అలిగితివా సఖీ ప్రియా.. (కథ)

ప్రియని పలకరిస్తే మాట్లాడటం లేదు. ఏమైందో తెలియడంలేదు. ఇప్పటి వరకూ బాగానే వుంది, మరి ఇంతలోనే ఏమైందో అర్థం కావటంలేదు. అప్పటికి నా చెల్లెలు రమ  పెళ్ళై, ఆమెని అత్తగారింటికి పంపించి కొన్ని గంటలైనా కాలేదు. ఎంతో ఘనంగా పెళ్ళిచేశానని అందరూ అంటుంటే ఆనందం అరగంటైనా నిలవలేదు. విషయం నలుగురికీ తెలిస్తే ఇంకేమైనా వుందా? ఆడపడుచు పెళ్ళిలో అలిగిందంటే ప్రియకి ఏమైనా గౌరవం నిలిస్తుందా.. భర్తగా నాకు ఎంత తలవంపులు.

"ఏరా శివం.. మొత్తానికి పెళ్ళి దివ్యంగా జరిపించావు.. తండ్రిలేకపోయినా లోటు లేకుండా అమ్మాయిని అత్తారింటికి పంపించావు. ఇంతకన్నా ఇంకా ఏం కావాల్రా?" అన్నాడు సుబ్బయ్య తాత. ఆయనికి ఇంకా ప్రియ అలక సంగతి తెలిసినట్లు లేదు. నేను చిన్న నవ్వు నవ్వి వూరుకున్నాను.

అలిగితే అలిగింది, అదేదో ఇంటికి వెళ్ళాక తీరిగ్గా అలగొచ్చు కదా. ఇలా కల్యాణ మంటపంలోనే అలిగితే నలుగురూ ఏమనుకుంటారో అన్న ఇంగితం వుండక్కర్లేదా? ఒక్కొక్కరే బంధుజనం అంతా కదులుతున్నారు. అవతల తెల్లవారితే  రమ అత్తగారింట్లో సత్యన్నారాయణ వ్రతం. రెండు రోజులుగా నిద్ర సరిగ్గా లేక ఇప్పటికే సగం తల నొప్పి పుడుతుంటే ఇప్పుడు ఈమెగారి అలక మరో సగం తల నొప్పై కూర్చుంది.

"ఏరా పలకవూ.. మరి మేం బయలుదేర్తాం రా.." అన్నాడు సుబ్బయ్యతాత మళ్ళీ.

"అలాగే తాతా.. మన కారు వుంది.. నిన్నూ, బామ్మని దిగబెట్టమని చెప్తాను.." అన్నాను.

"ఎందుకురా శ్రమ.. దీక్షితులు లేడూ ఇక్కడే ఎక్కడో వనస్థలిపురంలో వుంటాట్టగా.. రమ్మని ఒకటే పోరు.. పోయి వాళ్ళింట్లో రెండ్రోజులు వుండి తరువాతే ప్రయాణం" చెప్పాడు తాత.

"వనస్థలిపురమంటే దగ్గరేం లేదు తాతయ్యగారూ.. చాలా దూరం.. మళ్ళీ మీరు బస్సు ఎక్కాలంటే ఇబ్బంది పడతారు." మట అన్నది నేను కాదు. వెనక్కి తిరిగి చూద్దును కదా - ప్రియ. నన్ను చూసీ చూడనట్లుగా వుండిపోయింది.

"పోనీలేమ్మా.. కార్లో తీసుకెళ్తాడు కాకపోతే వచ్చేటప్పుడు కొంచెం శ్రమ అంతే." అన్నాడు తాత.

"మరేం ఫర్వాలేదులెండి.. మీరు మళ్ళీ ఇటు రావాలనుకున్నప్పుడు కబురు చెయ్యండి.. ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకువస్తారు" చెప్పింది ప్రియ.

నాకు తల గిర్రున తిరిగినట్లైంది. ఇందాకే కదా నేను పలకరిస్తే మూతి తిప్పుకుంటూ పలకకుండ పోయింది.. ఇంత లోనే నవ్వుతూ మాట్లాడుతోంది. ఆహా రెండు వైపులా పదునున్న కత్తి అంటే ఇదే కాబోలు.!!

"ఏమైనా బంగారం లాంటి పిల్లరా.. పెద్దవాళ్ళంటే అంత మాత్రం గౌరవం రోజుల్లో ఎవరికి వుంటుంది చెప్పు?" తాతయ్య అలా పొగిడేస్తుంటే నాకు మంట నెత్తికెక్కుతోంది.

చిన్నగా అక్కడినుంచి తప్పించుకోని ప్రియ వెనకాలే వెళ్ళాను. విడిది గది మొత్తం సర్దేసి ఆడవాళ్ళంతా అక్కడ మీటింగ్ పెట్టారు. ప్రియ నేరుగా వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంది.

"ఏమ్మా మరదలా.. మొత్తానికి రమ పెళ్ళి ఘనంగా చేయించావు.. అత్తామామలు లేకపోయినా బాధ్యతగా చేశావు.." అభినందిస్తోంది నాకు అక్కవరసైన సావిత్రి.

"నాదేముందిలే వదినా.. మీలాంటి వాళ్ళు సహాయం చెయ్యబట్టే.." మా ఆవిడ సిగ్గుపడుతుంటే, మా పిన్ని అందుకుంది.

"అదేం మాటలేవే... మేమెంతమంది వుంటే మాత్రం ఏం లాభం? సంబంధం చెప్పామా? కన్యాదానం చేశామా? పుణ్యమంతా మీ ఇద్దరిదే? ఏరా ఏమంటావ్?" అంటూ నావైపు చూసింది.

"అవును పిన్ని.." అన్నాను మొహమాటంగా నవ్వుతూ. ప్రియ నావైపు భావం పలకకుండా చూసింది. అలా చూడగలగటం కేవలం ప్రియకి మాత్రమే సాధ్యమని నా అభిప్రాయం. మీరు కాదంటే, కేవలం ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం అని మాత్రం చెప్పగలను.

నేను వీలైంత దీనంగా ముఖం పెట్టి ప్రియను బయటికి రమ్మనమని సైగ చేశాను. ప్రియ కొంచెం కళ్ళు పెద్దవి చేసి కొంచెం పద్ధతిగా బెదిరిస్తూ తల అడ్డంగా వూపింది. నేనేం చేసేది..? అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఇలాగే రమ్మంటే ఇలాగే బెదిరించేది.. అయినా అది సరసం.. మరి ఇప్పుడు..! నా ఖర్మ.!!

అసలు ఎందుకు అలిగింది? ప్రస్తుతానికి అంత తీవ్రంగా కనపడటంలేదు.. అలక తీరిందా లేక తర్వాతి డోసు ఇంటి దగ్గర పెడుతుందా? అర్థమే కావటంలేదే..!!

" ప్రియా.. నా పంచె అదీ ఎక్కడున్నాయి.. అన్నీ సరిగ్గా సర్దావా?" ఏదో ఒకటి అడగితే సమాధానం చెప్తుందేమో అని చూశా.

"సర్దాను" అంది పొదుపుగా. అసలింత పొదుపుగా వుంటుంది కాబట్టే ఇంత మాత్రం పెళ్ళి చెయ్యగలిగాను. కానీ మాటల్లో పొదుపు ఏల? ఇంక అక్కడ నిలబడి ప్రయోజనం లేదని అర్థమైంది. అక్కడ్నుంచి కదిలి, మా బాబాయి కొడుకుని వెంటబెట్టుకోని బయటకు వచ్చి సిగరెట్ వెలిగించాను.

వాడేదో వాడి వుద్యోగం సంగతి చెప్పి, ఎక్కడైనా వేరే వుద్యోగం చూడమని చెప్తున్నాడు. నా మనసు మాత్రం అక్కడే విడిది గదిలో ఆడవాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది.

ఏమై వుంటుంది? పట్టు చీరలు కొనుక్కుంటానంటే కాదనలేదు.. నగలు తనే వద్దంది.. ఏమన్నా పెట్టేదుంటే రమకే పెట్టండి అని బాధ్యతగా చెప్పింది. ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి - పెళ్ళి భాధ్యత భుజాన వేసుకోని మొత్తం జాగ్రత్తగా మాట రాకుండా జరిపించింది. ఇంతలోనే ఏమైందో అర్థం కావటంలేదు. అసలు ఎప్పుడు అలక మొదలింది? పెళ్ళి అయిపోయిన తరువాత? ఇంకా ముందేనా? ఇప్పుడు ఆలోచిస్తే గుర్తుకొస్తోంది.. నిన్న కూడా నేరుగా నాతో మాట్లాడింది తక్కువ. ఏదో అవసరానికి కొబ్బరికాయలు ఎక్కడున్నాయి? బాషికాలు ఎక్కడున్నాయి? అంటూ అడిగిందే కానీ వివరంగా మాట్లాడిందే లేదు. పెళ్ళి హడావిడిలో వుంది లెమ్మనుకున్నాను. నేనూ అదే హడావిడిలో పడిపోయాను.

***

"ఏరా ఇంకా మానలేదా నువ్వు?" మామయ్య వరసయ్యే పెద్దమనిషి, నా చేతిలో సిగరెట్ చూసి, చురుగ్గా అనేసి వెళ్ళిపోయాడు. నేను సిగరెట్ పడేసి మళ్ళీ లోపల ఆడవాళ్ళ మీటింగ్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు పెట్టెలు, బ్యాగులు ఒక మూలకి తోసి పడుకున్నారు. వాళ్ళ వివాహానంతర విశ్లేషణ ఇంకా కొనసాగుతోంది.

"ఎన్ని చెప్పు.. పెళ్ళికొడుకన్నా మన పిల్ల లక్షణంగా వుందే.. బాగా వున్న సంబంధమేనా?" చిన్నత్తయ్య అడిగింది.

"లేకనే.. కట్నం నయా పైసా అడగకపోతిరి.. లాంచనాలు ఏదో సాంప్రదాయానికి తప్పించి ఏం గొతెమ్మ కోరికలు లేవు.. ఇంకా ఏం కావాలి?" అంటోది మా వదిన. నేను గొంతు సవరించుకోని ప్రియ వైపు చూసి -

"ప్రియా.. సత్యనారాయణస్వామి వ్రతానికి పెట్టాల్సిన బట్టలు ఎక్కడున్నాయి?" అన్నాను.
నేను అనవసరంగా మాట్లాడించడానికే వచ్చానని ప్రియకి అర్థమైనట్లుంది, నోరు విప్పకుండా దూరంగా వున్న పెట్టవైపు చూపించింది. నాకు ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి.

"సరే.. ఓకే.. ఇంకో గంటలో మనం బయలుదేరాలి రెడీగా వుండు.." అనేసి సమాధానం కోసం ఎదురుచూడకుండా వచ్చేశాను.
మంటపంలో డెకరేషన్ మొత్తం తొలగిస్తున్నారు. కుర్చీలు ముందు మూడు వరసలు వదిలేసి మిగతావన్నీ తీసేస్తున్నారు.

"ఇవి కూడా తీసెయ్యి.. ఇంకో గంటలో మొత్తం ఖాళీ చేస్తాం" అరిచాను నేను కుర్చీలు సర్దుతున్న పిల్లాణ్ణి వుద్దేశించి.

"అమ్మగారు అంతవరకూ వుంచమన్నారు సార్.. ఎవరైనా బంధువులు కూర్చోవాలంటే అసలు లేకుండా చెయ్యద్దన్నారు" చెప్పాడు వాడు దూరం నుంచే.

ఓహో.. అయితే అలిగి పనీ చెయ్యకుండా కూర్చోలేదన్నమాట.. అన్నీ చేస్తూనే వుంది. అంటే అలక నా మీదే అన్నమాట. అసలు అలక అనే విద్య ఆడవాళ్ళకి ఎలా అబ్బిందో కానీ, మొగవాడికి ఇంతకన్నా సస్పెన్స్ ఇంకొకటి వుండదు. నాకు ఇప్పుడు రెండు రకాల టెంన్షన్లు - మొదటిది ప్రియ ఎందుకు అలిగిందో అని, రెండొవది ఇలా అలిగిందని తెలిస్తే నలుగురిలో నా పరువేం కావాలీ అని. నేను భయపడినంతా అయ్యింది. మరో అరగంటలో చిన్నత్తయ్య వచ్చి నా ముందు కూర్చోని అడిగింది -

"ఏరా కాముడూ.. ప్రియ నువ్వు ఏమైనా ఘర్షణ పడ్డారా?" అంటూ.

".. .. లేదే.. అట్లాంటిదేమీ లేదత్తయ్యా.. ఏం?" అన్నాను ఇబ్బందిగా.

"ఏమోరా నాకనిపించింది.. నువ్వు మాటి మాటికి దాన్ని పలకరించడం, అది పలకపోవటం.. చూస్తూనే వున్నా" అంది ఆరా తీస్తూ.

"అబ్బే.. బడలిక అత్తయ్యా.. పాపం" అన్నాను.

"అలాగైతే మంచిదే.. అయినా ఒక్కసారి గమనించుకో.. చెల్లెలు పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెట్టావనో, చీరలో నగలో కొనివ్వలేదనో.. కనుక్కో.. నలుగురికీ తెలిస్తే బాగుండదు" అని నా సమాధానం వినకుండా వెళ్ళిపోయింది. నేను కాదంటున్నా నమ్మటంలేదంటే, ప్రియ అలిగినట్లే అని నిర్థారించుకుందన్నమాట. ఈమెకు ఒక్కదానికి తెలిస్తే చాలదూ.. మొత్తం బంధువులందరికీ తెలిసిపోయినట్లే. ఎలాగైనా ప్రియతో వివరంగా మాట్లాడాలి.

అలా అనుకున్న సరిగ్గా అరగంట తరువాత అవకాశం వచ్చింది.

రమ అత్తగారింటికి వెళ్ళాలని వేరే గదిలో ఒక్కడినే తయారౌతూ వున్నా. ప్రియ చీర మార్చుకోడానికి గదిలోకే వచ్చింది.

"చీర మార్చుకోవాలి" అంది ఎక్కడో చూస్తూ. నాకు అది మంచి అవకాశంగా కనిపించింది.

"మార్చుకో" అన్నాను తుంటరిగా

"మీరు బయటికెల్తే.." అంటూ ఆపింది. సామన్యంగా ఒంటరిగా వున్నప్పుడు "మీరు" అనే గౌరవ వాచికం ఉండదు. ఇదొక స్పెషల్ ఎఫెక్టు.

"నేను వెళ్ళకపోతే..?" అన్నాను మంచం మీద కూర్చుంటూ.

"నేనే వెళ్తాను.." వెనక్కి తిరిగింది. నాకు దిమ్మతిరిగింది. కాళ్ళబేరానికి వస్తుందనుకుంటే ఇలా అడ్డం తిరిగింది. ఇక నేనే కాళ్ళబేరానికి వచ్చాను.

"ప్లీజ్.. ఒక్క నిముషం ఆగు వెళ్తాను.." అన్నాను

"సరే" అంటూ నిలబడింది.

"ఎందుకా అలక?" అడిగను సూటిగా.

"నేనేం అలగలేదే" అదే సమాధానం వస్తుందని నాకు ముందే తెలుసు.

"నాతో నువ్వు మాట్లాడట్లేదు.. విషయం స్పష్టంగా తెలుస్తోంది. నాకు కాదు.. వచ్చిన బంధువులకు కూడా" అన్నాను కాస్త అసహనంగా.

"తెలిసింది కదా.. ఇప్పుడు ఎందుకు అలిగానో కూడా తెలుసుకోండి" కోపంగా చెప్పింది ప్రియ.

"అది తెలియకే కదా.. సరే నువ్వే చెప్పు"

"చెప్తాను..! మరి నేను అడిగింది ఇస్తారా?" అంటూ మెలిక పెట్టింది. గుండె కలుక్కుమంది.. అయినా తప్పదు కదా!

"సరే చెప్పు.. ఏమిస్తే నీ అలక తీరుతుందో" అన్నాను.

"రెండు లక్షలు" బాంబు పేలినట్లైంది గదిలో.

"రెండు లక్షలా.. ఎందుకూ?" అర్థం కాక అడిగాను.

"అవును రెండు లక్షలు.. నాకు కాదు.. మా నాన్నకి.. ఇస్తారా?" మరో బాంబు.

"మళ్ళీ ఇదేంటి? మీ నాన్నకి ఎందుకివ్వాలి?" అడిగాను పంతంగా.

"ఎందుకంటే మీరు మా నాన్న దగ్గర తీసుకున్నారు కాబట్టి.."

"ఎప్పుడూ"

"కట్నంగా"

"కట్నమా?" ఆశ్చర్యపోయాను.

"అవును మన పెళ్ళి సంబంధం మాట్లాడినప్పుడు మీ అమ్మ ఏమని చెప్పింది? మాకు ఆడపిల్ల వుంది, వీడి కట్నం డబ్బుల్తోనే దానికి కట్నం ఇవ్వలి అని చెప్పిందా?"

"అయితే"

"అయితే ఏముంది.. ఇప్పుడు మీ చెల్లెలి పెళ్ళికి కాణీ కట్నం ఇవ్వలేదు కాబట్టి డబ్బులు తిరిగివ్వాలి కదా?" అంటూ సూటిగా చూసింది ప్రియ.

నాకు ఆమె చెప్పింది అర్థం కావటానికి రెండు క్షణాలు పట్టింది. వెంటనే తేరుకోని -

"ఇదెక్కది చోద్యమే? ఎప్పుడో అయిదేళ్ళక్రితం మాటవరసకి అన్న మాటలు అవి.." అన్నాను. అన్నానే కానీ నేను చెప్పినదాంట్లో అర్థంలేదని నాకు అర్థం అయిపోయింది.

"ఏం? అప్పుడు కట్నం ఇవ్వలేను అని మా నాన్న అంటే కారణం చెప్పేకదా తీసుకున్నారు? డబ్బు అవసరం లేకుండానే మీ చెల్లెలి పెళ్ళి జరిగిపోయింది కదా? ఇంకా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు రోజు చెప్పిన మాటలకి విలువ వున్నట్టా లేనట్టా? డబ్బు తిరిగి ఇవ్వాల్సిన న్యాయం వుందా లేదా?" కోపంగా అంటుంటే ప్రియ చెప్పేదీ నిజమే అనిపించింది. నిజానికి ఎక్కడో నా మనసులో తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది.

"సరే ఇచ్చేస్తా.. కానీ ఒక్కసారిగా అంటే ఎట్లా చెప్పు? ఇప్పుడేగా ఇంత ఖర్చైంది.. నెల నెలా కొంచెం కొంచెంగా ఇచ్చేస్తా" సర్ది చెప్పాను.

ఆమె తీవ్రంగా "సరే" అంటూ నా వైపు చూసింది. ఆమె కళ్ళలో చూడలేక తల దించుకుని బయటికి వచ్చాను. అప్పుడే కాదు చాలాకాలం వరకు, అంటే కట్నమనే అప్పు తీరేవరకు నాకు ఆమె కళ్ళలో చూడాలంటే అదే గిల్టీ ఫీలింగ్ కలిగేది.

***
Category:

1 వ్యాఖ్య(లు):

రాఘవ చెప్పారు...

ఎలా చేరానో తెలియదు కానీనండీ, ఈ మీ గూటికి చేరాను, ఈ కథ చదివాను. బాగా వ్రాసారు. కథావస్తువు ఎంపిక బాగుంది. కథనం కూడా క్ఌప్తంగా హాయిగా సాగిపోయింది. అభినందనలు.