Unknown
"రామనాథం గారు పోయారట" అమ్మ చెప్పింది. నేనేమి పలకపోవడంతో మళ్ళీ తనే అంది - "మీ నాన్నగారు ఆయన మంచి స్నేహితులు, వూర్లోనే వున్నావు కదా పోనీ ఒకసారి వెళ్ళి చూసిరారాదూ"
"సరే వెళ్తాలే" అన్నాను చదువుతున్న పేపరు పక్కన పెట్టి.
నాన్న బతికున్నప్పుడు కూడా రామనాథంగారి గురించి చాలా సార్లు చెప్పేవాడు. ఆయన తరచుగా స్నేహితులతో చుట్టపక్కాలతో గొడవపడే విషయాలే ఎక్కువగా చెప్పినట్లు గుర్తు. రామనాధంగారికి మా నాన్న తప్ప ఇంకెవరూ స్నేహితులు లేరనీ కూడా చెప్పారు. నాన్న ఎలాగూ లేరు కాబట్టి ఆయన తరఫున కనీసం నేనైనా వెళ్ళి చూసి రావాలని అమ్మ ఆలోచన.
***
నేను అక్కడికి వెళ్ళేసరికి అట్టే జనం కూడా లేరు. ఒక మనిషి పోతే కనీసం పది మందైనా రాకపోతే ఇంక ఆయన బ్రతికి ఏం సాధిచినట్లు అనుకున్నాను. నన్ను కనీసం గుర్తుపట్టి పలకరించేవాళ్ళు కూడా లేరక్కడ. సాంప్రదాయబద్ధంగా శవాన్ని పడుకోబెట్టి, దండలూ అవీ వేసున్నారు. తల దగ్గర దీపం పక్కనే వాళ్ళ అబ్బాయి అనుకుంటా కూర్చోనున్నాడు. గడప అవతలగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో రామనాధంగారి భార్య కూర్చోని చెంగు నోటికి అడ్డం పెట్టుకోని చిన్నగా ఏడుస్తోంది.
నేను శవం దగ్గరగా వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. పల్చటి మనిషి, చామనఛాయ, తల మీద ఎక్కువగా వెంట్రుకలు లేవు, చిరాకుగా వున్నట్టు వుంది ముఖం. కొందరి ముఖాలంతే... ప్రతిదానికి చిరాకు పడుతున్నట్టు వుంటాయి. అలాంటి మనిషి అందరితో గొడవలు పెట్టుకున్నాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు అనుకున్నాను. అక్కడినుంచి రెండడుగులు వెనక్కి వేసి వాళ్ళ అబ్బాయిని పలకరించాలా లేదా అని ఆలోచించాను. అంతలో అతనే గుర్తుపట్టాడు -
"భీమేశ్వర్రావు గారి అబ్బాయా మీరు..?" అడిగాడు అనుమానంగా.
"అవునండీ.." అన్నాను ఇంకేం చెప్పాలో తెలియక.
"నాన్నకి మీ నాన్నగారు ఒక్కళ్ళే మంచి స్నేహితుడు... ఎప్పుడూ ఆయన్నే తల్చుకుంటుండేవారు.." అన్నాడు బాధగా.
"బాధ పడకండి.. మళ్ళీ స్నేహితులు కలుసుకోని వుంటారు" అన్నాను పైకి చూపించి. అతను చిన్నగా నవ్వాడు.
"ఇంకెవరైనా రావాలా?" అడిగాను ఏదో ఒకటి అడగాలి కాబట్టి.
"అన్నయ్య నాగ్పూర్ నుంచి బయల్దేరాడు. ఇంకొంచెం సేపట్లో రావాలి. నేను బాంబేలో వుంటాను. నాన్నకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి నిన్నే వచ్చాను" చెప్పాడతను.
"సరే" అంటూ మళ్ళీ రామనాధంగారికి చేతులు జోడించి బయల్దేరాను.
ఆ వీధి చివర ఒక చిన్న పాకలో టీ కొట్టు చూసి అక్కడ ఆగి టీ చెప్పాను. అప్పటికే అక్కడ నలుగురైదుగురు కూర్చోని మాట్లాడుకుంటున్నారు.
"ఎవరో పోయారట" అడిగాడు అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న బట్టతలాయన.
"అదే మన చిరాకు రామనాథం లేడూ.. రామనాధం.." ఒకాయన అన్నాడు వెటకారంగా.
"హమ్మయ్య.. పోయాడా? ఇంక మనకు రోజు ఆ పిచ్చోడితో గొడవలు తప్పినట్లే.." అన్నాడా మొదటి వ్యక్తి నవ్వుతూ.
"మరే లేకపోతే ఈ పాటికి ఇంత ప్రశాతంగా వుండేదా? ఎవరిమీదో అరుస్తూ గోల చేస్తుందేవాడు కాదూ" ఇంకెవరో గట్టిగా నవ్వారు.
చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడుకోవడం తప్పుగాను, ఇబ్బందిగాను అనిపించింది నాకు.
"ఎందుకండీ చనిపోయినవాళ్ళ గురించి అట్లా మాట్లాడతారు" అన్నాను నేను కల్పించుకోని.
"మీరెవరు? ఆయన బంధువా?" ఆడిగారు.
"లేదండి.. తెలిసినాయన. చూడానికి వచ్చాను" చెప్పాను టీ అందుకుంటూ.
"తెలిసినాయనా? ఆయన గురించి పూర్తిగా తెలియదనుకుంటా... లేకపోతే మీరు ఇలా మాట్లాడరు"
"ఏమైనా చనిపోయిన తరువాత ఎవరినీ అలా కించపరిచేలా మాట్లాడకూడదు" అన్నాను నేను. అక్కడ వున్నవాళ్ళందరూ ముఖముఖాలు చూసుకున్నారు.
"ఆయన మమ్మల్ని పెట్టిన ఇబ్బందుల గురించి వింటే మీరుకూడా మాలాగే అదే మాటంటారు... ఈ వీధిలో వున్నవాళ్ళందరితో గొడవపడందే రోజు గడవదు ఆయనకి తెలుసా" చెప్పాడు మధ్యలో కూర్చున్న వ్యక్తి.
ఈ వ్యవహారం ఏదో కొత్తగా వుంది నాకు. నాన్న చెప్పినంతలో రామనాధంగారి గురించి ఇంత చెడుగా ఎప్పుడూ చెప్పలేదు. ఏవో ఆదర్శాలు, నియమాలు అంటూ చాలా మందితో గొడవలు పడేవారని నాన్న చెప్పినా, అతనంటే పడనివాళ్ళు ఇంతమంది వున్నారా అని ఆశ్చర్యం కలిగింది. అసలు అదేమిటో తెలుసుకోవాలని వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను.
"ఏం చేసేవాడు?" అడిగాను.
" ఏం చేసేవాడా? ప్రతి దానికి చిరచిరలాడుతుంటాడు... అందుకే చిరాకు రామనాథం అని పేరు పెట్టారు మా వీధి కుర్రాళ్ళు. ఆయనకి అదో రకమైన పిచ్చి.. అన్నీ రూల్ ప్రకారమే జరగాలంటాడు.. సిగ్నల్ పడ్డ తరువాతే బండి కదలాలంటాడు.. రోడ్డుకి ఎడమ వైపే నడవాలంటాడు.. అదేంటి.. ఆ.. జీబ్రా క్రాసింగ్.. అక్కడే రోడ్డు దాటాలంటాడు.. ఎవరైనా అట్లా చెయ్యకపోతే మనిషికి ఎంత చిరాకో చెప్పలేము.." చెప్పాడు నా కుడివైపున్న వ్యక్తి.
"అందులో తప్పేముంది?"
"మీకు అలాగే అనిపిస్తుంది... అక్కడికి మేమేమీ రూల్స్కి విరుద్ధంగా నడుచుకుంటామని కాదు.. కానీ ఈ ట్రాఫిక్లో అవన్నీ ఎక్కడ సాధ్యమౌతాయి చెప్పండి... "
"అయితే"
"అయితే ఏమిటి.. ఆ రామనాధం వీధి వెంట పోతుంటే ఎవరో టర్నింగ్ తిరుగుతూ చెయ్యి చూపించలేదనో, రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నాడనో పట్టుకునేవాడు.. ఇహ వాళ్ళతో వాదన... రూల్స్ ఒప్ప జెప్పడం, సెక్షన్లు చెప్పి నువ్వు చేస్తున్న పనికి ఇంత జరిమానా వుందని ఒకటే గొడవ.." చెప్పాడు మరొకాయన.
"డబ్బులు తీసుకునేవాడా?" అడిగాను.
"తీసుకోని వదిలేసినా బాగుండు... ఇచ్చినా తీసుకునేవాడు కాదు.. పైగా లంచం ఇస్తావా అని మరో గొడవ చేసేవాడు..."
"మరి?"
"ఎవరైనా ట్రాఫిక్రూల్ తప్పితే బలవంతంగా పోలీసు దగ్గరకి తీసుకెళ్ళి చెలాన వ్రాయమనేవాడు..." అంటూ అతను పక్కనే వున్న ట్రాఫిక్కానిస్టేబుల్ని చూపించాడు. అతను తల నిలువుగా వూపుతూ అన్నాడు
"అమ్మో.. అతను వీధిలో నడుస్తుంటే మాకే భయం వేసేది.. ఎవడో సిగ్నల్ దాటేసి వెళ్ళాడని మమ్మల్ని పట్టుకోని వాయించేసేవాడు.. మీరు వుండి ఏం చేస్తున్నారని నిలదీసేవాడు.." అంటూ నిట్టూర్చాడు కానిస్టేబుల్.
వాళ్ళు ఎంత చెప్పినా అతను చేసినదాంట్లో నాకేమీ తప్పు కనిపించలేదు. అదే అన్నాను వాళ్ళతో.
"మీకు అలాగే అనిపిస్తుంది లెండి.. రూల్స్ మాట్లాడటం చాలా సులభం.. పాటించాలంటేనే తెలిసొస్తుంది.." చెప్పాడు బట్టతలాయన.
"ఆయన పాటించేవాడు కాదా?" అడిగాను మరింత కుతూహలంగా. సదరు రామనాధంగారి విషయాలు కొత్తగానూ, విచిత్రంగాను అనిపించసాగాయి నాకు.
"ఎందుకడుగుతారులే.. ఆయన పాటించక పోవడమా? మిన్ను విరిగి మీద పడ్డా తప్పేవాడు కాదు... అదే సమస్యంతా... ఆయన చెయ్యడు ఇంకొకళ్ళని చెయ్యనివ్వడు.. మొన్నా మధ్య సిగ్నల్ దగ్గర ఆయన బండి మీద వున్నాడు. వెనకెవరో హారన్ కొట్టాడని బండి దిగి అతనితో గొడవ పెట్టుకున్నాడు.. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది.." చెప్పాడు కానిస్టేబుల్. మరొకళ్ళు అందుకున్నారు -
"ఆ ఇంట్లో వాళ్ళు ఈయనతో ఎట్లా భరించారో గానీ.. సినిమా హాలుకి వెళ్తాడా.. ఎవరో లైన్ తప్పి వచ్చి టికెట్ తీసుకున్నాడని వాడితో గొడవ.. సినిమా అయినా వొదులుకుంటాగానీ ఇలా లైన్ తప్పి వచ్చేవాళ్ళను వదలను అంటాడు.. పిచ్చి కాకపోతే ఏమిటి?" అన్నాడు.
" ఆయనగారి రూల్స్ పిచ్చి తట్టుకోలేకే “చిరాకు రామనాధం” అనేవాళ్ళు అందరూ.. ఆయనకేమో మమ్మల్ని చూస్తే చిరాకు.. మాకు ఆయన్ని చూస్తే చిరాకు.." గట్టిగా నవ్వారు అందరూ.
"పొద్దున్నే నీళ్ళ పంపు దగ్గర గొడవ... లైన్లో రమ్మంటాడు... మొన్నామధ్య ఆ కనకయ్యని కొట్టినంత పని చేశాడు.."
"అవును... అదే కోపంతో మా ఇంట్లో కరెంట్ మీటర్ టాంపర్ చేశానని పట్టించాడు.. నా నా గడ్డి కరిచి లంచాలిచ్చి మళ్ళీ మీటర్ వేయించుకుంటే.. లంచాలెందుకు ఇచ్చావని మళ్ళీ గొడవకొచ్చాడు.." చెప్పాడు కనకయ్య. అప్పటి దాకా వింటున్న టీ కొట్టు కుర్రాడు కూడా వంత పాడాడు -
"ప్లాస్టిక్ కవర్లు వాడద్దని నా మీద ఒక రోజు గొడవ... పర్యావరణం అంటాడు... కవర్లతో ప్రమాదం అంటాడు.. మీరే చెప్పండి నేనొక్కణి వాడితే ప్రపంచం పాడై పోతుందా? నేనొక్కడ్నే మానేస్తే ఆగిపోతుందా?" అన్నాడు.
ప్రతి ఒక్కరికీ ఆయనతో గొడవలున్నాయని అర్థం అయ్యింది. అర్థం కానిదల్లా ఒక్కటే - రామనాథంగారు చెప్పినవన్నీ సబబుగానే వున్నాయి ఆ విషయాన్ని వీళ్ళెందుకు అర్థం చేసుకోవటం లేదు అని.
టీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ రామనాధంగారింటికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఆయన చిన్నబ్బాయి కనిపించాడు.
"అన్నయ్య వచ్చాడు.. బయట వున్నాడు కలిసారా?" అన్నాడు.
"కలుస్తాను" అని బయటికి వచ్చాను. బయట పురోహితుడితో మాట్లాడుతున్నాడు అతను. దాదాపు రామనాధంగారిలాగానే వున్నడు. కాకపోతే తల మీద మరి కాస్త జుట్టు వుంది. పురోహితుడు వెళ్ళిపోయాక నేను పలకరించాను.
"నమస్తే నేను భీమేశ్వర్రావు గారి అబ్బాయిని" చెప్పాను.
"ఓ.. మీరేనా.. ఇందాకా వచ్చి వెళ్ళారని చెప్పాడు తమ్ముడు..?" అంటూ ఆగిపోయాడు. “మళ్ళీ వచ్చారే?” అన్నట్లు అనిపించింది నాకు.
"ఏం లేదు.. మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది.. చివర టీ కొట్టు దగ్గర ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు.. అది విని.." చెప్పటం ఇష్టం లేక ఆగిపోయాను.
"ఏమనుకుంటున్నారు? చిరాకు రామనాధం అనా? అందరితో గొడవలు పెట్టుకునేవాడనా?" అతను అంటుంటే అతని కళ్ళలో నీరు.
నేనేమి మాట్లాడలేదు, అతని భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నొక్కాను.
"నాన్నకి రూల్స్ అంటే పిచ్చి అనుకుంటారు అందరూ... కాదు.. ఆయనకి జనం అంటే పిచ్చి... అలాంటి నియమాలు వుంటే మన అందరి జీవితాలు బాలెన్స్గా వుంటాయని చెప్పేవాడు. జీవితాంతం ఎలాంటి నియమాన్ని దాటలేదు ఆయన. ఆయనకి ఇష్టం లేని నియమాలు చాలా వున్నాయి, అయినా అవన్నీ పాటించేవాడు.. అలా పాటించని వాళ్ళంటే ఆయనకి చిరాకు, కోపం, జాలి కూడా. అందుకే అందరితో అలా గొడవలు పెట్టుకునేవాడు. ఇంటికొచ్చి ఎంతో మధన పడేవాడు. ప్రపంచం అంతా పద్ధతిగా వుండాలని కలవరించేవాడు.. అలాంటి ప్రపంచం ఇక సాధ్యంకాదని అమ్మతో చెప్పారట.. తెల్లవారేసరికి గుండె ఆగిపోయింది...." చెప్తూనే ఏడ్చాడు అతను.
నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే సరికి అతను లోపలికి వెళ్ళిపోయాడు. నాకెందుకో అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఆయన అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతుంటే అవన్నీ చూస్తూ స్తబ్దుగా వుండిపోయాను. ఎత్తుబడి జరిగిపోయింది..
"గోవిందా గోవిందా అంటూ పడమటివైపు కదలండి" చెప్పాడు పురోహితుడు. నేను అప్రయత్నంగానే కల్పించుకున్నాను.
"అటు కాదు.. రోడ్డుకి ఎడమ వైపున నడుస్తూ చివరిదాకా వెళ్ళి, అక్కడ క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటి ఇటు వెళ్ళండి" చెప్పాను.
"కానీ శ్మశానం ఇటు వుందండీ" అన్నారెవరో.
"ఆయన చెప్పినట్లే చేద్దాం" అన్నాడు రామనాధంగారి పెద్ద కొడుకు నా వైపు చూస్తూ. నేను చెప్పినట్లే అంతిమ యాత్ర మొదలైంది.
ఇప్పుడు మీరు గాని జాగర్తగా గమనిస్తే రామనాధంగారి ముఖంలో చిరాకు మచ్చుకైనా కనిపించదు..!!
("సురభి" తెలుగు మాస పత్రిక అక్టోబర్ సంచికలో ప్రచురితం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 వ్యాఖ్య(లు):
raamanatham paatra chitranaa..katha ettugadaa baagunnaayi..alaane poruguvaari pratispandana koodaa vaastavikam gaa undi..aite ee katha ki vaastavam lO mugimpu undadanukontaa..!!
మీ రామనాథం గారు నాకు తెలుసు! అప్పుడెప్పుడో నేను రాసుకున్న మా ఊరి సణుగుడు మేళం పరంధామం గారి అన్నయ్య ఈయనే! ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి