రెండో పెగ్గు ఘాటుగా దిగిన తరువాత గమనించాను అతన్ని. నా
వైపే చూస్తున్నాడతను. ఆ బార్
మొత్తానికి దాదాపుగా మధ్యలో వున్నాను నేను. అతనేమో కుడివైపు మూలగా కూర్చున్నాడు.
కొంచెం తల ఎత్తి చూస్తే ఒకరికొకరం కనడతాము. కానీ పరిచయం లేని వ్యక్తి అలా అదే
పనిగా నా వైపే చూస్తూ వుండటం నాకు ఆశ్చర్యంగానూ, కొంత అనుమానంగానూ అనిపించింది.
పైగా అతన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం కూడా సతాయిస్తోంది.
మూడో పెగ్గు వచ్చి టేబుల్ మీద చేరిన తరువాత ఆ గ్లాసు
ఎత్తుతూ మళ్ళీ అతని వైపు చూశాను. అతని కళ్ళు నిశ్చలంగా నా పైనే నిలిచి వున్నాయి.
అతను నాకు పరిచయస్తుడే అయ్యి వుంటాడు, బహుశా నేనే మర్చిపోయి వుంటాను అని
అనుకున్నాను. అందుకే చిన్నగా నవ్వి నా చేతిలో గ్లాసు ఎత్తి పలకరించాను. అతను
తిరిగి గ్లాసు ఎత్తుతాడని వూహించాను కానీ అతనిలో ఏ మాత్రం చలనం లేదు. అతని చూపు
మరలటంలేదు. ఏదో చిన్నగా
గొణిగినట్లు అర్థం అయ్యింది.
బార్ మొత్తం గోలగోలగా వుంది. నాకు ఎడమపక్కన వున్న కుర్రళ్ళు
ఏదో జోక్ వేసుకొని గట్టిగా నవ్వుతున్నారు. నా ముందు కూర్చున్న సీటులో ఖద్దరు
చొక్కా వేసుకున్న పెద్దమనిషి లేవబోయి ఉన్నట్టుండి ఎదురుగా వున్న బల్ల మీద
పడిపోయాడు. ఖంగారుగా అక్కడికి చేరిన వెయిటర్ ని అతను తాకనివ్వకుండా – “ఏం
ఫర్లేదు... ఐ యామ్ ఆల్ రైట్... నాకేమన్న ఎక్కువైందనుకున్నావా..?” అంటూ గోల చేయటం
మొదలుపెట్టాడు. ఇంత గొడవ జరుగుతుంటే అందరి దృష్టి అతని వైపే తిరిగింది, నన్ను
చూస్తున్న ఆ ఒక్క అగంతకుడి చూపు తప్ప.
అతను ఎందుకు అదే పనిగా నన్ను చూస్తున్నాడో నాకు అర్థం
కావటంలేదు. కళ్ళు ఎగరేసి ఏమిటన్నట్లు సైగ చేశాను. అతను మళ్ళీ అస్పష్టంగా పెదాలు
కదిపాడు. అతను ఎంత చిన్నగా మాట్లాడాడంటే, మేం ఇద్దరం ఏ లైబ్రరీలో వున్నా కూడా అతని
మాటలు నాకు వినిపించేవి కాదు, అలాంటిది ఇంత గోలలో వినపడే అవకాశమే లేదు. లైబ్రరీ
అంటే గుర్తొచ్చింది, వుదయం లైబ్రరీలోనే చూశాను అతన్ని..!!
ఆ రోజు వుదయం లైబ్రరీకి వెళ్ళి నైజీరియాలోని తెగల గురించి
పుస్తకం కావాలని అడిగాను. మరో ఆరు నెలల్లో నేను నైజీరియాలో వుద్యోగం చెయ్యడానికి
వెళ్ళాలి కాబట్టి, అందులోనూ అక్కడి తెగలగురింఛి తెలుసుకోవాల్సిన అవసరం వుంది
కాబట్టి లైబ్రరీకి వచ్చాను. నా ఎదురుగా వున్న లైబ్రేరియన్ తన కంప్యూటర్ లో వెతికి,
“సెకండ్ ఫ్లోర్ రైట్ సైడ్ ఎండ్” అని చెప్పాడు.
రెండో అంతస్తులో కుడివైపు చివరికి వెళ్తుండగా కనిపించాడతను.
దాదాపు అన్ని పుస్తకాల ర్యాకులు దాటిన తరువాత వున్న గోడ దగ్గర నిలబడి వున్నాడు.
చాలా తీక్షణంగా నా వైపే చూస్తున్నాడు. మొదట పట్టించుకోలేదు కానీ, నేను పుస్తకం
వెతుకుతున్నంతసేపూ నన్నే చూస్తుండటంతో కొంచెం చిరాకుగా అనిపించింది. అతని వైపు
తిరిగి “ఏం కావాలి?” అన్నట్టు చేత్తో సైగ చేశాను. అతను ఏదో చిన్నగా గొణిగాడు. అతను
చెప్పింది అర్థం కాక రెండడుగులు అతని వైపు వేశానో లేదో, అతను ఖంగారుగా కదిలి
పక్కనే వున్న ర్యాకు దాటి వెళ్ళిపోయాడు. అప్పుడే అతని చేతి కర్రని, సగమే వున్న
కుడి కాలుని గమనించాను. ఆ తరువాత అటువైపుగా వెళ్ళాను కానీ, అతను మాత్రం కనపడలేదు.
మళ్ళీ ఇదుగో ఇక్కడ బార్ లో కనిపించాడు.
అతను నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని మాత్రం అర్థం
అయ్యింది. కానీ దాని కోసం అలా అదే పనిగా చూడటం ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడైనా
అతన్ని కలిసి ఆ విషయం ఏమిటో కనుక్కోవాలని లేచాను. సరిగ్గా అప్పుడే నా ఎదురుగా
కూర్చున్న ఖద్దరు చొక్కా పెద్దమనిషి తోసిన తోపుకి వెయిటర్ వచ్చి నా మీద పడ్డాడు.
ఇద్దరం పడబోయి తమాయించుకోని నిలబడ్డాం. అప్పటికే ఆ పెద్దమనిషి చాలా పెద్ద గొడవ
పెట్టుకున్నట్లున్నాడు. ఒక టై కట్టుకున్న వ్యక్తి, బహుశా ఆ బార్ మేనేజర్
అనుకుంటాను వచ్చి నాకు క్షమాపణ చెప్పాడు.
నేను సర్దుకోని కుడివైపు మూల చూసేసరికే ఆ అగంతకుడు అక్కడ
లేడు. మళ్ళీ వెళ్ళిపోయాడు..!!
“అక్కడ ఇప్పటిదాకా కూర్చున్న అతను ఏమయ్యాడు..?” అడిగాను
నేను.
“ఎవరు సార్? ఎక్కడ?” అడిగాడు మేనేజర్.
“అదే ఆ మూల టేబుల్...” అంటూ చూపింఛాను.
“అక్కడ ఎవ్వరూ లేరు సార్..” అన్నాడు వెయిటర్.
“ఇప్పుడు లేడు.. ఇప్పటి దాకా కూర్చోని వున్నాడు కదా
అతను..?” మళ్ళీ అడిగాను.
“అసలు అక్కడ ఎవరూ కూర్చోలేదు సార్... చూడండి టేబుల్ మీద
కూడా ఏమీ లేవు...” అన్నాడు మేనేజర్.
“మరో తాగుబోతు గొడవ మొదలు పెట్టాడురా”
అన్నట్టు వుంది అతని ముఖం.
అతను చెప్పింది కూడా నిజమే. ఆ టేబుల్ ఖాళీగానే వుంది. ఇందాక
గమనించలేదు కానీ, ఇప్పుడు గుర్తొస్తోంది... అతను అక్కడ కూర్చొని నన్ను చూడటమే
తప్పించి ఏమీ తాగను కూడా లేదు. అంటే కేవలం నన్ను చూడటానికే వచ్చి
కూర్చున్నాడన్నమాట. ఎవరా అగంతకుడు?
అప్పటికే ఖద్దరు చొక్కాని బయట వదిలి పెట్టి వచ్చారు బలిష్టంగా
వున్న బౌన్సర్ లు. ఆ అగంతకుడి విషయాన్ని మరీ ఎక్కువగా రెట్టిస్తే నన్ను కూడా అలాగే
వదిలిపెడతారేమో అని నేను చప్పుడు చెయ్యకుండా మరో పెగ్గు ఆర్డర్ ఇచ్చాను. అయిదు
పెగ్గుల తరువాతో... లేకపోతే ఆరు పెగ్గుల తరువాతో గుర్తులేదు కానీ, నాకు అర్జంటుగా
బాత్రూం కి వెళ్లాల్సివచ్చింది.
బాత్రూంలో పని కానిచ్చి టాప్ దగ్గర నిలబడి ఛేతులు
కడుక్కుంటూ తల ఎత్తి చూశాను. ఎదురుగా అద్దంలో, నా వెనుక గోడని ఆనుకోని ఎవరో కొత్త
వ్యక్తి కనిపింఛాడు. అప్పటి దాకా నన్ను చూసిన అగంతకుడు కాదితను, వేరే ఎవరో..!!
ఇతన్ని కూడా ఎక్కడో చూసినట్లే వుంది. పైగా ఇతను కూడా ఏదో గొణుగుతున్నాడు.
ఒక్కసారిగా ఆశ్చర్యం, భయం రెండూ పుట్టుకొచ్చాయి. అప్పటిదాకా తాగింది దిగిపోయింది.
ఒక్కసారి వెనక్కి తిరిగటంతో, శరీరంలో చేరిన మందు పనిచేసి తూలి కింద పడ్డాను.
కొంచెం తేరుకోని లేచి చూసేసరికి అతను లేడు..!! నేను లోపలికి, బయటికి చూసాను కానీ
అతను మాత్రం కనపడలేదు. నా భ్రమా? లేకపోతే ఎక్కువగా తాగానా? లేక నిజంగానే నన్ను ఎవరైనా
ఫాలో అవుతున్నారా? నాకు ఏమీ అర్థంకాలేదు.
ఆ ఇద్దరి చూపుల్లో ఏదో తెలియని ప్రశ్నలు కనపడ్డాయి నాకు.
ఎందుకలా చూస్తున్నారో మాత్రం తెలియటం లేదు. ఆ ఇద్దరి ముఖాలలో పోలికలు ఏవీ లేవు
కానీ, ఒక్క విషయంలో మాత్రం ఇద్దరికీ సామీప్యం వుంది. మొదటి వ్యక్తికి కాలు లేదు,
రెండో వ్యక్తికి చేతులు లేవు..!!
బయటికి వచ్చి బార్ మొత్తం కలియచూశాను. ఎక్కడా ఆ ఇద్దరి జాడ
మాత్రం లేదు. నా సీట్లో కూర్చోని మరో పెగ్గు ఆర్డర్ ఇచ్చాను. అప్పటికే ఎక్కువ తాగేసినా,
ఈ హడావిడిలో తాగిందంతా దిగిపోయిందని అనిపింఛింది. దాంతో మరో రెండు పెగ్గులు తాగి
బిల్లు కట్టి బయటపడ్డాను.
నా కారు పార్కింగ్ లో నుంచి తీసి గేటు దగ్గరికి నడిపింఛాను.
అప్పటికే నా నరనరాలలో ఇంకిపోయిన నిషా కళ్ళు మూతలు పడేలా చేస్తోంది. హఠాత్తుగా ఒక
మనిషి నా కార్ ఎదురుగా నిలబడ్డట్లు గమనించాను. సడన్ బ్రేక్.. బండి అప్పటికి వేగం
పుంజుకోలేదు కాబట్టి అతనికి దగ్గరగా వెళ్ళి ఆగింది. అతను కూడా నా వైపే చూస్తూ, తల
అడ్డంగా ఆడిస్తూ ఏదో అస్పష్టంగా గొణుగుతున్నాడు. ఇంతకు ముందు ఇద్దరు చూసినట్లుగానే
అదే రకంగా చూస్తున్నాడు, అదే విధంగా పెదాలు కదిలిస్తున్నాడు. కాకపోతే ఇతను వేరే
వ్యక్తి. ఇతని ముఖం నిండా బలమైన గాయాలు మానినట్లు గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ
చూపులోనే ఆదో వ్యక్తీకరిస్తున్నాడు. ఏదో అభ్యర్థన, ఏదో హెచ్చరిక..!! అర్థం కాని
ఏదో భావం..? ఏమిటది?? ఏమిటి??
హారన్ బలంగా కొట్టాను కానీ, అతనిలో ఏ చలనం లేదు. చేతులు
కట్టుకోని అదే పనిగా నా వైపే తీక్షణంగా చూస్తూ ఏదో, మంత్రాలు పఠిస్తున్నట్లు
గొణుగుతున్నాడు. హారన్ నాలుగుసార్లు కొట్టినా ఏ మాత్రం కదిలే వుద్దేశ్యం లేనట్టు
చూస్తూ వుండిపోయాడు.
హఠాత్తుగా నా పక్కన కిటికీలో ఒక తల ప్రత్యక్షమైంది. గుండె ఒక్క
క్షణం కొట్టుకోవడం ఆపేసి, తిరిగి వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను సెక్యూరిటీ
గార్డ్.
“ఏమైంది సార్?” అడిగాడు.
“వాణ్ణి అడ్డం లేవమని చెప్పు..” అన్నాను ఎదురుగా చూపిస్తూ.
“అక్కడ ఎవరూ లేరు సార్..” చెప్పాడతను. నేను తలతిప్పి
ఎదురుగా చూసి అదిరిపడ్డాను. అక్కడ ఎవరూ లేరు.. అటు ఇటూ చూసినా ఎవరూ కనపడలేదు.
ఏమిటీ మాయ... మూడు సార్లు ఒకే అనుభవం... కనిపించినట్లే వుంటారు.. ఇంతలోనే మాయం
అవుతారు.
“సార్.. కార్ తీయండి సార్..” అన్నాడు గార్డ్ అసహనంగా. కారుని
గేటు దాటించి రోడ్డు ఎక్కగానే, కారుతో పాటే నా ఆలోచనలు కూడా వేగం పుంజుకున్నాయి.
పొద్దున్నించి కనిపించిన మనుషులే కనిపిస్తున్నారు. అందరూ
ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో విషాదాన్ని చూస్తున్నట్లు బాధ నిండిన కళ్ళతో
చూడటం, అస్పష్టంగా వినపడని గొంతుతో ఏదో మాట్లాడటం, నేను వాళ్ళని కలిసేలోపలే
మాయమవ్వడం. అసలు ఏం జరుగుతోంది... వున్నట్టుండి నాకో విషయం స్పురించింది. నాకు
కనపడ్డవాళ్ళందరికీ ఏదో ఒక లోపం వుంది. లైబ్రరీలో, బార్ లో కనిపించిన వ్యక్తికి
కాళ్ళు లేవు, వాష్ రూంలో కనిపించిన వ్యక్తికి చేతులు లేవు, ఇప్పుడు గేటు దగ్గర
కనపడిన మనిషికి ముఖం నిండా గాట్లు, గాయాలు. ఆ మనుషులు గుర్తుకురాగానే ఏదో భయం కలుగుతోంది.
నా చుట్టూ వున్న గాలిలో ఏదో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. వళ్ళంతా చమటలు
పట్టేస్తున్నాయి. దానికి తోడు నేను తాగిన మందు మైకం కళ్ళను కప్పేస్తోంది.
నా ఆలోచనలు ఇలా నడుస్తుండగా, సరిగ్గా అప్పుడే క్షణంలో
వెయ్యోవంతు సమయంలో జరిగిందా సంఘటన. ఏం జరిగిందో అర్థం అయ్యేలోపలే నా కారు ఒక
మనిషిని కొట్టేసి ముందుకు సాగిపొయింది. మరుక్షణంలో తేరుకోని, కారు ఆపి వెనక్కి
తిరిగి చూశాను. అక్కడ కనపడ్డ దృశ్యం చూడగానే వొళ్ళు గగుర్పొడిచింది. అక్కడ..
అక్కడ..
ఒక తల లేని ఒక స్త్రీ మొండెం నా కారు వైపే చేతులు వూపుకుంటూ
వస్తోంది. ఆ అమ్మాయికి రెండడుగుల దూరంలో ఆ అమ్మాయి తల నేలపైన పడి దొర్లుతోంది.
అప్పుడు నేను అరిచిన అరుపు ఎంత గట్టిగా వచ్చిందంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల
దూరంలో వున్నవాళ్ళకి కూడా వినిపించి వుంటుంది. వెంటనే కారు స్టార్ట్ చేసి, ముందుకు
వురికించాను. ఆ అమ్మాయి మొండెం నా కారు వెనకే రావటం, కొంత దూరం తరువాత కింద
పడిపోయి, తెగిపడిన తలకోసం రోడ్డు మీద వెతకడం అద్దంలో కనిపిస్తూనే వుంది.
ఇదెలా సాధ్యం? తల తెగిపోయిన తరువాత మిగతా శరీరంలో ప్రాణం
ఎంత సేపు వుంటుంది? పైగా నేను కారుతో గుద్దితే మాత్రం, తల మాత్రమే తెగిపడే అవకాశమే
లేదే? ఇప్పటిదాకా నాకు కనిపించిన వ్యక్తులు నాతో చెప్పబోయింది ఇదేనా? ఇలా ఒక మనిషి
మరణానికి నేను కారణం అవుతానని వాళ్ళకి ముందే తెలుసా? ఒక్క సారి లక్ష ప్రశ్నలు
మెదడులో తిరగడం మొదలైంది. మత్తు తలలో నించి కళ్ళమీదకి జారడం మొదలైంది. సరిగ్గా
అప్పుడే ఒక్క క్షణం పాటు నా కళ్ళు మూతలు పడటం, నా కారు అదుపు తప్పి రోడ్డు
మీదనుంచి పక్కగా వున్న చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయిది. నేను తేరుకోని కారుని ఆపే
లోగా బలంగా ఒక చెట్టుకి గుద్దుకోని ఆగిపోయింది. నాకు స్పృహ తప్పింది.
***
నాకు స్పృహ వచ్చేసరికి నరనరాల్లో బాధ జివ్వు మంటోంది. తలకి
తగిలిన గాయం నుంచి ధారగా రక్తం నా ముఖాన్ని తడిపేస్తోంది. ముంజేతి మీద గాజు
పెంకులు గుచ్చుకుపోయి వున్నాయి. వీటన్నింటికన్నా బాధ పెడుతోంది పొత్తి కడుపు
దగ్గర. ఒక ఇనుప ముక్క లోపలికి దిగిపోయి వుందక్కడ. అది ఎమిటో, గాయం ఎంత తీవ్రంగా
వుందో తెలుసుకునే అవకాశమే లేదు. అసలు కదులేందుకే వీలు లేదు. భారంగా కళ్ళు
తెరిచాను.
ఎదురుగా అతను..!! ... నాకు బార్ లో కనిపించినతను. అతనే... ఇంకా
అలాగే చూస్తున్నాడు...!!
నాకు ఆశ్చర్యం, భయం కన్నా సంతోషం కలిగింది. అలాంటి ఆపదలో
ఆదుకోడానికి ఒక మనిషి వున్నాడని.
“హెల్ప్ మీ” అతి కష్టం పలికాను. అతనిలో ఏ మాత్రం చలనం లేదు.
అలాగే చూస్తూ వున్నాడు.
“ఏమిటలా చూస్తున్నారు... ప్లీజ్ హెల్ప్ మీ...” మళ్ళీ
అడిగాను. ఈ సారి కూడా అతను కదలలేదు సరికదా ఒక చిన్న చిరునవ్వు నవ్వి చుట్టూ
చూశాడు. అప్పుడు అర్థం అయ్యింది నాకు. అక్కడ నేను, అతనే కాదు ఇంకా ఎవరో వున్నారని.
నొప్పిగా వున్నా కష్టపడి చుట్టూ చూశాను.
షాక్..!!
అందరూ వున్నారు. బార్ టాయిలెట్ అద్దంలో కనిపించినతను, బయట
కనిపించిన వ్యక్తి, ఇందాక రోడ్డు మీద నా కారు గుద్దుకోని తల తె..గి...పడిన...
కానీ, తల వుంది. అతుక్కోనే వుంది...!! ఇదెలా సాధ్యం..?? నా గుండెల్లో భయం ముల్లులా
గుచ్చుతోంది. వెన్నులో నుంచి ఒక లాంటి వణుకు మొదలైంది.
“ఎవరు... ఎవరు మీరంతా..” అడిగాను. నేను బార్ లో మొదట చూసిన
వ్యక్తి కుంటుకుంటూ దగ్గరకు వచ్చాడు.
“మేమెవరమో తెలుసుకోవాలని వుందా? చెప్తే భయపడవు కదా?” అడిగాడు.
ఇంతలో నాకు బార్ లో తారసపడ్డ వ్యక్తి మందుకొచ్చాడు.
“అయినా ఇందులో భయపడటానికి ఏముంది...? మేమంతా చనిపోయి
కొంతకాలం అయ్యింది ”
“అంతే కాదు... ఇప్పుడు నీ వంతు వచ్చింది” నవ్వింది తలతెగిన
అమ్మాయి.
“ఏమిటిది... ఇదేమైనా ప్రాక్టికల్ జోకా? ఏదైనా టీవీ
ప్రోగ్రామా? ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో వుంటే మీరు జోక్స్ వేసుకుంటారా?”
అడిగాను కోపంగా. వాళ్ళందరూ ఇంకా గట్టిగా నవ్వారు.
చేతులు లేని వ్యక్తి నాకు కొంచెం దగ్గరగా వచ్చి పక్కనే ఒక
బండ రాయి మీద కూర్చోని చెప్పాడు –
“చూడు బ్రదర్... మేము టీవీ ఛానల్ కాదు... ఇది జోక్ అంత
కన్నా కాదు. మేమంతా చనిపోయిన మాట కూడా నిజమే. అంతే కాదు.. మేమంతా రోడ్
ఏక్సిడెంట్లలోనే చనిపోయాం. ఇంకా చెప్పాలంటే, తాగి డ్రైవ్ చెయ్యటం వల్ల కానీ, లేక
తాగి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ చేసిన ఏక్సిడెంట్ వల్లగానీ చనిపోయిన వాళ్ళం..”
మరో వైపు కాలు లేను వ్యక్తి వచ్చి పక్కగా కూర్చున్నాడు.
“ఇదుగో... నీ లాగే తాగేసి రోడ్డు మీదకు వచ్చేవాళ్ళను
చావకుండా ఆపుదామని ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఏం లాభం మేం చెప్పేది వాళ్ళకి అర్థం
కాదు. ఇదుగో నీ లాగే... తాగి బండో కారు నడుపుతారు... చివరికి వచ్చి మాలో
కలుస్తారు...”
నాకు పిచ్చిపట్టినట్లు అయ్యింది.
“ఏం మాట్లాడుతున్నారు... ఇదంతా చెప్పే బదులు నన్ను
కాపాడచ్చు కదా...”
“నీకేమైనా పిచ్చా... నువ్వు ఈ రోజు తాగి కార్ నడిపి
చావబోతున్నావని మాకు ముందే తెలుసు... ఆపుదామని ప్రయత్నించాం... ఇప్పుడు ఏం చేసినా
నిన్ను కాపాడలేం... నీ చావు ఖాయం... అందుకే మా మాటలు నీకు అర్థం అవుతున్నాయి...”
తలతెగిన అమ్మాయి చెప్పింది.
“అయితే... ఇప్పుడేం చెయ్యాలి?” అరిచాను.
“నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు... మేం చెయ్యగలిగిందీ ఏమీ
లేదు... నీ చావు పూర్తి కావడం కోసం ఎదురు చూడటం తప్ప..” చెప్పాడు ఒకడు.
నేను చూసిన నలుగురే కాకుండా ఇంకా చాలా మంది ఎక్కడెక్కడి
నుంచో వచ్చి నా చుట్టూ కూర్చుంటున్నారు. శ్రద్ధగా బుగ్గ కింద చేతులు పెట్టుకోని,
నా చావుని తదేకంగా పరిశీలిస్తున్నారు. అంతమందిలో ప్రాణం వున్న ఏకైక వ్యక్తిని
నేను... ఆ ప్రాణం పోతోందని తెలిసి బిక్కుబిక్కుమంటూ చావు కోసం ఎదురు చూస్తున్నాను.
?
(సన్ ఫ్లవర్ వార పత్రిక 09.05.2012)
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి