మా నాన్న పేరు మేఘం. అమ్మ పేరు ధరిత్రి. నాన్న అమ్మకి రాసిన ప్రేమలేఖనే నేను. నా పేరు చినుకు.
"జాగ్రత్త కన్నా... అపురూపంగా చూసుకున్న నిన్ను అమ్మదగ్గరకి పంపుతున్నాను. మీ అమ్మ మనసు విశాలమైంది. ఆ సువిశాల సామ్రాజ్యంలో విహరించే హక్కు నీకు ఇస్తున్నాను. అక్కడ నీ కోసం సముద్రుడనే ప్రియుడు ఎదురు చూస్తుంటాడు. అతని గుండె
ఎంతో లోతైనది. అతన్ని కలవడమే నీ జీవితానికి పరమార్థం..." చెప్పాడు నాన్న నేను పుట్టగానే.
"సరేలే నాన్నా... అక్కడ అమ్మ వుందిగా" అన్నాను నేను ఉరకలేసే వుత్సాహంతో
కదులుతూ.
"పిచ్చి తల్లీ... తొందర నీ జీవ లక్షణం. కానీ అక్కడ ఎన్నో అవాంతరాలు వుంటాయి... ఎత్తి పడేసే జలపాతాలు, కట్టిపడేసే ఆనకట్టలు వీటన్నింటినీ
దాటాలి... నేను నిన్ను ఒక కంట కనిపెడ్తూనే వుంటాలే… జాగ్రత్తగా వెళ్ళిరా" అని నన్ను సాగనంపి
వుత్తర దిశగా వెళ్ళిపోయాడు నాన్న.
‘టప్’మని అమ్మకి ముద్దు పెడుతూ నేలపైన రాలాను. నాతోపాటే ఎన్నో వేల చినుకులు… అమ్మ ముద్దుల్లో తడిసిపోతోంది. అయినా ఆమె ముఖంలో ఆనందంలేదు.
"ఇంత మంది నీ కోసం వస్తే ఎందుకమ్మా నిరాశగా వున్నావు?" అడిగాను నేను.
"మీరు వస్తారని ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? మీ నాన్న నన్ను బొత్తిగా మర్చిపోయాడేమో అని ఎంత కలవరపడ్డానో తెలుసా? మీ మామయ్య వాయువు ఈ మధ్య చెడిపోయాడు. వంటినిండా కల్మషాన్ని నింపుకోని, సూర్యుడితో స్నేహం మొదలుపెట్టాడు. సూర్యుడి ప్రతాపంతో నా వళ్ళంతా బీటలు వారింది. నీలాంటి ఎన్ని చినుకులు నన్ను చేరాలని ప్రయత్నించినా పుట్టక ముందే ఆవిరైపోతున్నాయి. ఇక మిమ్మలని కళ్ళ చూస్తానో లేదో అని ఎంత భయపడ్డానో.." బాధగా చెప్పింది అమ్మ.
"ఏం ఫర్లేదమ్మా... ఇప్పుడు మేం వచ్చేశాముకదా... చూడు నిన్ను ఎలా నవ్విస్తామో.." అంటూ మిగిలిన చినుకులకి సైగ చేశాను నేను. అందరం కలిసి పిల్ల కాలువగా తయారయ్యాం. అమ్మ వంటి మీదంతా పాకుతూ చక్కిలిగింతలు పెట్టాము. అమ్మ పక పకా నవ్వింది.
అంతలోనే కలవరం.
"పిల్లలూ.. త్వరగా పదండి... ఇక్కడికి దగ్గర్లోనే ఒక నది వుంది.. వెంటనే అక్కడికెళ్ళి ఆమెను
కలవండి. నదంటే మీ అందరికీ
అక్కలాంటిది... మిమ్మల్ని జాగ్రత్తగా సముద్రుడి దగ్గరకు చేరుస్తుంది.." చెప్పింది అమ్మ ఖంగారుగా.
"అదేమిటమ్మా ఇప్పుడే కదా వచ్చాం అప్పుడే మమ్మల్ని వెళ్ళమంటావే?" అడిగాము మేమంతా కలిసి.
"మీకు తెలియదు అమ్మలూ... నా దగ్గర వుంటే ఎన్నో రోజులుగా ఆర్తితో వున్న నా గుండె మిమ్మల్ని నాలోకి కలిపేసుకుంటుంది. నా గర్భంలో జలమైపోతారు.."
"అమ్మ కడుపులో వుండటం కన్నా కావాల్సింది ఏముందమ్మా... నన్ను నీలోనే కలిపేసుకో.." అన్నాను నేను చేతులు చాస్తూ.
"వద్దు తల్లీ వద్దు... భూగర్భంలో చేరిన ఏ నీటి చుక్కకి ప్రశాంతత లేదు... మర యంత్రాలు వస్తాయి... నా గుండెల్లో ఇనుప చేతులు దిగబడతాయి... నా కడుపులో వున్న మిమ్మల్ని బలవంతంగా బయటకు లాగుతాయి... ఆ కడుపుకోత నేను భరించలేను బంగారు... వెళ్ళండి... నదితో కలవండి... సముద్రుణ్ణి చేరండి.." ఆశీర్వదించింది అమ్మ.
ఇక మొదలైంది మా ప్రయాణం. గల గల జల జల.. తుళ్ళూతూ, దూకుతూ... పచ్చని చెట్లను పలకరిస్తూ వాటిలో ఉత్సాహాన్ని నింపుతూ, సమస్త ప్రాణికోటికి జవ జీవాలని ఇస్తూ జల జల గల గల... ముందుకి ముందుకి..!!
"అదిగో అక్కడే వుంది నది.. పదండి పదండి..." మమ్మల్ని వుత్సాహ పరుస్తూనే వుంది
అమ్మ.
నదిలోకి సంగమం... అహా అదో మధుర అభ్యంగనం. తల్లిలా చేరదీసింది నది. పేరు పేరునా పలకరించింది. దారిలో మేము మోసుకొచ్చిన కాగితం పడవలను చూసి చిన్నగా నవ్వింది.
"అదేమిటి అక్కా అలా నవ్వుతావు?" చిన్నబోయి అడిగాను నేను.
"కాగితం పడవలు కాదు చిన్నతల్లీ... పెద్ద పడవలు చూపిస్తాను. నాతో వస్తారా?" అడిగింది నది. అందరం వుత్సాహంగా ఉరకలేశాం.
ఇంతలో ఎక్కడో ఆర్తనాదాలు. ఏదో అపశృతి.
"పిల్లలూ... కుడివైపుకి వెళ్ళకండి... ఇటు.. ఇటువైపుకి రండి..." నది అరిచింది భయంగా.
"ఏమైంది అక్కా?" అడిగాను.
"అయ్యో తల్లీ అటు మంచినీళ్ళ ఫ్యాక్టరీ వుంది... అటు వెళ్ళినవాళ్ళు ప్లాస్టిక్ సీసాలలో బందీలైపోతారు.. మీలా ఇప్పుడే పుట్టిన వాళ్ళకు మరీ ప్రమాదం.." చెప్పింది మమ్మల్ని పక్కకి లాగుతూ.
అప్పుడు నిశితంగా గమనించాను అక్కని. మా అందరికన్నా కొంచెం రంగు తక్కువే.
"ఏమిటక్కా.. స్వచ్చంగా వుండాల్సిన నువ్వు ఇలా నల్లబడిపోతున్నావు?" అడిగాను ప్రేమగా.
"పిచ్చి పిల్లా... ఇంకా నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావా? ఇప్పుడు నాలో నువ్వు కూడా అంతర్భాగం... నీ రంగు కూడా మారుతోంది చూసుకో.." నవ్వింది విషాదంగా.
అవును నిజమే. నా వంటి నిండా బురద అంటినట్టు అసహ్యంగా వుంది. "ఛీఛీ" అంటూ దులుపుకున్నా వదలటంలేదు. నా పాట్లు చూసి చేప పిల్లలు నవ్వాయి.
"ఏమిటా నవ్వు... మీ దారేదో చూసుకోక" చిరుకోపంతో అదిలించాను చేపల్ని.
"మా దోవేముందమ్మా.. మీరు ఎటుపోతే అటు రావడమేగా..." చెప్పిందో చేప.
"అయితే దోవతప్పిన చేపల్లాగా పదిమందీ ఇటోచ్చారే... మీ పరివారమంతా ఏది.. కనీసం వంద చేపలు లేనిదే కదలరు కదా.." అడిగాను నాన్న చెప్పిన చేపకథల్ని గుర్తుతెచ్చుకుంటూ. చేపలు మళ్ళీ నవ్వాయి.. అయితే ఈ సారి విషాదంగా.
"ఇంకా ఎక్కడమ్మా
వందల చేపలు? మేం పదిమందైనా మిగులుతామో లేదో తెలియని బతుకులై పోయాయి..."
"అదేం?"
"అదిగో అక్కడ పెద్ద పెద్ద గొట్టాలలో పొగలొస్తూ కనిపిస్తోంది చూడు... అదే ఫ్యాక్టరీ... దాంట్లో నుంచి నల్లటి నీళ్ళేవో వచ్చి మీలో కలుస్తున్నాయి... ఆ నీళ్ళు కటిక చేదు... విషం... ముందు మీ రంగు మారుతుంది... మీరు రంగు మారిన ప్రతిసారీ మా గుండెల్లో గుబులు పెరుగుతుంది.. ఆ విషం కడుపులోకి చేరిందా మా బతుకులు తేలిపోతాయి.." చెప్పింది చేపపిల్ల ఏడుస్తూ.
ఇంతలోనే ఓ పెద్ద చేప అరిచింది. "తప్పుకోండి... నల్ల విషం వస్తోండి... తప్పుకోండి.."
చేపపిల్లలు చక చకా ఈది దూరంగా పారిపోయాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపలే విషం వచ్చి నన్ను తాకింది. వళ్ళంతా భగ్గున మండింది. క్రమ క్రమంగా నా రూపురేఖలే మారిపోయాయి. బలవంతంగా నన్ను ఆక్రమించి, నా వంటి నిండా మరకలు చేసి నాలో కలిపోయిందా విషం. ఇప్పుడు నాలోనే విషం వుంది. నన్ను చూస్తేనే చేపపిల్లలు పారిపోతున్నాయి.
నన్ను ఇలా మరకలతో సముద్రుడు చేరదీస్తాడో, తిరస్కరిస్తాడో. అడుగుదామంటే నది అక్క కనపడటంలేదు. "ఇప్పుడు నాలో నువ్వు అంతర్భాగం..." అక్క చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. అంటే ఇప్పుడు నేనే నదిని. కలుషితమైన నదిని.
అంతలోనే అదేదో పెద్ద పడవ కనపడింది. మునుపు కాగితం పడవలతో ఆడుకున్నప్పుడు కలిగిన సంతోషం పెద్ద పడవలని చూసినా కలగడంలేదు. అయినా మొయ్యక తప్పని భారంలా పడవ నా భుజాలమీదకి ఎక్కింది. ఆ బరువు మోస్తూ ఆలోచిస్తున్నాను.
నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తోంది. మంచి నీటినై ఒక ప్రాణి కడుపులోకి వెళ్ళినా, దాహం తీర్చానన్న తృప్తి వుండేది. అమ్మ కడుపులోకి ఇంకినా, వున్నంత కాలం వెచ్చగా హాయిగా వుండేది. సముద్రుణ్ణి కలుసుకోవాలని అతని
ప్రేమల
లోతు
కొలవాలని బయలుదేరి ఇలా తయారయ్యాను. ఇంత అపవిత్రమైన తరువాత సముద్రుణ్ణి చేరుకున్నా ఒకటే చేరకున్నా ఒకటే.
నా ఆలోచనలకి భగ్నం కలిగిస్తూ నా వెనకాలే ఏదో కదలిక. తిరిగి చూశాను. - అదేదో వింత పదార్థం. జిడ్డు జిడ్డుగా.. జిగట జిగటగా..
"అది ఆయిల్.. దూరంగా పో... వెళ్ళిపో.." మిగతా నీటి చుక్కలు గగ్గోలు పెడుతున్నాయి. నేను అక్కడి నుంచి ముందుకి ఈదాలని చూశాను కానీ నాలో సత్తువ లేదు. అన్ని వైపుల నుంచి ఆ నూనె ఆక్రమించడం మొదలుపెట్టింది. అది కప్పేసిన దారిలో ముందుకు కదలాలన్నా కదలలేని పరిస్థితి. మేం ఆటాడుకున్న కాగితపు పడవలే నయం
కాసేపు
ఆడించి
మాతో
కలిసిపోయాయి.
మరీ
ఈ మరపడవలో... మా నెత్తిన ఎక్కి మోయించుకుంటూ కూడా వీటికి కృతజ్ఞత లేదు. మాతో కలవని ఆయిల్ను తెచ్చి కుమ్మరించాయి.
అయిపోయింది... అంతా అయిపోయింది. నేనిప్పుడు పవిత్రత కోల్పోయిన నీటి చుక్కని.
దూరంగా సముద్రుడు కనిపిస్తున్నాడు. ఎన్నో కొండలు, గుట్టలు దాటుకుంటూ తనతో సంగమింఛడానికి వస్తున్న నదికోసం ఆవేశంగా ముందుకొస్తున్నాడు. అంతలోనే కనిపించిన మాలిన్యాన్ని చూసి నిరాశగా వెనక్కి జారుకుంటున్నాడు. అలాంటి సముద్రుడికి విషం నిండిన మనసుని ఎలా ఇవ్వగలను? మలినమైన శరీరాన్ని ఎలా అందింఛగలను?
సాగరసంగమానికి అనర్హురాలినై, తిరస్కారానికి గురై ఇంక నేను బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం?
"అమ్మా... నన్ను కాపాడమ్మా.." అరిచాను గట్టిగా.
అమ్మ విషాదవదనంతో కనిపించింది
" ఈ కలికాలంలో
నీటి చుక్కగా పుట్టాక ఈ కష్టాలు తప్పవు తల్లీ... నీలాంటి ఎన్నో నీటి చుక్కల ఆర్తనాదాలు వినీ వినీ నా గుండె రాయి అయిపోయింది... నాలో క్షమాగుణమే
లేకపోయి
వుంటే మిమ్మల్ని ఇలా చేసిన వాళ్ళని బ్రతకనిచ్చేదాన్నికాదు..." అంది అమ్మ.
అమ్మా కాకపోతే ఇంక
నన్ను రక్షించేది ఎవరు? నాన్న గురొచ్చాడు. అవును నాన్నే కాపాడగలడు...!!
"నాన్నా..
నాన్నా... నీ దగ్గరకు పిలిపించుకో
నాన్నా...... ఇక్కడ వద్దు నాన్నా..." పిచ్చిగా అరుస్తున్నాను.
నాన్న ఆకా శం నుంచి జాలిగా చూశాడు.
"నాన్నా... వద్దు నాన్నా... ఇలా కలుషితమైన శరీరంతో సముద్రుణ్ణి కలవలేను... నన్ను నీ దగ్గరికే తీసేసుకో.." బ్రతిమిలాడాను నేను.
నాన్న భారంగా తల వూపి, సూర్యుణ్ణి వేడుకున్నాడు. సూర్యుడు సరే అన్నాడు. వెచ్చటి సూర్యకిరణం వచ్చి నా గుండెల్లో దిగింది. నన్ను శుద్ధి చేస్టూ, నా మాలిన్యాలన్నీ కడిగేస్తూ నన్ను పై పైకి లాక్కేళ్ళింది సూర్యకిరణం అలా నేను ఆవిరై నాన్న
వైపు
సాగిపోతూ
బాధగా
కిందకి
చూసాను. సముద్రుడు
సహనంతోనే
చూస్తున్నాడు.
అమ్మకి
బాధలో
ఆనందం - నేను
వెళ్ళిపోతున్నాన్న
బాధ, ఏ మాలిన్యంలేని
దివ్యలోకానికి
చేరుతున్నాన్న
సంతోషం
ఒకేసారి.
నాన్నని చేరిన తరువాత
తెలిసింది
నాతో
పాటు
ఎన్నో
లక్షల
నీటిచుక్కలు
సముద్రుణ్ణి
చేరకుండానే
వెనక్కి
వచ్చేశాయని.
మేమంతా
కలిసి
అప్పుడే
నిర్ణయించుకున్నాం
- ఇక నాన్నని వదిలి ఎక్కడికీ
వెళ్ళకూడదని.
నాన్న
కూడా
దిగులు
కళ్ళతో
దగ్గరికి
తీసుకున్నాడు.
"మనింట్లో ఆకాశమంత ఛోటు వుంది
మీరెక్కడికీ
వెళ్ళాల్సిన
పనిలేదు" అన్నాడు. ఆయన
కళ్ళలో
మెరుపు. ఇక
మా
సంతోషానికి
ఆనకట్టలేదు.
కాకపోతే
మాపై
బెంగతో
అమ్మ
ఏ ప్రళయమౌతుందో
అనే
మా
భయం
అంతా.
***
(ప్రజాశక్తి
ఆదివారం అనుబంధం “స్నేహ”లో 11.03.2012 న ప్రచురితం)