స్వప్న హాస్య కథల పోటీలో నా కథకి బహుమతి



స్వప్న మాసపత్రిక జన్మదినసంచిక హాస్య కథలపోటీ ఫలితాలు ఆగస్టు సంచికలో ప్రకటించారు. అందులో నా కథ “మంత్రిగారి సమాధి” కి మొదటి బహుమతి (పి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి పురస్కారం) లభించింది. కథ చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!

బ్లాగు పునఃప్రారంభ ఆహ్వాన పత్రిక...



"ఎన్నాళ్ళకెన్నాళ్ళకి...!!"

"అవున్నిజమే..! చాన్నాళ్ళైంది..!! అయితే అయింది వచ్చేశాగా ఇంకా డిస్కషన్ ఎందుకు..!!"

"అబ్బెబ్బే వూరికే వచ్చేశామంటే ఎలా కుదురుతుందీ? మరి ఇన్నాళ్ళూ ఏమైపోయారు? ఎక్కడ దాక్కున్నారు? ఏం చేస్తున్నారు? ఇవన్నీ వివరంగా చెప్పాలి కదా.."

"చరిచే చెయ్యి, వాగే నోరు వూరుకుంటాయా? అన్నీ చెప్తాగా.. కొంచెం ఓపిక పట్టాలి మరి.."

"ఊరికే చెప్తామంటే కుదర్దు... మీరు లేకుండా ఇక్కడ ఎన్నెన్ని జరిగిపోయాయో తెలుసా? బ్లాగుల్లో కొత్త నీరు వచ్చింది.. పాత నీరు పోయింది... కొంత నిలవ నీరు నిలయవిద్వాంసులై స్థిరపడిపోయారు... మరి మీరేంటి పాత సారా ఇన్ కొత్త సీసానా లేక సరికొత్త సారా ఇన్ పాత సీసానా?"

"అబ్బే శుభమా అంటూ పునఃప్రారభిస్తుంటే సీసాలేమిటీ సారాలేమిటీ?"

"అబ్బే సారా సంగతి వదిలి సారాంశాన్ని మాత్రం అర్థం చేసుకోండి చాలు... 

“అది సరేకానీ నేను లేకుండా పోయిన ఇన్ని రోజులూ బ్లాగర్లకి ఎలా గడిచాయి... నన్ను అందరూ తల్చుకున్నారా? అరిపిరాల తిరిగి రావాలి అని ఎవరైన నిరాహారదిక్షలు గట్రా తలపెట్టారా? బందులు ధర్నాలు వగైరా...”

“ఏం గోటు.. ఏం గోటు.. ఏం తీట.. ఏం తీట.. వెనకటికి నీలాంటిదే ఒక ముసలమ్మ వుండేదంటలే... రోజూ పొద్దున్నే ఆ ముసలమ్మ కోడి లేచి కూస్తే చుట్టుపక్కలవాళ్ళు లేచేవారట... ఆమె రాజేసిన పొయ్యి లోనుంచి నిప్పు తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ పొయ్యిలు రాజేసుకునేవారట..”

“బాగుందే కథ.. ఆ తరువాత?”

“ఏముంది... అసలు నేను లేకపోతే ఈ వూర్లో జనం ఎట్టా లేస్తారు, పొయ్యి రాజేసుకోకుండా ఎట్టా బతుకుతారు అని అనుమానం వచ్చి ఒక రాత్రి ముసలమ్మ అడవికి వెళ్ళి కూర్చుందంట... ఎప్పుడో మధ్యాహ్నం కట్టెలు కొట్టుకునేవాడు చూసి ఏంటి పెద్దమ్మా ఇక్కడున్నావు? అంటే... వార్నీ నేను లేకుండా మీకు ఎట్టా తెల్లవారిందిరా అబ్బాయి అని అడిగిందట..”

“అంటే ఏమంటావు?”

“ఇంకా అనేదేముంది.. అర్థం కాలా?”

“సరే... అర్థం అయ్యిందిలే కానీ ఇంకేమిటి విశేషాలు?”

"విశేషాలు కాదు.... ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి?"

"దేని గురించి?"

"ఇంకేముంది... తెలంగాణ... వస్తుందా? రాదా? వస్తే మీరు మద్దత్తిస్తారా? ఖండిస్తారా? రాకపోతే నిరసిస్తారా? నీరసిస్తారా? మీకు వస్తే లాభమా రాకపోతే లాభమా?"

"ఏమిటండీ మీ ప్రశ్నలూ మీరూనూ..."

"హన్నా...  ఆ కప్పదాటు వ్యవహారాలు, కుప్పిగంతుల వేషాలు నా దగ్గర కాదు... విషయం చెప్పండి ముందు.."

"మనకెందుకండీ ప్రాంతీయవాదాలు, నినాదాలు, విభేదాలు? ఎంచక్కా కబుర్లు చెప్పుకుందాం.."

"సరే చెప్పండి వింటాం..."

"సరే ఇంక కాచుకోండి...!!"

హంసినిలో నా కథ

గతంలో హంసిని అంతర్జాల పత్రిక నిర్వహించిన ఉగాది కథలపోటీలో ప్రశంసా పత్రానికి ఎన్నికైన నా కథ "బహిష్కృత" ఈ మాసం ప్రకటించారు. ఆ కథకి లింకు ఇక్కడ.


ఈ కథ దాదాపు దశాబ్దం క్రితం అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా వ్రాసాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి..!!