బ్లాగోగులు: తెలుగులోనే ఏల బ్లాగవలె?

నిన్నటి నా టపాకి నెటిజెన్‌గారి ప్రశ్న ఇది - తెలుగులోనే ఏల బ్లాగవలె?

చాలా చిన్న ప్రశ్న, కానీ సమాధానం పెద్దది అందుకే టపాగా రాస్తున్నా.

దీనికి రెండు రకాల సమాధానాలు -

అ)వ్రాయటానికి సంబంధించి

అ.అ)మనమందరం మా
తృభాషలోనే ఆలోచిస్తాం. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన సత్యం. మనం ఆంగ్లమో మరో భాషో మాట్లాడాలన్నా తెలుగులో ఆలోచించుకొని మాటల్లోకి వచ్చేసరికి తర్జుమా చేసుకుంటాం. అలా ఆలోచించటంలో ఒక సౌలభ్యముంది (Comfort). అదే ఆలోచనలను మాతృభాషలో వ్రాయటం సులభం, తర్జుమా చేసి ఆంగ్లంలో వ్రాసేకన్నా. ఈ మాట తెలుగేతర భాష తెలిసిన వారందరూ వొప్పుకుంటారనుకుంటున్నా. తెలుగులో బ్లాగు వ్రాయటానికి ఇదే ప్రాధమిక కారణం అని నేను నమ్ముతున్నాను.

అ.ఆ) తరువాతది - "నాకు తెలిసిన చాలా విషయాలు తెలుగులో చెప్పటం, తెలుగువారితో చదివించడం సులభం". కవిత్వం, పద్యం, సంక్రాంతి ముగ్గులు, బాపు రమణలు, తెలుగు సినిమా, వాలు జడలు, వయ్యారి భామలు, పంచె కట్టులు, పాపిటబిళ్ళలు, పరికిణీలు, బతుకమ్మలు, చిరంజీవి - చంద్రబాబు, నుడికారం, సామెతలు... ఇలాంటివి వేరే భాషలో రాయాలంటే (రాయచ్చు) ఈ పదాలకి అర్థం రాయాటానికే ఒక టపా రాయాలి. (పరికిణీ అంటే ఒక రకం డ్రస్సు అంటే సరిపోతుందా..?? అందులో వున్న అందం, వయ్యారం, ఠక్కున గుర్తొచ్చే తెలుగుతనం గురించి వేరే భాషలో ఎంతవరకు చెప్పగలరు..??)

అ.ఇ) మూడొవది భాషాభిమానం. దీని గురించి నిన్నటి టపాలో కూడా ప్రస్తావించాను.

అ.ఈ) నాకు తెలుగు మాత్రమే తెలుసు. వేరే ఏ భాషపైనా పట్టులేదు

రెండొవది: మళ్ళీ అదే పాయింటు. ఆ)పాఠకులు.

ఇంగ్లీషులో బ్లాగులు మొదలెట్టి తెలుగులోకి వచ్చిన వాళ్ళు మన గుంపులో చాలామందే వున్నారనుకుంటా. నేను కూడా ఒకడిని. (నకిలీ కణికుడి గురించి చెప్పే అమ్మవొడి బ్లాగు మరొక వుదాహరణ). ఇందాక చెప్పినట్టు తెలుగు వారు చదివి అసోసియేట్ (associate)చేసుకోవటం సులభమనే కారణం ఒకటైతే, ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన బ్లాగు అగ్రిగేటర్ల ద్వారా పాఠకులు దొరుకుతారు అనే నమ్మకం మరొకటి.

ఏ రకంగా చూసినా పాఠకులే ప్రాధమికం. అయితే ఈ ప్రశ్న మన ప్రచారోద్యమంలో కొత్త కోణం చూపిస్తుంది. అదేమిటంటే మనం ప్రచారం చేసేటప్పుడు ఏ విషయం పైన ఫోకస్ చెయ్యాలి అన్నది.

తెలుగులో వ్రాయటానికి కారణం పైన చెప్పిన ఫలానా ఫలానా అయితే వాటి గురించే ప్రచారంలో ప్రస్తావించడం అవసరం -

ఉదా:
అమెరికాలో వుండి సంక్రాంతి ముగ్గులు, హరిదాసు పాటలు మిస్స్ అవుతున్నారా?
మీ పిల్లలకి వేమన పద్యాలు రావని బాధపడుతున్నారా?
అయితే నేడే చూడండి తెలుగు బ్లాగులు..!!

(వచ్చే టపాలో: తెలుగు బ్లాగర్లకొక రూపం కల్పిద్దాం)

14 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

మిస్ అవ్వడం లేదు, కాని పెద్దలు చెబుతున్నారు నీ తల్లి భాష తెలుగు అని. ఒక కుతూహలం - అలా అని వాటేసుకోలేను. కొంచెం ఉత్సుకత. కొంత వింత గా కూడా ఉంటుది. ఎందుకంటే, ఇక్కడే పెళ్ళి చేసుకున్నాను. పిల్లలూ ఇక్కడే పుట్టారు. ఈ మట్టిలోనే కలిసిపోతాను. ఇంగ్లిష్‌లొనే ఆలోచిస్తాను. దెబ్బ తగిలినఫ్ఫుడు, "షి*" అనో "omg"అనో "జీజ్" అనో అనుకుంటాను. నా కెందుకు ఈ తెలుగు? నా పిల్లలకెందుకు ఈ తెలుగు? నా కెందుకు ఈ తెలుగు సంస్కృతి? ఆ ఆచారాలు ఆ వ్యవహారాలు? ఆ కట్టు, ఆ బొట్టు? నా వరకు నాకు తెలుగు మరొక భాష అంతే!

నాగప్రసాద్ చెప్పారు...

తెలుగులోనే అని ఏముంది. అసలు ఏ భాషలోనైనా ఎందుకు బ్లాగాలి?

సంస్కృతి,సాంప్రదాయాల విషయంలోకొస్తే, ముస్లింలు ఈ ప్రపంచంలో ఎక్కడ వున్నా, ఏ మారుమూల గ్రామంలోనో ఒకే కుటుంబం వున్నా కూడా, వాళ్ళు వాళ్ల పిల్లలకు వాళ్ళ భాషనే నేర్పిస్తారు. ఎందుకు? కేవలం తమ ఉనికి కోసం. ఆ ఉనికి కోల్పోతే ఏమవుతుంది?. (ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నాను).

కొద్దికాలం క్రితం పేపర్లో చదివాను. "రామసేతు" సముద్రంలో మునిగి పోకముందు, కొద్దిమంది తెలుగు వాళ్ళు వ్యాపారం కోసం శ్రీలంకకు వెళ్ళి, తిరిగివచ్చేటప్పటికి రామసేతు మునిగిపోతే వేరే దారిలేక ఆ దేశంలోనే వుండి పోవలసి వచ్చింది.
వాళ్ళు ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా తెలుగును మర్చిపోలేదు. ఇంకా సముద్రం ఆవల తెలుగు మాట్లాడేవాళ్ళు వున్నారని తెలుసుకొని చాలా సంతోషించారట, అలాగే ఈ సమాజంలో కలిసిపోవాలని కోరుకున్నారట.

మనం కేవలం ఆంగ్లం నేర్చుకుని, కంప్యూటర్ వాడగలిగినంత మాత్రాన మన మూలాల్ని మర్చిపోవాలా?

"తన ఉనికికి వృద్ధికి, కారణమైన వేర్లు భూమిలో ఉన్నంత కాలం ఏ చెట్టు అయినా పచ్చగా ఉంటుంది. ఫలాలనిస్తుంది...అలాగే తన ప్రగతికి దోహదమైన మూలాన్ని, దారిని మరిచిపోనంతకాలం ఏ మనిషి జీవితమైనా సుఖమయమవుతుంది".

durgeswara చెప్పారు...

నిజమె, నీకు తెలుగు అవసరం లేదు.కాని కన్న తల్లీదండ్రీ, కావాలా వద్దా ? వద్దనుకుంటే మనలను ఏమనుకుంటారు? అది నీకే తెలియాలి. మరొక చిన్న విషయం, నువ్వు చదువుకున్నందుకు అయిన ఖర్చు మెత్తం నీవే భరించలేదు. అది ఈదేశప్రజలు ఇచ్చిన భిక్ష.ఈ భాషలోనుంచే చిన్నతనం నుంచీ నీభావాలు తెలిపి అన్నీ పొందివున్న విషయం మరచి పోయివుంటావు. కానీ నువ్వెక్కడున్న నిన్ను ఈదేశస్తునిగానే ,అందులో తెలుగువానిగానే గుర్తిస్తారు. తల్లి ని మర్చిపోయేవానికైతే ఇవేవీ అక్కర లేదు.ఇంకొక విషయం ఇప్పుడు నీవు మాతో మాట్లాడుతున్నది కూడా తెలుగుతోనే.ఏమిటి మిత్రమా ఈ పరాధీనత. నీలాంటీ మేధావులే ఇలా ఆలో చిస్తే ...........

అజ్ఞాత చెప్పారు...

playing devil's advocacy netizen??

Sreenivas Paruchuri చెప్పారు...

సత్యప్రసాద్ గారు,

మీరు పైన "మనమందరం మాతృభాషలోనే ఆలోచిస్తాం. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన సత్యం." ఆధారాలు ఇవ్వగలరా? చెప్పిన పుస్తకం పేరో అన్న మనిషి పేరో ... Cognitive Sciences లో మనిషి ఒక భాషలో ఆలోచిస్తాడని నాకు తెలిసి ఎవ్వరూ అనరు. రెండవది మనకు మాతృభాష (ఇప్పుడుకొందరు తల్లి/అమ్మభాష అని కూడా అంటున్నారు) అనే పదం లేదు.అది ఆంగ్లంలోని mother-tongue కి ముక్కస్య ముక్క@H అనువాదం. మనకున్నది దేశభాష, దేవభాషలే. ఇంకామీరు పైబ్లాగులోను, అంతకు ముందు దానిలోను చెప్పిన విషయాలు భాషాశాస్త్ర పరంగాను, చారిత్రాత్మకంగాను నిలబడటం చాలా కష్టం.

నాగప్రసాద్ గారు: "ముస్లింలు ఈ ప్రపంచంలో ... పిల్లలకు వాళ్ళ భాషనే నేర్పిస్తారు" అని అన్నారు. నిరూపించగలరా? ఒకసారి మన తెలుగుదేశంలోనో, లేక మీరుండే తమిళనాడులోనే ఒక పల్లెటూరికి వెళ్ళి అక్కడ ఎంతమందికి "ఉర్దూ/అరబిక్/పర్షియన్" వచ్చో కనుక్కోండి.ఒకవేళ వాళ్ళు మాట్లాడేది పరాయి భాషలాగా ధ్వనిస్తే పరిశీలనగా వినండి.

"దేశభాషలందు తెలుగులెస్స" అనే పద్య పాదాన్ని ఉదహరించడం ఎప్పటికి మానుకుంటామో! ఆ అన్న పెద్ద మనిషి తెలుగు మీద బోలెడు ప్రేమతో ఏమీఅనలేదు. అలాగే పిల్లలకి వేమన పద్యాలు రావడం తెలుగుతనం యెప్పటి నుండి అయ్యింది?

-- శ్రీనివాస్

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

శ్రీనివాస్ గారూ

అహా...ఎన్ని రోజులకి ఒక్క మనిషి కనపడ్డారండి....అంటే నాలా ఆలోచించే మనుషులు కూడా ఉన్నారన్నమాట.... ఖచ్చితంగా కృష్ణదేవరాయలవారు మన తెలుగు మీద ప్రేమతో అనలేదనే నాకూ గట్టి నమ్మకం. అలాగే అందరూ నెత్తినెట్టుకునే సి.పి.బ్రౌన్ "దొర" కి మన భాష మీద అంత ప్రేమా లేదూ, "ఆర్థర్ కాటన్" కి గోదావరి జిల్లా ప్రజలంటే ప్రేమ కారీపోలేదు...ఎవరి "అజెండా" లు వారికున్నవి....ఆ అజెండాల సాధనలో ఈ ప్రేమలు దోమలు మనోళ్ల సృష్టే, పబ్బం గడుపుకోవటానికి....

ఏవో మాటలు మెదళ్ళో మెదులుతున్నాయి....:)...:)....

1) పిడుగులతో తుఫానులతో
భాషించేవాడిని, చెవిలో గుసగుసలతో పలకరిస్తే ఎట్లా?

2) పాము పడగ మీద చెయ్యెట్టి త్యాగం చేశానంటే ఎవడూ నమ్మేది ?

3) చదువుకున్నవాడు ఎలాగూ అటువైపు పోడు, తెలివితక్కువవాళ్ళకి చెప్పినా తెలియదు...

మంచి రసకందాయంలో పడాలి నాటకం....
కాబట్టి..ఇంతే సంగతులు చిత్తగించవలెను...

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాస్ గారూ, అమ్మభాష అనే పదం లేదంటున్నారు. ఒకప్పుడు లేకపోయి ఉండవచ్చు.., తరువాత వచ్చి చేరింది కదా, ఇప్పుడు ఉంది. మనకు లేని పదాలు బోలెడు, బయటి నుండి వచ్చి చేరుతున్నాయి అలాగే ఇది కూడాను. కాదా?

Unknown చెప్పారు...

నేను వ్రాసినది ఇంత వాడి వేడి చర్చ లేవనెత్తుతుందని అనుకోలేదు. నేను ఎంచుకున్న పరిధి దాటి చర్చ వెళ్ళినదని నా అభిప్రాయం. (నా వుద్దేశ్యం తెలుగు బ్లాగు ప్రచారం - అందులో భాగంగా మనం ఎందుకు బ్లాగుతున్నామో తెలుసుకొని అది ప్రచార విషయంగా (content) వాడుకోవటం). ఏది ఏమైనా తెలుగులో ఎందుకు బ్లాగాలి అన్న విషయాలపైన నాకు అనిపించిన విషయాలు వ్రాసాను. ఇవి కాక ఇంకా ఎన్నో కారణాలు వుంటాయి. అవి తెలుసుకోవటమే ఈ టపా వుద్దేశ్యం. మీరెవరైనా నేను రాసినవి సంపూర్ణం కావనుకుంటే మీరు ఎందుకు తెలుగులో బ్లాగుతున్నారో తెలియజేస్తే ఆ వివరం ఇలాంటి బ్లాగ్ ప్రచారానికి వుపయోగపడచ్చు.

నెటిజెన్‌గారు,
నావరకు తెలుగు మరో భాష మాత్రమే అన్నారు... మీరు చెప్పిన విషయాన్ని నేను గౌరవిస్తాను కానీ ఏకీభవించలేను. ఎక్కడో పుట్టి, పెరిగిన మీకు తెలుగు బాష తెలిసుండటం, తెలుగులో బ్లాగటమే అందుకు నిదర్శనం. పర్సనల్ అనుకోకపోతే మీ పిల్లలకి తెలుగు తెలుసా? ఎందుకు నేర్పించారు??

శ్రీనివాస్‌గారు,
మాతృ భాషలో ఆలోచించడం శాస్త్రీయమని ఎక్కడో చదివాను. అప్పుడు కూడా మా మిత్రుల మధ్య ఇలాంటి వాదనే జరిగింది. అదే ధైర్యంతో వ్రాసాను. రెఫరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాను, ప్రస్తుతానికి ఇవ్వలేనందుకు క్షమించండి.

నాగప్రసాద్‌గారు,
ముస్లింలే కాదు, మాతృభాష తెలిసిన ఏ ఇద్దరు కలిసినా అదే భాషలో మాట్లాడుకుంటారనేది అందరికీ తెలిసిన సత్యం. అందులో భాషాభిమానం వున్నా లేకపోయినా ఒక సౌలభ్యం వుందని అని నా అభిప్రాయం. ఇది ఒక్క తెలుగే కాదు, తమిళ్, మళయాలం, ఆఖరికి ఇద్దరు బీహారీలు కలిస్తే మైథిలి మాట్లాడుకుంటారు కానీ హిందీ మాట్లాడుకోరు...!!

దుర్గేశ్వరా,
మీరన్నది నిజం. నెనర్లు.

వంశీగారు,
ఎవరి ఎజెండాలు వారికున్నమాట నిజమే. నేను చెప్పేదికూడా అలాంటిదే. మనం బ్లాగర్లం బ్లాగ్ ప్రచార ఎజెండా నిర్ణయించుకుందాం. ఆ తరువాత తదనుగుణంగా అడుగులేద్దాం. బ్రౌను దొర తెలుగు ప్రేమ గురించి మనకప్పుడు అనవసరం... బ్రౌను దొర నిఘంటువు అంతర్జాలంలో వుందని చెప్పటం అవసరమౌతుంది... ఆలోచించండి....!!

చదువరిగారు,
"ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి... వెయ్యండి వీరతాడు.." మీరన్నది నిజం.

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

సత్యప్రసాద్ గారూ

వాడి వేడి చర్చ సంగతి బ్లాగు దేవుడెఱుగు...మా ఆవిడ వేసిన వేడి పకోడీలు, (నిజమయిన పకోడీలు సుమండీ!) మటుకు తిని వస్తున్నా.....నేను ఒక్క లైను గురించి మాత్రమే మాట్లాడాను..ఆ క్రిందనే " ? " మార్కులూ ఇచ్చాను...బ్రౌన్ నిఘంటువు అంతర్జాలంలో ఉన్న సంగతి నాకు తెలియదు..:)..నిజమా? అయ్యో...ఇలాటివాడా నాకు చెప్పేది, ఇక్కడ (వ్రా)రా(యే)సేది ?...:)..:)...

సరే అది అలా పక్కనబెడితే...అచ్చంగా నేనన్న అజెండాల మాట మీరన్నదే ....కాకపోతే నేనుదహరించిన మనుషులు తెలుగు వారు కాదన్నది మీరు గుర్తుంచుకోవలె....మరి ఈ భాషాప్రేమ ముదావహం ఎప్పుడు అవుతుందో మీరే తెలియచెయ్యవలె..:)...అది త్వరలోనే అవ్వాలి అని కోరుకుంటున్నాను...ఆ బాటలో చాలా మంది నడవగలరని అనుకుంటున్నాను...

పామరుడికి మరో పామరుడు
పండితుడికి మరో పండితుడు
సహజశత్రువులన్నమాట సత్యమౌరా
పండితుడికి పామరుడు శత్రువెటులయ్యెరా....
విశ్వస్థ వడ్డింపగా మెక్కిన సోమా?

ఇంకో మాట ...నేను మామూలుగా ఒక సారి (వ్రా)రా(యే)సాక రెండో సారి అటువైపు రాను...రాళ్ళ గుట్టలు పోగయితే, నేనెక్కడ బండలు వెతుక్కోవలసి వస్తుందో అని...ఒక బ్లాగు మిత్రుడు మళ్ళీ లింకు పంపితేనూ.....ఇంతే సంగతులు చిత్తగించవలెను...

అజ్ఞాత చెప్పారు...

@శ్రీనివాస్ పరుచూరి: "రెండవది మనకు మాతృభాష (ఇప్పుడుకొందరు తల్లి/అమ్మభాష అని కూడా అంటున్నారు). దీనికి అభ్యంతరం ఏమిటి?
చదువరి గారి వ్యాఖ్యని సమాధానంగా తీసుకోలేరా?

@సత్యప్రసాద్ అరిపిరాల: ఆంగ్లం, సంస్కృతం,ఫ్రెంఛ్,హింది లతో బాటు తెలుగు కూడా నేర్చుకున్నారు. జర్మన్ నేర్చుకుందామని అనుకుంటున్నారు.

ఇక మీరన్న "మనం ఎందుకు బ్లాగుతున్నామో తెలుసుకొని అది ప్రచార విషయంగా (content) వాడుకోవటం" - ఇవేనా, ఇంతేనా కారణాలు? :(

ఇక తెలుగులో బ్లాగడానికి కారణం - భాషకి పదునుపెట్టుకుందామని..తుప్పు వదలగొట్టుకుందామని.

నాగప్రసాద్ చెప్పారు...

@Sreenivas Paruchuri గారు, నేను పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే. మా ఇంటి పక్కనే ముస్లింలు వుండేవారు. నా చిన్నప్పుడు మా ఊరిలో కేవలం రెండే ముస్లిం కుటుంబాలు వుండేవి. కాని వాళ్ళకు వాళ్ళ భాష వచ్చు. వాళ్ళ పిల్లలకు కూడా మొదటగా వాళ్ళ భాషనే నేర్పుతారు. స్థానిక బాష చుట్టూ వున్న సమాజం ఎలాగూ నేర్పిస్తుంది కదా. కాబట్టి వాళ్ళకు రెండు భాషలూ వచ్చు. బహుశా వాళ్ళకు చదవడం, వ్రాయడం తెలియకపోవచ్చు. ఆ అవకాశం వస్తే వాళ్ళు చదవడం, వ్రాయడం నేర్చుకోవడం కూడా నేను చూశాను. అంతే కాని, వాళ్ళు ఏనాడు ఈ భాష నేర్చుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయా, డబ్బులు వస్తాయా అని ఆలోచించలేదు.

నేను చాలామంది ముస్లింలను చూశాను. వాళ్ళందరికీ వాళ్ళ భాష వచ్చు.

కొత్తగా మతం పుచ్చుకున్న "మైకేల్ జాక్సన్" లాంటి వాళ్ళను మినహాయిస్తే, ఈ ప్రపంచంలో వున్న ముస్లింలందరికీ వాళ్ళ భాష వచ్చని నా అభిప్రాయం.

>>"ఆంగ్లంలోని mother-tongue కి ముక్కస్య ముక్క అనువాదం".

mother-tongue ని తెలుగులోకి అనువదిస్తే వేరే ఏదో అర్థం వస్తుందనుకుంటా. :)

@సత్యప్రసాద్ గారు, నేను తెలుగులో బ్లాగడానికి, టపాలో మీరు చెప్పినవన్నీ కారణాలే.

Sreenivas Paruchuri చెప్పారు...

re:మాతృభాష--> మాట యెప్పుడు పుట్టిందనే కాదు,అసలు మనకి ఆభావన (/concept) లేదు.
నాగప్రసాద్ గారు: మీ యింటి పక్క వాళ్ళ భాష అంటున్నారు. ఏ భాషో చెప్పలేదు. ఒకవేళ అది ఉర్దూ అని మీరనుకుంటుంటే దానిలో ఎంత తెలుగుందో గమనించండి. తెలుగు పత్రికల్లో (బ్లాగుల్లోకూడా) నూర్ బాషా రెహమతుల్లా గారి రాతలు veelaitE చూడండి. చెప్పుకోవలసిన విషయమేమంటే కొద్దేళ్ళుగా తెలుగుదేశంలో ఇస్లాం (మత) సాహిత్యాన్నంతటినీ తెలుగు (లిపి) లోనే అందించే ఒక గొప్ప ఉద్యమం సాగుతుంది. హైదరాబాదు పుస్తక ప్రదర్శన నాకు తెలియదు కానీ, విజయవాడలో వాళ్ళ స్టాల్ ఉంటుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూడండి.

ఏమయినా, "ఈ ప్రపంచంలో వున్న ముస్లింలందరికీ వాళ్ళ భాష వచ్చని నా అభిప్రాయం." అన్న వాక్యం మళ్ళీ అన్నారు కాబట్టి, ఈ విషయంపైన చర్చ అనవసరమని అనుకుంటున్నాను. Lets agree to disagree and move on.

Regards,
Sreenivas

అజ్ఞాత చెప్పారు...

మాతృభాష అనే భావన ఒకప్పుడు లేకపోవడం నిజమే కావచ్చు. అప్పట్లో ఒక ప్రాంతంలోని ప్రజలంతా ఒకే భాష వాడుతూ ఉండి ఉండవచ్చు, జనబాహుళ్యానికి వచ్చింది ఒకటే భాష. అంచేత భాషంటే వాళ్ళకు ఒకటే భాష - తెలుగు. అదే దేశభాష అయింది.

కానీ నేటి పరిస్థితి వేరు. సమాజంలో ఒకటి కంటే ఎక్కువ భాషలు వాడుకలో ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు అనేకం. నా సంగతే ఉదాహరణగా తీసికొంటే... నాకు తెలుగొచ్చు. ఇంగ్లీషూ, హిందీ కూడా వచ్చు అని చెప్పుకోగలిగేంత వచ్చు. ఇప్పుడు నాకు సంబంధించినంతవరకు ఈ మూడింటి మధ్య తేడాను ఎలా చెప్పుకోవాలి? మమ్మ నాకు నేర్పిన భాష తెలుగు, అంచేత దాన్ని అమ్మభాష అంటున్నాను. మిగతావి నాకు పరాయివే. నా భావన తప్పయితే సవరించగలరు.

పోతే... మాతృభాషలో ఆలోచించడం.. నాకు తెలుగు పదాలు నేరుగా భావాన్ని అందిస్తాయి, అనుభూతిని కలిగిస్తాయి. ఇంగ్లీషు చదువుతూంటే.. అలా అనుభూతి కలగదు. (బహుశా అది నా అశక్తత కావచ్చు) ఉదాహరణకు ఆశ్చర్యం అనే మాట నాకు వాక్యంలో కనబడితే నా బుర్ర ఠక్కున అర్థం చేసేసుకుంటుంది - ఆ భావాన్ని, దాని అనుభూతిని నాకు అందిస్తుంది. సర్‌ప్రైజ్ అనే మాట అలా నాకందించదు. "మనమందరం మాతృభాషలోనే ఆలోచిస్తాం." అంటే అదేనేమో!

నాగప్రసాద్ చెప్పారు...

@Sreenivas Paruchuri గారు, ఈ విషయం మీద అనవసరంగా వాదించుకోవడమెందుకని, తమిళనాడులో వుంటున్న నా స్నేహితుణ్ణి కలిసి, ఇక్కడి ముస్లింల గురించి అడిగాను.

వాడు చెప్పాడు- "నిజమే!.ఇక్కడి ముస్లింలకు ఉర్దూ రాదు. ఎందుకు రాదు అని అడిగితే, "మేము తమిళ ముస్లింలము" అని చెప్పారట. అలాగే మీరు "మక్కా" వెళతారా అని వాడు అడిగిన ప్రశ్నకు, "మక్కాకు వెళ్ళడం ఎందుకూ, మేము ఇంట్లోనే పూజించుకుంటాం" అని చెప్పారట.

కాబట్టి ముస్లింల భాషాభిమానం విషయంలో నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను.

Anyway, Thanks for the information.