కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు


అప్పటికే చిరాకుగా వుంది. దానికి తొడు ఇదొకటి.
విపరీతంగా కురిసిన తుఫాను వర్షం ఆగి అప్పటికి అరగంటైంది. శవంలేచిన ఇల్లులా వుంది వాతావరణం. రహదారిపైన ఎవో తెలియని రెండు పల్లెటూర్ల మధ్య గుర్తుతెలియని ప్రాంతం అది. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాలంటే కనీసం రెండు మూడు గంటలు పడుతుంది. అది కూడా నా కారులో వెళ్ళగలిగితే...! కనుచూపుమేరలో వూరు కాదు కదా కనీసం ఒక మనిషి జాడ కూడా కనపడటం లేదు. కాలు కింద పెడితే బురద. సెల్ ఫోన్ పనిచేయటం మానేసి అప్పటికి అరగంట దాటింది. అలాంటి నిస్సహాయ పరిస్థితిలో నా కారు వెనక టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి.
కారు ఆగిపోగానే మళ్ళీ స్టార్ట్ చేసి, బలంగా ఏక్సిలేటర్ తొక్కాను. అంగుళం కూడా ముందుకు కదలలేదు సరికదా మరో అడుగులోతు బురదలో దిగబడి పోయింది. పూర్తిగా ఇరుకున్న తరువాత కానీ తెలియలేదు, నేను చేస్తున్నది తప్పని. ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించిన ప్రతిసారి కారు ఇంకా లోతుగా ఇరుక్కుపోతోంది. నా బాధంతా కారు బయటికి రావట్లేదని కాదు. నా బాధకి అసలు కారణం నేను ఒంగోలు వెళ్ళలేకుండా ఆగిపోవడం. ఎందుకంటే తెల్లవారితే నాకు నిశ్చితార్థం.
ఆఫీసు పనుల్లో బిజీగా వున్నాను. సరిగ్గా ఉదయానికి అక్కడ వుంటానుఅని అమ్మకి, నాన్నకీ నమ్మకంగా చెప్పాను. మరో గంట దాటిందంటే మా బంధువులంతా చేరిన చోట ఖంగారు, కలకలం మొదలవటం ఖాయం.
చుట్టూ ఎవరైనా మనిషి కనపడతాడేమోనని చూశాను. నిర్మానుష్యంగా వుందా ప్రాంతం. కారు మెకానిక్ కాకపోయినా కనీసం ఇద్దరు మనుషులు దొరికినా, వాళ్ళు కొంచెం శ్రమ తీసుకోని తోస్తే చాలని నా ఆలోచన. ఈ బురద నుంచి బయటపడితే మరో నాలుగైదు గంటలలో ఒంగోలులో కల్యాణమంటపం చేరుకోవచ్చు. చేతికి వున్న వాచ్ వైపు చూసుకున్నాను. రాత్రి ఒకటి నలభై. ఇంత రాత్రివేళ ఎవరైనా మనుషులు కనపడతారని ఆశించడమే తప్పేమో.
ఇక తప్పదని అర్థమై కారు దిగి వెనక టైర్ల వైపు చూశాను. కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి తోస్తే కాని కారు ముందుకు కదిలే అవకాశమే లేదు. ఆ ముగ్గురు వ్యక్తులని ఇంత రాత్రివేళ పట్టుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ వుండగా, శరవేగంతో నా పక్కనుంచి దూసుకెళ్ళిన లారీ నా బట్టల మీద బురదని వసంతం చల్లినట్లు చిమ్ముకుంటూ వెళ్ళిపోయింది..
చొక్కాకి అంటిన బురద దులుపుకోని, మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళిపోతున్న లారీ వైపు చూశాను. ఆ వెళ్తున్న లారీ లైట్ల వెలుతురులో కనిపించిందో మైలురాయి. నాకు ప్రాణం లేచొచ్చినట్లైంది. కుడి వైపుకి బాణం గుర్తు పెట్టి రాసివుంది– “చిత్రపురం2 కిలోమీటర్లు.
***
అరగంట తరువాత, రెండు కిలోమీటర్ల నడక తరువాత ఆ వూర్లోకి అడుగుపెడుతుండగా కనిపించాడు మొదటి వ్యక్తి. చిన్న గుడిసె ముందు వేసుకున్న నులకమంచం మీద కూర్చోని వున్నాడతను.
ఎవరూ..” అన్నాడు టార్చిలైటు వెలుగు నా ముఖం మీదకు వేస్తూ.
నేను చేతులతో వెలుగు కళ్ళలో పడకుండా ఆపుకుంటూ అన్నాను– “నా కారు అక్కడ హైవే మీద బురదలో ఇరుక్కోని వుందండీ... కారు తొయ్యడానికి ఎవరైనా మనిషి సహాయం కోసం వచ్చాను..” చెప్పాను ఆయన దగ్గరకు వచ్చి. అప్పటికే ఆయన టార్చిలైటు ఆపేయడంతో ఆయన ముఖం కనపడింది. కనీసం ఒక అరవై అయిదు, డెబ్భై సంవత్సరాలు వుంటాయేమో ఆయనకి.
అట్నా బాబూ... నేను వచ్చేవాడినే కానీ, కాలు నొప్పి చేసింది. తొయ్యలేను..” అన్నాడాయన. ఆ నొప్పేదో లేకపోతే నిజంగా వచ్చి తోసేట్టే వున్నాడు.
అయ్యో.. మీకెందుకండీ శ్రమ... మీ అబ్బాయి కానీ, వేరే కుర్రాళ్ళు కానీ ఎవరైనా వున్నారా?” అన్నాను.
నాకెవురూలేరు నాయనా... పోనీ ఒక పని చెయ్... అదిగో అక్కడ రెండిళ్ళ అవతల దోమతెర కనపడుతుంది చూడు.. ఆచారి అని వుంటాడు... లేపి రమ్మనమని చెప్పు... ఆడు తప్పకుండా వస్తాడు..” సలహా ఇచ్చాడా పెద్దాయన.
నేను సరేనని చెప్పి, ఆయన చెప్పిన దోమతెర దగ్గరకివెళ్ళానో లేదో అందులో నుంచి ఖళ్ ఖళ్ అని దగ్గు, దాంతో పాటేఎవరూ..?” అనే ప్రశ్న వినిపించాయి.
నా పేరు బలరాం అండీ... నా కారు...” చెప్తున్నవాడినల్లా ఎదురుగా చూసి ఆగిపోయాను. ఆచారిగారు దోమతెర తొలగించి, పక్కనే బల్ల మీద గ్లాసునీళ్ళలో పెట్టుకున్న కట్టుడుపళ్ళు తీసి అమర్చుకోని – “.. నీకారు? ఏమైంది?” అడిగాడు.ఈయనకీ దాదాపు డెబ్భై ఏళ్ళు వుంటాయి.
ఏం లేదండీ... కారు బురదలో ఇరుక్కుపోయింది. తొయ్యడానికి మనుషులు కావాలి... అది అడుగుదామనీ..” అంటూ నసుగుతుంటే ఆయనే అందుకోనీ
ఏదీ ఆ హైవే దగ్గర మా మైలురాయి దగ్గరేనా... నాలుగు చుక్కల వర్షం పడిందంటే ఇదే వరస... పద నేను వస్తాను..” అంటూ చేతికర్ర అందుకున్నాడు.
అయ్యో.. మీరెందుకు ఇబ్బందిపడతారు...? వేరే ఎవరైనా దొరకరా..?” అన్నాను మొహమాటంగా.
అంటే ఏమిటయ్యా? నాకేదో వయసైపోయింది... నీ కారు తొయ్యలేననా నీ వెటకారం...” అన్నాడు కాస్త కటువుగా.
అలా అనుకోవద్దండీ... తెల్లవారితే నా నిశ్చితార్థం... అందుకని ఒక్కసారే నలుగుర్ని తీసుకెళ్తే మళ్ళీ రాకుండా తప్పుతుందని అన్నాను..” అంటూ సర్దిచెప్పబోయాను.
ఆయన దగ్గరగా వచ్చి నవ్వుతూ తల నెమిరి– “నిశ్చితార్థమా... సరే అయితే నీకు తప్పకుండా సహాయం చెయ్యాల్సిందే.. పద పర్వతరావుని లేపుదాం..” అంటూ దారి తీశాడు. నేను ఆయన వెనుకే విశాలమైన వూరివీధుల్లో తిరిగితిరిగి చివరికి వూరికి మధ్యలో వున్న ఆ పర్వతరావు ఇంటికి చేరాం. తలుపు తీసిన పర్వతరావుని చూసి ఆశ్చర్యపోయాను. పేరుకు ఏ మాత్రం సంబంధం లేకుండా సన్నగా పీలగా వున్నాడతను. ఆయన వయసు కూడా అరవై పైనే వుంటాయి.
నాతో వచ్చిన ఆచారి పర్వతరావు మాట్లాడుకోని ఇద్దరూ బలపరీక్షకు సిద్ధమే అన్నట్లు బయలుదేరారు.
అయ్యా... ఒక్కమాటఅన్నాను నేను. ఇద్దరూ ఏమిటన్నట్లు చూశారు. “మీరు సహాయం చెయ్యాలనే ప్రయత్నిస్తున్నారు... కానీ మీ కన్న కుర్రాళ్ళు వేరే ఎవరూ లేరా?” అన్నాను.
ఓహో కుర్రాళ్ళు కావాలా... అయితే ఓబులేసు అని ఒకడున్నాడులే... ఈ వూర్లో ఏదైనా కాయకష్టం చెయ్యాలంటేవాడే... రానాతోటి..” అని పర్వతాలరావు బయల్దేరాడు. ఆ వెనకే నేనూ, ఆచారి.
ఓబులేసు ఇల్లు వూరికి ఆ చివర వుంది. అయినా ఓపిగ్గా వెళ్ళిన నాకు, మళ్ళీ నిరాశే ఎదురైంది. కాస్త వయసు తక్కువగా కనిపిస్తున్నాడు కానీ అతనికీ దగ్గర దగ్గర అరవై వుంటాయి. విషయం తెలుసుకోని, నా ముఖంలో నిరాశ చూసి మరో ఇంటికి తీసుకెళ్తామని మళ్ళీ బయల్దేరదీశారు అందరూ.
ఇక అక్కడి నుంచి మొదలైంది వేట. వీళ్ళు తీసుకెళ్ళిన ప్రతిఇంటిలో అరవైకి తక్కువ వయసు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నేను అడిగే కొద్దిఇంత కన్నాకుర్రాడిని చూపిస్తామని చెప్పడం -  మళ్ళీ ఒక సీనియర్ సిటిజన్ని చూపించడం.. ఇలా సాగిందా ప్రహసనం. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా హర్రర్ కథలో పాత్రని అయిపోయానా అన్న అనుమానం కూడా వచ్చింది. చీకట్లు తొలగి తెల్లవారవచ్చింది.
ఏమండి.. మీరు నాతో ఎందుకు పరాచకాలు ఆడుతున్నారో అర్థంకావటంలేదు... కుర్రాళ్ళని చూపించండి అంటే ఇలా ముసలి ముతక చూపిస్తూ రెండు గంటలు గడిపేశారు... నేను త్వరగా వెళ్ళాలి.. తెల్లవారితే నా నిశ్చితార్థం...” అంటూ నా గోడు చెప్పుకున్నాను.
సరే అబ్బాయి... అంతగా అడుగుతున్నావు కాబట్టి, చివరి ఇల్లు ఇదే... ప్రతాప్ అని మిలటరీ మనిషి... మంచి ఎక్సర్సైజ్ బాడీ... నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు..” చెప్పాడు ఆచారి.
ఆ తలుపూ తెరిచారు. ఆయనకి యాభైఐదు వుంటాయి.
ఏమిటండీ ఇది...” అన్నాను నేను.
ఆచారి కొంచెం కోపంగా అరిచాడు. “ఏమిటయ్యా నీ గోల..  రెండు గంటల నుంచి వూరంతా తిప్పాను... ఎవరిని చూపించినా కాదంటావు... నీకు మేం సహాయం చేస్తున్నామా లేకపోతే కూలిపనికి వస్తున్నామనుకున్నావా?” అన్నాడు.
అది కాదండీ... కుర్రాళ్ళని చూపించమని కదా అడిగాను...”
అవునయ్యా... ఇప్పుడు నువ్వు చూసినవాళ్ళే ఈ వూర్లో కుర్రాళ్ళు... అందరి కన్నా చిన్నవాడు ఇదిగో ఈ మిలట్రీ ప్రతాపే... ఇంక ఇంతకన్నా కుర్రాళ్ళు కావాలంటే ఈ వూర్లో దొరకరు..” అన్నాడు పర్వతరావు.
మీ ఇళ్ళలలో కానీ, మిగత ఇళ్ళలలో కానీ ఇంత కన్నా చిన్న వాళ్ళేలేరా?ఆశ్చర్యంగా, అనుమానంగా అడిగాను.
మీకు కనపడే ఇళ్ళలో సగం పైనే ఖాళీ ఇళ్ళు బాబూ... ఇంక మా ఇళ్ళలో అంటావా... మా కన్నా ముసలీ ముతకా, మా ఇంటోళ్ళు...చెప్పాడు ఓబులేసు.
అదేమిటండీ... మరి మీ పిల్లలూ, మనవలు..”
ఎక్కడున్నారయ్యా... నా కొడుకులలో ఒకడు అమెరికా, ఒకడు లండన్... అదిగో వాడి పిల్లలు ఒకడు ఢిల్లీ, ఇంకొకడు దుబాయ్... ఇదిగో ఈ ఓబులేసు కొడుకులు పట్నంలో కూలి చేసుకుంటున్నారు, ప్రతాప్ కొడుకు కాన్పూర్ లో హాస్టల్లో వుండి ఇంజనీరింగ్ చదువుతున్నాడు... వాళ్ళకి ఈవూరికి వచ్చే తీరికాలేదు, మా బాగోగులు పట్టించుకునేంత ప్రేమలూలేవు... మేము మాత్రం ఈ వూరి మీద, మా ఇళ్ళ మీద మమకారం చావక ఇక్కడే వుంటున్నాం..”

***

నిశ్చితార్థం తర్వాత దండలు మార్చుకోని ఫోటలకి ఫోజులిస్తున్నాం.
ఏమిటి అంత లేటుగా వచ్చారుచిన్నగా అడిగింది కాబోయే శ్రీమతి.
చెప్తాలేకానీ...ఒక విషయం అడుగుతాను చెప్పు నేను మొదలుపెట్టాలనుకుంటున్న కంపెనీ ఒక పల్లెటూర్లో పెడదామనుకుంటున్నాను. పల్లెటూరంటే నీకు ఇష్టమేనా..” అడిగాను చిన్నగా.
చాలాఇష్టం... అలాగేచెయ్యండి..” అందామె.
ఇద్దరం నవ్వుతూ ఫోటోలకి ఫోజులిచ్చాం.

***

(సన్ ప్లవర్ వారపత్రిక 18.04.2012)
Category:

2 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

30 క్రింద వయసు ఉన్నవాళ్ళెవరూ ఈ మధ్య పల్లెటూళ్ళలో ఉండటం లేదన్నది వాస్తవమే! దీని వల్ల రాబొయే సమస్యలేమిటో చర్చించి ఉంటే ఇంకా బాగుండేదేమోనండి!పల్లెటూర్లో కంపెనీ పెట్టడం ఎందుకో అర్థం కాలేదు.

Unknown చెప్పారు...

@ అజ్ఞాత: నిశ్చితార్థం చేసుకుంటున్న మన హీరోగారి వయసు 30కి తక్కువే కదా... 30 వయసు వారు పల్లెటూర్లో ఉండేందుకు అది మొదటి అడుగు అని కవి భావం... :)