మొత్తం పోయింది (సరదా కథ)


మొపాస కథలు: కొత్తసంవత్సరం కానుక

జాక్ దె రాండల్ ఒంటరిగా భోజనం ముగించాడు. బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళమని కారు డ్రైవర్ కి చెప్పాడు. ఆ తరువాత కొన్ని వుత్తరాలు రాయాలన్న ఆలోచన రావడంతో తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
అతను ప్రతి సంవత్సరంలోని ఆఖరు రోజున ఇలాగే రాసుకుంటూ, కలలు కంటూ గడుపుతుంటాడు. నిర్జీవమైపోయిన గత సంవత్సరం మొత్తాన్ని ఓసారి సింహావలోకనం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకాలలో కనిపించిన మిత్రులకు కొన్ని వాక్యాలు రాయడం అతని అలవాటు. ఆ వుత్తరాలని మర్నాడు కొత్త సంవత్సం రోజున వాళ్ళకి అందించేవాడు.
ఇప్పుడు కూడా అలాగే చేద్దామని టేబుల్ ముందు కూర్చోని, సొరుగును బయటకు లాగి, అందులోనుంచి ఓ స్త్రీ ఫొటో బయటికి తీశాడు. ఆ ఫొటో వైపే కొద్ది క్షణాలు చూపు నిలిపి ఆపైన దానికి ముద్దుపెట్టాడు. దాన్ని అక్కడే వున్న పేపర్ల దొంతర పక్కన పెట్టి రాయటం ఆరంభించాడు.
"ప్రియమైన ఐరీన్: నేను మీ పనెమ్మాయి పేరు మీద పంపిన చిరు కానుక ఈ పాటికి నీకు అందే వుంటుంది. నీతో ఓ విషయం చెప్పాలని తలుపులన్నీ బంధించుకోని కూర్చున్నాను.."
ఆ తరువాత రాయడానికి అతని కలం నిరాకరించింది. జాక్యుయస్ లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయడం మొదలుపెట్టాడు.
గత పది నెలలుగా అతని మనసుని ఓ ప్రియురాలు ఆక్రమించింది. నాటకప్రదర్శనకు తోడుగా వస్తూ, ఏదో కాలక్షేపం కబుర్లు చెప్తూ వుండే అందరమ్మాయిల్లాంటి అమ్మాయి కాదు. అతను ప్రేమించి సాధించుకున్న అమ్మాయి. నిజానికి అతనేమీ కుర్రవాడు కాదు. వయసుకూడా ఏం మించిపోలేదు. జీవితాన్ని కేవలం ఆశావాదంతోనే కాకుండా కొంత వాస్తవికంగా కూడా చూడగలిగిన వయసు అతనిది.
అందుచేత, ప్రతి సంవత్సరం చివర్లో అతను, తన జీవితంలోకి వచ్చిన ప్రేమలకీ, కొత్తగా కలిసిన స్నేహాలకీ, ముగిసిపోయిన బంధాలకీ, అలాంటి పరిస్థితులకీ అన్నింటికీ కలిపి ఒక బాలన్స్ షీట్ లాంటి బేరీజు పట్టిక వేసుకుంటాడు.
ఆ క్రమంలో తన ప్రియురాలి మీద వున్న ప్రేమ తాలూకు ఉద్రేకం కాస్త చల్లబడ్డాక, ఈ ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో అని అతని మనసు శంకించింది. తులాలతో తూకం వేసే వ్యాపారిలా ఆమె పట్ల అతని మనసులో వున్న భావనలనీ, ఆమెతో అతని భవిష్యత్తు గురించి క్షుణ్ణంగా అంచనా వేయడం మొదలుపెట్టాడు.
ఆ ప్రయత్నంలో అతని మనసులో వున్న బలమైన భావాన్ని అతను గుర్తించాడు. అతి సున్నితమైన భావాలు నిండిన బలమైన అనుబంధమేదో అప్పటికే పుట్టిందన్న సంగతి గమనించాడు.
ఉన్నట్టుండి మోగిన కాలింగ్ బెల్ అతణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. తలుపు తీయాలా వద్దా అని కాస్త తర్జనభర్జన పడ్డాడు. కొత్త సంవత్సరం ముందురోజు ఏ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపుకొట్టినా తప్పకుండా తీయాలని తనకి తానే నచ్చజెప్పుకున్నాడు.
చేతిలో కొవ్వొత్తి పట్టుకోని ముందుగది దాటుకోని తలుపుల బోల్టు తెరిచి, నాబ్ తిప్పి, వెనక్కి తెరిచాడు. ఎదురుగా అతని ప్రియురాలు. జీవం లేనిదానిలా పాలిపోయిన ముఖంతో గోడకి జారిగిల పడి వుంది.
అతను తడబడ్డాడు.
"ఏంటి? ఏమైంది?"
"ఒక్కడివే వున్నావా?" ఆమె అడిగింది.
"అవును"
"పనివాళ్ళు కూడా లేరా?"
"లేరు"
"నువ్వు బయటికి ఎక్కడికీ వెళ్ళటంలేదా?"
"లేదు"
ఆ ఇంటిని పూర్తిగా తెలిసినదానిలా ఆ అమ్మాయి లోపలికి చొరబడింది. డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టగానే అక్కడే వున్న సోఫాలో కూలబడి ముఖాన్ని చేతుల్లో దాచేసుకోని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
అతను ఆమె కాళ్ళదగ్గర మోకాళ్ళమీద కూర్చోని ఆమె చేతుల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సఫలమయ్యాక ఆమె ముఖాన్ని చూసి అవాక్కయ్యాడు.
"ఐరీన్..? ఐరీన్ ఏమైంది నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగిందో నాకు చెప్పనిదే వూరుకోను." అన్నాడు.
అప్పుడా అమ్మాయి వెక్కిళ్ళు పెడుతూ చిన్నగా గొణిగింది - "ఇంక ఇలా బతకటం నా వల్ల కాదు"
"ఇలా బతకడం అంటే? ఏం చెప్తున్నావు?"
"అవును ఇలా బతకడం నా వల్ల కదు. చాలా సహించాను. ఈ రోజు మధ్యాన్నం కొట్టాడు"
"ఎవరు? నీ మొగుడా?"
"అవును, నా మొగుడే."
"ఓహ్"
అతను విస్తుపోయాడు. ఆమె భర్త అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని అతను కలలో కూడా ఊహించలేదు. ఎలా ఊహిస్తాడు. అతని గురించి వూరందరికీ తెలుసు. బయటికి పెద్దమనిషిలా వుంటాడు, గుర్రాలను ఇష్టపడతాడు, నాటకాల ప్రదర్శనకి తప్పక వెళ్ళేవాడు, కత్తి యుద్ధంలో నిష్ణాణుతుడు... అందరూ అతన్ని అభినందించేవాళ్ళే. మర్యాద కలిగిన ప్రవర్తన, కాస్తో కూస్తో తెలివితేటలు, చదువు అంతగా లేకపోయినా మేధావుల్లా ఆలోచించగల నేర్పు వున్నవాడు. అతని నడత, సంప్రదాయం చూసే అందరూ గౌరవిస్తారు.
బాగా కలిగిన కుటుంబాలలో లాగే అతను కూడా భార్యకి విధేయుడుగానే వున్నటు కనిపించేవాడు. ఆమెకు సంబంధించిన కోరికలు, ఆరోగ్యం, ఆఖరుకు ఆమె బట్టల విషయంలో కూడా అతను ఆందళన ప్రదర్శించేవాడు. అన్నింటినీ మించి ఆమెకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
ఐరీన్ స్నేహితుడిగా జాక్ కి పది మందిలో కూడా ఆమె చేతిని పట్టుకునేంత చనువుంది. మర్యాదస్తుడైన ప్రతి భర్త లాగే ఆమె భర్త కూడా దగ్గరి స్నేహితుడు అలా మెలగడంలో తప్పేమీ లేదనే భావించాడు. అయితే జాక్ కొంతకాలం స్నేహితుడిగా వుండి ఆ తరువాత ప్రేమికుడిగా మారాడు. ఆమె భర్తతో కూడా అనుకూలమైన స్నేహాన్ని కొనసాగించాడు.
ఆ ఇంట్లో తుఫాన్ లాంటి వాతావరణం వుందన్న సంగతి జాక్ ఊహించలేదు. అనుకోని కొత్త విషయం తెలిసి విస్తుపోయాడు.
“అసలు ఎలా జరిగింది? చెప్పు” అడిగాడు.
ఆమె చెప్పడం మొదలుపెట్టింది. పెళ్ళైన నాటి నుంఛి ఆమె జీవితంలో జరిగినవన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. తొలిసారి అకారణంగా మొదలైన అభిప్రాయభేదం నుంచి అది క్రమ క్రమంగా పెరుగుతూ పోయి చివరికి రెండు పరస్పర విరుద్ధమైన స్వభావల మధ్య మిగిలిపోయిన విబేధం దాకా అంతా విషయం చెప్పింది.
ఇక ఆ తరువాక జరిగిన కొట్లాటలు, పైకి కనపడకుండా లోపల లోపలే ఏర్పడ్డ అగాధాలు ఇవన్నీ చెప్పింది. ఆ తరువాత ఆమె భర్త గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టాడట. అనుమానించడం మొదలుపెట్టాడట. చివరికి ఆమెను గాయపరచడానికి కూడా వెనుకాడని స్థితికి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఈర్ష. జాక్ అంటే ఈర్ష.
ఇలాంటి విషయమై ఈ రోజు జరిగిన ఓ గొడవ తరువాత అతను ఆమెను కొట్టాడు.
“నేను తిరిగి అతని దగ్గరకు వెళ్ళను. నీతోనే వుంటాను. నువ్వు ఏం చేసినా సరే.. అక్కడికి మాత్రం వెళ్ళను” అంది స్థిరంగా.
జాక్ ఆమె ముందు ఇద్దరి మోకాళ్ళు తగిలేలా దగ్గరగా కూర్చున్నాడు. ఆమె చేతుల్ని అందుకున్నాడు –
“మై డియర్... నువ్వు ఎంట పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా? మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా వుండదు. నువ్వు నీ భర్తని వదిలి వచ్చేయాలనుకుంటే, అందుకు కారణం అతని తప్పు అయ్యుండాలి. అప్పుడు ఒక స్త్రీగా నీకు ఈ ప్రపంచంలో గౌరవం వుంటుంది”
ఆమె అతని వైపు అసహనంగా చూసింది
“అయితే నన్నేం చెయ్యమంటావు చెప్పు?”
“ఇంటికి తిరిగి వెళ్ళిపో... అతని దగ్గర్నుంచి విడాకులు తీసుకునేదాకా సర్దుకోని వుండు. అది నీకు మర్యాదగా వుంటుంది.”
“నువ్వు నాకు పిరికితనాన్ని సలహాగా ఇస్తున్నావు”
“కాదు.. కాదు.. ఇది తెలివైన సలహా. అందరూ ఒప్పుకునే సలహా. నీకంటూ ఓ పరపతి వుంది. పరువు మర్యాదలు వున్నాయి. స్నేహితులు, బంధువులు... వీరందరితో నువ్వు కాపాడుకోవాల్సిన బాంధవ్యం వుంది. ఆలోచన లేని ఒక్క పనితో వీటన్నింటినీ పోగొట్టుకుంటావా? చెప్పు?”
ఆ మాటలు వింటూనే ఆమె కోపంగా లేచి నిలబడింది.
“నో... నా వల్ల కాదు. ఇక భరించలేను! అంతే.. ఇక ఇంతటితో అంతా అయిపోయింది. అంతే!!” అని ఆమె తన చేతుల్ని ఎదురుగా వున్న ప్రేమికుడి భుజాలపైన వేసింది. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ – “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా”
“ప్రేమిస్తున్నాను”
“నిజంగా.. ఒట్టు?”
“ఒట్టు”
“అయితే నేను నీతోనే వుంటాను”
అతను ఆశ్చర్యపోయడు.
“నాతో వుంటావా? ఈ ఇంట్లో? ఇక్కడ? నీకేమైనా పిచ్చి పట్టిందా.  అలా చేస్తే ఇక ఎప్పటికీ మనం ఒకటి కాలేము. ఇక నిన్ను జ్ఞాపకలలో నుంచి కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిచ్చిగా మాట్లాడకు!”
ఆమె నెమ్మదిగా, నింపాదిగా, సూటిగా మాట్లాడింది. తను మాట్లాడుతున్న మాటల బరువు తెలిసినదానిలా పలికింది.
“చూడు జాక్, వాడు ఇక నిన్ను చూడటానికి వీల్లేదని చెప్పాడు. ఇలా దొంగచాటుగా వచ్చి నిన్ను కలుసుకోవడం నాకేం నచ్చడంలేదు. నా వల్ల కాదు కూడా. రెండే మార్గాలు – నన్ను అందుకుంటావా? వదులుకుంటావా?”
“అలాగైతే డియర్.. ముందు నువ్వు విడాకులు తీసుకో.. నేను నిన్ను పెళ్ళి చేసుకోడానికి సిద్ధమే.”
“అవును సిద్ధమే పెద్ద... ఎప్పడు? ఇంకో రెండు సంవత్సరాలకా? ఎంతో ఓర్పు నిండిన ప్రేమ కదా నీది”
“కొంచెం ఆలోచించు ఐరీన్... నువ్వు ఇక్కడే వుంటే రేపు పొద్దున్నే అతను వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అతని నీ భర్త. అలా చేసేందుకు అతనికి హక్కు వుంది, అధికారం వుంది. చట్టం అతని వైపు వుంటుంది.”
“నన్ను ఇదే ఇంట్లో వుంచుకోమని చెప్పడంలేదు జాక్. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపో... అంతమాత్రం ధైర్యం చేసే ప్రేమ కూడా లేదా నా మీద? అయితే నాదే పొరపాటు అనుకుంటాను.. గుడ్ బై!”
ఆమె వెంటనే వెనక్కి తిరిగి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఆ వేగానికి తేరుకొని ఆమెను అందుకొనే సరికే ఆమె గది బయట వుంది.
“నేను చెప్పేది విను ఐరీన్”
ఆమె వినిపించుకునే ప్రయత్నం చెయ్యకపోగా విడిపించుకునే ప్రయత్నం చేసింది. కళ్ళలో నీళ్ళు ఉబికి వచ్చాయి. తడబడుతూ అరిచింది.
“వదిలేయ్... వద్దు.. నన్ను వదిలేయ్... ఒంటరిగా వదిలేయ్..”
అతను వదల్లేదు. ఆమెను బలవంతంగా కూర్చోబెట్టి, మళ్ళీ మోకాళ్ళమీద ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె చెయ్యదల్చుకున్న పనిలో వున్న తప్పొప్పులనూ, అలా చెయ్యడం వల్ల జరిగే అనర్థాలను అర్థం అయ్యేలా నింపాదిగా వివరించాడు. ఒప్పించాలని విశ్వప్రయత్నం చేశాడు. ఆమెను ఒప్పించేందుకు అవసరమైనా ఏ చిన్న విషయాన్ని కూడా అతను వదిలిపెట్టలేదు. తన ప్రేమని సైతం ఒక ప్రోత్సాహకంలా చూపించి ఒప్పించాలనుకున్నాడు.
ఆమె స్థిరంగా చడీ చప్పుడు చెయ్యని మంచుగడ్డలా వుండిపోయింది. అతను ఆమెను మాట వినిపించుకోమని, తనని నమ్మమనీ, తాను చెప్పే సలహా పాటించామనీ ప్రాధేయపడ్డాడు.
అతను చెప్పడం పూర్తైన తరువాత ఆమె కేవలం ఒకటే మాట అడిగింది -
 “అయిపోయిందా? ఇకనైనా నన్ను వెళ్ళనిస్తావా? నీ చేతులు నా మీద నుంచి తీసేస్తే నేను లేస్తాను”
“ఏంటిది.. ఐరీన్”
“వెళ్ళనిస్తావా లేదా?”
“నీ నిర్ణయంలో ఏ మార్పు లేదా?”
“వెళ్ళనిస్తావా లేదా?”
“ముందు అడిగినదానికి సమాధానం చెప్పు. నువ్వు తీసుకున్న నిర్ణయం... నీ పిచ్చి నిర్ణయం.. నువ్వు తరువాత తరువాత బాధపడటానికి తీసుకున్న ఈ నిర్ణయం... మార్చుకోవా?”
“మార్చుకోను... ఇక వెళ్ళనిస్తావా?”
“అయితే వుండు. నీకు ఈ ఇల్లేమీ కొత్తకాదు. హాయిగా వుండు. రేపు ఉదయం ఎటైనా వెళ్ళిపోదాం”
అయినా ఆమె వినిపించుకోనట్లే లేచి నిలబడి, కరకుగా సమాధానం చెప్పింది –
“వద్దు... ఆ అవకాశం లేదు. నాకు నీ త్యాగాలూ వద్దు, నేనేదో దేవతలాగా నువ్వు భక్తిగా నేను చెప్పింది వినాల్సిన పనిలేదు”
“ఆగు! నేను ఏం చెయ్యాలో అది చేశాను. ఏం చెప్పాలో అది చెప్పాను. ఇక జరిగబోయే పరిణామాలకు నాకు ఎలాంటి బాధ్యత వుండదు. తరువాతెప్పుడో నేను పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు. అయిపోయింది. ఇక నువ్వే చెప్పు. ఏం చెయ్యమంటే అది చేస్తాను.”
ఆమె స్థిమితపడి కూర్చుంది. అతని వైపు చాలా సేపు చూసి ఆ తరువాత శాంతంగా అడగింది –
“అయితే వివరంగా చెప్పు”
“వివరంగా చెప్పాలా? ఏం చెప్పాలి?”
“మొత్తం చెప్పు. నువ్వు నీ నిర్ణయం మార్చుకోడానికి ముందు ఏమేమి ఆలోచించావో అదంతా చెప్పు. అప్పుడు నేను ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాను.”
“నేనేమీ ఆలోచించలేదే.. నువ్వు చేస్తున్నది తప్పని హెచ్చరించాలనుకున్నాను. నువ్వు చెయ్యక తప్పదన్నావు. తప్పనప్పుడు నేను కూడా నీతో కలుస్తానని అన్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను..”
“అంత త్వరగా ఎవరూ నిర్ణయాలు మార్చుకోరు”
“చూడు డియర్, ఇదేదో త్యాగమో, నువ్వంటే భయతోనో భక్తితోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో ఆ రోజే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ప్రేమికుడూ తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఏమిటో తెలుసా? ఒక మగవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ప్రయత్నపూర్వకంగా ప్రేమని గెలుచుకున్నట్లైతే, ఆమెను అందుకున్న క్షణంలో ఓ పవిత్రమైన ఒప్పందం చేసుకున్నట్లుగా భావించాలి. అది అతను తనతోనే చేసుకున్న ఒప్పందం. తన ప్రియురాలితో చేసుకున్న ఒప్పందం. పెళ్ళి కన్నా గొప్పదైన ఒప్పందం.
“పెళ్ళికి సామాజికంగా, చట్టపరంగా ఎంతో విలువ వుండచ్చు. కానీ నా దృష్టిలో దానికి నైతికవిలువేమీ లేదు. ముఖ్యంగా పెళ్ళిళ్లు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఆ విలువకి బద్ధులం కావాల్సిన అవసరం లేదనిపిస్తుంది.”
కాబట్టి కేవలం చట్టపరమైన ఒక బంధంలో మాత్రమే వున్న ఓ స్త్రీకి ఆమె భర్తతో ఏ అనుబంధం లేకుండా, అతన్ని ప్రేమించలేని స్థితిలో వుండే అవకాశం వుంది. అప్పుడు స్వేఛ్ఛగా వున్న ఆ హృదయంతో మరో మనిషి తారసపడవచ్చు. అతనికి కూడా మరే స్త్రీతో బంధం లేని పక్షంలో, వాళ్ళిద్దరూ ఒకరికరుగా వుంటామని నమ్మకంగా చెప్పుకునే మాట, స్వచ్చమైనది అవుతుంది. ఆ మాట చట్టప్రతినిధులముందు జరిగే పెళ్ళిలో పలికే అంగీకారం కన్నా గొప్పదని నా అభిప్రాయం.  నా దృష్టిలో వాళ్ళిద్దరూ మర్యాదస్తులే అయితే వారి సమాగమం, కేవలం మతం ఆమోదించి పవిత్రమైనదిగా భావించే పెళ్ళికన్నా ఎంతో అన్యోన్యమైనది, పరిపూర్ణమైందీ అవుతుంది.
నా ఎదురుగా వున్న ఈ అమ్మాయి అన్నీ వదులుకోడానికి సిద్ధపడుతోంది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమె తన సర్వస్వాన్నీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. తన హృదయం, శరీరం, ఆత్మ, గౌరవం చివరికి జీవితాన్ని కూడా. ఎందుకంటే ఆమె రాబోయే దురవస్థను ముందే ఊహించింది. రాబోయే అన్ని ప్రమాదాలను, విపత్తులను పసిగట్టింది. అందుకే ఒక సాహసం చెయ్యడానికి పూనుకుంది. నిర్భయంగా నిలబడింది. ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడింది. అది తనని చంపాలని చూసే భర్తనైనా సరే, వెలి వేయడానికి సిద్ధపడే సమాజాన్నైనా సరే. అందుకే ఆమె చేసేది దాంపత్యానికి ద్రోహమైనా సరే గౌరవించాలని అనిపించింది. అయినా ఆమె ప్రేమికుడిగా ఆమెను స్వీకరించే ముందు జరగబోయేది ఊహించాల్సిన అవసరం వుందని కూడా అనిపించింది. ఏ అనర్థం జరిగినా అందుకు సిద్ధపడే ధైర్యాన్ని ఆమె ఇవ్వాల్సిన అవసరం వుందని అనిపించింది.
 ఇక ఇంతకన్నా నేను చెప్పాల్సిందేమీ లేదు. నేను ముందు బాధ్యతగా ఆలోచించి, ఒక వివేకమున్న వ్యక్తిగా నిన్ను హెచ్చరించాను. ఇప్పుడు నేను మామూలువాడిని. నిన్ను ప్రేమించేవాడిని. నువ్వు ఎలా చెప్తే అలా.. ఆదేశించు, పాటిస్తాను..”
 మెరుపులా అతని మాటల్ని ముద్దుతో ఆపేసిందామె. లో గొంతులో పలికింది.
 "అదంతా నిజం కాదు డార్లింగ్. అలాంటిదేమీ లేదు. నా భర్తకు ఎలాంటి అనుమానం లేదు. నువ్వు నాకు పంపిన నక్లెస్ కాకుండా మరో బహుమతి కావాలనిపించింది. నీ హృదయాన్నే బహుమతిగా కోరాలనిపించింది. ఇలా అడిగితే నువ్వేమంటావో తెలుసుకోవాలనిపించింది. ఇలా నిన్ను చూడాలనిపించింది. నువ్వు నేను కోరుకున్న బహుమతి ఇచ్చావు. థాంక్స్.. థాంక్స్. నువ్విప్పుడు నాకిచ్చిన ఆనందానికి ఆ భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి."
***

డేగలు తిరిగే ఆకాశం


"వస్తున్నావా లేదా?" అన్నాడు మురుగన్.
"రావట్లేదు" అన్నాడు వెంకట్ స్థిరంగా. అప్పటికి అరగంట నుంచి ఇద్దరి మధ్య వాదన నడుస్తూనే వుంది.
"నీ అంత పిచ్చోణ్ణి నేను ఎక్కడా చూడలేదు... ఏదో కంపెనీ పుణ్యమాని సిడ్నీ చూసే అవకాశం వచ్చింది. ఈ రోజు బ్లూ మౌంటేయిన్స్ తీసుకెళ్తారట. హోటల్లోనే వుంటానంటావేంటి? పిచ్చి కాకపోతే?" మురుగన్ కోప్పడ్డాడు.
"రావాలనిపించట్లేదురా... బాస్‌కి ఏదో ఒకటి చెప్పు" అన్నాడు వెంకట్ బెడ్ మీదనుంచి కదలకుండానే.
మురుగన్ అసహనంగా లేచి, తన బ్యాగ్ తీసుకోని "పైత్యకారన్.." అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
ఆ తరువాత పది నిముషాలసేపు ఏం చెయ్యాలో తెలియనట్టు అలాగే బెడ్ మీద వుండిపోయాడు వెంకట్. క్రమ క్రమంగా అతన్ని ధుఖం కమ్మేసింది.
***
బస్సు బయల్దేరింది. ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ సంవత్సరం అత్యధిక సేల్స్ చేసిన మేనేజర్లందరికీ సిడ్నీ ట్రిప్ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీలో ఒక భాగస్వామి ఆస్ట్రేలియాలో వుండటం వల్ల స్వామి కార్యం స్వ కార్యం అన్నట్లుగా సిడ్నీ ఎన్నుకోబడింది. అందులో భాగంగా రెండో రోజు షేడ్యూల్ మొదలైంది. డ్రైవర్ వెనుకగా నిలబడి, ఇటు వైపు తిరిగి గట్టిగా చెబుతోంది గైడ్ ఇసబెల్లా.
"నిన్న మనం చూసిన సిడ్నీ టవర్ మీ కుడి వైపు కనిపిస్తుంది చూడండి. ఆ టవర్ పైయెత్తున సరిగ్గా నిన్న మనం నిలబడ్డ చోటు నుంచి ఇప్పుడు ఇంకెవరో మనల్ని చూస్తుంటారు.."
ఆమె చెప్పేది ఎవరూ పట్టించుకోవటం లేదు. బస్సంతా కోలాహలంగా వుంది. సేల్స్ వుద్యోగంలో తప్పనిసరి అయిన టెన్షన్లు, ఎడతెరిపి లేని ఫోన్ కాల్స్ లేని మూడు రోజులు అవి. ఆ ఆనందాన్ని ఎంత వీలైతే అంత జుర్రుకునే ప్రయత్నంలో వున్నారంతా. గోల గోలగా అరుస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఆటపట్టిస్తున్నారు. రాత్రంతా తెగ తాగినవాళ్ళు, కింగ్స్ స్ట్రీట్‌లో అందాలని ఆబగా జుర్రుకున్నవాళ్ళు మాత్రం సిటీ దాటక ముందే నిద్రకి ఉపక్రమించారు.
నేషనల్ మేనేజర్ గుర్జీత్ సింగ్ లేచి వచ్చి మురుగన్ పక్కన కూర్చున్నాడు.
"వేర్ ఈజ్ వెంకీ" అడిగాడు.
"రానన్నడు. రాత్రి చాలా సేపు ఏడుస్తూ కూర్చున్నాడు... ఏమైందిడా అంటే చెప్పడు".
"ఏమైనా హెల్త్ ప్రాబ్లం?" అడిగాడు గురు.
"హెల్త్ ఇజ్ పర్ఫెక్ట్... వేరే ఏదో??"
"అతని వైఫ్ డెలివరీకి వుందని చెప్పాడు.."
"ఇంట్లో అంతా ఓకే గురు... ఇక్కడే ఏదో అయ్యింది" చెప్పాదు మురుగన్. ఆ సీట్ వెనకే వున్న సైబు ముందుకు వంగాడు.
"నిన్న బోండాయ్ బీచ్‌లో ఏదో గొడవైందట... అప్పట్నుంచి అలాగే వున్నాడు బాస్." అన్నాడతను. అందరూ గురు అని పిలిచినా అతను మాత్రం బాస్ అనే పిలుస్తాడు. కాకా పట్టడంలో మొదటి రకం.
"బోండాయ్? నేను కూడా వున్నాను కదా? గొడవెక్కడైంది?"
"ఎవరో లోకల్ మనిషితో గొడవైంది సార్..." చెప్పాడు పక్కన ఐల్ సీట్లో వున్న రాథోడ్.
"ఈజ్ ఇట్? అలాంటివి నాకు చెప్పాలి కదా? ఏదైనా ప్రాబ్లం అయితే?" గుర్‌జీత్‌కి తను బాస్ అన్న సంగతితో పాటు, ఆ టూర్లో ఏదైనా తేడా జరిగితే తన పై అధికారుల నుంచి వినాల్సిన మాటలు మనసులో మెదిలాయి.
"నేను చెప్దామనుకున్నాను బాస్.. కానీ పూర్తిగా విషయం తెలియదు కదా అని వూరుకున్నాను. థాంక్ గాడ్. అది పెద్ద ఇష్యూ అయ్యుంటే బాస్‌కి ఎంత చెడ్డపేరు వచ్చేది" అందులో కూడా కాకా పట్టేందుకు అవకాశం వెతుక్కున్నాడు సైబు.
"అసలు ఏం జరిగింది? అప్పుడు అతనితో ఎవరున్నారు?" చుట్టూ చూశాడు గురు.
సైబు ఆఘమేఘాలమీద ముందురోజు సాయంత్రం వెంకీతో ఎవరున్నారో కనుక్కోని అతన్ని తీసుకొచ్చి గురు ముందు ప్రవేశపెట్టాడు. అతని పేరు జిగ్నేష్ పటేల్.
"క్యా హువారే?" అడిగాడు గురు. జిగ్నేష్ చెప్పడం మొదలుపెట్టాడు.
***
సిడ్నీలో మొదటి రోజు. సిడ్నీ టవర్, ఒపేరా హౌస్ చూసి సాయంత్రంగా బోండాయ్ బీచ్ కి చేరుకున్నారు.
దిగుతూనే చుట్టూ చూశాడు వెంకీ.
"ఇదేనా బోండీ బీచ్?” అందరూ పకపక నవ్వారు.
"బోండీ కాదు బోండాయ్ అనాలి" అన్నారెవరో. అదే అదనుగా అందరూ వెంకీని ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఇంగ్లీషు స్పెల్లింగ్‌ని (Bondi) బట్టి పలికిన వెంకీ అలా ఎందుకు పలకాలో తెలుసుకోలేకపోయాడు. అడిగితే ఇంకా వెటకారం చేస్తారని మాట్లాడకుండా ఇసుకలో అడుగులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అందరూ కుడి వైపుకి వెళ్తే అతను మాత్రం ఎడమ వైపుకి వెళ్ళాడు.
బీచ్ మొత్తం కోలాహలంగా వుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టూరిస్ట్ లు, సిడ్నీలో వుండే కుటుంబాలు, సర్ఫింగ్ చేసేవాళ్ళు సందడిగా వుంది. అవన్నీ చూడగానే వెంకీకి సూర్యలంక బీచ్ గుర్తొచ్చింది. అక్కడ ఇంత శుభ్రతలేదు. ఇంతమంది జనంలేదు. అయితే వుండే కాస్త జనం వంటినిండా బట్టలతో కనిపిస్తారు. ఇక్కడ అలా కాదు. అన్నీ వుండీ లేనట్టుండే కురచ దుస్తులే. నవ్వుకున్నాడు.
తనతో తెచ్చుకున్న బ్యాగ్లో నుంచి హ్యాండీక్యామ్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టాడు. జిగ్నేష్ అటుపక్కనించి పోతూ - "తీయ్.. తీయ్.. ఫేషన్ షో లాగుంది.." అన్నాడు నవ్వుతూ.
"ఛ.. ఛ.. నేను వాళ్ళని తీయటంలేదు భాయ్... వాళ్ళకి లేకపోయినా నాకుంది సిగ్గు.." అన్నాడు నిజాయితీగా. జిగ్నేష్ నమ్మలేదు సరికదా కన్నుకొట్టి ముందుకెళ్ళిపోయాడు.
ముందు దూరంగా వున్న ఓడల్ని, పైన ఎగురుతున్న పక్షులని తీశాడు. అల్లలనీ, ఇసకనీ తీస్తూ ముందుకు సాగాడు. అక్కడక్కడా సర్ఫిగ్ చేస్తున్నవాళ్ళని తీశాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తరువాత ఒక పక్కగా ఆడుకుంటున్న పిల్లల్ని చూశాడు. వాళ్ళ ఆటని గమనిస్తూ వీడియో తీయడం మొదలుపెట్టాడు.
అందులో ఒక ఐదారేళ్ళ పిల్ల వుంది. స్విమ్మింగ్ దుస్తులు వేసుకోని అటూ ఇటూ పరుగెడుతోంది. ఇసుకని చిన్న చేటలాంటి ఆట వస్తువుతో ఎత్తి ఒక కుప్పగా పోసింది. చిన్న ప్లాస్టిక్ బక్కెట్ లాంటి బొమ్మతో సముద్రం దగ్గరకి పరిగెట్టింది. దాంతో కాసిని నీళ్ళు తీసుకొచ్చి ఆ ఇసకలో పోసింది. సరిపడా తడి వుండని నిర్థారించుకోని కూర్చోని ఆ ఇసకతో చిన్న కోటలాంటిది కడుతోంది. మళ్ళీ తడి అవసరం అయితే నీళ్ళదగ్గరకి పరిగెత్తడం, ఇసకని తడపడం, కోట కట్టడం. ఇలా సాగుతోందా ఆట. ఇదంతా ఎంతో ఆసక్తితో వీడియో తీస్తూ వున్నాడు వెంకి. ఆ కోటకి కొంచెం అవతలగా వున్న వాళ్ళమ్మ ముచ్చటపడుతూ సూచనలు ఇస్తోంది. మధ్య మధ్యలో ఆవిడ వీడియోకి అడ్డం వస్తుంటే తీయడం ఆపేస్తున్నాడతను. ఆమె టూపీస్ బికినీ వేసుకోని వుంది. అలాంటి దుస్తుల్లో ఆమెను వీడియో తీయటం సభ్యత కాదని ఆమె పక్కకి తొలగేదాకా ఆగి కొనసాగిస్తున్నాడు.
కొంత సేపటికి ఆమె సముద్రం వున్న వైపుకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి వెనక నుంచి ఎవరో వచ్చి భుజం మీద చెయ్యేశారు. చటుక్కున తిరిగి చూస్తే ఎవరో ఆ ప్రాంతపు మనిషిలాగున్నాడు.
"వాట్ ద హెక్ ఆర్ యూ డూయింగ్" అన్నాడు
"వీడియో.. వీడియో" అన్నడు వెంకీ ఖంగారుగా.
"షీ ఈజ్ మై డాటర్.." అన్నాడతను కోపంగా.
"ఓహ్.. షీ ఇస్ వెరీ నైస్.."
"నైస్.. యూ సే నైస్... యూ నో వాట్.. దిస్ ఇజ్ డిస్‌గస్టింగ్" అంటూ అసభ్యమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. తాను చేసిన తప్పేమిటో తెలియక ఖంగారుగా నిలబడిపోయాడు వెంకీ. ఆ పిల్ల తల్లి కూడా వచ్చి నిలబడింది.
"నేను చెప్పానా? ఇందాకటి నుంచి తీస్తూనే వున్నాడు" అంది ఆమె ఇంగ్లీష్‌లో. తండ్రి కోపంతో ఊగిపోయాడు. కెమెరా లాక్కోవాలని ప్రయత్నం చేశాడు. ఒకటి రెండు దెబ్బలు కూడా పడ్డాయి.
వెంకీకి కాళ్ళూ చేతులు చల్లబడిపోయాయి. ఏం చెయ్యాలో అర్థంకాక బిక్కచచ్చిపోయాడు. ఎవరో, ఎమిటో తెలియని ప్రాంతం. భాషా అంతత మాత్రమే వచ్చు. ఇప్పుడేమిట్రా భగవంతుడా అని అనుకుంటుండగానే జిగ్నేష్ వచ్చాడు. ముందు అవతలి వ్యక్తి నుంచి వెంకీని దూరంగా జరిపి మధ్యలో నిలబడ్డాడు. విషయం అడిగి పరిష్కరించాలని ప్రయత్నం చేశాడు. ఆ ఆస్ట్రేలియన్ ఏమాత్రం వినే పరిస్థితిలో లేడు. అసభ్యంగా తిడుతూ ముందుకు దూకుతున్నాడు. సమయానికి టూరిస్ట్ గైడ్ ఇసబెల్లా వచ్చి అతనికి సర్ది చెప్పింది. వెంకీ దగ్గర కెమెరా తీసుకోని అతన్ని దూరంగా పంపించేశారు. వెంకీ పదడుగులు అవతలికి వెళ్ళి నిలబడి జరిగేది చూస్తూ వుండిపోయాడు. ఇసబెల్లా ఆ ఆస్ట్రేలియన్‌కి కెమెరాలో వీడియోలు చూపించి, అవన్నీ డిలీట్ చేసింది. వెంకీ తరఫున ఆమె, జిగ్నేష్ సారీ చెప్పి వచ్చేశారు.
"ఎంటండీ...? అంత గోల చేశాడు. బట్టలిప్పుకోని తిరుగుతున్నా వాడి పెళ్ళాన్ని నేను వీడియో తియ్యలేదే" అడిగాడు వెంకీ.
"వాళ్ళ ఆవిడని తీసినా ఇంత ఫీల్ అయ్యేవాడు కాదు..." అంది ఇసబెల్లా బస్ వైపు నడుస్తూ. అమె వెనకే నడుస్తున్నాడు వెంకీ. "అదేంటి?" అన్నాడు ఆశ్చర్యంగా.
“ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వుండాలి... అతనికి మీ మీద అనుమానం కలిగినట్టుంది..”
 "ఏమని?"
"మీరు పీడోఫైల్ అని..."
ఒక్కసారి నిలబడిపొయాడు. సముద్రపు హోరు తప్ప ఇంకేం వినపడలేదు వెంకీకి.
పీడోఫైల్.. పీడోఫై... ఛ.. ఛ.. చిన్నపిల్లలను కామించి, రమించే పీడో... ఒక్కసారిగా కదిలిపోయాడు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇసబెల్లాకి విషయం అర్థం అయ్యింది.
“ఇట్స్ ఓకే... ఇక్కడ ఆ సమస్య వుంది కాబట్టి...”
"నిజం చెప్తున్నాను ఇసబెల్లా... ఇంటి దగ్గర నాకూ కూతురుంది. దానికి చూపించాలనే తీశాను కానీ.. " చెప్పలేకపోయడు. ధారగా కన్నీళ్ళు వస్తుంటే చేతులు అడ్డం పెట్టుకోని బస్ ఎక్కేశాడు.
***
"అది గురు జరిగింది. అప్పట్నుంచి చాలా బాధపడుతున్నాడు." చెప్పాడు జిగ్నేష్.
"డామ్ ఇట్.. పాపం ఎంత ఇన్సల్ట్ కదా.." అన్నాడు గురు.
"తన తప్పు లేకపోయినా అలా అందరి ముందు అంటే ఎవరికైనా బాధే కదా?" రాథోడ్ అన్నాడు.
“ఎండ్ హీ ఈజ్ సో సెన్సిటివ్..”
"అవన్నీ కాదు... మనోడు అసలే భయస్తుడు. ఎవరూ తెలియని చోట ఒక్కడైపోయి తన్నులు తినేసరికి కాళ్ళు చేతులు వణికేసి వుంటాయి.." అన్నాడు శుక్లా.
"పీడోఫిలీ అన్నారుగా.. అందుకు బాగా ఫీల్ అయ్యుంటాడు" గురు మళ్ళీ అన్నాడు
"కరెక్ట్ బాస్.." వంత పాడాడు సైబు.
"మనం వెనక్కి వెళ్ళిపోయిన తరువాత ఒకసారి అతన్ని నా దగ్గరకు రమ్మనమని చెప్పండి. మాట్లాడతాను." అన్నాడు గురు.
"ష్యూర్ ష్యూర్" తల వంచి అన్నాడు మురుగన్. అంత చిన్న విషయానికి రాత్రంతా ఎందుకు కూర్చోని ఏడ్చాడో మాత్రం అర్థం కాలేదు.
బస్సు ముందుకి సాగిపోయింది.
వాళ్ళంతా తిరిగి వచ్చేసరికి రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు హోటల్ రూముల్లో పడి నిద్రపోయారు. మురుగన్ రూమ్ లోకి వచ్చేసరికి వెంకీ నిద్రపోతున్నాదు. అతన్ని డిస్టర్బ్ చెయ్యకుండా మురుగన్ కూడా పడుకున్నాడు. మరో రెండు నిముషాలు ఆగి వుంటే వెంకీ నిద్రపోవటం లేదని తెలిసుండేదేమో.
ఉదయాన్నే ఏడున్నరకి రూంలో ఫోన్ మోగింది. వెంకీనే ఎత్తాడు.
"నేను గురు.."
"చెప్పండి.."
"ఇంకో అరగంటలో కిందకి వస్తారా? కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం.."
"అది కాదు గురు.."
"డోంట్ సే ఎనీథింగ్... రెస్టారెంట్ బయట లాబీలో వుంటాను." చెప్పి పెట్టేశాడతను. ఇక తప్పదని లేచాడు.
"ముందురోజు బ్లూ మౌంటైన్స్ చూడటానికి ఎందుకు రాలేదని అడుగుతాడు." అనుకుంటూ త్వరగా తయారై కిందకు వెళ్ళాడు.
***
“సో... టెల్ మీ... హౌ ఆర్ యూ..” అడిగాడు గురు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర.
“ఏముంటాయ్.. ఏమీ లేవు..” అతనికి తెలుసు ప్రారంభం అలాగే వుంటుందని. రెస్టారెంట్ లో చాలా తక్కువమంది వున్నారు. మంద్రంగా అబోరిజినల్స్ కి సంబంధించిన సంగీతం వినిపిస్తోంది.
“ఇంట్లో అంతా బాగున్నారా? ఐ హర్డ్.. మీ వైఫ్ ప్రగ్నెంట్ కదా?”
“అవును గురు.. సెకండ్ టైమ్...” గురు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో “ఫస్ట్ పాప..” అని కొనసాగించాడు.
“ఐసీ..” గురు ఆ విషయాన్ని కదపడానికి తడబడ్డాడు.
“నిన్న నాకు హెల్త్ బాగలేదు గురు... లేకపోతే బ్లూ మౌంటెయిన్స్ చూసే అవకాశం వదులుకుంటానా? సారీ...” అన్నాడు వెంకీ కాస్త చొరవగా.
“నో.. నో.. నో... అందుకు కాదు నిన్ను పిలిచింది. దట్స్ ఓకే యార్..” సర్దుకున్నాడు గురు. మళ్ళీ ఓ నిమిషం మౌనం. తర్వాత మళ్ళీ అందుకున్నాడు –
“వెంకీ.. ఏక్చువల్లీ.. నీకో శుభవార్త చెప్పాలి... నీ ఫర్ఫామెన్స్ మన పార్టనర్స్ కి బాగా నచ్చింది. నీ లాంటి టేలంటడ్ మనిషి ఇండియాలో కాదు, ఇక్కడ ఆస్ట్రేలియాలో వుండాలని అంటున్నారు. నేను కూడా స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాను. ఇంక నువ్వు ప్లాన్ చేసుకోని వచ్చేయడమే. కంగ్రాట్స్.”
“సారీ గురూ.. ఐ కాంట్ ఏక్సెప్ట్...” గురు వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు వెంకీ.
“వెంకీ, ఏమైంది మీకు? ఇక్కడ పని చేసే అవకాశం ఎంత గొప్పదో తెలుసా? మన కంపెనీలో సగం పైనే ఆస్ట్రేలియాలో మన పార్టనర్ దగ్గర పని చేయాలని కోరుకుంటారు. అలాంటిది... ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఇంత పెద్ద కెరీర్ ఆపర్చునిటీ వదులుకుంటావా?” మందలించే ధోరణిలో అడిగాడు గురు. బోండాయ్ బీచ్ లో జరిగిన సంఘటన గురు దాకా చేరే వుంటుందని వెంకీ ఊహించేవున్నాడు.
“కారణం అది కాదు గురు..” అన్నాడు.
“మరింకేంటి? చూడు వెంకీ.. ఐ నో యు ఆర్ ఎ వెరీ సెన్సిటివ్ గయ్... పెయింటింగ్స్ అవీ వేస్తావు.. ఆర్టిస్ట్ కదా మీరు?”
“అవును.”
“సీ.. అలాంటి ఆర్టిస్ట్ లు ఇలాగే సెన్సిటివ్ గా వుంటారు... వాడెవడో మీ గురించి ఏదో తప్పుగా అనుకున్నాడు... హూ కేర్స్? వాడు అనుకున్నంతమాత్రాన మీరు చెడ్డావాళ్ళు అయిపోరు కదా? గెటింగ్ మై పాయింట్?” గురు వెంకీని ఎలాగైనా ఒప్పించాలన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు.
“అది కాదు గురు.. అతనెవరో నా గురించి చెడుగా అనుకున్నందుకు కాదు నేను బాధపడేది.”
“మరి? అంత మందిలో నిన్ను కొట్టాడని ఇన్సల్ట్ గా...” అతని వాక్యం పూర్తి కాకుండానే అందుకున్నాడు వెంకీ.
“నో... నో... అదేం కాదు?”
“మరి?”
వెంకి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచనలన్నీ కూడగట్టుకుంటున్నట్లు కొద్దిసేపు మౌనంగా వుండి చెప్పసాగాడు.
“గురు.. నిజానికి నేను బాధపడ్డది నా గురించి కాదు. మనకీ వాళ్ళకి కల్చర్ లో తేడాలు వుంటాయి. అవి అర్థం చేసుకోకపోవటం నా తప్పే. కానీ నేను ఎక్కువ బాధపడుతున్నది ఆ ఆస్ట్రేలియన్ గురింఛే..”
“వాట్? వై సో..?” ఏం ఆడగాలో తడబడ్డాడు గురు.
“అతను నన్ను చూసి అనుమానించాడు అంటే తన కూతురిని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే కదా? అలా కూతురిని అనుక్షణం భయంతో కాపాడుకోవాల్సిన అవసరం అతనికి కలిగినందుకు బాధపడుతున్నాను. ఇలాంటివి మనదగ్గర లేవని కాదు కానీ, ఇక్కడ అలాంటి సంఘటనలు ఎన్ని జరిగివుంటే అతనికి ఇంత ఆందోళన కలిగివుంటుంది? డేగలు తిరిగే ఆకాశం కింద వున్నప్పుడే కదా కోడికి తన పిల్లల్ని రక్కల కింద దాచుకోవాల్సిన అవసరం. అది తలుచుకోని అతని మీద జాలి కలిగిందే తప్ప కోపం రాలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకీ రాకూడదని దేవుణ్ణి కోరుకుంటూ ఏడుస్తున్నాను...” అతని గొంతు పూడుకుపోయింది. “సారీ..” అని చెప్తూ లేవబోయాడు.
“ఐ కెన్ అండర్స్టాండ్..” అన్నాడు గురు. కానీ ఈ కొత్త కోణం పూర్తిగా అతనికి అర్థం కాలేదు. వెళ్ళిపోతున్న వెంకీని పిలిచాడు – “కారణం అది కాకపోతే నువ్వు ఆస్ట్రేలియా పోస్టింగ్ ఎందుకు వద్దంటున్నావు?” అడిగాడు.
“కొంత వరకూ ఈ సంఘటన కూడా కారణమే... సారీ బట్... నాకూ ఓ కూతురుంది..” చెప్పి వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయడు వెంకీ.

<< ?>>

(ఆదివారం ఆంధ్రజ్యోతి 26 జనవరి 2014)