Unknown
ఎక్కడైనా ఉచితం అన్న మాట కనపడితే మన చూపు క్షణంకాలమైనా అక్కడ ఆగకుండా వుండదు. ఊరికే వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని మనం తరచుగా చెప్పుకునే సామెత ఒకటి వుండనే వుంది. ఈ విషయం బాగా తెలిసిన వ్యాపారస్తులు ఒక సబ్బు కొంటే మరో సబ్బు ఫ్రీ అని ప్రకటించేస్తుంటారు. ఇప్పుడిప్పుడే ప్రతి లావాదేవీల్లోకీ కంజూమరిజం ఎగపాకుతోంది కాబట్టి త్వరలోనే పురుడు పోసుకుంటే పీడియట్రిస్ట్ ఫ్రీ అనే రోజులు కూడా దాపురించచ్చు.
అసలు ద్రౌపది స్వయవరం అర్జునుడు గెలిస్తే బోనస్‌గా నలుగు భర్తలు ఫ్రీగా దొరికారని మొన్న ఒక కొంటె కోణంగి నాతో అన్నాడు. బహుశా అదే ఇలాంటి ఫ్రీ సాంప్రదాయానికి మూలమేమోనని కొత్త ప్రతిపాదన కూడా చేశాడు. విషయం తెలిసిన ఒక పెద్దాయన - "కాదు కాదు... మహా భారతంలో అంతకు ముందే భీష్ముడు సత్యవతితో మా నాన్నని పెళ్ళి చేసుకుంటే నీ కొడుకులకి రాజ్యం ఫ్రీ అన్నాడు కాబట్టి అది ఫ్రీ సాంప్రదాయానికి మొదలు" అని వివరించాడు.
"అయ్యో రామా... ఇంతకన్నా ముందు రామాయణంలొనే ఉచిత పధకాలు అమలులో వున్నాయి" అని మరో మహానుభావుడు చెప్పుకొచ్చాడు. ముక్కు కొయించుకుంటే చెవుల కటింగ్ ఫ్రీ ఆఫర్ లక్ష్మణుడు శూర్పణకకి ఇచ్చాడనీ, చూసి రమ్మని చెప్పిన రాముడికి హనుమంతుడు కాల్చి రావటమనేది ఫ్రీగా ఇచ్చాడని ఆయన వాదన. ఈ ఉచిత పధకాల ఆవిర్భావానికి సంబంధించి రీసర్చ్ చేసి పీ.ఎచ్.డీ సంపాదించే పనిలో వున్నాడాయన.
ఏది ఏమైనా ఉచిత పధకాలను సందర్భోచితంగా వాడేది ఇద్దరే - ఒకరు కార్పొరేట్లు, మరొకళ్ళు ప్రభుత్వాలు. మధ్యాహ్నం ఉచిత భోజనం దగ్గర్నుంచి మాపటేల వుచిత మద్యం (ఓటర్లకు మాత్రమే) దాకా అనేకానేక సందర్భాలలో ఎన్నో పధకాలు కల్పించబడ్డాయి. అవన్నీ అటుంచి ప్రభుత్వంతోపాటు అవినీతిని కూడా కలగలిపి ఇస్తున్నారని అన్నా హాజరే నిరశన ప్రకటించాడు. "నగదు బదిలీ పథకం" అనేది ఒకటి రాలేదు కానీ అది వీటన్నింటికీ "బాబు" లాంటి పథకం. వూరకే డబ్బులిస్తే సోమర్లు తయారవుతార్రా బాబూ... అన్నా వినలేదు ఆ పెద్దాయన.
ఇక సూపర్ మార్కెట్‌కి వెళ్తే నేను ఫ్రీ.. నేను ఫ్రీ అంటూ కేకలు వేస్తాయి అక్కడి వస్తువులు. ముఫై లీటర్ల నూనె కొంటే మూడు దువ్వెన్లు వుచితం అనగానే ఒక మహా ఇల్లాలు అంత నూనె కొని, దువ్వెన్ల పళ్ళు విరిగిపోయినా నూనె ఖర్చు కావటం లేదని వాపోయిందట. ఇక మనకి అట్టే అవసరం లేనిది, షాపు వాడికి అమ్ముడు పోని వస్తువులకీ ఏదైనా చిన్న పిల్లల బొమ్మలో, చాక్లెట్లో ఉచితం అని చెప్తే కాగల కార్యం పిల్లలే నెరవేరుస్తారని ఒక సిద్ధాతం.
ఇలా ప్రదిదానికీ ఉచితం అనేస్తుంటే ఆ ఉచితం అనేదానికి విలువ లేకుండా పోతోంది. ఏ తిరుపతో, బాసరో వెళ్ళామనుకోండి - ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే మనకి నామోషీ. మూడు వందలో, అయిదు వందలో పెట్టి టికెట్టు దర్శనానికే వెళ్ళడం మనకి అలవాటైపోయింది. ఈ అలవాటు ఎంత బలంగా వుందంటే, ఉచిత దర్శనం క్యూ ఖాళీగా వున్నా జనాలు టికెట్టు దర్శనానికే వెళ్తున్నారు. (బాసరలో నాకు ప్రత్యక్ష అనుభవం).
ఈ మధ్య హైదరాబాద్‌లొని ఒక సాయిబాబా మందిరంలో అంతర్భాగంగా ఒక హాస్పిటల్ చూశాను. ఈ హాస్పిటల్‌లొ ఎవరికైనా ఉచిత సేవలు అందిస్తారు. ఇక్కడ డాక్టర్ ఫీజుల పేరుతో పర్సులు, టెస్ట్‌ల పేరుతో ఆస్తులు లాక్కోరు. ఏవైనా టెస్టులు చేయాల్సి వస్తే ఖర్చులకు మాత్రం సరిపోయేట్టు చాలా చిన్న మొత్తాన్ని తీసుకుంటారు. నేను ఈ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్‌ని కలిసి, వైద్య సహాయం పొందిన తరువాత విరాళంగా కొత్త మొత్తం ఇస్తానని చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు. ఆ ఇవ్వదల్చుకున్నది సాయిబాబా హుండీలో వెయ్యమని సూచించారు. అలా హుండీలో పొగైన డబ్బులతోనే ఈ హాస్పిటల్‌ను నడుపుతారట. చిత్రమేమిటంటే డబ్బుల హుండీతో పాటు ఒక మందుల హుండీ కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర వూరకే పడివున్న అనవసర మందులన్నీ అందులో వేస్తే అవసరాన్ని బట్టి వాటిని రోగులకు వుచితంగా ఇస్తారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను వైద్య పరమైన ఏ అవసరం వచ్చినా ఇక్కడికే వెళ్తాను. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు బాబా దర్సనం, వైద్య సందర్శనం రెండూ జరిగిపోతాయి కాబట్టి. ఇలా నేను ఫ్రీ డాక్టర్ దగ్గరకి వెళ్తానని తెలిసి ఒక మిత్రుడు - "అది పేద వాళ్ళ కోసం... నువ్వు డబ్బులు తీసుకునే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి కానీ, ఇలాంటి డాక్టర్ దగ్గరకి కాదు" అని ఒక ఉపన్యాసం ఇచ్చాడు.
నిజానికి ఆ అభిప్రాయం తప్పు. అందరూ పేదవాళ్ళే ఆ ఆసుపత్రికి వెళ్ళారంటే ఆ ఆసుపత్రి త్వరలోనే మూతపడుతుంది. ఎందుకంటే అందరూ డబ్బులేని వాళ్ళే అక్కడికి వెళ్తే హుండీలో ఎవరూ డబ్బులు వెయ్యరు. తద్ఫలితంగా గుడి ఆదాయం తగ్గి, వైద్య సేవలు కుంటు పడతాయి. కాబట్టి డబ్బున్న ప్రతివాడూ ఇలాంటి వుచిత సేవని మొహమాటం లేకుండా స్వీకరించాలి. ఒక మామూలు హాస్పిటల్‌కి వెళ్తే ఎంత ఖర్చౌతుందో లెక్కకట్టి కనీసం అంత మొత్తం అక్కడ హుండీలో వేసి రావాలి. అప్పుడు గుడి ఆదాయం పెరిగి, మరి కొంతమందికి సహాయపడే అవకాశం వుంటుంది. ఇదే విషయాన్ని మా మిత్రుడికి వివరిస్తే ప్రశ్నార్థక ముఖం ఒకటి పెట్టి జారుకున్నాడు.
(నేను ప్రస్తావించిన గుడి హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో వుంది.)
Unknown
ఏమంటూ మళ్ళీ రాస్తానని ప్రకటించానోగానీ, ఆరోజు నుంచి నా లాప్‌టాప్ మొడికేసింది. ఇంటర్నెట్ అసలు చేతులు ఎత్తేసింది. సరే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని - ఈ మధ్య కాలంలో నాకు నా దైవానికి ఇదే ఆట నడుస్తోంది.
ఇంతకీ ఈ రోజేం జరిగిందో తెలుసా.. నేను పోస్టాఫీసుకి వెళ్ళాను. ఎంత కాలం అయ్యిందో పోస్టాఫీసుకు వెళ్ళి.!! కాకపోతే అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పులేమీ కనపడటంలేదు. అప్పట్లో గాంధీ స్టాంపులు ఎక్కువగా అమ్మేవాళ్ళు ఇప్పుడు ఇందిరా గాంధీ స్టాంపులు అమ్ముతున్నారు. అప్పట్లో కనీసం పావలా (ఈ మధ్యే పరమపదించిన రూపాయిలో నాలుగో వంతు), ఇప్పుడు అధమం అయిదు రూపాయలు. అంత కన్నా పెద్ద మార్పేమీ లేదు. ఇప్పుడు కూడా కౌంటరు వెనకాల చిరాకు ముఖం పెట్టుకోని, ఆవలిస్తూ స్టాంపులమ్మే రిటర్మెంటుకు దగ్గరైన వుద్యోగి, పోస్టు డబ్బాలో వేస్తే వెనకనించి బయట పడిపోయే డబ్బాలు అవన్నీ అలాగే వున్నాయి.
నాకు చిన్నప్పటి నుంచి స్టాంపులంటే భలే సరదా. స్టాంపు కి స్టాంపుకి మధ్యన వుండే చిల్లుల వెంబడి మిగతా స్టాంపు చినగకుండా చించడం అరవై నాలుగు కళలలో ఒకటని నా నమ్మకం. కాకపోతే స్టాంపుల మీద దేశనాయకుల ఫోటోలు ఎందుకు వేస్తారో అర్థం అయ్యేది కాదు. ఈ మధ్య నాకు తెలిసొచ్చిన విషయం ఏమిటంటే - మీకు నచ్చని దేశనాయకుడి/నాయకురాలి స్టాంపు కొనుక్కోని దాని వెనక ఎంగిలి పూసి, కవరు మీద పెట్టి ఆ నాయకుడు/నాయకురాలి ముఖం మీద రెండు పిడిగుద్దులు గుద్దచ్చు. అంటే నాయకుల పట్ల మనకి వుండే కసి, కోపం ఆ రకంగా తీర్చుకోవచ్చునని బహుశా ఇలా ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది.
(ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా గుర్తున్నవాళ్ళు, ఈ నాలికమీద స్టాంపు ప్రహసనాన్ని అంత ఇష్టపడక పోవచ్చు. అందుకే ఒక డబ్బాలో జిగురు కూడా ఏర్పాటు చేశారు పోస్టాఫీసు వారు.)
ఏదో అలవాటు కొద్ది అనడమే కానీ పోస్టాఫీసు అనే పదం కన్నా తపాలా కార్యాలయం అంటే ఎంత సొగసుగా వుందో చూడండి. అసలు ఆ అందమంతా తపాలా అన్న పదం లోనే వుందని నాకనిపిస్తుంది. స్కాములన్నీ 2G 3Gలలో జరిగాయి కానీ తపాలాలో జరిగుంటే "తపాలా హవాలా" అంటూ ఎంత ప్రాసగా వుంటుందో కదా..!! అయినా మన పిచ్చి కానీ ఏదో జరిగే వుంటుంది. ఇంకా మనదాకా రాలేదు అంతే..!!
ఇంతకీ విశేషమేమిటంటే అదేదో కథలపోటీకి నేను సైతం ఒక కథ పంపిద్దామని సదరు పోస్టాఫీసులోకి అడుగుపెట్టాను. నేను స్టాంపులు కొంటుండగా, పక్కనే ఎవరో పిల్ల వచ్చి చటుక్కున నా కవరు ఒకటి తీసుకోని పరిశీలనగా చూస్తోంది. నేను హడలిపోయి, ఏమైనా పోస్ట్ కవర్లలో ఆంత్రాక్స్ వుందని చెకింగ్ చేస్తున్నారా అని హాచ్చర్యపడిపోయా.
"ఏమిటమ్మా విషయం?" అని ఆడిగితే -
"ఏం లేదండీ.. అడ్రస్ ఎక్కడ వ్రాయాలో తెలియదు అందుకే చూస్తున్నా.." అంది.
ఆహా... ఇది కదా నా దేశ పరిస్థితి అని కొంత విచారించి, ఆ అమ్మాయిని విచారణ దగ్గరకు పంపించాను. ఆ అమ్మాయి రాకెట్‌లా తిరిగొచ్చి "అక్కడెవ్వరూ లేరండీ... కొంచెం ప్రాసెస్ చెప్తారా?" అంది.
"ఏం ప్రాసెస్ తల్లీ" అంటే - "అదే.. అడ్రస్ ఎలా వ్రాయాలి? స్టాంప్ ఎక్కడ కొట్టించాలి.."
"స్టాంప్ నువ్వు కొట్టక్కర్లేదమ్మా... స్టాంపులని అమ్ముతారు అవి కొనుక్కోని, అంటించి ఆ డబ్బాలొ పడేస్తే వాళ్ళే తీసి ముద్దుగా ముద్దర్లు కొట్టుకుంటారు" అని వివరంగా వివరించాను.
నేను కొనుక్కున్న స్టాంపులు అంటించుకుంటుండగా ఆ అమ్మాయి కౌంటర్ దగ్గరకు వెళ్ళి -"మేడం ఎక్కువ స్టాంపులు వేస్తే తొందరగా వెళ్తుందా?" అని అడుగుతోంది.
ఇంకా ఎక్కువసేపు వుంటే "స్టాంపుకి జిగురు ఏ పక్క పూయాలి" అని అడుగుతుందేమో అని నా కవర్లు డబ్బాలొ వేసి పారిపోయి వచ్చాను.
(ఇది నిజం జరిగింది... కాకపోతే రాం గోపాల్ వర్మ రక్త చరిత్ర లాగా యధార్థ సంఘటన ఆధారంగా కల్పించిన కథ)
Unknown
ఆ రాత్రి చంద్రుడు ఏ నక్షత్రంతో సరసమాడుతున్నాడో తెలియకుండా వుండాలనేమో నల్లమేఘాల దుప్పటి కప్పుకున్నాడు. నిండా పదిహేనేళ్ళు లేని ఇద్దరు పసివాళ్ళు లల్లాయి పాటలు పాడుకుంటూ రైలు పట్టాల వెంటే నడుస్తున్నారు. వాళ్ళిద్దరి భుజాన చెరో గోనెసంచి వూగుతున్నాయి. అక్కడక్కడా మిణుగురు పురుగులు మినహాయించి మరే వెలుగూ లేదక్కడ. దూరంగా ఏదో పల్లెటూరి స్టేషన్‌లో దీపస్థంభాలు మిణుకు మిణుకు మంటున్నాయి.
ఇద్దరూ కళ్ళు చిన్నవిగా చేసి ఆ చీకటిలో కనపడే కాగితాల కోసం వెదుకుతున్నారు. రాత్రికి ఆ ష్టేషన్ చేరి, కాగితాలు సర్దుకోని, మర్నాడు అమ్ముకోవాలని వాళ్ళ ఆలోచన.
"వురేయ్.. ఇక్కడేదో వుసిళ్ళ పుట్ట పగిలినాదిరోయ్.. టేషన్‌లో లైట్ల కాడ చేరుకోని వుంటాయి. బేగి బోయి ఏరుకుంటే రేపొద్దునకి కూరజేసుకోవచ్చు.." అన్నాడు ఇద్దరిలో పెద్దవాడు.
"అవున్రోయ్.. సానా కాలమైంది..” అంటూ దూరంగా దూసుకువస్తున్న వెలుగుని చూసి చిన్నవాడు గట్టిగా అరిచాడు “పక్కకురారోయ్ బండొత్తాంది.. హౌరానేమో"
ఇద్దరూ పట్టాలకి ఇవతలి వైపుకు వచ్చి నిలబడ్డారు. బండి క్షణాల్లో దూసుకుంటూ వచ్చింది. ఒకడు ఆ బండి వెలుగులో ఏమైనా కాగితాలు కనపడతాయేమోనని చూస్తున్నాడు. మరొకడు బండిలోనుంచి పడే ప్లాస్టిక్ కప్పులు, సగం తిన్న భోజనం ప్యాకెట్లకోసం కిటికీల వెంట చూపును పరుగెత్తిస్తున్నాడు. ఎవరో విసిరేసిన సిగిరెట్టు తాలూకు నిప్పు చిన్నవాడి చేతిమీద పడి చురుక్కుమనిపించింది.
"నీయమ్మ.. ఎదవలు కళ్ళు మూసుకోనుంటారేమో.." అన్నాడు, ఒక రాయి తీసి వెళ్ళిపోయిన రైలు వైపు విసురుతూ...!!
సరిగ్గా అప్పుడే గార్డు ఇస్తున్న సిగ్నల్ లైటు వెలుగులో కనపడిందొక పెద్ద ప్లాస్టిక్ సంచి. ఇద్దరూ ఒకేసారి - "వురేయ్ సూసావా?" అన్నారు. అది బండిలోనించి పడింది కాదు.. అంతకు ముందే అక్కడ వుంది. ఇందాక చీకట్లో కనపడలేదు కానీ, పెద్ద సంచినే. ఇద్దరూ ఒక్కసారి ఆ కనిపించిన కాగితం వైపు పరిగెత్తారు. ఆ పరుగులోనే పెద్దవాడు రాళ్ళు తట్టుకోని కింద పడ్డాడు. అప్రయత్నంగా వాడి నోటినుంచి ఒక బూతుమాట జారింది. మళ్ళీ లేచి పరుగెత్తాడు.
ఎవరి చెయ్యి ముందు పడితే ఆ సంచీ వాళ్ళదౌతుందని ఇద్దరికీ తెలుసు కాబట్టి పోటాపోటీగా పరుగెత్తి, ఇద్దరూ ఒకే సారి ఆ సంచి మీద చెయ్యి వెయ్యబోయారు. వున్నట్టుండి ఆ ప్లాస్టిక్ కాగితాల కట్టలోనించి వినపడింది - ఒక పసిపాప కేక.
***
వాళ్ళిద్దరూ ఎంతసేపు పరిగెత్తారో తెలియదుకాని రొప్పుతూ ఆ చిన్న స్టేషన్ చేరుకున్నారు. పాలిథీన్ కవర్ల కట్టలో పసిపాప 'దొరకగానే' ఎం చెయ్యాలో పాలుపోలేదిద్దరికి..! క్షణం పాటు శిలల్లా వుండిపోయారు..! ఆ పాపను కదిలించాలంటే ఇద్దరికీ భయమేసింది..! ఇదేమి పట్టని పసికందు మొండిగా ఏడుస్తూనే వుంది.
"వురేయ్.. మనం పాపని తీసుకోని బోయి టేషను మాస్టారికి చెప్దామురా.. పట్టాలకాడ వుండాదికద ఆయనే జూసుకుంటడు.." అన్నాడు పెద్దవాడు వణుకుతున్న గొంతుతో. ఆ భయంలో, అయోమయంలో తమతో తెచ్చుకున్న సంచీలను అక్కడే వదిలేసి పాపతో సహా పరుగులందుకున్నారు.
స్టేషను ప్రాంతమంత నిర్మానుష్యంగా వుంది. రాత్రిపూట నడిచే రైళ్ళేవి అక్కడ ఆగని కారణంగా మనుషుల జాడేమీ కనపడలేదు. స్టేషను మాస్టరు గది తలుపేసి తాళం వేసి వుంది.
"ఏం చేద్దాం రా" అన్నాడు చిన్నవాడు.
అవతలి ప్లాట్‌ఫారం మీద ట్యూబ్‌లైటొకటి వెలగడంలేదు. ఎవరో వుద్దేశ్యపూర్వకంగానే ఆ ట్యూబ్‌లైటు పగలగొట్టినట్టు కింద పడి వున్న తెల్లటి పెంకులు చీకట్లో మెరుస్తూ సాక్షం ఇస్తున్నాయి. అక్కడే ఎవరివో ఇద్దరి ఆకారాలు కదులుతూ కనబడ్డాయి. ఒక ఆడ, ఒక మగ..!! అట్లాటివి అక్కడ కనపడటం సాధారణం కావటంతో వాళ్ళిద్దరూ ముందుకెళ్ళబోయారు. ఇంతలో అక్కడినించి మాటలు వినిపించాయి -
"నా మాట ఇనయే.. నీకు కుక్క గరిచింది గదా.. అందుకని మందేద్దామని వచ్చా.. ఏదీ సూపించు" మగ గొంతు అన్నది.
"రేయ్.. నాకు మందొద్దు.. ఏమొద్దు ఫో.." అంటోంది ఆడగొంతు.
పిల్లలిద్దరూ అక్కడే ఆగిపోయారు. ఎప్పుడూ ఆ స్టేషన్‌కు వచ్చేవాళ్ళు కావడంతో ఆ గొంతులు వాళ్ళు గుర్తుపట్టారు. మగ గొంతు ఆ స్టేషను పోర్టరుది. ఆడగొంతు ఆ వూర్లో తిరిగే పిచ్చిదానిది.
పిచ్చిది చూడటానికి అసహ్యంగా వుంటుంది. ఎవరితో మాట్లాడదు.. ఎవరైనా మాట్లాడితే పిచ్చి పిచ్చిగా సమాధానమిస్తుంది, లేకపోతే రక్కడానికో, కొరకడానికో మీదకొస్తుంది.
"అట్లాంటిదాన్ని పోర్టరుబాబు.. ఛీ.." ఆ ఆలోచన రాగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. పెద్దవాడు ముందుగా తేరుకున్నాడు.
"వురేయ్.. స్టేషన్ మాస్టరుగారు పక్కన పాడుబడ్డ క్వాటర్స్ దగ్గర గదిలో దూరుంటార్రా.. పోయి సూసొత్తావా" అన్నాడు పెద్దాడు.
చిన్నాడు పాపని పెద్దాడి చేతికిచ్చి క్వాటర్స్ వైపు పరుగెత్తాడు.. వాళ్ళు వూహించింది నిజమే. ఎప్పుడూ తాళం వేసుండే ఆ గది తాళం తీసుంది. 'దబ దబ' మని తలుపులు బాదాడు..!
"ఎవడ్రా..!" కేక వినిపించింది వెంటనే.
"మాస్టారు..! మాస్టారు..!! పట్టాల మీద సంటిపాప దొరికిందయ్యా" అరిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. కొంచెం సేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎర్రటికళ్ళతో, లుంగీ సద్దుకుంటూ స్టేషన్ మాస్టరు బయటకి వచ్చాడు.
"ఏందిరా ఎదవగోల..?" అన్నడు. 'ఆ వేళ'లో వచ్చి పిలిచినందుకు చాలా కోపం వచ్చిందతనికి.
"పట్టాల పక్కన ఒక పాపాయి దొరికింది మాస్టారు..” చెప్పాడు చిన్నాడు.
"బతుకుందా? చచ్చిందా??" అడిగాడతను నిర్లక్షంగా సిగిరెట్ వెలిగిస్తూ. ఆ మాట ఆ పసివాడి గుండెల్లోకి ఎంతగా దూసుకెళ్ళిందటే "బ్రతికేవుందయ్యా" అనడానికి వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"సరే పద..." అన్నాడు అతను. ముందు పిల్లాడు నడుస్తుంటే ఆ వెనకే సిగరెట్ కాలుస్తూ మాస్టరు కదిలాడు. వాళ్ళ వెనకే, పాడుపడ్డ క్వాటర్స్ లో నుంచి బయటి వెళ్ళిన వ్యక్తి తాలూకు గాజుల చప్పుడు వినపడ్డా చిన్నాడు పట్టించుకోలేదు.
ఆ ఇద్దరు పెద్దవాడి దగ్గరకు వచ్చే సరికి పసిపాప ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. బ్రతికుందో లేదో పరీక్షించి స్టేషన్ మాస్టరు "బతికే వుందిరా..” అన్నాడు. పిల్లని చూసిన తరువాత స్టేషన్ మాస్టర్ లో ఇదివరకటి నిర్లక్ష్యం, నిద్రమత్తు చిత్రంగా మాయమయ్యాయి. అయితే వాటి స్థానంలో విసుగు మొదలైంది.
“ఇదెక్కడ దొరికిందిరా... ఖర్మ.. నా డ్యూటిలోనే ఇట్టాజరగలా.. సరే మీరిక్కడే కాపాలకాస్తుండండి. నేనెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను..! జాగర్తరోయ్" అంటూ స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు.
ఇద్దరూ పసిపాపకి చెరొకవైపు కూర్చున్నారు. పెద్దవాడు ముందుకు వంగి ఆ పాప వైపు చూడబోయి నోటి చివరిదాకా వచ్చిన కేకను తొక్కిపట్టాడు. ప్లాస్టిక్ కవర్ మీద నెమ్మదిగా పాకుతోందొక తేలు..! బహుశా పట్టాల పక్కన పడి వున్నప్పుడు ఆ కవర్లలో దూరి వుంటుందది. ఇలాంటివన్నీ అలవాటైన వాడు కావడంతో చటుక్కున దాన్ని పట్టి దూరంగా విసిరేశాడు.
ఆ చప్పుడుకి స్పృహ వచ్చిందేమో ఆ పాప మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. ఇద్దరు పిల్లలకి ఏమి చెయ్యాలో తెలియలేదు. చెయ్యి మీదేసి చిన్నగా కొట్టసాగారు..! ఆ పసికందు ఇంకా ఏడ్చింది.. ఎడుస్తూనే వుంది.. ఏడ్చి ఏడ్చి ఓపిక లేకనేమో కొద్దిగా ఆగిపోయి స్పృహతప్పింది. అప్పుడప్పుడు రైళ్ళు వేగంగా స్టేషన్ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ అదురుకి పాప చిన్నగా కదులుతోంది.
ఒక అరగంటకి రైల్వే పోలిసు ఒకాయన వచ్చాడు. వస్తూనే స్టేషన్ మాస్టరు గదిలోకి వెళ్ళి వివరాలు తెలుసుకున్నాడు.
"ఎవతో బలిసింది కని పడేసుంటుంది. దొంగముండలకు వేరే పనేముంది. కొవ్వెక్కి తిరగడం, కని పారెయ్యడం" అంటూ బయటికి వచ్చాడు పోలీసు.
బయట వున్న పిల్లలకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. బయటికి వస్తున్న పోలీసుకి ఎదురు పరిగెత్తాడు చిన్నాడు.
"అయ్యా బేగి రండయ్యా.. పాప పలకడంలేదు." అన్నాడు దాదాపు ఏడుస్తూ.
"వస్తన్నాకదరా... ఏంటీ నీ గోల..”
“సిన్న పిల్ల బాబూ... కదలకండా పడివుంది.. మీరు తొందరగా రండి..”
“అంటే ఏందిరా.. నేను జెయ్యాల్సిన పని కూడా నువ్వే చెప్తావా? నన్నే చెయ్యమంటావా?” అన్నాడు ఇన్స్ పెక్టర్ నిర్లక్ష్యంగా.
"సర్లే పదవయ్యా.. ఎంతైనా పసిపిల్ల.. " అన్నాడు స్టేషన్ మాష్టర్ ముందుకి నడుస్తూ. అంతలోనే రెండో పిల్లాడు పాపని ఎత్తుకోని ఎదురొచ్చాడు.
"ఏందిర ఇట్టొచ్చినావ్?" చిన్నాడు అడిగాడు.
"పిల్ల.. సచ్చిపోయినట్టుందిరా.." చెప్పాడు వాడు.
"హారినీ.. పోయిందీ.. శవ జాగారం తప్పదన్నమాట" స్టేషన్ మాష్టర్ అన్నాడు.
పోలీసు మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేస్తున్నాడు.
చిన్నాడు అలాగే నిలబడిపోయాడు. "పి..ల్ల - స..చ్చి.. పో.. యిం.. ది.." అంటున్నాడు గొణిగినట్టు. ఒక్కసారిగా కూలబడిపోయాడు.
వాడి గుండెల్లోంచి ఏడుపు తన్నుకొచ్చింది.
***
తెల్లవారింది..!!
పాపను ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురికీ తరలించారు.
ఒకరిద్దరు ప్రస్ వాళ్ళు వివరాలు వ్రాసుకున్నారు.
చిన్నవాడు ఇంకా ఏడుస్తూనే వున్నాడు.
"వురేయ్ ఎందుకురా ఏడుత్తావ్..? ఊరుకోరా?" పెద్దోడు సముదాయించాలని చూశాడు.
"ఎట్టా వూరుకోన్రా? ఈ పెద్దోళ్ళిద్దరూ తాత్సారం చేసి సంపినారు కదరా.. అసలు మనమే ఎత్తుకుపోతే ఎట్టో బతికేదిగదరా.." అన్నాడు.
"ఏట్టా బతికేదిరా? చెత్త కుప్పల్లో కాగితాలేరుకోనా? లేపోతే బిచ్చాలు లాగా అడుక్కోనా? బండిలో పాటలు పాడుకోనా? వద్దురా.. ఇట్టాగ బతికేకన్నా చావడం మంచిది గాదా? పోనీరా.. !" అన్నాడు పెద్దవాడు ఏడుస్తూనే.
***
ఇదంతా జరిగి ఒక సంవత్సరం తరువాత ఆ స్టేషన్ లో తిరిగే పిచ్చిది ఎక్కడో ఓ పసి బిడ్డని కనింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డని ఏం చెయ్యాలో ఆ పిచ్చిదానికి అర్థం కాలేదు. అందుకే ఆ పిల్లాణ్ణి గుడ్డపేలికల్లో చుట్టి పక్కవూరి చెత్తకుప్పలో వదిలేసి తన దారేదో చూసుకుంది. ఆ పసికందు మాత్రం ఇదంతా తెలియక ఏడుస్తూనే వుంది.
***
(అంతర్జాల పత్రిక హంసిని ఉగాది ఉత్తమ కథానికల పోటీ (2011) లో ప్రశంసా పత్రం పొంది, జులై సంచికలో ప్రచురితం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)