బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?


ఇది ప్రాధమిక ప్రశ్న. తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేద్దామని ఇప్పటికే పలు బ్లాగర్లు అనటం జరిగింది. వ్యాప్తి చెయ్యటమంటే ఏమిటి? బ్లాగులు పెంచాలా? బ్లాగర్లను పెంచాలా? పాఠకులని పెంచాలా?

అందుకే ఈ ప్రశ్న.

మనకి కావలసింది ఏమిటి?

దీనికి నాకు తోచిన జవాబు చెప్పే ముందు మరి కొంచెం లోతైన ప్రశ్న - ఆసలు మనం ఎందుకు బ్లాగుతున్నాం?

నా వరకు చెప్పాలంటే నేను బ్లాగు మొదలు పెట్టకుముందే అచ్చోసిన రచయితని (అనగా అడపాదడపా అచ్చులో నా రచనలు ప్రచురించబడ్డాయి). నేను బ్లాగటం మొదలు పెట్టింది నా దగ్గర వున్న రచనలని కొత్తగా మొదలైన ఒక మాధ్యమం (అంతర్‌జాలంలో) పెట్టడం. అంతే. అయితే వ్రాయటం మొదలెట్టాక అడపదడపా వ్యాఖ్యలు మొదలై తరచుగా రావటం మొదలైయ్యాయి. ఆ ప్రోత్సాహం మరిన్ని (కొత్త) కథలు రాయటానికి స్పూర్తి నిచ్చాయి. ఈ వ్యాఖ్యలు లేకపోతే గతంలో అచ్చైన కథలవరకు ఎక్కించేసి శెలవు పుచ్చుకునేవాణ్ణి. (అసలు నేను వ్రాయటం ఆపేసి అయిదు సంవత్సరాలైంది. మళ్ళీ రాస్తున్నానంటే అది మీ చలవే)

చెప్పొచ్చేదేమిటంటే.. నేను నాకోసమే బ్లాగు రాసుకుంటున్నాను, ఎవరు చదివినా చదవక పోయినా - అనే మాట అసంబద్ధంగా తోస్తుంది నాకు. అలాగైతే ఈ కూడళ్ళు, జల్లెడలూ ఎందుకు చెప్పండి? మీరు రాసుకునేది రాసుకోండి, రెండు మూడు సార్లు చదువుకోండి, మురిసిపోండి. ఇంకొకరు చదవాల్సిన పనిలేదు కాబట్టి ఏ ఆశలు ఆశయాలు లేవు..!!

నేను మాత్రం వొప్పుకోనండి..! ఎవరెన్ని చెప్పినా కళకారుడికి చప్పట్లే సన్మానపు దుప్పట్లు..!! బ్లాగరికి కామెంట్లే సన్మానపు దుప్పట్లు..!!

తనకోసమే వ్రాసుకునే వాళ్ళకి ఈ చర్చతో పనిలేదు. మీరు వ్రాసుకోండి.. అంతర్జాలంలో తెలుగు వెలుగుకి మీరూ ఒక సమిధనిచ్చారని (ఆ వుద్దేశ్యంతో కాకపోయినా) మీకు నెనర్లు. (ఈ విహారిణి కుడిచేతివైపు అన్నిటికంటే పైన ఒక ఇంటూ గుర్తు వుంటుంది అది నొక్కండి).

అలా కాదు నేను రాసేది ఇతరులు చదవటానికే అనే వాళ్ళు చదవటం కొనసాగించవచ్చు.

ఇతరులు చదవటానికి వ్రాసేవాళ్ళు అసలు ఎందుకు వ్రాస్తారా అని ఆలోచిస్తే నాకు తట్టిన సమాధానాలివి -

అ) నా భావాలు నలుగురితో పంచుకోవాలి

ఆ) నా అనుమానాలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎంతమందికి నచ్చుతాయో తెలుసుకోవాలి

ఇ) నేనూ రచయితనే.. ఈ సంగతి స్వాతీ ఆంధ్రభూమి తెలుసుకోలేకపోయాయి... మీరన్నా తెలుసుకోండి (నా లాంటివారు)

ఈ) నాకు తెలిసిన విషయం కొంత మందికైనా వుపయోగపడుతుంది..

ఉ) నా రచన చదివి ఎవరైనా వీరతాళ్ళేస్తే నాకు ఎంత సంబరమో

ఊ) వాడెవడో సత్యప్రసాదట - నేను వాడి కన్నా బాగ రాయగలనని నిరూపించాలి


ఇంకా ఇలాంటివి మరెన్నో వుండచ్చు - అన్నింటిలో సామ్యమైన విషయం ఏమిటంటే - నేను రాసింది చదివేవాళ్ళు కావాలి..!! నేను రాసినదానికి వ్యాఖ్యల రూపంలో అభినందనో, అభిప్రాయమో కావాలి. ఇది జరగాలంటే చదువరులు ఇంకా కావాలి.

బ్లాగర్లలో మరో వర్గం - తెలుగు భాషాభిమానులు. పైన చెప్పిన వర్గంలో భాషాభిమానులు లేరా అనకండి. ఇది ఇంకో రకమైన విభజన (Classification). దాదాపు అందరిలోను భాషాభిమానం వున్నా కొంచెం బలంగా అంటే బ్లాగు మాధ్యమంగా తెలుగు వాడకం పెంచాలనో, అంతర్జాలంలో తెలుగు వాడకం పెంచాలనో, కొండకచో "తెలుగు వాడుక భాషా దోషాలను సమూలంగా ప్రక్షాళన గావించెద" అనే తీవ్ర అభిమానులు వుంటారు. వీరి పుణ్యమే ఈ నాటి తెలుగు వెలుగులు, ఇంకా జరుగుతున్న అంతర్జాల తెలుగు భాషోద్యమ ప్రయత్నాలు. (నేను ఇక్కడకూడా వున్నాను అందుకే ఈ టపా). వీరి ప్రయత్నాలు ఫలించాలంటే అంతర్జాలంలో తెలుగు వెలుగుల గురించి మరింత మంది చదవాలి. వీరికీ చదువరులు మరింతగా కావాలి.

ఇక ఇంకొక విషయం - బ్లాగులు మొదలు పెట్టినవారి స్వగతాలో, సింహావలోకనాలో, లేదా మొదటి టపాలో చదవండి.

అ) నేను ఫలానా ఫలానా వారి బ్లాగు చదవటం మొదలు పెట్టాను. వారిలాగ/వారి కంటే బాగా రాయగలననే నేను మొదలెట్టా

ఆ) ఈనాడులో/ఆంధ్రజ్యోతిలో తెలుగు బ్లాగుల గురించి చదివాను.. నేనూ మెదలెట్టాను

ఇ) గూగులమ్మని ఏ వేమన గురించో పోతన గురించో అడుగుతుంటే తెలుగు పదాలు కనపడ్డాయి.. హై భలేగుందే అని ఒక నొక్కు నొక్కాను... ఆ తరువాత అ) పాయింటు చదువుకోండి.

ఇలాంటి కారణాలు కనిపిస్తాయి. కొంత మంది ఇంతకు ముందే అచ్చోసిన రచయితలు (నా లాంటోళ్ళూ) మినహాయిస్తే ఎక్కువగా బ్లాగులు మొదలెట్టిన వారు ముందు చదివారు, తరువాత మొదలెట్టారు. కాబట్టి మనం ఏం కనిపెట్టాం.. బ్లాగు రాయండి అని ప్రచారం చెయ్యటం కన్నా బ్లాగులు చదవండి అని ప్రచారం చేస్తే చదివిన వారు నెమ్మదిగా వ్రాస్తారు. పరంతూ... (అంటే కాకపోతే) ఇలాగొచ్చినవాళ్ళకి మీరూ వ్రాయండి... వ్రాయటం చాలా వీజీ అని చెప్తుంటే చాలు.

ఇప్పటికిక్కడ ఆపేస్తే మనకి కావల్సింది చదివేవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. పాఠకులే ముఖ్యం..!! రచయితలు కాదు..!! నేటి పాఠకులే రేపటి రచయితలు..!! కాబట్టి అంతర్జాలంలో తెలుగు చదివేవారికోసం వుద్యమిద్దాం..!! (నాకు తోచిన కొన్ని అవిడియాలు తదుపరి టపాలలో)

మొన్నామధ్య మాయాబజార్‌లో ఒక సన్నివేశం పేరడీలో నేను చెప్పదల్చుకుంది అదే. జ్యోతిగారు కరెక్టో అని మార్కులేశారు. మీరేమంటారు? మీరంతా నిరభ్యంతరంగా విభేదించవచ్చు, అనామక వ్యాఖ్యలేసుకోవచ్చు... ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే నేను వ్రాసేది చదివేవారికోసమే... వారి వ్యాఖలకోసమే.


12 వ్యాఖ్య(లు):

సుజ్జి చెప్పారు...

aaha.. super ga chepparu sir.. !! i agree with u.!!

bwt, అచ్చోసిన రచయితలు :))

Shiva Bandaru చెప్పారు...

మీరు నా బుర్రలో ఏదైతో ఉందో అదే రాశారు . 100 శాతం అంగీకరిస్తాను మీతో ఈ విషయంలో. మీ ఐడియాలకోసం ఎదురుచూస్తాను .

MURALI చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాల నిజమండి. మనం కూడా రచయితలమే అనిపించుకోవటానికేగా మన బ్లాగులు.

శరత్ కాలమ్ చెప్పారు...

బ్లాగడములో నాకు హిడెన్ ఎజెండా వుందండీ :))

cbrao చెప్పారు...

"అవిడియాలు" అనే పద ప్రయోగం సరైనదేనా? తెలుగు పదమేనా?

అజ్ఞాత చెప్పారు...

"చెప్పొచ్చేదేమిటంటే.. నేను నాకోసమే బ్లాగు రాసుకుంటున్నాను, ఎవరు చదివినా చదవక పోయినా - అనే మాట అసంబద్ధంగా తోస్తుంది నాకు."

వంద వరహాల నిజం.

-- విహారి

Kathi Mahesh Kumar చెప్పారు...

రైఠో!!! అర్జంటుగా అంగీకరించేశాం. కాకపోతే ఈ పరిణామం వివిధ స్థాయిల్లో ఏర్పడుతుందని మనవి.

అజ్ఞాత చెప్పారు...

@Sarath, everyone knows your agenda :-)

Unknown చెప్పారు...

సుజి, శివ, మురళి, విహారి గార్లకు నెనర్లు. త్వరలోనే నా ఆలోచనలు మీ ముందుంచుతాను.

రావుగారు అవిడియాలు తెలుగు పదం కాదు... అసలు పదమే కాదు. ఎదో హాస్యం (అనుకొని) ప్రయోగం.

మహేష్‌గారు, వాస్తవమే కాకుంటే అన్ని స్థాయిల్లో చదివేవారు అవసరమే కదా..! ఏమైనా ఆత్మతృప్తి కోసమే రాయటమనే స్థాయి అసలు లేదు (బ్లాగర్లలో) అని నా పాయింటు. అలా రాసుకునేదాన్ని బహుశా డైరీ అంటారనుకుంటా..!! :))

శరత్‌గారూ వీటన్నింటి అతీతమైన ఎజండానా...?? హన్నా తెలిసెన్ తెలిసెన్..!!!

oremuna చెప్పారు...

Agree.

అజ్ఞాత చెప్పారు...

ఆర్యా, తెలుగులోనే ఏల బ్లాగవలె?

అజ్ఞాత చెప్పారు...

సత్యప్రసాద్ గారూ,
మీరు చెప్పింది ప్రత్యక్షర సత్యం.
మనక్కావలసింది ఏమిటి?
1. ఆమాత్రం ఈమాత్రం కంప్యూటర్ ఉపయోగిస్తున్న తెలుగు వారందరికీ తమ భావాల్ని నలుగురితో పంచుకోగల వేదిక అంతర్జాలంలో ఉన్నదని తెలియజెయ్యటం, కొత్తగా వచ్చేవారికి సాయం చేసి, ప్రోత్సహించడం.. తద్వారా తెలుగుకు ఆధునిక హోదా, హంగు కల్పించటం!
2. అచ్చోసుకోలేని రచయితలను సైతం ఓసారి ఆహా అని ప్రోత్సహించడం!
అదే కదా. బాగుంది మీ టపా.

శరత్,
మీ రహస్య ఎజెండా మాకు తెలుసు... :)

నెటిజెన్,
బ్లాగదేలయన్న దేశంబు తెలుగేను..
...............................................
దేశభాషలందు తెలుగు లెస్స!
:)