ఏడో చేప (కథ)


మా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా ఇంగ కథలకు కొరతేముందా?. మొన్న పండగకని నెల్లూరు పోయున్నానా అప్పుడు ఇట్టాగే ఓ పూట కుదిరింది.

రేయ్ నర్సిమ్మానీకో కత చెప్తాగానా అది నువ్వు రాసి పత్రికకైనా పంపాల్రా..” అన్నాడు.

అట్నేలే మామా.. ముందు కథ చెప్పుఅన్నా. ప్లాస్టిక్ గ్లాసు కడాకు లేపి గుటకేసి, నాలిక బయటికి చాపిహా..” అని ఆమేన మొదలెట్టాడు.

అనగనగనగా హైదరాబాదు అమీర్ పేట్ లో బాయిస్ హాస్టల్ ఉండాది. రాజుగోరి ఏడు చేపల్లాగ అందులో ఏడుగ్గురు పిలకాయలు ఉండారు..”

నేను ఆమంతనే ఆపినా. “ఏంది మామా కథంటే ఇట్టానేనా మొదలెట్టేది? మరీ చిన్నపిల్లల కథలాగుందేఅనిన.

సరే అయితే సారి తిరగేసి చెప్తాలే గానీ నువ్వు మధ్యలో ఆపబాకఅంటూ ముందరే నా నోటికి తాళం వేసి మళ్ళీ మొదలుపెట్టినాడు.

పోయినసారి రొట్టెలపండగ టైములో హైదరాబాద్ లో వెంగళ్రావునగర్ దగ్గర ఒక ఇసిత్రం జరిగింది. ఆక్కడ్నే ఒక చిన్న సందులో, రేత్రిపూట చీకట్లో ఎవరో ఆడకూతురు పోతావుంణ్ణింది. రైయ్యి మంటా ఇద్దరు పిలకాయలు బండేసుకోని పోతా పోతా ఆయమ్మి మెళ్ళో దండ, పుస్తెలతాడు పుట్టుక్కున తెంచి నూక్కబోయారు.. యమ్మి లబోదిబోమంటా పోలీసు స్టేషన్ కి వచ్చింది. మా వోళ్ళు అవీ ఇవీ కొచ్చెన్లేసి, ఆడా ఈడ తచ్చాడి చివరికి వల్లగాదని చేతులెత్తేశారు. పొద్దుకి సరిగ్గా మూడు రోజుల పోయినాక ఇక్కడ నెల్లూరు చిన్నబజారులో ఎవుడో దొంగసరుకు అమ్మతన్నాడని నాకు తెలిసింది. పొయ్యి జూస్తే చైను, పుస్తెలతాడు. అవి అమ్మతావున్న పిలకాయల్ని తీసకపోయి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగితే వెంగళ్రావునగర్లో ఆయమ్మి మెళ్ళోంచి లాక్కోబోయింది మేమేనని ఒప్పుకున్నారు.

హైదరాబాదు అమీర్ పేట హాస్టల్లో వుండారని చెప్పానే.. ఏడు చేపల్లాగ.. ఏడు చేపల్లో చేపగాడు కూడా వున్నాడు. ఏం చదువుకున్నావురా అంటే ఇంజనీరన్నాడు. నేను బిత్తరపొయినా.

చేపా చేపా ఇంజనీరింగు చదివి దొంగతనం ఎందుకు చేశావే? అని అడిగా. అప్పుడు వాడు భోరుమని కాలుగంట ఏడ్చి విషయం చెప్పకొచ్చినాడు.

సార్మూడు సంవత్సరాలు అయ్యిందిసార్అల్లూరు నుంచి హైదరాబాద్ పొయ్యి. ఒక ఏడాది పొడవతా మా నాయన డబ్బులు పంపినాడు. తరువాత నీ బతుకేదో నువ్వే బతకరా ఎదవా అన్నాడురెండేళ్ళు నేను చెయ్యని పని లేదు సార్కాల్ సెంటర్లో పనిచేశా, కోచింగ్ సెంటర్లో చెప్పా, చిన్నచిన్న పిలకాయల ఇస్కూల్లో అయ్యోరిలెక్క చదువులు కూడా చెప్పినా సార్డబ్బులు జాలక పని చేశాను సార్..” అంటా మళ్ళా ఏడుపెత్తుకున్నాడు. సరే వాళ్ళ నాయనతో మాట్లాడదాలెమ్మనుకున్నా..

నాయనా నాయనా కన్న కొడుకుగదంటయ్యా? ఏమంట డబ్బులు పంపించేదానికి?” అని అడిగా

ఎందాకని పంపించేది సామీనెల నెల నాలుగైదువేలంటే ఎట్టోకొట్ట తెచ్చి పోస్తిని. నా కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం ఊడపెరుకుతానని చెప్పి నా ఇల్లు తనకా పెట్టి రెండు లక్షలు గుంజకపోయినాడు. అయన్నీ లెక్క అజం లేకుండా పాయ.. మళ్ళా డబ్బులంటే యాడ తెచ్చేది సామీ…” అన్నాడు.

వొరెవొరెవొరె.. ఇదేదో తిరగొట్టిన బంతిలాగా మళ్ళీ పిల్లోడి దగ్గరికే వచ్చిందే అని మళ్ళా చేప పిల్లోడి దగ్గరకే పొయినా.,.

“ఏమిరా చేపపిల్లోడా మీ నాయన దగ్గర రెండు లక్షలు గుంజకపోయినావంటనే? అయ్యన్నీ ఏం జేసినా?” అని అడిగా. ఆ పిలకాయ మళ్ళీ ఓ కాలుగంట ఏడస్తావుణ్ణేడు. ఆమేన అసలు జరిగిందేందో చెప్పకొచ్చినాడు.

“సార్ నిజమే సార్. రెండు లక్షలరూపాయలు తెచ్చింది నిజమే. ఎందుకు తెచ్చినానో తెలుసా? మాదాపూర్లో క్యూజెడ్ టెక్నాలజీస్ అని ఓ కంపెనీ వుంది. రెండు లక్షలు జమ జేస్తే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వుద్యోగం ఇస్తామన్నారు సార్. నేను మాములుగైతే నమ్మేవాణ్ణి కాదు సార్.. నాతో పాటు వున్న ఆరుగ్గురిలో నలుగురు అట్టానే వుద్యోగానికి కుదురుకున్నారు. పెద్ద బ్యాంకులో సాలరీ అకౌంట్ తెరిపించారు. నెలాఖరున ఖంగు మని మొబైల్ మోగింది. పాతికవేలు సార్.. జీతం. మా ఆరుగ్గురు చేపలకీ కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా రాద్సార్. అట్టాంటి ఎండు చేపగాళ్ళకే వస్తే నాకెందుకు రాదు? ఎట్లాగైనా అదే కంపెనీలో చేరాలనుకున్నాను సార్...”
ఆ పిలగాడు ఇట్టా చెబతావుంటే మధ్యలో ఆపినాను నేను.

“ఒరే అబ్బిగాడా... ఏదైనా వుద్యోగంలో చేరే ముందు మంచి చెడ్డా, ముందు ఎనక చూసుకోబళ్ళేదా? ఎవుడో అత్తరబిత్తరగాడు కంపెనీ పెడితే వాడి ఎదాన రెండులక్షలు ఎట్టా పెట్టావు?” అన్నా. దానికి ఆ పిల్లకాయ –

“సార్.. ఎట్టాగైనా వుద్యోగం సంపాదించాలి సార్. బ్యాక్ డోర్ కూడా ట్రై చేశా. ఫేకులు పెట్టి చూశా. ఏదీ కుదర్లేదు. చివరాకరికి రెండు లక్షలు ఇచ్చైనా వుద్యోగం తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పటికీ ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. నా హాస్టల్లో నాతోపాటే వున్న ఆరుగురు చేపగాళ్ళలో నలుగురు అక్కడే పంజేస్తున్నారు కదా. హైటేక్ సిటీకి పొయ్యి మరీ ఆళ్ళ ఆఫీసు చూసొచ్చినా. ఏసీ గదులు, పట్టపగల్లా మెరిసిపోయే లైట్లు, గుండ్రంగా తిరిగే సీట్లు, ఒకటే జనం అటూ ఇటూ తిరగతా.. అబ్బో గొలగమూడి తిరణాలేసార్.. అదంతా చూసేకొద్ది నాకు అందులో ఎలాగైనా చేరాలనిపించింది. నాయన సంగతి తెలిసి కూడా వేధించి డబ్బులు తెచ్చుకున్న. ఉద్యోగంలో చేరినాక నెలనెలా డబ్బులు చేర్చిపెట్టి నాయనకి ఇద్దామనే అనుకున్నా. నాకేం తెలిసు నా లాంటి వాళ్ళని ముఫై మందిని మోసం చేసి బోర్డు తిప్పేస్తాడని.” అన్నాడు.

“బోర్డు తిప్పేశాడా?” అని ఆశ్చర్యపోయా

“అవున్సార్.. డబ్బులు తీసుకోని రసీదు కూడా ఇచ్చారు. రెండు రోజుల్లో వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోమని చెప్పారు. వెళ్ళేసరికి ఎవరూ లేరు. ఏసీ గదులు, లైట్లు, సీట్లు అన్నీ వున్నాయి కానీ మనుషులే లేరు” అంటా మళ్ళీ ఓ కాలుగంట ఏడ్చాడా పిల్లకాయ.

ఇవరం కనుక్కుంటే ఆ కంపెనీ మొదలెట్టినోడు జైల్లోనే వున్నాడని తెలిసింది. ఇట్టగాదులెమ్మని నేను వాడి దగ్గరకు పొయినా – “కంపెనీ బాబు కంపెనీ బాబూ ఎందుకు బోర్డు తిప్పేశా?” అన్నా  -

వాడు దిగాలుగా జైలు పైకప్పు వైపు చూసి పొడుగ్గా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టినాడు.

“సార్.. కంపెనీ పెట్టింది నిజమే. డబ్బులు తీసుకుంది కూడా నిజమే సార్. మాకు ఓ అమెరికా కంపెనీతో టైఅప్ సార్. వాళ్ళకి పని చేసిపెట్టే మనుషులు కావాల్సార్. మన దగ్గర జనాన్ని చూపిస్తే వాడికి సరిపోలా. అందుకని కొంత మంది పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దాంట్లో చేర్పించమని వాళ్ళే చెప్పారు. మన మైత్రీవనంలో ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి తూ అంటే తా రాని ప్రతివాడికి ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇన్ని చేసినా ఆ అమెరికావాడికి కావల్సినట్టు తయారు చెయ్యలేకపోయాము”

“ఒరేనాయనా.. నాకేం అర్థం కావడంల్యా... కావాల్సినట్లు తయారు చేసేదేందియా? ఇదేమన్నా రాధామాధవ్ సెంటర్లో దోసెల బండా ఎట్టా కావాల్నంటే అట్టా తయారు చేసేదానికా?” అన్నాను

“అట్టాకాదు సార్... అమెరికాలో వుండే వాళ్ళు అన్ని పనులు చేసుకోరు సార్. ముఖ్యమైన పనులన్నీ వాళ్ళు చేసుకోని, పనికిరాని పనులన్నీ పరాయిదేశాల వాళ్ళకి చేసి పెట్టమని పడేస్తారు. ఇక్కడైతే రోజు కూలీ తక్కువని అట్లా చేస్తారు. అట్టా మా ముఖాన కూడా ఓ పని పడేశారు. కోవా అని ప్రోగ్రామింగ్ చెయ్యాలి. కానీ ఆ పని చెయ్యాలంటే ఎంతో కొంత కోవా తెలిసుండాలి కదా... మన దగ్గర అది తెలిసినోళ్ళు బాగా పెద్ద పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు. మా దగ్గర పని చెయ్యడానికి ఎవరూ రాలేదు. అందుకని అమీర్ పేటలో హాస్టళ్ళల్లో వుండే పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి, పని నేర్పించి వాళ్ళ చేత పని చేయించుకుందాం అని అనుకున్నాను. తీరా చూస్తే ఒక్కడంటే ఒక్కడికి అక్షరం ముక్క రాదు. పేరుకేమో ఇంజనీర్లు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అమెరికా వాడికి నచ్చలేదు. కాంట్రాక్ట్ కేన్సిల్ అన్నాడు. ఏం చేసేది సార్.. ఈ చదువురాని ఇంజనీర్లతో... ఇట్టాంటోళ్ళకి ఇంజనీరింగ్ పట్టా ఇచ్చిన కాలేజీ వాళ్ళని చంపినా పాపంలేదు..” అంటూ అక్కసంతా కక్కాడు.

కథ కాలేజీలకి మారింది. సరే అట్టనే కానీ అని ఓ కాలేజి డైరెక్టర్ ని పట్టుకున్నా.

“డైరెక్టరా డైరెక్టరా... హైదరాబాదులో ఓ చేప చైన్ స్నాచింగ్ చేసింది. అదేమంటే ఉద్యోగం పేరుతో ఎవడో మోసజేడంట. ఆణ్ణి ఎందుకు మోసంజేశావురా అంటే ఆయబ్బి కాలేజీలలో చదువు చెప్పకపోతే నేనేం చేసేది అంటన్నాడు. ఏమబ్బా.. కాలేజీ పెట్టినాడివి చదువులు జెప్పేదానికేమి రిమ్మతెగులు?” అంటా తెగేసి అడిగినా.
ఆ డైరెక్టరు అటూ ఇటూ చూసి, బోరుమంటా ఏడ్సినాడు. టై ఎత్తి ముక్కు చీదినాడు.

“నీ పాసుగోల ఇందేందయ్యా ఇట్టాగ ఏడస్తన్నావా?” అని మళ్ళీ అడిగా. ఆయన నిదానించి చెప్పడం మొదలు పెట్టినాడు.

“అయ్యా... ఏం చెప్పేది మా ఖర్మ. “హైదరాబాద్ కి పొయ్యి గట్టిగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలనుకుంటున్నామహో” అని అరిస్తే చాలు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. సర్లే అట్లాగే కానీ లెమ్మని కాలేజీ తెరిచాము. తీరా చూస్తే మా ఇంటెనక రెండు కాలేజీలకు, మా కాలేజి ముందు మూడు కాలేజీలకు పర్మిషన్లు వున్నాయి. ఊరు మొత్తం వైన్ షాపులు, ఇంజనీరింగ్ కాలేజీలే పుట్టగొడుగుల్లా వీధికి రెండు చొప్పున వున్నాయి. ఇట్టాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో మేమూ అదే చేశాం..”

“ఏందది” అన్నా

“మా కాలేజీలో చేరినవారికి ఒక లేప్ టాప్ ఫ్రీ అన్నాము, ముగ్గురు చేరారు. పుస్తకాలు ఫ్రీ అన్నాం, ఇంకో ఆరుగ్గురు చేరారు. కేంపస్ ప్లేస్ మెంట్ అన్నాం ఇంకో ఇద్దరు చేరారు. ఇక లాభంలేదని మొదటి సంవత్సరం ఫ్రీ అన్నాం... అప్పుడు జనం ఓ ఇరవైమంది వచ్చారు. వాళ్ళతో కాలేజీ మొదలెట్టాము..”

“ఫ్రీగా చదువులు చెప్పావా? మా గొప్ప పని చేశావే” అన్నాను నేను.

“గొప్పా పాడా... చేరినవాడు మొదటి సంవత్సరం చదవటం ఆయిపోగానే గవర్నమెంటు ఫీజు మొత్తం తిరిగి ఇచ్చేస్తానంది. అదే ఫ్రీ..”

“ఏదో ఒకటి. మంచిదే కదా” అనబోయా.

“ఊరుకోండి సార్.. మీకేం తెలియట్లేదు. అట్టా చేరిన పిల్లలు అందరు కలిసి మాట్లాడుకున్నారు. - మనం పాస్ అయితే తప్ప కాలేజీకి డబ్బులు రావు. పైగా మనం ఫెయిల్ అయితే కాలేజీకి చెడ్డపేరు. కాబట్టి ఈ కాలేజి వాళ్ళే ఎట్లైనా మనల్ని పాస్ చేస్తారు – అని తెలుసుకున్నారు.”

“ఆమేన?”

“ఇంకేముంది? క్లాస్ మొదలవ్వగానే లేచి వెళ్ళిపోతారు. లెక్చెరర్ “ఏందిరా” అంటే “ఏందిరా” అంటం మొదలుపెట్టారు. వాళ్ళు రాకపోయినా అటెండెన్స్ వెయ్యాల్సిందే. అంటెండెన్స్ లేకపోతే పాస్ కారు. పాస్ కాకపోతే మాకు గవర్నమెంటు నుంచి డబ్బులు రావు. అందుకని వచ్చినా రాకపోయినా, చదివినా చదవక పోయినా అందరినీ పాస్ చెయ్యడమే ఒక పని అయిపోయింది. గవర్నమెంటు సంవత్సరం అయిపోయినాక ఫీజులు ఇస్తుంది. మరి సంవత్సరం అంతా మా ఖర్చుల మీదే నడపాలి.”

“అవును కదా.. అట్టా ఎట్టా గిట్టుబాటు అవతాంది మీకు?” అడిగా అమాయకంగా.

“ఏం చెప్పేది సార్. బిల్డింగ్ ఖర్చులు, కరెంట్ ఖర్చులు, లంచాల ఖర్చులు ఇట్టాటివన్నీ తగ్గేవి కావు కదా. మేము తగ్గించుకోగలిగిన ఖర్చు ఒకటే వుంది”

“ఏంటది?”

“ఫేకల్టీ ఖర్చులు”

“అంటే చదువు చెప్పేవాళ్ళ జీతాలు తగ్గిస్తాన్నారా ఎట్టా?”

“కాదండీ.. జీతం తక్కువ తీసుకునేవాళ్ళకే ఉద్యోగం ఇస్తున్నాం”

“అంటే?”

“ఏముందిసార్.. మా కాలేజిలో చదువు అయిపోయిన వాళ్ళను తరువాత సంవత్సరం మా కాలేజిలోనే ఉద్యోగం ఇస్తాం. మా దగ్గర చదువుకున్న పిల్లలే కాబట్టి కంట్రోల్ లో వుంటారు. చెప్పిన చోటల్లా సంతకం పెడతారు.”

“ఓరినీ పాసుగోల, ఇట్టాటి అయ్యోర్లను పెట్టుకుంటే పిల్లలికి చదువెట్టా వచ్చుద్ది సామీ... సరే కథ ప్రకారం నేను వాళ్ళతో గూడా మాట్లాడాలగానె ఒకసారి రమ్మనదరాదా..” అన్నాను. మొత్తం పదిగేను మంది వుండారన్నాడు. పిలిత్తే పదమూడు మందే వచ్చారు.

“మిగతా ఇద్దరు ఏరి సామీ” అన్నా.

“రేయ్.. ఆ ప్యూను సాంబయ్యగాణ్ణి, డ్రైవర్ సైదులుగాణ్ణి పిలవండ్రా” అని నా వైపు చూడలేక తల దించుకున్నాడు.

***

మామ ఇక్కడ దాకా కథ చెప్పంగనే ఇంక ఉగ్గబట్టుకోలేక ఆపేశా..

“ఏంది మామా? ఏడ మొదలెట్టావు ఏడకి పొయ్యావు? ప్యూనేంది? డ్రైవరేంది?”అన్నాను.

“ఒరే అల్లుడా, ఆపద్దని ముందేజెప్పినానా... ఇంక నేజెప్పను ఫో...” అన్నాడు.

“మామా..మామా... జెప్పుమామా... ఇంగ మాట్టాడితే ఒట్టు” అన్నా.

“సరే ఇను అయితే” అని మళ్ళీ మొదలుపెట్టాడు మామ.

***

ఏడు సేపల కథలో సివరాఖరు సీను – నేను మా వూరి ఎమ్మెల్యే, ఎడుకేషన్ మంత్రి రంగనాయకులు దగ్గరికి పొయినా. టోపీ తీసి దణ్ణమెట్టి నిలబడినా.

“ఏందిరా?” అన్నాడు

“అయ్యా చేప చైను లాగింది, అడిగితే ఉద్దోగం లేదన్నాడు, ఆడినడిగితే పిల్లలకి చదువు లేదన్నాడు, కాలీజీకి పోతే రీయంబర్సుమెంటు కత చెప్పి పనికిమాలినోళ్ళనందరినీ చూపించి అయ్యోర్లని చెప్తా వున్నాడు, అదేమిరా అంటే ఈధికో కాలేజి వుంటే ఏం జెయ్యమంటున్నాడు. అసలిట్టా ఇన్నేసి కాలేజీలు ఎందుకు తెరిచినారు తవరే సెప్పాల” అన్నాను.

మంత్రిగారు పొట్ట ఊపుకుంటా నవ్వాడు.

“నువ్వు దగ్గరోడివి కాబట్టి ఒగ రగస్యం జెపతన్నా. మా రాజకీయలోళ్ళ సంగతి తెలుసు కదా? డబ్బులొస్తాయంటే కాలేజీలు కాకపోతే కల్లు షాపులు... పర్మిట్లదేముంది. కానీ, ఇన్నేసి కాలేజీలు పెట్టేదానికి ఇంత మంది మాకు డబ్బులిచ్చి మరీ ఎందుకు ఎగబడతన్నారో తెలుసా? ఆళ్ళు పెట్టే కాలీజీల్లో చేరేదానికి కావల్సినంతమంది పిల్లలున్నారని నమ్మకం ఉండబట్టే కదా. అదట్టా ఎందుకో తెలుసా?” అని మంత్రిగారు మళ్ళీ నవ్వారు.
చీమ ఎందుకు కుట్టిందో తెలిసిపోయే సివరాఖరుకు వచ్చేశానని అర్థమయ్యి చెవులు కిక్కిరించా

“ఆశ. ఈ జనానికి ఆశరా... పెతోడు వాడి పిల్లకాయలు పెద్ద ఇంజినీర్లు అయిపోయి, అమెర్కా ఎల్లిపోయి లచ్చలు లచ్చలు అంపేయాలని ఆశ. పెజెల్లో ఇట్టాటి ఆశ పెరిగిపోయింది కాబట్టే ఇంత కతా జరిగింది” అన్జెప్పి మంత్రిగారు పెజాసేవకి ఎల్లిపోయారు.

***

కత అయిపోయినట్లు మామ ఆపేయడంతో అందరం చేతుల్లో గళాసులవైపు చూసుకున్నాం. కొసరూ అరా ఏమన్నా వుంటే అట్నే తాగేసి ఎవరింటికి వాళ్ళం ఎలబారినాం.


***
(సారంగ సాహిత్య వార పత్రిక, 28 ఆగష్ట్, 2014)
Category: