మా వూర్లో చాలామంది ఆయన్ని దేవుడిలా పూజించేవాళ్ళు. సుఖాల్లో దేవుణ్ణి
మర్చిపోయి కష్టాల్లో దేవుడా అని అందరూ అన్నట్టుగానే ఇప్పుడు మా వూళ్ళో కష్టం వచ్చింది
కాబట్టి ఆయనతో అవసరం పడింది. వెంటనే ఆయన్ను వూర్లోకి తీసుకొస్తే కానీ అన్ని
ఇబ్బందులు తొలగిపోవని అందరూ కలిసి తీర్మానించారు. అందుకు నన్ను రాయబారిగా
ఎన్నుకున్నారు.
ఆయన పేరు కరుప్పుస్వామి. మా వూళ్ళో అంతా స్వామీ అనే పిలిచేవాళ్ళం. గట్టిగా
అయిదడుగులమీద అంగుళం కూడా లేకుండా పొట్టిగా, నల్లగా మా గుళ్ళో వేణుగోపాలస్వామి
లాగా వుంటాడు. తమిళ్‍నాడులో కోయంబత్తూరు దగ్గర ఏదో వూరు తన సొంత వూరని
చెప్తుండేవాడు. ఇప్పుడు కోయంబత్తూరులోనే వున్నాడని తెలిసింది. ఇదుగో అక్కడికే నా
ప్రయాణం.
నిజానికి ఆయనేం దేవుడు కాదు, బాబా అంతకన్నా కదు. ఒక మామూలు మనిషి. అలాంటిది
ఇంత మంది ఆయన్ని దేవుడిలా చూస్తున్నారంటే అది ఆయన మా గ్రామానికి చేసిన ఉపకారం
వల్లనే. రైలు ముందుకు పరుగెడుతుంటే వెనక్కి వెళ్తున్న తాటి చెట్ల వెంటే నా మనస్సూ
వెనక్కి పరుగు తీసింది.
దాదాపు పదిపదిహేనేళ్ళ క్రితం మా వూర్లో నీటికి కటకటగా వుండేది. ఎండాకాలం
వచ్చిందంటే బావులు, చలమలు, చెరువులు అన్నీ ఇంకిపోయేవి. ఆడవాళ్ళు మైళ్ళ దూరం నడిచి
ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు తెచ్చి, మట్టసంగా వాడుకునేవాళ్ళు. చుక్క నీళ్ళైనా
అమృతంతో సమానంగా చూసుకునే రోజులవి.
సరిగ్గా అలాంటి ఓ ఎండాకాలంలోనే మా వూర్లో అడుగుపెట్టాడు కరుప్పుస్వామి. ఆ రోజు
నాకు బాగా గుర్తుంది, నాన్న పంచాయితీ మీటింగులో వున్నాడు. నేను పంచాయితీ ఆఫీసు బయట
అరుగుమీద ఇంకెవరో పిల్లలతో ఆడుకుంటున్నాను.
“బాబూ.. సర్పంచ్ సారు యవరు... ఎంగే” అంటూ తమిళ్ తెలుగు కలిపి మాట్లాడుతూ ఆ
నల్లటి మనిషి నా దగ్గరకు వచ్చాడు. నేను లోపలికి తీసుకెళ్ళి చొరవగా నాన్న ఒళ్ళో
చేరి, “మా నాన్నే ప్రసిడెంట్” అని చెప్పాను.
ఆయన నమస్కారం చేసి తన పేరు వూరు వివరాలు చెప్పాడు. “చేయూత” అని ఏదో స్వచ్చంద
సేవా సంస్థలో పనిచేస్తున్నానని, వాళ్ళే ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారని చెప్పాడు.
“చేయూత.. ఈ పేరెక్కడా వినలేదే” అన్నాడు లక్కరాజు మామయ్య నాన్న వైపు చూస్తూ.
“మొన్న నన్ను అడిగారులే... అయినా ఇట్టాంటివి సవాలక్ష వున్నాయి బావా... ఫారిన్
నుంఛి డబ్బులొస్తాయి... వాటిని ఇక్కడ స్కూల్ కట్టేదానికో, అనాధాశ్రమం కట్టేదానికో
వాడతారు... కొంతలో కొంత వాళ్ళూ మిగిల్చుకుంటారు..” అన్నాడు నాన్న హేళనగా స్వామిని
చూస్తూ. స్వామి ఏమాత్రమ్ నొచ్చుకోకుండా నవ్వేసి,
“ఏడైనా ఉండేదానికి వీడు దొరుకుతుందా?” అని ఆ వివరాలు అడిగాడు.
“రేయ్ మాధవా... ఈయనతో పాటే వెళ్ళి ఆ మాచారం శ్రీరాములుగారింట్లో దక్షిణం
పోర్షన్ చూపించిరా..” అంటూ నన్ను పురమాయించాడు నాన్న. ఎండ ఎక్కువగా వున్నా బయట తిరిగేందుకు అనుమతి దొరికిందని సంతోషంగా ఛంగు
ఛంగున పరుగెత్తాను.
స్వామి నేరుగా శ్రీరాములుగారింటికి పోనివ్వకుండా వూరంతా చూపించమన్నాడు. అదే
అదనుగా నేను ఆయన్న వూరంతా తిప్పుతూ మా స్కూలు, స్నేహితుల ఇళ్ళు, నా కిష్టమైన
చింతచెట్టు, మామిడి తోపు, పెద్దబజారు, టూరింగ్ టాకీసు అన్నీ చూపించాను. దారిలో
డాక్టర్ ఎక్కడున్నాడనీ, పశువుల ఆసుపత్రి గురించి, పాల డైరీ గురింఛి అడిగి
తెలుసుకున్నాడు. ఎండకు నేను అలసిపోయాను కానీ, ఆయన కొంచెం కూడా నలగలేదు.
మాచారం శ్రీరాములుగారి ఇల్లు స్వామికి నచ్చింది. అందులోనే దిగాడు.
ఆ తరువాత వూర్లో అప్పుడప్పుడు కనిపించేవాడు. ఏవో కాగితాలు పట్టుకోని ప్రతీ
ఇంటికీ తిరిగి వివరాలు రాసుకునేవాడు. పంచాయితీకి వచ్చి కరణం బాబాయ్ దగ్గర
రికార్డులు చూసి ఏవేవో లెక్కలు రాసుకునేవాడు. ఒక్కోసారి వాళ్ళ ఆఫీసు వాళ్ళను
జీపులో తీసుకొచ్చి వూరంతా చూపించేవాడు. అట్టాంటప్పుడు నేను ఎక్కడైనా కనపడి అడిగితే
జీపులో ఎక్కించుకోని తిప్పేవాడు. ఆ వచ్చిన ఆఫీసువాళ్ళకి కూడా నేను చింతచెట్టు,
మామిడి తోపు చూపించేవాడిని. ఒక్కోసారి జీపులో ఫారిన్ వాళ్ళు వుంటే మాత్రం భయం వల్ల
పలకరించేవాణ్ణి కాదు.
ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది. ఆ వయసులో అంతకన్నా తెలిసే అవకాశంలేదు కానీ,
వయసు పెరిగే కొద్ది ఆయన చేసిన పనులు, వూరిలో వస్తున్న మార్పులు అర్థం అవసాగాయి.
జనం ఆయనకి ఇచ్చే గౌరవం, మర్యాద కూడా క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. విత్తనంలో
నుంచి మొలకెత్తిన మొక్కని రోజూ చూస్తే పెరిగినట్లు ఎట్లా తెలియదో వూరిలో
క్రమక్రమంగా జరుగుతున్న అభివృద్ధిని కూడా తెలుసుకోలేక పోయాను. ఆయన మాత్రం
విత్తనంలో దాగున్న చెట్టుని, ఆ చెట్టు విరబూసే వసంతాన్ని కూడా చూసినవాడిలా తన పని
తాను చేసుకుపోయేవాడు.
ఒకసారి ఆగష్టు పదిహేనున మా స్కూల్లో జరిగిన ఫంక్షన్ కి ఆయన్ను పిలిచారు. మా
ప్రిన్సిపాల్ ఇజ్రాయేల్ స్వామిని చాలా పొగిడారు. భగీరదుడనీ, కాటన్ దొర అని
చెప్పాడు. కాటన్ దొర అంటే అప్పుడు నాకు తెలియదుకానీ భగీరదుడి గురించి పాఠం
చదివాను. బహుశా వూర్లోకి నీళ్ళు తెప్పిస్తున్నాడేమో అనుకున్నాను. ఆ రోజు స్వామి
కూడా మాట్లాడాడు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తొవ్వాలనీ, నీటిని వృధా చెయ్యకుండా
పెద్దవాళ్ళకు పిల్లలే చెప్పాలని చెప్పాడు. అప్పటికి ఆయన తెలుగు స్పష్టంగా
మాట్లాడటం కూడా నేర్చుకున్నాడు.
ఆ తరువాత నేను గుంటూరులోఇంటర్మీడియట్ కాలేజీలో చేరి, దాదాపు సంవత్సరం తరువాత
ఎండాకాలం శెలవలకి ఇంటికి వచ్చాను. వూరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రతి
ఎండాకాలం తలమీద చెంగు కప్పుకోని, తలపైన బిందలతో కనిపించే ఆడవాళ్ళు ఎవ్వరూ
కనపడటంలేదు. కావడితో నీళ్ళు మోసే కరీం భాయ్ సైకిల్ రెపేర్ షాప్ పెట్టుకున్నాడు.
ఇంటికి వెళ్ళగానే అమ్మ నా చేతిలో వున్న సామాను అందుకోని – “అంతా వూరికి పడమట
వైపు వున్న బీడుభూమి దగ్గర చెరువు తొవ్విస్తున్నారని చెప్పింది”. నేను హడావిడిగా సైకిల్ మీద వెళ్ళి, అక్కడ కనిపించిన
దృశ్యాన్ని చూసి నమ్మలేనట్లు ఆగిపోయాను. ఒకప్పుడు గొడ్లను, మేకలను, గొర్రెలను
మేతకు తీసుకొచ్చే ప్రదేశమది. ఇప్పుడు దాదాపు చెరువు పూర్తికావస్తోంది. వూరి జనమంతా
అక్కడే పని చేస్తున్నారు. అందరినీ ఉత్సాహపరుస్తూ తిరుగుతూ స్వామి..!!
మా వూరికి ఉత్తమ పంచాయితీ అవార్డ్ వచ్చిందని, పత్రికలవాళ్ళు నాన్నతో
మాట్లాడుతున్నారు. స్వామి నా దగ్గరికి వచ్చి – “పెద్దవాడివి అయ్యావే..” అని మాత్రం
అన్నాడు తల నెమురుతూ. నాన్న స్వామి పేరు చెప్పాడనుకుంటా ప్రెస్ వాళ్ళు ఈయన దగ్గరకు
వచ్చారు.
“గవర్నమెంటులో ఇన్ని పథకాలు వుంటే మీరు అవి వాడుకోకుండా.. మీ అంతట మీరే అంతా
కలిసి ఇలా చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..?” అడిగారు వాళ్ళు.
స్వామి నవ్వేసి చెప్పాడు – “నేను గవర్నమెంటు సహకారం తీసుకొలేదని
ఎందుకనుకుంటున్నారు? ఈ గ్రామానికి పంచాయతే గవర్నమెంట్... ఈ ప్రజలే గవర్నమెంట్...
ఇదే గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం..”
చెరువు నిర్మాణం పూర్తి కాగానే స్వామికి మా ఊరి నుంచి వేరే వూరుకి బదిలీ
అయ్యింది.
***
కోయంబత్తూరులో ట్రైన్ ఆగింది. నేను ప్లాట్ ఫారమ్ మీద దిగిన రెండు నిముషాల్లోనే
స్వామి నా దగ్గరకు వచ్చాడు.
“నమస్కారమండీ సర్పంచిగారూ... బాగుండారా?” అన్నాడు లుంగీ పైకి కట్టి సామాను
పైకెత్తుకుంటూ.
అప్పటికీ నేను “వద్దు స్వామీ..” అంటూ వారించబోయాను..!
“ఏం ఫర్లేదు చిన్నా... రా రా... అన్నట్టు మొన్నే మీ ఐలారం వెంకటేషు
మాట్లాడాడు... అప్పుడే తెలిసింది నువ్వు సర్పంచ్ అయ్యావనీ..” చెప్పాడు ముందుకు
నడుస్తూ.
ఇంటికి తీసుకెళ్ళి భార్యని పరిచయం చేశాడు. ఆమె చేతి తమిళ వంట, నాకొసం స్వామి ప్రత్యేకంగా
చేసిన తెలుగు వంట కలిపి తినేసరికి కడుపు నిండిపోయింది. వరండాలో కూర్చోని
తొమలపాకులు నములుతూ మాట్లాడుకున్నాం.
“వెంకటేషుతొ మాట్లాడానన్నారుగా... విషయం తెలిసే వుంటుంది..” అన్నాను
“ఏ విషయం చిన్నా? వెంకటేషు మామూలు విషయాలు మాట్లాడాడు తప్ప ఏం చెప్పలేదే?” అన్నాడు.
వెంకటేషు స్వామి ప్రియ శిష్యుడు. అలాంటిది ఫోన్ చేసి కూడా ఏమీ చెప్పలేదంటే నాకు
ఆశ్చర్యంగా వుంది.
“మా వూరి దగ్గర్లో ఒక కూల్ డ్రింక్ ఫాక్టరీ పెడుతున్నారు...” చెప్పాను సూటిగా.
భూగర్భజలాల గురించి క్షుణ్ణంగా తెలిసిన స్వామికి, ఆ ఫాక్టరీ వల్ల వచ్చే అనర్థం ఏమిటో
వివరించాల్సిన పనిలేదు అనుకున్నాను.
స్వామి క్షణం మాట్లాడకుండా వుండి, గట్టిగా నిట్టూర్చి – “పోనీలే పది మందికి
వుద్యోగాలైనా వస్తాయి..” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను.
“ఏమిటి స్వామీ అలా అంటారు... అక్కడ ఫాక్టరీ పెడితే ఇన్ని సంవత్సరాలుగా మనం
పెంచుకున్న భూగర్భ జలాలు ఇంకిపోతాయి... వూరి మళ్ళీ పది సంవత్సరాలు
వెనక్కిపోతుంది...” అన్నాను ఆవేశంగా.
“అయితే ఏమంటావు?”
“మీరు వచ్చి ఏదైనా సలహా చెప్తారేమోనని వూరు వూరంతా ఎదురు చూస్తోంది...”
చెప్పాను.
ఆయన నవ్వి మళ్ళీ – “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా...”
అంటూ పాటపాడాడు.
“ఏంటి స్వామీ... మీలాంటి వాళ్ళు పూనుకుంటే కదా... ఆలోచించండి ఒక్క సంవత్సరంలో ఇన్ని
రోజులు మీరు, మన వూరి జనం పడ్డ కష్టానికి ఫలితమనేదే లేకుండా పోతుంది..” కొంచెం
కోపంగానే అడిగాను నేను.
“ఫలితం లేకుండా పోతుందని అనుకోడానికి నేను ఆ ఫలితం ఆశించి కష్టపడలేదు కదా
చిన్నా... అప్పుడు ఒక ఆశయం కోసం కష్టపడటం మాత్రమే నేను చేసింది... అప్పుడు అది నా
వుద్యోగ ధర్మం కూడా... ఫలితం దానంతట అదే వచ్చింది...” అన్నాడు నవ్వుతూ.
“ఏమిటండీ కర్మ సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు? వూర్లో నీటి కష్టం తీర్చడానికి
వచ్చిన కాటన్ దొర మీరేనని వూరంతా అనుకుంటుంటే మీరు కాదంటారేమిటి?”
“వూర్లో ఇబ్బంది తీరింది నా వల్లే అని మీరు అనుకుంటుంటే అది మీ పొరపాటు.
వూరంతా కలిసి ఆ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని అనుకున్నారు కాబట్టే అది
సాధ్యమయ్యింది. నేను కేవలం దారి చూపించాను..” చెప్పాడు స్వామి
“సరే మీ మాటే కరెక్ట్ అనుకుందాం... మీరు చేసినా, వూరంతా కలిసి చేసినా ఒక ఫలితం
వచ్చింది కదా... దాన్ని నిలబెట్టుకోడానికైనా మళ్ళీ కష్టపడాలి కదా?” వాదించాను
నేను.
“అదే చెప్తున్నాను ఫలితం ఆశించో, ఫలితాన్ని నిలబెట్టుకోడానికో కాదు పని
చెయ్యాల్సింది... పని చెయ్యాలి అంతే... మనం చెయ్యాల్సిన పని చెయ్యడం వల్ల ఏం
జరుగుతుందే అదే ఫలితం..” అన్నాడు.
ఇక వాదించి ప్రయోజనం లేదని అర్థం అయ్యి లేచి నిలబడ్డాను.
“అదే మీ నిర్ణయమైతే ఇక బయల్దేరతాను..” చెప్పాను కటువుగా.
ఆయన చిన్నగా నవ్వి, “నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు నువ్వు... వూరంతా కలిసి
పని చేస్తే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు అని మీకు చేసి చూపించాను... అంతే కానీ
మీకు కష్టం వచ్చినప్పుడల్లా వచ్చి ఆదుకుంటానని చెప్పలేదు.” అన్నాడు. ఆయనకి
నమస్కరించి వెంటనే బయల్దేరాను.
***
నేను ఎక్కిన కారు మా వూరి వైపు దూసుకుపోతోంది. వూరి పొలిమేరలో అమ్మోరి జాతరకు
కదలివచ్చినట్లు జనం. సరిగ్గా కూల్ డ్రింక్ ఫాక్టరీ కట్టడానికి నిర్ణయమైన చోట..!!
నేను కారు దిగి ఆ జనం మధ్యలోకి వెళ్ళాను. వాళ్ళందరి మధ్యలో ఐలారం వెంకటేషు మరో
ముగ్గురితో కలిసి నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
“ఫ్యాక్టరీ గో బాక్...!!” జనాలు వెంకటేషుతో గొంతు కలుపుతున్నారు.
నన్ను రైలు ఎక్కించేముందు స్వామి చెప్పిన మాటలు నా గుండెల్లోనుంచి
ప్రతిధ్వనించాయి – “కష్టం వచ్చిన ప్రతిసారీ దేవుడా అంటే దేవుడు రాడు చిన్నా...
నేనే దేవుణ్ణి అయితే ఏం చేస్తాను అని ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం
వుంటుంది... అప్పట్లో మీ వూర్లో నన్ను ముందుకు నడిపించింది కూడా ఆ ఆలోచనే...
ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది కూడా అదే..”
స్వామి అనే చిన్న విత్తనంలో దాగివున్న నాయకుణ్ణి గుర్తించిన క్షణం అది. నేను
కూడా వెంకటేష్ పక్కనే కూర్చోని వాళ్ళ గొంతులో గొంతు కలిపాను.
***
(నవ్య వార పత్రిక 22 జూలై 2015)