ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?



చాలారోజుల క్రితం ఒక కథ చదివాను. అందులో ఒక రాజుగారు. ఆయనకి తన జాతకం తెలుసుకోవాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా వూరిలో వున్న మహా మహా జ్యోతిష్యులని అందరినీ పిలిపించి తన జాతకం చూపించుకున్నాడు. చూసిన జ్యోతిష్యులు - "మహారాజా... మీ కుటుంబసభ్యులు మొత్తం మీ కళ్ళ ముందే మరణిస్తారు" అని ప్రకటించారు. దాంతో కోపం నషాళానికి అంటిన మహారాజు ఆ జ్యోతిష్యులకి మరణదండన విధించాడు. తమ తమ జాతకాలు చూసుకోకుండా రాజ సమక్షానికి వచ్చిన జ్యోతిష్యులంతా భోరుమన్నారు. సరిగ్గా అప్పుడే వారిలోనే వున్న ఒక తెలివైన జ్యోతిష్యుడు ముందుకొచ్చి - "మహారాజా, వీళ్ళు చెప్పేది అబద్ధం. మీ అసలు జాతకం నేను చెప్తాను చూడండి. మీ జాతకం ప్రకారం మీకు దీర్ఘాయిష్షు. మీ కుటుంబసభ్యులందరి కన్నా ఎక్కువ కాలం మీరే జీవిస్తారు" అని చెప్పాడట. అది విన్న మహరాజు ఎంతో సంతోషించి బహుమానాలు ఇచ్చి పంపించాడట.

పైన చెప్పిన కథలో మొదట జ్యోతిష్యులు చెప్పిన దానికి, తరువాత తెలివైన జ్యోతిషుడు చెప్పినదానికి తేడాలేదు. చెప్పే విధానంలోనే తేడా. ఆ విధానంవల్లే పర్యవసానంలో వ్యత్యాసం. "రాజుగారి చిన్న భార్య మంచిది" అని చెప్పడం ద్వారా పెద్ద భార్య మంచిది కాదని అన్యాపదేశంగా చెప్పడం గురించి ఒక సామెతే వుంది మనకి. ఇలా చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే వచ్చే అనర్థాలు చాలానే వున్నాయి. "అశ్వద్ధామ హతః" అని చెప్పిన ధర్మరాజు "ఇతి కుంజరః" అనే మాట చిన్నగా కాకుండ పెద్దగా చెప్పివుంటే ద్రోణవధ జరిగేదేకాదు. ఇలా చెప్పగలగడం ఒక ఆర్టు...!!

కొంతకాలం క్రిందట సినెమా హాలులో ఒక ప్రభుత్వ ప్రకటన వచ్చేది. మొగవారికి 21 ఆడవారికి 18 వివాహానికి సరైన సమయం అని చెప్తూ - "పెళ్ళికెందుకు తొందర, పని నేర్చుకో ముందర" అని ప్రకటన ముగిసేది. ఆ మాట వినపడగానే అక్కడక్కడా ఈలలు, ముసి ముసి నవ్వులు వినిపించేవి. ఇలాంటిదే మరో ప్రకటన ప్రభుత్వం వారిదే - కాండోమ్ వాడమని. హెచ్ఐవి వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా కాండోమ్ వాడండి అంటూ ప్రభుత్వ ప్రకటన. అసలు అలాంటి వ్యాధులకి కారణం వివాహేతర సంబంధాలు కానీ, కాండోమ్ వాడటం వాడబడకపోవటం కాదు. అలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు అని ప్రకటించాల్సిన ప్రభుత్వం, వెళ్తే వెళ్ళారు నిరోద్ వాడండి అని ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం చెప్పండి?

ఈ మధ్య ఇలాంటిదే మరోకటి తరచుగా వినిపిస్తోంది. "పర్యావరణ పరిరక్షణ" అంటూ. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ఎవరిపైన వుంది? పర్యావరణం అంటే అదేమైనా మానవజాతికి జాగీరా? పర్యావరణం అనేది సమస్త ప్రాణికోటికి, ప్రాణం లేని కోటాను కోట్లకి సొంతం. అందులో మనుషులు ఒక చిన్న భాగం అంతే. పర్యావరణంలో చిన్న భాగం ఒకటి లేచి నిలబడి, మొత్తం పర్యావరణాన్ని కాపాడుతుందా? అసలు పర్యావరణాన్ని కాపాడటమేమిటనీ? కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి వుంది. మానవులు అంతరించిపోయినా ఈ భూగోళం వుంటుంది. ఎప్పుడెప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందో అప్పుడు వైపరిత్యాల పేరుతో ఈ భూమి ఆ సమతుల్యాన్ని కాపాడుకుంటుంది. అప్పుడెప్పుడో రాకాసిబల్లుల్ని అంతరింపజేసిన భూమి, అవసరమైతే మనుషుల్ని కూడా అంతం చేస్తుంది. కాబట్టి పర్యావరణాన్ని, భూమిని మనం కాపాడుకోనవసరం లేదు. అంత శక్తీ మనకి లేదు. మన చెయ్యగలిగిందల్లా మనల్ని మనం కాపాడుకోవటమే. కాబట్టి - "ఈ భూమిని కాపాడండి", "పర్యావరణాన్ని కాపాడండి" లాంటి అర్థం లేని స్లోగన్లు వదిలి "మనల్ని మనం కాపాడుకుందాం" అని చెప్పడం కరెక్ట్. అలా చెప్పడం వల్ల, మనం ఏదో పర్యావణానికి సహయం చేస్తున్నామని అనే భ్రమ పోయి, మనల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం తెలియవస్తుంది.

మనకి నిజంగానే పర్యావరణాన్ని కాపాడలని కోరికేవుంటే దాన్ని చిత్తశుద్ధితో చూపించగలగాలి. మనం వాడే కార్లు, బైకుల గురించి మాట్లాడుకునేటప్పుడు కిలోమీటర్స్ పర్ లీటర్ (Kilometers per litre) అని కాకుండా లీటర్స్ పర్ కిలోమీటర్ (Litres per kilimeter) అని చెప్పాలి. ఒక కిలోమీటర్‌కి అతి తక్కువ పెట్రోల్ వాడే బండినే ఉత్తమ బండిగా ప్రకటించాలి. అప్పుడు కదా పర్యావరణ ప్రేమ చేతల్లో తెలిసేది.

ఇలాంటి స్పష్టత, చిత్తశుద్ధి నిజానికి ప్రభుత్వానికి వుండాలి. ఎంతసేపూ స్థూల జాతీయోత్పత్తి (Gross Domestic Product (GDP)), లేదా ద్రవ్యోల్బణం (Inflation) లాంటి కొలమానాలతో దేశ స్థిని కొలవటమే కానీ అవి నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నాయా అన్న కొలతని ఎప్పుడో మరిచిపోయాము. ఇలాంటి అర్థ-ఆర్థిక సూచీలతో దేశ ప్రగతి కొలిచేకన్నా స్తూల జాతీయ సంతోషం (Gross National Happiness Index) లాంటి సూచీలతో కొలిస్తే దేశ ప్రగతి మరింత మెరుగ్గా అర్థం అవుతుందేమో. మన పొరుగుదేశమైన భూటాన్ ప్రపంచంలోనే మొట్టామొదటిసరిగా దేశ జాతీయ సంతోష సూచీ తో ప్రగతిని కొలుస్తున్నా మనమింకా ఎక్కడా వేసిన గొంగళిలా అక్కాడే వున్నాం...!! జయ హో భారత్..!!


1 వ్యాఖ్య(లు):

రామ్ చెప్పారు...

ఇక్కడ మీరు కాపీ చేసిన చిత్రానికి "speak-out.jpg" కాపీ రైట్స్ మీ దగ్గర వున్నాయా మీరు వేరే బ్లాగ్ నుండి ఎలా కాపీ చేసారు? మీరి కాపీ చేసిన బ్లాగ్ అడ్రస్ ....
http://the-city-of-god.blogspot.com/2011/09/2130-die-gedanken-sind-frei.html
నాకు తెల్సి ఇది ఫ్రీ కాదు. మీరు కోడా మీ బ్లాగ్ లో వున్న "కాపీ రైట్స్ లేనివి" అన్ని తీసేయండి.

ఎక్కడో వున్న చిత్రాన్ని కాపీ చేసి మీరు చేసిన పని ఏమిటి, మీరు కాపీ చేసిన దాని ఫై మీకు రైట్స్ ఎక్కడివి, ఇదేమి పని "© All Rights Reserved. జోకాభిరామాయణం".

ఒక వేలు చూపించే ముందు, నాలుగు వేళ్ళు మనల్ని పాయింట్ చేస్తున్నా పట్టించుకోకపోవడం అవివేకం ....