బహిష్కృత (కథ)


ఆ రాత్రి చంద్రుడు ఏ నక్షత్రంతో సరసమాడుతున్నాడో తెలియకుండా వుండాలనేమో నల్లమేఘాల దుప్పటి కప్పుకున్నాడు. నిండా పదిహేనేళ్ళు లేని ఇద్దరు పసివాళ్ళు లల్లాయి పాటలు పాడుకుంటూ రైలు పట్టాల వెంటే నడుస్తున్నారు. వాళ్ళిద్దరి భుజాన చెరో గోనెసంచి వూగుతున్నాయి. అక్కడక్కడా మిణుగురు పురుగులు మినహాయించి మరే వెలుగూ లేదక్కడ. దూరంగా ఏదో పల్లెటూరి స్టేషన్‌లో దీపస్థంభాలు మిణుకు మిణుకు మంటున్నాయి.

ఇద్దరూ కళ్ళు చిన్నవిగా చేసి ఆ చీకటిలో కనపడే కాగితాల కోసం వెదుకుతున్నారు. రాత్రికి ఆ ష్టేషన్ చేరి, కాగితాలు సర్దుకోని, మర్నాడు అమ్ముకోవాలని వాళ్ళ ఆలోచన.

"వురేయ్.. ఇక్కడేదో వుసిళ్ళ పుట్ట పగిలినాదిరోయ్.. టేషన్‌లో లైట్ల కాడ చేరుకోని వుంటాయి. బేగి బోయి ఏరుకుంటే రేపొద్దునకి కూరజేసుకోవచ్చు.." అన్నాడు ఇద్దరిలో పెద్దవాడు.

"అవున్రోయ్.. సానా కాలమైంది..” అంటూ దూరంగా దూసుకువస్తున్న వెలుగుని చూసి చిన్నవాడు గట్టిగా అరిచాడు “పక్కకురారోయ్ బండొత్తాంది.. హౌరానేమో"

ఇద్దరూ పట్టాలకి ఇవతలి వైపుకు వచ్చి నిలబడ్డారు. బండి క్షణాల్లో దూసుకుంటూ వచ్చింది. ఒకడు ఆ బండి వెలుగులో ఏమైనా కాగితాలు కనపడతాయేమోనని చూస్తున్నాడు. మరొకడు బండిలోనుంచి పడే ప్లాస్టిక్ కప్పులు, సగం తిన్న భోజనం ప్యాకెట్లకోసం కిటికీల వెంట చూపును పరుగెత్తిస్తున్నాడు. ఎవరో విసిరేసిన సిగిరెట్టు తాలూకు నిప్పు చిన్నవాడి చేతిమీద పడి చురుక్కుమనిపించింది.

"నీయమ్మ.. ఎదవలు కళ్ళు మూసుకోనుంటారేమో.." అన్నాడు, ఒక రాయి తీసి వెళ్ళిపోయిన రైలు వైపు విసురుతూ...!!

సరిగ్గా అప్పుడే గార్డు ఇస్తున్న సిగ్నల్ లైటు వెలుగులో కనపడిందొక పెద్ద ప్లాస్టిక్ సంచి. ఇద్దరూ ఒకేసారి - "వురేయ్ సూసావా?" అన్నారు. అది బండిలోనించి పడింది కాదు.. అంతకు ముందే అక్కడ వుంది. ఇందాక చీకట్లో కనపడలేదు కానీ, పెద్ద సంచినే. ఇద్దరూ ఒక్కసారి ఆ కనిపించిన కాగితం వైపు పరిగెత్తారు. ఆ పరుగులోనే పెద్దవాడు రాళ్ళు తట్టుకోని కింద పడ్డాడు. అప్రయత్నంగా వాడి నోటినుంచి ఒక బూతుమాట జారింది. మళ్ళీ లేచి పరుగెత్తాడు.

ఎవరి చెయ్యి ముందు పడితే ఆ సంచీ వాళ్ళదౌతుందని ఇద్దరికీ తెలుసు కాబట్టి పోటాపోటీగా పరుగెత్తి, ఇద్దరూ ఒకే సారి ఆ సంచి మీద చెయ్యి వెయ్యబోయారు. వున్నట్టుండి ఆ ప్లాస్టిక్ కాగితాల కట్టలోనించి వినపడింది - ఒక పసిపాప కేక.


***


వాళ్ళిద్దరూ ఎంతసేపు పరిగెత్తారో తెలియదుకాని రొప్పుతూ ఆ చిన్న స్టేషన్ చేరుకున్నారు. పాలిథీన్ కవర్ల కట్టలో పసిపాప 'దొరకగానే' ఎం చెయ్యాలో పాలుపోలేదిద్దరికి..! క్షణం పాటు శిలల్లా వుండిపోయారు..! ఆ పాపను కదిలించాలంటే ఇద్దరికీ భయమేసింది..! ఇదేమి పట్టని పసికందు మొండిగా ఏడుస్తూనే వుంది.

"వురేయ్.. మనం పాపని తీసుకోని బోయి టేషను మాస్టారికి చెప్దామురా.. పట్టాలకాడ వుండాదికద ఆయనే జూసుకుంటడు.." అన్నాడు పెద్దవాడు వణుకుతున్న గొంతుతో. ఆ భయంలో, అయోమయంలో తమతో తెచ్చుకున్న సంచీలను అక్కడే వదిలేసి పాపతో సహా పరుగులందుకున్నారు.

స్టేషను ప్రాంతమంత నిర్మానుష్యంగా వుంది. రాత్రిపూట నడిచే రైళ్ళేవి అక్కడ ఆగని కారణంగా మనుషుల జాడేమీ కనపడలేదు. స్టేషను మాస్టరు గది తలుపేసి తాళం వేసి వుంది.

"ఏం చేద్దాం రా" అన్నాడు చిన్నవాడు.

అవతలి ప్లాట్‌ఫారం మీద ట్యూబ్‌లైటొకటి వెలగడంలేదు. ఎవరో వుద్దేశ్యపూర్వకంగానే ఆ ట్యూబ్‌లైటు పగలగొట్టినట్టు కింద పడి వున్న తెల్లటి పెంకులు చీకట్లో మెరుస్తూ సాక్షం ఇస్తున్నాయి. అక్కడే ఎవరివో ఇద్దరి ఆకారాలు కదులుతూ కనబడ్డాయి. ఒక ఆడ, ఒక మగ..!! అట్లాటివి అక్కడ కనపడటం సాధారణం కావటంతో వాళ్ళిద్దరూ ముందుకెళ్ళబోయారు. ఇంతలో అక్కడినించి మాటలు వినిపించాయి -

"నా మాట ఇనయే.. నీకు కుక్క గరిచింది గదా.. అందుకని మందేద్దామని వచ్చా.. ఏదీ సూపించు" మగ గొంతు అన్నది.

"రేయ్.. నాకు మందొద్దు.. ఏమొద్దు ఫో.." అంటోంది ఆడగొంతు.

పిల్లలిద్దరూ అక్కడే ఆగిపోయారు. ఎప్పుడూ ఆ స్టేషన్‌కు వచ్చేవాళ్ళు కావడంతో ఆ గొంతులు వాళ్ళు గుర్తుపట్టారు. మగ గొంతు ఆ స్టేషను పోర్టరుది. ఆడగొంతు ఆ వూర్లో తిరిగే పిచ్చిదానిది.

పిచ్చిది చూడటానికి అసహ్యంగా వుంటుంది. ఎవరితో మాట్లాడదు.. ఎవరైనా మాట్లాడితే పిచ్చి పిచ్చిగా సమాధానమిస్తుంది, లేకపోతే రక్కడానికో, కొరకడానికో మీదకొస్తుంది.

"అట్లాంటిదాన్ని పోర్టరుబాబు.. ఛీ.." ఆ ఆలోచన రాగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. పెద్దవాడు ముందుగా తేరుకున్నాడు.

"వురేయ్.. స్టేషన్ మాస్టరుగారు పక్కన పాడుబడ్డ క్వాటర్స్ దగ్గర గదిలో దూరుంటార్రా.. పోయి సూసొత్తావా" అన్నాడు పెద్దాడు.

చిన్నాడు పాపని పెద్దాడి చేతికిచ్చి క్వాటర్స్ వైపు పరుగెత్తాడు.. వాళ్ళు వూహించింది నిజమే. ఎప్పుడూ తాళం వేసుండే ఆ గది తాళం తీసుంది. 'దబ దబ' మని తలుపులు బాదాడు..!

"ఎవడ్రా..!" కేక వినిపించింది వెంటనే.

"మాస్టారు..! మాస్టారు..!! పట్టాల మీద సంటిపాప దొరికిందయ్యా" అరిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. కొంచెం సేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎర్రటికళ్ళతో, లుంగీ సద్దుకుంటూ స్టేషన్ మాస్టరు బయటకి వచ్చాడు.

"ఏందిరా ఎదవగోల..?" అన్నడు. 'ఆ వేళ'లో వచ్చి పిలిచినందుకు చాలా కోపం వచ్చిందతనికి.

"పట్టాల పక్కన ఒక పాపాయి దొరికింది మాస్టారు..” చెప్పాడు చిన్నాడు.

"బతుకుందా? చచ్చిందా??" అడిగాడతను నిర్లక్షంగా సిగిరెట్ వెలిగిస్తూ. ఆ మాట ఆ పసివాడి గుండెల్లోకి ఎంతగా దూసుకెళ్ళిందటే "బ్రతికేవుందయ్యా" అనడానికి వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

"సరే పద..." అన్నాడు అతను. ముందు పిల్లాడు నడుస్తుంటే ఆ వెనకే సిగరెట్ కాలుస్తూ మాస్టరు కదిలాడు. వాళ్ళ వెనకే, పాడుపడ్డ క్వాటర్స్ లో నుంచి బయటి వెళ్ళిన వ్యక్తి తాలూకు గాజుల చప్పుడు వినపడ్డా చిన్నాడు పట్టించుకోలేదు.

ఆ ఇద్దరు పెద్దవాడి దగ్గరకు వచ్చే సరికి పసిపాప ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. బ్రతికుందో లేదో పరీక్షించి స్టేషన్ మాస్టరు "బతికే వుందిరా..” అన్నాడు. పిల్లని చూసిన తరువాత స్టేషన్ మాస్టర్ లో ఇదివరకటి నిర్లక్ష్యం, నిద్రమత్తు చిత్రంగా మాయమయ్యాయి. అయితే వాటి స్థానంలో విసుగు మొదలైంది.

“ఇదెక్కడ దొరికిందిరా... ఖర్మ.. నా డ్యూటిలోనే ఇట్టాజరగలా.. సరే మీరిక్కడే కాపాలకాస్తుండండి. నేనెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను..! జాగర్తరోయ్" అంటూ స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు.

ఇద్దరూ పసిపాపకి చెరొకవైపు కూర్చున్నారు. పెద్దవాడు ముందుకు వంగి ఆ పాప వైపు చూడబోయి నోటి చివరిదాకా వచ్చిన కేకను తొక్కిపట్టాడు. ప్లాస్టిక్ కవర్ మీద నెమ్మదిగా పాకుతోందొక తేలు..! బహుశా పట్టాల పక్కన పడి వున్నప్పుడు ఆ కవర్లలో దూరి వుంటుందది. ఇలాంటివన్నీ అలవాటైన వాడు కావడంతో చటుక్కున దాన్ని పట్టి దూరంగా విసిరేశాడు.

ఆ చప్పుడుకి స్పృహ వచ్చిందేమో ఆ పాప మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. ఇద్దరు పిల్లలకి ఏమి చెయ్యాలో తెలియలేదు. చెయ్యి మీదేసి చిన్నగా కొట్టసాగారు..! ఆ పసికందు ఇంకా ఏడ్చింది.. ఎడుస్తూనే వుంది.. ఏడ్చి ఏడ్చి ఓపిక లేకనేమో కొద్దిగా ఆగిపోయి స్పృహతప్పింది. అప్పుడప్పుడు రైళ్ళు వేగంగా స్టేషన్ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ అదురుకి పాప చిన్నగా కదులుతోంది.

ఒక అరగంటకి రైల్వే పోలిసు ఒకాయన వచ్చాడు. వస్తూనే స్టేషన్ మాస్టరు గదిలోకి వెళ్ళి వివరాలు తెలుసుకున్నాడు.

"ఎవతో బలిసింది కని పడేసుంటుంది. దొంగముండలకు వేరే పనేముంది. కొవ్వెక్కి తిరగడం, కని పారెయ్యడం" అంటూ బయటికి వచ్చాడు పోలీసు.

బయట వున్న పిల్లలకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. బయటికి వస్తున్న పోలీసుకి ఎదురు పరిగెత్తాడు చిన్నాడు.

"అయ్యా బేగి రండయ్యా.. పాప పలకడంలేదు." అన్నాడు దాదాపు ఏడుస్తూ.

"వస్తన్నాకదరా... ఏంటీ నీ గోల..”
“సిన్న పిల్ల బాబూ... కదలకండా పడివుంది.. మీరు తొందరగా రండి..”
“అంటే ఏందిరా.. నేను జెయ్యాల్సిన పని కూడా నువ్వే చెప్తావా? నన్నే చెయ్యమంటావా?” అన్నాడు ఇన్స్ పెక్టర్ నిర్లక్ష్యంగా.

"సర్లే పదవయ్యా.. ఎంతైనా పసిపిల్ల.. " అన్నాడు స్టేషన్ మాష్టర్ ముందుకి నడుస్తూ. అంతలోనే రెండో పిల్లాడు పాపని ఎత్తుకోని ఎదురొచ్చాడు.

"ఏందిర ఇట్టొచ్చినావ్?" చిన్నాడు అడిగాడు.

"పిల్ల.. సచ్చిపోయినట్టుందిరా.." చెప్పాడు వాడు.

"హారినీ.. పోయిందీ.. శవ జాగారం తప్పదన్నమాట" స్టేషన్ మాష్టర్ అన్నాడు.

పోలీసు మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేస్తున్నాడు.

చిన్నాడు అలాగే నిలబడిపోయాడు. "పి..ల్ల - స..చ్చి.. పో.. యిం.. ది.." అంటున్నాడు గొణిగినట్టు. ఒక్కసారిగా కూలబడిపోయాడు.

వాడి గుండెల్లోంచి ఏడుపు తన్నుకొచ్చింది.

***

తెల్లవారింది..!!

పాపను ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురికీ తరలించారు.

ఒకరిద్దరు ప్రస్ వాళ్ళు వివరాలు వ్రాసుకున్నారు.

చిన్నవాడు ఇంకా ఏడుస్తూనే వున్నాడు.

"వురేయ్ ఎందుకురా ఏడుత్తావ్..? ఊరుకోరా?" పెద్దోడు సముదాయించాలని చూశాడు.

"ఎట్టా వూరుకోన్రా? ఈ పెద్దోళ్ళిద్దరూ తాత్సారం చేసి సంపినారు కదరా.. అసలు మనమే ఎత్తుకుపోతే ఎట్టో బతికేదిగదరా.." అన్నాడు.

"ఏట్టా బతికేదిరా? చెత్త కుప్పల్లో కాగితాలేరుకోనా? లేపోతే బిచ్చాలు లాగా అడుక్కోనా? బండిలో పాటలు పాడుకోనా? వద్దురా.. ఇట్టాగ బతికేకన్నా చావడం మంచిది గాదా? పోనీరా.. !" అన్నాడు పెద్దవాడు ఏడుస్తూనే.

***

ఇదంతా జరిగి ఒక సంవత్సరం తరువాత ఆ స్టేషన్ లో తిరిగే పిచ్చిది ఎక్కడో ఓ పసి బిడ్డని కనింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డని ఏం చెయ్యాలో ఆ పిచ్చిదానికి అర్థం కాలేదు. అందుకే ఆ పిల్లాణ్ణి గుడ్డపేలికల్లో చుట్టి పక్కవూరి చెత్తకుప్పలో వదిలేసి తన దారేదో చూసుకుంది. ఆ పసికందు మాత్రం ఇదంతా తెలియక ఏడుస్తూనే వుంది.


***


(అంతర్జాల పత్రిక హంసిని ఉగాది ఉత్తమ కథానికల పోటీ (2011) లో ప్రశంసా పత్రం పొంది, జులై సంచికలో ప్రచురితం)
Category:

3 వ్యాఖ్య(లు):

ఆ.సౌమ్య చెప్పారు...

ప్చ్ ఎందుకండీ ఇలా ఏడిపిస్తారు :(

నిజంగానే కళ్ళ చివర్న నీళ్ళు :(

కొత్త పాళీ చెప్పారు...

WOW!!

అజ్ఞాత చెప్పారు...

Many moons ago I was travelling from Rayagada, Orissa to Kakinada on train and saw a picchi lady who then was pregnant and was asking for food from someone (in turn offering her body!). Felt like throwing up but controlled. After nearly 2 decades I still cannot forget her. Your story just freshed up my memory yet again :-(

Cannot fault her. She was after all out of mind. When people go out of mind, they do things you cannot imagine. Even in the recent novel John Grisham (Confession) uses this concept on Donte Drumm. It left me wondering of many things.
(SGITS Alumnus)