నాన్న నవ్విన వైనం (కథ)


"అన్నయ్యా.. నీతో ఒక విషయం మాట్లాడాలి.." అన్నాడు రాఘవ. వుద్యోగ రీత్యా ఇద్దరు అన్నదమ్ములు మద్రాసులోను, ముంబైలోను స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగకని ఇద్దరూ సొంతవూరు వచ్చారు. సాయంత్రం తల్లిదండ్రులకు తెలియకుండా మంతనాలు చెయ్యడానికి, పిల్లల నెపంతో దగ్గర్లోని పార్కులో చేరారు.

రమేష్ చెప్పమన్నట్టు చూశాడు.

రాఘవ గట్టిగా నిట్టూరుస్తూ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని, భార్యని చూశాడు.

"
నాన్న మధ్య హింట్లు ఇస్తున్నాడు గమనించావా?" అన్నాడు వుపోధ్ఘాతం లేకుండా.

"
నీకు అనిపించిందా?" రమేష్ అన్నాడు ముందుకి వంగి.

"
ఇందులో అనిపించేదేముంది అన్నయ్యా? అంత స్పష్టంగా చెప్తుంటే.." అన్నాడు లాన్ గడ్డి పీకుతూ.

"
నీతో ఏమన్నాడేం?"

"
అదే మన స్కూల్ మాస్టర్ వరదరాజులుగారు లేరు.. ఆయన సంగతి చెప్పాడు.. కొడుకులు ముగ్గురూ చూడటం లేదట. కోడళ్ళకి ఆయనంటేనే పడదు.. ఒక్కడే వుంటూ చెయ్యి కాల్చుకుంటున్నాడట.."

"
అయితే"

"
అంతవరకు చెప్పి వూరుకుంటే పర్వాలేదు.. కొడుకులు ఎంత బాధ్యత లేకుండా పోతున్నారో.. కోడళ్ళు ఎందుకు మామగారిని, అత్తగారినీ గౌరవించాలో పెద్ద పెద్ద వుపన్యాసాలు ఇస్తున్నాడు.."

"
అదేరా నాకు అనుమానం.. అలా చెప్పి మన చేత అయ్యోపాపం అనిపించేస్తే మన దగ్గర
చేరచ్చని ఆయన ప్లాను అనుకుంటా.."

"
నీకూ ఇలాంటిదేమైనా చెప్పాడా"

"
చెప్పాడు.. రామసుబ్బమ్మగారు లేరు.. అదే రేగొడియాలు పెట్టేవాళ్ళు.. మన పక్క
వీధి.."

"
అవునవును.. ఏంటట ఆమె సంగతి?"

"
ఏముంది.. ఒక్కతే వుంటోంది కదా.. మొన్న ఎవరో నమ్మకంగా ఇంట్లో పని మనిషిలా చేరి.. ఇంట్లో ఆనుపానులు కనిపెట్టి.. ఒకరాత్రి పూట అంతా దోచుకెళ్ళాడట.."

"
అయ్యోపాపం"

"
నేను అదే అన్నాను అయ్యోపాపం అని.. అంతే నాన్న మొదలు పెట్టాడు.. అసలు ముసలివాళ్ళకు రక్షణ లేకుండా పోయింది.. దేశంలో అధిక శాతం దొంగతనాలు వొంటరిగా వుండే ముసలివాళ్ళ ఇళ్ళలోనే జరుగుతున్నాయట.. ఇంకా ఏదో చెప్పుకొచ్చాడు.."

"
అసలు ముసలివాళ్ళ రక్షణ బాధ్యత పిల్లలదే అని చెప్పాడా"

"
అలాగే కాదు కాని అలాంటిదేదో అన్నాడు"

"
అయితే అనుమానం లేదు.. నాన్న వూరు వదిలేసి మనతో వచ్చే ప్లాన్లో వున్నాడు."

ఇంతలో ఆటలు ముగించుకోని పిల్లలు తిరిగొచ్చారు. వాళ్ళాతో పాటే సరళ, లత కూడా.

"
ఏంటండీ.. బావగారు మీరు ఏదో మంచి డిష్కషన్లో వున్నట్టున్నారు..?" అడిగింది లత.

"
నీకు చెప్పానుగా లతా.. నాన్నగారి సంగతి.. అన్నయ్యతో కూడా అలాగే మాట్లాడుతున్నాడట..!" చెప్పాడు రాఘవ.

"
అవును కదూ.. తెలుసా అక్కా నేను వెంటనే కనిపెట్టాను.. రాఘవే "అదేం లేదు.. అదేం లేదు" అంటూ వచ్చాడు.." చెప్పింది లత ముందుకు జరుగుతూ. విషయం అర్థమవగానే సరళ కూడా ముందుకు జరిగి, నుదురు మీద పడుతున్న జుట్టును విసురుగా వెనక్కి తోసి -

"
అవునవును.. ఈయనకూడా అంతే - "మా నాన్న వూరు వదిలి రాలేడు" అంటూనే వున్నారు. ఇప్పుడు చూడండి మనల్ని ఇరుకున పెట్టి వప్పించే ప్లాన్ వేస్తున్నాడు మీ నాన్న.." అన్నది చివరి పదాలు నొక్కి పలుకుతూ.

"
సరే లేవే.. ఇప్పుడేం చేయ్యాలో అది ఆలోచించు.." అన్నాడు రమేష్.

"
చెప్పేదేముంది.. నేను ముందే చెప్పేస్తున్నాను.. ఆయన మీ అమ్మగారు వస్తే నా వల్లకాదు.. అక్కడికి నాకేదో వాళ్ళంటే ఇష్టం లేదని కాదు.. మనకంటూ ఒక లైఫ్స్టైల్ ఏర్పడిపోయింది.. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకోసం అది మార్చుకోవడం నా వల్లకాదు.." తేల్చేసింది సరళ.

"
అవునవును.. ఏదో నాలుగు నెలలకో ఆరు నెలలకో ఇక్కడికి వచ్చినప్పుడు చీరలు కట్టుకోమంటే సరే గాని.. వాళ్ళు గాని అక్కడికి వస్తే రోజు చీరలు కట్టాలి.. అంతేనా.. నో పబ్స్, నో పార్టీస్.. నా వల్ల కాదు.." లత వెగటుగా ముఖం పెట్టి అంది.

"
దట్స్ ఓకే డార్లింగ్.. ఇబ్బంది నీ ఒక్కదానిదే కాదు.. అందరిదీ.. ఏమంటావ్ అన్నయ్యా?"

"
అనేదేముందిరా.. మన వల్ల కాదు.. కాని విషయం నాన్నకి ఎలా చెప్పేది..?" అన్నాడు రమేష్.

"
సంగతి నాకు వదిలెయ్" అన్నాడు రాఘవ.


***


మర్నాడు వుదయం రాఘవ పేపర్ చదువుతూ వుండగా అతని తండ్రి గోపాలరావుగారు వాకింగ్ నుంచి వచ్చి వుస్సూరంటూ కూర్చున్నాడు.

"
ఏంటి నాన్నా.. అదోలా వున్నారు" అడిగాడు.

"
ఇప్పుడే ఒక దుర్వార్త విన్నాన్రా.."

"
దుర్వార్త.. ఏమిటది" అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రమేష్.

"
నాగేశ్వర్రావని నాతో కలిసి వాకింగ్కి వస్తాడు.. పాపం పొద్దున్నే పోయాడట్రా.." చెప్పాడు. పని చేసుకుంటున్న ఆడవాళ్ళు ముగ్గురూ ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పనిలో పడిపోయారు.

"
మంచివాడు.. రోజు వాకింగ్ తరువాత నాతో కలిసి టీ తాగేవాడు.."

"
పెద్దాయనా?"

"
ఏం పెద్దలేరా.. నా కన్నా చిన్నవాడే.. సిగిరెట్లు తాగేవాడు.. అదే కొంపముంచింది.. హార్ట్ఎటాక్..!!"

"
పాపం.." రమేష్ అన్నాడు.

"
ఆయన పోయినందుకు నేను బాధపడటం లేదురా... ఎందుకంటే ఆయనదీ అదే కథ.. పిల్లలు పట్టించుకోని తండ్రి. కొడుకులు వూర్లో వుండి ఆయన్ని అద్దింట్లో పెట్టారు.. రాత్రి కొడుకు ఇంటికి వెళ్ళి తిరిగొచ్చాడట.. ఇంటి గుమ్మదాటి రెండడుగులు వేసి అక్కడే పడిపోయి వున్నాడు.. లోపల ఆయన భార్య వుందికాని ఆరోగ్యం బాగాలేదని పడుకుని వుంది.. ఒక రాత్రప్పుడు పొరుగు వాళ్ళు చెప్తే కాని ఆమెకి తెలియలేదు... పాపం వాడు ఎప్పుడు పడిపోయాడో.. ఎంత సేపు అలా ఇంటి వాకిట్లో పడి వున్నాడో.." ఆయన చెప్తూ గట్టిగా నిట్టూర్చాడు.

ఇల్లంతా నిశబ్దంగా వుండిపోయింది. రాఘవ, రమేష్ ఒకరి వంక మరొకరు చూసుకున్నారు. మళ్ళీ ఆయనే అందుకున్నాడు -

"
పిల్లలుండీ అదేం ఖర్మంరా.. కనీసం చనిపోయేటప్పుడు పక్కన మనిషి లేకుండా.. దిక్కులేని చావు అంటారే.. అలాగైపొయింది..!! పిల్లలు కలిసి వుంటే కనీసం ఖర్మమన్నా తప్పేదేమో.." ఆయన చెప్పబోయాడు. రమేష్ వెంటనే రాఘవ వంక చూసి సైగ చేసాడు.

"
నాన్న.. మీరు చెప్పాలనుకుంటున్నది ఏమిటో మాకు తెలుసు.. మీరు, అమ్మ మా దగ్గరికి వచ్చి వుండాలనుకుంటున్నారు.. అంతేనా.." అన్నాడు రాఘవ ఖరాఖండిగా.

దురుసుతనానికి మిగిలిన వారందరు అవాక్కయ్యారు..

"
ఏమిట్రా.. నేనేదో చెప్తుంటే నువ్వు ఇంకేదో అంటావు..?" అన్నారు గోపాలరావుగారు.

రమేష్ అందుకున్నాడు -

"
మాకు తెలుసు నాన్నా.. మేమేమి అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు.. మీరు వూర్లో పిల్లలు వదిలేసిన తల్లి తండ్రుల కథలన్నీ సేకరించి మరీ మాకు ఎందుకు చెప్తున్నారో తెలుసుకోలేమనుకుంటున్నారా?"

"
ఏం తెలుసుకున్నారు.."

"
అదే.. ఫలానా వాళ్ళు తల్లిదండ్రుల్ని చూసుకోని చెడ్డవాళ్ళు అని పదే పదే చెప్పి.. మిమ్మల్ని మేము తీసుకెళ్ళకపోతే మేము చెడ్డవాళ్ళమే అని చెప్తున్నారు అంతేగా.. మీరెన్నైనా చెప్పండి.. మీకు ఇది వరకే చెప్పాం.. మీరు మేము ఒక చోట వుండటం సాధ్యపడదు.. రోజు అత్తా కోడళ్ళ గొడవలు, మీ చాదస్తం.. ఇవ్వన్నీ భరించడం చాలా కష్టం.. అందుకే మేము నిర్ణయించుకున్నాం.. మీరు ఇక్కడే వుండండి.." అన్నాడు రమేష్.

గోపాలరావు మాటలు విని భార్య వైపు చూశాడు. తరువాత నవ్వాడు.. తెరలు తెరలుగా నవ్వాడు. చిన్నగా దగ్గు వచ్చింది.. మళ్ళీ నవ్వాడు..!! కొంచెం తేరుకోని - "నేను నాగేశ్వర్రావు ఇంటికి వెళ్తున్నా.. నీళ్ళు పెట్టి వుంచు" అని భార్యకి చెప్పి బయలుదేరాడు.

"
నాన్నా.. ఏంటది.. మేమేదో చెప్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు.. ఎందుకంతలా నవ్వినట్టు.." అడిగాడు రాఘవ.

ఆయన ఆగి మళ్ళీ నవ్వి భార్య వైపు వేలు చూపించి "మీ అమ్మని అడగండి చెప్తుంది.." అంటూ వెళ్ళిపోయాడు.

అందరూ ఆమె వైపే చూశారు. యశోదమ్మ కూడా ముసి ముసిగా నవ్వుతోంది.

"
ఏంటమ్మా ఇది" అడిగాడు రమేష్.

"
ఏంటి ఇద్దరలా నవ్వుతారు.. కారణం లేకుండా.." రాఘవ అన్నాడు కోపంగా.

"
కారణం లేకనేం.. వుంది నాయనా.. మీరు మమల్ని తీసుకెళ్ళరని మాకు ముందే తెలుసు.. మా ఏర్పాట్లేవో మేము చేసుకున్నాం.. మీ నాన్న ఇల్లు అమ్మి ఒక ఓల్డ్ఏజ్ హోం పెడుతున్నారు.. అందుకే వూర్లో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల వివరాలన్నీ సేకరిస్తున్నారు.. వాళ్ళనందరినీ తీసుకొచ్చి ఒకచోట వుంటే ఒకరి ఒకరం తోడుగా వుంటామని ఆశ.. ఇప్పుడు నాగేశ్వర్రావుగారి గురించి చెప్తూ మీ నాన్న పక్కన ఎవరూ లేరని అన్నారేగాని.. కొడుకులు లేరని బాధపడలేదు.. ఓల్డ్ఏజ్హోం లో ఇబ్బంది కూడా వుండదు.. అంతా కలిసే వుంటాం.. పోయేటప్పుడు అందరూ పక్కనే వుంటారు.. మేము పోయినా సంస్థ అలాగే వుంటుంది.."

ఆమె చెప్పిన విషయం అర్థమవ్వటానికి రెండు నిముషాలు పట్టింది అందరికి.

"
మరి నవ్విందెందుకు?" అడిగాడు రాఘవ.

"
గుమ్మడికాయ దొంగల సామెత ఎప్పుడూ వినలేదా?" అంటూ నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది యశోదమ్మ.

(సూర్య దినపత్రిక July 2009)

Category:

2 వ్యాఖ్య(లు):

జ్యోతిర్మయి చెప్పారు...

వాస్తవం కొంచెం కఠోరంగా వుందండీ...

Unknown చెప్పారు...

కథ చాలా బాగుంది. వీలైతే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ముందుకెళ్ళి పబ్బులు, గబ్బులూ అంటూ అలవాటుపడిన ఈ కాలం యువత ముసలాళ్ళయ్యాక ఇటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించి రాయగలరా... జస్ట్ సరదాగ ఫన్నీగా.. :-)