డీవోయం (కథ)

సరిత నాకు జాయిన్ అయినప్పటి నుంచీ తెలుసు. ఇంకా చెప్పాలంటే జాయిన్ అవడానికి ముందే తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయిని రిక్రూట్ చేసిన పానెల్ లో నేను కూడా వున్నాను.

సీనియర్ అసోసియేట్, డాక్ పాసెసింగ్ డిపార్ట్మెంట్.

మెయిల్ చివర వున్న సిగ్నేచర్ చూసి ప్రమోషన్ కూడా వచ్చిందన్నమాట అనుకున్నాను. నేను మొన్నటి దాకా రిక్రూట్మెంట్ మాత్రమే చూస్తుండటంతో ఆ వివరాలు ఏవీ తెలియలేదు. ఈ మధ్యనే రీస్ట్రక్చెరింగ్ చేసి నన్ను జనరలిస్ట్ ఎచ్ఆర్ లో వేశారు.

మెయిల్ మొత్తం మళ్ళీ చదివాను. డాక్ ప్రాసెసింగ్ వీపీ వర్థమాన్ నేగీ మీద కంప్లైంట్.

అతనికి వ్యతిరేకంగా మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు. అతని పర్ఫామెన్స్ గురించి ఎమ్.డీ. దాకా తెలుసు. ఐఐయంబీ. ఆరేళ్ళలో ఐదు ప్రమోషన్లు. ఎనాలసిస్ చేసి నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. అలాంటి వ్యక్తి గురించి సరిత కంప్లైంట్ చెయ్యడమేంటి?

సరితని పిలిచి మాట్లాడాను.

“అంతకు ముందు లేదు సార్. లాస్ట్ మంత్ నుంచి మొదలైంది. అవసరమున్నా లేకపోయినా ఏదో ఒక కారణం పెట్టి తిడుతున్నారు. రోజూ ఏదో ఒక విషయంలో బ్లేమ్ చేస్తూ మెయిల్స్ రాస్తున్నారు. అది కూడా టీమ్ అందరికీ సీసీ పెడుతున్నారు. కావాలనే ఇదంతా చేస్తున్నారు సార్. ఇప్పుడు నాకు ఉద్యోగం చాలా అవసరం సార్. పెళ్ళై ఆరు నెలలే అయ్యింది.” దాదాపు ఏడ్చేసినంత పని చేసింది.

“వర్థమాన్ తో నేను మాట్లాడతాన్లే” అని చెప్పి పంపేశాను. మాట్లాడలేదు.

షహనాజ్ కూడా కంప్లైట్ చేసిన తరువాత మళ్ళీ మాట్లాడాలనుకున్నాను. కుదరలేదు. ఇంకో రెండు రోజులు తరువాత సంయుక్త రిజైన్ చేసి, ఎగ్జిట్ ఇంటర్వ్యూలో రెండు కారణాలు చెప్పింది. వర్థమాన్ ప్రత్యేకించి ఆ అమ్మాయి మీద వర్క్ లోడ్ పెంచేశాడని ఒకటి. రెండొవది పర్సనల్ కారణం. పిల్లల్ని కనాలని ప్లాన్ చేస్తున్నారట.

“వర్థమాన్, నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి” అని క్యాంటీన్ దగ్గర కలిసినప్పుడు హెచ్చరించాను.

“పై నుంచి ప్రజర్. ఐ యామ్ జస్ట్ పాసింగ్ ఇట్ ఆన్. ప్రజర్ పెడితే టీమ్ కి నచ్చదు కదా!” అని నవ్వేశాడు. లాస్ట్ క్వార్టర్ లో వుండే ప్రజర్ నాకు కూడా తెలుసు కాబట్టి కాదనలేకపోయాను.

మరో మూడు రోజులకి ఇంకో కంప్లైంట్ వచ్చింది. సీత దగ్గర్నుంచి. జనవరి ఆరో తారీఖున టార్గెట్స్ రివైజ్ చేస్తున్నానని చెప్పి కొంతమంది మాత్రమే జేఎఫ్ఎమ్ టార్గెట్స్ పెంచేశాడట. రోజూ ఎనిమిది తొమ్మిద్దాకా వుంచేస్తున్నాడు.

“అందర్నా?”

“కాదు కొంతమందినే. అది కూడా ఎక్కువ అమ్మాయిల్నే”

సమస్య పెద్దదవుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. డాక్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ లో నాకు పరిచయమున్న కొంతమంది అమ్మాయిల్తో మాట్లాడాను.

“అలాంటి ఇబ్బందేమీ లేదే. ఎట్ లీస్ట్ మాకైతే అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు” అని స్పష్టంగా చెప్పారు.
ఎచ్ఆర్ ప్లానింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు ఆ విషయం గురించి ఎచ్ఆర్ హెడ్ పారుల్ దేవి తో మాట్లాడాను.

“ఎక్స్పెక్ట్ సమ్ హిట్ ఇన్ డాక్ ప్రాసెసింగ్. కనీసం పది పదిహేను మంది రిజైన్ చేస్తారు” అని మాత్రమే చెప్పింది తప్ప వర్థమాన్ మీద వస్తున్న కంప్లైంట్స్ మీద ఏ మాత్రం స్పందించలేదు.

ఇంక ఈ విషయం గురించి నేరుగానే మాట్లాడక తప్పదని అనిపించింది. వర్ధమాన్ కి మెయిల్ ఇన్వైట్ పంపిద్దామని మెయిల్ బాక్స్ తీసాను. నేను ఇంతకుముందు పంపిన మెయిల్స్ లో అతని మెయిల్ ఐడి కోసం వెతికాను. 

మూడు నెలల క్రితం నేను పంపిన మైయిల్ వుంది. అతని టీమ్ మెంబర్స్ అందరి గురించి ఎచ్ఆర్ దగ్గర వుండే పర్సనల్ డీటైల్స్ అడిగాడు. దానికి సమాధానంగా రెండు వందల ఆరు మంది వివరాలు ఒక ఎక్సెల్ ఫైల్ చేసి పంపాను. ఆ మెయిల్ నుంచి అతని ఐడి కాపీ చేసుకున్నాను. ఆ మెయిల్ క్లోజ్ చెయ్యబోతూ, నేను అలాంటి పర్సనల్ డీటైల్స్ పంపించి తప్పు చేశానేమో అని అనిపించింది కానీ పట్టించుకోలేదు.

వర్థమాన్ ని కలవడానికి టైమ్ అడుగుతూ మెయిల్ రాశాను. అతని నుంచి సమాధానం లేదు. సాయంత్రం నాలుగున్నరకి ఫోన్ చేశాడు.

“వుడ్ యు లైక్ టు జాయిన్ ఫర్ ఎ కాఫీ?” అడిగాడు. ఇద్దరం సబ్ వే కి వెళ్ళి కూర్చున్నాం.

“క్యా బాత్ హై?” అన్నాడు నేరుగా విషయంలోకి వస్తూ.

“బోలా నా? నీ మీద కంప్లైట్స్ వస్తున్నాయి”

“ఫైన్. అఫిషియల్ గా కంప్లైంట్ వుంటే ఏక్షన్ తీసుకో. దానికి డిష్కషన్ ఎందుకు?”

“నై యార్! నీ మీద యాక్షనే తీసుకోవాలంటే ఎందుకు పిలుస్తాను? జస్ట్ మాట్లాడదామని”

“జస్ట్ మాట్లాడే సంగతి అయితే మెయిల్ రాయాల్సిన అవసరం ఏముంది? నాకు ఫోన్ చేసి ఇలాగే కాఫీ షాప్ లో కలిస్తే సరిపోయేది కదా?” అడిగాడు. నేరుగా సమాధానం చెప్పలేక విషయాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాను -

“నేను మీ టీమ్ లో కొంతమందితో మాట్లాడాను. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదన్నారు. బట్ నువ్వు మాత్రం ఏదో చేస్తున్నావు. అదేంటో ఎచ్ఆర్ కి కూడా చెప్తే మేము కూడా ప్రిపేర్ అవుతాము కదా”

“ఏంటి చెప్పేది? మీరు మాకు అన్ని చెప్పే చేస్తారా? మెటర్నిటీ లీవ్ ని ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకి మారుస్తూ నాలుగు నెలల క్రితం సర్కులర్ పంపించారు. దాని ఇంపాక్ట్ టీమ్స్ మీద ఎలా వుంటుందో ఎచ్ఆర్ టీమ్ ఆలోచించిందా?” అన్నాడతను ఆవేశంగా.

“వాట్ డూ యూ మీన్? నువ్వు చేసే పని ఇంపాక్ట్ వేరే టీమ్స్ మీద వుండదా? ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వల్ల అట్రిషన్ పెరుగుతోంది. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ సర్వే చేస్తే చాలా బాడ్ స్కోర్ వస్తుంది. ఇవ్వన్నీ నేనే చూసుకోవాలి కదా”

“సీ? ఆ అమ్మాయిల మీద కన్సర్న్ తో మొదలుపెట్టావు. నౌ యు ఆర్ టాకింగ్ ఎబౌట్ సేవింగ్ యువర్ ఓన్ ఆస్. నేను చేస్తున్నదేంటో మీ హెడ్ పారుల్ కూడా తెలుసు. కాబట్టి యు డోన్ట్ హావ్ టు వర్రీ” అనేసి వెళ్ళిపోయాడు.

మళ్ళీ నా వర్క్ స్టేషన్ దగ్గరకు వచ్చే దాకా అతను అన్న మాటల గురించే ఆలోచించాను. అతన్ని మీటింగ్ కి ఎందుకు పిలిచాను? ఏం మాట్లాడాను?

అసలు అతను ఏ సంబంధం లేకుండా మెటర్నిటీ లీవ్ గురించి ఎందుకు ప్రస్తావించాడు? ఆరు నెలలకి బదులు తొమ్మిది నెలలు మెటర్నిటీ లీవ్ ఇస్తే వీడికి వచ్చే నష్టం ఏంటట? ఉన్నట్టుండి ఏదో అనుమానం మొదలైంది.
మూడు నెలల క్రితం నేను అతనికి పంపిన టీమ్ పర్సనల్ డీటైల్స్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. డీవోయం - డేట్ ఆఫ్ మారేజ్ పైన ఫిల్టర్ వేశాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్టూ వన్ ఇయర్. కింద్ పేర్లు చూశాను. రెండు వందల ఆరు లో ఇరవై ఆరు పేర్లే మిగిలాయి. అందులో ప్రత్యేకంగా నాకు కనపడ్డ పేర్లు -

సీత

సంయుక్త

షహనాజ్

సరిత

<><><> 

వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ (కథ)

అంకుర్
మొదటిసారి అలా అనిపించగానే భయం వేసింది.

నేను వాళ్ళింటికి వెళ్ళిన తరువాత చాలాసేపు రష్మీ గురించే మాట్లాడిందావిడ.

“పేరుకే కూతురు. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్” అంటుంటుంది ఎప్పుడూ. “ఎలా వుందో ఏమిటో మలేషియాలో” అని కూడా అంటూ వుంది. అప్పటికి రష్మీ మలేషియా వెళ్ళి రెండు రోజులే అయింది.

కొద్దిసేపటి తరువాత నా కళ్ళముందు వున్న మాధవి స్థానంలో రష్మీ కనపడటం మొదలైంది. అప్పుడే భయం వేసింది.

నాలుగు నెలల క్రితం రష్మీ ఇంటికి రమ్మని చాలా బలవంతం చేసింది. అప్పటికి మేము ప్రపోజ్ చేసుకోని వారం కూడా కాలేదు. అంత త్వరగా ఇంట్లో వాళ్ళకి తెలియడం ఎందుకు అంటే – “మమ్మీకి నువ్వు ప్రపోజ్ చేసిన రోజే చెప్పేశాను” అంది.

ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళాము. మొదటిసారి మాధవిని చూసింది అప్పుడే. ఆవిడే తలుపుతీసింది.

“ఓ మై గాడ్... వచ్చేశారా!! నేను ఇంకా రెడీ అవలేదు. జస్ట్ ఫైవ్ మినిట్స్” అంటూ బెడ్ రూమ్ వైపు పరుగెత్తింది. వెళ్తూనే – “బేటా... అంకుర్ కోసం పాన్ కేక్స్ చేశాను. పెడుతూ వుండు వచ్చేస్తా..” అంటూ కూతురికి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది.

పాన్ కేక్స్ నాకిష్టమని రష్మీనే చెప్పి వుంటుంది అనుకున్నాను. హడావిడిలో గమనించలేదు కానీ ఆమె వేసుకున్న షర్ట్ రష్మీది. నేను సింగపూర్ తెచ్చిన గిఫ్ట్.

ఆ తరువాత ఇలాంటివి చాలా సార్లు గమనించాను. రష్మీ వస్తువులు చాలా వరకు ఆమె కూడా వాడేస్తుంటుందట. అడిగితే “నేను కూడా మమ్మీవి వాడుతుంటాను. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ యూ నో” అంది రష్మి.

అంత వరకు ఫర్లేదు. ఫేస్ బుక్ లో రష్మీకి ఫ్రెండ్ అయిపోతే రెండు రోజుల్లో మాధవి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుందట. కొలీగ్ చెప్పాడు. రష్మీ ఫ్రెండ్స్ అందరూ ఆమెకు తెలుసు. కలిసినప్పుడు చొరవగా నిక్ నేమ్ తో పిలుస్తుంది. నేను కలిసినప్పుడు నీ ఎక్స్ జయ ఎలా వుంది? అని అడిగేసింది. రష్మీతో కలిసి పబ్ కి వస్తుంది, మూవీకి వస్తుంది, మాల్ కి వస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే తిరుగుతారు.

ఇంతకీ ఇప్పుడేమైందంటే – రష్మీ మలేషియా వెళ్ళిన రెండు రోజులకి మాధవి ఫోన్ చేసింది.

“బేటా, చిన్నారి లేదు కదా బోర్ కొట్టేస్తోంది. వీకెండ్ ఖాళీగా వుంటే ఇంటికి రావచ్చు కదా” అంది. నేను వెళ్ళాను.
ఆమె సోఫాలో కూర్చోని మాట్లాడుతోంది. నేను దీవాన్ పైన వున్నాను. అదిగో అప్పుడే నాకు మాధవి స్థానంలో రష్మీ కనపడటం మొదలైంది. లోపల ఎక్కడో భయం కూడా!

మాధవి

రష్మీ నాకు చెప్పకుండా ఏమీ చెయ్యదు. అసలు చెప్పకుండా వుండలేదు. ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచీ అంతే. స్కూల్లో జరిగిన ప్రతి విషయం నాకు చెప్పాల్సిందే. లేకపోతే దానికి నిద్రపట్టదు.

అంకుర్ గురించి కూడా నాకు ముందే చెప్పింది. “ఈ మధ్య నన్నే చూస్తున్నాడు” అంది ఒకరోజు. నేను మొదట కొంచెం భయపడ్డాను కానీ అదంతా సహజమే కదా అనుకున్నాను. “ఐ థింక్ ఐ యామ్ ఆల్సో లైకింగ్ హిమ్” అన్నప్పుడు మాత్రం పార్టీ చేసుకున్నాం.

అతను గిఫ్ట్ లు ఇచ్చాడు. ఒక డ్రెస్ ఇచ్చాడు, పర్ఫ్యూమ్, ఇంకా ఒక హేండ్ మేడ్ పేపర్ తో చేసిన డైరీ. అన్నీ నా టేస్ట్ కి తగ్గట్టే వున్నాయి. అవున్లే నాదీ రష్మీది ఒకటే టేస్ట్ కదా.

ఇద్దరం కలిసి షాపింగ్ కి వెళ్తామా? ఇద్దరికీ ఒకటే నచ్చుతుంది. కొనేసి ఇద్దరం వాడేస్తాం. అసలు మా ఇద్దరిని వేరు వేరుగా షాప్ లోకి పంపించి చూడండి. ఇద్దరం ఒకటే కొనుక్కోని బయటికి వస్తాం. మేము తల్లీ కూతుర్లం అంటే ఎవరూ నమ్మరు. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్. అందుకే తనతో కలిసి పార్టీలకి వెళ్తాను. నాకు తెలియని రష్మీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అందరినీ పరిచయం చేస్తుంది. నేను కూడా వాళ్ళతో కలిసిపోతాను. దే లైక్ మీ ఆల్సో.

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇంతకీ ఏం చెప్తున్నాను? ఆ గుర్తొచ్చింది. అంకుర్ గురించి. చాలా బాగుంటాడు. చాలా మంచివాడు. రష్మీకి ఎలాంటి వాడు కావాలనుకున్నానో సరిగ్గా అలాంటి వాడే దొరికాడు.

అతను ఆ రోజు ప్రపోజ్ చేస్తాడని రష్మీకి ముందే తెలిసిపోయింది. నిజం చెప్పాలంటే నాక్కూడా తెలిసిపోయింది. వాళ్ళ మధ్య జరిగిన ప్రతి విషయం రష్మీ నాకు చెప్పేస్తుంది కదా. అలాగన్నమాట! ఈవినింగ్ అతను కాఫీకి పిల్చినప్పుడు రెస్టారెంట్ పేరు మెసేజ్ చేసింది రష్మీ. అతను ప్రపోజ్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళ వెనకాల రెండు టేబుల్స్ అవతల వున్నాను. ష్! ఈ విషయం అతనికి చెప్పకండి. అతనికి తెలియకూడదని నేనూ, రష్మీ అనుకున్నాము.

ఆ తరువాత అతన్ని ఇంటికి తీసుకొచ్చింది. అతనికి ఇష్టమని పాన్ కేక్స్ చేశాను. ఆ తరువాత అతను కూడా మాతో కలిసిపోయాడు. వీ త్రీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ నౌ!

రష్మీ ఆన్ సైట్ అని మలేషియా వెళ్ళింది. అంతకు ముందు కంబోడియా వెళ్ళినప్పుడు నేను కూడా తనతో వెళ్ళాను. ఈసారి వద్దంది. రెండు రోజులకే పిచ్చి పట్టినట్లు అయిపోయింది. అంకుర్ కి ఫోన్ చేశాను. వచ్చాడు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో! ఉన్నట్టుండి అతను నా వైపు అలాగే చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత అన్నాడు –

“ఆంటీ, నాకు మీరు కనపడట్లేదు. మీ ప్లేస్ లో రష్మీ కనపడుతోంది” అని.


రష్మీ

అంకుర్ ఫోన్ చేశాడు.

“మీ ఇంట్లోనే వున్నాను. జస్ట్ కేమ్ అవుట్ ఫర్ ఫ్యాగ్” అని ఆ తరువాత జరిగిందంతా చెప్పాడు. అతను మాట్లాడినంత సేపు మమ్మీ దగ్గర్నుంచి ఫోన్ వస్తూనే వుంది.

మమ్మీ అని అనాలి కాబట్టి అనటమే కానీ మేము ఎప్పుడూ అమ్మా కూతురు లాగా వున్నది లేదు. నేను ప్రతి విషయం మమ్మీకి చెప్పేస్తాను. చెప్పకపోతే ఆమె ఒప్పుకోదు. ఈ రోజు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోని రేపు అడుగుతుంది. ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అంతే. నాకు కూడా అలవాటైపోయింది. ఫ్రెండ్స్ లాగే మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫ్రీగా చెప్పలేని విషయాలు మమ్మీ దగ్గర దాచకుండా చెప్పేస్తాను. ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నా ఫేస్ బుక్ లో నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె కామన్ ఫ్రెండ్. ఆమె వుందని ఎవరూ కాన్షియస్ గా వుండరు. ఫేస్ బుక్ లో ఎలా వుండాలో అలాగే వుంటారు.

అంకుర్ చెప్పిన తరువాత ఇవన్నీ ఆలోచిస్తే అతను చెప్పింది నిజమే అనిపించింది.

అంకుర్ ని మొదటిసారి చూసిన దగ్గర్నుంచి ప్రతి చిన్న విషయం ఆమెతో చెప్తూనే వున్నాను. అతని హెయిర్ స్టైల్ నుంచి షర్ట్ కలర్స్ దాకా! ఇంకా చెప్పాలంటే షీ నోస్ హిమ్ బిఫోర్ షి మెట్ హిమ్. కానీ ఎందుకు చెప్పావు అని అడిగాడు అంకుర్.

“ఎందుకు చెప్పాను అంటే! చెప్పకుండా వుండలేను కాబట్టి. చెప్పకపోతే మమ్మీ అడుగుతుంది కాబట్టి.” అన్నాను

“ఆమె అడిగి అడిగి నీకు అలవాటు చేసింది. అదేదో కన్సర్న్ తో చేసింది కాదు. అంత కన్నా వేరే ఆప్షన్ లేక” అన్నాడు అంకుర్.

“వాట్ డూ యూ మీన్?” కొంచెం కోపం వచ్చింది

“సీ, ఆమెకి వేరే జీవితం అంటూ లేదు. నువ్వే ఆమె లైఫ్. ఇంకా చెప్పాలంటే, షీ ఈజ్ ఆక్చువల్లీ లివింగ్ యువర్ లైఫ్. నీలో తనని తాను చూసుకోని, నీ జీవితంలోనే సంతోషాన్ని వెతుక్కుంటోంది. నీ బట్టలు ఆమె వేసుకుంటుంది, నీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నీ జాబ్ గురించి ఆలోచిస్తుంది. ఆమె మాట్లేడేది నీ గురించి. ఆలోచించేది నీ గురించి. అన్నింటికి నువ్వు, నువ్వు, నువ్వు. ఇలా ఎంత కాలం నీ లైఫ్ లో బతుకుతుంది? ఆమె ఎక్కడుంది? మాధవి ఎక్కడ తప్పిపోయింది?” అంకుర్ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి.

మమ్మీ ఇంకా కాల్ చేస్తూనే వుంది.

<><><>