"బాబూ రిక్షా.." అతికష్టం మీద పిలిచింది రాములమ్మ. ఆమె కళ్ళు, డొక్క లోపలికి పోయినాయి. కాళ్ళు చేతులు సన్నగా కట్టెపుల్లల్లా వున్నాయి. మాసిన పాత చీర, చిరుగులు పడ్డ జాకెట్టు తొడుక్కొని వుంది. నెరిసిన జుట్టు మీద పడ్డ దుమ్ము జుట్టు రంగునే మార్చేసింది.
"ఏటే.. ఏడకి పోవాలే" అడిగాడు రిక్షావాడు. ఆమె చెప్పింది.
"అరే.. ఆ గల్లీలెంట బోవాలె.. ఇదేమన్న రిక్ష అనుకున్నవా.. ఇమానమనుకున్నావా..?? అసలు నీకాడ పైసలున్నాయే..?" వ్యంగ్యంగా అడిగాడు.
"పైసల్లేవు బిడ్డ.. ఆడకు పోగానే నా కోడుకిస్తడు.. నడ్వలేకున్నా జరంత తోల్కపో బిడ్డా.." ఆమె ప్రాధేయపడింది.
"ఏందిరన్నా సంగతి.." అంటూ వచ్చాడు మరో రిక్షావాడు.
"బస్తిలెంట గల్లీలెంట బోవాలంటది. పైసలు మాత్రం దీని బిడ్డ ఇస్తడంట.."
మధ్యలోనే అందుకుంది రాములమ్మ
"అవు బిడ్డ.. కాళ్ళునొస్తున్నాయ్.. జర నువ్వైనా జెప్పు నాయనా.."
"ఈళ్ళంత ఇంతెనే.. దా నా బండెక్కు నే తోల్కబోతా.." అంటూ ఆమెనెక్కించుకున్నాడు.
***
"నీ పేరిందిర బిడ్డ" దారిలో అడిగింది
"నా పేరేదైతేనేంటిలే అవ్వా.."
"ఏంలేదు.. మంచి తీరుగున్నవని అడిగిన.."
"అందరూ యాదగిరి అంటరు.."
"గట్లనా.."
అంతకు మించి ఏమి మాట్లాడుకోలేదు. బండి వీధులన్నీ తిరిగి తిరిగి చేరవలసిన చోటికి చేరింది.
"ఏడనే వుండు బిడ్డా.. నా బిడ్డ వచ్చి పైసలిస్తడు.." అంటూ లోపలికెల్లింది రాములమ్మ.
"ముసల్దొచ్చింది" లోపలినుంచి విసురుగా ఒక ఆడగొంతు.
"ఇదేందే ఇప్పుడొచ్చినావ్.. ఇంకా నాల్గుదినాలుండెగా.." కోపంగా మొగగొంతు.
"అదిగాదురయ్య.. ఆడనే సూపుగానక ఓ బుడ్డి పగలగొట్టిన.. ఆడు ఇంట్లోంచి తరిమేసిండ్రా.. మళ్ళ గిట్ల రావద్దండు.." బావురుమంది రాములమ్మ.
"ఆడు దరిమేస్తే.. గిట్లెందుకొచ్చినావ్..? నా కొంప సత్రం లెక్క గానొస్తుందానె.." అంటూ కసురుకున్నాడు.
"అది గాదురా అయ్యా.. ఆడు అసలు ఇంట్లోకే రానీయననిండు.."
"ఆడు దరిమితే.. నేనేమైనా పాగల్గాన్నా నిన్నుంచుకోడానికి.. నేను ఇంట్లోకి రానీయ్య.. బయటకిపో.."
"నువ్ గూడ గిట్లంటే నేనేంగావాల్రా..?"
"ఏహె గదంతా నాకెర్కలేదు నూవ్ ముందైతె ఇంట్లకెల్లి పో.."
రాములమ్మ పైటచెంగుతో గుడ్లొత్తుకుంది.
"గట్లనేకాని బిడ్డ.. బయట రిక్షావోడున్నడు.. ఆనికి పైసలిస్తే.."
"మంచిగనేవుంది.. నీ కోడుకులేమైనా పటేల్లనుకున్నవా.. రిక్షాల్లో తిరిగి రాజ్యాలేలనీకి.." కసురుకుంటూ డబ్బులిచ్చింది కోడలు. చివుక్కుమన్న గుండెతో రావులమ్మ బయటకి వచ్చింది.
"ఛీ ఛీ.. ఈ నాకొడుకులంతా ఇంతే.. కన్న తల్లిని జూస్కోడానికేమాయే..!!" అనుకున్నాడు యాదగిరి.
బయటకువచ్చి డబ్బులిచ్చింది రాములమ్మ. యాదగిరి వద్దనాడు. రాములమ్మ ఏమి మాట్లాడలేదు.
"నేనంతా ఇన్నాన్లే.. ఇప్పుడెక్కడికి పోతావ్.." యాదగిరి అడిగాడు.
"ఏడకని బోతా నైనా..! ఏ సెట్టు కిందో పుట్టకిందో.. గిట్లనే సచ్చిందనక.." ఆ పైన మాట్లాడలేదు. ఆ వయసులో నిస్సహాయంగా ఏడవటానికి మనస్కరించక కళ్ళలో నీళ్ళను తొక్కి పట్టింది.
"నా రిక్షా ఎక్కు.. నిన్ను ఆ పార్కు కాడ వదుల్తా.."
రాములమ్మ మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.
"గట్లైతే నికు ఇద్దరు బిడ్డలా..?" యాదగిరి అడిగాడు రిక్షా తొక్కుతూ.
"అవు బిడ్డా..! ఇంకొకడుండె గాని.." అంటూ ఆపేసింది.
"ఆనికేమైంది.."
"ఆడు సిన్నప్పుడే తప్పిపోయాడు బిడ్డ.. ఆడి సిన్నతనంలో నేను ఇస్కూళ్ళ ఆయాగా చేస్తుండె. ఇస్కూల్ల సారు సానా మంచిగుంటుండె. నా బిడ్డలకు వుట్టిగనే సదువుకూడ సెప్పిండు. ఆ యెదవ ఆయనకాడ చోరి చేసిండు. నే తంతానని ఆడ నించే పారిపోయిండు.. ఇప్పుడు ఏడున్నడో ఏమో...! ఆని పేరు కూడా యాదగిరే.."
యాదగిరి రిక్షా వేగం తగ్గింది. చిన్నప్పుడు హెడ్డుసారు ఆఫీసులో తనుచేసిన దొంగతనం గుర్తొచ్చింది.
"ఆడు గానొస్తే గుర్తుపడతావా..?" అడిగాడు అనుమానంగా.
"ఆయాల్టినుంచి గనపడనేలేదు.. ఇప్పుడు నీయంతై వుంటడు. ఆని మెళ్ళో ఒక దండ వుంది. ఆ ఇస్కూళ్ళ సారే ఆని మెళ్ళో ఏసిండు.. దానిపైన వోళ్ళ దేముడు బొమ్మ కూడా వుంది." చెప్పింది రాములమ్మ
యాదగిరి గుండె చప్పుడు వేగంపెరిగింది. రిక్షా దాదాపు ఆగిపోయింది. బుర్ర నిండా ఆలోచనలు -
"అయితే నేనేనా ఈమె బిడ్డని..?" మనసులో రొదగా వుంది.
"అమ్మా.." అని పిలవబోయాడు. అప్రయత్నంగా ఆ పిలుపు గొంతు దగ్గర ఆగిపోయింది. గొంతు ఆగిపోయి బుర్ర పనిచెయ్యడం మొదలెట్టింది.
"ఇప్పుడు ఈమే అమ్మని తెలిస్తే.. ఇంటికి దీస్కపోవాల.. ఇంటికాడ యాదమ్మ నన్ను సంపతాది.. మనం తినేదానికే లేకపోతే ఈ ముసల్దానేడకెళ్ళి దెచ్చినావ్ అంటది"
"అది సెప్పేది నిజమే.. ఈ రిక్షాపైన నాకెన్ని పైసలొచ్చినా అయి మా తిండికే సాలవు.. ఇంక దీన్నేస్కెల్తే కర్సులెక్కువైతాయి.. అయినా ఆళ్ళిద్దరూ తరిమేసిన్రు.. నడిమిట్ల నేనెందుకు సూడాలే..??"
ఆలోచన్లలోనే పార్కు దగ్గరకు వచ్చేసాడు. రిక్షా ఆపి కిందకి దిగాడు.
"పార్కు వచ్చేసింది.." అన్నాడు.
రావులమ్మ పలకలేదు.. ఇక పలకలేదు కూడా. అచేతనంగా పడిపోయివుంది.
యాదగిరి మాట్లాడలేదు. అతనికి ఏడుపు కూడా రావట్లేదు. ఆమె వైపే చూస్తూ నిలబడి పోయాడు. చుట్టూ జనం చేరారు.
"పాపం..!! కొడుకులు తరిమేసరికి గుండ పగిలి చచ్చిపోయింది.." ఎవరో పెద్దమనిషి అన్నాడు.
"ఛి.. ఛి..!! ఈ నా కొడుకులంతా ఇంతే.. కన్నతల్లిని చూస్కోడానికి యేమాయే.." ఇంకెవరో అంటున్నారు.
యాదగిరి గుండె కలుక్కుమంది. సూర్యుడి కిరణం పడి అతని మెడలో దండకున్న సిలువ తలుక్కుమంది.
(1995 ఆదివారం ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
5 వ్యాఖ్య(లు):
బావుంది
-భరత్
chaalaa baagundi
బాగుంది సత్యప్రసాద్ గారు.
బాగా రాసారండీ.
తనదాకా వస్తే గానీ అనే సామెత గుర్తొచ్చింది.
చాలా బాగా రాసేరు అరిపిరాల గారూ. నావ్యాసం తరవాత చదవడంచేతేమో నాకు ముగింపు ఇంకొంచెం పొడిగిస్తే బాగుండు అనిపించింది. అంటే యాదగిరికి తల్లిమీద సానుభూతి వుంది కనక కర్మకాండ అతనిచేత చేయిస్తే ఎలా వుండేదంటారు. ఒక ఆలోచన మాత్రమే. మీకథలో లోపం అని కాదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి