“ఇప్పుడు నీకు దేవుడి కనపడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు?” అడిగాడు ఆయన. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. దాదాపు యాభై ఏళ్ళ సంసార సాంగత్యం. దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు.
“చివర్రోజుల్లో చాదస్తం వస్తుందంటారు. మీరు దేవుడిగురించి మాట్లాడటమేమిటి?
పడుకోండి” అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందుసీసా మూత పెట్టిందామె.
“ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడన్నానా? నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే
ఏం అడుగుతావనే కదా అడిగాను” తల తిప్పి తన వైపు చూస్తున్న అతని తలని నేరుగా
పెట్టింది ఆమె. “ఎప్పుడూ ఆ సీలింగ్ నే చూడమంటే ఎలాగ పద్దూ. వుండే నాలుగు రోజులు నీ
ముఖం చూడనీ” అన్నాడాయన మళ్ళీ ముఖం ఆమె వైపు తిప్పి.
ఆమె కిసుక్కున నవ్వింది. పద్దు ఆమె పేరు కాదు. పెళ్ళైన కొత్తల్లో పిలిచేవాడలా.
ప్రతి ఖర్చుకీ లెక్కలు రాస్తోందని.
“ఆ పేరు గుర్తొచ్చిందే?”
“జ్ఞాపకాన్ని మించిన ఆనందం ఏముటుంది ఈ వయసులో? సరే విషయం దారిమళ్లుతోంది.
దేవుణ్ణి ఏం కోరుకుంటావ్?”
ఆమె అతని దగ్గరగా వచ్చి మంచం మీద ఒక పట్టీ చివర కూర్చుంది.
“ఏం కోరుకుంటాను. మా ఆయన ఆరోగ్యం బాగుపడీ..” మురిపెంగా తల మీద చెయ్యి
వేస్తుంటే వద్దన్నట్లు పట్టుకున్నాడు.
“వీటినే గొంతెమ్మ కోరికలంటారే గొంతెమ్మా... డాక్టర్ చెప్పలేదూ? వారమేనని.
అందులో మూడు రోజులు అయిపోయాయి... ఇంకో నాలుగో అయిదో..”
“చాల్లే ఆపండి. ఏం కాదు. వాళ్ళకు తెలిసి ఏడ్చి...”
“వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుస్తోంది కదా... నీకు మాత్రం తెలియట్లేదూ?”
“కనీసం మనవడి ముద్దు ముచ్చట చూసేదాకైనా...”
“ఆ తరువాత? వాడి పెళ్ళి. మునిమనవడు. వాడి బారసాల... అంతం వుందంటావా?” గట్టిగా
ఊపిరి పీల్చుకున్నాడాయన.
“జరిగేదేదో జరుగుతుంది. మీరు మాట్లాడకుండా పడుకోండి. ఆ భగవంతుడు తల్చుకుంటే ఏ
అద్భుతమైనా జరగచ్చు”
“పిచ్చిదానా నిజంగా నీ భగవంతుడు చేసే అద్భుతాలేమైనా వున్నాయంటే అవి రెండే -
పుట్టుక, మరణం. నువ్వన్నట్లు అద్భుతమే జరగబోతోంది.” ఆమె అతని పదవుల మీద కుడి చేతి
చూపుడు వేలు పెట్టి అతని మాటలు ఆపేసింది.
అతను కళ్ళు మూసుకోని ఇబ్బందిగా కదిలి బాధగా మూలిగాడు. అంతలోనే కళ్ళు గట్టిగా
బిగించేసి బిగుసుకుపోయి నిద్రపోయినట్లు నటించాడు.
ఆమె నవ్వుకుంది. “అన్నీ దొంగ వేషాలే” అనుకుంది మనసులో. బయట వర్షం మొదలైంది.
“నిద్రపోతున్నావా? లే… వర్షం చూద్దువుగాని లే…” పెళ్ళైన కొత్తల్లో ఓ
సాయంత్రం నిద్రలేపుతూ అతనన్న మాటలు గుర్తుకొచ్చాయామెకి.
“పడుకోనివ్వండి. అయినా వర్షం చూసేదేంటి?”
“చూసేదేంటి అంటే ఏం చెప్పేది?
చూస్తే తెలుస్తుంది”
“వర్షం అంటే గుర్తొచ్చింది. బట్టలు ఆరేసాను..” గబగబా లేచి పరుగెత్తిందామె.
“వర్షం అంటే గుర్తుకొచ్చేది ఆరేసిన బట్టలా? బాల్యం గుర్తుకురావాలి. కాగితప్పడవలు
గుర్తుకురావాలి.” కిటికీ దగ్గర స్టూల్ వేసుకోని కూర్చున్నాడతను. దండెం మీద
బట్టలను గబగబా లాగుతూ కనిపిస్తోంది. తడుస్తూనే ఎడమ భుజం మీద బట్టలన్నీ మోపులా
వేసుకుంటూ వుందామె.
“అలా కిటికీలోంచి చూస్తూ కూర్చోకపోతే వచ్చి నాలుగు బట్టలు అందుకోవచ్చు కదా…”
“నేను సహాయం చేస్తే నీకు బాగుంటుందేమో. నిన్ను అలా చూస్తుంటే నాకు ఆనందంగా
వుంటుంది” నవ్వాడతను.
లోపలికి వచ్చాక తడిసిన బట్టలను దులుపుకుంటూ అతన్ని ఫెళఫెళలాడించింది.
“నానా చాకిరీ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ కూర్చోండి. ఒక్క పనికి సాయం లేదు
కదా” అంది
“నేను చూస్తోంది నీ అందం కాదు దేవీ. నువ్వు నన్నూ, మన సంసారాన్ని బాధ్యతగా
తీసుకున్నావన్న సంతోషం కోసం చూస్తుంటాను.” ఆమె పేరు దేవి కూడా కాదు. అదో నాటకీయ
ఫక్కీ.
“బద్దకానికి పది రకాల అబద్దాలు” నవ్వేసి వచ్చి అతని పక్కనే కిటికీలోంచి చూస్తూ
కూర్చుంది.
ఆయన మాటలతో మళ్ళీ ఈరోజులోకి వచ్చిపడింది.
“ఏం చేస్తున్నావు కిటికీ పక్కన?” తల మళ్ళీ తిప్పాడాయన.
“నిద్రపొమ్మన్నానా?”
“ఒకేసారి పోతాలే. నిన్ను కాస్సేపు చూద్దామనిపించింది” చిలిపి నవ్వు కళ్ళలో
కనిపించింది.
ఆమె అతని దగ్గరకు వచ్చింది. అతను కదలడానికి ఇబ్బందిపడుతూ కొద్దిగా తిరిగాడు.
“పిల్లలకి విషయం చెప్తే మంచిదేమో అనుకుంటున్నా” ముఖం రాయిలా పెట్టి అన్నది.
“చెప్తావు. రమ్మంటావామ్మా అంటారు. వీకెండ్ కి వస్తాం అంటారు. నా ఎండ్ వీక్
లోనో వీకెండ్ లోనో తెలియదు కదా?”
“చాల్లేండి. పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేం కాదు”
“కాదులే. ఇప్పటి పిల్లల్తో పోలిస్తే మనవాళ్ళు కాస్త నయమే అనిపిస్తుంది. అయినా
నువ్వు మరీ అంత గుడ్డిగా సర్టిఫికెట్లు ఇచ్చేయకు. జాగ్రత్త”
అతను జాగ్రత్త అని ఎందుకన్నాడో ఆమెకు తెలుసు. అయినా భవిష్యత్తుకు లోటు లేకుండా
చూశాడాయన. కొడుకు కోడళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు.
“పిల్లలు వస్తే ఈ ప్రైవసీ కూడా వుండదు” అన్నాడు.
నిజమే పెళ్ళైన దగ్గర్నుంచి ఇద్దరూ కలిసి ఏకాంతంగా వున్న రోజులు చాలా తక్కువ.
పెళ్ళైసరికే ఇంటి నిండా జనం. మామగారు, అత్తగారు, ఆడపడుచులు వీళ్ళు కాక
చదువుకోడానికని వచ్చిన మామగారి తరఫు బంధువుల పిల్లలు ఇద్దరు. ఆ పిల్లలు చదువులు
అయిపోయి, ఆడపడుచుల పెళ్ళిలైపోయి, మామగారు కాలం చేసే సరికి తనకే ఇద్దరు పిల్లలు.
మధ్య మధ్యలో ఆడపడుచుల కాన్పులు. అత్తగారు కూడా వెళ్ళిపోయి పిల్లలు చదువులు పూర్తై
పెళ్ళిళ్ళు అయ్యి హమ్మయ్య అనుకునేసరికి అరవైల్లో పడ్డారు. ఈ మధ్యే కాస్తంత ఏకాంతం.
ఎంత అపురూపమో ఆయనకి ఆ ఏకాంతమంటే.
“మళ్ళీ ఆలోచిస్తున్నావు. ఏం గుర్తుకొచ్చింది?” చిలిపిగా కన్నుకొట్టాడతను.
“మీరేం అనుకుంటున్నారు?”
“మన మొదటి రాత్రి ఏమైనా గుర్తుకొచ్చిందేమో అని” నవ్వబోయి గట్టిగా దగ్గి
“అమ్మా” అన్నాడు బాధగా.
“చాల్లేండి సంబడం. ఆ రోజు భయం తప్ప మరో ఆలోచన కూడా లేదు”
“ఏం? నేను అంత భయంకరంగా వున్నానా?”
“ఊహూ. మీరు చాలా బాగున్నారు. పంచె కట్టుకోని. మీ కట్టు చాలా బాగుంటుంది.”
“ఎప్పుడూ చెప్పనేలేదు? నేను ఎన్నిసార్లు నీ చీర కట్టుని మెచ్చుకోలేదు”
“ఏమిటి చెప్పేది. మీరు ఒకటి ఒప్పుకున్నారా. పూజలన్నా వ్రతాలన్నా అసలు దేవుడే
లేడని కదా గొడవ”
“దణ్ణం పెట్టుకున్నానుగా చివరికి. గుళ్ళకి గోపురాలకి కూడా వచ్చాను”
“ఎందుకొచ్చారు? వదిలేయాల్సింది.”
“దేవుడి భక్తి అని కాదులే. నీకు నేను అలా వుంటే ఇష్టం అని వచ్చాను. పూజలు
వ్రతాలంటావా? నిన్ను ఎప్పుడైనా కాదన్నానా? నీకు నీ దేవుడికి మధ్యలో నేనెప్పుడూ
రాలేదమ్మా సోమిదేవమ్మా” మళ్ళీ మరో పేరు కలిపాడు.
“సర్లే ఇంక పడుకోండి. మాట్లాడితే అలిసిపోతున్నారు మీరు.” మంచం పక్కనే బొంత
పరుస్తూ చెప్పిందామె. ఆయన అలాగే చూస్తూ వుండిపోయాడు. ఆమె దిండుకి బదులు పాత
దుప్పటి పెట్టుకోని పక్కకి తిరిగి పడుకోని కళ్ళు మూసుకుంది.
“ఏమైనా కావాలంటే నాకు చెప్పండి” అంది కళ్ళు మూసుకోనే.
“చెప్పనా?” కళ్ళు మెరిసాయి.
“ఏమిటి” కళ్ళు తెరవలేదు.
“చెప్తే నిజంగా చేస్తావా?” ఆమె కళ్ళు తెరిచి కాస్త కోపం కలిపి చూసిందతని వైపు.
“నాకు పంచె కట్టగలవా?”
“ఇప్పుడా? ఈ పరిస్థితిలో...”
“ఏం ఫర్లేదు. నేను లేస్తానుగా. కడతావా?”
“ఏమిటీ చాదస్తం? మళ్ళీ పెళ్ళికొడుకు అవదామనా?” అనటానికి అంటూనే వుంది కాని
లేచి నిలబడింది.
“ఏం తప్పేంటి?” అని ఆయన అనే లోగా ఆమె బీరువా తెరిచి పంచె తీసింది. దగ్గరగా
వచ్చి ఆయన వీపు మీద చెయ్యి వేసి, పెదాలను బిగపట్టి పైకి లేపింది. ఆయన బరువుకి ఆమె
అలిసిపోయింది. ఆ కాస్త శ్రమకి ఆయన కూడా
అలిసిపోయాడు. ఆమె రొప్పుతుంటే ఎగిరిపడుతున్న గుండె మీద ఆయన తెలపెట్టి
రొప్పుతున్నాడు. అరనిముషం తరువాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోని చిరునవ్వు
నవ్వుకున్నారు. ఆమె కంటితో సైగ చేసి, రెండు చేతులతో భుజాలను పట్టుకోని “హుప్” అంటూ
నిలబెట్టింది. ఆమెని కౌగిలించుకోని బరువు ఆమె భుజాల మీద వేసి నిలబడ్డాడతను.
పంచె తీసిందామె. బెత్తెడు అంచు వున్న తెల్లటి పంచె. ఆయన తెల్లబట్టలు ఎప్పుడూ
తన చేతులతోనే ఉతికేది. గంజి పెట్టి మరీ. మడత విప్పి నడుము చుట్టూ తిప్పింది. ముందు
కుచ్చిళ్ళు పెట్టి బెత్తడంచూ కనపడేలా దోపింది. ఆమెనే చూస్తూ వున్నాడతను.
ఆమె నవ్వుతూ అతని వెనక్కి వెళ్ళి గోచీ తీసి దానికి కుచ్చిళ్ళు పెట్టింది.
పెడుతున్నంత సేపు విశాలమైన ఆయన వీపు వంకే చూస్తూ వుండిపోయింది. మంచానపడ్డ తరువాత
వీపంతా కురుపులు లేచాయి. కళ్ళలో నీళ్ళు వచ్చాయి కానీ రెప్పలని దాటలేదు. గోచీ దోపి
ముందుకొచ్చి, ఆయన ముఖంలోకి చూస్తే కన్నీళ్ళు జారతాయని పంచె వంకే చూస్తూ “బాగానే
కుదిరిందండీ” అంది.
ఆయన ఆమె తల పైకెత్తాడు. ఆయన నవ్వుతున్నాడు. ఆమె నవ్వినట్లే వుంది కానీ
కన్నీళ్ళు కారాయి.
మంచం మీద కూర్చోపెట్టింది. నెమ్మదిగా ఒరిగి, చిన్నగా సర్దుకుంటూ వెల్లకిలా
పడుకున్నాడు. ఆమె మళ్ళీ బొంత మీదకు వెళ్ళబోయింది. చెయ్యిపట్టుకోని లాగాడు. రెండో
చేతితో తన గుండెమీద కొట్టి చూపించాడు.
“వద్దండి” అందామె ఆయన పరిస్థితి గమనించి. ఒప్పుకోలేదతను. మంచం చివర కూర్చోని
బరువు ఎక్కువ పడకుండా తలని ఆయన గుండె మీద వాల్చింది. గుండె చప్పుడు కొంచెం నెమ్మదించింది.
గాలి ఆడటంలో వున్న ఇబ్బంది గుర్రుమంటూ వినపడుతోంది.
“ఇంతకన్నా ఇబ్బంది పడకుండా ఇంతే ప్రశాంతంగా ఈయన వెళ్ళిపోతే బాగుండు” అనుకుంది
ఆమె. ఆమె నమ్ముకున్న దేవుడో, ఆయన నమ్మని దేవుడో ఆమె మాట విన్నాడు. అద్భుతం
జరిగిపోయింది.
ఆఫీసుకెళ్ళే ప్రతిసారి ఆమెను దగ్గరగా హత్తుకోని “వస్తాను” అని చెప్పకుండా
వెళ్ళిన రోజు లేదు. ఒకసారి శ్రావణ శుక్రవారం. ఆమె హడావిడిలో ఆమె వుంది. ఆఫీసులో
ఆడిట్ అంటూ ఆయన హడావిడి ఆయనది. వెళ్ళిపోయాడు.
చెప్పకుండా వెళ్ళాడే అని ఆమెకి గిలిగా అనిపించింది. అరగంటలో నాలుగుసార్లు
గుమ్మానికి ఇంట్లోకి మధ్య నడిచింది. అరగంట తరువాత వచ్చాడాయన.
“హడావిడిలో మర్చిపోయాను” అంటూ హత్తుకున్నాడు. “వస్తాను” అని వెళ్ళబోతూ
“ఇంకెప్పుడూ మర్చిపోను” అన్నాడు. ఆయన కంట్లో నీటి పొర.
ఇదంతా గుర్తుకు వచ్చి ఆమె కంట్లో కన్నీటి వరద కట్టలు తెంచుకుంది.
><><><><
6 వ్యాఖ్య(లు):
అరిపిరాల వారు
అద్భుతః !
జిలేబి
అద్భుతం !
శ్రీ అరిపిరాల యద్భుత
మైన కథనటు నడిపిరి సుమా! రమ్యంబౌ
మానవ సంబంధమ్ముల
తానము సరి జూపిరి మమతల తక్కెడనన్ !
జిలేబి
టైటిల్‌ని భంగపరచని కథ
కంట తడి పెట్టించారు. మంచి కథ రాసి అందించినందుకు ధన్యవాదాలు సత్య ప్రసాద్ గారు.
Beautiful craft anna.....enati kalam lo miss avutunna nijayamaina dampatya anuraganni, sambandalani chala chakkaga varnichavu......very heart touching....
కామెంట్‌ను పోస్ట్ చేయండి