గుడగుడ... గడబిడ... (హాస్యకథ)

(ఈ కథ అంతర్జాల పత్రిక సరాగ తొలి సంచికలో ప్రచురితం)


నిజం చెప్పద్దూ ఆ రోజు బ్రహ్మగారికి నిద్ర ముంచుకొచ్చేస్తూ వుంది. పక్కనే కూర్చున్న వాగ్దేవి ఆయనగారు కునికిపాట్లు పడుతున్న సంగతి గమనించక యధాలాపంగా పేపరు చదువుతూ భూలోక విశేషాలను విశదపరుస్తోంది. అప్పటికీ అనుమానం వచ్చి పేపరు తప్పించి చూసింది కానీ, బ్రహ్మగారికి వున్న నాలుగు తలలో ఆమె వైపు వున్న ఒక తల తాలూకూ కళ్ళను మాత్రం తెరిచి, మిగిలిన మూడు తలల కళ్ళూ మూసుకోని వుండటంతో ఆయనగారి నిద్రాప్రహసనాన్ని ఆమె గుర్తించలేదు.

పేపరు నాలుగోపేజీ తిప్పుతూ అక్కడ వున్న వార్త చూసి ఆగిపోయింది.
“ఇది విన్నారా స్వామీ... పేదగృహ స్కీమ్ లో కోటిరూపాయల సిమెంటును స్వాహా చేసిన మంత్రి” అంటూ చదివింది.


“తధాస్తు” అన్నాడు నిద్ర మత్తులో చతుర్ముఖుడు.


***


“నేను ఇక్కడే వున్నాను స్వప్నా... నిన్న మంత్రిగారు హాస్పిటల్ కి వచ్చిన సంగతి నిజమేనని, ఆయన ఇక్కడే హాస్పిటల్ లో వున్నారనీ పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక డాక్టర్ దృవపరిచారు స్వప్నా...” టీవీ మూడొకట్లు తాలూకూ రిపోర్టర్ రవి ఆవేశంగా చెప్పాడు.


“ఒకే రవీ... అయితే మినిస్టరుగారు ఎందుకు హాస్పిటల్ లో చేరారు? ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్య వుందీ? దానికి డాక్టర్లు తీసుకుంటున్న చర్యలేమిటీ? ఇలాంటి విషయాలేమైనా తెలిసాయా?”


“లేదు స్వప్నా... మంత్రిగారు నిన్న ఇక్కడికి వచ్చింది మాత్రం నిజమనీ, ఆయన ఇంకా లోపలే వున్నారని మాత్రం తెలుస్తోంది స్వప్నా... నిన్న ఆయన కారు దిగుతున్నప్పుడు చూసిన స్వీపర్ ఒకామె వుంది ఆమెని అడిగి వివరాలు తెలుసుకుందాం..” అంటూ మైక్ ఆమె వైపు చూపింఛాడు. కెమెరా కూడా అటు వైపు తిరిగింది.


“చెప్పండమ్మా? రాత్రి మినిస్టరుగారు వచ్చినప్పుడు మీరు ఇక్కడే వున్నారు కదా? అప్పుడు ఏం జరిగింది? ఆయన చూడటానికి ఎలా వున్నారు? ఆయనకి వచ్చిన రోగం ఏమిటి?” ప్రశ్నలు కురిపించాడు రవి.


“ఆయనకేం సుస్తి జేషిందో నాకేం దెల్వది... రేత్రి కారులో వచ్చిండు... మొగమంతా వుబ్బిపోయి బుగ్గలెక్కనుంది... వురుక్కుంటా బోయిండు... ఆయన బోయినాన్క మా యాదగిరి జెప్పిండు... ఆయనే మినిష్టరని...” చెప్పింది ఆమె.


“వింటున్నావుగా స్వప్నా... మినిస్టర్ గారి ముఖం బెలూన్ లాగ వుబ్బిపోయి వుందంట... కారు దిగి పరుగెత్తుకుంటూ వెళ్ళాడంట... అయితే ఇంతవరకూ ఆయన బయటకు రాలేదని మాత్రం తెలుస్తోంది... లోపల ఏం జరుగుతోంది అనే విషయం పైన రకరకాల వూహాగానాలు ఇక్కడ ప్రచారంలో వున్నాయి... లోపల ఆపరేషన్ జరుగుతోందని కొంత మంది చెప్తున్నారు... సీబీఐ దాడులనుంచి తప్పించుకోడానికి హాస్పిటల్ లో చేరారని కూడా ప్రచారంలో వుంది... ఏది ఏమైనా ఇప్పటికే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు ఒక్కళ్ళు కూడ లేకపోవటంతో పరిస్థితి ఆందోళనకరంగా కానీ, ఉద్రిక్తంగా కానీ, రక్తసిక్తంగా కానీ మారే ప్రమాదం కూడా కనిపిస్తోంది... స్వప్న...” ఆగకుండా అక్కడిదాక చెప్పి ఊపిరి తీసుకోబోయాడు రవి. సరిగ్గా ఇదే అదనని లైన్ కట్ చేసి తను అందుకుంది స్వప్న.


“థాంక్యూ రవీ... మంత్రిగారి ముఖం బెలూన్ లా ఎందుకు ఉబ్బిపోయింది? ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్రం మొత్తం కలకలం సృష్టిస్తోంది... దీని పైన ప్రత్యేక కథనం, ఒక చర్చా కార్యక్రమం ఒక గంట తరువాత చూడండి... మీ అభిమాన ఛానెల్ మూడొకట్లులో...”


***


“శంకరన్న వర్థిల్లాలి... శంకరన్న జిందాబాద్..” మినిస్టర్ అభిమానులు హాస్పిటల్ బయట నిలబడి అరుస్తున్నారు.


“డాక్టర్ల దురాగతం నశించాలి..” కొత్త స్లోగన్ అరిచాడు యువనేత శ్యామల్రావ్. మినిస్టర్ వీరశంకరం వురఫ్ శంకరన్నకు కుడి భుజం, ఎడమ కాలు లాంటివాడు అతను. అతని వెంట వున్న జనం ఆ కొత్త స్లోగన్ అందుకున్నారు.


ఈ కథనం తనకి ప్రమోషన్ తెచ్చిపెట్టే పరమమంత్రంలా తోచింది రిపోర్టర్ రవికి. మైకు వైరు తెగిపోతున్నా పట్టించుకోకుండా శ్యామల్రావు దగ్గరకు పరుగెత్తాడు.


“సార్ శ్యామల్రావుగారు... అసలు మంత్రిగారికి వచ్చిన రోగం ఏంటి? ఆయనకు గతంలో వచ్చిన సమస్యలేంటి? ఇప్పుడు హాస్పిటల్ లో ఎందుకు చేరారు? మీకేమైనా వివరాలు తెలుసా?” అడిగాడు.


శ్యామల్రావు స్లోగన్లు అరుస్తున్నవాళ్ళని ఆపమన్నట్లు సైగ చేసి, రవి వైపు తిరిగాడు. క్షణంలో అతని ముఖం దీనంగా మారిపోయింది.


“ఏం చెప్పమంటారు సార్... మా శంకరన్నకి ఒక్క రోగం కూడా లేదు... కొంచెం బీపీ వుందని నెల నెల బ్యాంకాక్ పోయి ధ్యానంతో దాన్ని తగ్గించుకుంటున్నాడు... ప్రజాసేవలో పడి సరైన తిండిలేక ఆ మధ్య పైల్స్ వస్తే అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నాడు... డాక్టర్లు రెస్టు తీసుకోమన్నారని అసెంబ్లీలో కూడా ఒక మూల నక్కి నిద్రపోతున్నాడే తప్ప గట్టిగా అరవను కూడా అరవలేదే... ఆయనకి ఏం కష్టం వచ్చిందో...” అంటూ ఏడవటం మొదలుపెట్టాడు.


“అయితే ఆయనకి ఎలాంటి రోగాలు లేవంటారు... డాక్టర్ తో మీరు మాట్లాడారా?” అడిగాడు మళ్ళీ. మరుక్షణం శ్యామల్రావ్ ముఖం రౌద్రంగా మారిపోయింది.


“దేవుడు లాంటి శంకరన్నకు కష్టం వస్తే పంచుకోడానికి మేమంతా లేమా... అలాంటిది అసలేం జరిగిందో తెలియనీయకుండా దాచిపెట్టి లోపల ఏదో చేస్తున్నారు... మా శంకరన్నకి ఏమన్నా జరిగితే ఢిల్లీదాకా కదిలిపోతాయి. మా అన్న కోసం మేం ఆత్మాహుతికైనా సిద్ధమే... శంకరన్నా... జిందాబాద్...” శ్యామల్రావు స్లోగన్లు మొదలుపెట్టడంతో రవి మైక్ వైపు తిరిగి చెప్పిందే మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు.


***


“పైల్స్ వస్తే అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నాడు”
“పైల్స్ వస్తే అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నాడు”
“పైల్స్ వస్తే... పైల్స్ వస్తే”


“ప్రత్యక్షం” ఛానల్లో శ్యామల్రావు చెప్పిన మాటల్నే తిప్పి తిప్పి చూపిస్తున్నారు.


“అమెరికాలో పారిశుధ్ధ్య పధకాలను సమీక్షించేందుకు మూడు నెలల క్రింద పర్యటనకు వెళ్ళిన మంత్రి వీరశంకరం నిజానికి పైల్స్ ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్ళారని తెలుస్తోంది. ఆయన ప్రధాన అనుచరుడు శ్యామల్రావు ఒక టీవీ ఛానల్లో ఈ విషయాన్ని ఒప్పుకుంటున్న సంగతి ఇప్పుడు మీరు చూస్తున్నారు..” చెప్పుకెళ్తున్నాడు “ప్రత్యక్షం” ఏంకర్.


ఛానల్ మారిస్తే - మూడోకట్లు ఛానల్లో ముఖం బెలూన్ లా ఉబ్బటం ఏ రోగ లక్షణం అయ్యి వుంటుందనే విషయం పైన చర్చా కర్యక్రమం మొదలైంది. ఏంకర్ స్వప్న టాంక్ బండ్ పైన బూరలమ్ముకునే మస్తాన్ ని ఫోన్ లైన్లో తీసుకుంది.


“చెప్పండి మస్తాన్ గారు, బాగా ఉబ్బిన బెలూన్ ఎలా వుంటుంది? దానికి ఏదైనా రోగానికి సంబంధం వుందంటారా?”


“రోగాల గురించి నాకేటిదెల్సు... బుడగలగురించైతే జెప్తా... బుడగల్లో రకాలుంటాయి... గుండ్రంగా దోసకాయ మాదిరిగా వుండేవి, వంకాయ లాగా వుండేయి... ఇంకా ఇప్పుడు కొత్తగా వత్తున్నాయి... పొడుగ్గా సొరకాయ మాదిరిగా వుండేయి..”


మంత్రి వీరశంకరం ముఖాన్ని దోసకాయలాగా, వంకాయ లాగా, సొరకాయలాగా రకరకాలుగా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు. అందులో మంత్రిగారి ముఖం ఎలా వుండచ్చో వూహించి ఎస్.ఎమ్.ఎస్ చేయమని కూడా అడుగుతున్నారు.


ఛానల్ మారిస్తే – మూడుమూడ్లు ఛానల్ లో ప్రతిపక్ష నాయకుడు తిరుమల నాయిడు ఆవేశంగా అరుస్తున్నాడు – “ఏం రోగం వచ్చిందో అని చర్చ అనవసరం. మొన్న జరిగిన అసంబ్లీలో ఎయిడ్స్ వచ్చినట్లు మంత్రిగారే ప్రకటించారు... ఒక బాధ్యతాయుతమైన పదవిలో వుండి ఇలాంటి రోగాలను తెచ్చుకున్న మంత్రి సిగ్గుపడాలి. ఇలాంటి రోగాల్ని అరికట్టలేని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలను మేము గవర్నర్ గారిని కోరుతూ వినతి పత్రం సమర్పిస్తున్నాం...” చెప్పుకుపోతున్నాడు. మంత్రిగారు చెప్పిన ఎయిడ్స్ అంటే రోగం గురించి కాదనీ, ఎయిడ్స్ అంటే నిధులనీ తిరుమలనాయుడికి చెప్పిన తరువాత కానీ ఆయన శాంతించలేదు.


ఇదంతా టీవీలో చూస్తున్న డాక్టర్ ఐరావతం తలపట్టుకున్నాడు. ఒక్క పక్క మంత్రిగారికి తీరని సమస్య. మరోపక్క చిలవలపలువలుగా మీడియా కథనాలు. అంతకు ముందే రాష్ట్రముఖ్యమంత్రి ఫోన్ చేసి, ఆరోగ్య శాఖా మంత్రిని, ఆర్థిక శాఖా మంత్రిని పంపిస్తున్నట్లు చెప్పాడు. వాళ్ళు వచ్చేదాకా మీడియాతో మాట్లాడద్దని కూడా హెచ్చరించారు.


మరో అరగంటలో పదహారు కార్లు బారుగా వచ్చి హాస్పిటల్ ముందు నిలబడ్డాయి. ఏ కారులో నుంచి ఏ మంత్రి దిగుతారో అర్థంకాక సిబ్బంది ఈ చివరినుంచి ఆ చివరి వరకూ పరుగులు పెట్టారు. ఎనిమిదో కారులోనుంచి ఆరోగ్యమంత్రి బలహీన్రావ్, పధ్నాలుగో కారులోనుంచి ఆర్థికమంత్రి పాపర్ పరమాత్మ దిగారు. ముందు ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు.
“వీరశంకరం ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత, ఆయనకి ఏం కాదు. అభిమానుల ప్రేమ, హైకమాండ్ ఆశీర్వాదం ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాయి..” చెప్పాడు బలహీన్రావ్.


“ఆయన కుదుటపడటానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఖజానా నిండుకున్న ఈ సమయంలో ఈ విపత్తు రావటం, పైగా ఆయన ఏరి కోరి ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరటం వల్ల వచ్చే ఖర్చు దృష్టిలో వుంచుకోని ఏ ఏ పన్నులు విధించాలి అన్న విషయం పరిశీలించడానికి ఒక కమిటీ కూడా వేశాం...” అన్నాడు పాపర్ పరమాత్మ. ఇద్దరూ నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇచ్చిన తరువాత లోపలికి నడిచారు.


***


బ్రేకింగ్ న్యూస్...
వీరశంకరంకి మూలశంక... గత రెండు రోజులుగా అవస్థలు పడుతున్న మంత్రి. ఫలించని డాక్టర్ల ప్రయత్నాలు.
“మా ప్రత్యేక విలేఖరి టార్జాన్ పైపు ఎక్కి డాక్టర్ ఐరావతం మంత్రులతో జరిపిన సంభాషణను స్టింగ్ ఆపరేషన్ ద్వారా రికార్డ్ చేసిన టేపులను మీరు ఇప్పుడు చూడచ్చు...”


“లాక్సేటివ్ ఇచ్చాం సార్. ఆముదం తాగించాం సార్. జరగాల్సిన పని జరగనీయకుండా ఏదో అడ్డం పడుతోంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్.” చేతులు కట్టుకోని డాక్టర్ ఐరావతం మంత్రులిద్దరికీ చెప్తున్నాడు.


“అలాంటి సమస్య వుంటే ముఖం బెలూన్ లా ఉబ్బటం సహజమేనని మా స్టూడియోలో వున్న డాక్టర్ చెప్తున్నారు. ఆయన ముఖం బెలూన్ లా వుబ్బి వుందని మొదట మా ఛానలే చెప్పిన సంగతి ప్రేక్షకులకి గుర్తుండేవుంటుంది...” మళ్ళీ దోసకాయ శంకర్రావ్, వంకాయ శంకర్రావ్, సొరకాయ శంకర్రావ్ టీవీ పైన కనిపించారు.


రాష్ట్రం మొత్తం కలకలం. ఆయన అభిమానులు గుళ్ళకి, చర్చీలకీ, మసీదులకీ వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కటౌట్లకి పాలాభిషేకాలు, శనికి తైలాభిషేకాలు జరిగాయి.


సమస్య తేలిపోవటంతో శ్యామల్రావ్ నిరుత్సాహపడ్డాడు. అద్దెకు తెచ్చిన జనం వృధాగా వెనక్కి పోవటం ఎందుకని మూడొకట్లు స్టూడియో ముందుకు జనాన్ని తీసుకెళ్ళి అక్కడ ధర్నా మొదలుపెట్టాడు.


“ప్రజానాయకుడు వీరశంకరంను కూరగాయల్లాగా చూపించిన టీవీ యాజమాన్యం ఆయనకు క్షమాపణ చెప్పాలి... మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక ఈ ఛానల్ మూసెయ్యాలి..”


***


“హలో... రేడియో ఎఫ్ ఎమ్ నూటపధ్నాలుగు బై ఇరవైమూడు ఇంటూ నాలుగు... మంత్రి వీరశంకరంగారికి చెప్పుకోలేని సమస్య ఒకటి వచ్చింది. దీనికి మీదగ్గర ఏదైనా చిట్కా వుంటే వెంటనే నాకు కాల్ చేయండి... మా నెంబరు తెలుసుకదా.. తొమ్మిది ఒకటి తొమ్మిదొందల ఒకటి తొమ్మిది వేలా ఒకటి...”
“హలో..”
“ఆ హలో... మీరే ఫస్ట్ కాలర్... చెప్పండి.. మంత్రిగారి సమస్యకు పరిష్కారం వుందా మీ దగ్గర..”
“ఓ వుందండి... ఒక నాలుగు గ్లాసులు సబ్బునీళ్ళు తాగితే అన్నీ జారుకుంటాయండీ...”


***


మంత్రిగారి సమస్యని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య బృందం హుటాహుటిన నగరానికి చేరుకుంది. పన్నెండు గంటల సుదీర్ఘ పరిశ్రమ తరువాత బయటికి వచ్చిందా బృందం.
“సిమెంట్... మంత్రిగారి కడుపులో సిమెంట్ వుంది అది గడ్డకట్టి ఈ సమస్యని తెచ్చి పెట్టింది. ఒక చిన్న శస్త్ర చికిత్స చేసి సిమెంట్ బయటికి తీస్తున్నాం. అయితే చిత్రంగా బస్తాలకు బస్తాలు వస్తూనే వుంది. ఇంకా ఎంత సిమెంట్ వస్తుందో, ఎప్పటిదాకా ఈ ప్రహసనం నడుస్తుందో చెప్పలేం...” చెప్పాడు బృందం నాయకుడు మీడియాతో.
“మంత్రిగారు ఎలా వున్నారు? ఆయన మాట్లాడుతున్నారా? ఆయనకి ఈ విషయం తెలిసిందా? ఎలా రియాక్టయ్యారు?” మీడియా ప్రశ్నలు కురిపించారు.


“ఆయన ఆరోగ్యంగానే వున్నారు. ఇందాకే స్పృహ వస్తే విషయం చెప్పాం. వెంటనే ఆయన బావమరిదికి ఫోన్ చేసి వెంటనే ఒక సిమెంట్ ఫాక్టరీ కొనమని చెప్పి మళ్ళీ స్పృహ తప్పారు...”


***


విరగబడి నవ్వుతున్నాడు వేదపాణి బ్రహ్మ. వీణాపాణి చెంగు అడ్డం పెట్టుకోని మరీ నవ్వుతోంది.


“గృహ మంత్రి కాబట్టి సరిపోయింది... అదే పశుసంవర్థక శాఖా అయ్యింటే... గడ్డీ, తవుడూనా?” అడిగింది ఆమె నవ్వుతూ.


“ఏకంగా దూడలే...” నాలుగు నవ్వులు రువ్వాడు ఆయన.


“బాగానే వుంది మీ వినోదం... ఇలాంటి రాజకీయనాయకులకీ, లంచాలు మరిగిన కాంట్రాక్టర్లకీ, ఉద్యోగులకీ అందరికీ ఇలాంటి శిక్షలే వెయ్యాలి..” అంది మళ్ళీ నవ్వుతూ.


“తధాస్తు” అన్నాడు బ్రహ్మ, ఈ సారి మెలకువగానే. 
Category:

2 వ్యాఖ్య(లు):

జలతారు వెన్నెల చెప్పారు...

Hilarious! చాలా బాగుంది.

Unknown చెప్పారు...

సూపర్. చాలా బాగుంది.