సరిత నాకు జాయిన్ అయినప్పటి నుంచీ తెలుసు. ఇంకా
చెప్పాలంటే జాయిన్ అవడానికి ముందే తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయిని రిక్రూట్ చేసిన
పానెల్ లో నేను కూడా వున్నాను.
సీనియర్ అసోసియేట్, డాక్ పాసెసింగ్
డిపార్ట్మెంట్.
మెయిల్ చివర వున్న సిగ్నేచర్ చూసి “ప్రమోషన్
కూడా వచ్చిందన్నమాట” అనుకున్నాను. నేను మొన్నటి దాకా రిక్రూట్మెంట్
మాత్రమే చూస్తుండటంతో ఆ వివరాలు ఏవీ తెలియలేదు. ఈ మధ్యనే రీస్ట్రక్చెరింగ్ చేసి
నన్ను జనరలిస్ట్ ఎచ్ఆర్ లో వేశారు.
మెయిల్ మొత్తం మళ్ళీ చదివాను. డాక్ ప్రాసెసింగ్
వీపీ వర్థమాన్ నేగీ మీద కంప్లైంట్.
అతనికి వ్యతిరేకంగా మాట్లాడటం అంత తేలికైన విషయం
కాదు. అతని పర్ఫామెన్స్ గురించి ఎమ్.డీ. దాకా తెలుసు. ఐఐయంబీ. ఆరేళ్ళలో ఐదు
ప్రమోషన్లు. ఎనాలసిస్ చేసి నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. అలాంటి వ్యక్తి గురించి
సరిత కంప్లైంట్ చెయ్యడమేంటి?
సరితని పిలిచి మాట్లాడాను.
“అంతకు ముందు లేదు సార్. లాస్ట్ మంత్ నుంచి
మొదలైంది. అవసరమున్నా లేకపోయినా ఏదో ఒక కారణం పెట్టి తిడుతున్నారు. రోజూ ఏదో ఒక విషయంలో
బ్లేమ్ చేస్తూ మెయిల్స్ రాస్తున్నారు. అది కూడా టీమ్ అందరికీ సీసీ పెడుతున్నారు.
కావాలనే ఇదంతా చేస్తున్నారు సార్. ఇప్పుడు నాకు ఉద్యోగం చాలా అవసరం సార్. పెళ్ళై
ఆరు నెలలే అయ్యింది.” దాదాపు ఏడ్చేసినంత పని చేసింది.
“వర్థమాన్ తో నేను మాట్లాడతాన్లే” అని చెప్పి
పంపేశాను. మాట్లాడలేదు.
షహనాజ్ కూడా కంప్లైట్ చేసిన తరువాత మళ్ళీ
మాట్లాడాలనుకున్నాను. కుదరలేదు. ఇంకో రెండు రోజులు తరువాత సంయుక్త రిజైన్ చేసి,
ఎగ్జిట్ ఇంటర్వ్యూలో రెండు కారణాలు చెప్పింది. వర్థమాన్ ప్రత్యేకించి ఆ అమ్మాయి
మీద వర్క్ లోడ్ పెంచేశాడని ఒకటి. రెండొవది పర్సనల్ కారణం. పిల్లల్ని కనాలని ప్లాన్
చేస్తున్నారట.
“వర్థమాన్, నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి” అని క్యాంటీన్
దగ్గర కలిసినప్పుడు హెచ్చరించాను.
“పై నుంచి ప్రజర్. ఐ యామ్ జస్ట్ పాసింగ్ ఇట్ ఆన్.
ప్రజర్ పెడితే టీమ్ కి నచ్చదు కదా!” అని నవ్వేశాడు. లాస్ట్ క్వార్టర్ లో వుండే
ప్రజర్ నాకు కూడా తెలుసు కాబట్టి కాదనలేకపోయాను.
మరో మూడు రోజులకి ఇంకో కంప్లైంట్ వచ్చింది. సీత
దగ్గర్నుంచి. జనవరి ఆరో తారీఖున టార్గెట్స్ రివైజ్ చేస్తున్నానని చెప్పి కొంతమంది
మాత్రమే జేఎఫ్ఎమ్ టార్గెట్స్ పెంచేశాడట. రోజూ ఎనిమిది తొమ్మిద్దాకా వుంచేస్తున్నాడు.
“అందర్నా?”
“కాదు కొంతమందినే. అది కూడా ఎక్కువ అమ్మాయిల్నే”
సమస్య పెద్దదవుతున్న విషయం స్పష్టంగా
తెలుస్తోంది. డాక్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ లో నాకు పరిచయమున్న కొంతమంది
అమ్మాయిల్తో మాట్లాడాను.
“అలాంటి ఇబ్బందేమీ లేదే. ఎట్ లీస్ట్ మాకైతే
అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు” అని స్పష్టంగా చెప్పారు.
ఎచ్ఆర్ ప్లానింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు ఆ విషయం
గురించి ఎచ్ఆర్ హెడ్ పారుల్ దేవి తో మాట్లాడాను.
“ఎక్స్పెక్ట్ సమ్ హిట్ ఇన్ డాక్ ప్రాసెసింగ్.
కనీసం పది పదిహేను మంది రిజైన్ చేస్తారు” అని మాత్రమే చెప్పింది తప్ప వర్థమాన్ మీద
వస్తున్న కంప్లైంట్స్ మీద ఏ మాత్రం స్పందించలేదు.
ఇంక ఈ విషయం గురించి నేరుగానే మాట్లాడక తప్పదని
అనిపించింది. వర్ధమాన్ కి మెయిల్ ఇన్వైట్ పంపిద్దామని మెయిల్ బాక్స్ తీసాను. నేను
ఇంతకుముందు పంపిన మెయిల్స్ లో అతని మెయిల్ ఐడి కోసం వెతికాను.
మూడు నెలల క్రితం
నేను పంపిన మైయిల్ వుంది. అతని టీమ్ మెంబర్స్ అందరి గురించి ఎచ్ఆర్ దగ్గర వుండే
పర్సనల్ డీటైల్స్ అడిగాడు. దానికి సమాధానంగా రెండు వందల ఆరు మంది వివరాలు ఒక ఎక్సెల్
ఫైల్ చేసి పంపాను. ఆ మెయిల్ నుంచి అతని ఐడి కాపీ చేసుకున్నాను. ఆ మెయిల్ క్లోజ్
చెయ్యబోతూ, నేను అలాంటి పర్సనల్ డీటైల్స్ పంపించి తప్పు చేశానేమో అని అనిపించింది
కానీ పట్టించుకోలేదు.
వర్థమాన్ ని కలవడానికి టైమ్ అడుగుతూ మెయిల్
రాశాను. అతని నుంచి సమాధానం లేదు. సాయంత్రం నాలుగున్నరకి ఫోన్ చేశాడు.
“వుడ్ యు లైక్ టు జాయిన్ ఫర్ ఎ కాఫీ?” అడిగాడు.
ఇద్దరం సబ్ వే కి వెళ్ళి కూర్చున్నాం.
“క్యా బాత్ హై?” అన్నాడు నేరుగా విషయంలోకి వస్తూ.
“బోలా నా? నీ మీద కంప్లైట్స్ వస్తున్నాయి”
“ఫైన్. అఫిషియల్ గా కంప్లైంట్ వుంటే ఏక్షన్
తీసుకో. దానికి డిష్కషన్ ఎందుకు?”
“నై యార్! నీ మీద యాక్షనే తీసుకోవాలంటే ఎందుకు
పిలుస్తాను? జస్ట్ మాట్లాడదామని”
“జస్ట్ మాట్లాడే సంగతి అయితే మెయిల్ రాయాల్సిన
అవసరం ఏముంది? నాకు ఫోన్ చేసి ఇలాగే కాఫీ షాప్ లో కలిస్తే సరిపోయేది కదా?”
అడిగాడు. నేరుగా సమాధానం చెప్పలేక విషయాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాను -
“నేను మీ టీమ్ లో కొంతమందితో మాట్లాడాను. వాళ్ళకి
ఏ ప్రాబ్లం లేదన్నారు. బట్ నువ్వు మాత్రం ఏదో చేస్తున్నావు. అదేంటో ఎచ్ఆర్ కి కూడా
చెప్తే మేము కూడా ప్రిపేర్ అవుతాము కదా”
“ఏంటి చెప్పేది? మీరు మాకు అన్ని చెప్పే
చేస్తారా? మెటర్నిటీ లీవ్ ని ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకి మారుస్తూ నాలుగు నెలల
క్రితం సర్కులర్ పంపించారు. దాని ఇంపాక్ట్ టీమ్స్ మీద ఎలా వుంటుందో ఎచ్ఆర్ టీమ్
ఆలోచించిందా?” అన్నాడతను ఆవేశంగా.
“వాట్ డూ యూ మీన్? నువ్వు చేసే పని ఇంపాక్ట్ వేరే
టీమ్స్ మీద వుండదా? ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వల్ల అట్రిషన్ పెరుగుతోంది.
ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ సర్వే చేస్తే చాలా బాడ్ స్కోర్ వస్తుంది. ఇవ్వన్నీ నేనే
చూసుకోవాలి కదా”
“సీ? ఆ అమ్మాయిల మీద కన్సర్న్ తో మొదలుపెట్టావు.
నౌ యు ఆర్ టాకింగ్ ఎబౌట్ సేవింగ్ యువర్ ఓన్ ఆస్. నేను చేస్తున్నదేంటో మీ హెడ్
పారుల్ కూడా తెలుసు. కాబట్టి యు డోన్ట్ హావ్ టు వర్రీ” అనేసి వెళ్ళిపోయాడు.
మళ్ళీ నా వర్క్ స్టేషన్ దగ్గరకు వచ్చే దాకా అతను
అన్న మాటల గురించే ఆలోచించాను. అతన్ని మీటింగ్ కి ఎందుకు పిలిచాను? ఏం మాట్లాడాను?
అసలు అతను ఏ సంబంధం లేకుండా మెటర్నిటీ లీవ్
గురించి ఎందుకు ప్రస్తావించాడు? ఆరు నెలలకి బదులు తొమ్మిది నెలలు మెటర్నిటీ లీవ్
ఇస్తే వీడికి వచ్చే నష్టం ఏంటట? ఉన్నట్టుండి ఏదో అనుమానం మొదలైంది.
మూడు నెలల క్రితం నేను అతనికి పంపిన టీమ్ పర్సనల్
డీటైల్స్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. డీవోయం - డేట్ ఆఫ్ మారేజ్ పైన ఫిల్టర్ వేశాను.
లెస్ దాన్ ఆర్ ఈక్వల్టూ వన్ ఇయర్. కింద్ పేర్లు చూశాను. రెండు వందల ఆరు లో ఇరవై
ఆరు పేర్లే మిగిలాయి. అందులో ప్రత్యేకంగా నాకు కనపడ్డ పేర్లు -
సీత
సంయుక్త
షహనాజ్
సరిత
<><><>
0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి