చల్లని వెన్నెల
మురళిగానంలా పరుచుకుంది. శ్రీకృష్ణుడు స్వయంగా ఏరి పరిచిన పచ్చని గడ్డిని ఆనందంగా
మేసి సేదతీరింది గంగ అనే ఆవు. అలవాటుగా నెమరేసే గడ్డితో
పాటు శ్రీకృష్ణుడి పవిత్ర కరస్పర్శనీ, అతని మనోహర సుందర రూపాన్ని కూడా తన్మయత్వంతో
నెమరేస్తోంది.
ఈ లోగా పక్కనే
వున్న విశ్వ అనే ఆవు ఖంగారుగా పచార్లు చేయడం గమనించి ఆశ్చర్యపోయింది.
“ఏమిటోయ్... తెగ
హడావిడి పడుతున్నావు? పచ్చిక అరగలేదా? లేక చాలలేదా?” అంది మోర ఎత్తి తలాడిస్తూ.
అన్యమస్తకంగా
వున్న విశ్వకి పలకాలని లేకపోయినా ఒక మూలనున్న రాటానికి కొమ్ములు తాటించి అసహనంగా
రంకె వేసింది.
“ఆయ్..! ఏమిటా
అరుపు... వేళకాని వేళ... స్వామివారు విన్నారంటే ఏ గోవుకి ఏ ఆపద వచ్చిందోనని పరుగున
వచ్చేస్తారు...” అన్నది గంగ మందలిస్తూ.
“నువ్వు
అనుకోవడమే కానీ స్వామివారు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరులే...” అంది విశ్వ.
“ఏమిటా
దుడుకుతనం... గోకులకృష్ణుణ్ణి వ్యాఖ్యానించేంత దానివా?” అంది గంగ.
“అయ్యో... నీకు
అర్థం కావటం లేదే గంగా... ఇంకొన్నాళ్ళు ఆగు. స్వామివారు మనల్ని మరచిపోవటం ఖాయం...
ఈ పచ్చని పచ్చిక, స్వామివారి మచ్చిక ఇక మనకి దూరం కాక తప్పదు... చూస్తూ వుండు...”
అంది విశ్వ.
కపిల అనే మరో ఆవు
తోక ఝాడించి కొపంతో కొమ్ములు విసిరింది.
“కృష్ణ కృష్ణా...
ఏమిటా మాటలు... నిన్నగాక మొన్న వచ్చావు... ఆ పరమాత్ముడి గురించి ఏం తెలుసని అంతంత మాటలు
అంటున్నావు?” అంటూ ఆవేశంగా అరిచింది.
“ఏమిటమ్మా
తెలిసేది? మీరంతా అమాయకుల్లా వున్నారే? కళ్ళముందు జరుగుతున్న భాగవతం కనపడటం లేదా
ఏమిటి?” అంది విశ్వ.
“నువ్వన్నది
నిజమే. ఇది భాగవతమే. ఆ భాగవతంలో మనం కూడా వున్నాం చూడు. అదీ మన అదృష్టం.
సాక్షాత్తు దేవదేవడితో కలిసిమెలిసి వుండే అవకాశం, ఆ పరమాత్ముడి ప్రేమని అనుభవించే
అవకాశం.. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది?” అంది కపిల.
“గోవులంటే శాంత
స్వభావులని విన్నాను కానీ మరీ ఇంత శాంతమైతే ఎట్లాగమ్మా? మరీ యుధిష్టరులవారి వలే
మాట్లాడుతున్నారే? మనం మునిగిపోయే వరద ముంచుకొస్తుంటే ఇంత ప్రశాంతంగా ఎలా
వుండగలగుతున్నారమ్మా?” అంటూ గిట్టలు మట్టిలో దిగబడేలా కొట్టింది విశ్వ.
అప్పటికే
ఆవులన్నీ దాని చుట్టూ చేరాయి. అర్థంకాని ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలా వున్న విశ్వ
మాటలు ఏ పశువుకీ రుచించటంలేదు. పైగా కృష్ణ నింద జరుగుతోందని అనుమానం మొదలైంది వాటి
మనసుల్లో. గంగ తన గంగ డోలు ఉగుతుండగా పరుగు పరుగున వెళ్ళి కామధేనువైన సురభిని
పిలుచుకొచ్చింది. గోవర్థనగిరిని శ్రీకృష్ణుడు చిటికినవేలుపై నిలబెట్టినప్పుడు
గర్వభంగమైన దేవేంద్రుడు బహుమతిగా ఇచ్చిన ఆవు అది. ద్వారక గోశాలలో అన్ని ఆవులకూ
సురభి పెద్దదిక్కు.
“గోవులను కాచిన
గోవిందుణ్ణే నిందిస్తున్నావట? ఏమిటే నీ పొగరు?” అంటూ అరిచింది సురభి వస్తూనే.
“ఉన్నమాటంటే
ఉలుకని ఊరికే అన్నారా? మనందరి మంచి కోరే చెప్పాను. ఇక మీ ఇష్టం.” అంది విశ్వ.
“నీ మాట తీరు,
లక్షణంగా లేవే? అసలెక్కడి దానివి. మళ్ళీ స్వామివారిని అంతమొందించే పిచ్చి ఆలోచనతో
ఆవులా వచ్చిన రాక్షసుడివా? మిగిలిపోయిన కంసుడి అనుచరుడివా?” అనుమానంగా
ప్రశ్నించింది సురభి.
“రామ రామ. ఎంత
మాట? నేనూ మీలాంటి ఆవునే తల్లీ. ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేసిన తరువాత మా
ప్రభువు ధర్మరాజుగారు స్వయంగా నన్ను శ్రీకృష్ణులవారికి బహుమానంగా ఇచ్చారు.” అంటూ
తన ప్రవర చెప్పింది విశ్వ.
“మీ ఊరు
ఇంద్రప్రస్థమా... అదీ అలాగ చెప్పు... ఇంకనే రాజకీయాలు బాగానే వంటబట్టుంటాయి.
దొంగమాటలు, దుర్మార్గపు ఆలోచనలు అన్నీ అక్కడే వున్నాయి. ఆ గాలి పీల్చీ, ఆ నేల గరిక
తిన్నదానివి. నువ్విలా మాట్లాడటంలో ఆశ్చర్యమేముందిలే?” ఎద్దేవా చేస్దింది కపిల.
మిగిలిన ఆవులన్నీ తలాడించాయి.
“రాజకీయాలు,
రణరంగాలు లేకుండా అన్నీ ధర్మం న్యాయమంటూ జరగడానికి ఇదేమైనా త్రేతాయుగం
అనుకుంటున్నావా? ఇది ద్వాపర అంతకాలం. అంతమాత్రం రాజకీయాలు తెలియకుండా, లౌక్యం అంటే
ఎరగకుండా వుంటామంటే ఇదిగో.. బతుకులు ఇట్లాగే వుంటాయి” అంది విశ్వ తోకని అటూ ఇటూ
ఇసురుతూ.
“ఇదిగో నీ తోకనీ,
నోటిని కాస్త అదుపులో పెట్టుకో. సాక్షాత్తు ద్వారకలో, అందునా శ్రీకృష్ణులవారి
గోశాలలో వుంటూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మన బతుకులకు ఏమైందని అంత
చిరచిరలాడుతున్నావు?” పెద్దరికంగా అడిగింది కపిల.
“చెప్తానమ్మా.
అది చెప్పడానికేగా వున్నాను. అందరూ వినండి” అంటూ చెప్పసాగింది – “మూడు రోజుల
క్రితం మనం మేతకెళ్ళి సాయంసంధ్యకి ధూళి లేపుకుంటూ తిరిగివచ్చామా? మీరంతా హడావిడిగా
ముందుకు ఉరికారు. నేను స్వామివారి ప్రధాన ప్రాసాదం దగ్గరకు వచ్చేసరికి అక్కడేదో
పెద్ద గలాటా జరుగుతోంది. ఎవడో బ్రాహ్మణ యాచకుడు లోపలికి వెళ్ళి స్వామివారిని
దర్శించాలని ప్రయత్నం చేస్తూవున్నాడు. భటులు వీల్లేదు పొమ్మని బయటకి నెడుతున్నారు.
ఆ పేద బ్రాహ్మణుడు ఎలాగైనా లొపలికి వెళ్ళాలని భటులను ప్రాధేయపడుతున్నాడు.
“సరిగ్గా అప్పుడే
శ్రీకృష్ణులవారు అటుగా వెళుతూ అతన్ని చూశారు. ఒక్క ఉదుటున పరుగు పెట్టుకుంటూ
వచ్చి... మిత్రమా.. మిత్రమా.. అంటూ ఆ యాచకుణ్ణి కౌగిలించుకున్నారు. ఇక చూడండి
ఆయనగారి హడావిడి. ఒక పరిచారికను పిలిచి కాళ్ళు కడగడానికి గంగనీళ్ళు తెమ్మంటాడు,
ఇంకొకరిని పిలిచి పట్టువస్త్రాలు అంటాడు, మరికరిని పిలిచి భోజనానికి ఏర్పాట్లు
అంటాడు... మధ్య మధ్యలో ఆ పేదబ్రాహ్మణుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. భటులను మందలిస్తూ
ఒక చూపు విసిరాడు. మళ్ళీ వచ్చినాయనని కుశలమడుగుతూ లోపలికి లాకెళ్ళాడు. గడప
దాటుతూనే రుక్మిణీ, రుక్మిణీ అని ఒకటే కేకలు...”
కథ వింటున్న
ఆవులంతా ఒక్కసారి తన్మయత్వంతో ఊగిపోయాయి. దూడలు గడ్డి మేయడం ఆపి మోరలెత్తి
శ్రీకృష్ణ కథని గ్రోలడం మొదలుపెట్టాయి. భక్తిభావంతో అక్కడున్న ప్రతి పశువు ఒళ్ళు
జలదరించింది. విశ్వ కొనసాగించింది.
“ఆ సంఘటన చూసి
అటు భటులు, ఇటు నేను ఆశ్చర్యపోయాం. చినిగిపోయిన బట్టలు, మాసిన తల... అలాంటి వ్యక్తి
శ్రీకృష్ణులవారికి మిత్రుడా? పైగా ఆయనకు సేవలు చేయమని స్వామివారి ఆజ్ఞలా? ఇదేదో తెలుసుకోవాల్సిందేనని
ఆ సౌధం దక్షిణాన వున్న స్వామివారి ఆంతరంగిక మందిరం గవాక్షం దగ్గర నిలబడి జరిగేదంతా
చూశాను. ఆ వచ్చినాయన పేరు సుధాముడట. కుచేలుడని కూడా అంటారట. సాందీపమహర్షి ఆశ్రమంలో
వీరిద్దరూ సహాధ్యాయులట. అదీ బాంధవ్యం.
“ఇక కృష్ణయ్యగారు
ఆయనకు చేసిన సేవలు ఏమని చెప్పేది. స్వయంగా పట్టపురాణి రుక్మిణీదేవిగారు ఆయన
కాళ్ళమీద నీళ్ళు పోస్తుంటే స్వామివారు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తల మీద
చల్లుకున్నారు.. గంధం తెమ్మంటాడు, పన్నీరు తెమ్మంటాడు, భోజనం అంటాడు,
తాంబూలమంటాడు... అబ్బబ్బ స్వామివారు చెప్పిన పనులు చెయ్యడానికి పరిచారికలు సరిపోలేదంటే
నమ్ము. అష్టభార్యలనూ, వేల మంది గోపిలకలనూ పరుగులు తీయించాడు.
కథ అక్కడి
వచ్చేసరికే ఆవులన్నీ భక్తితో కూడిన ఆవేశంతో ఊగిపోయాయి. శ్రీకృష్ణా, గోవిందా అని
మోరలెత్తి రంకెలు వేశాయి.
“ఆగండి ఆగండి...
అసలు కథంతా ఇక్కడే వుంది. సేవలన్నీ చేసిన తరువాత స్వామివారు స్వయంగా ఆ
కుచేలుడుగారి పాదాలు వత్తుతూ కూర్చున్నారు. రుక్మిణమ్మ వింజామరలు వీస్తోంది. ఇంతలో
శ్రీకృష్ణులవారు – ’నా కోసం ఏం తెచ్చావోయ్ సుధామా?’ అంటూ చనువుగా వచ్చిన బాపనాయన
ఉత్తరీయం వెతికి మరీ చూశారు. చూస్తే ఏముందీ? అటుకులు...! అటుకులు తెచ్చాడు ఆ అయ్యగారు...!!
ఇదేమిట్రా భగవంతుడా? సమస్తసౌభాగ్యాలతో, సాక్షాత్తూ బంగారు గుడ్లు పెట్టే
శమంతకమణితో, సకల లక్ష్మీ వైభవంగా వుండే
శ్రీ కృష్ణులవారికి అటుకుల బహుమతా? అని నేనూ సత్యభామగారు నోరు నొక్కుకున్నాం. ఇలా
అవమానం చేసిన ఆ కుచేలుడుగారికి ఏ శిక్ష పడుతుందో అనుకున్నాను. కానీ చిత్రం –
స్వామివారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ’అటుకులంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ గబగబా
పిడికెడు నోట్లో వేసుకున్నారు. రెండో గుప్పెడు తీసుకున్నారు కానీ రుక్మిణమ్మ చాలని
ఆపింది.” చెప్పింది విశ్వ.
“అదేమిటి
రుక్మిణమ్మ ఆపడమేమిటే?” ఆశ్చర్యపోయింది గంగ.
“అమ్మగారు
అలాంటిది కాదే... సత్యభామగారు అలా అన్నారంటే నమ్మగలం కానీ రుక్మిణమ్మ అలా
చేయడమేమిటి?” ఆలోచనలో పడింది కపిల.
“నేనూ అలాగే
అనుకున్నాను. కుచేలయ్య వెళ్ళాక రుక్మిణమ్మగారు శ్రీకృష్ణులవారికి చెప్పగా అసలు
రహస్యం తెలిసింది. స్వామివారు ఒక్క పిడికెడు గింజలు నోట్లో పోసుకుంటే
కుచేలుడుగారింట్లో సకల ఐశ్వర్యాలు వచ్చాయట.. ఇక రెండో పిడికెడు తిని వుంటే సపరివార
సమేతంగా స్వామివారు, అమ్మగారు అంతా వెళ్ళి ఆయనగారికి ఊడిగం చెయ్యాల్సి
వచ్చేదట..!!” విశ్వ కథలా చెప్పిన విషయం విని పశువులన్నీ పరవశించి పోయాయి.
“శ్రీ
కృష్ణలీలామృతం... ఎంతటి అదృష్టవంతురాలవే విశ్వా... నీకు ఇదంతా కళ్ళారా చూసే భాగ్యం
కలిగింది..” కళ్ళ వెంట నీళ్ళు వర్షిస్తుండగా నీల పలికింది.
“చూశావా
స్వామివారి వాత్సల్యం.. అందుకే అంటారు ఆయనతో సఖ్యం కన్నా సౌఖ్యం లేదని” అంటూ ఇంకా ఏదో
చెప్పబోయింది సురభి.
“రామచంద్రా...
మీరంతా బొత్తిగా లౌక్యం తెలియని పశువుల్లా వున్నారే... రామాయణం ద్వారా ఏం
తెలుసుకున్నావు అంటే భార్యకి ఎప్పుడూ మూడు వరాలు ఇవ్వకూడదు అన్నదట మీలాంటిదే
ఒకతి..”
“ఏమిటే నీ గోల...
నీవు చెప్పిన లీలలో స్వామివారి ఔదార్యమే తప్ప నాకు ఇంకేమీ కనపడటం లేదే” సురభి
మండిపడింది.
“సరిగ్గా గమనిస్తే
తెలుస్తుంది. మనుషుల్లా ఆలోచిస్తే రాబోయే ఉపద్రవం ఏమిటో అవగతం అవుతుంది. ఇప్పుడు ఆ
కుచేలుడుగారు సొంత వూరు వెళతాడా? అక్కడ సకల ఐశ్వర్యాలతో తులతూగే ఇంటిని చూస్తాడా?
ఆ తరువాత ఊరుకుంటాడా? శ్రీకృష్ణులవారింటికి వెళ్ళానూ, నాలుగు ముక్కిపోయిన అటుకులు
పెట్టానూ... ఇదిగో ఇలా సకల సంపదలూ వచ్చిపడ్డాయని ప్రచారం చేస్తాడు”
“మంచిదే కదా..
స్వామివారి లీలని అందరూ తెలుసుకోని తరిస్తారు...”
“అందుకే
మనుషుల్లా ఆలోచించమని చెప్పాను... ఎవ్వరూ అలాగనుకోరు. శ్రీకృష్ణుడి దగ్గర బోలెడు
డబ్బు వుందీ... ఆస్తీ పాస్తి వుందీ... అన్నింటినీ మించి తనవాళ్ళకి పంచిపెట్టే
సుగుణం కూడా వుంది – అనుకుంటారు.”
“అయితే?”
“ఇంకేముంది?
గోకులంలో, బృందావనంలో శ్రీకృష్ణుడితో కలిసి తిరిగిన స్నేహితులు, చంకనేసుకు తిరిగిన
చుట్టపక్కాలు, పాలు పట్టిన గోపకాంతలు అంతా తరలివస్తారు. అదిగో అప్పుడు నీకు ఫలానా
సంవత్సరంలో భోగి పళ్ళు పోశానని ఒకరు, ఇదిగో నీ పెళ్ళికి సన్నాయి వూదానని మరొకడు,
మీకు మాకూ దూరం చుట్టరికం కూడా వుందోయ్ అని మరొకడు.. ఇలా ప్రతివాళ్ళు పాతబియ్యమో,
అటుకులో, మరమరాలో తెస్తారు. స్వామివారు వాళ్ళందరినీ కరుణచూసే నెపంతో దానాలు
ధర్మాలు చేసి ఉన్న ఆస్తినంతా కరిగించేస్తారు... మనం దానంగా మారి ఏ గోపాలకుడి
దగ్గరకు పోతామో... లేక ఇక్కడే మిగిలిపోయి గంజినీళ్ళకు మొహంవాచి పడి వుంటామో అని
భయపడుతున్నాను..” ఖంగారులో వ్యంగం కలిపి చెప్పింది విశ్వ.
సురభి గట్టిగా
నవ్వింది.
“బాగుంది వరస...
అదా నీ భయం. కుర్రతనం కదా ఏదో దుడుకు వుంటుందిలే అనుకున్నాను. దుడుకుతనంతో పాటు
దూరదృష్టి, దురదృష్టి కూడా వున్నట్టున్నాయే నీకు..” అంది పరిహాసంగా.
“నవ్వమ్మా
నవ్వు... మీరంతా ముసలివాళ్ళై ఇప్పుడు జరుగుతున్నదేమిటో తెలుసుకోలేక ఇలా
మాట్లాడుతున్నారు. మునుపు గోకులంలో మీరు చూసిన అమాయక గొల్లపిల్లలాగే జనం అంత
వున్నారని అపోహపడుతున్నారు. కాలం మారిందమ్మా... కలియుగం వచ్చేస్తోందట. నిన్నగాక
మొన్న ఆస్తి కోసం అన్నదమ్ముల పిల్లలు హోరాహోరీ తన్నుకున్నారు తెలుసా?”
“మాకు తెలుసులే
కౌరవులు పాండవులేగా...”
“అంతేనా... మనం
అందరం పాండవులు మహాత్ములని అనుకుంటామా? ఏమీ కాదు. అన్నదమ్ములంతా ఉద్యోగవిజయాలకి
బయల్దేరి తల్లిని విదురుడుగారి ఆశ్రమంలో వదిలిపోయారు. కన్న తల్లిని ఆశ్రమాలలో
వదిలిపెట్టే సంగతి చూస్తే కలిమహిమ కనపడటంలేదూ? మన శ్రీకృష్ణులవారు మాత్రం తక్కువా?
ప్రేమతో పెంచిన తల్లిని మర్చిపోయి హాయిగా వుండటం లేదూ... ఎవరి స్వార్థాలు వాళ్ళు
చూసుకునే కలియుగం వచ్చేస్తుంటే ఇంకా అనుమానమా. చూస్తుండండి. నేను చెప్పినట్లు
ఆస్తి కాజెయ్యడానికి స్వామివారి బంధువులు వచ్చి మీదపడక మానరు, కలియుగం వచ్చేసిందని
మీ నోటితో మీరు అనకా మానరు” అంటూ సూటిగా అడిగేసింది.
కృష్ణనింద విని
అప్పటికే కోపంతో ఊగిపోతున్న సురభి గట్టిగా అరిచి విశ్వ మీదకి దూకబోయింది. ఇంతలో
ఏదో అలికిడి వినపడింది.
“శ్రీకృష్ణులవారు”
ఎవరో అన్నారు.
ఆకాశంలాంటి అందరి
మనసులపైనా నీలి మేఘాలు కమ్ముకున్నాయి.
“సాత్యకీ... రథం
సిద్ధం చేయించు. బృందావనానికి వెళ్ళి యశోదమ్మను చూసివద్దాం...” అన్న మాటలు
వినపడుతుండగా అన్ని ఆవులు విశ్వ వైపు నిరసనగా చూసి నిద్రకి ఉపక్రమించాయి.
< ** >
(కనెక్టికట్ తెలుగు సంఘం వారి "తెలుగు వెలుగు" పత్రిక ఏప్రిల్ 2014 సంచికలో ప్రచురితం)