స్వప్నశేషం (కథ)

ఏ అర్థరాత్రో మెలుకువ వచ్చినప్పుడు.
చిక్కని చీకటిలో జారిపోయిన కలని నేను
పూర్తికాని స్వప్నశేషాన్ని వెతుక్కుంటూ
ఆశను మోస్తూ తిరుగుతున్న గాలిపాటని..
“ఏం చేస్తున్నావ్?” అడిగింది దివ్య. తపస్సు చెదిరిన మహాఋషిలా నేను. సమాధానం ఇవ్వాలా వద్దా?
“మళ్ళీ కవిత్వమా? పడుకోరాదూ.. రెండు దాటింది”
“ఊ” అన్నాను. లైటాపాను. నిద్రకి మెలకువకి మధ్య ప్రపంచంలో కేలండర్ ఒక గడిలోంచి ఇంకో గడిలోకి ప్రయాణం.
పరుగెడుతున్నాను... ఇంకా వేగంగా.. గసపెడుతూ ఆయాసపడుతూ... ఇంకా ఇంకా.. పరుగు.. పరుగు.. తరుముతున్నది ఎవరో.. చేరాల్సింది ఎక్కడికో... ఏదీ తెలియని పరుగు. హైవేలో వెళ్తూ హారన్ కొడితే చెల్లా చెదరై పరుగెత్తిన గొర్రల గుంపులో నేనూ ఒకణ్ణి... ఏ గుట్టచాటుకో తప్పించుకోని పోయిన గొర్రెపిల్లను వెతుక్కుంటూ పిచ్చిగా అరుస్తున్న కాపరిని.. అంతం ఎక్కడో తెలియని తార్రోడ్డుని.. చీకటి సొరంగంలో నిధులున్నాయని పరుగెత్తి పరుగెత్తి చివరికి అది సొరంగం కాదని గబ్బిలాల గుహ అని తెలుసుకోని వెనక్కి దారి వెతుక్కుంటున్న అభిమన్యుణ్ణి...
“ఆగద్దు.. ఆగద్దు... ఆగితే నువ్వే మిగలవు.. అభిమన్యుడిలా అంతం అయిపోతావు.. పరుగెత్తు... పరుగెత్తు... ఇంకా స్పీడ్ గా” దివ్య అరుస్తోంది.
ఆమె చుట్టూ గబ్బిలాలు తిరుగుతున్నాయి. నల్లటి చీకటి ఆమెను మింగేస్తొంది. క్రమంగా చీకట్లోకి కలిసిపోయిన దివ్య స్థానంలో చిన్న వెలుగు రేఖ. అది క్రమంగా విస్తరించి భయంకరమైన తెలుపు రంగుగా మారి సూదుల్లా వచ్చి కళ్ళలో పొడుస్తుంటే...
మెలకువ వచ్చింది..!
“గుడ్ మార్నింగ్... కాఫీ తాగుతావా?” దివ్య నన్నే చూస్తూ అడిగింది. తలాడించాను.
రుచి పచి లేని బ్రేక్ ఫాస్ట్. అట్టముక్కల మధ్య నలిగిపోయిన ఫ్రూట్ జ్యూస్. తినక తప్పదు కదా..!
“ఏదన్నా మాల్ కి వెళ్దామా” దివ్య అడిగింది.
“ఎందుకు? ఏమన్నా కొనాలా?”
“కొనడానికే వెళ్ళాలా?.. సరదాగా..”
“ఒద్దు.. నాకు నచ్చదు..”
“ఏం నచ్చదు?” కోపం ఆమె గొంతుతో.
“ఆ మాల్ తుడిచే ముసలాడు... గేటు బయట బుడగలమ్మే మాసిన బట్టల పిల్లాడు.. చినిగిపోయిన బట్టల్ని యూనిఫార్మ్ తో కప్పుకునే సెక్యూరిటీ గార్డ్..”
“వాళ్ళని ఎందుకు చూస్తావు?”
“ఏం చెయ్యమంటావు... వాళ్ళ కాళ్ళ కింద ఉండే భూమి ఒకప్పుడు వాళ్ళ సొంతమేమో అనిపిస్తుంటుంది... మాల్ పేరుతో ఆక్రమించిన రియల్ ఎస్టేట్ దురాశకి వాళ్ళంతా మూగ సాక్షుల్లా కనిపిస్తారు నాకు...”
“అవన్నీ కాదు.. రంగురంగుల ప్రపంచాన్ని చూడు.. ప్రపంచం మొత్తం వడ్డించే రకరకాల ఆహారాన్ని చూడు..”
“ప్చ్.. నీకు పిజ్జా తెచ్చి సర్వ్ చేసే కుర్రాడు.. ఆ హోటల్ వెనక పారేసిన ఉల్లితొక్కల మధ్య కూర్చోని ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దన్నం తింటాడు తెలుసా?”
“నీతో వాదించలేను... పోనీ మల్టీప్లెక్స్..?”
“తెరలాగేవాడి జీవితానికి తెరదించేసిన ఏసీ రాక్షసి..”
“ఇంకేం చేద్దాం? వీకెండ్ రెండు రోజులు...”
“బతుకుదాం..”
“వస్తావా రావా?”
ఏం చెప్పాలి? ఇద్దర్లో ఒకరన్నా సంతోషంగా వుండచ్చు కదా? వస్తానన్నాను.
వీకెండ్ రంగులరాట్నం రెండు రోజులు తిరిగింది. తెల్లవారితే ఫార్మల్ బట్టలు.. క్లీన్ షేవ్.. టై.. బూట్లు.. పరుగు ప్రారంభం.. చెరో దిక్కుకు..
“దించడం నా వల్ల కాదు.. నువ్వు ఆటోలో వెళ్ళిపో..” చెప్పాను.
“ఈవినింగ్ కాన్ఫరెన్స్ వుంది.. రాత్రికి లేటౌతుంది.. హోటల్ నుంచి ఏమన్నా తెచ్చి వుంచుతావా?” అడిగింది హడావిడిలో మాటలు వదులుతూ.
“నాక్కూడా క్లైంట్ మీటింగ్ వుంది..”
“సర్లే.. క్యాంటీన్ లో ఏదో ఒకటి తినేస్తాలే... మరి నువ్వు...”
“నేనూ అంతే... “
విడిపోతాం.. కాదు కాదు.. విడిపోయే ముందు యాంత్రికంగా పెట్టుకున్న ముద్దు బుగ్గలపైన మరకలుగా మాత్రమే మిగులుతుంది. ఆ తరువాత ఉద్యోగం బరువు లాప్ టప్ గా మారి భుజానికి ఎక్కుతుంది.
ఎండిపోయిన కొమ్మ మీద నుంచి పంజరంలోకి వలసెళ్ళిన పిట్టలమౌతాం. క్యూబికల్ జైల్లో కఠిన కారాగార శిక్ష. పరుగు.. పరుగు.. పరుగు..
“సార్ దిగండి...” ఆటోవాడు తట్టి లేపుతాడు. ఎదురుగా అద్దాల మేడ. మేడ మొత్తం గదులు. గది గదికి తలుపు. ఏ తలుపు తెరిస్తే రాకుమారి దొరుకుతుందో అని వెతికి వెతికి..
లిఫ్ట్ లో పైకి కిందకి.. కిందకి పైకి.. మెట్లెక్కి.. మెట్లు దిగి..
ఫాల్స్ సీలింగ్ లో నించి పొడుచుకొచ్చిన వెలుగు చుక్కలు రాలిపడేదాకా..!!
“మిస్టర్ అనిల్.. ఏం ఆలోచిస్తున్నారు?” రాకుమారిని బంధించిన మాయలఫకీర్ గొంతు.
“ఏం లేదు సార్..”
“ఆర్ యూ లాస్ట్ సమ్ వేర్...??”
యామ్ ఐ లాస్ట్? ఆర్ డిడ్ ఐ లాస్ట్ సమ్ థింగ్..?? సమాధానం వెతుక్కోవాలే తప్ప ప్రశ్నలు అడగకూడదు.
“సారీ సార్..”
***
“ఏంట్రా ఎప్పుడూ ఆలోచిస్తుంటావు?” ఒక స్నేహితుడు మెషిన్ కాఫీ తాగుతూ అడిగాడు.
“సమాధానం వెతుక్కోవాలే తప్ప ప్రశ్నలు అడగకూడదు..” చెప్పాను.
“ఇంకా కవిత్వం రాస్తున్నావా?”
“ఇంకా రాయడమేమిటి? కవిత్వం ప్రవాహం... మధ్యలో ఆగేందుకు అవకాశమే లేదు..”
“ఐ యాం సర్ప్రైజ్డ్.. ఇంత భావుకత్వంతో ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఎలా బతుకుతున్నావు రా?”
నేనొక వారథిని... శిధిలమైన వారధిని... జీవితానికి చావుకు మధ్య పరుచుకున్న కవిత్వాన్ని... ఐదురోజుల పోరాటాన్ని.. కొసమెరుపులా మెరిసే వారాంతపు భావుకుణ్ణి...!!
“ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు?”
“ఏం లేదు.. ఒక కాగితం ఇస్తావా?”
***
బట్టలు కొంటున్నారు.
ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫాస్ట్ గా కొంటున్నారు.
భూములు కొంటున్నారు.
గాలిలోకి లేచిన చిరునామాలు..
డూప్లెక్స్ ఇళ్ళకీ, పొడుగైన కార్లకి నెల నెలా కరిగిపోయే సంపాదనలు..
అందమైన యక్షిణి మాయలో చిక్కుకున్న రాకుమారులు..
ఇక మిగిలింది నా లాంటి పిచ్చివాళ్ళు...
అవును..
ఫైన్ ఆర్ట్స్ మర్చిపోయి ఎకనామిక్స్ మాత్రమే బోధించే జీవితపు విశ్వవిద్యాలయంలో
భావుకత్వం ఇక భ్రమ.
భావుకుడు ఒక పిచ్చివాడు.
***
“నీకేమైనా పిచ్చి పట్టిందా?” దివ్య అనే ఒక ఆడగొంతు.
“ఏం?”
“ఇప్పుడు మనకి పిల్లలు అవసరమా?” ఇప్పుడా గొంతులో ఆడతనం లేదు.
“అవసరానికి పిల్లలు కంటామా?”
“నీ కవిత్వం వినే ఓపిక నాకు లేదు.. ఇప్పుడిప్పుడే కెరీర్ దారిలో పడింది.. ఈ పరిస్థితిలో మనకి ఇదంతా బర్డన్.. నా వల్ల కాదు.. ప్లీజ్ అర్థం చేస్తుకో..”
అర్థం చేసుకో
ఎలా అర్థం చేసుకోమంటావు?
ఒక్క ఇంక్రిమెంట్ కోసం వద్దనుకున్న శిశువు
రేప్పొద్దున కలలో కనిపించి నిర్దయగా నన్ను చూసి నవ్వితే
సమాధానం నువ్వు చెప్తావా?
నా కలలోకి నువ్వు వస్తావా?
“నాకు ఈ పిల్స్ తెచ్చిపెట్టు.. నేను చూసుకుంటాను...”
బయటెక్కడో ఆఖరి గొడ్డలి దెబ్బకి మహావృక్షం ఒకటి నేలకొరిగిన చప్పుడు.
***
“ఈ నెల జీతం ఎక్కువ వచ్చినట్లుంది?” దివ్య అడిగింది
“సేలరీ పెరిగింది..”
“అదే ఎందుకు?”
“ప్రమోషన్..”
“వ్యాట్.. నిజమా? చెప్పనేలేదు...”
“ఏముంది చెప్పడానికి... బానిస పోస్ట్ నుంచి సీనియర్ బానిస పోస్టుకు, అక్కడ్నుంచి ఇప్పుడు హెడ్ బానిస పోస్టుకు వచ్చాను. రేపెప్పుడో ఛీఫ్ బానిస్ పోస్ట్ కూడా ఇస్తారు..”
“ఓహ్.. స్టాపిట్.. ఎందుకలా మాట్లాడతావు?”
“నాకు నచ్చే ప్రపంచం.. నేనుండే ప్రపంచం ఒకటే కానప్పుడు మాటలు ఇలాగే రాలిపడతాయి..”
“వాట్ ఆర్ యూ అప్టూ..? ఏం చేద్దామని?”
సమాధానం లేదు... వెతకాలి.
వెనక్కి పరుగెత్తే అవకాశం వుందా?
బూటకపు అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి నిజమైన మిడిల్ క్లాస్ లోకి
జనరల్ కంపార్ట్ మెంట్ లో ఖాళీలు వున్నాయా?
గొడ్లచావిడి పక్కన వేపచెట్టు
నులకమంచం మీద పడుకోని వివిధభారతి వింటూ.. అచ్చం మా నాన్న లాగా..
డబ్బులతో సంబంధంలేని అమ్మ చిరునవ్వు దివ్య ముఖంలో విరుస్తుందా?
“ఆలోచనలు ఆపండి సారు.. యూ నీడ్ ఏ బ్రేక్.. ఎక్కడికన్నా వెళ్దామా? గోవా? బ్యాంకాక్..?? నువ్వు కార్పొరేట్ ప్రపంచాన్ని తిట్టుకుంటావు కానీ, చూడు ఫ్యామిలీతో గడపమని పదిరోజుల కంపల్సరీ లీవ్ ఇస్తున్నారు మా ఆఫీస్ లో”
“హ.. హ.. అలా అర్థం అయ్యిందా నీకు... నువ్వు లేకపోయినా కంపెనీ నడవాలని నీకు శెలవ ఇస్తున్నారు... రెప్పొద్దున నీ చేతిలో పింక్ స్లిప్ పెట్టాలనుకున్నప్పుడు వరసలో మరో బలిపశువుని సిద్ధం చేసే మహా మాయ ఇది...”
“యు ఆర్ సిక్ ఐ సే..” దివ్య చిరాకు పడింది.
గోవాకి టికెట్లు బుక్ అయ్యాయి. రెండు నెలల జీతాన్ని క్రెడిట్ కార్డ్ మింగేసింది.
***
తిరిగి వచ్చాక తిరిగి కథ ప్రారంభం.
పరుగు.. పరుగు.. పరుగు...
“ఒక్కసారి ఆగుతాను...” అరిచాను.
“నీకేమన్నా పిచ్చా... ఆగావంటే ముందుకు పడతావు... నువ్వు పరుగెత్తేది ట్రెడ్ మిల్ పైన..”
కిందకి చూసుకున్నాను.
అవును నిజమే.. నెను ఇన్ని రోజుల్నుంచి పరుగెత్తుతున్నది ట్రెడ్ మిల్ మీద. కాదు.. కాదు.. నేను పరుగెత్తడంలేదు.. నా కాళ్ళ కింద బెల్ట్ పరుగెడుతోంది. పడిపోకుండా నిలబడటానికి చేసే ప్రయత్నాన్ని నేను పరుగనుకుంటున్నాను. అలా ఎంత పరుగెత్తినా అక్కడే వుంటాను... ముందుకు తీసుకెళ్ళే పరుగు కాదిది..!!
“దివ్యా.. ఈ ట్రెడ్ మిల్ ఎలా ఆఫ్ చెయ్యాలి?”
“ఆఫ్ బటన్ లేదు దీనికి... ఇంకొంచెం సేపు పరుగెత్తు..”
“అలిసిపోయాను... చెమటలు పడుతున్నాయి.. ఆపేస్తాను.. ప్లీజ్..”
“పరుగెత్తు.. పరుగెత్తు...”
నేను ఆగిపోయాను. ధబ్బున పదిపోయాను. మంచం మీదనుంచి. కల మిగిలిపోయింది.
***
"అనిల్ రిజైన్ చేశాడు." ఆఫీసు మొత్తం గుప్పుమన్న వార్త. 
ఆ పని అనుకున్నంత కష్టమేమీ కాదు. ఆఫీస్ లో కొన్ని కాగితాల మీద సంతకం, నా మెడకు బిగించిన బానిస పతకం ముడి విప్పడం, బరువెక్కి భుజాన కూర్చున్న లాప్ టాప్ ని వదిలించుకోవడం..
తోటి సైనికుడు చనిపోతే కనీసం అటు వైపు చూడనైనా చూడకుండా యుద్ధంలోకి పరుగెత్తే సైనికుల్లా కొలీగ్స్.
అద్దాల మేడలో రాకుమారి వుండదురా అని అరవాలనిపించింది. అంతలోనే అవసరం లేదనిపించింది. ఉపయోగం వుండదనిపించింది.
దివ్యకి మాత్రం కోపం వచ్చింది.
“నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో..” అరిచింది గట్టిగా.
“అదే చేద్దామనుకుంటున్నాను..” చెప్పాను.
“అదే ఏంటది?”
“ఒక కాలేజీలో లెక్చరర్ గా చేరుతున్నాను.. కవిత్వం రాయాలనుకుంటున్నాను... అమృతం కురిసిన రాత్రి వందసార్లు చదవాలనుకుంటున్నాను... పాటగా మళ్ళీ పుట్టాలనుకుంటున్నాను... ఇంకా...”
తీక్షణంగా చూపులతో పొడిచి వెళ్ళిపోయింది.
ఒక్కడినే ఇంట్లో... ఇల్లూ ఒంటరిదే.. మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను.
ఇప్పుడు నేను...
ఆకులు రాలిపోయి ఎండిన చెట్ల మధ్యలో నిలబడి
పచ్చటి వసంతాన్ని ఆవాహన చేస్తున్నాను..

<< ?>>
(ఆదివారం ఆంధ్రజ్యోతి, 24 ఫిబ్రవరి 2013)
Category:

2 వ్యాఖ్య(లు):

రాజ్ కుమార్ చెప్పారు...

ఒక్కటే మాటండీ... "అద్భుత:"

శిశిర చెప్పారు...

ఒక మనసుని చాలా బాగా ఆవిష్కరించారండీ.