అబద్ధాల ఆనందం


మా పక్కవీధి పాపారావుగారి పెద్దబ్బాయి పాపులారిటీ అంతా ఇంతాకాదు. ఇంటిపేరుతో కలిపి వాడిపేరు అవసరాల ఆనందం అయినా అందరూ అబద్ధాల ఆనందం అంటుంటారు. అలా వూరంతా పిలుస్తున్నారంటే దానికి కారణం వేరే చెప్పాల్సిన పని ఏముంది. అవసరం వున్నా లేకపోయినా అబద్ధం ఆడటం వాడికో అలవాటు... వ్యసనం కూడా.
ముందు వెనక చూడకుండా అలవోకగా అబద్ధాలు అల్లేయటం వాడికి ఉగ్గుతో పెట్టిన విద్య. స్కూల్ మార్కుల విషయంలో, అమ్మనీ నాన్ననీ బురిడీ కొట్టించే విషయంలో, ఊరివాళ్ళని ఆటపట్టించే విషయంలో చెప్పే అబద్ధాలే కాకుండా ఏమీ తోచక చెప్పే అబద్ధాలతో అందరినీ ఫూల్స్ చేయడం వాడికి చాలా మామూలు విషయం. అందరికీ సంవత్సరానికి ఒకటే ఫూల్స్ డే అయితే, ఆనందానికి మూడువందల అరవై ఐదు రోజులూ ఫూల్స్ డేనే.
మచ్చుకొకటి చెప్పుకోవాలంటే -
“ఈ మధ్య తిరుపతి వెళ్ళామా... అక్కడ మా మామయ్యే కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు... మొత్తం జనాన్ని పక్కకి తోసి, అన్ని లైన్లు ఆపేసి, మమ్మల్ని తీసుకెళ్ళి స్వామి ముందు నిలబెట్టాడు. మా బామ్మ వూరుకోకుండా ’ఎక్కడ నాయనా? నాకేం కనపడటంలేదే’ అని అనేసరికి అప్పటికప్పుడు మనుషుల్ని పిలిపించి విగ్రహాన్ని ముందుకు జరిపించాడు మామయ్య...” అంటూ కోసేవాడు.
“ఏమిట్రా నువ్వు చెప్పేది నమ్మేట్టులేదే..” అని ఎవరైనా అంటే “కావాలంటే వెళ్ళి చూసుకోవోయ్... విగ్రహం ఇప్పటికి కూడా మూడడుగులు ముందుకే వుంటుంది..” అని నమ్మకంగా చెప్పేవాడు. ఈ విషయం విని వాడి బామ్మ ఏడ్చినంత పని చేసింది. ’గోవిందా.. గోవిందా’ అని గగ్గోలు పెట్టి -
“ఎందుకురా అలా అబద్ధాలు చెప్తావు?” అని మందలించింది.
“ఏం? అబద్ధాలు చెప్తే ఏమౌతుంది?”
“కళ్ళుపోతాయి..” చెప్పిందామె.
“ఇదే పెద్ద అబద్ధం...” అంటూ గట్టిగా నవ్వేశాడు వాడు. “లేకపోతే అన్నీ అబద్ధాలే చెప్పే బాబాలకీ, స్వాములకీ ఈ పాటికి నల్లకళ్ళద్దాలు వచ్చేసేవి కదా?” అంటూ వివరణ కూడా ఇచ్చాడు. పాపం బాబాలనీ స్వామీజీలనీ కొలిచే బామ్మ ఇంకాస్త బాధపడి లెంపలేసుకుంది కానీ వాడి అలవాటు మానిపింఛలేక పోయింది.
మరొకరోజు వాళ్ళ బళ్ళో మాష్టారు సత్యహరిశ్చంద్రుడి కథ మొత్తం పద్యాలతో సహా చెప్పి – “హరిశ్చంద్రుడి కథ విన్న తరువాత నీకేం తెలిసింది?” అని అడిగాడు.
“అన్నీ నిజాలే చెప్తే ఇలాగే కష్టాలు పడాలి...” అన్నాడు ఆనందం చేతులు కట్టుకోని.
“అయ్యో... అది కాదురా ఎప్పుడూ నిజం చెప్పాలి... నిజం నిప్పులాంటిది...” అంటూ సామెత చెప్పాడు మాష్టరు.
“అదే నేనూ చెప్పేది... ఆ నిప్పులూ అవీ మనకెందుకండీ ఎంచక్కా కూల్ కూల్ గా అబద్ధాలు చెప్పుకోక” అంటూ తుర్రుమన్నాడు వాడు.
ఇలా వాడి అబద్దాల ఖ్యాతి ఎంతగా పేరు పొందిందంటే వూరి వాళ్ళు ఆనందం చెప్పిన విషయాన్ని ఏదీ నమ్మని స్థితికి చేరుకున్నారు.
“మా అబ్బాయిని కానీ చూశావా ఆనందం?” అని అడగటం – “అదుగో అటు తూర్పు వైపు పొలానికెళ్ళా”డని వీడు చెప్తే, “ఓహో అలాగా” అంటూ పడమటివైపు తిరిగి నడక సాగించేవారు.
నూరు అబద్ధాలు చెప్పి అయినా పెళ్ళిళ్ళు చెయ్యమన్నారని పెళ్ళి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా ఆనందాన్ని వెంట తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ అలవాటుగా – “అబ్బాయికేమండీ... లంకంత కొంప, ఆ కొంపలోనే కొల్లేరంత సరస్సు, అందులో కోట, ఆ కోటలో కోట్లు...” అంటూ కోతలు కోసేవాడు.
వాడితో కాస్త చనువుగా వుండేది నేనే కాబట్టి ఒకరోజు వివరంగా అడిగాను – “ఏందుకురా ఈ అబద్ధాలు అవీ?” అని.
“నమ్మేవాళ్ళని బట్టే అబద్ధాలురా... మన జనం వున్నారే అబద్ధాలు నమ్మడానికి అలవాటు పడ్డారు... ఉదాహరణకి ఎర్ర బస్సు ఎక్కారనుకో, కండెక్టర్ టికెట్ కొట్టి చిల్లర లేదు తర్వాత ఇస్తాను అంటే జనం నమ్ముతున్నారా లేదా? అయిదేళ్ళకొకసారి రాజకీయ నాయకుడు వచ్చి వరాలు కురిపిస్తే నమ్ముతున్నారా లేదా? ఫలానా సబ్బువాడితే నల్లటి చర్మం తెల్లగా నిగనిగలాడుతుందని టీవీలో చెప్తే నమ్ముతున్నామా లేదా? చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు దాచుకోని భద్రంగా వున్నాయి అని నమ్ముతున్నామా లేదా? అంతెందుకు 2012లో ప్రపంచం అంతం అయిపోతుంది అంటే నిజమే అనుకోవడంలేదూ...??”
“అయితే ఏమంటావురా?”
“ఏముందిరా... మెత్తగా వుండేవాణ్ణి చూస్తే మొత్త బుద్దేస్తుందని... నమ్మేవాణ్ణి చూస్తే ముంచబుద్దేస్తుంది... అందుకే రాజకీయనాయకుడు వరాలు మర్చిపోతున్నాడు, చిట్ ఫండ్ లు “చీట్” ఫండ్ లు అవుతున్నాయి, కండెక్టరు ఇవ్వల్సిన చిల్లర టికెట్ వెనకాల కాగితంపైన అంకెలుగానే వుండిపోతోంది... అలాంటి నమ్మేవాణ్ణి చూడగానే అబద్ధాలు వాటంతట అవే వచ్చేస్తుంటాయిరా... అయినా వాళ్ళందరితో పొల్చుకుంటే నేను చెప్పేవి కూడా అబద్ధాలేనట్రా?” అన్నాడు వాడు.
వాడు చెప్పింది అర్థం అయ్యాక వాణ్ణి అబద్ధాల ఆనందం అనడం మానేశాను నేను. అయినా వాడు మాత్రం ఇంకా అబద్ధాలు మానలేదు.
జాగ్రత్తండోయ్..!! రేపు ఏ సేల్స్ మేన్ గానో, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ గానో, బాబాగానో కనిపించి మిమ్మల్నీ బురిడీ కొట్టించెయ్యగలడు..! తస్మాత్ జాగ్రత్త..!!
(హాస్యానందం, ఏప్రిల్ 2012)
Category:

2 వ్యాఖ్య(లు):

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుందండి. అబద్ధాల ఆనందం గారు చెప్పిన అబద్ధాల వల్ల పరులకి ఎమీ నష్ట్టం కాని, బాధ కాని లేదు కదా.

అజ్ఞాత చెప్పారు...

:)