ప్రియ పుత్రుడు (అనువాద కథ)


(పోలిష్ కథ, మూలం: హెన్రిక్ షెస్కోవిచ్)
దూరంగా దట్టమైన అడవి కనపడుతోంది. ఆడవికి ఇవతలగా ఉన్న పచ్చిక బయలు దాటిటితే కోతకి సిద్ధంగా వున్న పంటపొలాల మధ్య రెల్లుగడ్డి కప్పిన చిన్న పాక ఉంది. ఇంటి చుట్టూ ఉన్న చెట్లకొమ్మలు పాకపైకి వాలుతున్నాయి. ఒక పెద్ద చెట్టు చిటారు కొమ్మన కొంగ ఒకటి తన గూటిపైన కూర్చోనుంది. కొంచెం అవతలగా వున్న చెర్రీ చెట్టుకి వేలాడుతున్న తేనెపట్టు చుట్టూ తేనెటీగలు తిరుగుతున్నాయి.

అలాంటి ఇంటి ముఖద్వారం గుండా లోపలికి వచ్చాడొక సాధువు. పాక గడప దగ్గరే నిలబడివున్న ఇంటి ఇల్లాలిని దగ్గరకు వచ్చాడా సాధువు.

"శుభోజ్జయం తల్లీ.. శుభోజ్జయం... చల్లని ఇంటికి శుభం, పచ్చన చెట్టూ చేమకి శుభం, మీ ఇంటి ధాన్యానికి శుభం, మీ లోగిలికి శుభోజ్జం తల్లీ... శుభోజ్జయం" అన్నాడు.

ఇల్లాలు అతన్ని సాదరంగా ఆహ్వానించింది.

"రండి స్వామీ. మీకు పాలు ఫలహారం తెస్తాను. కాస్సేపు మా అరుగు పైన కూర్చోని సేద తీరండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్లున్నారు. " అన్నదామె.

"అవునుతల్లి... దేశమంత పక్షి తిరిగినట్లు తిరిగాను. చాలా దూరం నుంచి వస్తున్నాను. నీ బిడ్డల యోగక్షేమాలు తెలుపడానికే ఇక్కడికి వచ్చాను" అన్నాడాయన.

"అలాగా స్వామీ.. అయితే నా యాస్కోని మీరు ఎరుగుదురా?"

"అమ్మా.. మొదట పిల్లవాడి గురించి అడిగావంటే అతనిపైన నీకు ఎంత ప్రేమ వున్నదో కదా? సరే విను. నీ బిడ్డలలో ఒకడు అడవిలో బతుకున్నాడు. గొడ్డలితో జీవనాధారం ఏర్పాటు చేసుకున్నాడు. సరస్సులపైన వల పరిచి
బతుకుతున్నాడు. ఇక రెండోవాడు గుర్రాలతో గడ్డిమేటల వెంట బతుకుతున్నాడు. జానపదాలు పాడుకుంటున్నాడు. ఆకాశంలో తారలని చూస్తూ సుఖంగా బతుకుతున్నాడు. నీ మూడో కొడుకు కొండలు గుట్టలు ఎక్కాడు. బండరాళ్ళను దాటాడు. పచ్చిక భూముల్ని దాటాడు. గొర్రలను కాచుకుంటూ, వాటికోసం వచ్చే గద్దల్ని తోలుకుంటూ నాకు కనిపించాడు. నీ బిడ్డలందరూ నీ పాదాలకి నమస్కరిస్తున్నట్లు చెప్పమన్నారు."

"మరి నా యాస్కో సంగతి?"

"అది సంతోషకరమైన సంగతి కాదనే చివరగా చెప్తున్నాను. యాస్కో పరిస్థితి బాగలేదు. అతని చేతికింద భూమి ఫలాలను ఇవ్వడంలేదు. ఆకలి, పేదరికం అతన్ని బాధిస్తున్నాయి. కష్టాలలోనే రోజులు, నెలలు గడుపుకొస్తున్నాడు. ఎవరూ తెలియని దేశంలొ ఒంటరిగా మన బాషే మరిచిపోయే స్థితిలో వున్నాడు. వాడు మాత్రం నిన్ని తలుచుకోను కూడా లేదు. వాణ్ణి మర్చిపో తల్లీ" అన్నాడు.

సాధువు చెప్పిన విషయం పూర్తికాగానే అతని చేతిని అందుకోని గౌరవంతో లొపలికి తీసుకెళ్ళి భోజనం చేసే గదిలో కూర్చోపెట్టింది. అతని కావాల్సిన ఆహరపానీయాలు సమర్పించింది. కొన్ని రొట్టెముక్కలు విడిగా ఇచ్చింది.
"
రొట్టెలు నా బిడ్డ యాస్కోకి ఇవ్వండి స్వామీ" అంది.

ఆమె దగ్గర వున్న చిన్న చేతి రుమాలు ముడి విప్పి అందులోనుంచి ఒక వెండి నాణాన్ని తీసి అతని చేతిలో పెట్టింది.
"
ఇది కూడా యాస్కోకే ఇవ్వండి. ఇంతకన్నా ఇవ్వలేని పేదరాలిని" అంది వణుకుతున్న కంఠంతో. సాధువు ఆశ్చర్యపోయాడు.

"అమ్మా. నీకు ఇంతమంది బిడ్డలు వున్నారు. అందరిలోనూ ఒక్కడికే నీ బహుమతిని ఇస్తున్నావు. వాడే నీకు అందరికన్నా ప్రియమైనవాడా? వాడొక్కడే నీకు ప్రియపుత్రుడా?" అడిగాడు.

ఆమె వాల్చి వున్న కనురెప్పలని భారంగా ఎత్తి అతని వైపు చూసింది. కళ్ళలో కన్నీళ్ళు.

"బిడ్డలందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి స్వామీ. కానీ నా బిడ్డ యాస్కో అందరికన్నా పేదవాడు కదా" అన్నది ఆమె.

(విపుల, మార్చి 2013)