టేట్ ఏజంట్ని కూడా తీసుకెళ్ళాను. అతను చెప్పే రేట్లు వింటేనన్నా నాన్న మెత్తబడతాడనుకున్నాను. మంచి ధర చెప్పి అక్కడే రెండు ఫ్లాట్లు కూడా ఇస్తానన్నాడు. అయినా నాన్న చలించలేదు.
" పొలం నేను బ్రతికుండగా అమ్మను.. ఇక విషయంలో వేరే మాట ప్రసక్తే లేదు.." అని తెగేసి చెప్పి అమ్మతో - "దూరం నించి వచ్చారు.. ఇద్దరికీ అన్నం పెట్టు" అంటూ పొలం వెళ్ళాడు.
రోజు రాత్రి మా ఇద్దరికీ తీవ్రంగా గొడవైంది -
" పొలాన్ని ఎందుకమ్మరో నాకు అర్థం కావటంలేదు.. నాకూ ఒక ఇల్లు ఏర్పడుతుంది.. వచ్చిన డబ్బుల్తో హాయిగా వుండచ్చు.. మీరన్నట్టు భూదేవతమ్మే.. అంటే లక్ష్మీదేవి.. వచ్చే లక్ష్మిని కాదనద్దు.." అన్నాను నేను. నాన్న వొప్పుకోలేదు.
"నువ్వనుకున్నట్లు భూదేవతంటే లక్ష్మీదేవికాదురా.. అన్నపూర్ణ... పదిమందికి అన్నం పెట్టే తల్లి.. తేడా అర్థమైతే నేను పొలం ఎందుకమ్మనో నీకు అర్థమైతుంది." అన్నాడు. రోజు నుంచి నాన్నతో మాట్లాడటం మానేశాను. మళ్ళీ ఇదుగో ఇప్పుడు రావటమే మా వూరికి.
***

బస్టాండులో దిగుతూనే "రిక్షా బాబూ" అంటూ వినిపించింది.
"నువ్వు సాములోరి నాగులు కదూ" అడిగాను అతన్ని చూస్తూ.
"తవరా బాబూ.. బాగుండారా?" అన్నాడు నాగులు సామాను అందుకుంటూ.
"బాగున్నాను.. రిక్షా ఎప్పటినుంచిరా..?" అడిగాను. నాగులు నా కన్నా పెద్దే కానీ చిన్నప్పటి నుంచీ వాణ్ణి అలా పిలవటమే అలవాటు. అతనికి కూడా అదే అలవాటు.
"ఏం చేస్తాం బాబూ.. పొలాలు బొయ్యి ప్లాట్లు అయినాయి. ఇంక మా పాట్లు ఎవరికి పడతాయి. పని బొత్తిగా దొరకటంలేదు.. అందరిలాగే వేరే వూరు జేరి కూలిపని జేద్దామంటే ఇంట్లో ముసిలాళ్ళు పిల్లలు వుండారు.. మా రామమ్మిని పంపి నేను బండి లాగతన్నా.." చెప్పాడు
"సరిపోతుందా?" అడిగాను.
"సరిపోకపోతే మాత్రం ఏం జెయ్యగలం బాబూ.. ఏదో మీ అయ్యలాంటి మారాజులు వుండబట్టి గుట్టుగా బ్రతుకుతున్నాం" అన్నాడు బలంగా రిక్షా తొక్కుతూ.
నేను ఇంకేమీ మాట్లాడలేదు. ఇంటి దగ్గర దిగి యాభై రూపాయలు నాగులు చేతిలో పెట్టి చిల్లర తీసుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాను.

"ఏరా నాయనా వచ్చావా.. రా.. ఇదుగో మంచినీళ్ళు తాగు.." అమ్మ హడావిడిగా వచ్చి స్టీలు కుండ నీళ్ళు గ్లాసుతో ఇచ్చింది. అమ్మతోపాటే వంటింట్లోకి వెళ్ళి కబుర్లు చెప్తూ పీట మీద కూర్చున్నాను. అమ్మ గిన్నెలు తోముతోంది.
"నువ్వెందుకు అంట్లు తోముతున్నావు? రూకమ్మ రావడంలేదా?" అడిగాను.
"ఎక్కడరా... రూకాలు మొగుడు మునుపు బాడిసె పనులు చేసేవాడు. నాగళ్ళు పోయాక వాడికి పని తగ్గింది. ఇప్పుడు పొలాలే పోతుంటే ఇంక వాడికి పనేమి వుంటుంది చెప్పు? పిల్లా జెల్లాతో పట్నంబోయి బేల్దారి పనులు చేసుకుంటున్నారట.." చెప్పింది అమ్మ చెయ్యి తుడుచుకుంటూ.
అప్పటికింకా నాన్న గొంతు వినిపించక పోవడంతో అడిగాను - "ఆయన లేడా?' అని.
"కరణంగారింటికి వెళ్లారురా.. ఆయన బావమరిది హైద్రాబాద్లో పెద్ద కంపెనీలో వుద్యోగమట.. నీకేమైనా చూస్తారేమోనని అడగటానికి.." అమ్మ చెప్తుండగానే నేను అరిచాను -
"అమ్మా.. నాకు వుద్యోగం వెతికిపెట్టమని నేనేమైనా బ్రతిమాలానా? ఆయనకి ఎందుకంట ఇవన్నీ.. నా సంగతి నేను చూసుకోగలను.. అయినా నాకు వుద్యోగానికి గతిలేక ఇక్కడికి రాలేదు.... వీలైతే మన పొలం అమ్మి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకోని వచ్చాను " అన్నాను.
" పొలం సంగతి ఇంకా వదిలిపెట్టలేదా నువ్వు.. ఎందుకురా నీకు ఇంత పంతం." అడిగిందామె.
"నాకేనా పంతం.. నాన్నకి లేదా?" అంటూ చివాల్న లేచి - "నేను శేషయ్య మామని కలిసి వస్తాను" అంటూ ఇంట్లోనించి బయటపడ్డాను.
***

మర్నాడు కొంచెం ఆలస్యంగా తయారయ్యి ఇంట్లోనించి బయటపడ్డాను. సీతమ్మగారి బావి పక్కనే వున్న సాంబయ్య టీ కొట్టు దగ్గర చేరి పాత మిత్రులతో టీ తాగుతున్నాను.
"దండాలు బాబూ" అంటూ వచ్చాడు వెంకటరెడ్డి.
"ఏం రెడ్డి బాగున్నావా?" అడిగాను.
"బాగానే వుండాం బాబూ.. తమరేంటి బాబూ చానా కాలాని కి కనిపించారు" అడిగాడు కూర్చుంటూ. వాడి వెనకే ట్రాక్టర్ల సాంబశివుడు, బస్తాలు కుట్టే వీరయ్య కూడా వచ్చి ఎదురుగా బల్ల మీద కూర్చున్నారు.
"బాబూ.. పొలం అమ్మేత్తన్నారంటగా?" అడిగాడు వీరయ్య. అప్పుడే విషయం వాడిదాకా వెళ్ళినందుకు ఆశ్చర్యమేసింది.
"ఏం వీరయ్యా.. నువ్వు కొనుక్కుంటావా?" ఎగతాళిగా అన్నాను
"కొనుక్కోగలిగినా బాగుండు బాబూ.. నాకంత తాహతెక్కడిది?" అన్నాడు వీరయ్య.
సాంబశివుడు ముదుకు జరిగి కుతూహలంగా అడిగాడు - "పెద్దయ్యగారు ఒప్పుకున్నారా బాబూ"
"ఇంకాలేదు సాంబశివుడు... ఇవాళో రేపో మాట్లాడతాను" అన్నాను.
"మీలాంటోళ్ళాని నమ్ముకున్నాం బాబూ.. మమల్నిట్టా అన్నాయం జెయ్యబాకండి" వెంకటరెడ్డి చేతులు జోడించాడు. అప్పటికి ఇంకొంత మంది అక్కడ చేరారు.
"ఏంటిది.. అందరూ కలిసి నన్ను బెదిరించడానికి వచ్చారా? లాభం వస్తుంటే పొలాన్ని అమ్ముకోకుండా ఎట్టా వుండమంటార్రా? అయినా మా పొలం అమ్మాలో లేదో మీ సలహా ఎందుకంటా?" కోపంగా అంటూ లేచాను అక్కడినుంచి కదలడానికి. నాతోటే అందరూ లేచారు. సాంబశివుడు కొంచెం ముందుకొచ్చి అన్నాడు
"బాబూ ఒక్క మాట ఇనండి.. పొలం మీదే.. అమ్మాలో వద్దో మీ ఇష్టం.. కానీ పొలం నమ్ముకోని మాలాంటోళ్ళు చాలామంది వుండారు బాబూ.... మీకు మటికి మీ పొలం మీరు అమ్ముకోని లాభాలు చేసుకోవడమే కనిపిస్తాంది... పొలం మీదే ఆధారపడ్డ మా బతుకులు కనిపియ్యటంలేదు. ఇంతకాలం పొలాన్ని దుక్కిదున్ని ఇంత వూడిగం చేసినోళ్ళం, మీరు పొలం ఇంకెవరికో అమ్మేత్తే పిల్లాజల్లతో వీధిన పడతాం... ఇంతకాలం మాకు అన్నం పెట్టినోళ్ళు ఇప్పుడు మా బతుకులు నాశనమౌతాయంటే సూత్తా వురుకుంటే న్యాయం కాదు కదయ్యా..? ఆలోచించండి.." చెప్పేసి అందరూ అక్కడినుంచి వెళ్ళిపోయారు..
అతను చెప్పిన మాటలు అర్థమవడానికి కొన్ని క్షణాలు పట్టాయి. అర్థం అయ్యేకొద్ది ఏదో మంచుతెరవీడి కొత్త పువ్వులు పూసినట్లుగా వుంది. ఇంతకాలం వుద్యోగస్తులను ఫర్నీచరులా చూసే కార్పరేట్లని విమర్శించినవాణ్ణి, ఇలా పొలంలో పనిచేసే వాళ్ళని అసలు వుద్యోగస్తులుగానే గుర్తించనే లేదు. అలా గుర్తించాకే నా బాధ్యత ఏమిటో అర్థమవుతోంది. అదే ఆలోచనతో ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు. ఎదురుగా నాన్న ముల్లుగర్ర భుజాన వేసుకొని వస్తూ కనిపించాకే తేరుకున్నాను. ఎదురు వెళ్ళి కర్ర అందుకోని అన్నాను -
"నాన్నా.. ఇంక మీరు పొలానికి వెళ్ళనవసరంలేదు.. రేపట్నించి నేనెళ్తాను.."           
నాన్న నవ్వేశాడు.

(రచన జులై 2012)