కాప్సే దె లారిమెరిన్ బట్టలు వేసుకోన్న తరువాత
తన డ్రసింగ్ రూమ్ గోడ అంచుల్ని తాకే పెద్ద అద్దం వైపు ఓ చూపు విసిరి
నవ్వుకున్నాడు. కొంత వయసు మీదపడ్డ మాట
నిజమే కానీ చూడ చక్కగా వుంటాడు. పొడుగ్గా, సన్నగా హుందాగా కనీసం చిరుబొజ్జ ఆనవాలు కూడా లేకుండా వుంటాడు. ఏ రంగో
తెలియనివ్వకుండా బాగున్నాయని మాత్రం అనిపించే చిన్న మీసాలతో గౌరవప్రదమైన లక్షణాలతో
తిరుగుతుంటాడు. కొట్లకొద్దీ రూపాయ వల్ల వచ్చే మార్పు కన్నా ప్రముఖంగా కనిపించేది ఇంకేదో
అతనిలో వుంటుంది.
"మనలో ఇంకా జీవం
వుంది. జవసత్వాలు అట్లాగే వున్నాయి" అంటూ గొణుకున్నాడు.
అక్కడినుంచి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళాడు.
అతనికి వచ్చిన వుత్తరాలు అక్కడే వున్నాయి. అతని టేబుల్ మీద అన్ని వస్తువులూ
వుండాల్సిన ప్రదేశంలోనే వున్నాయి. అతను ఎప్పుడూ వర్క్ చెయ్యని వర్క్ టేబుల్,
డజన్ దాకా వుత్తరాలు,
పక్కనే మూడు రకాల
అభిప్రాయాలు చెప్పే మూడు దినపత్రికలు. ఒక్కసారి తాకి వుత్తరాలన్నింటినీ పేక
ముక్కల్ని గేంబ్లర్ పరిచినట్లు పరిచాడు. ఉదయాన్నే వుత్తరాలని తెరవటానికి ముందు అలా
చెయ్యడం అతనికి అలవాటు.
అలా చెయ్యడంలో ఆశావహమైన ఓ ఆనందం, కుతూహలంతో కూడిన ఓ ఆదుర్దా కలుగుతాయి. ఈ సీల్‌చేయబడిన
కవర్లలో నిగూఢమైన ఉత్తరాలు ఏ వార్తలు మోసుకొచ్చాయో? ఏముంది వీటిల్లో - సుఖమా? సంతోషమా? బాధా? వాటన్నింటినీ ఈ చివరనుంచి ఆ చివరకి కళ్ళతోనే పరిశీలించేవాడు. చేతివ్రాత బట్టి
వాటిని గుర్తింఛి రెండు మూడు వర్గాలుగా విభజించేవాడు. ఇదుగో వీళ్ళు మిత్రులు,
వీళ్ళు పరిచయస్థులు,
ఇక వీళ్ళేమో అపరిచితులు.
ఈ చివరి రకం అంటే అతనికి కొంత అసహనం కలుగుతుండేది. నా దగ్గర్నుంచి ఏం కావాలి
వీళ్ళకి? ఏ చేతులు ఈ
చేతిరాతతో కుతూహలాన్ని కలిగించే పాత్రలను సృష్టించాయి? ఏ చేతి అక్షరాలు ఆ పాత్రలనిండా ఆలోచనలనో,
అనుమానాలనో, నమ్మకాలనో లేక బెదిరింపులనో నింపాయి?
ఈ రోజు ఓ ఉత్తరం అతన్ని ఆకర్షించింది. చాలా
సాదా సీదాగా వుంది, అయినా ఏదో
తెలియని గుప్తత వుంది. ఇబ్బందిగా దాని వైపు చూశాడు. గుండెల్లో వణుకులాంటిదేదో
కలిగిందతనికి. "ఎవరి దగ్గర్నుంచి అయ్యుంటుంది? ఈ చేతిరాత నాకు బాగా తెలిసినట్లే వుంది,
కానీ ఎవరిదో
గుర్తించలేకపోతున్నాను" అనుకున్నాడు
తెరవాలా లేదే అన్ని మీమాంస అలాగే వుంది.
రెండు వేళ్ళ మధ్యలో అతి సుకుమారంగా దానిని పట్టుకోని, ముఖం ఎత్తుకు తీసుకొచ్చి అందులో వున్నదేమిటో
చదవాలని ప్రయత్నం చేశాడు. ఆ తరువాత వాసన చూశాడు. అతను చేతిరాతల్ని పరిశీలించడానికి
వాడే భూతద్దాన్ని అందుకోని అందులో నుంచి చూశాడు. ఒక్కసారిగా కుంగిపోయిన భావన
కలిగింది.
"ఎవరిదబ్బా ఇది?
ఈ చేతి రాత నాకు తెలుసు.
బాగా తెలుసు. చాలా తరచుగా ఈ చేతిరాతను చదివినట్లే వుంది. చాలా చాలా తరచుగా. కానీ
అది చాలా కాలం క్రితం. అయితే ఇప్పుడు ఇది ఎవరిదని నిర్థారించగలను? ఓహ్.. ఇది ఖచ్చితంగా ఎవరో డబ్బులు అడిగటానికి
రాసినట్లే వుంది.”
ఉత్తరాన్ని చించి
చదవడం మొదలుపెట్టాడు.
“ప్రియ మిత్రమా:
బహుశా నువ్వు నన్ను ఈపాటికి మరిపోయే వుంటావు. మనం కలిసి పాతికేళ్ళు గడిచిపోయాయి
కదా. అప్పుడు నేను వయసులో వుండేదాన్ని. ఇప్పుడు వయసు మీదపడి వున్నాను. నువ్వు “నడిచే
దవాఖానా” అని నా భర్త గురించి అనేవాడివి. ఆయన నీకు గుర్తేనా? ఆఖరుసారి నేను నీకు
వీడ్కోలు చెప్పినప్పుడు మా ఆయనతో పాటు పారిస్ నగరాన్ని వదిలి వెళుతున్నాను. ఆయనతో
పాటు ఆయన జమీందారీ చేసే పరగణాకి వెళ్ళాను. అయిదేళ్ళ క్రితం ఆయన చనిపోయాడు. ఇప్పుడు
నేను ప్యారిస్ తిరిగి వస్తున్నాను. నా కూతురికి పెళ్ళిచెయ్యాలని. నువ్వు చూడలేదు
కానీ పద్దెనిమిదేళ్ళ చక్కని పిల్ల అది. అది పుట్టినప్పుడు నీకు తెలియజేశాను కూడా.
అయినా నువ్వు అలాంటి అనవసర విషయానికి అంత ప్రాధన్యత ఇచ్చివుండవులే.
నువ్వింకా
అందంగానే వున్నావటగా లారిమెరిన్? నాకు చెప్పార్లే. సరే, నువ్వు చిన్నప్పుడు లీజాన్
అని పిలిచిన ఈ లీసా నీకు ఇంకా గుర్తుంటే ఒక్కసారి వచ్చి మాతో కలిసి డిన్నర్
చెయ్యగలవా? నీకు ఎంతో నమ్మకమైన నీ మిత్రుడు బరోన్ డీ వాన్స్ ని కూడా కలవచ్చు.
ఇట్లు: లీసా ది.
వాన్స్
లోరిమెరిన్
గుండెలు వణికాయి. అలాగే ఉత్తరాన్ని మోకాళ్ళ పైన పెట్టుకుంటూ వాలు కుర్చీలో
కూలబడ్డాడు. అతని చూపు నేరుగా శూన్యంలోకి చూస్తుండగా ఒక తీక్షణమైన భావమేదో అతన్ని
ఆవహించింది. కళ్ళని నీళ్ళు కమ్మేశాయి.
అతని జీవితంలో ఏ
అమ్మాయినైనా ప్రేమించాడు అంటే అది చిన్నారి లీసానే. లీసా ది వాన్స్. “గుమ్మడి
పువ్వు” అని పిలిచేవాడామెని. ప్రత్యేకమైన ఆమె జుట్టు రంగు, పల్చటి బూడిదరంగులో
వుండే ఆమె కళ్ళను చూస్తే అలాగే పిలవాలనిపించేది. ఆహా! ఎంత కోమలంగా, సొగసుగా,
మనోహరంగా వుండేదో అంతే సుకుమారంగా వుండేది. అలాంటిది చివరికి ఆ మొటిమల ముఖం వుండే
వాతరోగికి పెళ్ళాంగా మారింది. వాడేమో ఉన్నపళాన ఆమెను తన పరగణాకి తీసుకుపోయాడు.
అక్కడే బంధించి వుంచాడు. ఒంటరిదాన్ని చేశాడు. అంతా అసూయ వల్ల. కేవలం అందగాడైన ఈ
లారిమెరిన్ మీద వున్న అసూయ వల్ల.
తను ఆమెను
ప్రేమించిన మాట నిజమే. ఆమె కూడా తనని ప్రేమించిందని నమ్మిన మాట కూడా నిజమే. ఆమె
చనువుగా అతన్ని జాక్లే అనేది. ఆ అనడంలో కూడా ఒక ప్రత్యేకమైన ధోరణి ప్రదర్శించేది.
ఒక్కసారి
మర్చిపోయిన వేల జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. సుదూరగా వెళ్ళిపోయిన ఆ జ్ఞాపకాలు -.
అప్పుడు తీయనివి, ఇప్పుడు తీరని దుఃఖాన్ని ఇచ్చేవి.!!
ఓ సాయంత్రం
నాట్యశాల నుంచి ఇంటికి వెళుతూ అతన్ని పిలిచింది. ఇద్దరూ కలిసి బోయి దె బులోయిన్
వీధుల్లో నడక సాగించారు. ఆమె సాయంత్రం పూట వేసుకునే గౌను వేసుకుంది. అతను చిన్న
జాకెట్లో వున్నాడు. వసంతకాలం. వాతావరణం అందంగా, ఆహ్లాదకరంగా వుంది. ఆ చుట్టుపక్కల
వున్న వెచ్చటి గాలిలో ఏవో సువాసనలు పరుచుకున్నాయి. అవి బహుశా ఆమె గౌను నుండో లేక
ఆమె చర్మం నుంచో వచ్చినట్లున్నాయి. అదే స్వర్గమని అతనికి అనిపించిన రాత్రి అది.
వాళ్ళిద్దరూ ఒక సరస్సు దగ్గరకు చేరారు. చంద్రుడి కిరణాలు చెట్ల కొమ్మల సందుల్లోంచి
జారి నీటి మీద నాట్యమాడుతున్నాయి. ఆ దృశ్యం చూసి ఆమె ఏడ్చేసింది. అతను ఆశ్చర్యపోయి
కారణం అడిగాడు.
“ఏమో తెలియదు. ఆ
చంద్రుడు, ఈ నీళ్ళు నన్ను కదిలించాయి. ఏ కాస్త భావుకత కలిగినా నా గుండెల్లో
పట్టేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు ఏడ్చేస్తాను”
అతను నవ్వాడు.
అతనూ ఆ అనుభూతిని గ్రహించాడు. స్త్రీ సహజమైన ఆ భావాన్ని అబ్బురంతో గమనించాడు. ఏ
మాత్రం కల్మషంలేని ఓ పేదింటి అమ్మాయి భావన అది. అలాంటి అమ్మాయి నుండి వచ్చే ప్రతి
స్పందనా అద్భుతమైనదే అనుకున్నాడు. ఉద్రేకంగా ఆమెని పొదవి పట్టుకోని తడబడుతూ
మాట్లాడాడు –
“నా చిన్నారి
లీసా, నువ్వు ఎంతో ప్రత్యేకమైనదానివి”
ఎంత అద్భుతమైన
ప్రేమ కథ. కొద్ది కాలమే వున్నా ఎంత తియ్యదనాన్ని పంచింది. అది సంభవించడం,
ముగిసిపోవడం అంతా ఎంత తొందరగా జరిగిపోయింది. లేదు ముగిసిపోలేదు. అంతటి
మోహావేశాన్ని అర్థాంతరంగా నిలిపేశాడు ఆ పశువులాంటి జమీందారు. ఆ అమ్మాయిని భార్యగా
మార్చేసుకోని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక ఎవరికీ కనిపించనీకుండా కట్టడి చేశాడు.
నిజానికి
లారిమెరిన్ ఆ విషయాన్ని రెండు మూడు నెలల తరువాత మర్చిపోయాడు. ఈ ప్యారిస్ మహానగరంలో
మనసులో వున్న అమ్మాయిని తోసేసి మరీ మరో అమ్మాయి చేరిపోడానికి అట్టే సమయం పట్టదు.
పెళ్ళికాని వాడైతే మరీనూ. అయినా సరే అతని గుండెల్లో ఏదో ఒక మూల చిన్న పూజాపీఠంలా ఆ
అమ్మాయిని వుంచుకున్నాడు. ఎందుకంటే అతని జీవితం మొత్తంలో ప్రేమించింది ఆ ఒక్క
అమ్మాయినే కాబట్టి. ఇప్పుడు ఆ విషయం మళ్ళీ నిర్థారించుకున్నాడు. లేచి నిలబడి
గట్టిగా అన్నాడు –
“వెళ్ళి
తీరుతాను. ఆమెతో కలిసి డిన్నర్ కి తప్పకుండా వెళతాను”
అంటూనే అద్దం
వైపు తిరిగి తనని తాను పై నుంచి కింద వరకు చూసుకున్నాడు.
అలా చూస్తునే –
“ఆమె ఇప్పుడు ముసలిదానిలా వుంటుందేమో. వయసు పెరిగిన విషయం నాకన్నా ఆమెలోనే బాగా
కనిపిస్తుందేమో” అనుకున్నాడు. అలా అనుకోవడంలో అతనికి ఒకలాంటి తృప్తి కలిగింది.
ఆమెకు తనని తను ఇంకా అందంగా, హుషారుగా చూపించుకోవడంలో ఒక ఆనందం వున్నట్లు
అనిపించింది. ఆమె అతన్ని అలా చూసి ఆశ్చర్యపోయి, ఉద్వేగానికి లోనై ఎప్పుడో
గడిచిపోయిన గతాన్ని తలుచుకోని పశ్చాత్తాపపడుతుందేమో అనిపించింది. తల తిప్పి
మిగిలిన ఉత్తరాల వైపు చూశాడు. వాటికిప్పుడు ఏ ప్రాముఖ్యతా వున్నట్లు తోచలేదు.
అంతకు ముందురోజు
దాకా ఎవరి గురించి ఆలోచించడానికి భయపడ్డాడో ఆమె ఆలోచనలోనే ఆ రోజంతా గడిపేశాడు.
ఎలావుంటుందామె? పాతికేళ్ళ తరువాత మళ్ళీ కలవడం ఎంత విచిత్రమైన అనుభూతో కదా? కాని
ఆమెని తను గుర్తుపట్టగలడా?
ఓ అమ్మాయి
సింగారించుకున్నంత శ్రద్ధగా అలంకరించుకున్నాడు. తనకి నల్లటి కోట్ కన్నా తెల్లటి
కోటే బాగ నప్పుతుందని దాన్నే వేసుకున్నాడు. హెయిర్ డ్రసర్ కి కబురు పెట్టి తన
రింగులు తిరిగిన జుట్టును సరి చేయించుకున్నాడు. ఆమెను చూడాలని పడుతున్న కుతూహలం
ఆమెకి కూడా తెలియాలనే కాస్త ముందుగానే బయల్దేరాడు.
కొత్త సామానుతో
నిండిన ఆ చక్కని డ్రాయింగ్ రూమ్ లోకి అడుగుపెట్టగానే అతని కంటపడిందది. పాతకాలం
నాటి సిల్క్ ఫ్రేములో బిగించి గోడకి వేలాడతీసిన ఆ పాత ఫొటోగ్రాఫ్. తనదే. అవును
తనదే. మారుతున్న ఫాషన్ కి అనుగుణంగా తన రూపురేఖలు మార్చుకునే వయసులో తీసినది. తనదే
ఆ ఫొటోగ్రాఫ్.
అక్కడే
ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అతని వెనుక వున్న తలుపు తెరుచుకున్నది. ఒక్క ఉదుటున
లేచి నిలబడ్డాడు. గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఆ గుమ్మం దగ్గరే వుంది – ఓ ముసలామె.
తల మొత్తం తెల్లటి జుట్టుతో. రెండు చేతులు అతని వైపు చాచింది. అతను అందుకున్నాడు.
ఒక దాని తరువాత మరొకదాన్ని పదే పదే ముద్దులు పెట్టాడు. ఆ తరువాత తాను ప్రేమించిన ఆ
అమ్మాయి ముఖాన్ని చూడటానికి తలెత్తాడు.
అవును ఆమెకు వయసు
మీదపడింది. తాను గుర్తుపట్టే అవకాశమే లేకుండా వుంది. ఆమె పెదాలపైన చిరునవ్వు
వున్నా కళ్ళ వెనుక కన్నీరు జారడానికి సిద్ధంగా వుంది.
మాట్లాడకుండా
వుండలేక చిన్నగా గొణిగాడు –
“నువ్వేనా లీసా”
“అవును నేనే.
నిజంగా నేనే.. మరొక చోటు అయితే నన్ను గుర్తుపట్టేవాడివి కాదు కదూ.. చేం
చెయ్యమంటావు. నా బతుకంతా బాధల్లోనే గడిచింది. విషాదం నా జీవితాన్ని ఆక్రమించింది.
చూడు ఎలా అయిపోయాను... అహా వద్దు చూడద్దు నన్ను... కానీ నువ్వు అలాగే అందంగా
వున్నావు. ఇంకా కుర్రాడిలా..!! ఏ బజారులోనో నువ్వు కనపడివుంటే వెంటనే గుర్తుపట్టి
“జాక్లే” అని అరిచేసేదాన్ని. సరేలే.. ముందు కూర్చో. కాస్సేపు మనిద్దరమే
మాట్లాడుకుందాం. ఆ తరువాత నా కూతుర్ని పిలుస్తాను. చాలా పెద్దదైపోయింది. నువ్వు
చూస్తావుగా. అచ్చు నాలాగే వుంటుంది, లేదంటే నేనే దానిలాగ వుంటానా – అహా కాదులే..
నేను ఆ వయసులో ఎలా వుండేదాన్నో సరిగ్గా అలాగే వుంటుంది. చూస్తావుగా. కానీ ముందు
నీతో కాస్సేపు ఏకాంతంగా గడపాలి. నిన్ను చూడగానే నేను ఏడ్చేస్తానేమో అని భయపడ్డాను.
అయినా అదంతా గడిచిపోయిన గతం. అంతా అయిపోయింది. సర్లే కూర్చో”
అతను ఆమె చేతిని
పట్టుకోని ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈమె అతనికి
తెలిసిన అమ్మాయి కాదు. ఈమెని ఇంతకు ముందెన్నడూ చూడనట్లే అనిపిస్తోంది. అసలు ఈ
ఇంటికి రాకుండా వుంటే బాగుండేది. ఏం మాట్లాడగలడు? ఇంత కాలం ఎడబాటు గురించా? ఇద్దరి
మధ్య ఏ సామీప్యం వుంది? బామ్మలా కనిపించే ఆమె ముఖాన్ని చూస్తుంటే అతనికి గతం
తాలూకు ఏ విషయమూ జ్ఞాపకం రావటంలేదు. ఆ రోజు వుదయం చిన్నారి లీసాని గుర్తు
చేసుకున్నప్పుడు, ఆ గుమ్మడి పువ్వుని తల్చుకున్నప్పుడు గుర్తుకొచ్చిన ఆ లేత
అనుభవాలు.. కాస్త తీయనివీ, కాస్త చేదువీ.. ఏవీ అవి? ఒక్కటి కూడా గుర్తుకురావే?
ఏమైపోయింది ఆ గతం తాలూకు జ్ఞాపకాలలోని చిన్నారి? తను ప్రేమించిన చిన్నారి?
సుదూరస్వప్నాలలో మాత్రమే కనిపించే ఆ బూడిదరంగు కళ్ళ చిన్నది. ప్రేమగా “జాక్లే” అని
పిలిచే ఆ అందాల లీసా – ఏదీ?
ఇద్దరూ ఒకరి
పక్కన ఒకరు. కదలలేదు. మాట్లాడలేదు. కదలలేక మాట్లాడలేక. ఎవరి ఇబ్బంది వాళ్ళది.
ఇంకేమీ లేనట్టు
ఇద్దరికీ పరిచయం వున్న స్థలాల గురించి ఇబ్బందిపడుతూ మాట్లాడుకున్నారు. ఆమె కీళ్ళ
నొప్పులు వున్నదానిలా కష్టపడుతూ లేచి ఒక బటన్ నొక్కింది.
“రీనీని
పిలుస్తున్నాను” అంది.
తలుపు దగ్గర
చిన్న అలికిడి, తలుపు మీద చిన్నగా కొట్టిన శబ్దం, అ తరువాత ఓ అమ్మాయి గొంతు –
“ఇక్కడే వున్నాను అమ్మా”
లారిమెరిన్ ఏదో
విచిత్రాన్ని చూసినట్లు దిగ్భ్రమతో వుండిపోయాడు. మాట తడబడింది.
“గుడ్ డే
మెడ్మోసెల్” అంని మళ్ళీ తల్లి వైపు తిరిగి “ఇది నువ్వే కదా” అన్నాడు.
నిజానికి
గడిచిపోయిన కాలంలో కరిగిపోయిన తన లీసా తిరిగి వచ్చేసినట్లు అనిపించింది.
పాతికేళ్ళక్రితం తను గెలుచుకున్న చిన్నారి లీసా.. ఇంకా చిన్నపిల్లలా, స్వచ్చంగా
మళ్ళీ కనిపించినట్లుంది.
ఆమెను తన
బాహువుల్లోకి తీసుకోని బలంగా కౌగిలించుకోని చెవిలో గుసగుసగా “నా లీసాన్.
గుడ్మానింగ్” అనాలన్న కోరిక అతన్ని దావానలంలా కమ్మేసింది.
“డిన్నరు సిద్ధం
మేడమ్.” నౌఖరు వచ్చి ప్రకటించాడు
అందరూ డైనింగ్
రూమ్ వైపు కదిలారు.
డిన్నర్ దగ్గర ఏం
జరిగింది? వాళ్ళేమన్నారు దానికి ఇతనేం సమాధానం ఇచ్చాడు? ఏమో. పిచ్చితనానికి
చేరువలో వున్న ఓ చిత్రమైన కలలో కూరుకుపోయి వున్నాడు. ఇద్దరు ఆడవాళ్ళ వైపు మార్చి
మార్చి చూశాడు. ఒకటే ఆలోచన. ఒక వెర్రి ఆలోచన. వైరుధ్యాలు కలిగిన ఆలోచన.
“ఇద్దరిలో ఎవరు
నిజం?”
తల్లి మళ్ళీ
మళ్ళీ నవ్వి పదే పదే అడగసాగింది – “నీకు జ్ఞాపకం వుందా?” అని. కాని అతనికి ఆ
చిన్నదాని మెరుస్తున్న కళ్ళలోనే పోగొట్టుకున్న జ్ఞాపకాలు దొరుకుతున్నాయి. కనీసం ఓ
ఇరవైసార్లు తన నోరు తెరిచి, “నీకు గుర్తుందా లీసా” అని చినదాన్ని అడగబోయాడు. పక్కన
నెరిసిన జుట్టుతో ఓ ప్రాణి అతని వైపు ఆరాధనగా చూస్తోందన్న విషయం కూడా అతనికి
స్ఫురణకి రాలేదు.
ఒకో క్షణంలో తన
మెదడు పని చేయడం మానేసిందన్న స్పృహ కూడా లేకుండా పోయింది. ఒకప్పటి ఆ అమ్మాయిలో ఎదో
ప్రత్యేకత – అది ఆమె గొంతులోనో, చూపులోనో, లేక మొత్తంగా ఆమెలోనే వుందో ఆ
ప్రత్యేకత. మళ్ళీ అలాంటి ప్రత్యేకత వున్న అమ్మాయి అతనికి తారసపడలేదు. ఆ జ్ఞాపకాలని
తిరిగి తోడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన
అమ్మాయిలో లేనివి, ఒకప్పటి చిన్నారి లీసాలో వున్నవి గుర్తు చేసుకోని తద్వారా
తప్పిపోయిన ఆ జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.
“నీలో ఒకప్పుడు
వున్న చురుకుదనం పోయినట్లుందే మిత్రమా” అన్నది ఆమె
“దాంతో పాటు ఇంకా
చాలా పోయినట్లున్నాయి” అన్నాడు సన్నగా.
కానీ అతని మనసును
తాకిన ఓ అనుభూతి, క్రమంగా పాత ప్రేమని మళ్ళీ అంకురించేట్లు చేసింది. ఇప్పుడా ప్రేమ
అతన్ని కబళించడానికి సిద్దంగా వున్న రాక్షసిలా తయారైంది.
ఆ అమ్మాయి
లొడలొడా మాట్లాడుతూనే వుంది. ఆ మాటల్లో బాగా తెలిసిన స్వరం వినపడుతోంది. సరిగ్గా
తల్లిలాగే పదాలను పలుకుతోంది... అంతేనా? మాట్లాడే విధానం, ఆలోచన అన్నీ ఆమె తల్లి
లాగే. ఇక అంత కాలం కలిసి వుండటం వల్ల తల్లి ద్వారా సంక్రమించిన అలవాట్లు అలాగే
వున్నాయి. చూస్తూ తల నుంచి పాదాల దాకా వణికిపోయాడు లోరిమెరిన్. ఇవన్నీ అతనిలోకి
దిగబడిపోయి పాత గాయాలను మళ్ళీ నెత్తురోడేలా చేస్తున్నాయి.
అక్కడి నుంచి
త్వరగా బయటపడి బోలివార్డ్ వీధుల్లో నడిచాడు. కానీ ఆ అందమైన పిల్ల జ్ఞాపకం అతన్ని
అనుసరించింది. వెంటాడింది. తల్లి కడుపులో శిశువు కదిలినట్లు గుండెల్లో కదిలింది.
రక్తాన్ని రగిలించింది. అప్పటి వరకూ చూసిన ఇద్దరు ఆడవాళ్ళకు బదులు ఇప్పుడు ఒకతే
అమ్మాయి గుర్తుకొస్తోంది. గతంలో నుంచి తనకోసం తిరిగివచ్చినట్లుగా తోస్తోంది.
ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. సరిగ్గా అప్పుడు ఎలా ప్రేమించాడో అలాగే.
పాతికేళ్ళ తరువాత మళ్ళీ అంతే తీవ్రత ఈ ప్రేమలో కూడా.
ఈ విచిత్రమైన,
అనూహ్యమైన విషయం గురించి ఆలోచించి, ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలని ఇంటికి
వెళ్ళిపోయాడు. చేతిలో కొవ్వొత్తి వెలిగించుకోని లోపలికి నడిచాడు. అలా నడుస్తూ
సాయంత్రం తనని తను పరిశీలించుకోని అభినందించుకున్న అద్దం ముందుకు వచ్చాడు. ఇప్పుడు
ఆ అద్దంలో వయసు పండి, జుట్టు నెరసిన మనిషి కనపడ్డాడు. ఉన్నట్లుండి చిన్నప్పుడు
చిన్నారి లీసాతో గడిపినప్పుడు తాను ఎలా వుండేవాడో జ్ఞప్తికి వచ్చింది.
ప్రేమించబడిన ఆ రోజుల్లో తాను ఎంత అందంగా, ఆకర్షణీయంగా వుండేవాడు!
కొవ్వొత్తి
వెలుగుని ఇంకా దగ్గరగా చేసుకోని మరింత దగ్గరగా ముఖాన్ని పరిశీలించుకున్నాడు.
భూతద్దంతో చూసినంత నిశితంగా తనని తాను చూసుకున్నాడు. మొదటిసారి అతనికి తన ముఖంలో
అతన్ని ధ్వంసం చేస్తున్న మార్పులు గోచరించాయి. ఇంతవరకూ కనపడని ముడుతలు కనపడ్డాయి.
అంతే!
కుప్పకూలిపోయినట్లు ఒక్కసారిగా కూలబడిపోయాడు. అతనిలో దుఃఖాన్ని రగిలించిన తన
ప్రతిబింబాన్ని చూస్తూ గొణిగాడు –
“అయిపోయిందిరా
లారిమెరిన్. అంతా అయిపోయింది.”