స్పీకిన్ టెల్గు... డబ్బింగ్ టెల్గు


ఈ మధ్య తెలుగు భాషా దినోత్సవం ఒకటి జరిగింది. నెటిజన్లకి చాలా మందికి ఈ విషయం తెలిసే వుంటుంది. అసలు తెలుగు భాషాదినోత్సవం ఒకటి వుందని ప్రవాసాంధ్రులకు, నెటిజన్లకు తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశమే లేదు. తెలిసెను ఫో అది గిడుగు రామ్మూర్తి పంతులుగారు జన్మదినమని తెలియనే తెలియదు. అదీ తెలిసెను ఫో, అసలు ఈ గిడుగు రామ్మూర్తి పంతులు ఎవరో తెలిసివుంటుందని నేను అనుకోను. బుడుగు అనే పుస్తకం రాసినాయన ఈనేనా అని ఎవరినా అడిగినా నేను ఆశ్చర్యపోను. అదీ మన పరిస్థితి. తెలుగు భాషాభివృద్ధికి మనం అందరం కలిసి పాటు పడదామని కనీసం కిందామీదా పడతామనీ అనుకోవాల్సిన రోజు ఇది. అయినా ఈ రోజు గురించి చాలామందికి తెలియకపోవటం విచారకరం. ఎందుకులెండి కడుపు చించుకుంటె బూట్లమీద పడిపోతుంది.

సరే అదలా వుంచండి. తెలుగులో మాట్లాడితే అదెక్కడ నామోషీగా వుంటుందో అని ఆంగ్లంలో మాట్లాడేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఉద్యోగరీత్యా తెలుగులోనే మాట్లాడాల్సినవారు, ఎంతో కాలంగా తెలుగు భాషకి దూరంగా వున్నవాళ్ళు అలామాట్లాడినా కొంత వరకు క్షమించచ్చు. అమలాపురంలో పుట్టి ఆంగ్లము తప్ప టెల్గు రాదని వగలు పోయే వాళ్ళా గురించే నా బాధంతా. ఏం చేస్తాం? పరుగింటి పుల్ల కూర రుచి... నిజమే కానీ ఆ పొరిగింటి పుల్లకూరని పొరుగింటివాళ్ళు చేస్తేనే రుచి. అదే కూరని మనం చెయ్యాలని ప్రయత్నిస్తే ఆ రుచి రాదు. ఆ సంగతొ మనకి గుర్తురాదు.

తెలుగులో మాట్లాడితే పిల్లలు ఎక్కడా తెలుగు నేర్చేసుకుంటారోననీ, ఆ తరువాత వాళ్ళ స్కూల్లో మెడలో మూర్చరోగి బిళ్ళలేసి "నేను తెలుగు మాట్లాడను" అని ఇంగ్లీషులో చెప్పిస్తారేమోనని చాలా మంది తల్లిదండ్రులు భయపడాతారు. ఇక ఆ ఇంట్లో దోశ మాడినా - "బ్లాక్ గ్రాం పేస్ట్ బ్రెడ్ రోస్టెడ్ టు బ్లాక్" అనే అనుకుంటుంటారు తప్ప కలలో కూడా తెలుగు పలకరు. అలా పెరిగిన పిల్లాడు కిందపడ్డా "మమ్మీ" అని అరుస్తాడు తప్ప "అమ్మా" అనలేడు.

నా మటుకు నేను గర్వంగా చెప్పుకునేదేమిటంటే, మా అమ్మాయి స్కూలుకి వెళ్ళే సమయానికి ఎలాగైనా ఆంధ్రాకి తిరిగి వచ్చి తెలుగు కూడా నేర్పించే స్కూల్‌లో చేర్పిస్తానని ముందే ప్రకటించి, అనుకున్నట్టుగానే చెయ్యగలిగాను. ఇప్పుడు మా అమ్మాయి "తెలుగదేల నాన్నా?" అనకుండా "తెలుగదేల యన్న" అని పద్యం చెప్తుంది. నాకదొక తుత్తి.

ఈ మధ్యే నేను తీసుకున్న మరో నిర్ణయం ఏమిటంటే - ప్రయాణాల్లో, ముఖ్యంగా వేరే రాష్ట్రాలకి వెళ్ళేటప్పుడు ఆవశ్యకంగా చేతిలో తెలుగు పుస్తకాన్నే వుంచుకోవాలి అని. ప్రయాణంలో టికెట్టు వుండటం ఎంతముఖ్యంఓ, పుస్తకం వుండటం కూడా అంతే ముఖమని నమ్మిన వాణ్ణి నేను. ఆ పుస్తకమేదో తెలుగుదే అయితే నేను నా మాతృభాష ఇది అనీ కనపడ్డవాళ్ళందరికీ చెప్పుకున్నట్లౌతుంది. ఎవరైనా తెలుగువాడు తారసపడితే మనకున్న అలవాటు ప్రకారం - "ఏది మాష్టారు ఒకసారి చూసి ఇస్తాను.." అని అడిగేవాళ్ళు తగులుతారు. అది లేకపోతే నాతో మాట్లడని వాళ్ళు కూడా ఆ పుస్తకం చూడటానికి తెలుగులో మాట్లాడతారు. అదీ నా ఆలోచన.

సరే ఇదంతే ప్రతి సంవత్సరం చెప్పుకునే తెలుగు వాడకం గురించి. అది కాకుండ ఈ మధ్య నన్ను బాగా కలవరపెడుతున్న విషయం మరొకతి వుంది. అది తెలుగు మీద పడుతున్న పరభాషా ప్రభావం. ముఖ్యంగా మనం