ప్రియ పుత్రుడు (అనువాద కథ)


(పోలిష్ కథ, మూలం: హెన్రిక్ షెస్కోవిచ్)
దూరంగా దట్టమైన అడవి కనపడుతోంది. ఆడవికి ఇవతలగా ఉన్న పచ్చిక బయలు దాటిటితే కోతకి సిద్ధంగా వున్న పంటపొలాల మధ్య రెల్లుగడ్డి కప్పిన చిన్న పాక ఉంది. ఇంటి చుట్టూ ఉన్న చెట్లకొమ్మలు పాకపైకి వాలుతున్నాయి. ఒక పెద్ద చెట్టు చిటారు కొమ్మన కొంగ ఒకటి తన గూటిపైన కూర్చోనుంది. కొంచెం అవతలగా వున్న చెర్రీ చెట్టుకి వేలాడుతున్న తేనెపట్టు చుట్టూ తేనెటీగలు తిరుగుతున్నాయి.

అలాంటి ఇంటి ముఖద్వారం గుండా లోపలికి వచ్చాడొక సాధువు. పాక గడప దగ్గరే నిలబడివున్న ఇంటి ఇల్లాలిని దగ్గరకు వచ్చాడా సాధువు.

"శుభోజ్జయం తల్లీ.. శుభోజ్జయం... చల్లని ఇంటికి శుభం, పచ్చన చెట్టూ చేమకి శుభం, మీ ఇంటి ధాన్యానికి శుభం, మీ లోగిలికి శుభోజ్జం తల్లీ... శుభోజ్జయం" అన్నాడు.

ఇల్లాలు అతన్ని సాదరంగా ఆహ్వానించింది.

"రండి స్వామీ. మీకు పాలు ఫలహారం తెస్తాను. కాస్సేపు మా అరుగు పైన కూర్చోని సేద తీరండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్లున్నారు. " అన్నదామె.

"అవునుతల్లి... దేశమంత పక్షి తిరిగినట్లు తిరిగాను. చాలా దూరం నుంచి వస్తున్నాను. నీ బిడ్డల యోగక్షేమాలు తెలుపడానికే ఇక్కడికి వచ్చాను" అన్నాడాయన.

"అలాగా స్వామీ.. అయితే నా యాస్కోని మీరు ఎరుగుదురా?"

"అమ్మా.. మొదట పిల్లవాడి గురించి అడిగావంటే అతనిపైన నీకు ఎంత ప్రేమ వున్నదో కదా? సరే విను. నీ బిడ్డలలో ఒకడు అడవిలో బతుకున్నాడు. గొడ్డలితో జీవనాధారం ఏర్పాటు చేసుకున్నాడు. సరస్సులపైన వల పరిచి
బతుకుతున్నాడు. ఇక రెండోవాడు గుర్రాలతో గడ్డిమేటల వెంట బతుకుతున్నాడు. జానపదాలు పాడుకుంటున్నాడు. ఆకాశంలో తారలని చూస్తూ సుఖంగా బతుకుతున్నాడు. నీ మూడో కొడుకు కొండలు గుట్టలు ఎక్కాడు. బండరాళ్ళను దాటాడు. పచ్చిక భూముల్ని దాటాడు. గొర్రలను కాచుకుంటూ, వాటికోసం వచ్చే గద్దల్ని తోలుకుంటూ నాకు కనిపించాడు. నీ బిడ్డలందరూ నీ పాదాలకి నమస్కరిస్తున్నట్లు చెప్పమన్నారు."

"మరి నా యాస్కో సంగతి?"

"అది సంతోషకరమైన సంగతి కాదనే చివరగా చెప్తున్నాను. యాస్కో పరిస్థితి బాగలేదు. అతని చేతికింద భూమి ఫలాలను ఇవ్వడంలేదు. ఆకలి, పేదరికం అతన్ని బాధిస్తున్నాయి. కష్టాలలోనే రోజులు, నెలలు గడుపుకొస్తున్నాడు. ఎవరూ తెలియని దేశంలొ ఒంటరిగా మన బాషే మరిచిపోయే స్థితిలో వున్నాడు. వాడు మాత్రం నిన్ని తలుచుకోను కూడా లేదు. వాణ్ణి మర్చిపో తల్లీ" అన్నాడు.

సాధువు చెప్పిన విషయం పూర్తికాగానే అతని చేతిని అందుకోని గౌరవంతో లొపలికి తీసుకెళ్ళి భోజనం చేసే గదిలో కూర్చోపెట్టింది. అతని కావాల్సిన ఆహరపానీయాలు సమర్పించింది. కొన్ని రొట్టెముక్కలు విడిగా ఇచ్చింది.
"
రొట్టెలు నా బిడ్డ యాస్కోకి ఇవ్వండి స్వామీ" అంది.

ఆమె దగ్గర వున్న చిన్న చేతి రుమాలు ముడి విప్పి అందులోనుంచి ఒక వెండి నాణాన్ని తీసి అతని చేతిలో పెట్టింది.
"
ఇది కూడా యాస్కోకే ఇవ్వండి. ఇంతకన్నా ఇవ్వలేని పేదరాలిని" అంది వణుకుతున్న కంఠంతో. సాధువు ఆశ్చర్యపోయాడు.

"అమ్మా. నీకు ఇంతమంది బిడ్డలు వున్నారు. అందరిలోనూ ఒక్కడికే నీ బహుమతిని ఇస్తున్నావు. వాడే నీకు అందరికన్నా ప్రియమైనవాడా? వాడొక్కడే నీకు ప్రియపుత్రుడా?" అడిగాడు.

ఆమె వాల్చి వున్న కనురెప్పలని భారంగా ఎత్తి అతని వైపు చూసింది. కళ్ళలో కన్నీళ్ళు.

"బిడ్డలందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి స్వామీ. కానీ నా బిడ్డ యాస్కో అందరికన్నా పేదవాడు కదా" అన్నది ఆమె.

(విపుల, మార్చి 2013)

మొపాస కథలు: మీసాలు


ఛాటువ్ డి సోల్స్
జులై, 30 1883
ప్రియమైన లూసీకి,
నిజం చెప్పద్దూ... నీతో ముచ్చటించడానికి విశేషాలూ లేవు. ఇదిగో ఇక్కడ ఈ ముందు గదిలోనే మా మకాం. రోజూ బయటపడే వర్షాన్ని చూస్తూ కూర్చుంటాము. ఇంత భయానకమైన పరిస్థితిలో బయటికి వెళ్ళలేము కదా? అందుకోసమే మేము రోజు నాటకాలు చూసే ఏర్పాటు చేసుకున్నాము. ఏం నాటకాలోలే..! మన బందిఖానా బతుకులకి ఈ జీడిపాకంలా సాగదీసే వినోదాలు అవసరమా చెప్పు? ఏది చూసినా బలవంతంగా చేసిన ఫార్స్ కథల్లా వుంటాయి. అందులో వుండే హాస్యం, ఫిరంగుల్లోంచి దూసుకు వచ్చిన గుండ్లలాగా చుట్టూ వున్నవాటిని చెల్లాచదరు చేస్తుంటుంది. హాస్యంలో ఒక చమక్కు లేదు, సహజత్వం లేదు, ఆహ్లాదం లేదు. నిజానికి సాహిత్యకారులకి సమాజంలోని వాస్తవాల గురించి ఏమీ తెలియదు. నిజ జీవితంలో మనుషులు ఎలా మాట్లాడతారో, ఎలా వ్యవహరిస్తారో వీళ్ళకి మాత్రం అవగాహన వున్నట్లు కనపడదు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని వెటకారం చేసినా క్షమించగలను కానీ, అసలు అవేమిటో కూడా తెలియదంటే ఎలా క్షమించడం? హాస్యం పలికించాలంటే చాలు వాళ్ళు సైనిక స్థావరాలు లాంటి చోట మాట్లాడుకునా వెటకారపు విషయాలు చెప్తారు. ఇంకొంచెం హాస్యం కావాలంటే మన వూరి బయట కల్లు దుకాణాల్లో యాభై ఏళ్ళుగా కుర్రాళ్ళు చెప్పుకుంటున్న పాత జొకులు చెప్తారు.

ఇక ఇలా కాదని అనుకోని, చివరికి మేమే నాటకాలు వెయ్యాలని నిర్ణయించుకున్నాం. మేము ఇద్దరం ఆడవాళ్ళం  కాబట్టి మా ఆయన విదూషకుడి పాత్ర వెయ్యాలని అనుకున్నాడు. అందు కోసమే ఆయన మీసాలు కూడా తీసేశాడు. నువ్వు నమ్మవు కానీ లూసీ, మీసాలు లేకపోతే ఆయన ఎంత మారిపోయాడనుకున్నావు? పగలైనా రాత్రైనా ఆయన్ని గుర్తుపట్టడమే కష్టమౌతోంది నాకు. ఆయనగాని మళ్ళీ మీసాలు పెంచకపోతే నేను ఆయన్ని ప్రేమించడం మానేస్తానేమో అనిపిస్తొంది. అంత దారుణంగా వున్నాడాయన.

మీసాలు లేనివాడు మగాడెలా అవుతాడు చెప్పు? గడ్డం లేకపోయినా సరే ఫర్లేదు. గడ్డం వుంటే కొంచెం అందం తగ్గుతుంది. కానీ మీసాలు...? మీసాలనేవి మగవాడి ముఖం నుంచి తప్పించలేని అలంకారాలు. నువ్వు నమ్మవు కానీ పై పెదిమ పైన వుండే నాలుగు వెంట్రుకలు చూసే కళ్ళకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయో తెలుసా? అంతేకాదు మీసాలు వుండటం వల్ల ఇంకా చాలా వుపయోగాలు వున్నాయి. నేను వాటన్నింటి గురించి తీవ్రంగా ఆలొచించాను కనీ ఇలా రాయడానికే ధైర్యం చెయ్యలేకపోయాను. ఇలాంటి చిత్రమైన, సున్నితమైన విషయాలు కాగితం పైన పదాల రూపంలో పెట్టదగినవి కావు. అలా రాయాలంటే ఎంతో నేర్పు అవసరం అంటాను.

నిజం చెప్పనా? ఆయన మీసాలు తీసేసి నాకు కనపడగానే, ఇలాంటి పేడి మూతితో వుండే నటుణ్ణి కానీ, పుజారిని కానీ ఆఖరుకి మన్మధుడైనా సరే నేను ప్రేమించలేను అని అనుకున్నాను. తరువాత ఆయనతో(అదే మా ఆయనతో) ఏకాంతంగా గడపాల్సివచ్చినప్పుడు నా ఇబ్బంది వర్ణనాతీతం. లూసీ, నీకు కాబట్టి చెబుతున్నాను. మీసాలు లేనివాడు ముద్దుపెట్టినా ఎప్పుడూ పెట్టించుకోకు. ముద్దులో వుండాల్సిన అనుభూతి వుండదు.. అసలు ఎలాంటి అనుభూతీ వుండదు. ముద్దులో వుండాల్సినవి మచ్చుకైనా కనిపించవు - మాధుర్యం, మెత్తదనం, కిక్కు ఇవేవీ వుండవు. మీసాలే ముద్దులో వున్న కిక్కు.

బాగా ఎండిన గరుకు కాగితం పైన పెదాలు పెడితే అలా వుంటుంది? అలాగే వుంటుంది మీసం లేవివాడి ముద్దు. అలాంటి ముద్దుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు.

మరి మీసమున్నవాడి ముద్దు మహత్యం నీకు ఎదురైనప్పుడు నాకు చెప్తావు కదూ? నాకు తెలీయదనా? తెలుసు. ప్రియుడి మీసం ముఖం పైన కూడా గిలిగింతలు పెట్టగలదు. ముద్దుకి సిద్ధమై దగ్గరైనప్పుడు ఆపాదమస్తకం సన్నటి వణుకుతో జివ్వుమంటుంది. ఇక మెడ..!! ఎప్పుడైనా మెడమీద నాట్యం చేసే మీసం అనుభవానికి వచ్చిందా? ఒక మత్తు మందు చల్లిన అనుభవాన్ని ఇస్తుంది. నరనరాల్లో కరెంటు పుడుతుంది. కరేంటు వేళ్ళ చివరి కొసలదాకా పాకుతుంది. వణికిపోతావు.. భుజాలు ఎగరేస్తావు, తల తిప్పేస్తావు. వెళ్ళిపోవాలనిపిస్తుంది. కదలబుద్దేయ్యదు. అద్భుతంగా వుంటుంది. చిరాగ్గానూ వుంటుంది. కానీ ఎంత బాగుంటుందో?

మీసాలు లేని పెదాలు, బట్టలు లేని శరీరాల్లాంటివి. బట్టలు వేసుకోకపోతే ఎలా? తక్కువో, ఎక్కువో బట్టలనే వేసుకోవాల్సిందే కదా? అలాగే మీసాలు కూడా.

నాకు ఒక రాజకీయనాయకుడు అన్న మాటలు మూడు నెలలుగా గుర్తుకువస్తున్నాయి. శ్రీవారు ఎప్పుడూ పేపర్ చదువుతూ వుంటారుగా. అలాంటి ఒక సాయంత్రమే చదివి వినిపించారు ఇది. ఎవరో మెలీన్ అని వ్యవసాయ శాఖా మంత్రట, ఆయన ప్రసంగపాఠం అది. మంత్రిగారు ఇప్పుడు ఇంకా పెద్ద పదవిలో వుండేవుంటాడు. నాకా వివరాలు తెలియదు.

ఆయన చదువుతుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ మెలీన్ అనే పేరు వినగానే ఎందుకో ఆసక్తి కలిగింది. పేరు వింటూనే ఎందుకో నేను చదివిన పాత పుస్తకంలో పాత్ర ఒకటి గుర్తుకువచ్చింది. సరే, సదరు మిస్టరుగారు ప్రజలను వుద్దేశ్శించి మాటలు అన్నాడు. అప్పటి నుంచి ఆయన మాటలకి అర్థం వెతుకుతున్నాను. ఇంతకీ ఆయనేమన్నాడో తెలుసా - "వ్యవసాయం లేకపోతే దేశభక్తి వుండదు" అన్నాడు. ఇదుగో ఇప్పుడే ఆయన మాటలకి అర్థం తెలుసుకున్నాను. ఆయన చెప్పినదానికి అనుసరణగా నేనూ చెప్తున్నాను - "మీసాలు లేకపోతే ప్రేమ వుండదు" అని. నవ్వొస్తోంది కదూ ఇలా చెప్తుంటే?

"మీసాలు లేకపోతే ప్రేమ వుండదు"

"వ్యవసాయం లేకపోతే దేశభక్తి వుండదు" అన్నాడు కదా మిస్టర్ మెలీన్. ఆయన చెప్పిన మాట నిజమే. ఎందుకో నన్ను అడగకు.

అదలా పక్కన పెట్టి. మీసాల అవసరం వేరే ఎన్నో విధాలుగా మన గుర్తించచ్చుముఖానికి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది మీసం. ఒక మగవాడు సౌమ్యుడా, మృదుస్వభావియా, క్రూరుడా, రాక్షసుడా మీసాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ముఖమంతా జుట్టుతో గడ్డం చెయ్యనివాడు అందంగా కనపడడు సరికదా అతని రూపురేఖలు గడ్డంలో మాయమై అతనిని అర్థం చేసుకునేందుకు ఆస్కారమివ్వవు. కానీ మీసాలు అలా కాదు.

మీసాలు వున్న మగవాడు ఒక ప్రత్యేకమైన ముఖకవళికలతో, శుభ్రంగా స్పష్టంగా కనిపింఛే వ్యక్తిత్వంతో వుంటాడు.
అసలు మీసాలు ఎన్ని రకాలుగా వున్నాయో మనుషులూ అన్ని రకాలుగా వుంటారు. మెలితిప్పినవి, వంకర్లు తిరిగినవి, పొడవైనవి, బలమైనవి, సరసమైనవి... ఇలాంటి మీసాలవాళ్ళు అమ్మాయిలని ఆకట్టుకోడానికే అంకితమై వుంటారు. ఇంకొన్ని వుంటాయి. సూటిగా, సూదుల్లా కొనదేరి, బెదిరిస్తూ వుంటాయి. ఇలాంటివాళ్ళకి మందు, గుర్రాలు, యుద్ధాలు వుంటే చాలు. ఇంకొంతమందికి చాలా పెద్దవిగా, వేలాడుతూ భయానకంగా వుంటాయి.ఇలాంటి పెద్ద మీసాలు వారి వారి ముఖాలలో భావాలని దాచిపెడాతాయి. ఆదరణ వెనక బలహీనతల్ని, ప్రేమ వెనక భయాన్ని దాచిపెడతాయి.

కానీ నాకు మీసాలలో నచ్చేదేమిటో తెలుసా? వాటిలో వున్న ఫ్రెంచ్ వ్యక్తిత్వం. ఇది మన పూర్వుకులైన గౌల్స్ నుండి సంక్రమించింది కదా. అప్పటి నుంచి మన సంస్కృతిలో భాగమై మన దేశానికి ఆనవాలుగా వుండిపోయిందీ మీసం. మీసం మనకి గర్వకారణం. సాహసానికి, ధైర్యానికి చిహ్నం ఇది. హుందాగా వైన్ తాగగలదిది. మర్యాదగా నవ్వగలదిది. గడ్డాలవారి చేతగానితనంతో పోలిస్తే మీసం చాలా ఉన్నతమైనది.
నా కంటిలో వున్న కన్నీటినంతా ఏకధాటిగా కర్చేసిన సంఘటన ఒకటి గుర్తుకువస్తోంది. గుర్తుకురావడం కాదు, స్పష్టంగా నా కళ్ళముంది కనపడుతోంది. నేను మగవాడి ముఖాన వుండే మీసాన్ని ప్రేమించేలా చేసిన సంఘటన అది.

అప్పుడు యుద్ధం జరుగుతోంది. నేను అప్పటికింకా పుట్టింట్లోనే వున్నాను. వయసు కూడా ఎక్కువేంకాదు. ఒకరోజు కోట దగ్గర చిన్న యుద్ధమేదో జరిగింది. పగలంతా నాకు అక్కడి నుంచి ఫిరంగులు పేలిన శబ్దాలు, తుపాకులు కాల్చిన శబ్దాలు వినపడ్డాయి. సాయంత్రమవగానే ఒక జర్మనీ కల్నల్ వచ్చి మా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. మర్నాడు వుదయం మళ్ళీ వెళ్ళిపొయాడు.

యుద్ధం జరిగిన చోట చాలా శవాలు పడి వున్నాయని మా నాన్నకి చెప్పాడు. ఆ శవాల బాధ్యత నాన్న తీసుకున్నాడు. వాటిని అన్నింటిని ఒకే చోట పాతిపెట్టాలని అన్నింటినీ మా స్థలానికి తీసుకొచ్చాడు. తెచ్చిన వెంటనే శవాలని మా ఇంటికి వచ్చే మట్టిదారికి రెండువైపులా పడుకోబెట్టాడు. వారినందరినీ పాతిపెట్టడానికి పెద్ద కందకంలాంటిది తొవ్వాలి. లోగా శవాల నుంచి దుర్వాసన రాకుండ పైపైన మట్టితో కప్పేశారు. అందువల్ల మట్టిలో నుంచి బయటికి పొడుచుకువచ్చినట్లుగా పచ్చటి చేతులు, కళ్ళు మూసుకోని వున్న ముఖాలు కనిపిస్తున్నాయి.

నాకు వాటిని దగ్గరగా చూడాలనిపించింది. కానీ రెండు వరసల్లో వున్న శవాలను చూస్తే భయంతో కళ్ళుతిరిగినట్లు అనిపించింది. అయినా ధైర్యంగా చూడటం మొదలుపెట్టాను. వాళ్ళ ముఖాలని చూస్తూ ఒక్కొక్కరూ ఎలాంటివాళ్ళో అని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను.

వారి మిలటరీ దుస్తులు మట్టితో కప్పబడి వున్నాయి. కానీ వాళ్ళ ముఖాలని చూడాగానే నేను వాళ్ళని గుర్తుపట్టాను. వాళ్ళ మీసాలు చూసి గుర్తుపట్టాను... వాళ్ళు నిస్సందేహంగా మన ఫ్రెంచ్ సైనికులే అని.

వాళ్ళలో కొంతమంది రోజు వుదయమే మీసాలను కుదురుగా తీర్చిదిద్దుకున్నట్లున్నారు. చివరివరకూ హుందాగా బతకాలని అనుకున్నారేమో మరి. మరికొంతమందికి వారం నుండి కత్తెర పడనట్లు బాగా పెరిగి వున్నాయి. కానీ అందరికీ వున్నాయి. ఫ్రెంచ్ మీసాలు. విశ్రాంతగా వున్నా ఆ మీసాలు గర్వంగా నాతో మాట్లాడాయి. "మమ్మల్ని గడ్డం వాళ్ళనుకోకు పాపా. మేము నీ సోదరులమే" అన్నాయి.

నేను ఏడ్చాను. ఎంతో ఏడ్చాను... బహుశా వాళ్ళను గుర్తుపట్టకపోతే అంత ఏడ్చేదాన్ని కాదేమో. అయ్యో పాపం అనుకుంటూ భోరున ఏడ్చాను.

ఇదంతా నీకు చెప్పకుండా వుండాల్సింది. ఇప్పుడు బాధ నన్ను కమ్మేసింది. ఇంకేమీ మాట్లాడాలేను. ఇంక వుంటాను లూసీ. నీకు ప్రేమతో ముద్దులు. మీసం వర్థిల్లాలి –

ఇట్లు నీ జీన్.                                            

<< ?>>

(1870 ప్రాంతంలో జరిగిన ఫ్రెంచ్-జర్మనీ యుద్దం మొపాస కథలలో తరచుగా కనిపిస్తుంటుంది. ఆ యుద్ధంలో నలిగిపోయిన మధ్యతరగతి కుటుంబాలు, పోరాడిన సైనికులు ఈయన కథలలో ఎక్కువగా తటస్తపడుతుంటారు. పై కథ అలాంటి కథల్లో ముఖ్యమైనది, పతిభావంతమైనది, ప్రభావంతమైనది కూడా..)