ఒక్కణ్ణే స్టేజి
వెనుక భాగంలో కూర్చోని వున్నాను. స్టేజ్ పైన ఏదో రెండర్థాల పాట నడుస్తోంది.
వుండుండి అమ్మాయి గొంతు వినపడగానే కుర్రకారు వేస్తున్న ఈలలు వినపడుతున్నాయి. ఆ పాట
కచేరి అయిన తరువాత నా మ్యాజిక్ షో వుంటుందని చెప్పారు నిర్వాహకులు. అన్నీ సిద్ధంగా
వున్నాయో లేదో చూసుకున్నాను. నా సరంజామా అంతా పెట్టుకున్న పెట్టె దారికి అడ్డంగా
వుందేమో అని అనుమానంతో నేను కూర్చున్న కుర్చీ కిందకి జరిపాను. దాని మీద రాసున్న
అక్షరాలను ఒకసారి తడిమి చూసుకున్నాను – “మెజీషియన్ బుచ్చిబాబు”. నాకెందుకో నాన్న
పేరు కళ్ళ ముందు మెదిలింది. గారడి మల్లయ్య.
నాన్నని
తల్చుకుంటే ఎక్కడలేని వుత్సాహం వచ్చేస్తుంది.
“రండి బాబు
రండి... మల్లయ్య చేసే ఇంద్రజాల, మహేంద్రజాలం చూడండి... గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార
విద్యలు చూడండి... ఇంద్రస్థంభన, వజ్రస్థంభన, జలస్థంభన, వాయుస్థంభన విద్యలు చూడండి...”
గొంతెత్తి అరిచే నాన్న రూపమే కనిపిస్తుంది నాకు. నాన్న చేసిన ట్రిక్కులన్నీ నాకూ
నేర్పించాడు. నేను వేరే చోట కొత్త ట్రిక్కులు కూడా నేర్చుకున్నాను. అయినా నాన్న
చేతికి వున్న హస్త లాఘవం, తీయటి మాటలతో మత్తు జల్లే విద్య నాకు సగం కూడా అబ్బలేదు.
“నాన్నా నాకు
ఏదైనా పెద్ద గారడి చేసి చూపించవా?” అడిగాను నాలుగేళ్ళ వయసులో ఒకసారి. అప్పటికే
చీకటి పడుతోందని గారడి సామానంతా సర్దుతున్నాడు నాన్న.
“ఏం
చెయ్యమంటావు... ఒక మనిషిని మాయం చెయ్యమంటావా? నీకు మీసాలు తెప్పింఛమంటావా?”
అడిగాడు నాన్న కర్ర తిప్పుతూ. గారడి చెయ్యమంటే ఎంత వుత్సాహమో నాన్నకు.
“ఊహు... అలాంటిది
కాదు. అవన్నీ నువ్వు మంత్రం వేస్తే వుంటాయి, మంత్రం పోతే అవీ పోతాయి... అట్టాంటివి
కాదు... ఎప్పటికీ వుండిపోయే గారడి చేస్తావా?” అడిగాను అమాయకంగా.
నాన్న అరనిముషం
ఆలోచించి “సరే చూసుకో...“ అంటూ ఏదో మంత్రాలు చదివాడు. ఆకాశం వైపు చూస్తూ చేతిలో ఒక
తాడు వున్నట్లు గిరగిరా తిప్పి దాన్ని ఆకాశంలోకి విసిరినట్లు నటించాడు. నా పసి
వయసుకు ఏదో అద్భుతం జరగబోతోందని నమ్మకం కలిగించాడు. ఆ తరువాత చెప్పాడు –
“బుచ్చీ... అదిగో
ఆడుండాడే చందమామ... ఆడ్ని తాడుతో కట్టేసినా... ఇంగ చూడు మనం ఏడకి బోతే ఆడకి మనతోనే
వస్తాడు... ఇంద తాడు పట్టుకో..” అంటూ చేతికి ఏదో అందించినట్లు నటించాడు. నేనూ
అందుకున్నా.
నాన్న చెప్పింది
నిజమే. నాన్న సైకిల్ కి ముందుండే రాడ్ మీద కూర్చోని వెళ్తుంటే మా వెంటే వచ్చాడు
చందమామ. గుట్టల్లో, పొలాల్లో, మట్టిరోడ్డు మీద, కాలవ గట్టుమీద... ఎక్కడికి వెళ్తే
అక్కడికి వచ్చాడు. ఆ రాత్రంతా తాడుని పట్టుకున్న పిడికిలి విడవకుండా నిద్రపోయాను
నేను.
కొంచెం
పెద్దయ్యాక నాన్నకు ఈ విషయం చెప్పి నవ్వేస్తే ఆయన కూడా దగ్గుతూ నవ్వి – “పైన పెద్ద
గారడి వాడు ఆయన విద్యని ప్రదర్శిస్తుంటే మనం చెయ్యాల్సిందల్లా ఆ మంత్రం మనకి
తెలుసన్నట్లు నటించడమే... మన చుట్టూ జరుగుతుండే గారడిని తెలుసుకోవడమే విద్యంతా...”
అంటూ పాఠం చెప్పాడు నాకు.
***
“బుచ్చిబాబూ... ఈ
పాట తరువాత నీదే రా... నువ్వు రెడీనేగా?” అడిగాడు శేషు. ఆ వూర్లో జరుగుతున్న కొత్త
సంవత్సరం సంబరానికి నన్ను పిలిచేలా వూరి పెద్దల్ని ఒప్పించినవాడు శేషు. నా
చిన్నప్పటి స్నేహితుడు.
నాన్న
ఆలోచనల్లోంచి బయటికి రావటం ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి తలాడింఛాను. స్టేజ్ మీద
ఏదో వాంప్ సాంగ్ ఊపందుకుంది. శేషు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.
“ఎక్కువ టైం
వుండదేమోరా... తోందరగా చేసి వచ్చేయ్... సిగరెట్ తాగుతావేటీ..” అడిగాడు. నేను
వద్దని చెప్పడంతో కొంచెం దూరంగా వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. టైమ్ చూసుకున్నాను.
పదకొండు నలభై. మళ్ళీ నా ఆలోచనల్లోకి జారుకున్నాను.
నాన్న గారడీ
చెయ్యడానికి ఎన్నో వూర్లు తిరిగేవాడు. ఎప్పుడో వచ్చేవాడు. నాకేమో ఎప్పుడూ
నాన్నతోనే వుండాలని. అమ్మ మాత్రం ఒప్పుకునేదికాదు. ఒకరోజు రాత్రి నా కోరిక విని
నాన్న నన్ను తీసుకెళ్తానని పట్టుపట్టాడు. అమ్మ ఏం మత్రం వేసిందో కానీ మర్నాడు
వూరెళ్తూ – “బాగా సదువుకోరా అయ్య...
నాబోటి బతుకు కాకూడదు నీది..” అంటూ వెళ్ళాడు. ఇదంతా అమ్మ చేసిన మాయ. అసలు నాన్న
తెచ్చే నాలుగు డబ్బులతో అమ్మ ఎట్లా ఇల్లు నడిపేదో, నాకు చదువులు ఎట్లా చెప్పించేదో
నాకు ఇప్పటికీ అర్థం కాదు. అప్పట్లో తెలిసేది కాదు కానీ ఇప్పుడు తల్చుకుంటే
అనిపిస్తుంది - నాన్న చేసే గారడిలకన్నా ఇదే పెద్ద గారడి అని. అన్ని కష్టాలు వున్నా
అమ్మ నవ్వుతూనే వుండేదే అది అన్నింటికన్నా అంతు చిక్కని మహేంద్రజాలం.
సిగరెట్ పూర్తి
చేసి శేషు కార్యక్రమం నిర్వహిస్తున్న ఏంకర్ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడాడు. మళ్ళీ
నా దగ్గరకు వచ్చి –
“ఆ పిల్ల
పాడతాంటే జనాలు ఎంజాయ్ చేత్తన్నారంట... ఇంకో పాట పాడిస్తన్నారు. ఆ తరువాత నీదే..”
చెప్పాడు.
అప్పటికే
చిన్నపిల్లలంతే ఎక్కడపడితే అక్కడ నిద్దర్లు పోతున్నారు. మ్యాజిక్ షో అంటే ముందు
వరసలో వుండేది పిల్లలే కదా. వాళ్ళు నిద్ర పోతుంటే ఇంకేం మ్యాజిక్ చెయ్యాలి?
అడగకూడదనుకుంటూనే అడిగేశాను వాణ్ణి.
“పోన్లేరా...
హ్యాపీ న్యూయియర్ అంటే అంతే మరి... అద్దరేత్రి అయుతేనే కదా... అప్పటిదాకా ఏదో పోగ్రామ్
చేస్తానే వుండాలి కదా..” చెప్పాడు వాడు.
హ్యాపీ న్యూ
ఇయర్..!!
మా లెక్కల
మాష్టారు సంజీవయ్యగారు గుర్తుకొచ్చారు. ఒక సంవత్సరం జనవరి ఒకటిన ఆయన క్లాసులోకి
రాగానే ఇలాగే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పలకరించాను. ఆయన కొంచెం తీక్షణంగా చూసి బోర్డు
వైపు తిరిగి – “365” అంటూ రాసాడు.
“ఏమిటిది?”
అడిగాడు.
“ఒక సంవత్సరంలో
వుండే రోజులు..” క్లాసులో చాలామంది బదులిచ్చారు.
“అదే... అన్నే
రోజులు ఎందుకున్నాయని?”
“భూమి సూర్యుడి
చుట్టూ తిరగడానికి పట్టే సమయం – మూడొందల అరవైదు రోజులు” చెప్పాను.
“మరి లీపు
సంవత్సరంలో 366 రోజులు
వుంటాయేం?” కళ్ళెగరేస్తూ మళ్ళీ అడిగాడాయన. ఈసారి సమాధానం చెప్పడానికి నాకు కొంచెం
సమయం పట్టింది.
“ఎందుకంటే భూమి
సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 కన్నా ఒక పావు
రోజు ఎక్కువ పడుతుంది... అలాంటి పావు రోజుల్ని మొత్తం కలిపి నాలుగేళ్ళకి ఒకసారి
ఫిబ్రవరిలో చేరుస్తాము.. అందుకే ఒక రోజు ఎక్కువ వుంటుంది..” చెప్పాను ఖగోళపాఠాన్ని
లెక్కల మాస్టారికి వివరిస్తూ. ఆయన ప్రసన్నంగా నవ్వి-
“అంటే మనం
అర్థరాత్రి దాకా మేలుకోని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటామే అదంతా బూటకం...
నిజంగా భూమి మొదలు పెట్టిన చోటికి మళ్ళీ తిరిగి రావటానికి 365 రోజులు కాక మరో పావురోజు పడుతుంది కాబట్టి
వచ్చే సంవత్సరం అర్థరాత్రి కాకుండా మర్నాడు పొద్దున ఆరు గంటలకీ, ఆ తరువాత సంవత్సరం
మధ్యాన్నం పన్నెండు గంటలకీ, ఆ తరువాత సంవత్సరం సాయంత్రం ఆరు గంటలకీ హ్యాపీ న్యూ
ఇయర్ చెప్పుకోవాలి..” చెప్పాడు సంజీవయ్య మాష్టారు.
మా ముఖాల్లో
ఆశ్చర్యం చూసి మరి కొంచెం నవ్వుకుంటూ – “అంతే కాదురా... నువ్వు చెప్పినట్లు
నాలుగోవంతు రోజు కూడా కరెక్టుగా నాలుగోవంతు కాదు. కొన్ని గంటలు అటూ ఇటూ... ఇంకా
ఖచ్చితంగా చెప్పాలంటే నాలుగు వందల సంవత్సరాలకి ఒకసారి కానీ కరెక్టుగా డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటలకి భూమి మొదలు పెట్టిన
ప్రదేశంలో వుండదు. అంటే అర్థరాత్రి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మనల్ని మనమే
పిచ్చోళ్ళని చేసుకొవడం...” వివరించాడాయన.
ఆయన చెప్పిన
విషయం నాకు సగం అర్థం అయ్యి సగం అర్థం కాక వుండిపోయాను. ఆ విషయం గురించి చాలా
సార్లు ఆలోచించాను. ఆ లెక్కలేవో నాకు అర్థం కాలేదు కానీ మరీ కొత్త కోణం అర్థం
అయ్యింది. భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సమయాన్ని ఏ మూడొందల రోజులకో, నాలుగొందల
రోజులకో సర్దేసి వుండచ్చుగా దేవుడు? ఈ అరవై అయిదు రోజులా కొసర్లు ఎందుకు? ఇదిగో
ఇది కూడా దేవుడు చేసే ఒక గారడీ. మనల్ని మోసం చేసే గారడీ. మోసం చెయ్యడమే కదా గారడీ
అంటే.
***
“తరువాత
కార్యక్రమం... మెజీషియన్ బుచ్చిబాబుచే మ్యాజిక్ షో...” స్టేజి పైన ప్రకటన
వినపడటంతో ఈ లోకలోకి వచ్చాను. హడావిడిగా పెట్టెని స్టేజి దగ్గరగా జరుపుకోని, వంగి
వేదికకి నమస్కారం చేసుకొని ముందుకు నడిచాను.
“త్వరగా
కానివ్వాలి... టైమ్ లేదు మనకి” చెవి దగ్గర చెప్పాడు నిర్వాహకుడు. ఆయన మైక్ ఆపడం
మర్చిపోయాడు కాబట్టి ఆయన చేసిన సూచన ప్రేక్షకులదాకా పాకింది. గట్టిగా నవ్వులు
నేను మొదలు
పెట్టాను.
పేకమేడలు
లేస్తున్నాయి, కాగితం తగలబడి నోట్లకట్టలా మారుతోంది, ఏ ఆధారం లేకుండ కర్ర గాలిలో
నిలబడుతోంది.
“కానీరా బాబూ...
బోరు కొట్టిస్తున్నావు..” ఎవడో ఆకతాయి అరిచాడు.
“ఆ పిల్ల పాటే
నయం... వీణ్ణి ఎవడు పిలిచార్రా..” ఇంకెవరో నిట్టూరుస్తున్నారు.
యాంత్రికంగా నా
మ్యాజిక్ జరుగుతూనే వుంది. మనసులో నాన్న మెదిలాడు. ఆయన దగ్గర నాలా సూటు లేదు,
అందమైన మేకప్ లేదు, మైక్ లేదు, సరంజామా లేదు... అయినా జనం. తోసుకుంటూ, ఒకరి మధ్యలో
ఒకరు దూరుకుంటూ, ఒకరి భుజాల మీద నుంచి ఇంకొకళ్ళ తలలు మొలుచుకుంటూ, కొంగల్లా
మెడల్ని చాపుకుంటూ, ఆశ్చర్యంగా కళ్ళు విచ్చుకుంటూ...
“కానీ...
కానీ...” వెనకనుంచీ పిలుపు.
ఒక ఇరవై మందిదాకా
కొత్త జనం వచ్చి స్టేజి ముందుకు చేరారు. ఆ రాత్రితో తాగుడు మానేస్తామని నమ్మే
మూర్ఖులు. అదే నెపంగా నాలుగు రోజులకి సరిపడా తాగి అప్పుడే అక్కడికి చేరుకున్నారు.
“చెప్పాగా
గురూ... ఇక్కడంతా చెత్త పోగ్రాములుంటాయని... మన సిటింగే కరెష్టు...” బీడీ పొగ
వదులుతూ అన్నాడెవరో.
నా వెనక స్టేజీ
పైన ఒక బల్ల, దాని పైన కేకు వచ్చి చేరింది. దూరంగా ఎవరో టపాసులు అంటించారు.
జరిగేది అర్థం అయ్యేలోపల నా చేతిలో మైక్ లాకున్నారు. “ఇప్పుడు కేక్ కటింగ్...”
మైక్‍లో నుంచి వినపడింది. నా టోపీలో నుంచి బయటికి రావాల్సిన పావురం అక్కడే
ముడుక్కోని వుండిపోయింది.
జనంలో కోలాహలం.
అయిదు... నాలుగు... మూడు... రెండు... ఒకటి... సున్నా.... హ్యాపీ న్యూ ఇయర్....!!
ఎవరెవరో
ఎవరెవరినో కౌగిలించుకుంటున్నారు. పలకరించుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్... హ్యాపీ
న్యూ ఇయర్. ఫోన్లు, మెసేజులు, కేకులు, కేరింతలు...!! ఏదో అర్థంకాని కోలాహలం.
నేనొక్కణ్ణే స్టేజికి ఒక మూలగా, వైరాగ్యం ఆవహించిన సన్యాసిలా నిలబడి చూస్తూ
వున్నాను. సంజీవయ్య మాష్టారు చెప్పినట్లు చాలా మంది పిచ్చివాళ్ళు కనపడుతున్నారు
నాకు.
***
తెల్లవారుతోంది.
అవున్నిజమే...
కేలండర్ మారింది. రోజు ఒక పేజి చించుతాం, కాకపోతే నెలకి ఒక కాగితం మడుస్తాం. ఈ
రోజు కొత్త క్యాలండర్ అదే స్థానంలో. రెండు రోజులు పోతే దాని ముఖాన కూడా పాలపేకట్
లెక్కలు, ఇస్త్రీ బట్టల పద్దులు.
ఎవరి బతుకైనా
అంతేగా. రాత్రి తాగింది దిగాక కొత్త సీసా పగుల్తుంది. హ్యాపీ న్యూ ఇయర్
చెప్పుకున్న మధ్యాన్నానికి గత సంవత్సరం బాకీలు గుర్తుకొస్తాయి. నాలాంటి వాడికి కడుపు
నింపుకునే మహా మహా కార్యానికి మరో రోజు పుట్టుకొస్తుంది. స్కూటర్ తీసి శేషు
ఇంటినుంచి బయల్దేరాను. మధ్యాన్నానికి పక్కూరికి వెళ్ళి అక్కడ సాయంత్రం ఎవరిదో
పుట్టిన రొజు ఫక్షన్లో మ్యాజిక్ షో. మళ్ళీ అదే పెట్ట, అదే స్కూటర్, అదే
బుచ్చిబాబు, అదే పావురం.
వూరు పొలిమేర
దాకా వచ్చానో లేదో అక్కడ దృశ్యాన్ని చూసి ఆగిపోయాను. కాలవ మీదుగా ఆకాశాన్ని
ఆక్రమించేందుకు సూర్యుడు కదులుతున్నాడు. ఎర్రరంగు సిరా పోసి అలికినట్లు ఆకాశం
సూర్యుణ్ణి ఆహ్వానిస్తోంది.
దేవుడు రోజూ చేసే
మ్యాజిక్ షో. కేలండర్ మారినా, జనవరి ఒకటైనా డిసెంబరు ముప్పై ఒకటైనా, అలుపుసొలుపు
లేకుండా యుగయుగాలుగా సాగుతున్న ఇంద్రజాలం. చూడాల్సినవాళ్ళంతా రాత్రి మత్తులోనే
జోగుతున్నాసరే ఆగని మహేంద్రజాలం.
“మన చుట్టూ
జరుగుతుండే గారడిని తెలుసుకోవడమే విద్యంతా...” నాన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది.
ఇప్పుడు నాన్న
చేసినంత అద్భుతంగా నేనూ గారడి చెయ్యగలను.
***
(హంసిని వెబ్ పత్రిక అక్టోబర్ 2012)
3 వ్యాఖ్య(లు):
New year concept is very interesting.ఒక్క క్షణం కథలో నాయకుడి లాగా అందరం పిచ్చోళ్ళ లాగా అనిపించింది. అఖరుగా యుగాలుగా సాగుతున్న ఇంద్రజాలం అంటూ చెప్పిన విషయం కూడా బాగుంది.చాలా నచ్చిందండీ కథ.
ధన్యవాదాలు సుభగారు...
సత్య ప్రసాద్ గారు...కథా నాయకుడు సూర్యోదయంతో ప్రేరణ పొందడం చాలా నచ్చింది. దేముడు చేస్తున్న గారడి గురించి తెలుసుకోవడమే జీవితం అన్న సందేశం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. చక్కని కథనందించినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి