అసమర్థుని ప్రేమయాత్ర


ఆమె చనిపోయింది.
అవును అంతే…! ఆమె చనిపోయింది… ఆ చిన్న వాక్యంలోనే గూడుకట్టుకోని వుంది నా విషాదమంతా. పన్నెండేళ్ళ సావాసానికి, ప్రేమకి చరమగీతం పాడేసి వెళ్ళిపోయింది గీత. వెన్నలలో తడిసిన మా మనసుల తడి ఆరకముందే చీకటైపోయింది. నా చెవిలో గుసగుసగా చెప్పిన రహస్యాలకి అర్థం నేను తెలుసుకునేలోపే తనే ఒక రహస్యమైపోయింది.
నేను అలాగే నిలబడి చూస్తున్నాను.
ఇప్పుడు నా ఎదురుగా వున్నది ఒకప్పుడు నేను చూసిన గీత కాదు. అప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు కళ్ళ కింద ఆ నల్లటి చారలు లేవు, మందు తాగి తాగి ఉబ్బిపోయిన కళ్ళు లేవు, సిగెరెట్లతో నల్లబడ్డ పెదాలు లేవు. అప్పట్లో ఆమె ముఖంలో ఈ విషాదంలేదు… అవునులే అప్పట్లో ఆమెకి భగ్న ప్రేమాలేదు, అసమర్థుడైన నా లాంటి ప్రేమికుడూ లేడు. నేను గమనించలేదు కానీ బహుశా నాతో పరిచయమే ఈ మార్పుకి కారణం అయ్యుంటుంది.
నా కళ్ళలోకి నీళ్ళు రావటంలేదు. తడి మొత్తం మనసులోనే. ముఖంలోకి రానంటోంది. ఎవరైనా చూస్తారేమో అన్న భయం. అప్పుడప్పుడు వచ్చి పోయే స్నేహితుడిగా వున్న హోదా, ఎక్కువగా ఏడవటానికి సరిపోదు. ఆమెని కలవడానికి ఎన్నిసార్లు వచ్చినా మనసులో ముల్లులా ఇదే భయం. ఎవరైనా చూస్తారేమోనని !! ఈ సారి కూడా.
సెల్ ఫోన్ మోగింది. శారద.
“ఎక్కడున్నావు? పొద్దుననగా వెళ్ళావు… ఎక్కడికో, ఏమిటో చెప్పి చావవు… తినడానికన్నా వస్తావా లేదా?” శారద మాట్లాడితే సమాధానం చెప్పడానికి అవకాశాలు వుండవు. “వస్తాను” అన్నాను.
“వచ్చేటప్పుడు ఏదైనా కర్రీ పాకెట్ తీసుకురా… అన్నం మాత్రం వండాను… అన్నట్టు వీధి చివర టైలర్ నా జాకెట్లు ఇస్తానన్నాడు. అవి కూడా తీసుకురా”
“సరే” అన్నాను గీత శవం వైపే చూస్తూ.
“సరే అనడం కాదు… గుర్తుపెట్టుకో… మళ్ళీ మర్చిపోయాను అనకు…”
“సరే అంటున్నాగా…”
“ఎందుకు అలా నెమ్మదిగా మాట్లాడుతున్నావు”
“ఏదో పనిలో వున్నాలే… మళ్ళీ చేస్తా…” పెట్టేశాను. ఎప్పుడు శారద ఫోన్ చేసినా నవ్వేది గీత. ఇప్పుడు కూడా నవ్వుతున్నట్టే అనిపిస్తోంది.
“నీకు పెళ్ళాం ఫోన్ చేసిందంటే భయం… కదూ” అంది ఒకసారి జలజలా నవ్వేస్తూ.
“నీకు తెలుసుగా శారద సంగతి. చిన్న విషయాన్ని పెద్దది చేసేస్తుంది. అరుస్తుంది” అన్నాను సంజాయిషీగా.
“ఏ పెళ్ళానికీ మొగుడు ఇంకో అమ్మాయితో పడుకోవడం చిన్నవిషయం కాదు భద్రం… అయినా నీ భయం ఒక్క శారద విషయంలోనే అయితే ఆమెని తప్పు పట్టచ్చు… నీకు ఎప్పుడూ భయమే కదా… ఊర్లో జనం అంతా నిన్నే చూస్తారని భయం, పక్కింటివాళ్ళకి మన పడకింట్లో శబ్దాలు వినపడతాయని భయం… అలా భయపడుతూనే ప్రేమించావు, భయం కారణంగానే నన్ను పెళ్ళి చేసుకోలేకపోయావు…” అలా అన్నప్పుడు ఆమె మాటల్లో కోపం కన్నా నిరాశే ఎక్కువగా కనపడేది.
“ఇంకా ఎవరైనా కావల్సినవాళ్ళు రావాలా?” పురోహితుడు గట్టిగా అడుగుతున్నాడు.
ఎవరు కావల్సినవాళ్ళు? గీతకి ఎవరూ కావల్సినవాళ్ళు లేరు. తల్లి లేదు. పెళ్ళి చేసుకున్నవాడు వదిలేశాడు. మిగిలిన బంధుజనాన్ని గీతే వదిలేసింది. ఆమె మునుపు పనిచేసిన ఆఫీస్ కొలీగ్స్ కొంతమంది వచ్చినా అక్కడ ఎక్కువసేపు నిలబడలేదు. ఆ అమ్మాయి తండ్రి, నేను మాత్రమే లెక్కకి మిగిలిన కావల్సినవాళ్ళం.
గీత శవాన్ని చూసినప్పుడు కన్నా ఇంటినిండా వున్న మందు బాటిల్స్, సిగరెట్ పీకలు చూసినప్పుడు ఎక్కువ ఏడ్చాడు గీత తండ్రి విశ్వేశ్వరరావు. దానికే ఇంత గుండెలు బాదుకుంటే ఆ అమ్మాయికి నాకు వున్న సంబంధం గురించి తెలిస్తే ఇంకా ఏమైపోతాడో అనుకున్నాను.
పురోహితుడు కావల్సిన సర్దుకోని కార్యక్రమానికి ఉపక్రమించాడు.
“మీ పేరు రామభద్రే కదూ?” అన్నాడు గీత తండ్రి విశ్వేశ్వరరావు.
“అవునండీ..”
“అమ్మాయి నీ గురించి చెప్తుండేది… నువ్వన్నా ఆ పిల్లకి ఆసరగా వున్నావు అదే చాలు…” అన్నాడాయన నిట్టూరుస్తూ.
చెప్పేసింది…!!
నా గురించి వాళ్ళ నాన్నకి చెప్పేసింది.
ఎవరికీ చెప్పనని నాకు ఒట్టేసిన గీత… వాళ్ళ నాన్నతో మా సంబంధం గురించి చెప్పేసింది…!! ఎంత పరువు తక్కువ? అసలు ఇలాంటి విషయం తండ్రితో ఎలా చెప్పగలిగింది? నేను గీతని ప్రేమించిన సంగతి మా నాన్నకి చెప్పడానికే భయపడ్డాను. ఆ తరువాత మా ఇద్దరికి విడివిడిగా పెళ్ళిళ్లు అయిపోయాయి. ఆమె మొగుడు వదిలేసిన తరువాత మళ్ళీ మా ఇద్దరికీ అనుకోకుండా పరిచయం. ఆ తరువాత ఎండిపోయిన చెట్టు మొదట్లోనుంచి కొత్త పచ్చదనం పుట్టుకొచ్చినట్లు మా ప్రేమ మళ్ళీ చిగురించడం మొదలైంది. అయినా కొన్ని సంవత్సరాలుగా గుట్టుగా నెట్టుకొస్తున్న వ్యవహారం అది.
నిజంగా గుట్టుగానే వుందా? లేకపోతే తండ్రికి చెప్పినట్లు అందరితో చెప్పేసిందా? కళ్ళు మూసుకోని పాలు తాగే పిల్లిలాగే నేను కూడా అందరికీ తెలిసిపోయిన విషయాన్ని, ఎవరికీ తెలియదన్న భ్రమలో బ్రతికేస్తున్నానా?
చుట్టూ చూశాను. అన్నీ శవాన్ని చూడటానికి వచ్చిన ముఖాల్లానే వున్నాయి.
అదిగో అక్కడ – ఆ ఎర్రచీర కట్టుకున్న ఆవిడ నా వైపే చూస్తూ పక్కన వున్న ఆవిడతో ఏదో చెప్తోంది… ఖచ్చితంగా నా గురించే అయ్యుంటుంది. ఈ పక్కన గీత శవం వెనుకగా వున్న వ్యక్తి నన్నే చూస్తున్నాడు. తెలిసిపోయిందేమో… అందరికీ తెలిసిపోయిందేమో… వుండకూడదు… ఇక్కడ వుండకూడదని మనసు చెప్తోంది. వెళ్ళి పోవాలి… ఇక్కడ్నుంచి… గీత నుంచి దూరంగా… వెళ్ళిపోవాలి.
ఫోన్ రింగ్ అయ్యింది.
“ఏమయ్యా వస్తున్నావా లేదా?” శారద గొంతు.
“వ..వస్తున్నా..!”
“ఎక్కడ వున్నావు ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి…”
“గుళ్ళో” పెట్టేశాను.
నా పక్కన వున్నవాళ్ళు చిత్రంగా చూశారు నా వైపు. ఇక అక్కడినుంచి తప్పుకోక తప్పదనిపించింది నాకు. నెమ్మదిగా కదిలాను. గీత తండ్రి విశ్వేశ్వరరావు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
“నీతో మాట్లాడాలి. ఒకసారి లోపలికి వస్తావా?” అడిగాడు. నేను తలాడించి అతని వెనకే ఇంట్లోకి అడుగుపెట్టాను. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. పక్కనే టేబుల్ మీద వున్న గీత ఫోటోనే చూస్తున్నాను నేను. కొంతసేపు తటపటాయించి మొదలుపెట్టాడు ఆయన.
“మీ గురించి గీత పూర్తిగా చెప్పింది బాబూ… నేనేం మిమ్మల్ని కానీ, అమ్మాయిని కానీ తప్పుపట్టడం లేదు. మీ ప్రేమని పెళ్ళిదాకా తీసుకురాలేకపోయారు. ఇద్దరి పెళ్ళిళ్ళు అయిపోయినా ప్రేమని మాత్రం కొనసాగించారు… మీరు ఇంట్లో చెప్పలేనని భయపడ్డప్పడు, విషయం ముందే చెప్పకుండా శుభలేఖ పోస్ట్ లో పంపినప్పుడు గీత ఆ విషయం నాతోనే ముందు చెప్పింది. నువ్వు ప్రేమని గెలిపించుకోలేని అసమర్థుడివని, నిన్ను వదిలెయ్యమని చాలా చెప్పాను… కానీ, అప్పటికే గీత నిన్ను చాలా ప్రేమించింది…”
ఫోన్ మోగింది. శారద. సైలెంట్ మోడ్ లో పెట్టి విశ్వేశ్వరరావు వైపు చూశాను.
“ఇదంతా నీకు తెలియదని కాదు… చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దయచేసి జరగవలసిన కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించగలవా? గీత కోరిక కూడా అదే అయ్యుంటుంది” చెప్పాడాయన.
నా పక్కనే బాంబు పేలినట్లు అదిరిపడ్డాను నేను.
“ఏంటండీ… ఏం మాట్లాడుతున్నారు మీరు? నలుగురికీ తెలిస్తే ఏమౌతుంది? నేను ఎవర్ని అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు?”
“మీరు ఎవరో, గీతకి ఏమౌతారో మీకు తెలుసు, గీతకి తెలుసు, నాకు తెలుసు. మిగతా జనానికి తెలియకపోయినా ఫర్లేదు”
“ఎందుకు తెలియదు? తెలిసిన తరువాత నా పరువేం కావాలి?”
“ఇదే జనం కోసం, పరువుకోసం ఒకప్పుడు గీతని కోల్పోయావు. మళ్ళీ ఇప్పుడు కొల్పోతున్నావు” ఆయన కటువుగా అన్నాడు. నేను లేచి నిలబడ్డాను.
“సారీ అంకుల్… ఇది జరిగేది కాదు. వస్తాను…” అని ఆయన సమాధానం వినకుండా బయల్దేరాను.
మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది.
“ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చారు?”
“వచ్చేస్తున్నా…. మైలపడ్డాను. కొంచెం వేడినీళ్ళు సిద్ధం చేస్తావా?”
“గుడికి వెళ్ళానని అన్నారు. అక్కడేం మైల?”
“వచ్చింది గుడికే కానీ మైల పడ్డాను…” చెప్పాను నేను ఆఖరుసారిగా గీత వైపు చూస్తూ. ఆమె ఇంకా నవ్వుతున్నట్లే అనిపిస్తోంది.
***
(వాకిలి e-పత్రిక, ఫిబ్రవరి సంచిక 2013)
Category:

4 వ్యాఖ్య(లు):

Zilebi చెప్పారు...


అరిపిరాల 'రచనా'మార్క్ కథాంశం,కథా కథనం

చీర్స్
జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

అసమర్థుని ప్రేమయాత్ర. yes really

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

నాకు కథల గురించి ఎక్కువగా తెలియదు.
విఫలమైన ప్రేమ కొన్నేళ్ళకు కలిస్తే అనే నేపద్యంలో నేనూ కథ రాయాలనుకున్నాను. రాయలేకపోయాను.
నేను అనుకున్న కథాంశము కాబట్టి కొంత కుతూహలం కలిగింది, ముగింపు ఇలా వూహించలేదు నేను

ఏది ఏమైనా మర్చిపోయిన కథరాయలనే తలంపును నిద్రలేపారు.

అభినందనలు

తులసి చెప్పారు...

ఎవరిది తప్పు? అసమర్ధుడిదా? అసమర్ధుడని తెలిసీ సంబంధం కొనసాగించిన గీతదా? కధ బాగుందండి.