యు ఆర్ సెలక్టెడ్ (కథ)

"డామ్లిన్నున్ లాయింగ్టంబమ్" సీవీ మీద వున్న ఆ పేరును రెండు మూడుసార్లు మళ్లీ పలికితేగానీ నోరు తిరగలేదు అర్చనకి. ఆ పేరుగల వ్యక్తి లోపలికి వచ్చాడు.
"గూర్ఖా లాగా వున్నాడు" ఆమెకు వచ్చిన మొదటి ఆలోచన. పక్కనే వున్న వైస్ ప్రసిడెంట్ సావంగికర్ చిన్న గొంతుతో "అరే షాబ్ జీ" అని అర్చన వైపు చూసి కన్నుకొట్టి నవ్వాడు. ఇంటర్వ్యూ మొదలైంది.
అతనిది మణిపూర్ లో ఇంఫాల్ దగ్గర చిన్న ఊరు. పెద్ద కుటుంబం. చిన్న సంపాదన. వుండీ, లేక ఎంతో కష్టపడి ఎం.బీ.యే. దాకా వచ్చానని చెప్పాడు. ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నాడు కానీ ఎంతో జాగ్రత్తగా వింటే కానీ అది ఇంగ్లీషని అర్థం కావడం లేదు.
అర్చన కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆమెకి చాలా ఎక్సైటింగ్ గా వుంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇలాగే తన కాలేజీలో టేబుల్ కి మరో వైపు కూర్చోని ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడు కూడా సావంగికరే వచ్చాడు. అతనితో పాటు ఎచ్.ఆర్. హెడ్ అనూప్ సింగ్. ఇప్పుడు అలాంటి టేబుల్ కి మరో వైపు కూర్చోవడం ఆమెకు ఎంతో సంతోషానిస్తోంది. నిజం చెప్పాలంటే గర్వాన్ని కూడా.
అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా నెమ్మదిగా పదాలు కూడగట్టుకుంటూ సమాధానాలు చెప్తున్నాడతను.
"ఆర్.బీ.ఐ. గవర్నర్ సీ.ఆర్.ఆర్. తగ్గించారు కదా... అందువల్ల ఎకానమీకి జరిగిన నష్టం చెప్పు" అడిగాడు సావంగికర్.
అర్చన ఆశ్చర్యంగా సావంగికర్ వైపు చూసింది. అది చాలా కష్టమైన ప్రశ్న. అప్పటిదాకా ఇంటర్వ్యూకి వచ్చిన స్టూడెంట్స్ స్టాండర్డ్ ని బట్టి అది చాలా పెద్ద ప్రశ్న. ఆ కాలేజీ కూడా పెద్ద పేరున్న కాలేజేమీ కాదు. గ్రేటర్ నోయిడాలో వున్న వందల కాలేజీలో ఇదొకటి. కాకపోతే సావంగికర్ కింద పనిచేసే ఏవీపీ అదే కాలేజి నుంచి వచ్చాడని, అతను బాగా పని చేస్తున్నాడనీ, ఆ కాలేజీకి కేంపస్ ప్లేస్మెంట్స్ కోసం వచ్చాడు. రిక్రూట్మెంట్ అంటే ఎచ్.ఆర్ తోడు తప్పనిసరి కాబట్టి ఆమె కూడా రావాల్సి వచ్చింది.
ఆమె డామ్లిన్నున్ వైపు చూసింది. పొట్టివాడు కావడం చేత ఎదురుగా వున్న టేబుల్ ని దాటి అతని భుజాలు, మెడ, తల మాత్రమే కనపడుతున్నాయి. చేతులు టేబుల్ మీద పెట్టుకోవడం కుదరలేదేమో ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న విని కుడిచేత్తో నుదిటి మీద చెమట తుడుచుకున్నాడు.
"సీ.ఆర్.ఆర్. తగ్గించడం వల్ల చాలా వరకు బ్యాంకులు వడ్డీ రేటు తగ్గిస్తాయి.. దాని వల్ల లోన్ తీసుకునేవారికి ఈ.ఎమ్.ఐ. తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ మంది లోను తీసుకుంటారు. సీ.ఆర్.ఆర్. తగ్గించడం వల్ల నాకు తెలిసినంత వరకు ఎకానమీకి మంచే జరుగుతుంది. నెగటివ్ ప్రభావం వుంటుందని నేను అనుకోను" అన్నాడతను.
చాలా చక్కని సమాధానం అనిపించింది అర్చనకి. అలాంటి ప్రశ్న తననే ఆడిగి వుంటే చేతులు ఎత్తేసేది. ఏడాది క్రితం ఇంటర్వ్యూలో ఇంతకన్నా సులభమైన ప్రశ్నలే అడిగారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అడిగారు. బట్టీ కొట్టిన సబ్జెక్ట్ లో నుంచి ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు. అది కూడా చెప్పలేకపోయింది. బయటికి వచ్చి "ఈ జాబ్ అనుమానమే" అని కూడా అంది. తన కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాళ్ళు చాలా మంది అప్పటికింకా ప్లేస్ కాలేదు. ఫస్ట్ ర్యాంకర్ కిరణ్ కుమార్ కే ఇంకా జాబ్ రాలేదు. అలాంటప్పుడు తనకి ఈ ఉద్యోగం వస్తుందని ఏ మాత్రం అనుకోలేదు. ఉన్నట్టుండి యు ఆర్ సెలక్టెడ్ అన్న మాట విని పొంగిపోయింది.
సావంగికర్ వైపు చూసింది. డామ్లిన్నున్ సమాధానాలు అతనికే మాత్రం నచ్చినట్లు లేదు. కోపంగా ముఖం పెట్టాడతను.
"వాట్? అది కూడా తెలియదా? ఎక్కువమంది లోన్లు తీసుకుంటే అందరి దగ్గర ఎక్సెస్ డబ్బు వుంటుంది... దానివల్ల ఏమౌతుంది?" అడిగాడు. అతను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు కాక ర్యాగింగ్ చేస్తున్నట్లు అర్చనకి అనిపించింది.
"ఎకానమీలో ఎక్కువ డబ్బు వుంటే అన్ని వస్తువులకీ డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల అన్నింటి ధరలు పెరిగే అవకాశం వుంది. అంటే ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం వుంటుంది. మీ ప్రశ్నకి సమాధానం అదే అనుకుంటాను "
"నేను ప్రామ్టింగ్ ఇస్తే కానీ చెప్పలేకపోయావ్..." అన్నాడు సావంగికర్ పెదవి విరిస్తూ.
"సారీ సార్" అన్నాడతను.
సావంగికర్ ఎప్పుడూ అంతే. అతని టీమ్ తో కూడా అలాగే ప్రవర్తిస్తుంటాడని అందరూ అంటారు. అంతెందుకు అవసరం వున్నా లేకపోయినా వచ్చి తనతో మాట్లాడుతుంటాడు. నిన్న హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి పక్కనే వున్నాడు. ఏదో ఒక వంకతో తాకుతున్నాడు. అవసరం వున్నా లేకపోయినా గట్టిగా నవ్వేసి హైఫై కొట్టాలన్నట్లు చేతిని పైకి ఎత్తుతున్నాడు. కొన్ని సార్లు ఇవ్వక తప్పట్లేదు.
ఆ మాటకొస్తే ఆమె ఎక్స్ బాస్, ఆమెని క్యాంపస్ లో రిక్రూట్ చేసిన అనూప్ సింగ్ కూడా అంతే. ఏదో చేస్తాడని కాదు. కానీ ఆ చూపు లోనే ఏదో తేడా. ఒకోసారి మాటల్లో అనేస్తాడు కూడా "యు ఆర్ డామ్ సెక్సీ అర్చనా" అని.
మూడు నెలల క్రితం అతను రిజైన్ చేశాక అతని ప్లేస్ లో వందన రావడంతో ఆ ఇబ్బంది లేకుండా పోయింది. వెళ్ళే రోజు కూడా "మిస్ యు ఆల్" అంటూ అందరినీ బలవంతంగా కౌగిలించుకోని కుతి తీర్చుకున్నాడు.
“అంతకన్నా ముందుకెళ్ళే ధైర్యం వాళ్ళకీ వుండదు" చెప్పింది కొలీగ్ వైశాలి. "సెక్సువల్ హెరాస్మెంట్ పాలసీ కింద కేసు పెడితే మంచి ఉద్యోగం పోతుందని భయం వుంటుంది లోపల..."
"ఉద్యోగం దొరికిందనుకుంటే ఈ బాధ ఒకటా" అని ఆమె దగ్గర అంటే - "మరి ఇంతందంగా ఎందుకు పుట్టావ్?" అంది కన్నుకొట్టి.
"వాట్ ఆర్ యూ థింకింగ్ అర్చనా?" అంటూ భుజం మీద చెయ్యేసేసరికి తేరుకుంది. ఎదురుగా అతను అలాగే వున్నాడు. సావంగికర్ అడగాల్సిన ప్రశ్నలు అయిపోయినట్లు వున్నాయి. అర్చన నుంచి ఏమైనా ప్రశ్నలు వుంటాయేమో అన్న బెదురు అతని కళ్ళలో కనపడుతోంది.
"డు యూ హావ్ ఎనీ క్వశ్చెన్స్?" అడిగింది.
"నో మేడమ్"
"థాంక్యూ డామ్సూ...." పలకలేకపోయింది.
"మై ఫ్రెండ్స్ కాల్ మీ డేవిడ్ మేడమ్" అన్నాడతను అతనికి అలవాటైన తడబాటుని చూస్తూ
"ష్యూర్... ఆల్ ద బెస్ట్ డేవిడ్" అంది అర్చన.
అతను వెళ్ళిపోగానే సావంగికర్ అతని సీవీ మీద పెద్ద "ఆర్" అక్షరాన్ని రాసి దాని చుట్టూ సున్నా చుట్టాడు.
"సార్... ఎందుకు రెజెక్ట్ చేస్తున్నారు?" అడిగింది.
"అతని కమ్యూనికేషన్ చూశావా?" అడిగాడతను.
"అతను పుట్టి పెరిగిన ప్రదేశం అలాంటిది. అతని లాంగ్వేజ్ లో ప్రాబ్లం వుంది కానీ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు కదా?"
"ఏంటి కమ్యూనికేట్ చేసేది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడుగా..."
"అది చాలా కష్టమైన ప్రశ్న... పైగా మీరు కాస్త అందిస్తే అల్లుకుపోయాడు... హీ ఈజ్ గుడ్..."
"హీ ఈజ్ నాట్.... హీ ఈజ్ జస్ట్ ఎ చింకీ..." గట్టిగా నవ్వాడతను.
"నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాడని మీకు చులకన" కటువుగానే అంది.
"కాదు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాడు కాబట్టి నీకు జాలి... అందుకే తీసుకుందాం అంటున్నావు...” ఒక్క క్షణం ఆగి సీవీ మీద రాసిన "ఆర్" అక్షరాన్ని కొట్టేశాడు. “ఇఫ్ యు రియల్లీ వాంట్, లెట్స్ టేక్ హిమ్... మనం రిక్రూట్ చేసే అరవై డెబ్భై మందిలో ఒకడు... హౌ డజ్ ఇట్ మాటర్?”
"అలా ఎలా తీసుకుంటారు? ఇద్దరికీ నచ్చితేనే కదా సెలక్ట్ చెయ్యాలి?" అర్చన ఆశ్చర్యపోయింది.
"ఏం నచ్చాలి? మనిషా? మార్కులా?" గట్టిగా నవ్వాడతను. "తీసుకోవాలనిపిస్తే తీసేసుకోవడమే... నీ సంగతే చూడు.. పర్సెంటేజ్ ఎంత ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ థ్రీ... ఇంటర్వ్యూ వాజ్ పేథటిక్... మేము తీసుకోలేదూ..."
"అదే ఎందుకు తీసుకున్నారు?" అని అడగాలనుకుంది కానీ ఆగిపోయింది.
అతను తన చేతిని ఆమె జబ్బలమీద వేసి చిన్నగా నొక్కి నవ్వాడు. "గో ఎహెడ్… టేక్ హిమ్" అన్నాడు.
తను సెలక్ట్ అయినప్పుడు క్లాస్ టాపర్ కిరణ్ యాంత్రింకంగా చెప్పిన కంగ్రాట్స్ గుర్తుకొచ్చిందామెకి.
***
(వాకిలి, నవంబర్ 2015)

దైనందినం (కథ)

తలుపు మీద దబదబమని చప్పుడైంది. ఉలిక్కిపడి లేచాడు లవ్. కళ్ళు పూర్తిగా తెరిపిడి పడలేదు. మళ్ళీ దబదబమని చప్పుడైంది. రెండు క్షణాలు అలాగే వుండిపోయాడు. తరువాత అర్థమైంది. ఆ రోజు ఆదివారమనీ, తాను తొమ్మిదైనా ఇంకా నిద్రపోతూనే వున్నాడనీ.
ఆ తలుపు కొడుతోంది తన అత్తగారేనని కూడా అతనికి తెలుసు. వెళ్లి బెడ్ రూమ్ తలుపు తీసాడు.
"క్యా హై మాజీ?" అన్నాడు కళ్ళు నలుపుకుంటూ.
అతనికి తెలుగు అర్థం కాదు. ఆమెకు తెలుగు తప్ప వేరే భాష రాదు. "టిఫిన్... టిఫిన్... రెడీ.." అంది చేత్తో తింటున్నట్లు అభినయిస్తూ. నిజానికి ఆమె మాట్లాడిన రెండు పదాలు ఇంగ్లీషు పదాలే కాబట్టి అతనికి అర్థం అవుతుంది. కానీ ఆమెకు అతనితో మాట్లాడటం అంటే సైగలు చెయ్యడమే అని మనసులో స్థిరపడిపోయింది.
"అభీ??" అన్నాడతను ఆశ్చర్యంగా "సండే... సండే... నో ఆఫీస్..." అంటూ సైగలు చేశాడు.
ఆమె గోడ మీద వున్న గడియారం వైపు వేలు చూపించి, అదే వేలిని బెడ్ రూమ్ లో వున్న మంచం వైపు చూపించి, చేతులు రెండు కుడి చెవి కింద పెట్టి, నిద్రపోతున్నట్లు నటించి "నహీ... నహీ.." అంటూ చెప్పింది. అతను విసుగ్గా చూశాడు. ఆమె తనతో చెప్పడానికి పడుతున్న ఇబ్బందిని గమనించి చిన్నగా నవ్వాడు.
"ఠీక్ హై... ఆతా హూ" బ్రష్ చేస్తున్నట్లు అభినయించి, బెడ్ రూమ్ లోకి నడిచాడు. ఆమె తలాడించి హాల్లోకి వచ్చింది.
టీవీలో భక్తి ఛానల్ నడుస్తోంది. తెల్లవారుఝామునే లేచి సంధ్యావందనం చెయ్యాలి అని చెప్తున్నారు. ఆ ఛానల్ అల్లుడు వచ్చేదాకే అని ఆమెకు తెలుసు. అతను వచ్చాక ఏవేవో ఛానల్స్ తిప్పుతుంటాడు. హిందీ పాటలు పెడతాడు, బిజినెస్ న్యూస్ వింటాడు, ఒకోసారి వంటల కార్యక్రమాలు చూస్తుంటాడు. నాన్ వెజ్ వంటలు. అలాగని ఆమెకి అతనితో పెద్ద ఇబ్బందేమీ లేదు.
"మాజీ..?" అని ప్రశ్నార్థకంగా పిలిచి రిమోట్ అందిస్తాడు. ఆమె చెయ్యి అడ్డంగా ఊపి, నువ్వే చూడు అన్నట్లు సైగ చేస్తుంది. ఇద్దరూ చిరునవ్వు నవ్వుకుంటారు. అతను టీవీలో పడిపోతాడు. ఆమె వంటలో మునిగిపోతుంది.
అతనితో ఆమెకు వున్న చిక్కల్లా అతని పేరే.
"లవ్ టాండన్" అని కూతురు చెప్పినప్పుడు "అదేం పేరే? మేమంతా ఎలా పిలవాలి" అంది. కూతురు నవ్వేసి ఊరుకుంది. ఆ పేరు వల్లే ప్రేమ పుట్టిందేమో మరి. గుర్గావ్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్ ట.
ఆలోచనలు ఆపి మళ్ళీ బెడ్ రూమ్ వైపు చూసింది. అతను ఇంకా బయటికి రాలేదు. ఆమె నిట్టూర్చి, సోఫా మీద బలమంతా పెట్టి పైకి లేచింది. మోకాళ్ళ నొప్పులు వచ్చాక సోఫాలో కూర్చోవటం లేవటం కష్టంగా వుంటోంది. ఎప్పటికప్పుడు సోఫాలో కూర్చోకూడదు అనుకుంటూనే వుంటుంది కానీ మర్చిపోతుంటుంది.
మళ్ళీ తలుపు కొట్టింది. ఆమె అనుకున్నది నిజమే. అతను మళ్ళీ పడుకున్నాడు. చిరాగ్గా వచ్చి తలుపు తీసాడు.
"పాంచ్ మినిట్ మాజీ" అన్నాడు కుడి చేతివేళ్ళను చూపిస్తూ. ఆమె మళ్ళీ టిఫిన్ తినమన్నట్లు సైగలు చేసింది. టిఫిన్ చల్లారిపోతుంది అని చెప్పాలనుకుంది కానీ ఎలా సైగలు చెయ్యాలో అర్థం కాలేదు."ఓకే.. ఓకే" అన్నాడతను.
***
ఆమె హాల్లోకి వెళ్ళిపోయిన తరువాత తన బెడ్ వైపు చూసి, అపురూపమైనదేదో కోల్పోయినట్లు, చిరాకు పడుతూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. ఈ విషయం గౌతమితో మాట్లాడాలి అనుకున్నాడు. పాపం రాత్రంతా డ్యూటీ చేసి వస్తుంది. నాతో మాట్లాడే తీరికే వుండదు. అని కూడా అనుకున్నాడు.
గౌతమిని ప్రేమించినప్పుడు రోజుల్లో భాష పెద్ద అడ్డంకిలా అనిపించలేదు అతనికి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఇంగ్లీషులో, హిందీలో మాట్లాడుకుంటారు. తను తెలుగు నేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాడు కానీ కుదర్లేదు. మాజీతోనే సమస్య. గౌతమికి నైట్ షిప్ట్ మొదలైన తరువాత మాజీ ఇంట్లో వుంటే బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నట్లే సొంత ఊరు వదిలి వచ్చి వుంటోంది.
తమకు సహాయంగా వచ్చి వుంటున్న మనిషితో కనీసం మాట్లాడలేకపోతున్నానన్న భావన అతనిలో వుంది. అయినా మాట్లాడటానికి అవకాశం ఎక్కడుందిలే అనుకున్నాడు. ఉదయం ఎనిమిదికి బయల్దేరితే రాత్రి పదికి తక్కువ కాదు. అతను బయల్దేరడానికి ఓ అరగంట ముందు గౌతమి వస్తుంది. కాబట్టి ఉదయం ఉన్న కాస్త టైమ్ గౌతమితోనే గడుపుతాడు. గౌతమికి శనివారం వీక్లీ ఆఫ్. మిగిలింది ఆదివారం.
తనకి ఆదివారం అపురూపం. ఇంతకు ముందు పన్నెండు దాకా నిద్రపోయేవాడు. లేచి, ఒకేసారి బ్రంచ్ చేసి టీవీలో ఏ సినిమానో, స్పోర్ట్సో చూస్తూ గడిపేసేవాడు. అత్తగారు వచ్చాక అదేమీ కుదరట్లేదు. ఆదివారమైనా ఏడూ ఎనిమిదింటికి లేపేస్తుంది. ఈ ఒక్క విషయంలో ఆమె అంటే అతనికి చిరాకు, కోపం. ఇది ఆమెకి చెప్పాలనుకున్నా చెప్పలేడు. గౌతమికి ఫోన్ చేసి ఈ సంగతి ఒకసారి చెప్పాలి. ఆదివారం పది దాకా లేపద్దని చెప్పించాలి అనుకున్నాడు.
మళ్ళీ బెడ్ రూమ్ తలుపు చప్పుడైంది. అప్పటికే లవ్ బ్రష్ చేసుకోవడం అయిపోయింది. ఆమె కాఫీ అందించింది. తెలుగు అమ్మాయిని పెళ్ళి చేసుకోవడంలో వున్న అతిపెద్ద లాభం ఉదయాన్ని దొరికే ఫిల్టర్ కాఫీ అని అతని నమ్మకం. ఆమె చేతిలో నుంచి అందుకోని "థాంక్యూ" అన్నాడు. ఆమె మోకాళ్ళ నొప్పులవల్ల వంగని కాళ్ళతో అటూ ఇటూ ఊగుతూ నడుస్తూ హాల్లోకి నడిచింది. అలా నొప్పులు పడుతూ వచ్చి కాఫీలు టిఫిన్లు అందించకపోతే ఏం? నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పాలని అతనికి అనిపించింది. కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు.
కళ్ళు ఇంకా మగతగానే వున్నాయి. కాఫీ తాగితేకానీ నిద్ర మత్తు పూర్తిగా వదలదు అనుకోని ఒక సిప్ చేశాడు. బెడ్ మీద వున్న ఫోన్ అందుకోని గౌతమికి కాల్ చేస్తూ హాల్ లోకి, అక్కడ్నుంచి కామన్ బాల్కనీలోకి నడిచాడు.
"గుడ్ మార్నింగ్" అంది గౌతమి. "క్యా హో రహాహై యార్" అంది.
అతను చెప్పాడు.
"ఎందుకు మాజీ ప్రతి ఆదివారం నా నిద్ర చెడగొడుతుంది?" అన్నది అతని ఆఖరు వాక్యం.
"నేను మాట్లాడతాను ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు" అంది గౌతమి.
అతను హాల్లో కి వచ్చి చూశాడు. ఆమె లేదు. టీవీ ఆపేసి వుంది. "మాజీ" అన్నాడు.
వంటింట్లో కూడా కనపడలేదు. మళ్ళీ హాల్లోకి నడుస్తూ కామన్ బాత్ రూమ్ తలుపు కొట్టాడు. సమాధానం లేదు. తలుపు తోస్తే తెరుచుకుంది. అతను ఆ బాత్ రూమ్ ఎప్పుడూ వాడింది లేదు. ఇండియన్ స్టైల్ అతనికి అలవాటు లేదు.
ఆమె బెడ్ రూమ్ లో చూశాడు. అక్కడ కూడా లేదు.
గౌతమి ఫోన్ లో "హలో హలో" అంటోంది. అతను విషయం చెప్పాడు.
"బాత్ రూమ్ లో వుందేమో" అంది.
"చూశాను, అక్కడ కూడా లేదు" అన్నాడతను.
"కామన్ కాదు... వెస్ట్రన్... మన బెడ్ రూమ్ లో" అంది.
అతను అక్కడికి నడిచాడు. నీళ్ళ చప్పుడు వినిపించింది.
"హై?"
"హా"
"బయటికి వచ్చాక ఫోన్ చెయ్యి" అంది.
"అవసరం లేదులే. ఇంక ఆ విషయం ఆమెతో మాట్లాడకు.. నాకు అర్థం అయ్యింది" అన్నాడతను హిందీలో.         

***

(వాకిలి అక్టోబర్ 2015)

కబ్జా

విజయ దాన్ని చూడగానే కోపంతో ఉగిపోయింది. అన్నాళ్ళుగా తనకు అందాల్సిన సుఖాన్ని బలవంతంగా లాగేసుకున్నారన్న భావన ఆమెను కుదిపేసింది. కోపంతో పళ్ళు పటపట కొరికి చేతిలో చీపురును కిందపడేసింది. పైకి దోపిన చీర కుచ్చిళ్ళను కిందకు జార్చి పరుగులాంటి నడకతో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది.

నిజానికి ఆ ఇంటిని ఇల్లు అనడానికి కూడా మనసొప్పదు విజయకు. ఉండేది ఒకటే గది. దానికి ఆనుకోని వుండే వంటగదిని కూడా ఒక గది కింద లెక్కేస్తే రెండు గదులు. ఈ చివరి నించి ఆ చివరకు పద్దెనిమిది అడుగులు. ఇంకో వైపు ఇరవై అడుగులు. అందులో, ఒక మూల వుండే టీవీ, ఇంకో గోడవైపు వుండే సోఫా వదిలేస్తే ఇంకో రెండు అడుగులు తగ్గించుకోవాలి. అసలు ఆ సోఫాని కూడా సోఫా అనలేమని విజయ అంటుంది. ఎన్నో ఏళ్ళు ఎవరో వాడిపడేసిన ఆ సెకండ్ హ్యాండ్ సోఫా మధ్యలో గుంట పడిపోయి వుంటుంది. ఏ పక్క కూర్చున్నా మధ్యలోకి జారిపోతుంటారు. అదనంగా దాంట్లో నల్లులు, బొద్దింకలు. సోఫా కింద జాగానే చెప్పులు పెట్టుకునే స్థలం.
మరాఠీలో కోలీ పిలవబడే ఆ ఒక్కగది ఇల్లు దాటి కారిడార్లోకి వచ్చిందామె. అలాంటి పధ్నాలుగు ఇళ్ళ ముందు పరుచుకున కారిడార్ చివరి వైపుకి వడివడిగా నడిచింది.

“ఎలా వుంది మన చాల్” అన్నాడు పెళ్ళై ముంబై వచ్చిన రోజు రిక్షా దిగుతున్నప్పుడు.

“చాల్ ఏంటి?” అంటే – “మనలాగా ఎక్కడెక్కడ్నుంచే వచ్చే వాళ్ళకోసం గవర్నెమెంటు, మిల్లు ఓనర్లు కట్టించిన ఇళ్ళు” అన్నాడు. మహానగరం మాయలో దిష్టి చుక్కలాంటి ఇంటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలేదు విజయ. ఆ ఇరుకు గదినే ఇల్లంటారని తెలుసుకున్న రోజు అడిగేసింది.

“గది చిన్నదినేం? ఈ ముంబై మహానగరంలో ఇంత జాగా ఎవరికి దొరుకుతుంది చెప్పు” అన్నాడు కారిడార్ ని చూపిస్తూ. అప్పటికి వాళ్ళకి పెళ్ళై రెండు నెలలో మూడు నెలలో అయ్యింది. కారిడార్లో పడుకోని వున్నారప్పుడు.

“ఇదంతా నీదే అయితే మన మహారాజులం అనుకోవాలి” అంటూ నిరసించింది విజయ.

“ఇప్పుడేం తక్కువైందని” అన్నాడతను కాస్త దగ్గరకు జరుగుతూ.

“దూరం జరుగు. కనీసం వంద మంది పడుకోని వున్నారు మన చుట్టూ. కారిడార్లో సరసాలేంటి?” అంది సర్దుకుంటూ.

అతని దగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పలేడు. ఆ ఒక్క గది ఇంట్లో ఉండేది ఆరుగ్గురు మనుషులు. ఆనంద్, అతని భార్య విజయ, అతని అన్న శివ, వదిన మాధవి, తల్లి, తండ్రి. ఆనంద్ కి పెళ్ళైన కొత్తల్లో అంతా బాగానే వుండేది. వాళ్ళిద్దరూ కొత్త దంపతులని మిగిలిన నలుగురు నెలరోజులు బయటే పడుకున్నారు. ఆ తరువాత నెమ్మదిగా మాధవి తోడుకోడలి దగ్గర మనసు విప్పింది.

“ఇక్కడ చాలా మంది ఇళ్ళలో రెండు మూడు జంటలు వుంటాయి. అందరికీ అవసరాలు వుంటాయి కదా. ఆ విషయాలన్నీ నోరు విప్పి ఎలా మాట్లాడుకుంటాం చెప్పు? అందుకని వాళ్ళ మధ్య ఒక కోడ్ భాష వుంటుంది. ఎవరు ముందు దుప్పటి పరిస్తే వాళ్ళకి రాత్రి లోపల పడుకోవాలని వున్నట్లు గుర్తు. గది వాళ్ళకి వదిలేసి మిగతా వాళ్ళు బయట పడుకుంటారు” అని చెప్పింది. ఆ చెప్పడం కూడా యధాలాపంగా, కూరగాయలు ఎక్కడ కొనుక్కోవాలో చెప్పినట్లు చెప్పింది. చివర్లో – “అర్థం అయ్యిందా?” అంది. విజయ తలాడించింది. ఆ రోజు రాత్రి మాధవి ముందుగా దుప్పటి పరిచింది.

అలా ఒక వారం రోజుల పాటు మాధవి ఆ గదిని ఆక్రమించడంతో విజయ భర్తతో కలిసి, బయట అత్త మామల పక్కనే పడుకోక తప్పలేదు. చుట్టూ వందమంది వున్నా పడుకోవటం ఆమెకి పెద్ద ఇబ్బంది కాలేదు. వున్న సమస్యల్లా మూడున్నరకో, నాలిగింటికో లేచి బకెట్లో నీళ్ళు తీసుకోని కారిడార్ చివర్లో వుండే సామూహిక టాయిలెట్ల దగ్గరకి పరిగెత్తడమే. ఆలస్యమైతే క్యూ ఎక్కువైపోతుంది. మగవాళ్ళు వచ్చేస్తారు. పెళ్ళికి ముందు అమెకు అలవాటైన టైమ్ అది కాదు. అయినా తప్పటంలేదు.

ఇప్పుడు కారిడార్ చివరికి వచ్చేసరికి రోజు అంత ఉదయాన్నే వెళ్ళటం ఎంత ఆమెకు మంచిదో అర్థం అయ్యింది. ఎనిమిది కావస్తుండటంతో చాలా పెద్ద క్యూ వుంది. కొంత మంది అక్కడే నిలబడి నోట్లో బ్రష్ తో పళ్ళు తోముతుంటే, ఇంకొంతమంది సిగరెట్ కాలుస్తున్నారు. లోపలి వాళ్ళు బయటకొచ్చేదాకా కాలక్షేపంకోసం పేపరు చదువుతున్నారు. మాటలు రకరకాల భాషల్లో దొర్లిపోయి మరకలు పడ్డ గోడల్లా కంగాళీగా వున్నాయి. క్యూ మధ్యలో వున్నాడు ఆనంద్. పిలిచింది. క్యూలో తన ప్లేస్ ముందు వెనక వున్నవాళ్ళకి చెప్పుకోని వచ్చాడు. వెనకనుంచి ఎవరో మరాఠీలో ఏదో అని నవ్వేశాడు.

“ఏంటి ఇక్కడికొచ్చావ్?” అన్నాడు లుంగీ దించుతూ. మాట్లాడలేదు విజయ. గుప్పట తెరిచి చూపించింది. చింపేసి వున్న ఖాళీ కాండోమ్ పేకట్. అదిరిపడి అటూ ఇటూ ఎవరూ చూళ్ళేదని నిర్థారించుకోని దాన్ని చటుక్కున లాగేసుకున్నాడు.

“ఏంటే ఇది?” అన్నాడు కాస్త కోపంగా.

“మీ అన్నగారి నిర్వాకం. వాళ్ళిద్దరూ ఇది వాడుతున్నారు.” అంది ఉక్రోషంగా. ఒక్క క్షణం ఆలోచించాడు.

“నాన్న మనవల్ని చూడాలంటున్నాడ్రా అని నన్ను బ్రతిమిలాడితే కదా బయటపడుకుంటున్నాను” అన్నాడు.

“ఏడ్చినట్లే వుంది. నిన్న పదమూడో రోజు, ఈ మూడు రోజులు మాకొదిలెయ్యవే అని అక్క అంటే నేను కూడా నమ్మేశాను” అంది విజయ. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. విజయ కళ్ళలో నీళ్ళు కనపడ్డాయి.

“ఈ రోజు మాట్లాడతాను” అన్నాడు

“అక్కర్లేదు. సాయంత్రం త్వరగా రండి. దుప్పటి నేనే పరుస్తాను. ఎవరడ్డం వస్తారో చూద్దాం” అంటూ వెనక్కి తిరిగింది విజయ. ఆమె వెళ్ళిపోతుంటే లైన్లో నుంచి మళ్ళీ ఏవో కామెంట్లు, నవ్వులు వినపడ్డాయి.

***

రాత్రి భోజనాలయ్యాయి. విజయ సాయంత్రం నుంచి దుప్పటి వుండే చోటే తిరుగుతుండటం గమనిస్తూనే వుంది మాధవి. పదమూడు, పధ్నాలుగు, పదిహేను వదిలేయమని చెప్పింది కాబట్టి, భయం లేదు అనుకుంటూ వుంది. కానీ పరిస్థితి చూస్తే అనుమానంగానే వుంది. మూడు రోజులు ఆగలేరా? అనుకుంది ముందు. మరుక్షణం జాలేసింది. పాపం చిన్న పిల్ల, పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదు. అనుకుంది. కానీ శివ ఒప్పుకోడు. పొద్దున వెళ్తూనే చెప్పి వెళ్ళాడు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు.

ఇంటి పని మొత్తం విజయే చేస్తుంది. మామగారు సెక్యూరిటీ గార్డ్ గా వెళ్తాడు. అత్తగారు ఒక ఇంట్లో పిల్లలకి కేర్ టేకర్ గా పని చేస్తుంది. శివ, ఆనంద్ మిల్లులో కూలికి వెళ్తారు. మాధవి ఆయమ్మగా పనిచేస్తోంది. ఇంట్లో వుండేది విజయే కాబట్టి పని భారం మొత్తం ఆమె మీదే పడింది. రోజూ రాత్రి భోజనాలు అయ్యాక అక్కడ చీపురుతో చిమ్మేసి ఆ చెత్త మొత్తం బయట కారిడార్లో వున్న డస్ట్ బిన్ లో వెయ్యడానికి వెళ్తుంది. అప్పుడు టీవీ స్టాండ్ కింద వున్న దుప్పటి తీసి పరిచేస్తే సరిపోతుంది.

ఆలోచిస్తూ టీవీ కింద చూస్తే వాళ్ళు వాడే దుప్పటి కనపడట్లేదు. పైన విజయ, ఆనంద్ వాడే దుప్పటి మాత్రం వుంది. విషయం అర్థమైంది. గబగబా లేచి ఏదో పని వున్నట్లు అటూ ఇటూ తిరిగి చూసింది. ఎక్కడా కనపడలేదు. విజయ ఏమీ ఎరగనట్లు భోజనాలు అయిపోయిన చోట చిమ్మేసి చెత్త మొత్తం కవర్లో పెట్టుకోని బయటికి నడిచింది. నడుస్తూ ఆమె ఆనంద్ వైపు చూడటం, ఆనంద్ ఓరగా చూసి నవ్వటం గమనించింది.

సోఫాలో కూర్చోని పళ్ళు కుట్టుకుంటున్న భర్త వైపు చూసింది మాధవి. అతను యధాలాపంగా ఆమె వైపు చూసి ఏమిటన్నట్లు కళ్ళు ఎగరేశాడు. కళ్ళతోనే దుప్పటి వుండే స్టాండ్ వైపు చూపించింది. అప్రయత్నంగా అతను కూడా లేచాడు. అంతలోనే విజయ లోపలికి వచ్చింది.

“పాలు తోడు పెట్టలేదనుకుంటా. పక్కింట్లో కాస్త పెరుగు తీసుకురామ్మా” అంది అత్తగారు విజయను చూసి. విజయ ఒక చూపు మాధవి, శివ వైపు చూసి వాళ్ళ చేతుల్లో దుప్పటి లేదని నిర్థారించుకోని బయటకు నడిచింది. అదే మంచి అవకాశంలా కనిపించింది మాధవికి. గదిలో కనపడటంలేదంటే ఖచ్చితంగా వంటింట్లోనే వుండి వుంటుంది. చటుక్కున దూకి వంటింట్లో వెతకడం మొదలుపెట్టింది. అరనిముషంలో దొరికేసింది.


దుప్పటి చేత్తో పట్టుకోని పరుగుపందెంలో ఆఖరి అంగ వేసినట్లు ముందు గదిలోకి వచ్చింది. అప్పటికే విజయ కూడా వచ్చేసి వాకిట్లో నిలబడి వుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా గది మధ్యలో దుప్పటి పరుస్తున్న అత్తగారిని, గోడవారగా నిలబడి నేల చూపులు చూస్తున్న మామగారిని చూస్తున్నారు.
<*>
(వాకిలి, సెప్టెంబర్ 2015)

ఎవరో వస్తారని... (కథ)

మా వూర్లో చాలామంది ఆయన్ని దేవుడిలా పూజించేవాళ్ళు. సుఖాల్లో దేవుణ్ణి మర్చిపోయి కష్టాల్లో దేవుడా అని అందరూ అన్నట్టుగానే ఇప్పుడు మా వూళ్ళో కష్టం వచ్చింది కాబట్టి ఆయనతో అవసరం పడింది. వెంటనే ఆయన్ను వూర్లోకి తీసుకొస్తే కానీ అన్ని ఇబ్బందులు తొలగిపోవని అందరూ కలిసి తీర్మానించారు. అందుకు నన్ను రాయబారిగా ఎన్నుకున్నారు.

ఆయన పేరు కరుప్పుస్వామి. మా వూళ్ళో అంతా స్వామీ అనే పిలిచేవాళ్ళం. గట్టిగా అయిదడుగులమీద అంగుళం కూడా లేకుండా పొట్టిగా, నల్లగా మా గుళ్ళో వేణుగోపాలస్వామి లాగా వుంటాడు. తమిళ్‍నాడులో కోయంబత్తూరు దగ్గర ఏదో వూరు తన సొంత వూరని చెప్తుండేవాడు. ఇప్పుడు కోయంబత్తూరులోనే వున్నాడని తెలిసింది. ఇదుగో అక్కడికే నా ప్రయాణం.

నిజానికి ఆయనేం దేవుడు కాదు, బాబా అంతకన్నా కదు. ఒక మామూలు మనిషి. అలాంటిది ఇంత మంది ఆయన్ని దేవుడిలా చూస్తున్నారంటే అది ఆయన మా గ్రామానికి చేసిన ఉపకారం వల్లనే. రైలు ముందుకు పరుగెడుతుంటే వెనక్కి వెళ్తున్న తాటి చెట్ల వెంటే నా మనస్సూ వెనక్కి పరుగు తీసింది.

దాదాపు పదిపదిహేనేళ్ళ క్రితం మా వూర్లో నీటికి కటకటగా వుండేది. ఎండాకాలం వచ్చిందంటే బావులు, చలమలు, చెరువులు అన్నీ ఇంకిపోయేవి. ఆడవాళ్ళు మైళ్ళ దూరం నడిచి ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు తెచ్చి, మట్టసంగా వాడుకునేవాళ్ళు. చుక్క నీళ్ళైనా అమృతంతో సమానంగా చూసుకునే రోజులవి.

సరిగ్గా అలాంటి ఓ ఎండాకాలంలోనే మా వూర్లో అడుగుపెట్టాడు కరుప్పుస్వామి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, నాన్న పంచాయితీ మీటింగులో వున్నాడు. నేను పంచాయితీ ఆఫీసు బయట అరుగుమీద ఇంకెవరో పిల్లలతో ఆడుకుంటున్నాను.

“బాబూ.. సర్పంచ్ సారు యవరు... ఎంగే” అంటూ తమిళ్ తెలుగు కలిపి మాట్లాడుతూ ఆ నల్లటి మనిషి నా దగ్గరకు వచ్చాడు. నేను లోపలికి తీసుకెళ్ళి చొరవగా నాన్న ఒళ్ళో చేరి, “మా నాన్నే ప్రసిడెంట్” అని చెప్పాను.
ఆయన నమస్కారం చేసి తన పేరు వూరు వివరాలు చెప్పాడు. “చేయూత” అని ఏదో స్వచ్చంద సేవా సంస్థలో పనిచేస్తున్నానని, వాళ్ళే ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారని చెప్పాడు.

“చేయూత.. ఈ పేరెక్కడా వినలేదే” అన్నాడు లక్కరాజు మామయ్య నాన్న వైపు చూస్తూ.

“మొన్న నన్ను అడిగారులే... అయినా ఇట్టాంటివి సవాలక్ష వున్నాయి బావా... ఫారిన్ నుంఛి డబ్బులొస్తాయి... వాటిని ఇక్కడ స్కూల్ కట్టేదానికో, అనాధాశ్రమం కట్టేదానికో వాడతారు... కొంతలో కొంత వాళ్ళూ మిగిల్చుకుంటారు..” అన్నాడు నాన్న హేళనగా స్వామిని చూస్తూ. స్వామి ఏమాత్రమ్ నొచ్చుకోకుండా నవ్వేసి,

“ఏడైనా ఉండేదానికి వీడు దొరుకుతుందా?” అని ఆ వివరాలు అడిగాడు.

“రేయ్ మాధవా... ఈయనతో పాటే వెళ్ళి ఆ మాచారం శ్రీరాములుగారింట్లో దక్షిణం పోర్షన్ చూపించిరా..” అంటూ నన్ను పురమాయించాడు నాన్న. ఎండ ఎక్కువగా వున్నా బయట తిరిగేందుకు అనుమతి దొరికిందని సంతోషంగా ఛంగు ఛంగున పరుగెత్తాను.

స్వామి నేరుగా శ్రీరాములుగారింటికి పోనివ్వకుండా వూరంతా చూపించమన్నాడు. అదే అదనుగా నేను ఆయన్న వూరంతా తిప్పుతూ మా స్కూలు, స్నేహితుల ఇళ్ళు, నా కిష్టమైన చింతచెట్టు, మామిడి తోపు, పెద్దబజారు, టూరింగ్ టాకీసు అన్నీ చూపించాను. దారిలో డాక్టర్ ఎక్కడున్నాడనీ, పశువుల ఆసుపత్రి గురించి, పాల డైరీ గురింఛి అడిగి తెలుసుకున్నాడు. ఎండకు నేను అలసిపోయాను కానీ, ఆయన కొంచెం కూడా నలగలేదు.

మాచారం శ్రీరాములుగారి ఇల్లు స్వామికి నచ్చింది. అందులోనే దిగాడు.

ఆ తరువాత వూర్లో అప్పుడప్పుడు కనిపించేవాడు. ఏవో కాగితాలు పట్టుకోని ప్రతీ ఇంటికీ తిరిగి వివరాలు రాసుకునేవాడు. పంచాయితీకి వచ్చి కరణం బాబాయ్ దగ్గర రికార్డులు చూసి ఏవేవో లెక్కలు రాసుకునేవాడు. ఒక్కోసారి వాళ్ళ ఆఫీసు వాళ్ళను జీపులో తీసుకొచ్చి వూరంతా చూపించేవాడు. అట్టాంటప్పుడు నేను ఎక్కడైనా కనపడి అడిగితే జీపులో ఎక్కించుకోని తిప్పేవాడు. ఆ వచ్చిన ఆఫీసువాళ్ళకి కూడా నేను చింతచెట్టు, మామిడి తోపు చూపించేవాడిని. ఒక్కోసారి జీపులో ఫారిన్ వాళ్ళు వుంటే మాత్రం భయం వల్ల పలకరించేవాణ్ణి కాదు.
ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది. ఆ వయసులో అంతకన్నా తెలిసే అవకాశంలేదు కానీ, వయసు పెరిగే కొద్ది ఆయన చేసిన పనులు, వూరిలో వస్తున్న మార్పులు అర్థం అవసాగాయి. జనం ఆయనకి ఇచ్చే గౌరవం, మర్యాద కూడా క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. విత్తనంలో నుంచి మొలకెత్తిన మొక్కని రోజూ చూస్తే పెరిగినట్లు ఎట్లా తెలియదో వూరిలో క్రమక్రమంగా జరుగుతున్న అభివృద్ధిని కూడా తెలుసుకోలేక పోయాను. ఆయన మాత్రం విత్తనంలో దాగున్న చెట్టుని, ఆ చెట్టు విరబూసే వసంతాన్ని కూడా చూసినవాడిలా తన పని తాను చేసుకుపోయేవాడు.

ఒకసారి ఆగష్టు పదిహేనున మా స్కూల్లో జరిగిన ఫంక్షన్ కి ఆయన్ను పిలిచారు. మా ప్రిన్సిపాల్ ఇజ్రాయేల్ స్వామిని చాలా పొగిడారు. భగీరదుడనీ, కాటన్ దొర అని చెప్పాడు. కాటన్ దొర అంటే అప్పుడు నాకు తెలియదుకానీ భగీరదుడి గురించి పాఠం చదివాను. బహుశా వూర్లోకి నీళ్ళు తెప్పిస్తున్నాడేమో అనుకున్నాను. ఆ రోజు స్వామి కూడా మాట్లాడాడు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తొవ్వాలనీ, నీటిని వృధా చెయ్యకుండా పెద్దవాళ్ళకు పిల్లలే చెప్పాలని చెప్పాడు. అప్పటికి ఆయన తెలుగు స్పష్టంగా మాట్లాడటం కూడా నేర్చుకున్నాడు.
ఆ తరువాత నేను గుంటూరులోఇంటర్మీడియట్ కాలేజీలో చేరి, దాదాపు సంవత్సరం తరువాత ఎండాకాలం శెలవలకి ఇంటికి వచ్చాను. వూరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రతి ఎండాకాలం తలమీద చెంగు కప్పుకోని, తలపైన బిందలతో కనిపించే ఆడవాళ్ళు ఎవ్వరూ కనపడటంలేదు. కావడితో నీళ్ళు మోసే కరీం భాయ్ సైకిల్ రెపేర్ షాప్ పెట్టుకున్నాడు.

ఇంటికి వెళ్ళగానే అమ్మ నా చేతిలో వున్న సామాను అందుకోని – “అంతా వూరికి పడమట వైపు వున్న బీడుభూమి దగ్గర చెరువు తొవ్విస్తున్నారని చెప్పింది”.  నేను హడావిడిగా సైకిల్ మీద వెళ్ళి, అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నమ్మలేనట్లు ఆగిపోయాను. ఒకప్పుడు గొడ్లను, మేకలను, గొర్రెలను మేతకు తీసుకొచ్చే ప్రదేశమది. ఇప్పుడు దాదాపు చెరువు పూర్తికావస్తోంది. వూరి జనమంతా అక్కడే పని చేస్తున్నారు. అందరినీ ఉత్సాహపరుస్తూ తిరుగుతూ స్వామి..!!

మా వూరికి ఉత్తమ పంచాయితీ అవార్డ్ వచ్చిందని, పత్రికలవాళ్ళు నాన్నతో మాట్లాడుతున్నారు. స్వామి నా దగ్గరికి వచ్చి – “పెద్దవాడివి అయ్యావే..” అని మాత్రం అన్నాడు తల నెమురుతూ. నాన్న స్వామి పేరు చెప్పాడనుకుంటా ప్రెస్ వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చారు.

“గవర్నమెంటులో ఇన్ని పథకాలు వుంటే మీరు అవి వాడుకోకుండా.. మీ అంతట మీరే అంతా కలిసి ఇలా చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..?” అడిగారు వాళ్ళు.

స్వామి నవ్వేసి చెప్పాడు – “నేను గవర్నమెంటు సహకారం తీసుకొలేదని ఎందుకనుకుంటున్నారు? ఈ గ్రామానికి పంచాయతే గవర్నమెంట్... ఈ ప్రజలే గవర్నమెంట్... ఇదే గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం..”

చెరువు నిర్మాణం పూర్తి కాగానే స్వామికి మా ఊరి నుంచి వేరే వూరుకి బదిలీ అయ్యింది.

***

కోయంబత్తూరులో ట్రైన్ ఆగింది. నేను ప్లాట్ ఫారమ్ మీద దిగిన రెండు నిముషాల్లోనే స్వామి నా దగ్గరకు వచ్చాడు.

“నమస్కారమండీ సర్పంచిగారూ... బాగుండారా?” అన్నాడు లుంగీ పైకి కట్టి సామాను పైకెత్తుకుంటూ.
అప్పటికీ నేను “వద్దు స్వామీ..” అంటూ వారించబోయాను..!

“ఏం ఫర్లేదు చిన్నా... రా రా... అన్నట్టు మొన్నే మీ ఐలారం వెంకటేషు మాట్లాడాడు... అప్పుడే తెలిసింది నువ్వు సర్పంచ్ అయ్యావనీ..” చెప్పాడు ముందుకు నడుస్తూ.

ఇంటికి తీసుకెళ్ళి భార్యని పరిచయం చేశాడు. ఆమె చేతి తమిళ వంట, నాకొసం స్వామి ప్రత్యేకంగా చేసిన తెలుగు వంట కలిపి తినేసరికి కడుపు నిండిపోయింది. వరండాలో కూర్చోని తొమలపాకులు నములుతూ మాట్లాడుకున్నాం.

“వెంకటేషుతొ మాట్లాడానన్నారుగా... విషయం తెలిసే వుంటుంది..” అన్నాను

“ఏ విషయం చిన్నా? వెంకటేషు మామూలు విషయాలు మాట్లాడాడు తప్ప ఏం చెప్పలేదే?” అన్నాడు. వెంకటేషు స్వామి ప్రియ శిష్యుడు. అలాంటిది ఫోన్ చేసి కూడా ఏమీ చెప్పలేదంటే నాకు ఆశ్చర్యంగా వుంది.

“మా వూరి దగ్గర్లో ఒక కూల్ డ్రింక్ ఫాక్టరీ పెడుతున్నారు...” చెప్పాను సూటిగా. భూగర్భజలాల గురించి క్షుణ్ణంగా తెలిసిన స్వామికి, ఆ ఫాక్టరీ వల్ల వచ్చే అనర్థం ఏమిటో వివరించాల్సిన పనిలేదు అనుకున్నాను.
స్వామి క్షణం మాట్లాడకుండా వుండి, గట్టిగా నిట్టూర్చి – “పోనీలే పది మందికి వుద్యోగాలైనా వస్తాయి..” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను.

“ఏమిటి స్వామీ అలా అంటారు... అక్కడ ఫాక్టరీ పెడితే ఇన్ని సంవత్సరాలుగా మనం పెంచుకున్న భూగర్భ జలాలు ఇంకిపోతాయి... వూరి మళ్ళీ పది సంవత్సరాలు వెనక్కిపోతుంది...” అన్నాను ఆవేశంగా.

“అయితే ఏమంటావు?”

“మీరు వచ్చి ఏదైనా సలహా చెప్తారేమోనని వూరు వూరంతా ఎదురు చూస్తోంది...” చెప్పాను.
ఆయన నవ్వి మళ్ళీ – “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా...” అంటూ పాటపాడాడు.

“ఏంటి స్వామీ... మీలాంటి వాళ్ళు పూనుకుంటే కదా... ఆలోచించండి ఒక్క సంవత్సరంలో ఇన్ని రోజులు మీరు, మన వూరి జనం పడ్డ కష్టానికి ఫలితమనేదే లేకుండా పోతుంది..” కొంచెం కోపంగానే అడిగాను నేను.

“ఫలితం లేకుండా పోతుందని అనుకోడానికి నేను ఆ ఫలితం ఆశించి కష్టపడలేదు కదా చిన్నా... అప్పుడు ఒక ఆశయం కోసం కష్టపడటం మాత్రమే నేను చేసింది... అప్పుడు అది నా వుద్యోగ ధర్మం కూడా... ఫలితం దానంతట అదే వచ్చింది...” అన్నాడు నవ్వుతూ.

“ఏమిటండీ కర్మ సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు? వూర్లో నీటి కష్టం తీర్చడానికి వచ్చిన కాటన్ దొర మీరేనని వూరంతా అనుకుంటుంటే మీరు కాదంటారేమిటి?”

“వూర్లో ఇబ్బంది తీరింది నా వల్లే అని మీరు అనుకుంటుంటే అది మీ పొరపాటు. వూరంతా కలిసి ఆ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని అనుకున్నారు కాబట్టే అది సాధ్యమయ్యింది. నేను కేవలం దారి చూపించాను..” చెప్పాడు స్వామి

“సరే మీ మాటే కరెక్ట్ అనుకుందాం... మీరు చేసినా, వూరంతా కలిసి చేసినా ఒక ఫలితం వచ్చింది కదా... దాన్ని నిలబెట్టుకోడానికైనా మళ్ళీ కష్టపడాలి కదా?” వాదించాను నేను.

“అదే చెప్తున్నాను ఫలితం ఆశించో, ఫలితాన్ని నిలబెట్టుకోడానికో కాదు పని చెయ్యాల్సింది... పని చెయ్యాలి అంతే... మనం చెయ్యాల్సిన పని చెయ్యడం వల్ల ఏం జరుగుతుందే అదే ఫలితం..” అన్నాడు.

ఇక వాదించి ప్రయోజనం లేదని అర్థం అయ్యి లేచి నిలబడ్డాను.

“అదే మీ నిర్ణయమైతే ఇక బయల్దేరతాను..” చెప్పాను కటువుగా.

ఆయన చిన్నగా నవ్వి, “నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు నువ్వు... వూరంతా కలిసి పని చేస్తే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు అని మీకు చేసి చూపించాను... అంతే కానీ మీకు కష్టం వచ్చినప్పుడల్లా వచ్చి ఆదుకుంటానని చెప్పలేదు.” అన్నాడు. ఆయనకి నమస్కరించి వెంటనే బయల్దేరాను.

***

నేను ఎక్కిన కారు మా వూరి వైపు దూసుకుపోతోంది. వూరి పొలిమేరలో అమ్మోరి జాతరకు కదలివచ్చినట్లు జనం. సరిగ్గా కూల్ డ్రింక్ ఫాక్టరీ కట్టడానికి నిర్ణయమైన చోట..!! నేను కారు దిగి ఆ జనం మధ్యలోకి వెళ్ళాను. వాళ్ళందరి మధ్యలో ఐలారం వెంకటేషు మరో ముగ్గురితో కలిసి నిరాహార దీక్షకు కూర్చున్నాడు.

“ఫ్యాక్టరీ గో బాక్...!!” జనాలు వెంకటేషుతో గొంతు కలుపుతున్నారు.

నన్ను రైలు ఎక్కించేముందు స్వామి చెప్పిన మాటలు నా గుండెల్లోనుంచి ప్రతిధ్వనించాయి – “కష్టం వచ్చిన ప్రతిసారీ దేవుడా అంటే దేవుడు రాడు చిన్నా... నేనే దేవుణ్ణి అయితే ఏం చేస్తాను అని ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం వుంటుంది... అప్పట్లో మీ వూర్లో నన్ను ముందుకు నడిపించింది కూడా ఆ ఆలోచనే... ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది కూడా అదే..”

స్వామి అనే చిన్న విత్తనంలో దాగివున్న నాయకుణ్ణి గుర్తించిన క్షణం అది. నేను కూడా వెంకటేష్ పక్కనే కూర్చోని వాళ్ళ గొంతులో గొంతు కలిపాను.

***
(నవ్య వార పత్రిక 22 జూలై 2015)

జ్ఞాపకాల వాసన

నా దగ్గర చాలా జ్ఞాపకాలు వున్నాయి. గుట్టలు గుట్టలుగా ఒకదాని మీద ఒకటి పడి! కొన్ని జేబులో కొన్ని పర్సులో… కాస్త పాతబడ్డవైతే అరమరలో, ఇంకా పురాతనమైనవి ఎక్కడో నూతిలోనో, పాత ఉత్తరాల కట్టలోనే, చాలాకాలంగా చూడని ఫోటో ఆల్బంలోనో ఎక్కడో వుంటాయి. హాలులో, బెడ్రూములో, వంటింట్లో ఎక్కడ పడితే అక్కడ! కొన్ని జ్ఞాపకాలు రకరకాల వస్తువులకు అతుక్కోని వుంటాయి. గరిటెకు కొన్ని, రేజర్ కి కొన్ని, వాడకుండా వదిలేసిన కాండోమ్ కి కొన్ని. కొన్నేమో గాల్లోనే వేలాడుతుంటాయి. ఇంక బాత్రూములో అయితే ఎన్నుంటాయో చెప్పలేను. అవన్నీ కడిగేసుకున్నవని నేననుకుంటాను. అవేమో తూముల్లోంచి బయటికి పోకుండా అక్కడే పడుంటాయి. తడిసిపోయి నానుతూ చిరాకేస్తుంది వీటన్నింటిని చూస్తే!!

ఎప్పుడన్న ఒకసారి ఏదన్నా ఒక జ్ఞాపకాన్ని తీసుకోని చూద్దామనుకుంటానా, దానికి అతుక్కోని ఇంకోటి వస్తుంది.దాన్ని అందుకుంటే ఇంకోటి అతుక్కుంటుంది. అలా అలా అక్కడ వున్నవన్నీ ఒకదానికి ఒకటి అతుక్కోని గుదిబండలా తయారయ్యి నా నెత్తిన పడతాయి. వీటిని కలిపి వుంచిన దారాన్ని తెంచి పడేద్దామని అనిపిస్తుంటుంది ఒకోసారి. కానీ ఆ దారం ఎక్కడుందో తెలిసి చావదు!

ఇలా కాదని ఒకసారి వాటన్నింటిని సర్ది పద్దతిగా అమర్చుకుందామనుకున్నాను. మంచి జ్ఞాపకాలకు చక్కగా అట్టలేసి అందంగా తయారు చేయాలి. పనికిరాని పిచ్చి జ్ఞాపకాలని వీలైతే తగలబెట్టేయాలి. కనీసం కనపడకుండా ఎక్కడన్నా దాచేయాలి. ఇదీ ప్రణాలిక. అనుకున్నట్టే ఓ టెబుల్ సొరుగులో వున్న జ్ఞాపకాలన్నీ సర్దాను. మంచివి చక్కగా షోకేసులో అమర్చిపెట్టాను. బాలేనివి ఎక్కడన్నా పడేద్దామని చూస్తున్నా. చెత్తబుట్టలో వేద్దామంటే అప్పటికే అక్కడ చాలా జ్ఞాపకాలు పేరుకుపోయి వున్నాయి. పరుపు ఎత్తి దానికింద పెడదామంటే అక్కడ కుళ్ళిపోయిన జ్ఞాపకాలు పేరుకుపోయున్నాయి. వీటిని ఏం చేద్దాంరా భగవంతుడా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అదిగో అప్పుడే వచ్చాడు వాడు!

వాడు వచ్చాడంటే నాకు వణుకు పుడుతుంది. వెధవ ఎప్పుడూ అంతే!

ఒకసారి ఇలాగే వచ్చాడు. ఆ రోజు నేను లాయరయ్యాను. నల్లకోటు అదీ వేసుకోను సెక్షన్ ఫోర్ట్వంటీ, త్రీనాటూ గట్రా నెంబర్లన్నీ దొర్లించుకుంటూ వాటి చుట్టూ తిరుగుతున్నాను. వాడు అప్పుడు వస్తాడని నాకు తెలుసు. వచ్చి రాగానే వాణ్ణి ముద్దాయి బోనులోకి ఎక్కించేసి “యువరానర్” అని గట్టిగా వాదించేయాలని నా ప్లాన్. వాడు వచ్చాడు. చూస్తే వాడూ నల్లకోటు, తెల్ల చొక్కా వేసుకోని వున్నాడు.

“ఇదేంట్రా? నువ్వూ లాయరేనా” అన్నా.

“ఒకసారి చూసుకో” అని కోటు చాటు నుంచి పెద్ద అద్దం తీశాడు. వాడి దగ్గర ఎప్పుడూ ఒక అద్దం వుంటుందని నాకు తెలుసు కాబట్టి నేను ఆశ్చర్యపోలేదు. కానీ అద్దంలో కనపడ్డ నన్ను చూసి ఆశ్చర్యపోయా. ఇప్పుడు నేను ముద్దాయి గెటప్ లో వున్నాను. చేతులకి బేడీలూ అవీ. ఎంత ప్రయత్నించినా నాకు ఒక్క సెక్షన్ కూడా గుర్తురాలేదు. ముఖానికి మసి పూసినట్లు నల్లగా వుంది.

వాడు గట్టిగా “యువరానర్” అన్నాడు.

“రేయ్.. వద్దురా... నన్ను వదిలేయ్” అన్నాను. వాడు ఒప్పుకోలేదు. వాదించాలన్నాడు.

“యువరానర్ నన్ను కాపాడండీ” అన్నాను జడ్జి వైపు తిరిగి. అప్పుడు చూస్తే వాడే జడ్జి.
ఇంకేం చేసేది? శిక్షవేసి పోయాడు. ఆ కోర్టు కాగితం కూడా ఎక్కడో జ్ఞాపకాల మధ్యలో కుక్కేసాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు.

“ఏం చేస్తున్నావ్” అన్నాడు.

“ఏం లేదే” అన్నా చేతులు వెనక్కి పెట్టుకోని. వాడు నా వెనకే వున్నాడన్న సంగతి గమనించుకోలేదు. ఓ కట్ట జ్ఞాపకాలను తీసుకున్నాడు. అవన్నీ పారేద్దామనుకున్నవే. ఓ మూడు నా ముఖం మీద కొట్టాడు. చిత్రం! అవి నాకు తగల్లేదు. నా నుదుటిలో నుంచి దూరి, మెదడులో చేరి పురుగులుగా మారిపోయాయి. లోపలెక్కడో తొలుస్తున్న బాధ. అక్కడితో ఆగాడా వాడు. మిగిలినవన్నీ ఇల్లంతా చల్లేసి పోయాడు.

వాడు వెళ్ళిపోయిన తరువాత కూడా ఇల్లంతా ఒకటే జ్ఞాపకాల వాసన. ఆ వాసనతో పడలేక ఎక్కడో మూల పడిపోయిన నాలుగు మంచి మంచి జ్ఞాపకాలను ఏరుకోని అక్కడ్నుంచి బయటపడ్డాను. దగ్గర్లో ఏదో పార్క్ కనపడితే అక్కడ చేరి, తెచ్చుకున్న మంచి జ్ఞాపకాలను లాన్ మీద మెత్తగా వుండేట్టు పరుచుకోని దాని మీద పడుకున్నాను.

నేను గమనించనేలేదు. నాలుగు మంచి జ్ఞాపకాలతో పాటు, నలభై చెత్త జ్ఞాపకాలు కూడా అతుక్కోని వచ్చినై. అవన్నీ కలిసి ఒక దుప్పటిలా మారి నా మీద పరుచుకున్నాయి. మళ్ళీ ఆ దరిద్రపుగొట్టు వాసన. వాడు వచ్చినట్లున్నాడు.

“మనం ప్రేమికులం” అన్నాడు.

“నేను ప్రియుణ్ణా” అడిగా.

“అవును. నేను ప్రేయసి” చెప్పాడు.

“ఐ లవ్యూ” అన్నా.

“అంటే?”

“అదే ప్రేమికులం అన్నావు కదా? అందుకే ప్రేమిస్తున్నానని చెప్పాను”

“ఏదీ ప్రేమించు”

“ఎనీథింగ్ ఫర్యూ డార్లింగ్” అన్నా.

“మాల్ లో షాపింగ్”

“ఓస్ అంతేనా?”

“బంగారం, ఒక ఫ్లాట్, ఒక బిజినెస్”

“తీసుకో బుజ్జీ నీకన్నానా? మరి నాక్కావల్సింది ఇస్తావా? ” అన్నా లస్టీగా

“మరి నాకో” వెనుక నుంచి వినపడింది. తిరిగి చూస్తే వాడే. “ఇప్పుడు పెళ్ళాన్ని” అన్నాడు.

“ఛీ ఎదవన్నర ఎదవా. ఏబ్రాసి నా కొడక. సుఖంగా వుండనీవారా నన్ను” బట్టలన్నీ విప్పేశా. ఒకో బట్ట విప్పుతుంటే ఒకో కొత్త బూతుమాట తన్నుకొచ్చింది. నా పెళ్ళాంగాడిని చావగొట్టా.
వాడు నవ్వేసి “పోయస్తా” అన్నాడు.

“మళ్ళీరాకురరేయ్ చెత్తనాయలా” అన్నా గట్టిగా. పార్కులో వున్నవాళ్ళంతా నన్నే చూస్తున్నారు. మళ్ళీ బట్టలేసుకోని బయల్దేరా.

వాణ్ణి తప్పించుకోవాలంటే ఊరు దాటి పోడమే మార్గమని ఓ బస్సెక్కా. వేరే వూర్లో బస్సు దిగగానే ఆటోవాడు తగులుకున్నాడు. మళ్ళీ వాడే. ఈ సారి ఆటోవాడయ్యాడు. కనపడగానే నమస్తే చెప్పి, ప్రయాణం ఎలా జరిగింది సార్ అని అడగాలా? అదేం లేదు.

“పక్క వీధికేగా? మూడొందలు ఇవ్వండి” అన్నాడు.

“నీకు బుద్ధుందా? పక్క వీధికి మూడొందలు అడుగుతున్నావ్? మీటరెంతవుతుందో తెలుసా?” గట్టిగా అరిచా. వాడు ఆటో దిగాడు.

“పోనీ లాడ్జిలో దిగుతారా? పది రూపాయిలివ్వండి చాలు. ఏ ప్రాబ్లం రాని లాడ్జి వుంది” అన్నాను నేను.
ఆగండాగండి. నేను కూడా కన్ఫూజ్ అవుతున్నా. అవును ఇదేంటి నా వంటి మీద ఖాకీ చొక్కావుంది? ఒహో! నేనే ఆటో డ్రైవర్. వాడు ప్యాసింజర్. అవును ప్యాసింజర్.

“ఏమే వస్తావా” అన్నాడు.

మళ్ళీ మారిపోయింది.

అంటే ఇప్పుడు నేను లం.. తప్పు తప్పు.. వేశ్య... ఊహూ కాదు కాదు కాల్ గర్ల్.
లాడ్జికి వెళ్ళాం. వాడు బట్టలు విప్పి దూకాలా? ఏం లేదు. నేనే విప్పుకున్నా. మళ్ళీ మారిపోయాం ఇప్పుడు నేను విటుడు వాడు సెక్స్ వర్కర్.. కాదు కాదు లం..

“ఏమే రోజుకి ఎంత మంది వస్తారు?” దాని దీన చరిత్ర తెలుసుకోని జాలిపడిపోవాలని నాకు ఆరాటం. మూడు వేళ్ళు చూపించాడు వాడు.. నాకు నచ్చలా. నాకు నచ్చలేదన్న సంగతి వాడికి తెలిసిపోయినట్లుంది. మిగిలిన వేళ్ళు కూడా తెరిచాడు. ఇంకో చేతిని కూడా తెరిచి చూపించాడు.

“అయ్యో పాపం” అన్నాను. “అసలెందుకు దిగావు ఈ రొంపిలోకి?” అడిగాను. అది ఏదో దీనగాధ చెప్తుందని ఎదురు చూశా.

“నా మొగుడే నన్ను తార్చాడు. ఇప్పటికీ వస్తాడు. వాడికి ఫ్రీ. మిగిలిన వాళ్ళ ఇచ్చినదాంట్లో వాడికి కమిషన్. ఇద్దరు పిల్లలు. స్కూల్ కి వెళుతున్నారు. వాళ్ళకోసమే నేను పక్కలెక్కుతున్నాను” ఏడుస్తూ చెప్పాడు వాడు.

“అయ్యయ్యయ్యో.... లోకం ఎంత దుర్మార్గంగా మారిపోయింది. సరే. నువ్వు నా పక్కలో పడుకోకపోయినా సరే ఇదిగో వెయ్యి రూపాయలు. ఉంచుకో” అనేసి నేను బయటికి నడిచాను. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది.
నేను కూడా ఏడుస్తున్నాను. కాదు నేనే ఏడుస్తున్నాను. ఒక్కసారి నా దొంగ ఏడుపు ఆపి గట్టిగా నవ్వుకున్నాను.

“పిచ్చి నా బకరా... పడక మీద ముండమాటలు విని వెయ్యి రూపాయిలిచ్చాడు” అన్నాను గట్టిగానే. డబ్బులు జాకెట్లో తోసుకుంటున్నప్పుడు అర్థం అయ్యింది. బయటికి వెళ్ళింది వాడు!! వాడు విటుడు. నేను మళ్ళీ ఇక్కడ మంచం మీద వేశ్యనయ్యాను.

థూ..!! ఈడి బతుకు చెడ!!

లేచి అక్కడ్నుంచి పారిపోయాను. ఒకటే పరుగు. వాడు దొరకలేదు. చేతిలో చూసుకుంటే మా వూరికి టికెట్. తప్పక రైలెక్కా.

నా ఎదురుగా ఒక ఆంటీ కూర్చోని వుంది. జాగ్రత్తగా గమనించి చూశా. అనుమానం మొదలైంది. వాడే అయ్యుటాండని అనుకున్నా. ఆమె చదువుతున్న పుస్తకం దించి నన్ను చూసి చిలిపిగా నవ్వింది.

రేయ్.. నాకు తెలియదనుకున్నావా. ఈ సారి చచ్చినా నీ మాయలో పడను అనుకున్నా. నేను నవ్వలేదు. ఆంటీ ఏమనుకుందో మళ్ళీ పుస్తకంలో తల దూర్చేసింది. నేనే గెలిచా. వాడు ఓడిపోయాడు. రైలు పొందుగుల స్టేషన్ దాటి ముందుకు పోతోంది.

ఇంతలో ఏదో జ్ఞాపకాల వాసన. ఉడకబెట్టిన శెనక్కాయల వాసన. శెనక్కాయలమ్మే నడివయసామె వచ్చింది. బుట్ట దించి నా ముందు పెట్టింది. చూద్దును కదా బుట్టనిండా నా జ్ఞాపకాలే!! వాడు శనక్కాయల రూపంలో వచ్చాడా? కాదు, కాదు..!! శేనక్కాయలమ్మేదానిలాగా.. అవును వాడే. ఆమె చీర గుండెల మీద నుంచి జారిపోయి ఇంకేవో కొత్త జ్ఞాపకాలను నా ముందు పరిచింది. వాడు నా చొక్కా పట్టుకున్నాడు.

“ఏరా ఎలా కనిపిస్తున్నారా నీకు?” అంటూ నా దవడలు వాచిపోయేలా కొట్టాడు.

“నేనేం చేశాను” అన్నాను అమాయకంగా.

“ఏమైందమ్మా?” అంది ఎదురుగా కూర్చోనున్న ఆంటి.

“వీడు నా నడుం మీద చెయ్యేసి గిల్లాడు. ఎదవ నా కొడుకు” అంది మరో రెండు దెబ్బలు కొట్టి.

నేను ఆమె నడుం మీద చెయ్యేసానా? అబద్దం అంతా అబద్దం అందామనుకున్నా. చుట్టూ వున్న జనం నన్ను పురుగుని చూసినట్లు చూస్తున్నారు. చూస్తున్నారా? లేకపోతే నేనే అలా అనుకున్నానా? అంతా పిచ్చి. ఎవడికి పట్టింది? అందరూ చిలిపిగా నవ్వుతున్నారు. ఎవరో పైన బెర్తులో గట్టిగానే నవ్వారు. తల ఎత్తి చూశా. వాడే. నా ఎదురుగా వున్న ఆంటీ పైన బెర్తులో పడుకోని నవ్వుతున్నాడు. నవ్వేటప్పుడు వాడి చూపంతా ఆంటీ మీదే వుందన్న సంగతి నేను మాత్రమే గమనించాను.

ఇంక అక్కడే వుంటే ప్రమాదమని అర్థం అవడంతో ట్రైన్ లో నుంచి దూకేసి, ఎగురుకుంటూ సికింద్రాబాద్ చేరుకున్నాను. అక్కడ దిగగానే నేరుగా ఇంటికి పోయాను.

ఇప్పుడు నాకు అర్జంటుగా కావాలనిపించింది. పెళ్ళాం ఒకతి వుందిగా ఇంటిలో. నాకు మాత్రమే సొంతమని నేను నమ్మే ఒక జీవం ఇంట్లోనే వుంది కదా. ఇంట్లో నేను నా పెళ్ళాంతో వుంటే వాడు వస్తాడన్న భయం కూడా వుండదు. అదీ నమ్మకం. అదీ ఒప్పందం.

“రావే” అన్నాను ఇంట్లోకి అడుగుపెడుతూనే.

“వద్దండీ” అంది పెళ్ళాం.

“నీయమ్మ రాయే” నేను చొక్కా విప్పాను

“ఒంట్లో నలతగా వుందండీ”

“దొంగ వేషాలెయ్యకే. దొంగముండా” నేను బనీను విప్పాను.

“అయ్యో.. ఏమిటండీ ఈ పని”

“నీ యమ్మని...” ప్యాంటు కూడా విప్పాను.

ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు. పదకొండు నిముషాల తరువాత వాడు నాపై నుంచి లేచాడు. నా ఒళ్ళంతా నొప్పులు. ఎక్కడెక్కడో చురుక్కుమంటోంది. గోళ్ళు దిగాయో, పళ్ళు దిగాయో. తొడల మీద జిగటగా రక్తం.
వాడు నవ్వాడు.

“నేను కదరా అక్కడుండాల్సింది” అన్నాను బాధతో మూల్గుతూ.
వాడు మళ్ళీ నవ్వాడు.

“వస్తా” అన్నాడు వెళ్ళిపోతూ.

“మళ్ళీ రావద్దురరేయ్ ముండనాయాలా” అరిచా గట్టిగా. నొప్పితో స్పృహ గిలగిలా తన్నుకుంటూ వుండిపోయా.
వాడు వదిలిపెట్టిన పురుగులు ఇంకా మెదడులోనే తిరుగుతున్నాయి. క్రమక్రమంగా అవి నా బుర్రలో తొలవటం మొదలుపెట్టాయి. జ్ఞాపకాల పురుగులు. ఎలా వదిలించుకోవాలి? ఏం చేస్తే ఇవన్నీ చచ్చిపోతాయి? వాడు మళ్ళీ రాకుండా, ఇవన్నీ లేకుండా చెయ్యాలి.

నేను లేచాను. శరీరంలో నొప్పుల స్థానంలో ఎక్కడలేని బలం పుట్టుకొచ్చింది. ఇంట్లో వున్న జ్ఞాపకాలన్నీ సేకరించడం మొదలుపెట్టాను. చీపురుతో ఊడ్చాను, బూజు కర్రతో దులిపాను. గుట్టగుట్టలుగా జ్ఞాపకాలు పేరుకున్నాయి. కొన్నింటిని బలంగా కొడితేకానీ కదలేదు. కొన్ని తెగిపడ్డాయి. అలా తెగిపడ్డవాటి చివర్లలో రక్తం కనపడేకొద్దీ నాలో కసి ఇంకా పెరిగిపోతోంది. అన్నింటినీ ఒక చోట చేరి అగ్గిపుల్ల వెలిగించాను.

“వద్దురా... ప్లీజ్” అన్నాడు వాడు.

“నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఈ రోజు నీకు మూడింది” అన్నాను వెలిగించిన అగ్గిపుల్లని జ్ఞాపకాల మీద పెడుతూ.

భగ్గున అంటుకుంది. హాహాకారాలు. భగభగ మంట పైకి లేచింది. వళ్ళంతా చురచురలాడుతోంది. అబ్బా... ఇదేంటి నాకే చురచురలాడుతోంది. ఇదేమిటి మంటలన్నీ నా మీద ఉన్నాయి? తగలబడుతోంది నేనా? జ్ఞాపకాలు కావా?.
వాడు ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. ఇప్పుడు నా జ్ఞాపకాలు ఎక్కడున్నాయో కనపడలేదు. నేనే కాలుతున్నాను. వాడు నవ్వుతున్నాడు.

“జ్ఞాపకాలని కదరా తగలబెట్టాను” అన్నాను నేను.

“నువ్వే నీ జ్ఞాపకానివి” అన్నాడు వాడు వెళ్ళిపోతూ.

వాడు ఇంక తిరిగిరాకుండా తలుపులేసేశాను. నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి.

<***>
(ఈమాట వెబ్ మాసపత్రిక, సెప్టెంబర్ 2014)
http://eemaata.com/em/issues/201409/4895.html