మబ్బుతునక (రచన కథాపీఠం కథ)


వాసంతీ... నాకు నిజంగా పిచ్చి పట్టిందా?” అడిగాను నేను. ఆమె నిర్దయగా నవ్వింది.
“ఈ ప్రపంచానికే పిచ్చి పట్టింది. అందుకే నిన్ను పిచ్చివాడు అంటోంది.” అలా అంటూనే నేల చూపులు చూస్తోంది వాసంతి.
“పోనీలే, నువ్వన్నా నమ్ముతున్నావు. నా పిచ్చి లోకంలో నేను బాగానే వున్నాను కదా? అయినా ఈ జనానికి వచ్చిన బాధేంటి..”
“మన లోకానికి, ఈ లోకానికి చాలా తేడావుంది విశ్వం. అదే వాళ్ళ బాధ..” చెప్పింది నవ్వుతూ.
“కాఫీ కలపనా?” అడిగాను.
“వద్దు అలా బయటికి వెళ్ళి నడుద్దాం పద..” చెప్పింది.
“ఇంత రాత్రా?” అన్నాను. ఆమె సమాధానం చెప్పకుండా లేచి బయటికి అడుగులేసింది. నేను అనుసరించాను.
బయట వూరంతా వెన్నెలలో తడుస్తోంది. వాసంతి మబ్బుతునకలా ముందుకు నడుస్తోంది. నేను చల్లగాలిలా అమె వెనకాల.
“ఎందుకు అంత తొందర... ఇద్దరం కలిసినడుద్దాం..” అన్నాను
“అవును నిజమే... ఇద్దరం కలిసే నడుద్దాం అనుకున్నాం, కానీ నీ దారి వేరు నా దారి వేరు అయిపోయాయి కదా?” అంది అడుగులు నిదానించకుండానే.
“అది అప్పుడు... ఇప్పుడు నేనూ నీ దారిలోకి వచ్చేశాను కదా?”
“నువ్వు వచ్చేసరికి నేను నీ కన్నా చాలా ముందుకి వెళ్ళిపోయాను కదా...” అంది. నాకు ఆమెను అందుకోవడం కష్టంగానే వుంది.
“సరే ఆ పార్కులో కూర్చుందామా” అడిగాను. ఇలా నడవటం కన్నా ఒక చోట కూర్చుంటే సుళువనిపించింది.
పార్కు నిశబ్దంగా వుంది. పూలమొక్కలన్నీ కొత్త అతిధుల్ని నిద్ర కళ్ళతో ఆహ్వానిస్తున్నట్లు తలలూపాయి. ఇద్దరం ఒక సిమెంటు బెంచి మీద కూర్చున్నాం.
“ఏదైనా పాట పాడు...” అడిగింది వాసంతి. నేను గట్టిగా నవ్వేశాను.
“నేను పాటలు పాడి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో... అప్పుడు కాలేజి రోజుల్లో...”
“అదే... అప్పుడు క్యాంటీన్ లో నన్ను చూసి పాడావు చూడు – “తూ మెరీ జిందగీ హై... తూ మెరీ హర్ ఖుషీ హై...” ఆ పాట పాడు” ఆ జ్ఞాపకం ఒక్కసారి వెండి వెలుగులా ఆమె ముఖంలో మెరిసింది.
“లిరిక్స్ గుర్తులేవు..” ఏదో ఒక సాకు.
“నాకు గుర్తున్నాయిగా... నేను అందిస్తాలే.. పాడవూ ప్లీజ్..”
పాట మొదలైంది.
“సపనోమే ఆనేవాలీ బాహోమే కబ్ ఆయేగీ...” అన్నప్పుడు గట్టిగా నవ్వేసింది వాసంతి. పాట ఆగిపోయింది.
“ఎందుకు ఆపావు?” ఆమెకి ఎప్పుడూ రాని కోపం నటించింది.
“పాడమని అడిగి అలా నవ్వితే ఎలా పాడను? ముందే చెప్పాను పాటలు పాడి చాలా రోజులైందని”
“నేను నవ్వింది అందుకు కాదు... అప్పుడు కాలేజీలో ఈ లైన్లు పాడినప్పుడు ఏం జరిగిందో గుర్తులేదా?” అంటూ మళ్ళీ నవ్వింది.
“గుర్తుంది... వున్నట్టుండి వచ్చి నన్ను కౌగిలించుకున్నావు...” నవ్వొచ్చింది. సిగ్గేసింది. అంత అందమైన అమ్మాయి అప్పుడెప్పుడో కాలేజి కేంటీన్ లో అందరి ముందు కౌగిలించుకున్నప్పుడు కలిగిన గర్వం మళ్ళీ నా కళ్ళలోకి వచ్చింది. వాసంతి నవ్వుతూనే నా వొళ్ళో పడుకుంది.
“అంత సంతోషం మళ్ళీ మన జీవితంలోకి రాలేదు కదా విశ్వం...” అడిగింది ఆమె. అప్పటిదాకా నవ్విన చంద్రుణ్ణి దిగులు మబ్బులు కమ్మేశాయి.
“అలా ఎందుకు అనుకుంటావు వాసంతి... మన పెళ్ళిరోజు, మొదటిరాత్రి... మర్చిపోయావా?” సరదాగా మాట్లాడాననుకున్నాను. ఆమె ముఖంలో విషాదం పెరిగింది.
“మన తల్లిదండ్రులు లేకుండా పెళ్ళి చేసుకోవటంలో లోటు తప్ప సంతొషం లేదు విశ్వం... మొదటిరాత్రి కూడా గుర్తుంది... ముందు ముందు భార్యాభర్తలుగా ఎలా బ్రతకాలో, సంసారమనే నది పైన డబ్బుల తెప్ప ఎలా పరచాలో అని చర్చించుకోని నిద్రపట్టక ఏ తల్లవారుఝామునో చేసిన శృంగారం...”
“ఎందుకలా అంటావు... అది జీవితంలో కొత్త మలుపు... ముందు దారిలో పూలు వుంటాయో, ముళ్ళు వుంటాయో అన్న భయం, ఆందోళన...”
“మనం సంసారం మొత్తం ముళ్ళు ఏరి పడెయ్యడానికే సరిపోయింది... పూలు వున్న దారులు పక్కనే వున్నా ముళ్ళు ఏరే పనిలో ఆ దారుల్ని గుర్తించనేలేదు మనం.”
“ఏం చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తావు నువ్వు... సరే ఆ విషయాన్ని వదిలెయ్... నువ్వు రాసిన కథలన్నీ నా దగ్గరే వున్నాయి. పుస్తకంగా వేద్దామనుకుంటున్నాను” అడిగాను మాట మార్చే ప్రయత్నంలో.
“వద్దు. ఆ కథలన్నీ మెలాంకలిక్ గా కనిపిస్తాయి నాకు... అలాంటివి వుంచడమే దండగ. రేపు మొత్తం తగలబెట్టేసెయ్...” చెప్పింది ఆమె నా వొళ్ళో నుంచి లేస్తూ.
“నిజంగా చెప్తున్నావా... నువ్వు అంత కష్టపడి రాసిన కథలు...”
“కథకి విలువ ఎంత కష్టపడి రాసామని కాకుండా, ఆ కథ ఏం చెప్తోంది అన్నదాని మీద ఆధారపడి వుంటుంది... వద్దు... తగలబెట్టేసెయ్...” గట్టిగానే అరిచింది.
“సరే... నువ్వు చెప్పినట్లే చేస్తాగా...” నేను కూడా కాస్త గట్టిగానే చెప్పాల్సివచ్చింది. ఇద్దరి మధ్య మౌనగీతం మోస్తూ చల్లగాలి తిరుగుతోంది. మళ్ళీ నేనే మాట్లాడాను.
“నీకు నచ్చవేమో కానీ, నీ కథలు నాకు బాగా నచ్చుతాయి...”
“అబద్ధాలు చెప్పకు విశ్వం ...” అంది ఆమె. “నేను రాసినప్పుడల్లా నీకు వినిపించేదాన్ని... ఆఫీసుకు వెళ్ళే హడావిడిలోనో, మంచం ఎక్కే తొందరలోనే వినేసి, “బాగుంది” అని ఒక్క మాటతో సర్టిఫికెట్ ఇచ్చేవాడివి... ఆ తరువాత ఎప్పటికో ఏదో పత్రికలో వచ్చేది. ఏదో ఒక ఆదివారం నీ చేత బలవంతంగా చదివిస్తే చదివి – “ఇదెప్పుడు రాసావు, నాకు గుర్తులేదే” అనేవాడివి...” అంతా కళ్ళముందు జరుగుతున్నట్లు చెప్తోంది వాసంతి.
“అప్పుడు నా వుద్యోగం... కార్పొరేట్ ప్రపంచం... టార్గెట్ లు, ప్రజంటేషన్లు... ఆ హడావిడిలో పడిపోయి అలా...” చెప్తున్నమాటలు మధ్యలోనే ఆగిపోయాయి. తప్పు చేసినప్పుడు కన్నా తప్పు చెప్పుకునేటప్పుడు చూపులు నేలరాల్తాయి.
“ఆ జంఝాటాన్ని వదిలేసి రమ్మని ఎన్నిసార్లు చెప్పాను... అలాంటి బ్రతుకు వద్దని ఎంత వేడుకున్నాను..” తల్చుకోని మరీ బాధపడింది వాసంతి.
“వచ్చేశాను కదా... ఇప్పుడు అవన్నీ ఏవీ లేవు... నువ్వు చెప్పినట్లే అన్నీ వదిలేశాను...” అంటున్నప్పుడు నా కళ్ళలో ఆశ. ఆమె కళ్ళలో అదే నిరాశ.
“ఇప్పుడా... చేతులు కాలిన తరువాత ఏం చేసి మాత్రం ఏం ప్రయోజనం... జరగాల్సినవన్నీ జరిగిపోయాక నువ్వు ఎన్ని విమానాలు ఎక్కి వస్తే మాత్రం ఏమిటి లాభం..?” ప్రశ్న సూటిగా వాడిగా తగిలింది. నా దగ్గర సమాధానం లేదు.
“నీకు గుర్తుందా విశ్వం? ఆ రోజు మార్చి ముఫై ఒకటి... నువ్వు అందీ అందని టార్గెట్లు వెనక పరుగులుపెడుతూ ఆఫీసులో వుండిపోయావు... నేను రోజంతా నీకు ఫోన్ చేస్తూనే వున్నాను... నువ్వు ఎత్తలేదు” ఆమె చెప్తుంటే మధ్యలో ఆపాను.
“గుర్తుంది... ఆ రోజే అంత వరకూ కంపెనీలో ఎవ్వరూ చెయ్యనంత బిజినెస్ చేశాను... లక్షల్లో బోనస్, ప్రమోషన్... అయినా నీ ఫోన్ ఎత్తలేదని అనకు ఒకసరి మాట్లాడాను...” సమర్ధించుకున్నాను.
“అవును ఫోన్ ఎత్తి... “ఏమైనా అర్జంటా? నేను పనిలో వున్నాను” అన్నావు... నువ్వు తండ్రివి కాబోతున్నావని అంత హడావిడిగా చెప్పడం నాకు ఇష్టంలేక పెట్టేశాను..”
“అవును ఆ రోజు రాత్రి బాగా ఏడ్చేవు కూడా...” అంటూ దగ్గరకు తీసుకోని గుండలకి హత్తుకున్నాను నేను.
“ఆ రోజు మాత్రమే కాదు... ఆ రోజు నుంచీ ఏడుస్తూనే వున్నాను...”
“అలా అనకు వాసంతి... అభినవ్ పుట్టినప్పుడు శలవు పెట్టి నీ దగ్గరే వున్నాను కదా?”
“వున్నావు... తరువాత అమర్ పుట్టినప్పుడు? ఢిల్లీలో నువ్వు మొదలుపెట్టబోయే వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్టర్స్ తో మీటింగ్స్ అన్నావు... నేను ఒక్కదాన్నే నొప్పులు పడుతూ ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళాను. ఆ క్షణంలో నాకేమనిపించిందో తెలుసా? అలా అనాధలా బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది” ఆమె చెంపల పైన జారిన కన్నీళ్ళు నా చేతి మీద పడుతున్నాయి.
“ఏడవకు వాసు... నిజమే... అప్పుడు తెలియలేదు. సక్సస్ ఇచ్చే మత్తు అది... ఒక్కఒక్క మెట్టు ఎక్కుతున్నానన్న సంతోషంలో కిందెక్కడో మిమ్మల్ని వదిలేశానన్న నిజం వెనక్కి తిరిగి చూసినప్పుడే కదా తెలిసింది..” నా కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. వాసంతి నా గుండల మీద నుంచి లేచి, కన్నీళ్ళు తుడుచుకోని నిటారుగా కూర్చుంది. చేతులు రెండు రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకోని వస్తున్న ఏడుపును దిగమింగుకుంటోంది.
“వెనక్కి తిరిగి చూసుకోమని చాలాసార్లు నీకు చెప్పాను... నువ్వు ఈ రోజు తిరిగి చూసుకునేసరికి నువ్వు కోల్పోవలసింది కోల్పోయావు... మన వయసు, మన సంతోషం, మన కుటుంబం అన్నీ కోల్పోయావు. చివరికి నన్ను కూడా...!!” చెప్పి కూర్చున్న చోటు నుంచి లేచింది వాసంతి. ఆ ముఖంలో ఇప్పుడు సంతోషంలేదు, దుఖంలేదు. ఒక స్థిరమైన మొండితనం మాత్రమే వుంది.
“వెళ్తున్నావా?” అడిగాను వినవలసిన జవాబు ఇష్టం లేకపోయినా.
“అవును”
“రేపు కలుస్తావుగా?”
“ఊ”
వాసంతి వెళ్ళిపోయింది.
***
“అన్నయ్యా... నేను అమర్ ని మాట్లాడుతున్నాను” నా చిన్న కొడుకు పెద్దవాడితో మాట్లాడుతున్నాడు. నాకు వినపడకూడదనేమో వరండాలోకి వెళ్ళి చిన్నగా అంటున్నాడు. వినపడ్డా వినపడనట్లే వున్నాను నేను.
“రాత్రి మళ్ళీ వెళ్ళి పార్కులో కూర్చున్నాడీయన... చెప్తే వినడు.. పైగా నన్ను వుద్యోగం మానేసి, ఎక్కడైనా టీచింగ్ చెయ్యమంటాడు... మళ్ళీ మొదటికొచ్చిందన్నయ్యా...” వాడు చెప్తూనే వున్నాడు. తప్పేముంది? నేను చేసిన తప్పే వాడు చేస్తున్నాడని నా బాధ. వాడు ఫోన్ కి చెయ్యడ్డం పెట్టుకోని మాట్లాడుతున్నాడు.
“పొద్దున్న అమ్మ పుస్తకాలన్నీ తీసి తగలబెట్టబోయాడు... ఏమన్నా అంటే మీ అమ్మే చెప్పింది అంటాడు... నాన్నకి పిచ్చి ఎక్కువైనట్లుంది అన్నయ్యా... అమ్మ చనిపోయిన దగ్గర్నుంచి ఇదే వరస... మొన్న డాక్టర్ అంకుల్ నాన్నకి నిజం చెప్పేశాడు... అమ్మ ఆత్మహత్య చేసుకుందని.. అప్పటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు... అక్కడ ఏదైనా మంచి వైద్యం దొరికే అవకాశం వుంటే చెప్పు అన్నయ్యా... పంపిచేస్తాను... ఇంక ఈయన పిచ్చి పనులు తట్టుకే శక్తి నాకు లేదు...”
“పిచ్చట... నాకు పిచ్చి... విన్నావా వాసంతీ... నువ్వు చచ్చిపోయావని నేను పిచ్చివాణ్ణి అయిపోయానట... విన్నావా? విన్నావా?...” విరగబడి నవ్వుతున్నాను.
“ఫర్లేదులే విశ్వం... నేను చెప్పాగా... ఈ ప్రపంచానికే పిచ్చి పట్టింది. అందుకే నిన్ను పిచ్చివాడు అంటోంది.” అంది నాకు తప్ప ఇంకెవరికీ కనపడని వాసంతి.

<<?>>
(రచన కథాపీఠం నవంబరు 2012)