బలి చక్రవర్తి కూతురు రత్నమాల తన తల్లి కైతవి పక్కనే నిలబడి ఆ మనోహర దృశ్యాన్ని చూసింది. అమాయకంగా అర్థిస్తూ నిలబడ్డ ఆ బాల వటువును చూడగానే రత్నమాలకు చిత్రంగా మాతృవాత్సల్యం పొంగుకొచ్చింది. ఆ చక్కని బిడ్డడు తన పుత్రుడే అయితే తన స్తన్యమిచ్చి లాలించాలనిపించిందామెకు.
మూడొవ అడుగు బలి తలపై పెడుతూ వామనుడు ఆమె వైపు చూసి తథాస్తు అన్నట్టు నవ్వాడు.
***
***
ఎన్నడూ లేనిది పార్వతి కొలనులో శివపూజకై నిర్దేశించిన పూలు మాయమైనాయి. పార్వతి కోపంతో దుర్గైంది.. కాళికైంది.. ఆ పని చేసినవాడు కొంగరూపంలో తిరిగే రాక్షసుడు కావాలని శపించింది. శివార్చనకే ఆ పూలు కోసిన గంధర్వుడు అదేమి తెలియక పరమేశ్వరుడి పాదాలపై ఆ పూలు వుంచి నమస్కరించాడు. అన్నీ తెలిసిన సర్వేశ్వరుడు మూడు నేత్రాలు మూసుకొని కేశవ స్తుతి చేసాడు.
***
మహర్షి ద్రోణుడు అగ్నిని ఆవాహన చేసాడు. ఆయన ముందున్న సమిధలు భగ్గున మండాయి. ఆ ఋషి పత్ని ధర కంట కన్నీరు వర్షిస్తోంది. ఇద్దరూ అగ్నిహోత్రం చుట్టు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తూ నిలబడ్డారు.
"దేవాది దేవా.. సంతానంకోసం అలమటించిపోతున్నాము.. ఇన్నేళ్ళుగా చేసిన తపస్సు నీలో కరుణ కలిగించలేదా ప్రభూ.. మా అత్మాహుతితోనైనా నీకు దయ కలిగితే మరుజన్మలోనైనా పుత్రభాగ్యాన్ని ప్రసాదించు తండ్రి.." అంటూ ఇద్దరూ వేడుకున్నారు. ఆ పై ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు.
***
ఆ రోజు నారదుడు సత్యలోకం చేరేసరికి జయవిజయులు విష్ణుమూర్తికి ప్రణమిల్లుతూ కనపడ్డారు.
"స్వామీ.. సనకసనందులను అడ్డగించిన పాపం మీ వియోగానికి కారణమౌతుందని తెలిస్తే.. వారిని అడ్డగించేవారమే కాదు. వారి శాపాన్ననుసరించి హిరణ్యాక్షహిరణ్యకశపులుగా, రావణకుంభకర్ణులుగా మీకు విరోధులమై మీచేతే వధించబడ్డాము. ఇక మా వల్లకాదు.. విష్ణుద్వేషులమై మిగిలిన ఆ ఒక్క జన్మా వెంటనే ఆరంభిస్తాము.. మమ్ములని వధించి శాశ్వత విష్ణుసేవా భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభూ.." అంటూ వేడుకొని వెళ్ళిపోయారు.
నారదుడు విష్ణుసంకీర్తనం చేసి నమస్కరించాడు.
"దేవదేవా.. ఏనాడు లేనిది తాపసిని నాకు కోపం కలిగింది స్వామీ.. మునుపు మిమ్మల్ని దర్శించి వెళ్తుండగా నగ్నంగా విహరిస్తున్న కుబేరపుత్రులు నలకుబేరుడు, మణిగ్రీవుడు కనిపించారు. నన్ను చూసి, తొలగక, నా ఆగ్రహానికి కారణమయ్యారు. వారిద్దరిని మద్దిచెట్లు కమ్మని శపించాను. నా చేత ఈ పని చేయించటంలో అంతరార్ధమేమిటి జగన్నాటక సూత్రధారి..?" అని ఆడిగాడు.
విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి అన్నాడు -
"నీవల్ల శాపంపొందిన కుబేరపుత్రులే కాదు నారదా.. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి ఆరుగ్గురు కొడుకులు అనేకానేక జన్మలెత్తుతూ బ్రహ్మ విధించిన శాపవిమోచనానికి ఎదురుచూస్తున్నారు.. సహస్రాక్షుడనే రాజు రాక్షస రూపంలో శాపవిముక్తికై వేచివున్నాడు.."
"ఇంతమంది శాపగ్రస్తులు ఏ కథకి నాంది పలుకుతున్నారు దేవా.."
"శాపగ్రస్తులేకాదు నారదా, వరప్రసాదులు కూడా వున్నారు.. సూర్యుని కుమార్తె కాళింది నన్ను వివాహమాడాలని వరం పొందింది. తరువాతి అవతారంలో ద్వంద యుద్ధం చేస్తానని జాంబవంతుడికి మాట ఇచ్చాను.."
"నారాయణా.. అయితే ద్వాపర యుగానికి దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారభమైనట్లేనా..."
విష్ణుమూర్తి నవ్వుతూ లక్ష్మీదేవి వైపు చూసాడు. ఆమె చిరునవ్వుతో సమ్మతించి అదృశ్యమైంది.. ఆమెతో పాటే విష్ణుమూర్తి కూడా. అటుపై ఆదిశేషుడు కూడా అంతర్ధానమయ్యాడు. నారదుడు నిష్ఠగా నారాయణ మంత్రం పఠిస్తున్నాడు.
***
బలిపుత్రిక రత్నమాల పూతన అనే రాక్షసిగా, శివపూజకై పార్వతి కొలనులో పూలుకోసిన గంధర్వుడు బకమనే రాక్షసుడిగా, సహస్రాక్షుడు తృణావర్తుడనే రాక్షసుడిగా పుట్టి కంసుడి దగ్గర చేరారు. జయవిజయులు శిశుపాల దంతవక్తృలుగా పుట్టి విష్ణుదూషణ చేయసాగారు. ధరాద్రోణులు యశోదా నందులై గోకులంలో పుట్టారు. నారద శాపంతో మద్దిచెట్లైన కుబేరపుత్రులు నందుని పెరట్లో పెరిగి విష్ణుస్పర్శకై వేచివున్నారు. లక్ష్మీదేవి రుక్మిణిగా జన్మించింది. అదితికశ్యపులు దేవకీ వసుదేవులుగా జన్మించారు. పూర్ణిమంతుడు, పుర్ణిమాసాది మరీచి పుత్రులు ఆరుగ్గురు, షడర్భకులుగా దేవకి గర్భమున ఒక్కొక్కరే జన్మించారు. ఏడొవ గర్భమున ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడు. అష్టమ గర్భంలో సాక్షాత్ శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు.
9 వ్యాఖ్య(లు):
చాలా బాగుందండీ.
కృష్ణావతారంలో చంపిన రాక్షసుల పూర్వ వృత్తాంతాలు ఏ పురాణంలో ఉన్నాయో తెలీదు కానీ, తనను చూసి మాతృవాత్సల్యంతో పొంగిన స్త్రీమూర్తికి విష్ణుమూర్తిచ్చిన వరం, మరుజన్మలో రాక్షసిగా పుట్టి తన చేతిలో చావటమా.
మిగతావారు చేసినవి పెద్ద నేరాలు కాకపోయినా, కనీసం వారు శాపాలకు గురవ్వటం జరిగింది. కానీ రత్నమాల చేసిన నేరమేమిటని వారిలాగే రాక్షసిగా పుట్టింది.
తెలియని విషయాలు చాలా చక్కగా తెలియజేసారు
నాగమురళి, రమణి
నెనర్లు
చైతన్య కృష్ణ,
ఈ కథకి ఆధారం డా.బూదరాజు రాధాకృష్ణమూర్తి గారి పురాతన నామకోశము అనే పుస్తకం. భాగవతంలోని పాత్రలపేర్లను అనుసరించి వివరాలను తెలుసుకొని కథలా రాశాను. వారిచ్చిన ఆధార రచనలు భాగవతం, భారతం, హరివంశం. ఇక పూతన కథకి ఆధారం బ్రహ్మ వైవర్త పురాణం. నిజమే, విష్ణుమాయ కాకపోతే తల్లి కావాలనుకున్న రత్నమాలను రాక్షసిని చేసాడు.. హరి హరి.
అరిపిరాల
చాలా బాగుందండి. భాగవత కథ లోని సంక్లిష్టతను, ఎన్నో బాహ్య సంబంధం లేనట్లు అనిపించే సంఘటనల అంత:సూత్రాన్ని చక్కగా వివరించారు.
నెనర్లు.
కథనం చాలా బావుంది సత్య ప్రసాద్ గారూ...ఇహ తరచుగా మీ బ్లాగు లోకి చొరబడుతుంటా....
చంద్రమోహన్ గారు,
నెనర్లు
భగవాన్‌గారు,
సుస్వాగతం.
రత్న మాల ఎందుకు రాక్షసి అయ్యిందంటే:
వామనుడ్ని చూసి ముందు తల్లి అవుదామనుకున్న తరువాత బలి కి జరిగిన అన్యాయం చూసి, వామనుడి పై పగ పెంచుకుంటుంది. అందుకే కృష్ణ అవతారంలో చనుబాలిచ్చి చంపుదామని చూస్తుంది అప్పుడు కృష్ణుడు తన పాలతో పాటుగా రక్తాన్ని కూడా తాగేసి చంపేస్తాడు. పాలివ్వటం వల్ల ఆమె కృష్ణుడికి తల్లే అయ్యింది, ధన్యత పొందింది.
-మారుతి
satya prasad garu chalabaga rasaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి