తప్పిపోయిన సూర్యుడు (కథ)

అప్పటికే మూడు రోజుల ముసురు. ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు కురుస్తుందో కనిపెట్టలేని కాలం. అలాంటి ఓ వర్షాకాలం సాయంత్రం వూర్లోకి వచ్చాడు సూర్యనారాయణరావు. పేరు గుర్తుంచుకోవాల్సినంత ప్రాధాన్యత లేని ఓ లాడ్జిలో మకాం. ఏసీ సూట్లకి అలవాటు పడ్డ శరీరం కాబట్టి అంతటి వర్షాకాలంలోనూ కూలర్ పెట్టించుకున్నాడు. దాని చప్పుడూ, బయట వర్షం చప్పుడు కలిసి దరువులా వినిపిస్తోందతనికి. వచ్చినప్పటి నుంచి కిటికీ పక్కనే కుర్చీలో కూర్చోని కిటికీ అద్దం మీద పడి జారిపోతున్న వర్షపుచుక్కల్ని చూస్తూ వున్నాడు. రాత్రి పదైందో, పన్నెండైందో తెలియదు. గోడకి గడియారం లేదు. వున్నా టైం తెలుసుకునే ఉద్దేశ్యం అతనికి లేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒక ఉషస్సు కోసం జాగారం చేస్తున్నాడతను.

తెల్లవారితే తన బతుకులోకి వెలుగొస్తుందని అతని నమ్మకం. పాతికేళ్ళుగా చూడని కొడుకుని చూడాలని ఆరాటం. ఆ కొడుకు తనని తండ్రిగా అంగీకరిస్తాడో లేదో అని భయం. వెరసి అతనికి నిద్రకీ ఆమడ దూరం పెరిగింది.

అరవై ఏళ్ళ జీవితంలో అర్థం భాగం అదే వూర్లో గడిపాడతను. ఆ అర్థం భాగం ఏ మాత్రం అర్థం పర్థం లేనిదని అతని అభిప్రాయం. పుట్టిన దగ్గర్నుంచి పుట్టెడు దుఖాన్ని దగ్గర్నుంచి చూశాడు. పాపం అనేవాళ్ళనీ చూశాడు. పాపం చేసేవాళ్ళనీ చూశాడు. తండ్రి వ్యసనాలను భరించలేక ఉరిపోసుకున్న తల్లిని చూశాడు. భార్య చచ్చిపోయిందన్న సాకుతో కనపడ్డ ఆడదాన్నల్లా కామించిన తండ్రిని చూశాడు.

ఒక శివరాత్రి మర్నాడు జరిగినది అతనికి బాగా గుర్తు. తండ్రితో కోటప్పకొండ జాతరకి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. దారిలో ఏదో పల్లెటూరు. ’ఇక్కడ్నుంచి లారీలో పోదా’మని తండ్రి చెప్తే తలూపాడు. టీ కొట్టు చావిట్లో ముడుక్కోని కూర్చున్నాడు. తెల్లవారిందాకా తండ్రి టీ కొట్టు వెనక ఎవరో అమ్మాయితో వున్నాడని మాత్రం తెలిసింది. ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ తప్పు చేస్తున్నాడని తెలుసు. ఎముకలు కొరికే చలిలో గడగడ వణుకుతున్నప్పుడు ఏడేళ్ళ వయసులో తండ్రిని మొదటిసారి అసహ్యించుకున్నాడు.  పదేళ్ళకు అలాంటి విషయాలకు అలవాటుపడిపోయాడు. ఇరవై ఏళ్ళకు అది తండ్రి అవసరం కాబోలు అని అనుకున్నాడు. పాతికేళ్ళకు అదే అడుగుల్లో అతనూ నడిచాడు. అతని అడుగుల కింద నలిగిన అమ్మాయి పేరు మల్లి.

మల్లి గుర్తుకురాగానే మనసులో ఎవరో కవ్వంతో చిలికినట్లైంది సూర్యనారాయణకి. ఖరీదైన సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకున్నాడు. బలవంతంగా మల్లి ఆలోచనలు పక్కకి నెట్టి అతని జీవితంలో రెండో సగం గురించి తలుచుకున్నాడు.

మంచో చెడో, తండ్రి వల్ల సూర్యం జీవితంలో రెండు ముఖ్యమైనవి జరిగాయి. ఒకటి తండ్రి ద్వారా సంక్రమించిన అలవాటు అయితే రెండోది తండ్రి పేదరికం కారణంగా పుట్టుకొచ్చిన కసి. అది అలాంటి ఇలాంటి కసి కాదు. కొండల్ని పిండి చెయ్యగలిగిన కసి. ఒక ఉప్పనలా లేచి సూర్యాన్నికబళించి సూర్యనారాయణగా తయారుచేసింది. చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. పెద్దవాడయ్యాడు. పెద్ద పెద్ద సంస్థలకు అధిపతి అయ్యాడు. పగలూ రాత్రి తెలియని అలాంటి పరుగు మధ్యలో సంధ్యారాగంలా కలిసింది మల్లి. పేరుకు తగ్గ పిల్ల. విరిసీవిరియని జాజిమల్లి.

ఎర్రటి ఎండా కాలం. మల్లెలకాలం. మంచినీళ్ళ బావి దగ్గర కలిసింది. ఉరుకుల పరుగులలో అలసిపోయిన అతని శరీరదాహాన్ని తీర్చింది. అతడు ఆమెని గుక్కెడు నీళ్ళు ఇచ్చే నీటి చెలమ అనుకున్నాడు. ఆమె మాత్రం నదీ ప్రవాహమై అతనిలో కలిసిపోవాలనుకుంది. అవసరం తీరాక అవతలికి నెట్టాడు. తను ఎక్కుతున్న మెట్లకి అడ్డంరావద్దని పక్కన పెట్టాడు. మల్లి ఏడవలేదు. మళ్ళీ అడగలేదు. తొమ్మిదినెలల కష్టాన్ని ఆశ అనే వారధితో దాటేసింది. పిల్లాడు పుట్టాడు.

అప్పటికే పెద్ద పారిశ్రామికవేత్త కూతురితో పెళ్ళి ప్రయత్నాలు సాగుతున్నాయి. పెళ్ళేకానివాడు పిల్లాణ్ణి ఎలా ఎప్పుకుంటాడు? పైగా పిల్లాణ్ణి కన్న తల్లిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా లేనప్పుడు. కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేదు.

“వాడు నీ కొడుకు... నీ రక్తం...” అని మల్లి అన్నప్పుడు మాత్రం దగ్గరకు వెళ్ళబోయాడు. అటు వేసే ప్రతి అడుగు అతని ఎదుగుదలను అణగదొక్కుతుందని అనుకున్నాడు. మెళ్ళో వున్న బంగారు గొలుసు తీసి ఆమె చేతికి ఇచ్చాడు. ఒక్క క్షణంపాటు కలిగిన ప్రేమ అది అని అతనుకున్నాడు. అతని పేరు బయటపెట్టకుండా వుండేందుకు ఇచ్చిన లంచమని ఆమె అనుకుంది.

“వాడి బాగోగులు చూస్తాను... డబ్బు పంపుతుంటాను” అన్నాడు. ఆ మాటలు వినకుండానే వెళ్ళిపోయింది మల్లి. మళ్ళీ కనపడలేదు.

ఇప్పుడు మల్లి సంగతి చెప్పగలిగినవాడు ఒక్కడే వున్నాడు. ఆమెకు వరసకి బావ అయిన శ్రీపతి. అతన్ని కలిసి తన కొడుకు వివరాలు తెలుసుకోవాలని అతని ఆలోచన. చీకట్లు తప్పుకున్న ఆకాశాన్ని కడిగేస్తూ సన్నటి వాన కురుస్తోంది. సూర్యనారాయణరావు ఎదురు చూసిన క్షణం మరింకెంతో దూరంలో లేదు. అతను తయారై బయటపడేసరికి మసకేసిన మబ్బులు కొంచెం తెరిపినిచ్చాయి.

శ్రీపతి కోసం వూరంతా వెతికాడు. అతని ఇల్లు తెలుసుకునేసరికే మధ్యాహ్నం అయ్యింది. కానీ, శ్రీపతి లేడు.

“ఊరెళ్ళారండీ..” చెప్పిందతని భార్య. “మీరు ఎవరని చెప్పమన్నారు?” అడిగింది.

ఏం సమాధానం చెప్తాడు? సూర్యనారాయణ కొద్దిసేపు తటపటాయించాడు.

“చిన్నప్పటి స్నేహితుణ్ణి... ఎప్పుడో ముప్ఫై ఏళ్ళ క్రితం...” అబద్ధాలాడటం అతనికి వ్యాపారంలో అబ్బిన కళ. వెళ్ళబోతూ మళ్ళీ ఆగాడు.

“వాడి మరదలు ఒకమ్మాయి వుండాలి... మల్లి అనీ...”

“అయ్యో మీకు తెలియదా?...” ఆమె చెప్పబోయేది ముందే తెలిసిపోయిందతనికి. వినకూడదంటే మాత్రం చెవులకు వినపడకుండా వుంటుందా? “చనిపోయింది”

“ఎంత కాలం అయ్యింది?”

“పదేళ్ళు పైనే...”

బాధపడాలా? పశ్చాత్తాపడాలా?

“ఆమె కొడుకు...?”

“భాస్కర్... మూడు వీధుల అవతల... కుడి వైపు రెండో ఇల్లు... ఇంటి ముందు జాజిమల్లె చెట్టు..” చెప్పిందావిడ.
సూర్యనారాయణరావు అక్కడి నుంచి కదిలాడు.

పదేళ్ళు... పదేళ్ళు... అనుకున్నాడు మనసులోనే. అవే పదేళ్ళలో అన్నీ జరిగాయి. తన సంసారంలో తుఫాను రేగింది ఆ కాలంలోనే. పిల్లలు పుట్టలేదని జయంతి బాధపడేది. వారసులు పుట్టలేదని అతను బాధపడేవాడు. ఆమె బాధకి పర్యవసానం ఆత్మహత్య అయితే, అతని బాధకి పర్యవసానం నిద్రలేమి, నిట్టూర్పులు అన్నింటినీ మించిన నిన్నటి జ్ఞాపకం.. మల్లి, మల్లి కొడుకు! మల్లికి పుట్టినవాడు తనవాడు కాడూ. తన రక్తం కాదూ.
అడపదడప చినుకులు పడుతున్నాయి. నడకలో వేగం పెంచలేని అశక్తుడై వున్నాడు సూర్యనారాయణరావు. ఏం చేస్తాడు? వయసు భారం మొత్తం మోకాళ్ళమీద వచ్చిపడింది. అయినా నడుస్తూనే వున్నాడు. మల్లె పందిరి కనిపించేంతవరకు.

ఎన్ని వ్యాపారాలు చేసి ఏం లాభం? ఎన్ని కార్పొరేట్ మీటింగులలో మాట్లాడి ఏం లాభం? ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అటుంచి, తొంగి చూడటానికే భయపడ్డాడతను. చినుకులు పెద్దవై తడుస్తున్నా, పూలు లేని మల్లెపందిరి చూస్తూ నిలబడిపోయాడు.

భాస్కర్ కి తన తండ్రి ఎవరో తెలిసేవుంటుందా? మల్లి చెప్పేవుంటుందా? చచ్చిపోయాడని చెప్పి వుంటుందా? చచ్చినారాడని చెప్పివుంటుందా? వర్షం కన్నా మనసులో ప్రశ్నలే అతన్ని ఎక్కువగా తడిపేస్తున్నాయి. సాయంత్రం దాటిన చీకట్లు కమ్ముకుంటున్నాయి.

“ఎవరదీ?” వినిపించిందో గొంతు. ఆ వెనకే ఎవరో పాతికేళ్ళ యువతి వర్షానికి తలపై చేతిని పెట్టుకోని వచ్చింది.

“ఎవరంటే పలకరేం?” కొంత ఖంగారు, కొంత భయం ఆమె గొంతులో.

“కోడలేమో...” అనుకున్నాడు. మరింత ఖంగారు, మరింత భయం అతని గుండెలో.

“ఏం లేదమ్మా... ఇక్కడ నా వస్తువు ఒకటి పోయింది వెతుక్కుంటున్నాను...” చెప్పాడతను. 

వెతుక్కుంటున్నమాట నిజమే అయితే అది వస్తువు కాదని అతనికీ తెలుసు.

“అయ్యో... వర్షం పడుతోంది కదండీ... పోనీ లోపలికి రండి...” ఆహ్వానించిందామె.

“ఫర్లేదమ్మా... దొరుకుతుందని నమ్మకం కూడా లేదు..” నిరాశ అతని గొంతులో.

“పోనీ... ఏం పోయిందో చెప్పండి. పిల్లాడికి చెబితే వెతికి పెడతాడు..”

ఆమె వెనుకగా గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు ఆరేళ్ళ పిల్లాడు.

“అది చెప్పేది కాదు తల్లీ... కానీ విలువైనది...” అన్నాడతను.

“అరెరె... ఈయన కూడా లేరే... ముందు లోపలికి రండి. వర్షం తగ్గాక వెతుకుదురుగానీ...” అందామె.

“వద్దమ్మా... నేను అనవసరంగా వెతుకుతున్నాను... పోయింది ఇక్కడ కాదేమో...” అంటూ వెనక్కి తిరిగాడు. ఒక మెరుపు మెరిసింది. ఆమె అలాగే కొద్దిసేపు చూస్తూ నిలబడిపోయింది.

లాడ్జికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయాడు సూర్యనారాయణరావు. తడిబట్టలతోనే మంచం మీద వాలాడు.
కనపడ్డది కోడలే అని మనసు చెప్తోంది. కొడుకుని చూడలేకపోయానన్న బాధకన్నా మనవణ్ణి చూశాన్న ఆనందం వుంది. సుఖంగా వున్న కుటుంబాన్ని కష్టపెట్టకుండా వచ్చేసినందుకు సంతోషంగా వుంది. ఒంటరితనం మళ్ళీ మొదలైందని కలతగా వుంది. అలాగే నిద్రపోయాడు.

తెల్లవారుతుండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడు. చప్పున మెలుకువ వచ్చింది. తలుపు తీశాడు.
అదే ముఖం... గత కొంతకాలంగా పగలూ రాత్రి కళ్ళముందు కనిపిస్తున్న మల్లి ముఖం. అవును మల్లే..!! కాదు కాదు... మల్లి పోలికలున్న వాడు.. వాడే... తన కొడుకు భాస్కర్..!! ఇంకా వెతికితే ఆ ముఖంలో తన పోలికలు వుంటాయని అనిపించిందతనికి. అయినా వెతకలేదు. ఆ ముఖంలో మల్లి కనపడటంలోనే ఆనందం వుంది.

“నమస్కారమండి...” అన్నాడతను.

“లోపలికిరా బాబూ...” పిలిచాడు. అతను లోపలికి వచ్చాడు కానీ కూర్చోలేదు. సూర్యనారాయణరావు చూపు మరల్చలేదు.

“రాత్రి మా ఇంటి వైపు వచ్చారట కదా... సీత చెప్పింది...” అడిగాడతను. తలూపాడు సూర్యనారాయణరావు. 

ఒక్కసారి భాస్కర్ “నాన్నా” అంటాడేమో అని గుండె ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆ ఒక్క మాట అతను అంటే తన సమస్త వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేయడానికైనా సిద్ధంగా వున్నాడు. కొడుకు ఒప్పుకోవాలేగానీ వాళ్ళందరినీ తన కుటుంబంగా చేసుకోడానికి తహతహలాడుతున్నాడు. కానీ భాస్కర్ ఆ ఒక్క మాట అనలేదు. కొద్ది సేపు సూర్యనారాయణ ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.

“మీ వస్తువేదో పోయిందని చెప్పారట... అది దొరికింది. మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను...” అంటూ ఒక కాగితపు పొట్లం అతని చేతిలో పెట్టి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడతను.

సూర్యనారాయణ చేతిలో చూసుకున్నాడు. వణుకుతున్న చేతులతో కాగితం మడతలు విప్పి చూశాడు...
బంగారు గొలుసు...!

ఆ రోజు ఒకరు బాధ్యత అనీ, మరొకరు లంచమనీ అనుకున్న దండ. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించి మంచం మీద కూలబడిపోయాడతను.

భాస్కర్ వడి వడిగా అడుగులేసుకుంటూ లాడ్జి దాటి వెళ్ళిపోయాడు. బయట మబ్బులు తొలగి సూర్యుడు బయిటికి వస్తున్నాడు.

<< ?>>


Category: