స్వప్నశేషం (కథ)

ఏ అర్థరాత్రో మెలుకువ వచ్చినప్పుడు.
చిక్కని చీకటిలో జారిపోయిన కలని నేను
పూర్తికాని స్వప్నశేషాన్ని వెతుక్కుంటూ
ఆశను మోస్తూ తిరుగుతున్న గాలిపాటని..
“ఏం చేస్తున్నావ్?” అడిగింది దివ్య. తపస్సు చెదిరిన మహాఋషిలా నేను. సమాధానం ఇవ్వాలా వద్దా?
“మళ్ళీ కవిత్వమా? పడుకోరాదూ.. రెండు దాటింది”
“ఊ” అన్నాను. లైటాపాను. నిద్రకి మెలకువకి మధ్య ప్రపంచంలో కేలండర్ ఒక గడిలోంచి ఇంకో గడిలోకి ప్రయాణం.
పరుగెడుతున్నాను... ఇంకా వేగంగా.. గసపెడుతూ ఆయాసపడుతూ... ఇంకా ఇంకా.. పరుగు.. పరుగు.. తరుముతున్నది ఎవరో.. చేరాల్సింది ఎక్కడికో... ఏదీ తెలియని పరుగు. హైవేలో వెళ్తూ హారన్ కొడితే చెల్లా చెదరై పరుగెత్తిన గొర్రల గుంపులో నేనూ ఒకణ్ణి... ఏ గుట్టచాటుకో తప్పించుకోని పోయిన గొర్రెపిల్లను వెతుక్కుంటూ పిచ్చిగా అరుస్తున్న కాపరిని.. అంతం ఎక్కడో తెలియని తార్రోడ్డుని.. చీకటి సొరంగంలో నిధులున్నాయని పరుగెత్తి పరుగెత్తి చివరికి అది సొరంగం కాదని గబ్బిలాల గుహ అని తెలుసుకోని వెనక్కి దారి వెతుక్కుంటున్న అభిమన్యుణ్ణి...
“ఆగద్దు.. ఆగద్దు... ఆగితే నువ్వే మిగలవు.. అభిమన్యుడిలా అంతం అయిపోతావు.. పరుగెత్తు... పరుగెత్తు... ఇంకా స్పీడ్ గా” దివ్య అరుస్తోంది.
ఆమె చుట్టూ గబ్బిలాలు తిరుగుతున్నాయి. నల్లటి చీకటి ఆమెను మింగేస్తొంది. క్రమంగా చీకట్లోకి కలిసిపోయిన దివ్య స్థానంలో చిన్న వెలుగు రేఖ. అది క్రమంగా విస్తరించి భయంకరమైన తెలుపు రంగుగా మారి సూదుల్లా వచ్చి కళ్ళలో పొడుస్తుంటే...
మెలకువ వచ్చింది..!
“గుడ్ మార్నింగ్... కాఫీ తాగుతావా?” దివ్య నన్నే చూస్తూ అడిగింది. తలాడించాను.
రుచి పచి లేని బ్రేక్ ఫాస్ట్. అట్టముక్కల మధ్య నలిగిపోయిన ఫ్రూట్ జ్యూస్. తినక తప్పదు కదా..!
“ఏదన్నా మాల్ కి వెళ్దామా” దివ్య అడిగింది.
“ఎందుకు? ఏమన్నా కొనాలా?”
“కొనడానికే వెళ్ళాలా?.. సరదాగా..”
“ఒద్దు.. నాకు నచ్చదు..”
“ఏం నచ్చదు?” కోపం ఆమె గొంతుతో.
“ఆ మాల్ తుడిచే ముసలాడు... గేటు బయట బుడగలమ్మే మాసిన బట్టల పిల్లాడు.. చినిగిపోయిన బట్టల్ని యూనిఫార్మ్ తో కప్పుకునే సెక్యూరిటీ గార్డ్..”
“వాళ్ళని ఎందుకు చూస్తావు?”
“ఏం చెయ్యమంటావు... వాళ్ళ కాళ్ళ కింద ఉండే భూమి ఒకప్పుడు వాళ్ళ సొంతమేమో అనిపిస్తుంటుంది... మాల్ పేరుతో ఆక్రమించిన రియల్ ఎస్టేట్ దురాశకి వాళ్ళంతా మూగ సాక్షుల్లా కనిపిస్తారు నాకు...”
“అవన్నీ కాదు.. రంగురంగుల ప్రపంచాన్ని చూడు.. ప్రపంచం మొత్తం వడ్డించే రకరకాల ఆహారాన్ని చూడు..”
“ప్చ్.. నీకు పిజ్జా తెచ్చి సర్వ్ చేసే కుర్రాడు.. ఆ హోటల్ వెనక పారేసిన ఉల్లితొక్కల మధ్య కూర్చోని ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దన్నం తింటాడు తెలుసా?”
“నీతో వాదించలేను... పోనీ మల్టీప్లెక్స్..?”
“తెరలాగేవాడి జీవితానికి తెరదించేసిన ఏసీ రాక్షసి..”
“ఇంకేం చేద్దాం? వీకెండ్ రెండు రోజులు...”
“బతుకుదాం..”
“వస్తావా రావా?”
ఏం చెప్పాలి? ఇద్దర్లో ఒకరన్నా సంతోషంగా వుండచ్చు కదా? వస్తానన్నాను.
వీకెండ్ రంగులరాట్నం రెండు రోజులు తిరిగింది. తెల్లవారితే ఫార్మల్ బట్టలు.. క్లీన్ షేవ్.. టై.. బూట్లు.. పరుగు ప్రారంభం.. చెరో దిక్కుకు..
“దించడం నా వల్ల కాదు.. నువ్వు ఆటోలో వెళ్ళిపో..” చెప్పాను.
“ఈవినింగ్ కాన్ఫరెన్స్ వుంది.. రాత్రికి లేటౌతుంది.. హోటల్ నుంచి ఏమన్నా తెచ్చి వుంచుతావా?” అడిగింది హడావిడిలో మాటలు వదులుతూ.
“నాక్కూడా క్లైంట్ మీటింగ్ వుంది..”
“సర్లే.. క్యాంటీన్ లో ఏదో ఒకటి తినేస్తాలే... మరి నువ్వు...”
“నేనూ అంతే... “
విడిపోతాం.. కాదు కాదు.. విడిపోయే ముందు యాంత్రికంగా పెట్టుకున్న ముద్దు బుగ్గలపైన మరకలుగా మాత్రమే మిగులుతుంది. ఆ తరువాత ఉద్యోగం బరువు లాప్ టప్ గా మారి భుజానికి ఎక్కుతుంది.
ఎండిపోయిన కొమ్మ మీద నుంచి పంజరంలోకి వలసెళ్ళిన పిట్టలమౌతాం. క్యూబికల్ జైల్లో కఠిన కారాగార శిక్ష. పరుగు.. పరుగు.. పరుగు..
“సార్ దిగండి...” ఆటోవాడు తట్టి లేపుతాడు. ఎదురుగా అద్దాల మేడ. మేడ మొత్తం గదులు. గది గదికి తలుపు. ఏ తలుపు తెరిస్తే రాకుమారి దొరుకుతుందో అని వెతికి వెతికి..
లిఫ్ట్ లో పైకి కిందకి.. కిందకి పైకి.. మెట్లెక్కి.. మెట్లు దిగి..
ఫాల్స్ సీలింగ్ లో నించి పొడుచుకొచ్చిన వెలుగు చుక్కలు రాలిపడేదాకా..!!
“మిస్టర్ అనిల్.. ఏం ఆలోచిస్తున్నారు?” రాకుమారిని బంధించిన మాయలఫకీర్ గొంతు.
“ఏం లేదు సార్..”
“ఆర్ యూ లాస్ట్ సమ్ వేర్...??”
యామ్ ఐ లాస్ట్? ఆర్ డిడ్ ఐ లాస్ట్ సమ్ థింగ్..?? సమాధానం వెతుక్కోవాలే తప్ప ప్రశ్నలు అడగకూడదు.
“సారీ సార్..”
***
“ఏంట్రా ఎప్పుడూ ఆలోచిస్తుంటావు?” ఒక స్నేహితుడు మెషిన్ కాఫీ తాగుతూ అడిగాడు.
“సమాధానం వెతుక్కోవాలే తప్ప ప్రశ్నలు అడగకూడదు..” చెప్పాను.
“ఇంకా కవిత్వం రాస్తున్నావా?”
“ఇంకా రాయడమేమిటి? కవిత్వం ప్రవాహం... మధ్యలో ఆగేందుకు అవకాశమే లేదు..”
“ఐ యాం సర్ప్రైజ్డ్.. ఇంత భావుకత్వంతో ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఎలా బతుకుతున్నావు రా?”
నేనొక వారథిని... శిధిలమైన వారధిని... జీవితానికి చావుకు మధ్య పరుచుకున్న కవిత్వాన్ని... ఐదురోజుల పోరాటాన్ని.. కొసమెరుపులా మెరిసే వారాంతపు భావుకుణ్ణి...!!
“ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు?”
“ఏం లేదు.. ఒక కాగితం ఇస్తావా?”
***
బట్టలు కొంటున్నారు.
ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫాస్ట్ గా కొంటున్నారు.
భూములు కొంటున్నారు.
గాలిలోకి లేచిన చిరునామాలు..
డూప్లెక్స్ ఇళ్ళకీ, పొడుగైన కార్లకి నెల నెలా కరిగిపోయే సంపాదనలు..
అందమైన యక్షిణి మాయలో చిక్కుకున్న రాకుమారులు..
ఇక మిగిలింది నా లాంటి పిచ్చివాళ్ళు...
అవును..
ఫైన్ ఆర్ట్స్ మర్చిపోయి ఎకనామిక్స్ మాత్రమే బోధించే జీవితపు విశ్వవిద్యాలయంలో
భావుకత్వం ఇక భ్రమ.
భావుకుడు ఒక పిచ్చివాడు.
***
“నీకేమైనా పిచ్చి పట్టిందా?” దివ్య అనే ఒక ఆడగొంతు.
“ఏం?”
“ఇప్పుడు మనకి పిల్లలు అవసరమా?” ఇప్పుడా గొంతులో ఆడతనం లేదు.
“అవసరానికి పిల్లలు కంటామా?”
“నీ కవిత్వం వినే ఓపిక నాకు లేదు.. ఇప్పుడిప్పుడే కెరీర్ దారిలో పడింది.. ఈ పరిస్థితిలో మనకి ఇదంతా బర్డన్.. నా వల్ల కాదు.. ప్లీజ్ అర్థం చేస్తుకో..”
అర్థం చేసుకో
ఎలా అర్థం చేసుకోమంటావు?
ఒక్క ఇంక్రిమెంట్ కోసం వద్దనుకున్న శిశువు
రేప్పొద్దున కలలో కనిపించి నిర్దయగా నన్ను చూసి నవ్వితే
సమాధానం నువ్వు చెప్తావా?
నా కలలోకి నువ్వు వస్తావా?
“నాకు ఈ పిల్స్ తెచ్చిపెట్టు.. నేను చూసుకుంటాను...”
బయటెక్కడో ఆఖరి గొడ్డలి దెబ్బకి మహావృక్షం ఒకటి నేలకొరిగిన చప్పుడు.
***
“ఈ నెల జీతం ఎక్కువ వచ్చినట్లుంది?” దివ్య అడిగింది
“సేలరీ పెరిగింది..”
“అదే ఎందుకు?”
“ప్రమోషన్..”
“వ్యాట్.. నిజమా? చెప్పనేలేదు...”
“ఏముంది చెప్పడానికి... బానిస పోస్ట్ నుంచి సీనియర్ బానిస పోస్టుకు, అక్కడ్నుంచి ఇప్పుడు హెడ్ బానిస పోస్టుకు వచ్చాను. రేపెప్పుడో ఛీఫ్ బానిస్ పోస్ట్ కూడా ఇస్తారు..”
“ఓహ్.. స్టాపిట్.. ఎందుకలా మాట్లాడతావు?”
“నాకు నచ్చే ప్రపంచం.. నేనుండే ప్రపంచం ఒకటే కానప్పుడు మాటలు ఇలాగే రాలిపడతాయి..”
“వాట్ ఆర్ యూ అప్టూ..? ఏం చేద్దామని?”
సమాధానం లేదు... వెతకాలి.
వెనక్కి పరుగెత్తే అవకాశం వుందా?
బూటకపు అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి నిజమైన మిడిల్ క్లాస్ లోకి
జనరల్ కంపార్ట్ మెంట్ లో ఖాళీలు వున్నాయా?
గొడ్లచావిడి పక్కన వేపచెట్టు
నులకమంచం మీద పడుకోని వివిధభారతి వింటూ.. అచ్చం మా నాన్న లాగా..
డబ్బులతో సంబంధంలేని అమ్మ చిరునవ్వు దివ్య ముఖంలో విరుస్తుందా?
“ఆలోచనలు ఆపండి సారు.. యూ నీడ్ ఏ బ్రేక్.. ఎక్కడికన్నా వెళ్దామా? గోవా? బ్యాంకాక్..?? నువ్వు కార్పొరేట్ ప్రపంచాన్ని తిట్టుకుంటావు కానీ, చూడు ఫ్యామిలీతో గడపమని పదిరోజుల కంపల్సరీ లీవ్ ఇస్తున్నారు మా ఆఫీస్ లో”
“హ.. హ.. అలా అర్థం అయ్యిందా నీకు... నువ్వు లేకపోయినా కంపెనీ నడవాలని నీకు శెలవ ఇస్తున్నారు... రెప్పొద్దున నీ చేతిలో పింక్ స్లిప్ పెట్టాలనుకున్నప్పుడు వరసలో మరో బలిపశువుని సిద్ధం చేసే మహా మాయ ఇది...”
“యు ఆర్ సిక్ ఐ సే..” దివ్య చిరాకు పడింది.
గోవాకి టికెట్లు బుక్ అయ్యాయి. రెండు నెలల జీతాన్ని క్రెడిట్ కార్డ్ మింగేసింది.
***
తిరిగి వచ్చాక తిరిగి కథ ప్రారంభం.
పరుగు.. పరుగు.. పరుగు...
“ఒక్కసారి ఆగుతాను...” అరిచాను.
“నీకేమన్నా పిచ్చా... ఆగావంటే ముందుకు పడతావు... నువ్వు పరుగెత్తేది ట్రెడ్ మిల్ పైన..”
కిందకి చూసుకున్నాను.
అవును నిజమే.. నెను ఇన్ని రోజుల్నుంచి పరుగెత్తుతున్నది ట్రెడ్ మిల్ మీద. కాదు.. కాదు.. నేను పరుగెత్తడంలేదు.. నా కాళ్ళ కింద బెల్ట్ పరుగెడుతోంది. పడిపోకుండా నిలబడటానికి చేసే ప్రయత్నాన్ని నేను పరుగనుకుంటున్నాను. అలా ఎంత పరుగెత్తినా అక్కడే వుంటాను... ముందుకు తీసుకెళ్ళే పరుగు కాదిది..!!
“దివ్యా.. ఈ ట్రెడ్ మిల్ ఎలా ఆఫ్ చెయ్యాలి?”
“ఆఫ్ బటన్ లేదు దీనికి... ఇంకొంచెం సేపు పరుగెత్తు..”
“అలిసిపోయాను... చెమటలు పడుతున్నాయి.. ఆపేస్తాను.. ప్లీజ్..”
“పరుగెత్తు.. పరుగెత్తు...”
నేను ఆగిపోయాను. ధబ్బున పదిపోయాను. మంచం మీదనుంచి. కల మిగిలిపోయింది.
***
"అనిల్ రిజైన్ చేశాడు." ఆఫీసు మొత్తం గుప్పుమన్న వార్త. 
ఆ పని అనుకున్నంత కష్టమేమీ కాదు. ఆఫీస్ లో కొన్ని కాగితాల మీద సంతకం, నా మెడకు బిగించిన బానిస పతకం ముడి విప్పడం, బరువెక్కి భుజాన కూర్చున్న లాప్ టాప్ ని వదిలించుకోవడం..
తోటి సైనికుడు చనిపోతే కనీసం అటు వైపు చూడనైనా చూడకుండా యుద్ధంలోకి పరుగెత్తే సైనికుల్లా కొలీగ్స్.
అద్దాల మేడలో రాకుమారి వుండదురా అని అరవాలనిపించింది. అంతలోనే అవసరం లేదనిపించింది. ఉపయోగం వుండదనిపించింది.
దివ్యకి మాత్రం కోపం వచ్చింది.
“నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో..” అరిచింది గట్టిగా.
“అదే చేద్దామనుకుంటున్నాను..” చెప్పాను.
“అదే ఏంటది?”
“ఒక కాలేజీలో లెక్చరర్ గా చేరుతున్నాను.. కవిత్వం రాయాలనుకుంటున్నాను... అమృతం కురిసిన రాత్రి వందసార్లు చదవాలనుకుంటున్నాను... పాటగా మళ్ళీ పుట్టాలనుకుంటున్నాను... ఇంకా...”
తీక్షణంగా చూపులతో పొడిచి వెళ్ళిపోయింది.
ఒక్కడినే ఇంట్లో... ఇల్లూ ఒంటరిదే.. మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను.
ఇప్పుడు నేను...
ఆకులు రాలిపోయి ఎండిన చెట్ల మధ్యలో నిలబడి
పచ్చటి వసంతాన్ని ఆవాహన చేస్తున్నాను..

<< ?>>
(ఆదివారం ఆంధ్రజ్యోతి, 24 ఫిబ్రవరి 2013)

మొపాస కథలు: ఇద్దరు సైనికులు



ప్రతి ఆదివారం, కాస్త తీరిక చిక్కగానే ఆ ఇద్దరు సైనికులు నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళేవారు. బలవంతంగా మార్చింగ్ చేస్తున్నట్లు కాకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ బ్యారెక్‌లు దాటి వెళ్ళేవాళ్ళు. వూరి చివర దాదాపు ఇళ్ళు లేని ప్రాంతందాకా వెళ్ళి అక్కడినుంచి వేగం తగ్గించి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బెజాన్స్ వెళ్ళే మట్టి రోడ్డు మీద నడిచేవాళ్ళు.

ఇద్దరూ బక్కపల్చగా వుండటం వల్ల పెద్ద పెద్ద టోపీలలో తలలు దాచుకున్నట్లు వుండేవాళ్ళు. చేతులు దాటిన పొడవైన చొక్కాలు వేసుకునేవాళ్ళు. వాళ్ళు వేసుకునే ఎర్రటి ప్యాంట్లు పొడవు ఎక్కువవటంతో మడిమల దగ్గర మడతలు పెట్టుకోని వేసుకునేవారు. వారి దళసరి మిలటరీ దుస్తుల మధ్యలో వాడిపోయి, చిక్కిపోయినట్లు వుండే వాళ్ళ ముఖాలను, ఆ ముఖాల పైన వున్న ప్రశాంతమైన నీలం రంగు కళ్ళను సాధారణంగా ఎవరూ గుర్తించేవాళ్ళు కాదు. ఆ ఇద్దరూ నేరుగా నడిచుకుంటూ వెళ్ళేవాళ్ళే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. అయితే ఆ సమయంలో ఇద్దరి మనసులోనూ ఉండే ఒకే ఆలోచన ఇద్దరి మధ్య మౌన సంభాషణకి కారణమయ్యేది. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటే వెళ్ళే  ఛంపియక్స్ అనే ప్రాంతంలో, అడవి మొదలయ్యే చోట ఒక ప్రదేశాన్ని కనుక్కున్నారు. అక్కడికి వెళ్తే చాలు, వాళ్ళకి మాతృభూమి, పుట్టి పెరిగిన ఊరు గుర్తుకువస్తాయి. అక్కడ తప్ప వాళ్ళ జీవితంలో సంతోషమే కనపడనట్లుగా వుండేది వాళ్ళకి.

కోలోంబెస్, చాటోవ్ దారులు కలిసే కూడలి దగ్గర వున్న చెట్ల నీడకు రాగానే ఇద్దరూ తలమీద అదిమినట్టు వుండే బరువైన హెల్మెట్లను తీసి నుదిటి మీద చెమట తుడుచుకునేవాళ్ళు.

బెజాన్స్ వంతెన మీద కొద్ది సేపు ఆగి అక్కడ చేపలు పట్టడానికి వేసిన వలలను కొద్దిసేపు చూసేవాళ్ళు. కొన్ని నిముషాలపాటు ఆ వంతెన గోడపైన ముందుకు వంగి తెల్లటి తెరచాప కట్టి చేపలకోసం వలని నీళ్ళలోకి విడిచి నిలబడిన చిన్న పడవలను చూస్తూ గడిపేవాళ్ళు. బహుశా అవి వాళ్ళకి వాళ్ళ ఇంటిని, అక్కడ చేపలు పట్టడానికి వాడే పడవలను గుర్తుచేస్తాయేమో. నీటిలో ఆ వలలను చూస్తూ వంతెన దాటిన తరువాత కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ పచారీ షాపులో, బేకరీలో, వైన్ షాపులో కావాల్సినవి కొనుక్కునేవాళ్ళు. ఆ పూట భోజనానికి ఒక సాసేజ్, నాలుగు సెంట్లకి బ్రెడ్, ఒక సీసా వైన్ కొనుక్కోని రుమాళ్ళలో కట్టుకోని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ గ్రామాన్ని కూడా దాటుకుంటూ వెళ్తుంటే మాటలు మొదలై వాళ్ళ నడకలు మందగించేవి.

వాళ్ళకు అభిముఖంగా పచ్చిక బయలు, అక్కడక్కడా గుబురుగా కొన్ని చెట్లు ఆ వెనక అడవి కనిపించేవి. ఆ చిన్న అడవిని చూస్తే వాళ్ళకి వాళ్ళ వూర్లో వున్న అడవి గుర్తుకువచ్చేది. దారికి ఇరువైపులా వున్న గోధుమ, ఓట్స్ పంటలు వుండేవి. అవి చూసినప్పుడల్లా జోర్డాన్, లూయీస్ తో అనేవాడు -

"మన వూరిలాగే వుంది కదూ.. అచ్చం మన పులోనివన్ లాగా?"
"అవును మన వూరిలాగే వుంది"

అంతే. ఆ తరువాత వాళ్ళ మనసుల్లో సొంత వూరి జ్ఞాపకాలు పల్చగా పరుచుకుంటుండగా పక్క పక్కనే నడుస్తూ ముందుకు సాగిపొయేవాళ్ళు. అక్కడ వున్న పొలాలనీ, దారుల్నీ, అడవుల్నీ, నీటి చలమల్ని చూసుకుంటూ సాగిపోయేవాళ్ళు.

ప్రతిసారీ అక్కడే వున్న ఒక ప్రైవేటు ఎస్టేట్ లోని ఒక పెద్ద బండారాయి దగ్గర ఆగేవాళ్ళు. అది వాళ్ళకి వాళ్ళ వూరికి పొలిమేరలో వున్న ఒక సమాధిని గుర్తుచేసేది.

గుబురుగా కనిపించే చెట్ల మధ్యకు చేరగానే లూయీస్ ఒక చిన్న కొమ్మని విరిచి దాన్ని ముక్కలు చేసుకుంటూ, తన స్నేహితులను గుర్తుచేసుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగేవాడు. జోర్డాన్ సామానులు మోసేవాడు.

ఎప్పుడో ఒకసారి లూయీస్ ఏదో ఒక పేరునో, చిన్నప్పుడు ఆడిన తమాషా అటనో గుర్తుచేసేవాడు. ఇక వారి ఆలోచనలన్నీ ఆ విషయం చుట్టే తిరిగేవి. వాళ్ళ స్వదేశం ఎంతో దగ్గరగానూ, అంతలోనే ఎంతో దూరంగానూ అనిపించేది ఇద్దరికీ. ఆ ప్రదేశం తాలూకు ఆలోచనలు క్రమక్రమంగా వాళ్ళ మనసుల్ని ఆవహించేవి. ఆ ఆలోచనలతో వాళ్ళు కాలంలో వెనక్కి వెళ్ళిపోయి తమకెంతో బాగా గుర్తున్న ఆ పొలాలనీ, అందమైన ప్రకృతినీ చూసేవాళ్ళు. పరిచయమైన శబ్దాలను వినేవాళ్ళు. ఆకుపచ్చని పొలాలల పరిమళాలని పీల్చేవాళ్ళు. సముద్రపు గాలిని అనుభవించేవాళ్ళు. జ్ఞాపకాలలో తడిసేవాళ్ళు. ఇప్పుడున్న నగరం తాలూకూ వాసనలు ఏ మాత్రం తెలిసేవికాదు. ఆ కలల్లోనే తమ మిత్రులు వీరికి వీడ్కోలు చెప్పి తిరిగి రాని ప్రమాదకరమైన చేపల వేటకు వెళ్ళినట్లు అనిపించేది.

వాళ్ళ నడక ఇంకా మందగించేది. ఆ ఇద్దరి మనసులో గూడుకట్టిన విషాదం, మధురమైన బాధ, బంధించిన జంతువు తన స్వతంత్రాన్ని గుర్తుచేసుకునేంత దీనంగా గుండెల్లో చొరబడేది.

లూయీస్ కొమ్మని ముక్కలు చెయ్యడం పూర్తికాగానే, వాళ్ళు ప్రతి ఆదివారం భోజనం చేసే ఒక చిన్న మూలకి చేరి, అక్కడ పొదల్లో దాచిన రెండు ఇటుకలను బయటికి తీసేవాళ్ళు. ఆ ఇటుకలమధ్య ఎండిన కర్రపుల్లల్ని వేసి, మంట పెట్టి తమ తెచ్చుకున్న సాసేజ్‌ని కత్తి కొసకి గుచ్చి ఆ మంట పైన వేపుకునేవాళ్ళు.

తెచ్చుకున్న బ్రెండ్ చివరి ముక్క తిన్న తరువాత, సీసాలో వైన్ చివరి చుక్కదాకా తాగిన తరువాత ఇద్దరూ గడ్డిపైన వళ్ళు విరుచుకోని మాట్లాడుకోకుండా పడుకునేవాళ్ళు. కళ్ళు సగం మూసి ఆకాశం దూరాలని కొలుస్తున్నట్లు చూస్తూ, చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు పడి వుండేవాళ్ళు. వాళ్ళు వేసుకున్న ఎర్రటి మిలటరీ దుస్తులు అక్కడ వున్న చిత్రమైన అడవి పువ్వులలో కలిసిపోయేవి.

మధ్యాహ్నం తరువాత అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ బెజాన్ గ్రామం వైపు చూసేవాళ్ళు. అక్కడినుంచి వచ్చే గొల్లపిల్ల కోసమే వాళ్ళ ఎదురుచూపులు. ప్రతి ఆదివారం ఆ అమ్మాయి వాళ్ళ ముందు నుంచే నడుచుకుంటూ వెళ్ళి, ఆ ప్రాంతలో గడ్డి మేస్తూ తిరిగే ఒకే ఒక ఆవు దగ్గరకు వెళ్ళి పాలు పితికేది. అలా వాళ్ళు ఎదురుచూస్తూ వుండగానే ఆ పిల్ల పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చేది. ఆ అమ్మాయి చేతిలో వుండే పాత్రపైన ఎండ పడి చిత్రంగా మెరుస్తుంటే వాళ్ళకి ఏదో తెలియని ఆనందం కలిగేది. వాళ్ళు ఆ పిల్లతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఎందుకో తెలియదు కానీ ఆ పిల్లని చూడటంలోనే వాళ్ళకి సంతోషం కలిగేది.

ఆ పిల్ల చూడటానికి ధృఢంగా, ఎండకి నల్లబడిన రంగుతో జర్మనీలోని ఆ ప్రాంతపు పల్లెటూర్లలో వుండే అందరి అమ్మాయిలాగే వుంటుంది.

ఎప్పుడూ ఒకే చోట కనిపిస్తున్నారని గమనించి ఒకరోజు ఆ అమ్మాయి పలరింఛింది –
“మీరు ఎప్పుడూ ఇక్కడికే వస్తారు కదూ?”

తోటి మిత్రుడి కన్నా కాస్త చొరవ ఎక్కువున్న లూయీస్ కూడా కాస్త తడబడ్డాడు.
“అవును... అదీ.. అదీ... అప్పుడప్పుడు విశ్రాంతి కోసం వస్తుంటాము..” అన్నాడు

అంతే. కానీ ఆ తరువాత ఆదివారం వాళ్ళు కనపడగానే ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. వాళ్ళ సిగ్గు గురించి తెలుసుకున్న గడుసుదనంతో నవ్వింది. ఆ తరువాత అడిగింది –

“ఏం చేస్తుంటారు ఇక్కడికి వచ్చి? ఈ గడ్డి ఎలా పెరుగుతోందో తెలుసుకోడానికి వస్తుంటారా?”
లూయీస్ కాస్థ ధైర్యం తెచ్చుకోని నవ్వేసి- “అవును అందుకే వస్తాము మేము” అన్నాడు.
“ఏమంత త్వరగా పెరుగుతున్నట్లు లేదు... ఏమంటారు?” అంది కొనసాగింపుగా.
“నిజమే... కాస్త మందకొండిగా వుంది వ్యవహారం” అన్నాడతను నవ్వుతూనే.
ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం, పాత్ర నిండా పాలతో వాళ్ళ ముందు ఆగింది.
“తాగుతారా? మీ వూర్లో పాలలాగే వుంటాయి” అన్నది.

ఆ అమ్మాయి అనుకోకుండా అన్నది కానీ ఆ మాట వాళ్ళని సూటిగా గుండెల్లో తాకింది. ఇద్దరూ కదిలిపోయారు. ఆ తరువాత వాళ్ళు తెచ్చుకున్న వైన్ సీసా నిండా పాలు వొంపిందా పిల్ల. లూయీస్ సీసా ఎత్తి కొద్ది కొద్దిగా తన భాగం మాత్రమే అయ్యేలా, జాగ్రత్తగా తాగాడు. ఆ తారువాత సీసా జోర్డాన్ చేతిలోకి వెళ్ళింది. ఆ పిల్ల నడుము మీద చేతులు వేసుకోని, తాను వాళ్ళకి ఇచ్చిన ఆనందాన్ని సంతోషంగా గమనిస్తూ నిలబడి చూసింది.

“సరే మరి వచ్చే ఆదివారం కలుద్దాం. బై” అంటూ ఆ తరువాత ముందుకు కదిలింది ఆమె.
పొడుగ్గా వున్న ఆమె రూపం క్రమంగా చిన్నదై, దూరమై ఆ తరువాత పచ్చటి పొలాల్లో అదృశ్యమైపోయే దాకా చూస్తూ వుండిపోయారు ఇద్దరూ.

మరో వారం గడిచింది. ఈ సారి బ్యారెక్ లు దాటుతుండగానే జోర్డాన్ లూయీస్ తో – “మనం ఆ అమ్మాయి కోసం ఏమన్నా కొనుకెళ్తే బాగుంటుందేమో కదా” అని అన్నాడు. అయితే ఏం తీసుకెళ్ళాలి అన్న విషయం దగ్గర కొంత తర్జనబర్జన పడ్డారు.  లూయీస్ పోర్క్ తో చేసిన ఒక వంటకం తీసుకెళ్దామని అంటే జోర్డాన్ కి స్వీట్లంటే ఇష్టం కాబట్టి రెండు క్యాండీలు తీసుకెళ్దాం అన్నాడు. చివరికి అతని మాటే నెగ్గడంతో, రెండు రూపాయలు ఖరీదు చేసేవి ఎర్రదొకటి, తెల్లదొకటీ తీసుకున్నారు.

ఈ సారి మాత్రం ఎప్పటికన్నా తొందరగానే భోజనాలు ముగించారు. బహుశా ఆతృత, ఉత్సుకత కారణమేమో. ఆ అమ్మాయిని ముందు జోర్డాన్ గమనించాడు.
“అదిగో వస్తోంది” అన్నాడు.
“అవును అదిగదిగో వచ్చేస్తోంది” అన్నాడు లూయీస్ సమాధానంగా.
వీళ్ళను చూడగానే ఆ అమ్మాయి కూడా చిరునవ్వు నవ్వింది. “ఎలా వున్నారు?” అంటూ అరిచింది.
“మేం బాగున్నాం. నువ్వెలా వున్నావు?” అడిగారు ఇద్దరూ ఒకేసారి.

ఆ అమ్మాయి వాళ్ళతో వాళ్ళకి ఇష్టమైన సంగతులు, ఇంకా ఏదో పిచ్చాపాటి మాట్లాడింది. అక్కడి వాతావరణం గురింఛి, పంటల గురించి, తన యజమాని గురించి చెప్పింది.

జోర్డాన్ జేబులో వున్న క్యాండీలు చిన్నగా కరిగిపోతున్నాయి. ఇచ్చే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది. చివరికి ఎలాగైతేనేం లూయీస్ ధైర్యం చేసి, చిన్న గొణిగినట్లుగా విషయం చెప్పాడు.
“నీ కోసం ఒకటి తెచ్చాం” అన్నాడు.
“ఏదీ చూపించండి” అడిగిందామె.

జోర్డాన్ ముఖం మొత్తం ఎర్రబడేంతగా సిగ్గుపడిపోయి, జేబులో నుంచి పేపర్ బ్యాగ్ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఆ అమ్మాయి ఆ తీయటి క్యాండీలను తింటుంటే వీళ్ళు సంబరంగా ఆమెనే చూస్తూ గడిపారు. ఆ తరువాత ఎప్పటిలాగే ఆ అమ్మాయి పాలు పిండుకోని వచ్చి వీళ్ళకు కొంత పాలు ఇచ్చింది.

ఇక అప్పటినుంచి వారం మొత్తం ఆ అమ్మాయి గురించే ఆలోచించేవాళ్ళు ఇద్దరూ. అడపదడపా మాట్లాడేవాళ్ళు కూడా. ఆ తరువాత ఒక ఆదివారం ఆ అమ్మాయి వాళ్ళతోనే చాలాసేపు గడిపింది. ముగ్గురు పక్కపక్కనే కూర్చోని, ఒళ్ళో చేతులు బిగించుకోని, ఎక్కడో సుదూర ప్రాంతాలని చూస్తున్నట్లు వుండిపోయారు. వాళ్ళు ముగ్గురూ, వాళ్ళు పుట్టిన పల్లెటూర్ల గురింఛి ప్రతి చిన్న సంగతీ వివరంగా చెప్పుకుంటూ గడిపారు. ఆ అమ్మాయి వచ్చి పాలుపితుకుతుందేమో అని ఎదురుచూసే ఆవు కూడా ఆ అమ్మాయి వైపు మోరచాచి ’అంబా’ అంటూ అరిచింది.

ఇంకొంతకాలానికి వాళ్ళతో కలిసి తినడానికీ, ఒక గుక్క వైన్ తాగడానికి కూడా ఆ అమ్మాయి ఒప్పుకుంది. అప్పుడప్పుడు వాళ్ళకోసం దోరగా మాగిన రేగిపండ్లు తీసుకొచ్చేది. ఆ అమ్మాయితో గడిపితే తమలో జీవం వచ్చినట్లు అనిపించేది ఇద్దరికీ. ఒకే కొమ్మ మీద పిట్టల్లా తెగ మాట్లాడేవాళ్ళు.

ఒక మంగళవారం లూయీస్ ఒక చిత్రమైన పని చేశాడు. ఎప్పుడూ లేనిది ఆ రోజు శెలవ పెట్టి, రాత్రి పది గంటలదాకా కనపడకుండా పోయాడు. జోర్డాన్ తన మిత్రుడు ఏమైపోయాడా అని రోజంతా ఖంగారుపడ్డాడు.
ఆ తరువాత శుక్రవారం రోజు కూడా లూయీస్ వేరే ఎవరో స్నేహితుడి దగ్గర పది రూపాయలు అప్పుఛెసి మరీ, కొన్ని గంటలకి శలవ పెట్టి వెళ్ళిపోయాడు.

ఆ తరువాత ఆదివారం జోర్డాన్ తో కలిసి వెళ్ళేటప్పుడు కొంత చిత్రంగా, అసహనంగా వున్నాడు లూయీస్. జోర్డాన్ ఏదో తేడాగా వుందని గుర్తించాడు కానీ అదేమిటో ఊహించలేకపోయాడు.

ఇద్దరూ ఎప్పుడూ వెళ్ళే చోటుకే వెళ్ళి చాలా నిరాసక్తంగా తిన్నారు. ఇద్దరికీ అంతగా ఆకలి వేయలేదు.
ఆ అమ్మాయి వచ్చింది. ఇద్దరూ ఎప్పటిలాగే ఆ అమ్మాయి క్రమంగా దగ్గరవటం చూశారు. ఆమె కొంత దగ్గరవగానే, లూయీస్ లేచి ఆమెకు ఎదురువెళ్ళాడు. ఆ అమ్మాయి పాలు పట్టే పాత్రను కింద పెట్టి అతనికి ముద్దు పెట్టింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి, చాలా తమకంగా చుంబించింది. అక్కడే జోర్డాన్ వున్నా, అతని ఉనికిని గుర్తించనట్లే వున్నారిద్దరూ. పాపం జోర్డాన్ ఏం జరిగుతోందో అర్థం కాక కళ్ళప్పగించి చూశాడు. ఎందుకు జరిగిందో తెలియలేదు కానీ, గుండె ముక్కలైనట్లు, మనసు చెదిరిపోయినట్లు అనిపించింది అతనికి.

లూయీస్, ఆమె ఇద్దరూ అక్కడే పక్కపక్కనే కూర్చోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జోర్డాన్ వాళ్ళ వైపు చూడటం మానేశాడు. అతనికి ఇప్పుడు మిత్రుడి రెండు రోజుల శెలవల వెనుక వున్న రహస్యం ఏమిటో బోధపడింది. ఏదో ద్రోహం జరిగిపోయినట్లు, తనని మోసం చేసినట్లు బాధగా అనిపించసాగింది.

లూయీస్, ఆ అమ్మాయి కలిసి ఆవు దగ్గరకు వెళ్ళారు. జోర్డాన్ వాళ్ళను చూపులతోనే వెంటాడాడు. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ క్రమంగా మాయమయ్యేదాకా చూశాడు. అతని మిత్రుడు వేసుకున్న ఎర్రటి ప్యాంట్ తెల్లటి బాట మీద చిన్న మచ్చలా మారిపోవటం చూశాడు. లూయీస్ పలుగుని భూమిలో దించి, ఆవుని దానికి కట్టాడు. ఆమె వంగి పాలు పితుకుతుంటే, అతను యధాలాపంగా ఆవు గంగడోలు నెమురుతూ వున్నాడు. ఆ తరువాత పాల గిన్నెను అక్కడే గడ్డిలో వదిలేసి, వెనకగా వున్న చెట్ల చాటుకి వెళ్ళిపోయారు.

జోర్డాన్ కి ఆ తరువాత ఏదీ కనిపించలేదు. వాళ్ళు దాటివెళ్ళిన చెట్ల ఆకులు గోడలా కప్పేశాయి. అతను నిలబడలేనంతగా కృంగిపోయాడు. అక్కడే కదలకుండా కూర్చుండిపోయాడు. బాధ కలిగింది - బలమైన బాధ అది. గట్టిగా ఏడవాలనీ, ఎటైనా పారిపోవాలనీ, ఎక్కడైనా దాక్కోవాలనీ ఇక ఎవరినీ ఎప్పటికీ కలవకూడదనీ అనిపించింది.

ఇంతలో వాళ్ళు తిరిగిరావటం కనిపించింది. ఇద్దరూ నెమ్మదిగా చేతిలో చెయ్యి వేసుకోని, అచ్చం పల్లెటూరి ప్రేమికుల్లాగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు. లూయీస్ పాల గిన్నె మోసుకొచ్చాడు.
ఆ అమ్మాయి లూయీస్ ని ఇంకొసారి ముద్దాడి, జోర్డాన్ వైపు చూసి తలాడించి వెళ్ళిపోయింది. ఆ రోజు అతనికి పాలు కూడా ఇవ్వలేదు.

ఇద్దరు సైనికులూ ఎప్పటిలాగే నిశబ్దంగా అచేతనంగా కూర్చున్నారు. వాళ్ళ మనసులో వున్న భావాలేవీ ముఖాలలో కనిపించకుండా కూర్చున్నారు. కొంతసేపు వారిపైన ఎండ పడింది. దూరంగా వున్న ఆవు అప్పుడప్పుడు విషాదంగా అరిచినట్లు అనిపించింది. వాళ్ళు ఎప్పట్లాగే టైం అయ్యిందనిపించగానే లేచి కదిలారు.
లూయీస్ చురకత్తి తీసి ఏదో ఒక కట్టేని చెక్కుతూ నడిచాడు. జోర్డాన్ ఖాళీ సీసాను పట్టుకున్నాడు. బెజాన్ లోని కొట్టు దగ్గర ఆ సిసాని తిరిగి ఇచ్చేశాడతను. ఆ తరివాత ప్రతి ఆదివారం లాగే వంతన దగ్గర ఆగి, పరుగెడుతున్న ప్రవాహాన్ని చూస్తూ గడిపారు.

జోర్డాన్ వంతెన గోడపై నుంచి ముందుకు వంగాడు. ప్రవహిస్తున్న నీటిలో ఆకర్షణీయమైన వస్తువేదో కనిపించినట్లు మరీ ముందుకు వంగాడు.

“ఏమైందిరా నీకు... ఇంకాస్త మందేస్తావా?” అడిగాడు లూయీస్.
అతని ఆఖరు మాట పూర్తి అయ్యిందో లేదో, ఇంతలోనే జోర్దాన్ తల, తలతోపాటు మిగతా శరీరం ముందుకు కదిలింది. ఎరుపు నీలం బట్టలు వేసుకున్న ఆ సైనికుడు ఒక బులెట్ లా నీళ్ళలోకి పడ్డాడు. మరుక్షణం మాయమైపోయాడు.

లూయీస్ కి కాళ్ళుచేతులు ఆడలేదు. సహాయం కోసం అరిచాడు కానీ ఫలితం లేకపోయింది. దూరంగా ఏదో కదిలినట్లు కనిపించింది అతనికి. అతని స్నేహితుడి తల ఒకసారి పైకి తేలి అంతలోనే మునకేసింది. ఇంకొంచెం సేపటికి, ఇంకా అవతల చెయ్యి పైకి లేచి కనిపడింది. ఇక అంతే.

తరువాత ఎప్పటికో ఆ సంఘటన జరిగిన చోటికి పరుగెత్తుకోని వచ్చిన జాలర్లకు శవం దొరికింది.
లూయీస్ తమ బ్యారెక్ ల దగ్గరకి పిచ్చిపట్టినవాడిలా పరుగెత్తాడు. జరిగిన ప్రమాదం గురించి చెప్తుంటే అతని కళ్ళలోనూ, గొంతులోనూ తడి తెలుస్తోంది.

“వాడు ముందుకు వంగాడు... ముందుకు... బాగా ముందుకు... వాడు చాలా ముందుకు వంగాడు. ఆ బరువుకు వాడు... వాడు ముందుకు పడిపోయాడు... వాడు పడిపోయాడు...”

బాధతో అంతకన్నా చెప్పలేకపోయాడు.

మిత్రుడి మరణానికి అసలు కారణం మాత్రం అతనికి ఎప్పటికీ తెలియలేదు.
***