పద్మావతీ శ్రీనివాసం (కథ)


ఆదివారం ఆంధ్రజ్యోతి 11 డిసెంబర్ సంచికలో ప్రచురింపబడిన నా కథ..





తరతరాల నిశీధి



జానకిరాముడు నిస్సత్తువగా నులక మంచం మీద కూర్చున్నాడు. మాములుగా బయటనించి రాగానే కాళ్ళు కడుక్కోనిదే ఎక్కడా కూర్చోని అతణ్ణి చూసి రమణమ్మ కొంచెం ఆశ్చర్యపోయింది.
“గోవిందు రాలేదేం?” అడిగింది చెంబుతో నీళ్ళు అందిస్తూ.
“అదే ఆ ఉద్యోగం సంగతేందో కనుక్కోని వస్తానన్నాడు... రాత్రికల్లా వస్తాడు” చెప్పాడు రాముడు.
“వెళ్ళిన పని ఏమైంది?”
“ఏమౌతుంది.. నిన్నటిదాకా మనం రైతులం... ఈ రోజుతో ఆ పదవి పోయింది.” అన్నాడు జానకిరాముడు పక్కనే వున్న పొట్లపాదు దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ.
“ఈ పరిస్థితిలో అంతకన్నా చెయ్యగలిగింది ఏముంది చెప్పయ్యా..” అంది ఆమె ఓదార్పుగా.
“ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదు.. కానీ ఇప్పుడు చేసిన పని వల్ల రేపు బాధపడాల్సి వస్తుందేమో అనే నా బాధంతా..” అన్నాడతను.

ఆమె అతని వైపు చూసింది. పొలం అమ్మేశానన్న బాధకన్నా, తను చేస్తున్నది సరైన పనేనా అని మనసుపొరల్లో ఎక్కడో అనుమానం వున్నట్టు అనిపించింది. ఆ పరిస్థితిలో అతన్ని అట్టే మాట్లాడించడం అనవసరం అనుకొని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. భుజం పైన వున్న కండువా తీసి మంచం చివర్న వేసి దాని పైన వాలాడు రాముడు.

నలభై ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే పరిస్థితి. తన కొడుకు గోవిందు స్థానంలో తను. తన స్థానంలో తండ్రి వరదయ్య.
“నా మాట విను అయ్యా... ఎంతకాలం ఇట్టా బాడిస పెట్టుకోని బతుకుతాం? వూర్లో రైతులంతా మన కళ్ళ ఎదురుగుండానే ఎట్టా ఎదిగిపోయారో చూత్తానే వున్నాం కదా...” అన్నాడు జానకిరాముడు ఒకరోజు. అప్పటికింకా జానకిరాముడికి పెళ్ళికాలేదు.

“అంటే ఏందిరా నువ్వు జెప్పేది.. కులవృత్తిని కాదంటే కూడు పెట్టేది ఎవరురా?” అన్నాడు వరదయ్య.
“ఇంకా ఏం కులవృత్తి నాయనా? నీ చిన్నప్పటి కత కాదు... పంటలు మారాయి, మునపటి గింజ కాదు, అప్పటి సేద్యం కాదు... నీ కాడకి నాగలి పని చేయించుకునేదానికి ఎంతమంది వస్తున్నారు ఎప్పుడైనా విచారించావా?” అడిగాడు రాముడు.
“ఇంకా ఎవరొస్తారురా... కాలం మారిపోలేదంటరా?... వరి వేసేచోట వేరుశనగ వచ్చింది... నాగళ్ళు పోయి బండ్లు వచ్చాయి... ఇంకా నాగలి పని చేయించేవాళ్ళు ఎవరుంటారురా?” అన్నాడు వరదయ్య.
“నేను చెప్పేది అదే నాయనా... నీ తరం అయిపోయి నా చేతికి బాడిస వచ్చేనాటికి నాగలి అంటే ఏందని అడిగినా అడుగుతారు.. ఇట్టా కాదయ్యా మనం కూడా ఒక్క చెక్క పొలం సంపాయించుకున్నామంటే నాలుగు తరాలదాకా దిగులు వుండదు..” నమ్మబలికాడు ఆ రోజు.

వరదయ్యకి మనస్పూర్తిగా ఇష్టంలేకపోయింది. అయినా తనది పోయే తరం, కొడుకుది వచ్చే తరం. వాడు చెప్పినదాంట్లో నిజం లేకపోలేదు అనుకున్నాడు. ఆ రోజు నించి పైసా పైసా కూడబెట్టాడు. వున్న కాస్త నగానట్రా తాకట్టు పెట్టాడు. ఇంటిల్లిపాదీ కూలి చేశారు.ఒక పూట అన్నం మానేశారు. కొంత సొమ్ము, కొంత అప్పు. రెండకరాల భూమి సొంతమైంది.

ఆ పొలంలో జానకిరాముడు, వరదయ్య కలిసి పడ్డ కష్టానికి రాళ్ళ గుట్టమీదైనా వరి పండుతుంది అనుకునేవారు అంతా. రెండు సంవత్సరాలు అంతా సవ్యంగానే జరిగింది. ఆ తరువాత రెండేళ్ళు వరసగా నీటికి కొరత, ఆ తరువాత మూడేళ్ళు వరద.

“రైతు బ్రతుకంటే అంతేరా... ప్రతి సంవత్సరం లాభాలు వచ్చేదుంటే ప్రపంచకమంతా పొలం పనులే చేసేవారు... రైతు గుండె బరువుకి ప్రకృతి పెట్టే పరీక్షలేరా ఇయన్నీ” అనేవాడు వరదయ్య. ప్రకృతి పరీక్షలకి అంత ధైర్యంగా నిలబడ్డమనిషి, మనిషి చేసే మోసానికి తట్టుకోలేకపోయాడు. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందు..!! విత్తనాల్లో కల్తీకి బాధపడలేదు... నమ్మకాల్లో కల్తీకి బాధపడ్డాడు.

“కాలం మారుతుంది... మన చుట్టూ ప్రపంచకం మారుతుంది... మారనివి మన బతుకులేరా” అన్నాడు చనిపోయేముందు.

***

జానకిరాముడు ఇవన్నీ గుర్తుచేసుకుంటూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు.
“మన బిడ్డ ఇంకా రాలేదేందయ్యా?” అని రమణమ్మ అడుగుతుంటే మెలకువ వచ్చింది.
“వస్తాడు లేవే... ఆడేమన్నా పసిబిడ్డా? రాత్రి బస్సుకు వస్తాడేమో..” అన్నాడు. అన్నాడే కానీ ఆఖరు బస్సు అప్పటికే వూర్లోకి వచ్చి వుంటుందని అతనికి తెలుసు.
“పోనీ నీకు అన్నం పెట్టేదా?” అంది రమణమ్మ.

జానకిరాముడు పలకలేదు. కళ్ళు తెరవకుండానే చేతిని వద్దన్నట్టు వూపి. మంచం మీద మరో పక్కకు మసలాడు. ఆమెకి అతని సైగా అర్థం అయ్యింది, మనసూ అర్థం అయ్యింది.
అర్థరాత్రి దాటుతుండగా వచ్చాడు గోవిందం.ఆ అలికిడికి లేచాడు జానకిరాముడు.
“ఏరా ఇంత రాత్రైందే? ఆ కల్లుపాక కాడికి పొయ్యావా ఎట్టా?” అడిగాడు. గోవిందు అప్పుడప్పుడు కల్లు తాగేది తెలిసినా, తాగి ఇంటికి రాడు కాబట్టి అంతగా పట్టించుకునేవాడు కాదు.
“పొలం అమ్మేశామంటే ఏదో గిలిగా వుండిందయ్యా... అందుకే..”
“సరేలేరా నేను పోదామనుకున్నా... ఎందుకో పడుకున్నచోటు నుంచి లేవబుద్దెయ్యలేదు.. నీ కోసం అమ్మ అన్నం ఆడ పెట్టింది.. తినేసి పడుకో..” అంటూ మళ్ళీ మంచం మీద వాలాడు.

గోవిందు సమాధానం చెప్పకుండా కొంచెం అవతలగా వున్న మంచం మీద పడ్డాడు. మరో రోజైతే గోవిందుని అన్నం తినమని జానకిరాముడు పోరు పెట్టేవాడే. ఈ రోజు వాడు ఎందుకు అన్నం తినటంలేదో రాముడికి తెలుసు. అందుకే మౌనంగా వుండిపోయాడు. మరో నిముషంలో గోవిందు నిద్రలోకి జారుకోని మత్తుగా గురక పెట్టడం మొదలుపెట్టాడు. జానకిరాముడు మాత్రం నిద్ర పట్టక కొంచెం సేపు అటు ఇటు దొర్లి, లేచి గోవిందు మంచం దగ్గరకు వచ్చాడు.

“మా నాయన్ని పోరుపెట్టి పొలం కొనిపించినా.. నా బతుకిట్టా ఏడ్చింది.. ఇప్పుడు నీ మాట విని ఆ పొలం అమ్మినా.. నీ ఖర్మ ఎట్టుందో నాయనా..” అన్నాడు గోవిందు మంచం పట్టె మీద కూర్చుంటూ. అంతకు నెల క్రితం జరిగిన సంఘటన గుర్తొచింది అతనికి.

***

“వూర్లో సంగతి విన్నావా? మన భూముల దిక్కున ఏదో ఫాక్టరీ వస్తదంట... ఫాక్టరీ కట్టేవాళ్ళే పొలాలు కొనుక్కుంటన్నారంట..” చెప్పాడు గోవిందు ఒకరోజు సాయంత్రం.

“కొంటే కొన్నారు లేరా.. పొలం అమ్మాల్సిన అవసరం మనకేమొచ్చింది చెప్పు? ఏటా లాభాలు లేకపోయినా తినడానికి నాలుగు గింజలైనా గిడుతున్నాయి కదా?” అన్నాడు రాముడు.

తినడానికి మాత్రమే గింజలు పండితే అది సేద్యమెట్టా అవుతుంది నాయనా? విత్తనం కొనేటప్పుడు రేటు కూడా గింజ అమ్మేటప్పుడు కళ్ళాజూడలేకపోతున్నాం... గిట్టుబాటు అంటావు గానీ సేద్దెం చేసినంతకాలం కర్సైన ఎరువుకి, మందుకి, నీళ్ళకీ, కరెంటుకీ, మన చాకిరీకీ, కూలికీ ఎవుడైనా గిట్టుబాటు ధర ఇత్తన్నాడా?” అన్నాడు గోవిందు. రాముడి దగ్గర సమాధానం లేదు. కాదని చెప్పేందుకు నిదర్శనమూ లేదు. తన తండ్రి వరదయ్య బాడిసెని నమ్ముకున్నాడు, తను పొలాన్ని నమ్ముకున్నాడు. ఈ రెండింటితోనూ ఏమీ సంపాదించుకున్నది లేదని ఇద్దరికీ తెలుసు. అయినా అది ఒప్పుకునే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది.

పొలం అమ్మమని గోవిందు, అమ్మనని జానకిరాముడు... నాలుగు నెలల పాటు ఇదే వ్యవహారం నడిచింది. వూరి రైతులంతా ఒక్కొక్కరే పొలం అమ్ముకుంటుంటే కాస్తమెత్తబడ్డాడు.

“నాయనా.. నా మాట ఇను... మనం అమ్మిన పొలాలలో ఫాక్టరీలు కట్టి అందులో ఇంటికో వుద్యోగం ఇస్తారంట... ఎండకీ వానకీ వుంటదో పోతదో తెలియని పంట కన్నా నెల నెలా ఠంచనుగా వచ్చే జీతం మేలు గాదా... సేద్దెం చేసి బతికే రోజులు పొయినాయంట.. ఇప్పుడంతా ఫాక్టరీలు, వుద్దోగాలు అంట... పట్నం నించి వచ్చే స్కూలు పంతులుకూడా చెప్పాడు..” అన్నాడు గోవిందు ఒకరోజు.

“నిన్ను జూత్తంటే అప్పుడెప్పుడో నన్ను చూసుకున్నట్టే వుందిరా... అప్పుడు మా నాయనకి ఇట్టే జెప్పినా... చేతి పని కాదు, పొలాన్ని నమ్ముకోడవడం నయమని... ఇప్పుడు నువ్వొచ్చి పొలం కాదు వుద్దోగం నమ్ముకోవాలంటన్నావు... అప్పుడు మా నాయన నాకు ఎదురు చెప్పలా... ఇప్పుడు నేను మాత్రం ఎందుకు జెప్పాల... వచ్చేది నీ తరం... నీ ఇష్టం ప్రకారమే కానీ...” అన్నాడు రాముడు.

ఆ మాట ప్రకారమే పట్నం వెళ్ళి పొలం అమ్మి వచ్చారు తండ్రీ కొడుకులు. వుదయం పొలానికెళ్ళే పని లేదన్న ధైర్యం వల్లేమో ఎండపడే దాకా ఇద్దరూ నిద్రపోయారు.

***

భూమికి పొలం అన్న పేరు పోయి ప్లాటు అన్న పేరు వచ్చింది. మెషీన్లు వచ్చి మళ్ళు గట్లు మాయం చేసి కనుచూపు మేరలో వుత్త మట్టి తప్ప ఇంకేమీ కనపడకుండా చేసినరోజు మాత్రం జానకిరాముడు కొంచెం బాధపడ్డాడు. తన చమటలో తడిసిన భూమి ఆ సువిశాల నేలలో ఎక్కడుందో వెతకాలనిపించింది. కానీ ఆ నేలకి కాపలాగా నిలిచిన మనుషులు వెనక్కి పంపేశారు.

గోవిందు ఇప్పుడు వుద్యోగస్తుడు. నాగలి పట్టినడిచిన నేల మీదే బూట్లు వేసుకోని, హెల్మెట్ పెట్టుకోని నడుస్తున్నాడు. నెల నెలా జీతం, సంవత్సరానికి ఒకసారి బోనస్, రెండు జతల బట్టలు, ఇంట్లో ఎవరికైనా సుస్తి చేస్తే ఆసుపత్రి, పిల్లల కోసం ఒక స్కూలు. ఇంతకన్నా ఇంకా ఏం కావాలనుకున్నాడు. జానకిరాముడు కూడా తను ఒకప్పుడు రైతు అన్నసంగతి క్రమంగా మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.

ఆ సంవత్సరం బోనస్ తగ్గింది. జీతాలు పెరగలేదు. ఒక జత బట్టలే ఇచ్చారు. సరిగ్గా అప్పుడే ఫాక్టరీలో వర్కర్స్ యూనియన్ పెట్టారు. యూనియన్ ఆఫీసుకి అవతలే ఒక వైన్ షాపు కూడా పెట్టారు. విచిత్రంగా అదే సంవత్సరం జానకిరాముడికి బీపీ, షుగరు వున్నాయని డాక్టరు చెప్పాడు.

“ఏరా గోవిందు... డాక్టర్ దగ్గరకి పోవాల తొందరగా రారా అంటే మూడు రోజుల్నుంచి చూస్తున్నా ఒక్కనాడూ రావేందిరా... రోజూ ఆ కల్లుకొట్లో చేరతన్నావంటగదా..” అడిగాడు రాముడు ఒకరోజు.

“అది కల్లుకొట్టు కాదు నాయనా... వైన్ షాపు... మునుపటిలాగా కల్తీ కల్లుకాదు... ప్రపంచకంలో దొరికే మందు సరుకంతా అక్కడే వుంది... అయినా నేను ఎళ్ళేదు అది తాగాడానికి కాదు... మా లీడరు కాశన్న మాటలు ఇనేదానికి..” వివరించాడు గోవిందు.

“ఏం వుంటాయిరా రోజు చెప్పుకునే మాటలు... పోసుకోలు కబుర్లు కాకపోతే..” అంటూ తీసిపారేశాడు జానకిరాముడు.

“అట్టా ఏమీ తెలుసుకొకే మన బతుకులు ఇట్టా ఏడ్చినాయి... ఎంతసేపు మన కుంపటి మన కోడి అనుకోవడమే గానీ ప్రపంచకంలో జరిగేది ఏమిటో ఎప్పుడైనా తెలుసుకున్నావా?”
“ఏందిరా తెలుసుకునేది?”
“ఏమిటా.. మా కాశన్న చెప్పిండు... మన దేశంలో మూడు ఇప్లవాలు వచ్చినాయంట... మొదటిది హరిత ఇప్లవం అంటే పంటలకి సంబంధించినది... అప్పుడు పొలమున్నోడే మారాజు... ఆ తరువాత వచ్చింది ఈ ఫాక్టరీల ఇప్లవం... ఇప్పుడు వుద్దోగం వున్నోడే మారాజు... ఇప్పుడు అసలైన ఇప్లవం వచ్చిందంట... అదేదో గోలగోబలైజేషనో ఏదో... అంటే ప్రపంచకంలో వున్న అన్ని వస్తువులూ ఇక్కడ దొరుకుతాయంట... మేము ఫాక్టరీలో చేసేవి వేరే వేరే దేశాలకు పోతాయంట...”

“అయితే ఏందిరా... ఇప్పుడేందంట?” అడిగాడు రాముడు తలగోక్కుంటూ.
“ఏందా... ప్రపంచకంలో వుండేవన్నీ మనదేశంలో చవగ్గా అమ్మేస్తున్నారంట... అందుకే మా ఫాక్టరీకి లాభాలు రాక పండగ బోనస్సులు తగ్గిపోతున్నాయి... వుద్యోగాలు కూడా పోయే పరిస్థితి వస్తావుందంట...”
ఆ మాట వింటూనే ఖంగారు పడ్డాడు జానకిరాముడు.
“నీ వుద్యోగానికి ఏం కాదుగదా నాయనా?” అన్నాడు
“అట్టా కాకుండా వుండాలనే మా ఫాక్టరీని వేరే జపాను కంపెనీకి అమ్మేస్తున్నారు... ఇంక నించి నేను మన దేశంలో కంపెనీకి వుద్యోగం చెయ్యను... పప.. ఫారిన్ కంపెనీకి వుద్యోగం చేస్తా..” గర్వంగా చెప్పాడు గోవిందు.
జానకిరాముడికి కొడుకు చెప్పిన మాటల్లో సగం కూడా అర్థం కాలేదు. అయినా కొడుకు ముఖంలో సంతోషం చూసి తను కూడా సన్నగా నవ్వుకొని – “నా బిడ్డని సల్లంగా సూడు సామీ..” అంటూ ఆకాశంలోకి మొక్కాడు.
నెల తిరిగే సరికి ఫాక్టరీ పేరు ముందు ఏవో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరాయి. ఫాక్టరీ లోపల పరికరాలు మారాయి, కంప్యూటర్లు వచ్చాయి. యంత్రాలు కొత్త కొత్తవి దిగాయి. యంత్రాలంటే మామూలు యంత్రాలు కాదు...ఒక్క స్విచ్ వేస్తే పది మంది చేసే పనిని అవలీలగా చేసేసే అద్భుతాలు. అందుకే వచ్చిన ప్రతి యంత్రానికి ప్రతిగా పది మంది వుద్యోగాలు పొయాయి. ఆ పది మంది పేర్లలో గోవిందు పేరు కూడా వుంది...!!

 “... ఆ కొత్త మెషిన్ల మీద పని చెయ్యాలంటే ఐటీఐ చేసుండాలంట... అందుకే తీసేశారు.. ఏం ఫర్లేదు నాన్నా... కాశన్న మాకు అండగా వున్నాడు...” చెప్పాడు గోవిందు ఆ రోజు మందు తాగి వచ్చి. అనటానికి అన్నాడే కానీ, ఆ మాట మీద వాడికే నమ్మకం లేనట్టు పలికాడు. “రేపటి నుంచి సత్తాగ్రహం చేత్తన్నా...” అంటూ ప్రకటించాడు.

జానకిరాముడు ఏడ్చాడు “మా నాయనను పోరు బెట్టి పొలం కొనిపించినా... నువ్వు నన్ను సతాయించి ఆ పొలం అమ్మించినావు... ఇప్పుడు మళ్ళా మూడు తరాల ఎనక్కి పోయింది కదరా బతుకు..” అన్నాడు. జానకిరాముడి కళ్ళముందు తన తండ్రి బాడిసె పనులు చేసిన చెట్టుకిందే కొడుకు జానకిరాముడు నిరాహారదీక్ష చేస్తున్నట్లు కనిపించి కుప్పకూలి పోయాడు.


(జాగృతి 28 నవంబరు 2011 సంచికలో ప్రచురితం)

చిట్టెమ్మ చివరి కోరిక




నవ్య 30 నవంబరు 2011 సంచికలో వచ్చిన నా హాస్య కథ.




ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?



చాలారోజుల క్రితం ఒక కథ చదివాను. అందులో ఒక రాజుగారు. ఆయనకి తన జాతకం తెలుసుకోవాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా వూరిలో వున్న మహా మహా జ్యోతిష్యులని అందరినీ పిలిపించి తన జాతకం చూపించుకున్నాడు. చూసిన జ్యోతిష్యులు - "మహారాజా... మీ కుటుంబసభ్యులు మొత్తం మీ కళ్ళ ముందే మరణిస్తారు" అని ప్రకటించారు. దాంతో కోపం నషాళానికి అంటిన మహారాజు ఆ జ్యోతిష్యులకి మరణదండన విధించాడు. తమ తమ జాతకాలు చూసుకోకుండా రాజ సమక్షానికి వచ్చిన జ్యోతిష్యులంతా భోరుమన్నారు. సరిగ్గా అప్పుడే వారిలోనే వున్న ఒక తెలివైన జ్యోతిష్యుడు ముందుకొచ్చి - "మహారాజా, వీళ్ళు చెప్పేది అబద్ధం. మీ అసలు జాతకం నేను చెప్తాను చూడండి. మీ జాతకం ప్రకారం మీకు దీర్ఘాయిష్షు. మీ కుటుంబసభ్యులందరి కన్నా ఎక్కువ కాలం మీరే జీవిస్తారు" అని చెప్పాడట. అది విన్న మహరాజు ఎంతో సంతోషించి బహుమానాలు ఇచ్చి పంపించాడట.

పైన చెప్పిన కథలో మొదట జ్యోతిష్యులు చెప్పిన దానికి, తరువాత తెలివైన జ్యోతిషుడు చెప్పినదానికి తేడాలేదు. చెప్పే విధానంలోనే తేడా. ఆ విధానంవల్లే పర్యవసానంలో వ్యత్యాసం. "రాజుగారి చిన్న భార్య మంచిది" అని చెప్పడం ద్వారా పెద్ద భార్య మంచిది కాదని అన్యాపదేశంగా చెప్పడం గురించి ఒక సామెతే వుంది మనకి. ఇలా చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే వచ్చే అనర్థాలు చాలానే వున్నాయి. "అశ్వద్ధామ హతః" అని చెప్పిన ధర్మరాజు "ఇతి కుంజరః" అనే మాట చిన్నగా కాకుండ పెద్దగా చెప్పివుంటే ద్రోణవధ జరిగేదేకాదు. ఇలా చెప్పగలగడం ఒక ఆర్టు...!!

కొంతకాలం క్రిందట సినెమా హాలులో ఒక ప్రభుత్వ ప్రకటన వచ్చేది. మొగవారికి 21 ఆడవారికి 18 వివాహానికి సరైన సమయం అని చెప్తూ - "పెళ్ళికెందుకు తొందర, పని నేర్చుకో ముందర" అని ప్రకటన ముగిసేది. ఆ మాట వినపడగానే అక్కడక్కడా ఈలలు, ముసి ముసి నవ్వులు వినిపించేవి. ఇలాంటిదే మరో ప్రకటన ప్రభుత్వం వారిదే - కాండోమ్ వాడమని. హెచ్ఐవి వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా కాండోమ్ వాడండి అంటూ ప్రభుత్వ ప్రకటన. అసలు అలాంటి వ్యాధులకి కారణం వివాహేతర సంబంధాలు కానీ, కాండోమ్ వాడటం వాడబడకపోవటం కాదు. అలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు అని ప్రకటించాల్సిన ప్రభుత్వం, వెళ్తే వెళ్ళారు నిరోద్ వాడండి అని ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం చెప్పండి?

ఈ మధ్య ఇలాంటిదే మరోకటి తరచుగా వినిపిస్తోంది. "పర్యావరణ పరిరక్షణ" అంటూ. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ఎవరిపైన వుంది? పర్యావరణం అంటే అదేమైనా మానవజాతికి జాగీరా? పర్యావరణం అనేది సమస్త ప్రాణికోటికి, ప్రాణం లేని కోటాను కోట్లకి సొంతం. అందులో మనుషులు ఒక చిన్న భాగం అంతే. పర్యావరణంలో చిన్న భాగం ఒకటి లేచి నిలబడి, మొత్తం పర్యావరణాన్ని కాపాడుతుందా? అసలు పర్యావరణాన్ని కాపాడటమేమిటనీ? కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి వుంది. మానవులు అంతరించిపోయినా ఈ భూగోళం వుంటుంది. ఎప్పుడెప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందో అప్పుడు వైపరిత్యాల పేరుతో ఈ భూమి ఆ సమతుల్యాన్ని కాపాడుకుంటుంది. అప్పుడెప్పుడో రాకాసిబల్లుల్ని అంతరింపజేసిన భూమి, అవసరమైతే మనుషుల్ని కూడా అంతం చేస్తుంది. కాబట్టి పర్యావరణాన్ని, భూమిని మనం కాపాడుకోనవసరం లేదు. అంత శక్తీ మనకి లేదు. మన చెయ్యగలిగిందల్లా మనల్ని మనం కాపాడుకోవటమే. కాబట్టి - "ఈ భూమిని కాపాడండి", "పర్యావరణాన్ని కాపాడండి" లాంటి అర్థం లేని స్లోగన్లు వదిలి "మనల్ని మనం కాపాడుకుందాం" అని చెప్పడం కరెక్ట్. అలా చెప్పడం వల్ల, మనం ఏదో పర్యావణానికి సహయం చేస్తున్నామని అనే భ్రమ పోయి, మనల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం తెలియవస్తుంది.

మనకి నిజంగానే పర్యావరణాన్ని కాపాడలని కోరికేవుంటే దాన్ని చిత్తశుద్ధితో చూపించగలగాలి. మనం వాడే కార్లు, బైకుల గురించి మాట్లాడుకునేటప్పుడు కిలోమీటర్స్ పర్ లీటర్ (Kilometers per litre) అని కాకుండా లీటర్స్ పర్ కిలోమీటర్ (Litres per kilimeter) అని చెప్పాలి. ఒక కిలోమీటర్‌కి అతి తక్కువ పెట్రోల్ వాడే బండినే ఉత్తమ బండిగా ప్రకటించాలి. అప్పుడు కదా పర్యావరణ ప్రేమ చేతల్లో తెలిసేది.

ఇలాంటి స్పష్టత, చిత్తశుద్ధి నిజానికి ప్రభుత్వానికి వుండాలి. ఎంతసేపూ స్థూల జాతీయోత్పత్తి (Gross Domestic Product (GDP)), లేదా ద్రవ్యోల్బణం (Inflation) లాంటి కొలమానాలతో దేశ స్థిని కొలవటమే కానీ అవి నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నాయా అన్న కొలతని ఎప్పుడో మరిచిపోయాము. ఇలాంటి అర్థ-ఆర్థిక సూచీలతో దేశ ప్రగతి కొలిచేకన్నా స్తూల జాతీయ సంతోషం (Gross National Happiness Index) లాంటి సూచీలతో కొలిస్తే దేశ ప్రగతి మరింత మెరుగ్గా అర్థం అవుతుందేమో. మన పొరుగుదేశమైన భూటాన్ ప్రపంచంలోనే మొట్టామొదటిసరిగా దేశ జాతీయ సంతోష సూచీ తో ప్రగతిని కొలుస్తున్నా మనమింకా ఎక్కడా వేసిన గొంగళిలా అక్కాడే వున్నాం...!! జయ హో భారత్..!!


సిరి మాలచ్చిమి..!!



ధనమూలం ఇదం జగత్ అని పెద్దలు శెలవిచ్చారు - (శెలవంటే హాలీడే కాదండీ.. చెప్పడం). అలా మూలాధారమైన ధనమే ఇంధనమై ఈ భూమిని గిరగిరాతిప్పుతోందని చెప్పుకుంటారు. అసలు భూమి తిరిగేది సూర్యుడి చుట్టూ కాదని, రూపాయి బిళ్ళ చుట్టూ అని కొంతమంది భావుకుల ఊహ. అంత గొప్పదైన డబ్బు విషయంలో కూడా మన మనుషుల్లాగే చిన్నవి పెద్దవీ, కొత్తవి పాతవి అనే తాహతులు కల్పించి వాటి మధ్యలో వైషమ్యాలు కల్పిస్తున్నాం. డబ్బు ఏదైనా శ్రీమహాలక్ష్మే కదా..! అది వెయ్యి రూపాయల కాగితమైనా, అర్థరూపాయి బిళ్ళైనా డబ్బు డబ్బే కదా...!!

అదేదో సినిమాలో నల్ల ధనం అంటే ఏంటయ్యా అది నల్లగా వుంటుందా అని ఒక అమాయకుడు ప్రశ్నిస్తాడు. నిజానికి నల్ల డబ్బంటే తెల్లగా నిగనిగలాడుతూ వుంటుంది. దేశం దాటింఛే సొమ్ముని మినహాయిస్తే ఇంట్లో పరుపులకింద దాచుకునే నల్ల డబ్బంతా దేశంలో చలామణిలో వున్న అధ్యధిక కరెన్సీ నోటు రూపంలో వుంటుంది. కోటానుకోట్లు మింగేస్తున్న మహామహులకి అలా పెద్దకాగితాలుగా మార్చుకోవటం సులభం, దాచుకోవటం సులభం. అదీ ఒకందుకు మంచిదే... మధ్యతరగతి ప్రజలకు కావాల్సింది పది రూపాయల నోట్లు, వంద రూపాయల నోట్లు. వెయ్యి రూపాయలలాంటి పెద్ద నోట్లు ఎక్కడ పోయినా, కనపడక పోయినా పాపం వీళ్ళ బతుకుల్లో పెద్ద కష్టమేమీ రాదు. డబ్బువల్ల సృష్టించబడిన పేద ధనిక వ్యత్యాసం డబ్బులోనే వుండటం మరీ అన్యాయం. వెయ్యి రూపాయల నోటుకు వున్న విలువ అయిదు రూపాయల నోటుకి వుండదు కదా. వెయ్యి రూపాయలు ధనిక వర్గం, అయిదురూపాయలు మధ్యతరగతి... చిల్లర డబ్బు పేదవాడిది.

మనకి తెలియదు కానీ వెయ్యి రూపాయలనోటు మరో వెయ్యి నోటుతోనో, అది లేకపోతే అయిదువందల నోటుతో ఫ్రండ్‌షిప్ చేస్తుంది కానీ పది రూపాయలను, అయిదు రూపాయలను దగ్గరకి కూడా రానివ్వదు. ఇక రూపాయి, అర్థ రూపాయి కనపడితే చిరాకు పడుతుందనుకుంటా. "దూరంగా వుండండయ్యా... వెధవ చిల్లర ముఖాలు మీరూనూ... " అంటుందేమో. ఇంతవరకన్నా నయం... చినిగిపోయిన కాగితాల బతుకు మరీ దుర్భరం. చినుగులు కనపడకుండా ముడుచుకోవాలి. తళ తళా లాడే మరో కొత్త కాగితం కనికరిస్తే దాని మధ్యలో దూరీ, పై పై మెరుగుల ముసుగులో చేతులు మారాలి. పొరపాటున బయటపడిందా, గుట్టు రట్టైందా - అవమానాలు భరించాలి. "ఇది చెల్లదు సార్..!!" ఇది వినడానికేనా నేనింకా బతికుంది అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఏ నోట్లాసుపత్రిలోనో చేరి ష్రడ్డర్ మెషిన్ కింద చావడానికి సిద్ధపడాలి.

నోటు ఏదైనా నోటే కదా..!! ఏ నోటైనా గాధీ తాత బోసి నవ్వు అలాగే వుంటుంది కదా. కానీ ఒకసారి చినుగు పడితే దాని మీద ఆర్.బి.ఐ. అధికారులు చేసిన హామీపత్రం, సంతకం స్పష్టంగా వున్నా దాని విలువ పడిపోతుంది. "ఇది ఎవరూ తీసుకోరు సార్.." అనేది చాలా చోట్ల వినపడే వాదన. ఇది వింటే నాకు భలే చిరాకు... - "ఎవరూ తీసుకోరు అంటే? నేను తీసుకోలా? నాకు ఎవడో ఇస్తేనేగా నాదగ్గరకి వచ్చింది? నేనేమైనా చినిగిపోయిన నోట్లు తయారు చేసే యంత్రం ఒకటి కనిపెట్టి ఇలాంటి కాగితాలని సృష్టిస్తున్నానా?" ఇవన్నీ అడగాలనిపిస్తుంది. అడిగినా పట్టించుకునేది ఎవరు - నోటును బట్టి మనిషికి గౌరవం, మర్యాద..!!

ఇలా పాతనోటుని వాడటం విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్దతి వుంటుంది. కొన్ని చోట్ల కొంచం చినిగినా ఒప్పుకోరు. మరికొన్న చోట్ల చినిగిపోయిన నోటు ముక్కల్ని ఒక ప్లాస్టిక్ కాగితంలో వేసి ఇచ్చినా తీసుకుంటారు (కొంత కాలం క్రితం కర్నాటకలో వున్న పద్దతి ఇది). ఏ రకంగా చూసినా కరెన్సీకి వుండేది వూహాత్మక విలువు (notional value). అందరూ కలిసి కొన్ని పేపరు ముక్కలకి ఒక విలువ ఆపాదించి, పరస్పర అంగీకారం (mutual agreement) మీద ఆ విలువని బదిలీ చేసుకోవడామే కరెన్సీ. అలాంటప్పుడు కాగితం చినిగినా, నలిగినా వచ్చే తేడా ఏమీ లేదు. నిజానికి కొన్నిచోట్ల అర్థ రూపాయికి బదులుగా ఒక చాక్లెట్ ఇవ్వడం మనందరికీ తెలుసు. పరస్పర అంగీకారం ప్రకారం ఆ చాక్లెటే అర్థ రూపాయి. దాన్ని తిరిగి ఇచ్చినా ఆ షాపువాళ్ళు తిరిగి అర్థ రూపాయిగానే తీసుకుంటారు. అందుకే నోటూ మీద వ్యామోహం అనవసరం. ఇప్పుడు ఉన్నట్టుంది ప్రభుత్వం వెయ్యిరూపాయల నోటును ఉపసంహరించుకుంటే అంత పెద్ద నోటు కూడా కాగితం ముక్కగా మిగిలిపోతుంది. దాచుకున్న నల్ల డబ్బు తీసి లెక్క చెప్పి మార్చుకోలేని వారు ఆ కాగితాలు కాల్చి టీ కాచుకోడానికి తప్ప ఇంక దేనికీ వాడలేరు.

చిరిగిపోయిన కాగితాల పరిస్థితి ఇలా వుంటే ఇక చిల్లర మాలచ్చిమి సంగతేమిటి? దారుణం. అన్నింటికన్నా ముందు అంతరించే జాతి ఇది. మొన్న మొన్నటిదాకా నున్నగా గుండ్రంగా బతికిన పావలా ఇప్పుడు పరమపదించింది. నా చిన్నప్పుడు వున్న ఐదుపైసలు (రాంబస్ ఆకారం), పది పైసలు (నొక్కులు నొక్కులుగా గుండ్రంగా), ఇరవై పైసలు (అష్ట భుజి) మా కళ్ళముందే అంతరించిపోయాయి. ఇక కాణీ, అర్థణా, అణా, బేడ ఇత్యాది పదాలు నాయనమ్మల దగ్గర వినడమే కానీ, చాలా తక్కువమంది చూసుంటారు. మెళ్ళోనూ, మొల్లోనూ కట్టుకునే సాంప్రదాయం వల్ల చిల్లి కాణీ ఇంకా అక్కడాక్కడా కనిపించే అవకాశం వుంది. ఇలాంటి చిల్లర పైసలకి ఆయువు మూడిందని తెలియడానికి మొదటి గుర్తు వ్యాపారులు దాన్ని తీసుకోవడం మానేస్తారు. ఆ తరువాత ఆర్టీసీవారు (ఇక్కడ కొన్ని యుద్ధాలు జరుగుతాయి). ఆ తరువాత ఆ చిల్లర తీసుకున్న యాచకులు విచిత్రమైన చూపులు విసరటం మొదలుపెడతారు. ఇక చివరిగా మిగిలేది దేవుడు. ఎందుకూ పనికిరాని ఆ చిల్లర డబ్బు హుండీ ద్వారా దైవ సన్నిధికి చేరుకుంటుంది. చెల్లని డబ్బు వేసినా నిఖార్సైన పుణ్యం మిగుల్తుంది.