Unknown
మొన్నామధ్య అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా గుంపుకి నేనొక వేగు పంపాను - "తెలుగు బ్లాగుల అభివృద్దికి మనమేమి చెయ్యొచ్చు??" అని. అందులో కొన్ని విషయాలను హై. సమావేశంలోనూ, అంతర్జాల సమావేశంలోనూ చర్చించారు. యోగ్యత అనుసరించి కొన్ని పాటించటం మొదలుపెట్టాము కూడా. చాలా సంతోషం. అందులోని విషయాలనే ఇంకొంచెం వివరంగా చర్చించాలని నా ప్రయత్నం. అందులో లేనివి కూడా కొన్ని సందర్భానుసారంగా ప్రస్తావిస్తాను.
తెలుగు బ్లాగుల ప్రచారోద్యమంలో ఈ-తెలుగు స్టాలు ఒక మైలు రాయి అనిపిస్తోంది నాకు. అక్కడ బ్లాగ్మిత్రులు తీసుకున్న శ్రమ, సమయస్ఫూర్తి (కరపత్రాలనించి స్టాలుకి, స్టాలు నుంచి స్టేజికి, చివరికి ఆ పుస్తక ప్రదర్శన సైటు మనమే తయారు చేసే దాకా) ఎంతో అభినందనీయం. అక్కడ నేను లేకపోతినే అంటూ చాలా మంది బ్లాగర్లు ఇప్పటికే అన్నారు. నేను అనలేదు... అనను కూడా... ఎందుకంటే నేనక్కడలేకపోయినా అందులో భాగస్వామినే. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి "టీవీలో చూపిస్తున్నారు... ఎవరో తెలుగు బ్లాగర్లట అంతా కుర్రాళ్ళే (పద్మనాభంగారు కనపడలేదనుకుంటా.. కనపడ్డా ఆయన వుత్సాహంలో కుర్రాడేగా..!!) తెలుగుకోసం ఎంత పనిచేస్తున్నార్రా.." అని అంటే నేను "అవును నేను కూడా అందులో భాగమే... హైదరాబాదులో లేను కానీ లేకపోతే నేనూ అక్కడే వుండేవాడిని" అని చెప్పుకొచ్చా. విషయమేమిటంటే... నన్ను నేను అక్కడ శ్రీధర్‌లోనూ, శిరీష్‌లోనూ, లక్ష్మిలోనూ, కశ్యప్‌లోనూ, పద్మనాభంగారిలోనూ చూసుకున్నాను.
ఈ సమావేశం టపాలలో ఒక చిత్రం జరిగింది (వుద్దేశ్యపూర్వకమో కాదో కానీ...) ఈ-తెలుగు సమావేశంలో తీసిన (చాయా) చిత్రాలను బ్లాగుల్లో పెట్టినవారెవ్వరూ - ఇదుగో నిల్చున్నవారు కుడి నుంచి ఎడమకి - అని పేర్లు వ్రాయలేదు. నాకూ తెలుసుకోవాలనిపించలేదు. ఎందుకంటే వారందరిలో నేనూ వున్నాను... అక్కడ నాకు కనపడేది తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేస్తున్న తెలుగు బ్లాగర్లు మాత్రమే. ఎవరో అనవసరం...!!
వీడేమిటి ఇలాగంటున్నాడు అనుకుంటున్నారా?? ఇక్కడ నేను అంటే తెలుగు బ్లాగర్. వ్యక్తిగతంగా నాకు తోటి బ్లాగర్లతో మాట్లాడాలని - దార్లతో దళిత సాహిత్యం, రామరాజుతో గుత్తి గుమ్మడికాయ, భగవాన్‌తో వ్యంగ్య హాస్యం, సౌమ్యతో నేను చదివిన పుస్తకాల గురించి - ఇలాంటివి ఎన్నో. కానీ ఇవన్నీ సత్యప్రసాద్‌గా, అదే తెలుగు బ్లాగర్లమై మనం కలిస్తే మనం మాట్లాడేది బ్లాగాభివృద్ధి, అంతర్జాల తెలుగు వైభవం.. కాదంటారా..??
ఒక్క విషయం గమనించండి ఈ-తెలుగు సమావేశాలలో కృషి చేస్తున్నది శ్రీధరో, భార్గవోకాదు - ఒక తెలుగు బ్లాగర్ మాత్రమే. "నేనక్కడ వుంటే నిశ్చయంగా అక్కడ నిలబడేవాడిని.." - ఈ మాట అనుకోని తెలుగు బ్లాగర్ ఎవరైనా వున్నారా? (వుంటే జోహార్... మీరీ టపా ఇక్కడిదాకా చదవటమే తప్పు. అర్జెంటుగా కంట్రోలు ఎక్స్ కొట్టండి). అంటే వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం కాదా అనకండి.. నేననేది ఇదే అవకాశం మీ వూర్లో వస్తే మీరు కృషి చెయ్యరా అని? (చేస్తారా.. అయితే నా తరువాతి టపా తప్పకుండా చదవండి). మరో చిత్రం చూసారా - ఇప్పటిదాకా మనం చాలామంది బ్లాగరలను ముఖాముఖీ చూసిందిలేదు. అయినా ఏదైన విషయం వస్తే కత్తి మహేష్ అయితే ఇలా ఆలోచిస్తాడేమో, తాడేపల్లికి తెలిస్తే ఇంకో కొత్త తెలుగు పదం పుట్టిస్తాడు అనుకుంటాం. ముఖాలు తెలియకపోతేనేమి...?? కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే మనందరిలో అంతరాంతరాలలో తెలుగు బ్లాగర్ అనే ఒక సన్నని దారం సామ్యంగా కనపడుతోంది.
ఇప్పుడు అసలు విషయం -
మనమందరం పూలలాగా ఒక దారంతో కలిసిపోయి వున్నాం కదా.. అందరం కలిస్తే ఒక దండ అవుతాముకదా. ఆ దండకి ఇప్పుడు ఒక రూపం ఇవ్వాల్సిన అవసరం వుంది. నేననేది తెలుగు బ్లాగర్స్‌కి ఇప్పుడు ఒక చిహ్నం అవసరం. మనమందరం ఒకటి అని గుర్తుచేస్తూ వుండటానికి, సందర్భం వచ్చినప్పుడు చూసే వాళ్ళందరికి ఒహో వీళ్ళు ఫలానా కదూ అని చెప్పటానికి, ముఖాముఖి కలుసుకోని తెలుగు బ్లాగర్లందరికి ఒక రూపం తీసుకురావటానికి, ఏదైనా అవకాశం చిక్కినప్పుడు (పుస్తక ప్రదర్శనలాగా) దాన్ని బ్యానరు పైనా, బాడ్జీలపైనా వెయ్యటానికి, నాగ ప్రసాద్ లాంటివారు టీ షర్ట్‌పైన వెయ్యటానికి, తెలుగురత్న గ్రంధాలయంలో పెట్టే బ్లాగు ఈ-పుస్తకాలపైన వెయ్యటానికి, ప్రతి బ్లాగరు తన బ్లాగులో పెట్టుకొని బ్లాగు ప్రచారోద్యమంలో పాలు పంచుకోవటానికి, తరచుగా బ్లాగులగురించి వ్రాసే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఆ వ్యాసంలో ప్రచురించటానికి.. ఇంకా ఇలాంటివి ఒక ఇరవై ముప్పై అయినా వ్రాయచ్చు..!!
సరే చిహ్నం కావాలి...!! అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారా..?? చెప్తా అదీ చెప్తా -
అ) తెలుగు బ్లాగర్ల చిహ్నం తయారు చెయ్యమని బ్లాగర్లనే అడగటం/పోటీ పెట్టడం. (ఈ విషయం ఇదివరకే ప్రస్తావనకి వచ్చింది.. మళ్ళి ఒక ఆలోచన పారెయ్యండి). మన దగ్గర భగవాన్, వెంకట్ (వెంకటూన్స్), పృధ్వీరాజు లాంటి మంచి ఆర్టిస్టులు వున్నారు. వారు వేసినా సరే లేదా మరెవరైనా ఔత్సాహికులు వేసినదానికి మెరుగులు దిద్దినా సరే.
ఆ) రెండొవది చాలా సులభమైనది. ఎవరైనా పేరుమోసిన ఆర్టిస్టుని పట్టుకోని బాబ్బాబు మేమిలాగిలాగ తెలుగు బ్లాగర్లం అని చెప్పుకోని బొమ్మ గీయించుకోవడం. దీంట్లో వున్న ఇబ్బంది ఏమిటంటే సదరు ఆర్టిస్టుకి మన సంగతులు వివరంగా తెలియజేయాలి, ఆయనా తెలుసుకోవాలి అది బొమ్మలో రావాలి. రెండొవ సమస్య మన బ్లాగర్లు అలా "బయట"వారు వేస్తే కలుపుకుంటారా లేదా అనేది ప్రశ్న. (ఈ ఆలోచన నచ్చితే బాపూగారితోనే వేయించగలిగితేనే సార్థకత అని నా విశ్వాసం.)
ఇ) మూడొవది మరీ తెలివైనది - పుణ్యం పురుషార్థం ఆలోచన. మనం తెలుగు బ్లాగర్లం ఏదైనా పత్రికలో పోటీ ప్రకటిద్దాం. మాకు చిహ్నం చేసిపెట్టేవారు కావలెను అని. తయారు చేసి సాఫ్ట్/స్కాన్డ్ కాపీ పంపించండి, ఎన్నికైన బొమ్మకి పారితోషికం అని. అసలు ఆలోచనేమిటంటే సదరు ఆర్టిస్టుగారు బొమ్మ వెయ్యాలంటే వివరాల కోసం మనం ఇచ్చే లంకెలు పట్టుకొని కూడలి, పొద్దు నించి మొదలెట్టి బ్లాగులు చదివి ఆకళింపు చేసుకొని బొమ్మ గీసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రక్రియలో ఒక వందమంది అయినా "ఆర్టిస్టులు" బ్లాగులు చూస్తారు. (చదువరులు పెరుగుతారు, ఆర్ట్"ఇష్టులు" కాబట్టి మళ్ళీ వస్తారు, లేదా వారి బొమ్మలతో ఒక బ్లాగైనా పెడతారు.)
ఏది ఏమైనా ఇలాంటి చిహ్నం మనం తయారు చేసుకోవటం అవసరం, అత్యవసరం. తరువాతి టపాలో నేను చెప్పే కొన్ని విషయాలు ఇలాంటి చిహ్నంతో చేస్తే బాగుంటుంది. అందుకని యుద్ధప్రాతిపదికన మీ అభిప్రాయం వ్యాఖ్య రూపంలో చెప్పండి..!! (ఎందుకు బ్రదర్ అనవసర ప్రయాస అంటున్నారా సరే అదే చెప్పండి).
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 వ్యాఖ్య(లు):
@సత్యప్రసాద్ అరిపిరాల: ఇవి ఎలాగున్నవి?
http://wiki.etelugu.org/E-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B0%82_-_%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B9%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82
ఆలోచన బాగుందండీ... ముందస్తుగా బ్లాగరుల మధ్య పోటీ మొదలు పెట్టేయచ్చునేమో...
నెటిజన్ గారు మీరు ఇచ్చిన లంకె లో లోగో లు కూడా బాగున్నాయి. యానిమేషన్ లో ప్రేమ గుర్తుకు బదులు అక్షర మాల ఉపయోగిస్తే మరింత అర్ధవంతంగా ఉంటుందేమో...
చక్కగా చెప్పారు గురువుగారూ.మంచి ఆలోచన.నెటిజన్ గారిచ్చిన లింక్ లోవి బొమ్మలు కూడా బాగున్నవి.శుభస్య శీఘ్రం...
chaalaa baagunnadi mee soochana
మంచి ఆలోచన.
శుభస్య శ్రీఘ్రం!!
చిహ్నం అనగానే టపా పూర్తిగా చదవకముందే నాకు బాపుగారయితే బాగుంటుంది అనిపించింది.బాపుగారికి నా ఓటు. మన వివరాలు చెబితే కాదనరని నా అభిప్రాయం. బాపుగారు వేస్తే అది సంచలన వార్త కూడా కావొచ్చు. మనకి మరింత ప్రచారం.
తెలుగు బ్లాగర్ల emblem కోసం చిత్రకారుల కొరకై ప్రకటన పోటీ అన్న ఆలొచన బాగుంది. దీని వలన emblem తో బాటుగా ప్రచారం, కొత్త బ్లాగర్లు ఇంకా పాఠకులు. అంతా లాభమే. e-తెలుగు వారిని న్యాయ నిర్ణేతలుగా ఉంచితే బాగుండగలదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి