ఏడో చేప (కథ)


మా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా ఇంగ కథలకు కొరతేముందా?. మొన్న పండగకని నెల్లూరు పోయున్నానా అప్పుడు ఇట్టాగే ఓ పూట కుదిరింది.

రేయ్ నర్సిమ్మానీకో కత చెప్తాగానా అది నువ్వు రాసి పత్రికకైనా పంపాల్రా..” అన్నాడు.

అట్నేలే మామా.. ముందు కథ చెప్పుఅన్నా. ప్లాస్టిక్ గ్లాసు కడాకు లేపి గుటకేసి, నాలిక బయటికి చాపిహా..” అని ఆమేన మొదలెట్టాడు.

అనగనగనగా హైదరాబాదు అమీర్ పేట్ లో బాయిస్ హాస్టల్ ఉండాది. రాజుగోరి ఏడు చేపల్లాగ అందులో ఏడుగ్గురు పిలకాయలు ఉండారు..”

నేను ఆమంతనే ఆపినా. “ఏంది మామా కథంటే ఇట్టానేనా మొదలెట్టేది? మరీ చిన్నపిల్లల కథలాగుందేఅనిన.

సరే అయితే సారి తిరగేసి చెప్తాలే గానీ నువ్వు మధ్యలో ఆపబాకఅంటూ ముందరే నా నోటికి తాళం వేసి మళ్ళీ మొదలుపెట్టినాడు.

పోయినసారి రొట్టెలపండగ టైములో హైదరాబాద్ లో వెంగళ్రావునగర్ దగ్గర ఒక ఇసిత్రం జరిగింది. ఆక్కడ్నే ఒక చిన్న సందులో, రేత్రిపూట చీకట్లో ఎవరో ఆడకూతురు పోతావుంణ్ణింది. రైయ్యి మంటా ఇద్దరు పిలకాయలు బండేసుకోని పోతా పోతా ఆయమ్మి మెళ్ళో దండ, పుస్తెలతాడు పుట్టుక్కున తెంచి నూక్కబోయారు.. యమ్మి లబోదిబోమంటా పోలీసు స్టేషన్ కి వచ్చింది. మా వోళ్ళు అవీ ఇవీ కొచ్చెన్లేసి, ఆడా ఈడ తచ్చాడి చివరికి వల్లగాదని చేతులెత్తేశారు. పొద్దుకి సరిగ్గా మూడు రోజుల పోయినాక ఇక్కడ నెల్లూరు చిన్నబజారులో ఎవుడో దొంగసరుకు అమ్మతన్నాడని నాకు తెలిసింది. పొయ్యి జూస్తే చైను, పుస్తెలతాడు. అవి అమ్మతావున్న పిలకాయల్ని తీసకపోయి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగితే వెంగళ్రావునగర్లో ఆయమ్మి మెళ్ళోంచి లాక్కోబోయింది మేమేనని ఒప్పుకున్నారు.

హైదరాబాదు అమీర్ పేట హాస్టల్లో వుండారని చెప్పానే.. ఏడు చేపల్లాగ.. ఏడు చేపల్లో చేపగాడు కూడా వున్నాడు. ఏం చదువుకున్నావురా అంటే ఇంజనీరన్నాడు. నేను బిత్తరపొయినా.

చేపా చేపా ఇంజనీరింగు చదివి దొంగతనం ఎందుకు చేశావే? అని అడిగా. అప్పుడు వాడు భోరుమని కాలుగంట ఏడ్చి విషయం చెప్పకొచ్చినాడు.

సార్మూడు సంవత్సరాలు అయ్యిందిసార్అల్లూరు నుంచి హైదరాబాద్ పొయ్యి. ఒక ఏడాది పొడవతా మా నాయన డబ్బులు పంపినాడు. తరువాత నీ బతుకేదో నువ్వే బతకరా ఎదవా అన్నాడురెండేళ్ళు నేను చెయ్యని పని లేదు సార్కాల్ సెంటర్లో పనిచేశా, కోచింగ్ సెంటర్లో చెప్పా, చిన్నచిన్న పిలకాయల ఇస్కూల్లో అయ్యోరిలెక్క చదువులు కూడా చెప్పినా సార్డబ్బులు జాలక పని చేశాను సార్..” అంటా మళ్ళా ఏడుపెత్తుకున్నాడు. సరే వాళ్ళ నాయనతో మాట్లాడదాలెమ్మనుకున్నా..

నాయనా నాయనా కన్న కొడుకుగదంటయ్యా? ఏమంట డబ్బులు పంపించేదానికి?” అని అడిగా

ఎందాకని పంపించేది సామీనెల నెల నాలుగైదువేలంటే ఎట్టోకొట్ట తెచ్చి పోస్తిని. నా కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం ఊడపెరుకుతానని చెప్పి నా ఇల్లు తనకా పెట్టి రెండు లక్షలు గుంజకపోయినాడు. అయన్నీ లెక్క అజం లేకుండా పాయ.. మళ్ళా డబ్బులంటే యాడ తెచ్చేది సామీ…” అన్నాడు.

వొరెవొరెవొరె.. ఇదేదో తిరగొట్టిన బంతిలాగా మళ్ళీ పిల్లోడి దగ్గరికే వచ్చిందే అని మళ్ళా చేప పిల్లోడి దగ్గరకే పొయినా.,.

“ఏమిరా చేపపిల్లోడా మీ నాయన దగ్గర రెండు లక్షలు గుంజకపోయినావంటనే? అయ్యన్నీ ఏం జేసినా?” అని అడిగా. ఆ పిలకాయ మళ్ళీ ఓ కాలుగంట ఏడస్తావుణ్ణేడు. ఆమేన అసలు జరిగిందేందో చెప్పకొచ్చినాడు.

“సార్ నిజమే సార్. రెండు లక్షలరూపాయలు తెచ్చింది నిజమే. ఎందుకు తెచ్చినానో తెలుసా? మాదాపూర్లో క్యూజెడ్ టెక్నాలజీస్ అని ఓ కంపెనీ వుంది. రెండు లక్షలు జమ జేస్తే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వుద్యోగం ఇస్తామన్నారు సార్. నేను మాములుగైతే నమ్మేవాణ్ణి కాదు సార్.. నాతో పాటు వున్న ఆరుగ్గురిలో నలుగురు అట్టానే వుద్యోగానికి కుదురుకున్నారు. పెద్ద బ్యాంకులో సాలరీ అకౌంట్ తెరిపించారు. నెలాఖరున ఖంగు మని మొబైల్ మోగింది. పాతికవేలు సార్.. జీతం. మా ఆరుగ్గురు చేపలకీ కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా రాద్సార్. అట్టాంటి ఎండు చేపగాళ్ళకే వస్తే నాకెందుకు రాదు? ఎట్లాగైనా అదే కంపెనీలో చేరాలనుకున్నాను సార్...”
ఆ పిలగాడు ఇట్టా చెబతావుంటే మధ్యలో ఆపినాను నేను.

“ఒరే అబ్బిగాడా... ఏదైనా వుద్యోగంలో చేరే ముందు మంచి చెడ్డా, ముందు ఎనక చూసుకోబళ్ళేదా? ఎవుడో అత్తరబిత్తరగాడు కంపెనీ పెడితే వాడి ఎదాన రెండులక్షలు ఎట్టా పెట్టావు?” అన్నా. దానికి ఆ పిల్లకాయ –

“సార్.. ఎట్టాగైనా వుద్యోగం సంపాదించాలి సార్. బ్యాక్ డోర్ కూడా ట్రై చేశా. ఫేకులు పెట్టి చూశా. ఏదీ కుదర్లేదు. చివరాకరికి రెండు లక్షలు ఇచ్చైనా వుద్యోగం తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పటికీ ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. నా హాస్టల్లో నాతోపాటే వున్న ఆరుగురు చేపగాళ్ళలో నలుగురు అక్కడే పంజేస్తున్నారు కదా. హైటేక్ సిటీకి పొయ్యి మరీ ఆళ్ళ ఆఫీసు చూసొచ్చినా. ఏసీ గదులు, పట్టపగల్లా మెరిసిపోయే లైట్లు, గుండ్రంగా తిరిగే సీట్లు, ఒకటే జనం అటూ ఇటూ తిరగతా.. అబ్బో గొలగమూడి తిరణాలేసార్.. అదంతా చూసేకొద్ది నాకు అందులో ఎలాగైనా చేరాలనిపించింది. నాయన సంగతి తెలిసి కూడా వేధించి డబ్బులు తెచ్చుకున్న. ఉద్యోగంలో చేరినాక నెలనెలా డబ్బులు చేర్చిపెట్టి నాయనకి ఇద్దామనే అనుకున్నా. నాకేం తెలిసు నా లాంటి వాళ్ళని ముఫై మందిని మోసం చేసి బోర్డు తిప్పేస్తాడని.” అన్నాడు.

“బోర్డు తిప్పేశాడా?” అని ఆశ్చర్యపోయా

“అవున్సార్.. డబ్బులు తీసుకోని రసీదు కూడా ఇచ్చారు. రెండు రోజుల్లో వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోమని చెప్పారు. వెళ్ళేసరికి ఎవరూ లేరు. ఏసీ గదులు, లైట్లు, సీట్లు అన్నీ వున్నాయి కానీ మనుషులే లేరు” అంటా మళ్ళీ ఓ కాలుగంట ఏడ్చాడా పిల్లకాయ.

ఇవరం కనుక్కుంటే ఆ కంపెనీ మొదలెట్టినోడు జైల్లోనే వున్నాడని తెలిసింది. ఇట్టగాదులెమ్మని నేను వాడి దగ్గరకు పొయినా – “కంపెనీ బాబు కంపెనీ బాబూ ఎందుకు బోర్డు తిప్పేశా?” అన్నా  -

వాడు దిగాలుగా జైలు పైకప్పు వైపు చూసి పొడుగ్గా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టినాడు.

“సార్.. కంపెనీ పెట్టింది నిజమే. డబ్బులు తీసుకుంది కూడా నిజమే సార్. మాకు ఓ అమెరికా కంపెనీతో టైఅప్ సార్. వాళ్ళకి పని చేసిపెట్టే మనుషులు కావాల్సార్. మన దగ్గర జనాన్ని చూపిస్తే వాడికి సరిపోలా. అందుకని కొంత మంది పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దాంట్లో చేర్పించమని వాళ్ళే చెప్పారు. మన మైత్రీవనంలో ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి తూ అంటే తా రాని ప్రతివాడికి ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇన్ని చేసినా ఆ అమెరికావాడికి కావల్సినట్టు తయారు చెయ్యలేకపోయాము”

“ఒరేనాయనా.. నాకేం అర్థం కావడంల్యా... కావాల్సినట్లు తయారు చేసేదేందియా? ఇదేమన్నా రాధామాధవ్ సెంటర్లో దోసెల బండా ఎట్టా కావాల్నంటే అట్టా తయారు చేసేదానికా?” అన్నాను

“అట్టాకాదు సార్... అమెరికాలో వుండే వాళ్ళు అన్ని పనులు చేసుకోరు సార్. ముఖ్యమైన పనులన్నీ వాళ్ళు చేసుకోని, పనికిరాని పనులన్నీ పరాయిదేశాల వాళ్ళకి చేసి పెట్టమని పడేస్తారు. ఇక్కడైతే రోజు కూలీ తక్కువని అట్లా చేస్తారు. అట్టా మా ముఖాన కూడా ఓ పని పడేశారు. కోవా అని ప్రోగ్రామింగ్ చెయ్యాలి. కానీ ఆ పని చెయ్యాలంటే ఎంతో కొంత కోవా తెలిసుండాలి కదా... మన దగ్గర అది తెలిసినోళ్ళు బాగా పెద్ద పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు. మా దగ్గర పని చెయ్యడానికి ఎవరూ రాలేదు. అందుకని అమీర్ పేటలో హాస్టళ్ళల్లో వుండే పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి, పని నేర్పించి వాళ్ళ చేత పని చేయించుకుందాం అని అనుకున్నాను. తీరా చూస్తే ఒక్కడంటే ఒక్కడికి అక్షరం ముక్క రాదు. పేరుకేమో ఇంజనీర్లు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అమెరికా వాడికి నచ్చలేదు. కాంట్రాక్ట్ కేన్సిల్ అన్నాడు. ఏం చేసేది సార్.. ఈ చదువురాని ఇంజనీర్లతో... ఇట్టాంటోళ్ళకి ఇంజనీరింగ్ పట్టా ఇచ్చిన కాలేజీ వాళ్ళని చంపినా పాపంలేదు..” అంటూ అక్కసంతా కక్కాడు.

కథ కాలేజీలకి మారింది. సరే అట్టనే కానీ అని ఓ కాలేజి డైరెక్టర్ ని పట్టుకున్నా.

“డైరెక్టరా డైరెక్టరా... హైదరాబాదులో ఓ చేప చైన్ స్నాచింగ్ చేసింది. అదేమంటే ఉద్యోగం పేరుతో ఎవడో మోసజేడంట. ఆణ్ణి ఎందుకు మోసంజేశావురా అంటే ఆయబ్బి కాలేజీలలో చదువు చెప్పకపోతే నేనేం చేసేది అంటన్నాడు. ఏమబ్బా.. కాలేజీ పెట్టినాడివి చదువులు జెప్పేదానికేమి రిమ్మతెగులు?” అంటా తెగేసి అడిగినా.
ఆ డైరెక్టరు అటూ ఇటూ చూసి, బోరుమంటా ఏడ్సినాడు. టై ఎత్తి ముక్కు చీదినాడు.

“నీ పాసుగోల ఇందేందయ్యా ఇట్టాగ ఏడస్తన్నావా?” అని మళ్ళీ అడిగా. ఆయన నిదానించి చెప్పడం మొదలు పెట్టినాడు.

“అయ్యా... ఏం చెప్పేది మా ఖర్మ. “హైదరాబాద్ కి పొయ్యి గట్టిగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలనుకుంటున్నామహో” అని అరిస్తే చాలు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. సర్లే అట్లాగే కానీ లెమ్మని కాలేజీ తెరిచాము. తీరా చూస్తే మా ఇంటెనక రెండు కాలేజీలకు, మా కాలేజి ముందు మూడు కాలేజీలకు పర్మిషన్లు వున్నాయి. ఊరు మొత్తం వైన్ షాపులు, ఇంజనీరింగ్ కాలేజీలే పుట్టగొడుగుల్లా వీధికి రెండు చొప్పున వున్నాయి. ఇట్టాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో మేమూ అదే చేశాం..”

“ఏందది” అన్నా

“మా కాలేజీలో చేరినవారికి ఒక లేప్ టాప్ ఫ్రీ అన్నాము, ముగ్గురు చేరారు. పుస్తకాలు ఫ్రీ అన్నాం, ఇంకో ఆరుగ్గురు చేరారు. కేంపస్ ప్లేస్ మెంట్ అన్నాం ఇంకో ఇద్దరు చేరారు. ఇక లాభంలేదని మొదటి సంవత్సరం ఫ్రీ అన్నాం... అప్పుడు జనం ఓ ఇరవైమంది వచ్చారు. వాళ్ళతో కాలేజీ మొదలెట్టాము..”

“ఫ్రీగా చదువులు చెప్పావా? మా గొప్ప పని చేశావే” అన్నాను నేను.

“గొప్పా పాడా... చేరినవాడు మొదటి సంవత్సరం చదవటం ఆయిపోగానే గవర్నమెంటు ఫీజు మొత్తం తిరిగి ఇచ్చేస్తానంది. అదే ఫ్రీ..”

“ఏదో ఒకటి. మంచిదే కదా” అనబోయా.

“ఊరుకోండి సార్.. మీకేం తెలియట్లేదు. అట్టా చేరిన పిల్లలు అందరు కలిసి మాట్లాడుకున్నారు. - మనం పాస్ అయితే తప్ప కాలేజీకి డబ్బులు రావు. పైగా మనం ఫెయిల్ అయితే కాలేజీకి చెడ్డపేరు. కాబట్టి ఈ కాలేజి వాళ్ళే ఎట్లైనా మనల్ని పాస్ చేస్తారు – అని తెలుసుకున్నారు.”

“ఆమేన?”

“ఇంకేముంది? క్లాస్ మొదలవ్వగానే లేచి వెళ్ళిపోతారు. లెక్చెరర్ “ఏందిరా” అంటే “ఏందిరా” అంటం మొదలుపెట్టారు. వాళ్ళు రాకపోయినా అటెండెన్స్ వెయ్యాల్సిందే. అంటెండెన్స్ లేకపోతే పాస్ కారు. పాస్ కాకపోతే మాకు గవర్నమెంటు నుంచి డబ్బులు రావు. అందుకని వచ్చినా రాకపోయినా, చదివినా చదవక పోయినా అందరినీ పాస్ చెయ్యడమే ఒక పని అయిపోయింది. గవర్నమెంటు సంవత్సరం అయిపోయినాక ఫీజులు ఇస్తుంది. మరి సంవత్సరం అంతా మా ఖర్చుల మీదే నడపాలి.”

“అవును కదా.. అట్టా ఎట్టా గిట్టుబాటు అవతాంది మీకు?” అడిగా అమాయకంగా.

“ఏం చెప్పేది సార్. బిల్డింగ్ ఖర్చులు, కరెంట్ ఖర్చులు, లంచాల ఖర్చులు ఇట్టాటివన్నీ తగ్గేవి కావు కదా. మేము తగ్గించుకోగలిగిన ఖర్చు ఒకటే వుంది”

“ఏంటది?”

“ఫేకల్టీ ఖర్చులు”

“అంటే చదువు చెప్పేవాళ్ళ జీతాలు తగ్గిస్తాన్నారా ఎట్టా?”

“కాదండీ.. జీతం తక్కువ తీసుకునేవాళ్ళకే ఉద్యోగం ఇస్తున్నాం”

“అంటే?”

“ఏముందిసార్.. మా కాలేజిలో చదువు అయిపోయిన వాళ్ళను తరువాత సంవత్సరం మా కాలేజిలోనే ఉద్యోగం ఇస్తాం. మా దగ్గర చదువుకున్న పిల్లలే కాబట్టి కంట్రోల్ లో వుంటారు. చెప్పిన చోటల్లా సంతకం పెడతారు.”

“ఓరినీ పాసుగోల, ఇట్టాటి అయ్యోర్లను పెట్టుకుంటే పిల్లలికి చదువెట్టా వచ్చుద్ది సామీ... సరే కథ ప్రకారం నేను వాళ్ళతో గూడా మాట్లాడాలగానె ఒకసారి రమ్మనదరాదా..” అన్నాను. మొత్తం పదిగేను మంది వుండారన్నాడు. పిలిత్తే పదమూడు మందే వచ్చారు.

“మిగతా ఇద్దరు ఏరి సామీ” అన్నా.

“రేయ్.. ఆ ప్యూను సాంబయ్యగాణ్ణి, డ్రైవర్ సైదులుగాణ్ణి పిలవండ్రా” అని నా వైపు చూడలేక తల దించుకున్నాడు.

***

మామ ఇక్కడ దాకా కథ చెప్పంగనే ఇంక ఉగ్గబట్టుకోలేక ఆపేశా..

“ఏంది మామా? ఏడ మొదలెట్టావు ఏడకి పొయ్యావు? ప్యూనేంది? డ్రైవరేంది?”అన్నాను.

“ఒరే అల్లుడా, ఆపద్దని ముందేజెప్పినానా... ఇంక నేజెప్పను ఫో...” అన్నాడు.

“మామా..మామా... జెప్పుమామా... ఇంగ మాట్టాడితే ఒట్టు” అన్నా.

“సరే ఇను అయితే” అని మళ్ళీ మొదలుపెట్టాడు మామ.

***

ఏడు సేపల కథలో సివరాఖరు సీను – నేను మా వూరి ఎమ్మెల్యే, ఎడుకేషన్ మంత్రి రంగనాయకులు దగ్గరికి పొయినా. టోపీ తీసి దణ్ణమెట్టి నిలబడినా.

“ఏందిరా?” అన్నాడు

“అయ్యా చేప చైను లాగింది, అడిగితే ఉద్దోగం లేదన్నాడు, ఆడినడిగితే పిల్లలకి చదువు లేదన్నాడు, కాలీజీకి పోతే రీయంబర్సుమెంటు కత చెప్పి పనికిమాలినోళ్ళనందరినీ చూపించి అయ్యోర్లని చెప్తా వున్నాడు, అదేమిరా అంటే ఈధికో కాలేజి వుంటే ఏం జెయ్యమంటున్నాడు. అసలిట్టా ఇన్నేసి కాలేజీలు ఎందుకు తెరిచినారు తవరే సెప్పాల” అన్నాను.

మంత్రిగారు పొట్ట ఊపుకుంటా నవ్వాడు.

“నువ్వు దగ్గరోడివి కాబట్టి ఒగ రగస్యం జెపతన్నా. మా రాజకీయలోళ్ళ సంగతి తెలుసు కదా? డబ్బులొస్తాయంటే కాలేజీలు కాకపోతే కల్లు షాపులు... పర్మిట్లదేముంది. కానీ, ఇన్నేసి కాలేజీలు పెట్టేదానికి ఇంత మంది మాకు డబ్బులిచ్చి మరీ ఎందుకు ఎగబడతన్నారో తెలుసా? ఆళ్ళు పెట్టే కాలీజీల్లో చేరేదానికి కావల్సినంతమంది పిల్లలున్నారని నమ్మకం ఉండబట్టే కదా. అదట్టా ఎందుకో తెలుసా?” అని మంత్రిగారు మళ్ళీ నవ్వారు.
చీమ ఎందుకు కుట్టిందో తెలిసిపోయే సివరాఖరుకు వచ్చేశానని అర్థమయ్యి చెవులు కిక్కిరించా

“ఆశ. ఈ జనానికి ఆశరా... పెతోడు వాడి పిల్లకాయలు పెద్ద ఇంజినీర్లు అయిపోయి, అమెర్కా ఎల్లిపోయి లచ్చలు లచ్చలు అంపేయాలని ఆశ. పెజెల్లో ఇట్టాటి ఆశ పెరిగిపోయింది కాబట్టే ఇంత కతా జరిగింది” అన్జెప్పి మంత్రిగారు పెజాసేవకి ఎల్లిపోయారు.

***

కత అయిపోయినట్లు మామ ఆపేయడంతో అందరం చేతుల్లో గళాసులవైపు చూసుకున్నాం. కొసరూ అరా ఏమన్నా వుంటే అట్నే తాగేసి ఎవరింటికి వాళ్ళం ఎలబారినాం.


***
(సారంగ సాహిత్య వార పత్రిక, 28 ఆగష్ట్, 2014)

బహుళ పంచమి జోత్స్న (హర్రర్ కథ)

“తాతయ్యా కథ చెప్పవూ..” బిలబిలమంటూ చేరారు పిల్లలు. క్యాలండర్ తిరగేస్తున్న వెంకటరామయ్య అది పక్కన పెట్టి కళ్ళజోడు తీస్తూ –

“ఏం కథలురా పొద్దస్తమానం... సెలవలంతా తాతయ్య దగ్గర కథలు చెప్పించుకుంటూ కూర్చుంటే, వచ్చే సంవత్సరం క్లాసు పుస్తకాలు తెచ్చుకున్నారు కదా? వాటినేం చేస్తారు?” అన్నాడు.

“సెలవలు అయిపోయాక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం... అప్పుడు ఎట్లాగూ స్కూలు, చదువులు తప్పవు... కథలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వింటాం తాతయ్యా?” అంది పెద్ద మనవరాలు స్నిగ్ధ. అవును అవునంటూ మిగిలిన నలుగురు వంత పాడారు.

వెంకటరామయ్య గట్టిగా నిట్టూరుస్తూ – “సరే... ఇంత వరకూ మీరెవరూ వినని, నేను ఎవరికీ చెప్పని కథ ఒకటి చెప్తాను... మీరెవ్వరూ భయపడకూడదు మరి...” అన్నాడు.

“అంటే దయ్యాల కథా తాతయ్యా?” అడిగాడు చిన్నవాడు సాకేత్. ఆయన అవుననట్లు తలవూపాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తల్లి శిరీషని చూసి –

“అమ్మా.. దయ్యాల కథ చెప్తున్నాడు తాతయ్య” అన్నాడు ఉత్సాహంగా.

“అలాంటి కథలు ఎందుకు మామయ్యా? వాడికి అసలే చచ్చేంత భయం.. ఒక్కడే బాత్ రూం కి కూడా వెళ్ళలేడు... ఇప్పుడు ఇలాంటి కథలు విన్నాడంటే ఇంక రాత్రంతా నన్ను వేధిస్తాడు” అంది శిరీష.

“ఇది మామూలు కథ కాదమ్మా... నిజంగా జరిగింది... నలభై ఏళ్ళ క్రితం నా కళ్ళ ఎదురుగా జరిగింది... ఇంత వరకూ నేను ఎవరికీ చెప్పని కథ...” అన్నాడు ఉత్సాహంగా. శిరీష ఆ మాట విని ఆసక్తిగా అక్కడే కుర్చీలో కూర్చుంది.

వెంకటరామయ్య కథ మొదలు పెట్టాడు.

***

నా వయసు ఇరవై లోపు వున్నప్పుడు జరిగిందిది. నేను, మా వూరి కరణం కొడుకు గోపాలయ్య, గుళ్ళో ఆచారి కొడుకు వామనాచారి ముగ్గురం ఒకే ఈడు వాళ్ళం. మా అన్నయ్య వెంకటసుబ్బయ్య కూడా ఒక సంవత్సరం చదువు తప్పడంతో మాతో పాటే చదివేవాడు. మేం నలుగురం కలిసి గుంటూరులో వున్న ఏ.సీ. కాలేజీలో ఒకేసారి బియ్యే చదవటానికి చేరాం.

అప్పట్లో గుంటూరు ఇప్పటిలాగా వుండేది కాదు. ఏ.సీ. కాలేజీకి దగ్గర్లో ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకోని అక్కడ మమ్మల్ని చదివించుకుంటూ వుండాలని మా అమ్మ ఆలోచన. అయితే నాన్న దేవతార్చనకి, నైవేద్యాలకి అమ్మ వూర్లోనే వుండాలని పట్టు పట్టడంతో అమ్మ రావటం సాధ్యపడలేదు. దాంతో వారాలు చేసుకోక తప్పింది కాదు మాకు.

కాలేజీకి దగ్గరగా వున్న బ్రాహ్మణుల ఇళ్ళన్నీ వెతికి, వుండటానికి గది కోసం, వారం వారం భోజనం కోసం అడగటం మొదలుపెట్టాం. ఇల్లు ఇస్తామన్న వాళ్ళందరివి కాలేజికి బాగా దూరంగానో, లేకపోతే నలుగురు వుండటానికి సరిపోని చిన్న చిన్న గదులో కావటం మూలాన వద్దనుకున్నాము. పోనీ వారమన్నా కుదురుతుందా అంటే “నలుగురు పిల్లలకి ఎక్కడ పెట్టగలం నాయనా..? మాకూ పిల్లా జెల్లా వున్నారు... ఏదో ఇద్దరి వరకైతే సర్దుకోవచ్చు..” అన్నారు చాలా మంది. ఈ పరిస్థితిలో ఒక పాత ఇంట్లో మా సమస్యకి పరిష్కారం దొరికింది.

ఆ ఇంట్లో వారం అడగటానికి నేనూ ఆచారి వెళ్ళాము. కొంచెం దట్టంగా చెట్లూ, పుట్టలు వున్న ప్రాంతం. అక్కడ ఒక ఇల్లు వుందని ఏ మాత్రం ఆనవాలు లేకుండా వుంది.

“అంత పాడుబడ్డ ఇంట్లో మనుషులు వుంటారా?” అన్నాను నేను.

“ఇల్లు ఎలా వుంటేనేం... మనకి కావల్సింది సమయానికి ఇంత తినడానికి, పడుకోడానికి ఒక గది... అడిగి చూద్దాం” అన్నాడు ఆచారి. మేం మాటల్లో వుండగానే ఆ ఇంటి ముందు గుమ్మం తెరుచుకోని ఒక ముసలి బ్రాహ్మడు వచ్చాడు.

“ఏమిటి నాయనా?” అన్నాడు పళ్ళులేని నోటితో. ఆయన భుజం మీద జంధ్యం, నుదుటన బొట్టు లేకపోతే ఆ సందర్భంలో అలాంటిని మనిషిని చూసి దడుచుకునేట్టు వున్నాడు.

“వినుకొండ దగ్గర్నుంచి చదువుకోడానికి వచ్చిన బ్రాహ్మలం... వసతి, వారం వెతుక్కుంటున్నాం..” అన్నాను నేను భయం భయంగా. ఆయన సాలోచనగా మా ఇద్దరి వైపు చూసి తృప్తిపడి – “సరే, ఈ పక్కగా వెళ్ళారో.. ఇంటికి వెనక బావి, పక్కన పెంకుటిల్లు వుంది. చూసుకోండి.. ఒకప్పడు మేము వున్న ఇల్లే... ఇది కట్టుకున్నాక అది ఖాళీగా వుంది... నచ్చితే రేపే దిగిపోండి...” అంటూ గడగడా చెప్పేశాడు.

“అద్దే అదీ...” అంటూ నసిగాడు మా ఆచారి.

“అద్దె లేదు ఏమీ లేదు... చదువుకునే పిల్లలు మీరు ఇచ్చేదేమిటీ? మేం తీసుకునేదేమిటి?” అన్నాడాయన. అప్పటిదాకా మా సంభాషణ తలుపు వారగా నిలబడి వుంటున్న ఆయన భార్య ముందుకు వచ్చింది.

“మాకు జరగకనా బాడుగలకి ఇవ్వడం? నలుగురు పిల్లలుంటే మాకు కాస్త తోడు వుంటారని... సామెత చెప్పినట్లు బెస్తల్లో పెద్ద బ్రాహ్మల్లో చిన్న... ఏదన్నా బజారు పని చెప్పినప్పుడు కాదనకుండా చేసిపెట్టండి చాలు... మీ భోజనాలు కూడా మా ఇంట్లోనే” అన్నది ఆమె. ఆ క్షణం మా నెలనాళ్ళ కష్టమంతా తీరినట్లైంది. ఆమెకూ, ఆయనకూ దణ్ణం పెట్టి తిరిగివచ్చాము. ఆ తరువాత ఆ వృద్ధ దంపతులు చెప్పినట్లే ఆ ఇంట్లో దిగి, వారికి చేదోడుగా పనులు చేసిపెడుతూ మా చదువులేవో కానిస్తున్నాం. అంతా సజావుగానే సాగుతోంది.

***

కథ చెప్తున్న వెంకటరామయ్య మధ్యలో ఆపి మంచినీళ్ళు ఇవ్వమని సైగ చేశాడు.

“ఏంటి తాతయ్యా.. దయ్యం కథ అన్నావు? వేరే కథ చెప్తున్నావు?” అంది స్నిగ్ధ మంచినీళ్ళు అందిస్తూ.

“వేరే కథ కదమ్మా... ఏదీ ఇంకా కథలోకి రానిదే..”

“అంటే ఆ ఇంట్లోనే దయ్యముందా?” అడిగాడు వైభవ్.

“కాదురా ఆ ముసలివాళ్ళే దయ్యాలై వుంటారు” అంది ప్రజ్ఞ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భార్గవ పెద్దాయన వుట్టూ చేరిన పిల్లల్ని, కొంచెం అవతలగా కూర్చున్న శిరీషని చూశాడు.

“ఏంటి నాన్నా? పిల్లల్ని అందర్నీ కూర్చోపెట్టి ఏదో కథ చెప్తున్నట్లున్నారు?” అడిగాడు. వెంకటరామయ్య సమాధానం చెప్పేలోగా మనవడు వైభవ్ అందుకున్నాడు – “అవును మామయ్యా... తాతయ్య దయ్యం కథ చెప్తున్నాడు..” అన్నాడు.

భార్గవ చిన్న నవ్వు నవ్వి అక్కడే కూర్చున్నాడు. వెంకటరామయ్య కథని కొనసాగించాడు.

***

మేము చేరిన దాదాపు పదిహేను రోజులకి, అంటే నాకు బాగా గుర్తు – బహుళ పంచమి రోజు, మా గోపాలయ్య రెండు ఝాముల రాత్రి పూట లేచి బయటికి వెళ్ళాడు. మరో రెండు నిముషాలలో పెద్దగా పొలికేక పెట్టి పడిపోయి పొర్లుతూ ఇంట్లోకి వచ్చి పడ్డాడు.

ఏమైందిరా అంటే పలకడు. గుడ్లు మిటకరిస్తాడు, గుటకలు మింగుతాడు, కానీ ఒక్క మాట కూడా పెగల్లేదు. మంచినీళ్ళు తాగించాము, విసనకర్రతో విసిరాము, అయినా ఫలితం లేదు. మా నలుగురిలో పెద్దవాడు సుబ్బయ్యన్నయ్య బయటికి వెళ్ళి నాలుగువైపులా చూసి ఏమీ లేదని తేల్చాడు.

అయినా సరే గోపాలయ్య భయం మాత్రం పోలేదు. ఆ రాత్రి మొత్తం గసపెడుతూ, అరుస్తూ అట్లే మేలుకోని వున్నాడు. వాడికి తోడుగా మిగతా ముగ్గురం వంతులు వేసుకోని జాగారం చేశాము. తెల్లవారే సరికి వాడికి రక్త విరేచనాలు పట్టుకున్నాయి. మేము కాలేజీకి వెళ్తూ వస్తూ వాడికి సపర్యలు చేస్తూ, ఆయుర్వేదం, ఇంగ్లీషు మందులు అన్నీ ఇప్పింపజూశాం. ఏ మాత్రం గుణం కనిపించకపోగా వాడు మరింత నీరసించడం మొదలుపెట్టాడు. చివరికి ఒకరోజు వామనాచారిని వెంటపంపి వాణ్ణి మా వూరు చేర్చాం.

ఇది జరిగిన కొంతకాలానికి, సరిగ్గా చెప్పాలంటే మళ్ళీ బహుళ పంచమి రాత్రి తరువాత ఉదయాన్నే చూస్తే మేము బహిర్భూమికి వెళ్ళే చోట వామనాచారి పడి వున్నాడు. వాడికి నీళ్ళు చల్లి సపర్యలు చేసి లేపేసరికి తేరుకున్నాడు.
“నాకు కూడా రక్తవిరేచనాలు మొదలయ్యాయిరా” అన్నాడు నీరసంగా. మాకు దిక్కు తోచకుండా అయ్యింది. వీడి విషయం వెళ్ళి ఇంటి యజమానులకి చెప్పాము. ఇంతకు ముందు గోపాలయ్య విషయంలో కూడా పెద్దగా పట్టించుకోని వాళ్ళు, ఇప్పుడు కూడా ఏం లేదన్నట్లు తేల్చేశారు.

“వాడికి ఒకడికి వచ్చింది కదా... అదేదో అంటు వ్యాధి అయ్యుంటుంది... ఇప్పుడు మరొకరికి వచ్చింది.. మందులు ఇప్పించడమే కానీ మేం మాత్రం ఏం చెయ్యగలం చెప్పు నాయనా? పైగా పెద్దవాళ్ళం... ఆ రోగం మాకు గాని అంటుకునేనా.. మాకు కైలాస యాత్రే... అందుకని, ఆ పిల్లాణ్ణి ఇటు వైపు రాకుండా ఇంటి పట్టునే వుండమని చెప్పండి.. మీరు కూడా ఇటు రావడం తగ్గిస్తే మంచిది.” అన్నది ఆమె. అప్పటిదాకా గిన్నెల్లో అన్నం, కూరలు పెట్టిచ్చే ఆమె విస్తరాకుల్లో కట్టి ఇవ్వడం మొదలుపెట్టింది.

ఇది ఇలా వుండగా, ఆచారికి శక్తి మరింత క్షీణించడం మొదలుపెట్టింది. మనిషి నీరసించి పుల్లలా సన్నగా తయారయ్యాడు.

“పోనీ వాణ్ణి తీసుకుపోయి వూర్లో దిగబెట్టి వస్తానురా..” అన్నాడు సుబ్బయ్య అన్నయ్య.

“మీరు ఇద్దరూ పోతే నేను ఒక్కణ్ణే ఇక్కడ వుండలేను అన్నయ్యా..” అన్నాను నేను. ముగ్గురం వెళ్ళడానికి సరిపడా డబ్బులు కూడా చేతిలో లేవు. సరే ఏమైతే అది అయ్యిందని మేమే వాణ్ణి చూసుకుంటూ వున్నాం. దగ్గర దగ్గర మళ్ళీ నెల తరువాత మళ్ళీ బహుళ పంచమి రోజు రానే వచ్చింది. అప్పటికే వామనాచారి స్పృహ లేని విధంగా పడి వున్నాడు. ఇంక వాడు దక్కుతాడో లేదో అన్నట్లు వుంది పరిస్థితి. సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరినైనా సాయం అడగాలన్నా తెలియనితనం. పట్నం వచ్చి కొన్ని నెలలే అయ్యింది, ఇంకా పట్నం పోకడలకి అలవాటుపడని పల్లెటూరి మనుషులం.

ఈ జరిగేదంతా బహుళ పంచమి రోజే జరుగుతోందని అన్నయ్య అనుమానించాడు. అదే విషయం నాతో చెప్పడంతో – “పోనే ఈ రాత్రికి ఏ గుళ్ళోనన్నా పడుకుందామా” అని అడిగాను.

“మరి వామనాచారి సంగతి?” అడిగాడు అన్నయ్య.

ఇద్దరం ఇక తప్పదని ఆ ఇంట్లోనే ఒక మూల చేరి నోటికొచ్చిన దేవుళ్ళని తల్చుకుంటూ కూర్చున్నాం. ఆ రాత్రి మేము అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. ఒక రాత్రప్పుడు ఒళ్ళు తెలియకుండా నిద్రకూడా పోయాము. నిద్రలేచి చూస్తే అంతా మాములుగానే వుంది. ఆచారికి కాస్త నెమ్మదించినట్లు కూడా అనిపించింది. సంతోషంతో ఒకరినొకరం కావలించుకోని కాలకృత్యాలకి బయటపడ్డాం. నేను తిరిగివచ్చేసరికి అన్నయ్య ఒక్కడే ఇంటి గడప మీద కూర్ఛోని మోకాళ్ళలో తలపెట్టుకోని కూర్చోని వున్నాడు. నేను వచ్చానని తెలిసినా తల ఎత్తలేదు. నాకు భయంతో చెమటలు పట్టాయి. నాలుగుసార్లు “అన్నయ్యా... అన్నయ్యా...” అని పిలిస్తే నెమ్మదిగా తల ఎత్తాడు.

“నాకూ మొదలైనాయిరా...” అన్నాడు.

“ఏమిటి అన్నయ్యా?” అన్నాను నేను భయం భయంగా.

“నాకూ ఈ వేళ రక్తం పడిందిరా..” అంటున్నవాడల్లా నా వైపు చూసి “కెవ్వు”న కేక పెట్టాడు. నేను తలదించి చూద్దును కదా నా పంచె, లంగోటా మొత్తం తడిసివున్నాయి – రక్తంతో.

***

వెంకటరామయ్య క్షణం ఆపి అందరి ముఖాల్లోకి చూశాడు. ఆప్పటికే ఆయన కొడుకు భార్గవ, కోడలు శిరీష, కూతురు అపర్ణ, మనవలు మనవరాళ్ళు అంతా నిశబ్దంగా వింటున్నారు.

“ఇదంతా దయ్యం వల్లేనా మమగారూ?” అడిగింది శిరీష.

“ఈ కథ మాకు ఎప్పుడూ చెప్పలేదు మీరు?” అంది అపర్ణ. భార్గవ నవ్వేశాడు.

“ఏంటి అపర్ణా... పిల్లల కోసం నాన్న ఏదో కథ అల్లి చెప్తుంటే...” ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో అడ్డుకున్నాడు వెంకటరామయ్య.

“కట్టుకథ కాదురా... కావాలంటే ఈ సారి మన వూరెళ్ళినప్పుడు కరణంగారి కొడుకు గోపాలయ్య ఎలా చనిపోయాడో కనుక్కో...” అన్నాడు.

“అంటే గోపాలయ్య చనిపోయాడా?” అడిగింది శిరీష.

“అవును... అక్కడ వూర్లో చేరినా వాడి పరిస్థితి ఏమీ బాగుపడలేదు... రక్తం పోతూనే వుంది. చివరికి క్షీణించి క్షీణించి చనిపోయాడు... అయితే వాడి పోవడానికి ఒక్క రోజు ముందు చేసిన పని వల్ల మేము బతికిపోయాం...”

“ఏంటి తాతయ్యా అది?”

“అదేమిటంటే... కరణంగారి అబ్బాయికి బాగాలేదన్న సంగతి తెలుసుకోని మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ వాడి పరిస్థితి చూసి, విషయం అర్థం చేసుకోని, ఎదో మంత్రించిన విభూతి పెట్టారట. దాంతో అప్పటిదాకా మాట పలుకు లేకుండా పడివున్న వాడు కాస్త తేరుకోని, జరిగినదంతా ఆయనకు వివరంగా చెప్పాడు...” చెప్పాడు వెంటరామయ్య.

“దాంతో మీ నాన్నగారు... అంటే మా తాతగారు వచ్చి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి కాపాడాడు.. అంతేగా” అంది అపర్ణ.

“కాదమ్మా... అసలు కథ అప్పుడే మొదలైంది. చెప్తాను వినండి..” అంటూ కొనసాగించాడు.

***

నాన్నగారు మా ఇంటికి వచ్చేసరికి మేము ముగ్గురం మూడు శవల్లాగా పడి వున్నాము. ఇల్లుగలవాళ్ళు మా సంగతి పట్టించుకోవడమే మానేశారు. దాంతో మందులు కాదు కదా కనీసం తిండి పెట్టేవారు కూడా లేక అల్లాడిపోతున్నాము. నాన్నగారు, వామనాచారి తండ్రి సుదర్శనంగారు ఇద్దరూ కలిసే వచ్చారు. వామనాచారి పరిస్థితి చూసి ఆచారిగారి ఒకటే ఏడుపు. నాన్నగారు వచ్చారన్న సంతోషం వున్నా, లేవలేని పరిస్థితి మాది. నాన్నగారు మాత్రం లోపలికి వస్తూనే ఎవరినీ పట్టించుకోకుండా, ఏదో మైకంలో వున్నవాడిలాగా మంత్రాలు చదువుతూ, గట్టిగా వూపిరి పీలుస్తూ గది నాలుగు మూలలు తిరిగారు. చప్పున వచ్చి తనతో తెచ్చుకున్న విభూతి మంత్రించి వామానాచారి నుదుటన పెట్టాడు.

“సుదర్శనంగారు... ఇక ప్రాణ భయం లేదు... ఇక్కడ వున్నదేమిటో తెలుసుకుంటేకాని వీళ్ళ రోగాలకి విరుగుడు దొరకదు... నేను ఇక్కడే వుంటాను... మీరు పిల్లాణ్ణి వూరికి తీసుకెళ్ళి నా కోసం ఎదురుచూడండి. నేను విరుగుడు కనుక్కోని తీసుకొస్తాను..” అంటూ వామనాచారి తండ్రికి పురమాయించాడు. సుదర్శనంగారు ఆయన చెప్పినట్లే వామనాచారిని తీసుకోని బయల్దేరాడు.

ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే వున్నారు నాన్నగారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మాతో సంధ్యావందనం చేయిస్తూ, దానితో పాటే ఆయనతో జింక చర్మంలో చుట్టి తెచ్చుకున్న దేవతాప్రతిమలతో దేవతార్చన, రుద్రాభిషేకాలు ఇలా ఒకటని కాదు, ఎన్నో చేశాడు. మంత్రించిన విభూతి, తీర్థాలు తీసుకోని మాకు కొంచెం తెరిపినిచ్చినట్లైంది. అయినా పూర్తిగా కోలుకోలేదు.

మరో బహుళ పంచమి వచ్చింది. నాన్నగారు ఆ రోజు పూజాధికాలు ఎక్కువ చేశారు. అత్యంత గోప్యమైన ఒక రహస్యాన్ని ఛేదించబోతున్నట్లు ఉత్సాహంతో సిద్ధంగా వున్నారు. ఆ రోజు రాత్రి అవుతూనే ఇంట్లో ఉధృతంగా పూజలు చేశారు. మేము ఇద్దరం ఒకరాత్రి దాకా ఆసక్తిగా చూసి చివరికి అలసిపోయి నిద్రపోయాము. అర్థరాత్రి దాటిన తరువాత నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి అదిరిపోయాను... భయంతో నా గుండె ఆగిపోయిందేమో అనిపించింది. మా నాన్నగారు కళ్ళు మూసుకోని ఏదో మత్రం పఠిస్తున్నారు. ఆయనకి ఎదురుగా కూర్చోని వుంది... ఆ అమ్మాయి..!!

జుట్టు విరబోసుకోని, తెల్లటి చీరలో.. ఆమె... ఆ అమ్మాయి.. నాన్నగారి ఎదురుగా కూర్చోని.. “ఆపరా.. ఆపరా... ఆపు” అంటూ గొణుగుతూనే వుంది.

నేను గట్టిగా అరిచిన అరుపుకి కళ్ళు తెరిచారు నాన్నగారు. ఎదురుగా వున్న ఆమెను చూసి ఉలిక్కిపడి వెనక్కి జరిగారు.

***

కరెంట్ పోయింది.

పిల్లలు కెవ్వుమని అరిచి ఒకచోటికి ముడుచుకున్నారు.

“భయపడకండి... కరెంట్ పోయింది అంతే..” అన్నాడు వెంకటరామయ్య. “అమ్మా... కొవ్వొత్తి వెలిగించి తీసుకొస్తావా?” అన్నాడు శిరీషని చూసి.

శిరీష “అలాగే మామయ్యా” అంటూ లేచి భార్గవ దగ్గరగా వెళ్ళి – “తోడు వస్తావా?” అంది భయంగా. భార్గవ నవ్వుకుంటూ లేచి ఆమెతో వంటింటిలోకి వెళ్ళాడు. శిరిష కొవ్వొత్తితో తిరిగిరాగానే, ఆ వెలుగుతో కొంచెం ధైర్యం కూడగట్టుకోని పెద్దపిల్ల స్నిగ్ధ అడిగింది –

“తాతయ్యా ఆమె ఎవరు? దయ్యమేనా?” అని

వెంకటరామయ్య కొనసాగించాడు – “అవునమ్మా... ఆ పిల్ల దయ్యమే. పేరు జోత్స్న. ఆ ఇల్లుగల ముసలివాళ్ళ కోడలు. కొంతకాలం క్రితం అత్తామామల పోడు పడలేక ఆత్మహత్య చేసుకుందట. ఆ తరువాత మొగుణ్ణి వేధించి చంపింది. అత్తామామల్ని కూడా పీడిస్తుంటే ఆ ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇంట్లోకి మారిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో వుండటానికి వచ్చినవాళ్ళని ఈ విధంగా పీడిస్తోంది...”

“ఇదంతా ఆ దయ్యమే చెప్పిందా” అడిగాడు సాకేత్ ఆశ్చర్యంగా.

“అవునురా... నా కళ్ళ ఎదురుగా జరిగింది... మా నాన్నగారితో స్పష్టంగా మాట్లాడింది... తనని మంత్రబంధం నుంచి వదిలేస్తే నీ పిల్లల్ని నేను వదిలేస్తానని చెప్పింది..” చెప్పాడాయన కళ్ళు పెద్దవి చేస్తూ. ఆ సంఘటన గుర్తుచేసుకున్నందుకే ఆయన కళ్ళలో ఒక భయం కొవ్వొత్తి వెలుగులో కనిపిస్తోంది.

“అంతే కాదు... ఆ అమ్మాయి కనపడ్డ విషయం ఎవరికో చెప్పకూడదనీ, అలా మా నాన్నకి గోపాలయ్య చెప్పడం వల్లే అతని ప్రాణం పోయిందని చెప్పింది. మేము ముగ్గురం మరో అయిదు నిముషాలలో ఆ ఇల్లు ఖాళో చేసి వూరు వచ్చేశాం.. అదీ కథ” చెప్పాడాయన.

బిగుసుకుపోయినట్లు వున్న అందరినీ చూసి – “ఇంక చాలు వెళ్ళి పడుకోండి..” అన్నాడు ఆయన.
అందరూ భయం భయంగా ఒకరినొకరు చూసుకోని తమతమ గదులవైపు కదిలారు. స్నిగ్ధ ఎదో గుర్తుకొచ్చినట్లు ఆగి తాతయ్య వైపు తిరిగి అడిగింది –

“తాతయ్యా... ఆ రోజు జోత్స్నని చూసిన సంగతి ఎవరికైనా చెప్తే చచ్చిపోతారు అని చెప్పావు కదా? మరి ఇప్పుడు మాకు చెప్పేశావే..??” అంది. ఒక్కసారి పిడుగు పడ్డట్లైంది ఆ ఇంట్లో. అంతా విస్మయంగా ఆయన వైపు చూశారు.

నిలబడి వున్న వెంకటరామయ్య భయం భయంగా కుర్చీలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళు ఏ కారణంతో ఈ రహస్యాన్ని దాచాడో ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు అంతా చెప్పేశాడు. అప్రయత్నంగా తన చేతిలో వున్న కేలండర్ లో ఆ రోజు తిథి గమనించాడు. ఆ రోజు బహుళ పంచమి.
<***>
(విపుల, ఆగస్ట్ 2014)