అమెరికాకి జలుబు - ప్రపంచానికి తుమ్ములు (సబ్‌ప్రైం క్రైసిస్)

2002

నగనగనగ అమెరికాలో ఒక గన్నాయిగాడున్నాడు. సదరు గన్నాయిగాడికి ఎప్పటినుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ. వాళ్ళూరిలోనే వున్న పిటి బాంకుకు వెళ్ళి అడగ్గా వాళ్ళు -

“నువ్వు చేసే వుద్యోగమేమిటి.? నీ దగ్గర ఇతర ఆస్తులేమైనా వున్నాయా..? నెల నెలా ఈఎంఐ ఎలా కడతావు..” లాంటి ప్రశ్నలన్నీ వేశారు. గన్నాయిగాడి దగ్గర అవేమి లేకపోవటంతో అప్పు ఇవ్వముగాక ఇవ్వమని చెప్పేసారు పిటిబ్యాంకు వాళ్ళు.

గన్నాయిగాడు కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాడు.

2004 - 2007

లేమాన్ తమ్ముళ్ళని ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీవాళ్ళు, పిటీ బ్యాంకువాళ్ళను కలిసారు.
“పిటీ బ్యాంకూ పిటీ బ్యాంకూ నువ్వు ఇళ్ళు కొనుక్కోటానికి లోన్లు ఇస్తావటకదా.. ఆ లోన్లు తీరి ఆ డబ్బంతా నీ దగ్గరకు వచ్చేసరి ఇరవై ముప్ఫై ఏళ్ళు పడుతుందికదా.. అప్పటిదాకా నీ డబ్బులు ఇరుక్కుపోయినట్లే కదా”

“అవును అదే చాలా ఇబ్బందిగా వుంది… ఏదైనా వుపాయం చెప్పరాదూ..” అన్నారు పిటీ బ్యాంకర్లు.

“అయితే విను… నీ హోం లోన్లన్నీ నాకు అమ్మేసెయ్యి నేను కొనుక్కుంటాను… నీకు ఒక్కసారే డబ్బులిస్తాను అది నువ్వు మళ్ళీ నీ బ్యాంకు పనులకి వాడుకోవచ్చు… నాకు మాత్రం నెల నెలా లోను తీసుకున్నవాళ్ళు ఇచ్చే నెల వాయదాల్లో కొంత భాగమివ్వు చాలు..” అని లేమాన్ తమ్ముళ్ళు చెప్పారు.

భలే భలే అని బ్యాంకులన్నీ అప్పులను అమ్మడానికి సిద్ధమయ్యాయి. అనుకున్నట్టే బ్యాంకులు తమ తమ అప్పులన్నీ తమ్ముళ్ళకి అమ్మేసాయి. తమ్ముళ్ళిచ్చిన డబ్బులను మళ్ళీ అప్పుగా ఇవ్వడం మళ్ళీ తమ్ముళ్ళకి అమ్మటం.. ఇలా సాగుతోంది ప్రహసనం.

తమ్ముళ్ళు ఆ అప్పులన్నీ ఒక కుప్ప పోశారు. వాటిని విలువ, వ్యవధి, వడ్డిని బట్టి భాగాలుగా కోసారు. ఒక్క భాగాన్నికి 'STRUCTURED ENHANCED HOME LOAN CREDIT LEVERAGE FUND' లాంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టి అమ్మకానికి పెట్టారు. (అమ్మకానికైతే అంత పేరుగాని అసలు వీటిని COLLETARALIZED DEBT OBLIGATIONS అంటారు)

ఈలోగా మరోపక్క వేరే కథ నడుస్తోంది. ప్రపంచంలో వున్న అనేక కంపెనీలు అంటే జపాను ఇన్సురెన్సు కంపెనీ, ఫిన్లాండు పెన్షన్ కంపెనీ లాంటివి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాటిని ఎక్కడ పెడితే ఎక్కువ రిటన్సు వస్తాయా అని చూస్తున్నాయి. ఇంతకు మునుపైతే అమెరికా గవర్నమెంటు బాండ్లలో పెడితే 4-5% దాకా వచ్చేది, సెప్టెంబరు పదకొండు తర్వాత అమెరికా 1% కన్న ఇవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే తమ్ముళ్ళు పెట్టిన అమ్మకం గురించి వీళ్ళకి తెలిసింది.

వాళ్ళు తమ్ముళ్ళ దగ్గరకు వచ్చి –“అబ్బాయిలూ మీరు అమ్ముతున్నది బాగానే వుంది కాని గవర్నమెంటు బాండులు కొనుక్కుంటే మాకేదో గ్యారంటీ వుండేది.. నీ బాండులు కొంటే రేప్పొద్దున అప్పుతీసుకున్నవాళ్ళు తిరిగివ్వకపోతే బ్యాంకు నీకు డబ్బులివ్వదు, బాంకు నీకివ్వకపోతే నువ్వు మాకివ్వవు, మేము ఇవ్వకపోతే మా వూళ్ళో నిలబెట్టి తంతారు… అందుకని నువ్వు వద్దు నీ బాండులు వద్దు..” అన్నారు.

తమ్ముళ్ళు వెంటనే – “అంతే కదా ఇక్కడే వుండండి” అని KIG అనే ఒక ఇన్సురెన్సు కంపెనీ దగ్గేరకి వెళ్ళారు. .


“కేఐజీ కేఐజీ ఇలాగిలాగ మేము అప్పులు కొనుక్కున్నాము… ఎవడన్నా అప్పుతీర్చకపోతే మా డబ్బులు నువ్విచ్చేట్టు ఒక ఇన్సూరెన్సు తయారు చెయ్యి… ప్రీమియము ఎంతైతే అంత నీకిస్తాము..” అన్నారు.

KIG సరే లెమ్మని “CREDIT DEFAULT SWAPS” అనే ఒక ఇన్సూరెన్సు తయారు చేసి పెట్టారు. తమ్ముళ్ళు అది కొనుకున్నారు. ఇకనే… అప్పు తీసుకున్నవాళ్ళు ఇవ్వకపోయినా ఇన్సురెన్సు కంపెనీ ఇస్తుంది కదా అని ప్రపంచంలో వున్న రకరకాల కంపనీలు తమ్ముళ్ళ దగ్గర బాండులు కొనడం మొదలెట్టాయి.

బ్యాంకులు అప్పులియ్యను, తమ్ముళ్ళు కొనుక్కోను, KIG ఇన్సుర్ చెయ్యను పెట్టుబడిదారులు కొనుక్కోను… ఇలా సాగుతోంది వరస. ఆప్పు కొన్నా నష్టపోయేది లేదు కాబట్టి తమ్ముళ్ళు బ్యాంకులను ఇంక ఇంకా లోనులివ్వమని ప్రోత్సహించారు. తాము తయారు చేసిన విధానంలో విశ్వాసంతో తమ్ముళ్ళు కూడా తమ గొడ్డు గోదా అన్నీ అమ్మి ఇందులో పెట్టారు.


బ్యాంకులు ఎవడు దొరుకుతాడా అప్పిద్దామని ఎదురు చూడసాగాయి. కనపడ్డవాడినల్లా అప్పు కావాలా అప్పు కావాలా అని వేధించసాగాయి. లోను దొరకటం చాల సులభమైపోయింది. ఒక రోజు గన్నాయిగాడిని పట్టుకోని పిటీ బ్యాంకువాళ్ళు బలవంతంగా లోను అంటగట్టారు. దమ్మీడి ఆదాయంలేదు నాకెందుకయ్యా లోను అంటే, కాదు కూడదు తీసుకోవాల్సిందే అని బ్రతిమిలాడారు. అమెరికాలో రియలెష్టేటు మాంచి బూం లో వుంది. మేమిచ్చిన డబ్బులుతో ఇల్లు కొనుక్కోని వెంటనే అమ్మేసినా బోలెడు డాలర్లు వెనకేసుకోవచ్చు అని ఆశపెట్టాయి.

ప్రతివాడు ఎగబడి ఇళ్లు కొనడంతో ఇళ్ళు కట్టే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి , టైలు కట్టిన మేనేజర్లను పెట్టి ఎడా పెడా ఇళ్ళు అమ్మేసుకున్నారు. ఇందులో భాగస్వాములైన కంపనీలన్నీ దిన దిన ప్రవర్ధమానమై వెలగ సాగాయి. తమ్ముళ్ళు లాంటి వారు, పిటీ లాంటి బ్యాంకులు, KIG లాంటి ఇన్సురెన్సు కంపెనీలు, ఇళ్ళుకట్టే కంపెనీలు, తమ్ముళ్ళ దగ్గర అప్పు ముక్కలు కొనుక్కునే కంపెనీలు వగైరాలన్నమాట. ఇంకేముంది వీటి చుట్టు సాఫ్టువేరు కంపెనీలు, HR కంపెనీలు, కన్సల్టెంటులు, ఏసీ సప్లై చేసేవాడి దగ్గరనుంచి, ఆఫీసులో చెత్త వూడ్చే వాడిదాక, అసలు ఇది ఇంత సక్సస్ ఎందుకైందో రీసర్చ్ చేసేవారి నుంచి ఇలాంటి వుద్యోగాల్లో చేరటానికి కోచింగ్ సెంటర్లు దాకా అన్ని ఎక్కడికక్కడ ఎదో పదో పరకో సంపాయించుకుంటున్నాయి.

KIG లాంటి ఇన్సురన్సు కంపనీలైతే… ఈ పాలసీలమీద క్లయిములెట్టాగు రావు కాబట్టి ఎవరైనా ఈ రిస్కుని మా దగ్గర కొనుక్కుంటే మీకు ప్రీమియంలో భాగమిస్తామన్నాయి. (బ్యాంకులు అప్పులమ్మినట్టే ఇన్సురన్సు కంపెనీలు ఇన్సురన్సు కవర్ అమ్మసాగాయి)

2008

బ్యాంకులు ఇచ్చిన అప్పులన్నీ వేరియబుల్ వడ్డి రేట్లు. అంటే నెల నెలా కిస్తులు స్థిరంగా వుండవ్. అదీ కాక అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువవటంతో జనాలు పోనీలే ఇల్లు కొంటే దాని ధర ఎప్పటికైనా పెరుగుతుంది అని ఎడా పెడా కొనేసారు. నిజానుకి డబ్బులు దండిగా దొరకటంతో గన్నాయిగాడుకూడా కొత్తిల్లే కొన్నాడు. అవసరమైతే అమ్మి అప్పు కడదామనుకున్న వాళ్ళకి వడ్డి పై వడ్డిలు పడ్డాయి. అమెరికా రియలెస్టేటు బుడగ ఒక రోజు బుడుగున మునిగింది.

గన్నాయిగాడు ఆలోచించాడు -

“ నేనెట్టాగు అప్పుతీర్చలేను… రెండురోజులైనా సొంతింట్లో వున్నాను.. నా కల రెండురోజులకైనా నెరవేరింది…” అనుకున్నాడు. అప్పు తీర్చడం మానేసాడు – కావాలంటే ఇల్లు జప్తు చేసుకోమన్నాడు.

పిటీ బ్యాంకుకు మతి పోయింది… అసలు లేదు, వడ్డి లేదు పైగా ఆ ఇంటిని జప్తు చేసి అమ్ముకుంటే లోనులో సగంకూడా వచ్చేట్టు లేదు. తమ్ముళ్ళని పిలిచి –

“అయ్యా ఇదీ పరిస్థితి… కనక మేము నీకు డబ్బులిచ్చుకోలేము” అని తేల్చేసారు. తమ్ముళ్ళు నానా హైరాన పడి KIG దగ్గరకు వెళ్ళారు. KIG కొంతకాలం పాపం వోపిక పట్టి కొన్ని తీరని అప్పులు తీర్చింది. అవి మరీ ఎక్కువైపోతుండటంతో తనూ చేతులెత్తేసింది. ఇంకేముంది – తమ్ముళ్ళు, KIG ఇద్దరూ ఐపీ పెట్టారు. దుకాణాలు మూసేసారు.

తమ్ముళ్ళదగ్గర అప్పు ముక్కలు కొన్న కంపనీలన్నీ ఏడుపు ముఖాలు పెట్టాయి. ఆయా దేశాలలో వాటి షేర్లూ ఏడుపు ముఖమే పట్టాయి. అలాగే తమ్ముళ్ళను నమ్ముకున్న సాఫ్టువేరు ఇత్యాది కంపనీలన్నీ హడావిడిగా మీటింగులు పెట్టేసుకున్నాయి. కొన్ని దుకాణాలు కట్టేసాయి, కొన్ని మనుషుల్ని బయటికి గెంటేసాయి.

దాంతో ప్రపంచంలో వున్న అన్ని మార్కెట్లు నేల చూపులు చూసాయి. తమ్ముళ్ళ దగ్గర అప్పు ముక్కలు కొన్న కంపనీలు మనదేశంలో లేక పోయినా… వాళ్ళకి BPOలు, సాఫ్టువేర్లు, హార్డువేర్లు, మంత్రిచ్చినవేర్లు గట్రా సేవలందించే కంపనీల వల్ల, తమ్ముళ్ళ దగ్గర అప్పుముక్కలు కొన్న కంపనీలన్ని నష్టాలని తగ్గించుకోవడానికి మన దేశంలో పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల, ప్రపంచంలో మార్కెట్టులన్ని పడిపోతున్నాయి కాబట్టి మన మార్కెట్టు పడిపోవాలి అనే పిచ్చి నమ్మకం వల్ల, కొండక చో మన బ్యాంకులు మూత బడుతున్నాయహో అని పనిలేని వాళ్ళు పుట్టించే పుకార్ల వల్ల మన మార్కెట్టు పడిపోతోంది. కోలుకోవడానికి సమయం పట్టినా కోలుకోవడం ఖాయం.. ప్రాణ భయమేమి లేదు అంటున్నారు (ఆర్థిక) డాక్టర్లు. సరే చూద్దాం ఏంజరుగుతుందో…

కొసమెరుపు

కథ అంతా విన్న శిష్యుడు గురువు మణి సిద్దుడితో అన్నాడు –

“గురువుగారు, అంతా బాగానే వుంది కాని.. ఇప్పుడు మన దేశంలోనూ రియలెస్టేటు బూం అంటున్నారు కదా.. బ్యాంకులూ వెంటబడి లోన్లిస్తున్నాయి… మరి రేపో మాపో మనకీ అమెరికా గతి పడుతుందంటారా..?”

“పిచ్చివాడా… భారత దేశం ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ముందుంది. అమెరికా లాంటి చోట బాంకులు ఇచ్చిన అప్పుతోనే ఇల్లు కొంటారు కాబట్టి, అప్పు తీర్చలేనప్పుడు… ఇల్లు వదిలేసుకుంటారు..

అదే మన దేశంలో అయితే బ్యాంకు ఇచ్చిన అప్పుకు దాదాపు సమానంగా నల్ల ధనం చేతులు మారుతోంది. అంటే బ్యాంకు దృష్టిలో నీ ఇంటికిచ్చిన అప్పు 30 లక్షలైతే నిజానికి నువ్వు కట్టిన డబ్బు యాభయ్యో అరవయ్యొ లక్షలుంటుంది. ముప్పై లక్షల అప్పుకి అరవై లక్షల ఇల్లు ఎవరైనా వదులుకుంటారా.. అందుకే తల తాకట్టు పెట్టైనా మనవాళ్ళు ఇంటిమీది అప్పులు తీరుస్తుంటారు…”

“అంటే గురువుగారు… నల్ల ధనమే మన దేశాన్ని సంక్షోభంలోకి పోకుండా కాపాడుతోందన్నమాట…”

“నిశ్చయంగా..”


(హాస్యదర్బార్ సీరియల్ తరువాత నేను రాయబోతున్న సీరియల్ కథ కోసం ఇది రాసుకున్నాను. మార్కెట్టు "నెత్తురు కక్కుంటూ నేలకి రాలటం" చూసి సందర్భం కుదిరిందని ఇప్పుడే ప్రచురించాను.)



25 వ్యాఖ్య(లు):

KumarN చెప్పారు...

Wow....
Can't tell you in enough words how simple you made it to understand, for the folks who thought this is all rocket science..

Thanks a lot..Great Work!!

KumarN

ఉమాశంకర్ చెప్పారు...

బాగా రాసారు..

హేట్సాఫ్ ....

శ్రీ హర్ష PVSS Sri Harsha చెప్పారు...

చాలా తేలికగా అర్థమయ్యేలా రాసారండి. ఈ సబ్ ప్రైమ్ గందరగోళం గురించి ఎప్పుడు తెలుసుకుందామనుకున్నా, ఏమో మనకి అర్థమవ్వదేమో అనిపించేది. అయినా, ఏదో ప్రయత్నం చేద్దాములే అంటే, ఎక్కడ మొదలెట్టాలో అర్థమయ్యేది కాదు. మీ కథ ఆ వ్యధ తీర్చింది. మీకు నెనర్లు

Rajendra Devarapalli చెప్పారు...

ఓరి వీళ్ళమ్మా కడుపులు మాడా,ఇంత తతంగం నడిచిందా దీనివెనుక!!!??.ప్రసాద్ గారు,ఒకబుట్టెడు థాంక్సండి,ఇన్నాళ్ళు పట్టింది నాకు ఈపాటి సంగతి తెలీడానికి,మీకు లాగా ఎవరన్నా చెప్పేవాళ్ళుంటే తెలిసేదేమో!!

అయిననూ అడగవలె కొన్ని ప్రశ్నలు:
*)అమెరికా రియలెస్టేటు బుడగ ఒక రోజు బుడుగున మునిగింది...ఎందుకట్టా మునిగింది?
*)మార్కెట్టులన్ని పడిపోతున్నాయి కాబట్టి మన మార్కెట్టు పడిపోవాలి అనే పిచ్చి నమ్మకం వల్ల, ...ఇట్టాంటి ముదనష్టపు సెంటిమెంట్లను పుట్టించి జనాల నెత్తిన రుద్దిన ఎదవెవడు?
*)కొండక చో మన బ్యాంకులు మూత బడుతున్నాయహో అని పనిలేని వాళ్ళు...ఈ దద్దమ్మలు అటు దలాల్ వీధిలోనూ,బ్యాంకుల్లోనూ,కార్పొరేట్ సెక్టర్ లోనూ,మీడియాలోనూ ఉన్నారు,దీనివెనుక ఉన్న మర్మాలు,మతలబులు,అసలు వాళ్ళకొచ్చే లాభాలు ఏమయ్యుండొచ్చు..

krishna rao jallipalli చెప్పారు...

అప్పు ముక్కలు. బాగుంది. మొత్తానికి టపా చాలా బావుంది. దేవరపల్లి వారి ప్రశ్నలకి సమాదానం ఇస్తే అందరు అసలు విషయాని తెలుసుకొంటారు.

అజ్ఞాత చెప్పారు...

వివరంగా, చక్కగా అర్థమయ్యేలా రాసారు, నెనరులు.

Unknown చెప్పారు...

దేవరపల్లిగారు,

ఇలా బుడగ పగలటానికి చాలానే కారణాలు వున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వడ్డీ రేట్లు పెరగటం, చాలామంది ముందస్తుగా లోన్లు ముగించడం, సంవత్సర జీతానికి 5-10 రెట్లు లోనులు తీసుకోని కట్టలేకపోవడాలు ఇవన్ని. సులువుగా చెప్పాలంటే మీరొక వేలంపాటలో వున్నారనుకోండి. ఎవడో వొకడు మీకన్నా ఎక్కువకి పాడతాడనే ధైర్యంతో మీరు పాట పెంచేసారు. అసలు దాని విలువకన్నా చాల ఎక్కువ రేటుకి వెళ్ళాక ఉన్నట్టుండి మీ దగ్గర పాట ఆగిపోయింది. గతిలేక మీరు దాన్ని కొనుక్కోని అప్పులు తీర్చలేక "హాఫు రేటుకే కళా ఖండం" అని అమ్మేసారు. ఆ కళాఖండం రేటు చూడండి ఎంత ఎత్తుకి వెళ్ళి ఉన్నట్టుండి సగానికి పడిపోయిందో...

ఇంక వివరంగా కావాలంటే వికీలో ఈ లంకె పట్టుకోండి - http://en.wikipedia.org/wiki/United_States_housing_bubble


పక్కనే వున్న ఇళ్ళు కాలుతుంటే నా ఇంటికీ నిప్పంటుంకుంటుంది అని భయపడటం సామాన్యమే.. కాని మనిల్లు తాటాకులా, పక్కా బిల్డింగా అని చూడకుండా నీళ్ళు కుమ్మరించుకోవటమే ఈ సెంటిమెంటు. ఇదొక్కటేనా స్టాక్ మార్కెట్ అంటేనే సెంటిమెంట్ల మధ్య "టగ్ ఆఫ్ వార్"

ఈ పుకార్లు అంతే.. పుట్టేది భయంలోనించి లేదా మిడిమిడి జ్ఞానంలోనుంచి.. అక్కడక్కడ శత్రురాజుల కుట్రలు (ఐసివైసి బ్యాంకు మూత పడుతోందని ఇంకో ఎల్లయ్య బ్యాంకు ప్రచారం చెయ్యొచ్చు..). ఇవన్నీ కాకుంటే ఫలానా బ్యాంకు షేరును కిందకి లాగి తొక్కేసి ఎందుకూ పనికిరానిదని చూపించీ దాని షేరు విలువ అధఃపాతాళంలో వున్నప్పుడు కొనుక్కోవాలని ఒక బడా ఇన్వెస్టరు ప్లాను వేసి వుండచ్చు... అయ్య ఒకటా రెండా.. ఏమని చెప్పుదు స్టాక్ మార్కేట్ వికట వర్ణనలను..

అరిపిరాల

Unknown చెప్పారు...

@ కుమార్‌గారు
నెనర్లు. నా ప్రయత్నం కూడా అదే సరళంగా చెప్పాలని..
@ కొత్తపాళిగారు,
నెనర్లు
@ ఉమా శంకర్ గారు,
థాంక్యు
@ శ్రీ హర్ష గారు,
నేను చెప్పింది చాలా తక్కువ. గూగులమ్మని అడగండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు
@ కృష్ణా రావుగారు,
నెనర్లు
@చదువరిగారు,
ప్రతినెనర్లు

అజ్ఞాత చెప్పారు...

atta boyo!

కొత్త పాళీ చెప్పారు...

రాజేంద్ర..
మొదట జరిగింది ఏంటంటే .. ఎట్లాగైనా ఇళ్ళ అమ్మకాన్ని పెంచాలి అని చెప్పి ఇంటి ఋణాల మీద తనిఖీని బాగా తగ్గించారు. పైగా, ఋణాలిచ్చేందుకు భేంకులకి కొన్ని ఆకర్షణాలు కల్పించారు. మామూలుగా ఇంటి లోను అంటే 15 - 30 ఏళ్ళ పాటు ఉండే లోను. అంతకాలం ఆ వ్యక్తి చెల్లింపులు చెయ్యగలడా అని బేరీజు వేసుకుని ఇస్తారు. అలా కాకుండా అడీగిన VArikallA ఇవ్వడం మొదలు పెట్టారు. రెండోది, ఎడ్జస్టబుల్ రేట్ మార్టుగేజ్ అనే పథకాలు పెట్టారు. దీంట్లో వడ్డీ రేటు మార్కెట్టుని బట్టి మారుతుంది. నెలసరి కట్టే మొత్తం కూడా మారుతుంది. 2005 దాకా వడ్డీ రేట్లు చాలా తక్కువలో ఉన్నై. దాణి మీడ ఆధారపడీ జనాలు, 3, 4 లక్షల డాలర్ల ఇళ్ళు కొని పడేశారు. 2006 నించీ రేట్లు పెరగడం మొదలైంది. రేటు ఒక్క శాతం మారినా, నెలసరి చెల్లింపు సుమారు రెండు రెట్లవుతుంది. దాంతో జనాలు గుడ్లు తేలేసి చెల్లింపులు చెయ్యడం మానేశారు. బేంకులు చేతులు కాలాక ఆకులు పట్టుకోడానికి వెతుకుతున్నై.
ముఖ్యంగా సబ్ ప్రైం గోలకి ఈ రెండూ కారణం.
ఇక దీని మూలంగా మార్కెట్ ఎందుకు సంక్షోభంలో పడిందని సత్యప్రసాద్ గారు భాగా వివరించారు.

Raj చెప్పారు...

సులభంగా, అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలు.

శ్రీ హర్ష PVSS Sri Harsha చెప్పారు...

మా స్నేహితుడు ద్వారా నాకందిన చాలా వివరమైన సమాచారం ఇక్కడ వినచ్చు. ఆసక్తి గలవారు ఇంకొంచెం లోతుగా తెలుసుకోవచ్చు. Full Episode మీద నొక్కండి

Bolloju Baba చెప్పారు...

చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో గొప్పగా చెప్పారండీ.
ఇప్పుడు వచ్చిన మాంధ్యానికి కారణాలు, ఒకటి రెండుచోట్ల చదివినా కొద్దిగా కూడా అర్ధంకాలేదు, మొత్తం గందరగోళాన్ని చాలా సింపుల్ గా అరటిపండు వలచి పెట్టినట్లు చెప్పారు.

మీ నేరేషను కూడా ఇంతటి డ్రై సబ్జక్టునీ(కనీసం నామట్టుకు) ఆద్యంతం గ్రిప్పింగ్ గా చదివించింది.

మంత్రిచ్చినవేర్లమ్మే ప్రయోగం భలే బావుంది.

కొత్త పాళీగారి వివరణ బాగుంది.

బొల్లోజు బాబా

Unknown చెప్పారు...

నెటిజన్, రాజ్ గార్లకి,
నెనర్లు

బాబాగారు,
నా బ్లాగ్లో మీరు కామెంటటం మొదటిసారి.. ఎంత భాగ్యం.. డ్రై సబ్జెక్ట్ అనే కథలా అందించా. వర్కౌట్ అయ్యిందన్నమాట.. ;)

అధిక వనరులందించిన శ్రీహర్షగారికి నెనర్లు.

కొత్తపాళీగారు,
మీరందించిన విషయం అక్షరాలా నిజం. (కథనంతా అర్థమయ్యేట్టు రాసి రాజేంద్రగారి ప్రశ్నలకు సమాధానం మాత్రం మళ్ళి కాంప్లెక్సు చెయ్యబోయాను.. మీ జవాబు సరళమైనది, సరియైనది)

అరిపిరాల

Unknown చెప్పారు...

సరళంగా అందరికీ అర్థమయేలా చెప్పారు.

తేలిగ్గా అర్థమయేలా ఇంకో వ్యాసం ఇక్కడ.

Rajendra Devarapalli చెప్పారు...

ఆ.. మీరు మరీనండి ప్రవీణ్ గారు,అక్కడ ఇంగ్లీషులో ఉంది :)

Unknown చెప్పారు...

ప్రవీంగారు,

హిందూలో వచ్చిన ఈ ఆర్టికల్ నేను మునుపే చదివాను. దాదాపు అదే స్ఫూర్తి తో రాసిన టపా ఇది.

రాజేంద్ర గారు,
మరే.. అందునా హిందూలో రాసినదది... కాని అది కూడా చాలా సరళంగా వుంది.

అరిపిరాల

Unknown చెప్పారు...

arati pandu valichi chetilopettadam annadaniki akshrabaddam mi vyasam.gottam gannayya gadiki kuda ardam ayyela saralam ga rasina sanklistamaina subject vyasam.e floating vaddi ratlu tisesi chidambaram ika nunchi anni home loans kuda only 9 percent thats all ante yenta vavunnu.nalanty gannayyalu nelaki patika velu kadutu kuda inka asalu assalu tiraledani bank vadu cheputunte mi america gannayya la neneduku maarakudada ani pistondy. appudu meeru india subprime crime ani rasukovachhu.

అజ్ఞాత చెప్పారు...

సూపరండీ. చాలా బాగా రాశారు. అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలా క్లిష్టమైన విషయాల్ని హాస్యంగా చెప్పడం - hats off to you !!!

Burri చెప్పారు...

వివరంగా, చక్కగా అర్థమయ్యేలా రాసారు, నెనరులు.

అజ్ఞాత చెప్పారు...

Satya garu,


wonderful eloboration. Thanks for making it so easy

ఆయుర్వేదం చెప్పారు...

ఆర్ధిక మాంద్యమంటే ఆర్ధికమాంద్యం అనుకున్నాను. కానీ అసలు విషయం ఏంటి అని అర్ధం కాలేదు. చాలా బాగా చెప్పారండి

మానస సంచర చెప్పారు...

కొత్తపాళీ గారి టపాలు తవ్వుతుంటే ఈ లంకే కనపడి ఇప్పటికైనా చదివే అదృష్టం కలిగింది.

భలే చెప్పారు. ఎక్కడ చదివినా ఎంత చదివినా పూర్తిగా అంతుపట్టని ఆ క్రైసిస్ గురించి చాలా మటుకు (నాకు కూడా) అర్థమయ్యేంత బాగా రాశారు . థాంక్స్.

ఒక్క ప్రశ్న. కేవలం లేహ్మాన్ బ్రదర్స్ వల్లేనా . మిగతా వాళ్ళ హస్తం లేదా దీంట్లో. లేక లేహ్మన్ ఒక ఉదాహరనేనా.

Nag చెప్పారు...

hi,
సత్యప్రసాద్ గారు. నేను మీ బ్లాగును(http://www.blogger.com/blogin.g?blogspotURL=http://hasyadurbar.blogspot.com/) చూసే వాడిని ఇప్పుడు వెళ్ళి చూస్తే "This blog is open to invited readers only" అని ఉంది.

Can you give permissions to that.

Once or twice i commented in that bolg but i used to follow much silently. I like that particular very much management mama lessons are great.

Sorry for posting at wrong place.

రామ్ చెప్పారు...

అంతోటి కష్ట తరమయిన విషయాన్ని చాలా హాస్యం మిళాయించి చదివించేలా సులువుగా రాసారండీ . ధన్యవాదాలు

రామ్ ప్రసాద్